20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక


20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల
పరిచయ గ్రంథం

20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం పేరుతో ఫిబ్రవరి 2009 లో ప్రచురించబడ్డ ఈ సంకలనం 2010 జనవరిలోనే అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఈ బృహత్సంకలనంలో 116 కథలున్నాయి. ఇవన్నీ 1964 నుంచి 1999 వరకూ అమెరికా నుంచి ప్రచురించబడ్డ తెలుగు కథలు. ఇందులో 11 కథలు మినహా మిగిలినవన్నీ మొట్టమొదటిసారిగా అమెరికాలో ప్రచురించబడినవే! మిగిలినవి: వంగూరి ఫౌండేషన్‌ వారు వార్షీకంగా నిర్వహించే కథలపోటీల్లో బహుమతి పొందినవి, వారు ప్రచురించిన అమెరికా తెలుగు కథా సంకలనాలనుంచి, అమెరికాలో తెలుగు పత్రికలనుంచి, తానా, ఆటా వార్షిక సంచికలనుంచీ పోగుచేసినవి. ఈ సంకలనంలో ఇరవయి ఇద్దరు రచయితలకు పరిమితమై నలభైఏడు కథానికలున్నాయి. ముత్యంగా ముగ్గురు రచయితలవి మూడేసి కథలు, పంతొమ్మిదిమందివి, రెండేసి కథలూ ఉన్నాయి. పుస్తకం చివర 106 పేజీలకు పరిమితమై అమెరికా తెలుగు రచయితల చిట్టా ఉన్నది.

ఈ సంకలనం అమెరికా నుండి ప్రచురించబడిన అమెరికా తెలుగువారి కథల సంకలనం. కాబట్టి, ముందుగా అమెరికాలో అమెరికన్‌ కథాసంకలనాల చరిత్ర గురించి క్లుప్తంగా ముచ్చటించడం కనుతెరుపని నా ఉద్దేశం.


1915 లో ఇరవైమూడేళ్ళు నిండిన హార్వర్డ్‌ పట్టభద్రుడు ఎడ్వర్డ్‌ జె. ఓ’బ్రైన్‌ (Edward Joseph Harrington O’Brien) మొట్టమొదటి ఉత్తమ అమెరికన్‌ కథానికా సంకలనం ప్రచురించాడు. అప్పటినుంచి, ప్రతి సంవత్సరం ఉత్తమ అమెరికన్‌ కథల సంకలనాలు వెలువడుతూ వచ్చాయి. అమెరికా చరిత్రలో 20వ శతాబ్దం మొదటిభాగంలో అమెరికాకి యూరప్‌ నుంచి జనం ఉప్పెనల్లా వలసకొచ్చారు. అప్పట్లో అమెరికా నుంచి వచ్చిన కథలు అమెరికా జీవన కథలు. ఆ కథల్లో అమెరికా వలస జీవితం ముఖ్య కథావస్తువుగా ప్రతిధ్వనించింది. అందుకనే కాబోలు, ఇంగ్లండ్‌ లోను, యూరప్‌ లోనూ విమర్శకులు అమెరికన్‌ కథలో తర్కం లేదు, శిల్పం అసలే లేదు, కథా కథనం సున్న అని న్యూనతాభావంతో తీసిపారేశారు. సరిగ్గా అదేపని ఇప్పుడు అమెరికన్‌ తెలుగుకథ గురించి తెలుగునాడులో అగ్ర సింహాసనాలపైన బైఠాయించిన సంకలనకర్తలు, విమర్శకులూ చేస్తున్నారని అనడం అతిశయోక్తి కాదు. అయితే, ఓ’బ్రైన్‌ అమెరికన్‌ కథలో ఉన్న నవ్యతని చూశాడు; ఆ నవ్యతని గుర్తించవలసిన ఆవశ్యకతా చూశాడు. అమెరికన్‌ కథని ప్రోత్సహించవలసిన అవసరం గుర్తించాడు.

ఆ తరువాత ఓ’బ్రైన్‌ పాతిక సంవత్సరాల పాటు అమెరికన్‌ కథా సంకలనాలు ప్రచురించి ఎంతోమంది కొత్త కథకులని ప్రోత్సహించాడు. విలియమ్‌ ఫాక్నర్ (William Faulkner), ఎర్స్కిన్‌ కాల్డ్వెల్‌ (Erskine Caldwell), స్కాట్ ఫిట్జ్గెరాల్డ్ (F. Scott Fitzgerald) , విలియమ్‌ సారోయన్‌ (William Saroyan) , జాన్‌ స్టైన్‌బెక్ (John Steinbeck), రిచర్డ్ రైట్‌ (Richard Wright) మొదలైన వారి కథలు ఉత్తమ కథలుగా గుర్తించి తన సంపాదకత్వంలో అచ్చయిన వార్షిక సంకలనాలలో ప్రచురించి ప్రోత్సహించబట్టే, ఇప్పటికీ మనం వాళ్ళ కథలు చదవి ఆనందించగలుగుతున్నాం.

ఓ’బ్రైన్‌ 1923లో స్విట్జర్లెండ్‌లో ఒక చిన్న పత్రికకి విలేఖకుడుగా పనిచేస్తున్నఒక అమెరికన్‌ రచయితని కలిశాడు. అతను చెప్పుకున్న గోడు విన్నాడు. అప్పటికి ఆ రచయిత పంపిన కథలన్నీ పత్రికలు తిరస్కరించి తిరుగుటపాలో పంపాయట! దానికి తోడు, బోలెడు రాతప్రతులన్నీ ఉన్న సూట్‌కేస్‌ కాస్తా పోయింది. నిరాశతో ఇక తను కథలు రాయటం మానుకుంటానని ఓ’బ్రైన్‌తో చెప్పాడు. ఓ’బ్రైన్‌ అతని దగ్గిర మిగిలివున్న రెండు రాత ప్రతులు తీసుకొని చదివి, మొట్టమొదటిసారిగా ఆ రచయిత రాసిన కథ, My Old Man, తన సంకలనంలో ప్రచురించాడు. ఓ’బ్రైన్‌ తన నిబంధనలని తానే ఉల్లంఘించి, అంతకుముందు ప్రచురణ కాని కథని కథాసంకలనంలో ప్రచురించటం, ఆ కథా సంకలనం ఆ రచయితకే అంకితమివ్వడం అదే మొదటిసారి. ఓ’బ్రైన్‌ ఆ సాహసం గనక చేసి ఉండకపోతే, ఎర్న్‌స్ట్ హెమింగ్‌వే (Ernest Hemingway) ఎవరో మనకెవ్వరికీ తెలిసేదే కాదనుకుంటాను.

ప్రతి యేటా ఎంపిక చేసిన కథలు ప్రచురించటమే కాకుండా, ఆ సంవత్సరంలో అచ్చైన అన్ని కథల పట్టిక, సమీక్షల పట్టిక, రచయితల వివరాలు, కథలు అచ్చువేసే అమెరికన్‌ పత్రికల చిరునామాలు, వగైరా ఇవ్వడం ఓ’బ్రైన్‌ చేసేవాడు. మొట్టమొదటి సంకలనంకోసం ఓ బ్రైన్‌ ఇరవైరెండు వందల కథలు చదివి ఎంపిక చేశానని రాశాడు. అమెరికన్‌ కథ పరంగా అది అతని నిబద్ధత అని చెప్పాలి. అది, అతని పట్టుదలకి, అతను కథల ఎంపికకై పెట్టుకున్న ప్రమాణాలకీ తార్కాణం.

1941లో లండన్‌పై కురిసిన బాంబుల వర్షానికి ఆహుతైన వారిలో ఓ’బ్రైన్‌ ఒకడు. అతని తరువాత, అమెరికన్‌ కథానికా సంకలనాలు మార్థా ఫోలె (Martha Foley), సంపాదకత్వంలో వెలువడినై. సాల్‌ బెల్లొ (Saul Bellow), ఫిలిప్ రాత్ (Philip Roth), వ్లాదమీర్‌ నబకోవ్ (Vladamir Nabakov) , జాయ్స్ కెరోల్‌ ఓట్స్‌ (Joyce Carol Oats), బెర్నార్డ్‌ మాల్మూద్‌ (Bernard Malamud) వగైరా ప్రసిద్ధ రచయితల కథలని గుర్తించి సంకలనాలలోకి తీసుకొవచ్చింది ఫోలే. సంవత్సరంలో ఆవిడ సుమారు రెండువేల కథలు చదివి వాటినుంచి ‘మంచి’ కథలు ఎంపిక చేసేదట! మూడు శతాబ్దాలపాటు ఆవిడ పని ఇదే!

అమెరికన్‌ కథాసంకలనాల ప్రచురణలో రాను రాను రకరకాల మార్పులు వచ్చాయి. 1978నుంచీ ప్రతిసంవత్సరం అతిథి సంపాదకుడో, అతిథి సంపాదకురాలో ఆఖరి ఎంపిక చెయ్యడం, తన ఎంపికపై వ్యాఖ్య రాయడం ఆనవాయితీ అయ్యింది. 2008 లో సల్మాన్‌ రష్దీ (Salman Rushdie) ఉత్తమ అమెరికన్‌ కథానికల సంకలనానికి అతిథి సంపాదకుడు.

కథాసంకలనాల కూర్పుకి పడవలసిన శ్రమ, కావలసిన ఓపిక గుర్తుకి తేవడంకోసమే ఈ పై ఉపోద్ఘాతం చెప్పాను. ఓపిక, శ్రమా చాలవు ; ఆ రెండింటికన్నా కన్నా ముఖ్యంగా
కావలసిన గుణం: Selectivity. ఈ Selectivity గనక లేకపోతే ఎంత శ్రమ పడి తెచ్చిన కథాసంకలనమైనా రాణించదు. కథలని ఒక సంకలనంలోకి ఎంపిక చెయ్యడానికి ఎన్నిగుణాలు, లక్షణాలు, నిబంధనలూ ఎంచుకున్నా, ఆ సంకలనంలో కథ కానిదేదో, చెడ్డకథ ఏదో చెప్పడం బహుశా తేలికేమో గాని, “ఇది మంచి కథ,” అని చెప్పడం కష్టమే! ఇది “గొప్ప కథ,” అని చెప్పడం అంతకన్నా కష్టం అని నేను అనుకుంటాను. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సంకలనాన్ని సమీక్షించడానికి ప్రయత్నిస్తాను.


ఓ’బ్రైన్‌ అమెరికన్‌ కథని ప్రోత్సహించవలసిన ఆవశ్యకతని గుర్తించాడని ఇదివరలో చెప్పాను. ఆ ప్రోత్సాహం మేరకు వంగూరి ఫౌండేషన్‌ వారికి, ఓ’బ్రైన్‌కీ ఉన్న పోలిక నిజంగా చెప్పుకోదగిన పోలిక. అంతేకాదు. 1995 లో మొదలుపెట్టి, వంగూరి ఫౌండేషన్‌ వారు ఇప్పటివరకూ పది అమెరికన్‌ తెలుగు కథా సంకలనాలు ప్రచురించి మార్గదర్శకమైన పని చేశారని ఒప్పుకొని తీరాలి. అందుకు ఆ సంస్థ నిర్వాహకులని అభినందించి తీరాలి.

ఆగస్టు 2000 లో చికాగో సాహితీ సదస్సులో నేను ఒక కొత్త పాట పాడాను. క్లుప్తంగా ఆ పాట సారాంశం ఇది: ” అమెరికాలో మనం తెలుగు డయాస్పోరా కమ్యూనిటీ
(diaspora community). మనం రచయితలుగా డయస్పోరా రచయితలం,” అని (డయాస్పోరా లో చిన్న ‘d’ గమనించండి). అప్పట్లో చాలామందికి డయాస్పోరా అన్నపదం ఒక వింత పదం! తరువాత, 2002లో డెట్రాయట్‌లో జరిగిన సదస్సులో నా భావనలో తెలుగు డయాస్పోరా అంటే ఏమిటో వివరణ ఇచ్చుకున్నాను. నిజం చెప్పాలంటే, అది వివరణ కాదు; సంజాయిషీ! ఆ తరువాత, తెలుగు డయాస్పోరా సాహిత్యం పై, మాచిరాజు సావిత్రి, అఫ్సర్, రెంటాల కల్పన‌ వ్యాసాలు రాసారు. ఈ డయస్పోరా అన్న పదం అమెరికా సంకలనాలలోకి ఎక్కింది. ఒక్కొక్కసారి నా మటుకు నాకే అనుమానం వస్తుంది: “అమెరికా నుంచి వచ్చిన ప్రతి రచనా డయాస్పోరా రచనగా భావించడం గాని మొదలయ్యిందా? లేదా, డయాస్పోరా రచన అంటే నాకున్న అభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలా?” అని.

షికాగో సదస్సులో జంపాల చౌదరి అమెరికాలో తెలుగు డయాస్పోరా కథ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “… కొన్ని కథలలో కథాస్థలం మాత్రమే అమెరికా; వస్తువు, పాత్రలు, చిత్రీకరణ మొత్తం ఇండియా నుంచే. కథా స్థలాన్ని హ్యూస్టన్‌ బదులు హైదరాబాద్‌, చికాగో బదులు శ్రీకాకుళం చేసి ఈ కథల్ని పెద్దమార్పులు లేకండా తిరగవ్రాస్తే, పాఠకులకు తేడా ఏమీ తెలియదు. వీటిని డయాస్పోరా కథలు అనలేము” (రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, సభా విశేష సంచిక, షికాగో, ఆగస్టు, 19-20, 2000). ప్రస్తుతం సమీక్షకున్న సంకలనంలో అచ్చైన 116 కథలూ మరోసారి చదివిన తరువాత, చాలా కథల గురించి ఈ అభిప్రాయాన్ని ఖండించడం కష్టం. అయినా, ఈ సంకలనంలో అధ్యక్షుల ముందుమాటలో “డయస్పోరా ఇతివృత్తాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం,” అన్నమాటలు చూసిన తరువాత, ఈ డయాస్పోరా అనే ‘వింత పదం’ ఊత పదంగా తయారయ్యిందా అన్న అనుమానం వస్తుంది. అసలు డయాస్పోరా కథలు లేవని నేను అనడం లేదు. డయాస్పోరా సాహిత్యం గురించి మనకి కొంత ధృఢమైన అవగాహన అవసరం. ఇది చర్విత చర్వణం. అయినా తిరిగి చెప్పక తప్పదనిపిస్తున్నది.