నా భావనలో తెలుగు డయాస్పోరా

రెండేళ్ళ క్రిందట, చికాగోలో రెండవ అమెరికా తెలుగు సదస్సు నాందిగా, “మనం డయాస్పోరా రచయితలం. ఈ సదస్సు ముఖ్యోద్దేశం, తెలుగు డయాస్పోరా రచయితలని ఒకచోట సమావేశ పరిచి వాళ్ళ రచనలు వినడానికి, విమర్శించుకోడానికీ,” అని నేను అనంగానే, కొందరు సాహితీ వేత్తలు కంగారుపడ్డారు. మరికొందరు ఈ వింత పదానికి విముఖత చూపించారు.

అయితే, వీరిలో కొంతమంది, నిజంగానే diaspora అన్న పదానికి ప్రస్తుతం వాడుకలోకొస్తున్న అర్థ వివరణ గ్రహించకపోవడమో, ఆ వివరణ ఒప్పుకోవడం ఇష్టంలేకపోవడమో, వారి విముఖతకి కారణం కావచ్చు. ఆ సదస్సు సంధానకర్తల్లో ఒకడిగా, డయాస్పోరా రచయితలు అంటే నా భావం ఏమిటో, నే పెట్టుకున్న పరిధి ఏమిటో, అందరికీ బోధ పడేట్టు విశదీకరించకుండా, కప్ప దాటు వేశాను. అలా దాటేయడానికి ఇక వీలు లేదనిపిస్తున్నది. ఈ ఏటి ఆటా సభలో, డెట్రాయట్‌ అమెరికా తెలుగు సాహితీ సభలోనూ తెలుగు డయాస్పోరా పై చర్చ పరాకాష్ట అందుకున్నదనే చెప్పుకోవాలి.

Diaspora అన్న పదం గ్రీకు పదం, నిజమే! దీనిని, క్రీస్తు పూర్వం 586 లో యూదుజాతివాళ్ళు దేశభ్రష్టులై, ఈజిప్ట్‌ నుండి చెల్లాచెదరైపోయిన సందర్భంలోనే వాడడం కద్దు. కానీ, చిన్న d తో రాసిన diaspora అన్న మాటని, విధిలేకనో, అప్రయత్న పూర్వకంగానో, స్వదేశాన్ని వదిలి పరదేశాలకి వెళ్ళిన అందరికీ అన్వయించడం మొదలై, చాలా కాలం అయ్యింది. ఉదాహరణకి, African, Italian, Polish, Phillippino, Chinese and Irish diaspora! లు ) ఇంకో విషయం. బానిసలుగా కాకుండా, స్వచ్ఛందంగా ఆఫ్రికనులు భారతదేశానికి వలస వెళ్ళిన విషయం మనకి కొత్తగా వినిపించవచ్చు (1).. గత దశాబ్దంలో Cultural Anthropologist లూ, Trans-Cultural Studies లలో పనిచేస్తూన్న ప్రొఫెసర్లూ, పరిశోధకులూ, ముఖ్యంగా, సాహిత్యం, సోసియాలజీ, మతం విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఈ డయాస్పోరా అర్థపరిధిని చాలా విస్తృతంచేశారు(2). ఇది ఒకరకమైన paradigmatic shift అని అనచ్చు.

ఇకపోతే, మొదటి తరం జనాభాయే కాదు, రెండవ, మూడవ, నాలుగవ తరం వాళ్ళు, తాము డయాస్పోరా అని నిరూపించుకోవడం ( identify ) కూడా మొదలయ్యింది. ఉదాహరణకి, Irish diaspora తీసుకోండి. Ireland లో బంగాళా దుంపల కరువుతో మొదలయ్యింది, ఈ “డయాస్పోరా.” ఇప్పుడు Ireland స్వతంత్ర దేశం. దాని జనాభా ఐదున్నర మిలియన్లు. పోతే, ప్రపంచం మొత్తంమీద , Irish diaspora అని చెప్పుకునేవాళ్ళు, డెభై ఏడు మిలియన్లు. అందులో, సుమారు నలభై ఐదు మిలియన్ల మంది ఉత్తర అమెరికా ఖండంలోనే ఉన్నారు. ఐరిష్‌ వాళ్ళు చెప్పుకుంటారు, ఐర్లండ్‌ నుంచి ముఖ్య ఎగుమతి జనాభాయేనని! మన ఎగుమతులకు నిజమైన బేరీజు వేస్తే, మనకీ ముఖ్య ఎగుమతి జనాభాయే అవుతుందేమో!!

ఐర్లండ్‌ తరువాత చెప్పుకోదగ్గ డయాస్పోరా సమూహం ( diaspora community ) చైనా వారు. ముఖ్యంగా, సింగపూరు చైనావారిని గురించి చదివితే, వీళ్ళకీ, Indian diaspora, లేదా Telugu diaspora కీ చాలా సన్నిహితమైన పోలికలు కనిపిస్తాయి (3), తరాలు, కాలపరిమితీ మినహా!

అన్ని డయాస్పోరా కమ్యూనిటీలు, తమదైన సాంస్కృతిక సృహతో సాంఘిక వ్యక్తిత్వం కోసం తహ తహలాడతాయి. ఇది సహజం. తెలుగు వారినే తీసుకోండి. మన రెండో తరం వాళ్ళు పెద్దవాళ్ళై నారు. పెద్ద ఉద్యోగస్తులవుతున్నారు. మనం, మనది అని చెప్పుకునే సాంస్కృతిక సృహ వాళ్ళకి పూర్తిగా మరుగున పడకండా చెయ్యడం మన తరం డయాస్పోరా కర్తవ్యం. అందుకు, డయాస్పోరా సాహిత్యం ఒక ముఖ్య పరికరం అవుతుంది ( సింగపూరులో చైనీయుల డయాస్పోరా, చైనా భాషలోను, మాలేలోను, ఇంగ్లీషులోనూ అందుకోసం సాహిత్య సృష్టి చేశారు (3).)

నా పరిధిలో Diaspora ముఖ్య లక్షణాలు కొన్ని చెపుతాను.

  1. మాతృదేశ జ్ఞాపకాలు
  2. పెంపుడు దేశంలో మనని పూర్తి భాగ స్వాములుగా ఎప్పటికీ ఒప్పుకోరు అన్న నమ్మిక (కారణాలు ఏవైతేనే!)
  3. ఎప్పుడో ఒకప్పుడు మనం వెనక్కి తిరిగి మన మాతృదేశానికి వెళ్తాం అన్న నమ్మకం, ఇది ఎంత పిచ్చి నమ్మకమైనా సరే!
  4. మాతృదేశానికి ఏదో మంచి చేద్దామన్న కోరిక, గట్టి పట్టుదల (అందరికీ కాదులెండి.)
  5. మాతృదేశ సాహితీ సంస్కృతుల్లో వచ్చే మార్పులలో, “విప్లవాలలో” భాగస్వాములు కావాలనే కుతూహలం
  6. సామూహిక సృహ, ధృఢమైన ఏకత్వ నిరూపణ ( project a strong uniform identity. )

డయాస్పోరాగా గుర్తించబడడానికి, పైన చెప్పిన అన్ని లక్షణాలూ ఉండక్కర లేదు, ఏ కొన్ని లక్షణాలు ఉన్నా చాలు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పరిశోధనా వ్యాసాల్లో నే చెప్పిన అర్థంలో డయాస్పోరా అన్న పదం వాడడం కనిపిస్తుంది. (చూ. Cultural Anthropology, Diaspora Journal, etc. ) ఈ పైన చెప్పిన లక్షణాల పరిధిలో తెలుగు డయాస్పోరా సాహిత్యం గురించి నా భావాలు చెప్పుతాను.

దేశం విడిచి పెట్టాకనే దేశం బాగా అర్థం అవుతుంది. దీపంకింద ఉన్నంత కాలం నీడలో తెలియదు. umbra, penumbra లలో, చీకటిలా! దీపానికి కాస్త దూరంగా ఉంటేనే దీపకాంతి మన మీద బాగా ప్రసరిస్తుంది. ఇక్కడికి రాకముందు మనలో చాలా మందిమి తెలుగు మీద, తెలుగు సాహిత్యం మీద ఏమంత శ్రద్ధ చూపించిన వాళ్ళం కాదని మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు. దానికి తోడు, మొదటితరం వాళ్ళం చాలామందిమి, భౌతిక రసాయన శాస్త్రాల్లోను, ఇంజనీరింగు, మెడిసిన్‌ల లోను పట్టభద్రులమై ఇక్కడికి వచ్చినవాళ్ళం. అందరం కలిసి, మూక ఉమ్మడిగా పడవెక్కి రాలేదు. ఎవరికి వారేగా వలస వచ్చిన వాళ్ళం. ఇక్కడికి వచ్చాక, మన చుట్టూ ఉన్న ఇంగ్లీషు వాతావరణం, తెలుగు పాఠం ఎప్పుడూ శ్రద్ధగావినని మనని మరింత తెలుగు వాళ్ళని చేసింది. మనని, మరింత భారతీయులుగా చేసి దగ్గరకు రప్పించింది.

తెలుగు దేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయని వాళ్ళం, గట్టిగా తెలుగు చదవని వాళ్ళం, గట్టిగా తెలుగు పత్రికలు కూడా చూడని, చదవని వాళ్ళం ఇక్కడికొచ్చాక మనకి ఇంగ్లీషుకన్నా తెలుగే బాగా వచ్చునని గుర్తించాం. మనం తెలుగులో రచయితలం, కవులం అయ్యాం.

నిజమే! మనం రాస్తున్న రచనలలో చాలాభాగం మన పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉండడం సహజం. అంతమాత్రంచేత మనం రాస్తూన్న రచనలని, అక్కడి విమర్శకులుగాని, సీనియర్‌ జర్నలిస్టులుగానీ, ఇక్కడి సాహితీ రసజ్ఞులుగానీ, అభేదంగాను, చులకనగానూ, తక్కువచేసి condescending & patronizing గా, చూడవలసిన ఆవశ్యకత లేదు. నా ఉద్దేశంలో అక్కడి రచయితలతో, అక్కడివారి రచనలతో పోల్చవలసిన అవసరంకూడా కనిపించదు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూడగలిగితే, కొంచెం సహృదయతతో చదవగలిగితే, తెలుగు దేశంలో ఉన్న రచయితలకీ, కవులకీ, మనకీ రచనా శైలి లో, ఆలోచనాసరళిలో, ఊహల ప్రపంచాల్లో చెప్పుకోదగిన తేడా కనిపిస్తోంది. దేశం వదిలి రావడం వల్ల మనకి కలిగిన ఎడబాటు, మనలో ఒక స్వతంత్రతకీ, ధైర్యానికీ, ఒక కొత్త అనుభవాన్ని చెప్పడానికీ, కావలసిన మాటలు ఏరుకోడానికీ అవకాశం ఇచ్చింది. మన మాటల పొందిక, కూర్పు, చేర్పు, అక్కడలా ఉండకపోవచ్చు. వాక్య నిర్మాణంలో కూడా అక్కడి “లాలిత్యం, సొబగులూ” కనపడక పోవచ్చు. ఆల్లాగ లేవు కాబట్టి, అక్కడి గీటు రాళ్ళతో, అక్కడి మీటరు కొలబద్దలతో మన అమెరికన్‌ తెలుగు “అడుగులని” , మన తెలుగు రచనలనీ పరిశీలించితే వచ్చే ప్రమాదం, “వాళ్ళు ఒప్పుకున్నట్టుగా రాస్తేనే రచన అవుతుందనే” దురభిప్రాయం మన నవ రచయితలకి రావడం! (తమాషా ఏమిటంటే, అక్కడి నవసాహితీకారులు, మన ప్రాచీన లాక్షణికులని ఒప్పుకోరు, కానీ వాళ్ళు మన నవ రచయితలకి “లాక్షణిక శాస్త్రాచార్యులుగా” తయారవుతారు. ఇది, కొంచెం వింతగా కనిపించటల్లేదూ?) పైగా, అందరూ, కాళీపట్నం రామారావుగారిలా, రావిశాస్త్రిగారిలా, చలంలా, కృష్ణశాస్త్రిలా, తిలక్‌ లా రాయరు, రాయలేరు. ఒకవేళ అలా కాపీరాస్తే, అది literary cloning అయి కూర్చుంటుంది.

ఇక్కడికి వచ్చిన మనకి, ఒక కొత్త అవకాశం, అంటే జాగా (space), వచ్చింది. తెలుగు దేశంలో ఉన్నవాళ్ళకి, ఆ తెలుగు వాతావరణపు సమ్మర్దం వల్లా, తెలుగులో ప్రస్తుత సాహిత్యరాజకీయాల వత్తిళ్ళ వల్లా, ( వీటిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకండా చేశారు, ఈ మధ్య కాలంలో కొందరు “ప్రఖ్యాత” సాహితీవేత్తలు, Halloween ముసుగులు కప్పుకోని, సాహితీరంగాన్ని మలినం చేసారు.) తప్పనిసరిగా కొంత మొహమాటం, కొంత భయం, కొంత సర్దుబాటు తప్పవు. చాలా రంగాలలో లాగే, సాహిత్య రంగంలో కూడా నిక్కచ్చిగా గొప్పవాళ్ళే పైకి వస్తారనే హామీ అక్కడ లేదు. ఇది తెలుగులోనే వున్న ప్రత్యేక లోపం కాదు. ప్రపంచ సాహిత్య రంగాలలో చాలాచోట్ల ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకే ఈ లోపం ఉందని అనక్కర లేదు.

కాని, మనకి ఆ ఇబ్బంది లేదు. మనం ఎవరికీ మొహమాట పడక్కర లేదు. ఎవరన్నా భయపడక్కర లేదు. మనం అందరం సమానంగానే కొత్తగా రాస్తున్న రచయితలం, కవులం కాబట్టి అసూయలు లేవు. అన్నింటికన్నా ముఖ్యంగా మనం మన రచనలవల్ల కవితలవల్ల పొందేగొప్ప కీర్తులు, ఆర్జించే పెద్ద పదవులూ లేవు. మనకి రచన మన జీవితావసరం. మనని మనం, మన తరువాతి తరాన్నీ, ఈ నూతన సమాజంలో మనుషులుగా, ఒక కొత్త సాంస్కృతిక మిశ్రిత ( Hybrid Cultural Community(4)) సమాజంగా రూపొందించుకోడానికి రచన మన ప్రాణం. ఇక్కడ నేను రచన అన్న పదం చాలా విస్తృతార్థంలో వాడుతున్నాను. దీనిలో నేను ఆంగ్లానువాదాలనీ, స్వతంత్రంగా ఆంగ్లంలో వచ్చిన, వచ్చే రచనలనీ కూడా కలుపుతున్నాను. ముఖ్యంగా మన పూర్వ సారస్వత సంస్కృతి మన తరువాతి డయాస్పోరా తరానికి తెలియచెప్పి, వాళ్ళకి వాళ్ళ జాతి స్పృహ కల్గించాలంటే, మనకి తెలుగులో ఉన్న ప్రముఖ రచనలన్నీ ఆంగ్లంలోకి అనువదించవలసిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత మనపై ఉన్నది. ఆ పని ఇక్కడ ఉన్న మన తరం డయాస్పోరా యే చెయ్యగలదు.

మనకి అసూయలు, సాహిత్యం పేరుతో పదవీ కాంక్షలూ లేవని చెప్పానుగా! ( ఇది ఏ ఒకరికో, ఇద్దరికో వర్తించక పోవచ్చు! వీరికి, సాహిత్యం పేరు వాడుకోని, పదవులు, తెలుగు దేశంలో కీర్తీ సంపాదిద్దామనే కాంక్షలు ఉండవచ్చు. ) అంచేత మనం ఒకరి రచనలు మరొకరికి చదివి వినిపించుకోగలం. స్నేహపూర్వకంగా లోపాలు చూపించుకోగలం. మనకి మనమే “రచయితలం, కవులం, పాఠకులం, శ్రోతలం, విమర్శకులం!”

ఈ ఉమ్మడితనమే నాకు, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎవరికి వాళ్ళం ఇంట్లో కూర్చొని రాసుకొంటున్నప్పుడు ఏదో వెలితి కనిపించేది. ఇవాళ మనం ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. ఇదే నా దృష్టిలో తెలుగు డయాస్పోరా సాహిత్య ప్రపంచం.

అమెరికాలో వార్షీకంగా జరిగే Bread Loaf Writers’Conference(5) లాగా, మనం literary workshops పెట్టుకోగలమేమో ఆలోచించండి. ఇతర ఖండాలలో ఉన్న తెలుగు రచయితల్తో కలిసి, ఇటువంటి సమావేశం పెట్టుకుంటే బాగుంటుండని నా ఆశ. ( Dream on, Veluri, అన్నారు, ఎవరో, ఆటా సభల్లో!)

నామటుకు నేను రాస్తూన్నకొద్దిపాటీ, ఈమాట లోనో, తానా పత్రికలోనో, అమెరికా భారతిలోనో ప్రచురణకి పంపబోయే ముందు, కనీసం ఒక నలుగురైదుగురికి పంపించుతా, వాళ్ళ విమర్శల కోసం. ఆతరువాతనే అవి ప్రజల ముఖం చూడడం జరుగుతూన్నది. చెప్పానుగా, ఇంతకుముందే! “మనకుమనమే రచయితలం, శ్రోతలం, విమర్శకులం,” అని.

నిర్భయంగా అవసరమైతే మనం కొత్త genre తయారు చేసుకోగలం. ఆ కొత్త genre ఆవశ్యకత మనకే తెలుసును. అక్కడి విమర్శకులకి అది తెలియక పోవచ్చు. ఇక్కడ కొత్తగా తయారవుతున్న genre ని, ప్రక్రియలనీ అక్కడి ఫక్కీలోనే చూస్తే, పాత ప్రశ్నలు రాక మానవు. “ఇది కథా? వ్యాసమా? వ్యాస కథా, లేక కథా వ్యాసమా?” అని నా రచననొకదాన్ని గురించి అడిగినప్పుడు, నేను ఆ రచన “వ్యాకథ” అంటే, వ్యాకులతతో రాసినది అని శసబవ చేశాను, ఒక ప్రఖ్యాత సాహితీ విమర్శకుడుగా పేరున్న నా మిత్రుడితో!)

ఇందాక అవకాశాన్ని గురించి చెప్పాను. అవకాశం అంటే జాగా అన్నాను. ఈ జాగావల్ల మనకి తెలుగు వాతావరణం నుంచి ఎడబాటు కలగలేదు. కొంచెం దూరం మాత్రమే అయినదన్నాను. అవకాశం అంటే సదుపాయం (opportunity) కూడా.

మనకి, ఈ దేశానికి రాబట్టి కొన్ని సదుపాయాలు కూడా కలిగాయి. పుస్తకాలు “అచ్చు” వేసుకోవడంలో, పదిమందికీ అందేట్టు చెయ్యడంలో, తెలుగు దేశంలో రచయిత్రులతో, రచయితలతో, కవయిత్రులతో, కవులతో తరచు సంబంధం ఏర్పరచుకోవడంలో, వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోడానికి, మనం అక్కడికి వెళ్ళడానికీ మన ఉభయ సాహిత్య ప్రపంచాల మధ్యా సాదరమైన, స్నేహ పూర్వకమైన పరిచయాలు ఏర్పరుచుకోడానికీ సదుపాయాలు చాలా ఉన్నాయి. వాటిని మనం ఎంతబాగా పెంపొందించుకుంటే, మన డయస్పోరా ప్రపంచం అంతబాగా వృద్ధిపొందుతుంది. ఇది ఏమంత తేలికైన పని కాదు. మనకున్న ప్రత్యేక సదుపాయాలు కొంతమందికి ఈర్య్ష, అసూయా కూడా కలిగించవచ్చు. మన ఉద్దేశాలు, మన ప్రయత్నాలూ, మన తాత్పర్యతలపై అనవసరమైన అనుమానం వచ్చే అవకాశం కూడా ఉన్నది. అటువంటి ప్రమాదం రాకుండా చూడగల స్థైర్యం మనకి ఉన్నదని నేను గాఢంగా నమ్ముతున్నాను. మనసదుపాయాలని జాగ్రత్తగా ఉపయోగించుకొని, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు రచయితలతో పరిచయాలు పెంచుకొని, తెలుగు దేశంలో రచయితలని, మనని, వారినీ కలుపుకొని వేరువేరు ప్రక్రియలపై ప్రత్యేకమైన సాహితీ సదస్సులు చేసుకోగలం. ఈ విషయమై, దేశ వ్యాప్తంగా ఉన్న మన పెద్ద సంఘాలు ఆలోచించడం ఆదరించడం అవసరం.

అయితే, నేను ఇందాక చెప్పిన ఆ వృద్ధి, ఇక్కడ వున్న అమెరికన్‌ సాహిత్య ప్రపంచానికిమధ్యలో ఉండబట్టి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ విదేశపు వాతావరణాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మనకి కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త విమర్శాప్రమాణాలూ, కొత్త సాంస్కృతిక విశ్వాసాలూ ఏర్పడతాయి. తెలుగు దేశంలో ఉండి ఇంగ్లీషుని చూడడంకన్నా, ఇక్కడనించి ఇంగ్లీషుని చూడడం వల్ల, మనలో ఆ “వ్యామోహం” తగ్గి, విమర్శనాత్మకమైన నిబ్బరం ఎక్కువ అవుతుంది.

తెలుగు దేశంలో ఉండగా మనలో ఉండే పాశ్చాత్య వ్యామోహంవల్ల మనకి ఇంగ్లీషుమీద మోజే కాని అవగాహన గాని అభిరుచి గాని ఏర్పడ లేదు. ఇప్పుడు పరిస్థితి వేరు. మనం తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యాలతో సమానంగా సరితూచి అందులో భాగంగా ఇంగ్లీషు సాహిత్యాన్ని చూడగలం.

ఈ మధ్య సాహితీ సహృదయులైన నా అమెరికన్‌ మిత్రులు కొందరికి, ఈ క్రింది పద్యం చదివి వినిపించాను.

‘Who were we in our past life?’
She became shy and giggled.
‘What will be our future life?’
She turned pale, amazed.
‘How long our happiness last?’
Tears in her eyes, she grew sad.

మా స్నేహితులు అన్నారు, It’s great. You must publish it అని. ఈ పద్యమే, ఇక్కడ పుట్టి పెరుగుతూ, కాలేజీకి వెళ్ళుతున్న మా మేనకోడలికి వినిపించా. ఆ అమ్మాయి వెంటనే, I bet this must be from Elizabeth Barrett Browning! అన్నది. వీళ్ళకి ఇది 75 సంవత్సరాలక్రితం తెలుగులో మా ఏలూరి వాడు, నండూరి సుబ్బారావు గారు రాసిన యెంకి పాటకి, నిరుడు వెల్చేరు నారాయణరావు గారు ప్రచురించిన అనువాదం (6), అని చెప్పినప్పుడు, నేను తెలుగు కవిత్వాన్ని ప్రపంచకవిత్వంలో ఒక ముఖ్య భాగంగా చూసి, మురిసిపోయి, గర్వపడ్డాను. అనువాదాలు ఎందుకు చేసుకోవాలో మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్పనక్కరలేదు. ఈ పని చెయ్యగల సదుపాయాలు మనకే దండిగా ఉన్నాయి. అవి సద్వినియోగపరుచుకోవాలి, అంతే!

మనకి ఇక్కడనించి అనేక ప్రపంచ సాహిత్యాలతో సంబంధం ఎక్కువ అవుతుంది. మనద్వారా ప్రపంచ సాహిత్యంలో తెలుగు సాహిత్యం ఒకటవుతుంది.

అయితే, ఈ మంచి పనులన్నీ మనం మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన సదుపాయాలనీ, అవకాశాన్నీ, జాగానీ బాగా వాడుకోగలిగితేనే సాధ్యపడతాయి. మనం మన గొప్పతనాన్ని మనం నలుగురం కలుసుకున్నప్పుడు చెప్పుకోడంతో కలిగే ఆత్మ సంతృప్తితో, అక్కరకు రాని పఫల తో గడిపేస్తే మన డయాస్పోరా సాహిత్య ప్రపంచం మనతో పుట్టి మనతోనే అంతరించి పోతుంది.

మనం మనకున్న అవకాశాన్నీ, సదుపాయాలనీ, జాగానీ వాడుకొని మన ప్రపంచాన్ని అటు తెలుగుదేశంలో తెలుగు సాహిత్య ప్రపంచంలోకీ, ఇటు ఇంగ్లీషులో తయారవుతున్న మన పిల్లల ప్రపంచంలోకీ విస్తరిస్తే అప్పుడు మన డయాస్పోరా సాహిత్య ప్రపంచం అటు తెలుగు దేశంలో ఉన్న సాహిత్యాన్నీ సంపన్నం చేస్తుంది; ఇటు ప్రపంచ భాషల సాహిత్యాన్నీ సుసంపన్నం చేస్తుంది.

అపని మనం చెయ్యగలం, అందుకు మనం సమర్థులం అన్న నమ్మకం నాకు ఉంది.

“Diaspora invariably leaves a trail of collective memory about other times and places. Most displaced/immigrant people frame these attachments with the aid of living memory and the continuity of cultural traditions. It is not uncommon for some diasporas to have these memories refracted through a prism of history to create maps of desire and attachment.” Paul Gilroy రాసిన ఈ మాటలు ఆఫ్రికన్‌ డయాస్పోరా కే కాదు, మనకి కూడా వర్తిస్తాయి.

References.

  1. Zacharaiah Cherian Mampilly: The African Diaspora of the Indian Sub-Continent,1999.
  2. Diasporas: Some Conceptual Considerations – from the Diaspora Panel of the International Studies Association –ISA Conference, February, 1999.
    See also William Safran, Diasporas in Modern Societies: Myth of Homeland Return in Diaspora: A Journal of Transnational Studies, Vol. 1, no.1.
    James Clifford: The Predicament of Culture, Harvard University Press, 1988 (Especially, Chapters 7 & 11,
    A Politics of Neologism & On Orientalism).
    Paul Gilroy, The Black Atlantic: Modernity and Double Consciousness, Harvard University Press, 1993.
  3. David Kenley: Publishing the New Culture: Singapore’s Newspapers and Diaspora Literature, 1919-1933
    in Exploration in South Asian Studies, Vol.2, No.2, Fall 1998.
  4. Homi K. Bhabha: The Location of Culture, Routledge, 1994.
  5. Bread Loaf Writers’ Conference : (Every year for 11 days in August this conference takes place in Green Mountains of Vermont is administered by Middlebury College. For an article by Rebecca Mead on the 2001 Conference, see The New Yorker, October 15, 2001.
  6. Twentieth Century Telugu Poetry, An Anthology, edited and translated by Velcheru Narayana Rao, Oxford University Press, 2002.