తెలుగు డయస్పోరా సాహిత్యం

ఈ మధ్య “డయస్పోరా సాహిత్యం” అనే మాట తరచుగా వినిపిస్తోంది, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో.  రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈ అంశం పైన కొన్ని ప్రసంగాలు జరిగాయి కూడా.  ఆ సదస్సులో శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారు డయస్పోరా రచయిత అంటే తన నిర్వచనం ఏమిటో వివరించారు.  అయితే ఆ మాటకు నేను చెప్పుకునే అర్ధం కొంచెం తేడాగా ఉన్నందుమూలాన దాన్ని ఇక్కడ మరొక్కసారి ప్రస్తావిస్తాను.

డయస్పోరా అంటే?

మొదట అసలు డయస్పోరా అంటే ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది.  ఈ పదం మొట్టమొదట తమ స్వదేశాన్నుంచి బహిష్కరింపబడి బలవంతంగా వేరే దేశాలకి వెళ్ళిపోవాల్సొచ్చిన యూదుల పరిస్థితిని వర్ణించడానికి సృష్టింపబడింది.  ఇలా పరదేశాలకు చెల్లాచెదురైపోయిన యూదులని డయస్పోరా అన్నారు.  కాలక్రమాన, ఈ పదం వాడకంలోనూ, అర్ధంలోనూ కొంచెం మార్పు వచ్చి, ఇప్పుడు స్వదేశాన్ని వదిలి వేరే చోట స్థిరపడినవాళ్ళందరికీ వర్తిస్తుంది.

డయస్పోరాకీ ప్రవాసానికీ తేడా

ఈ సంవత్సరంలో జరిగిన ఆటా కాన్ఫరెన్స్‌ లో ” diaspora literature ” అనే పదాలని తెలుగులో “ప్రవాస సాహిత్యం” అని తర్జుమా చేశారు.  మరి ప్రవాసానికీ డయస్పోరాకీ తేడా ఉందా? ఉంటే ఏమిటది?  ఒక మనిషి వేరే చోటకి ఎక్కడికి వెళ్ళినా ప్రవాసి అవుతాడు.  కానీ ఒక్క మనిషితో డయస్పోరా ఏర్పడదు.  కొంత సంఖ్యాబలం కూడేంతవరకూ అలా ప్రవాసంలో ఉన్నవారు డయస్పోరా అవరు.  అయితే ఎంత మంది ప్రవాసులైతే డయస్పోరాగా మారుతారో చెప్పేందుకు ఏమీ ఖచ్చితమైన లెక్కలు లేవు.  స్థూలంగా, స్వదేశంతో సంబంధ బాంధవ్యాలు లేకపోయినా, తమ ఉనికికి ఏమీ ఇబ్బంది కలగని స్థితికి ఎదిగితే, ఆ ప్రవాసులు డయస్పోరా అనుకోవచ్చు.  ఇక్కడ “ఉనికి” అంటే, జీవనోపాధి మాత్రమే కాదు, వారి సంస్కృతిని నిలబెట్టుకునేందుకు కూడా వీలయ్యే పరిస్థితి అని అర్ధం చేసుకోవాలి.

ఈ నిర్వచనం ప్రకారం, భారతదేశంలోనే నివసిస్తూ తెలుగు నాడుకి దూరంగా ఉన్నవాళ్ళను కూడా డయస్పోరాగా వ్యవహరించవచ్చు.  ఉదాహరణకి, తమిళ నాడులోనూ, కర్ణాటకలోనూ, ఒరిస్సాలోనూ, తరతరాలుగా స్థిరపడిపోయిన తెలుగువాళ్ళని పేర్కొనవచ్చు. ఇలా పొరుగు రాష్ట్రాలలోనే కాక, దేశం మొత్తంలో, తరతరాలుగా కాకపోయినా ఒక తరంవాళ్ళైనా ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళున్నారు.  వాళ్ళని కూడా డయస్పోరాగా పేర్కొనవచ్చు.   ఇంకా సులభంగా నిర్వచించాలంటే, తెలుగు సంఘంగానీ, ఆంధ్రా అసోసియేషన్‌ గానీ ఏర్పరచుకోవాల్సిన అవసరం కలిగిన వాళ్ళందరూ డయస్పోరాలో ఒక భాగంగా భావించవచ్చు.

డయస్పోరా సాహిత్యం ఒక నిర్వచనం

అయితే, కేవలం స్థలం మార్పు చెందినంత మాత్రానే ఒక రచయిత రచనలలో మార్పు వచ్చి, అంతకు ముందు దేశీ సాహిత్యంగా చలామణీ ఔతున్న రచనలు హఠాత్తుగా డయస్పోరా రచనలుగా పరిణామం చెందుతాయా?  గత ముఫ్ఫై నలభై ఏళ్ళల్లో, భారతదేశంలో కాకుండా, ఇతర దేశాలలో స్థిరపడిన రచయితలు రాసిన రచనలను చూస్తే, ఈ అభిప్రాయం సరైనది కాదని తెలుస్తుంది.  కథావస్తువునుబట్టిగానీ, కథనంలో గానీ, పాత్రల ద్వారాగానీ, ఆ రచయిత భారత దేశంలో ఉన్నారో లేదో తెలియకపోతే, అది డయస్పోరా రచన కాదని నా ఉద్దేశం. ఎందుకంటే,  వేరే రాష్ట్రానికి కానీ, దేశానికికానీ వెళ్ళిన వ్యక్తికి ఇంకొక భిన్నమైన సంస్కృతితో పరిచయమౌతుంది.  మనుషుల స్వభావాన్ని బట్టీ, అనుభవాలను బట్టీ వాళ్ళు ఈ పరాయి సంస్కృతి మూలాన ఎంత వరకూ ప్రభావితమౌతారో అనే విషయం  నిర్ణయింపబడుతుంది. ఈ కోణంలోనుంచి చూస్తే, ఒక వ్యక్తి వేరే దేశానికీ, రాష్ట్రానికీ మాత్రమే గాక పొరుగూరికి వెళ్ళినా, లేక స్వంత ఊరులోనే ఒక ఉపసంస్కృతి ( subculture ) తో పరిచయం కలిగినా (ఉదాహరణకి ఒక కులం మనుషులు వేరే కులం వారితో పరిచయం కలిగి, వారి ఆచార వ్యవహారాలగురించి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు), వీళ్ళని కూడా పరాయి సంస్కృతులవల్ల ప్రభావితమైన వారిగా పేర్కొనవచ్చు.  ఇలాంటి సాహిత్యాన్ని ఇంగ్లీషులో bicultural literature  అని పిలవచ్చు.  అంటే, రచయిత పుట్టి పెరిగిన సంస్కృతి ప్రభావమూ, ప్రస్తుతం తానుంటున్న సంస్కృతి ప్రభావమూ, రెండూ రచనలో స్పష్టంగా కనిపిస్తాయి.  ఇలాంటి సాహిత్యాన్ని డయస్పోరా సాహిత్యం అనొచ్చని నా ఉద్దేశం.  ఇంకో విధంగా చెప్పాలంటే, ఇలా భిన్న సంస్కృతుల ప్రభావాలు కనిపించని సాహిత్యం, రచయిత ఎక్కడ ఉండి రాస్తున్నా, డయస్పోరా సాహిత్యం అనిపించుకోదు అని కూడా నా ఉద్దేశం.

డయస్పోరా సాహిత్యపు లక్షణాలు

ఈ నిర్వచనం ప్రకారం విదేశీ డయస్పోరా రచనల లక్షణాలని పరిశీలిద్దాం.

· కథా వస్తువు డయస్పోరా కథల్లోని కథావస్తువు సామాజిక స్పృహతో కూడుకున్నది.  అయితే ఈ స్పృహ కలిగేది ఆ రచయిత ఉంటున్న కొత్త సమాజం గురించి.  ఈ  సందర్భం లో సామాజిక స్పృహ అంటే ఇదివరకు మనం చెప్పుకున్న అర్ధం అనగా, వర్గ వ్యవస్థ గురించీ, పీడిత వర్గాల సమస్యల గురించీ అని కాకుండా, తన చుట్టూ ఉన్న సమాజాన్నీ, అందులో తాననుభవిస్తున్న జీవితాన్నీ, అర్ధం చేసుకోవాలనే తపన అని అర్ధం చేసుకోవాలి.  ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే, వేరు వేరు దేశాలలో ఉండే డయస్పోరా వారి అనుభవాలు విభిన్నంగా ఉంటాయి.  కాబట్టి, వారు రాసే రచనలూ, వారు ఎదుర్కొనే సమస్యలూ కూడా విభిన్నంగానే ఉంటాయి.

· కథా స్థలం డయస్పోరా కథలలో కథాస్థలం సాధారణంగా విదేశాలలోనే ఉన్నా, కొన్ని సార్లు కథా స్థలం భారతదేశం లో కూడా ఉండవచ్చు, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశంలో.  మరి కథాస్థలం భారతదేశం లోనే ఉంటే అది డయస్పోరా కథ ఎలా అవుతుందీ? అంటే, తిరిగి తనకు తెలిసిన పాత సంస్కృతీ, పాత సమాజంలోకీ వెళ్ళిన వ్యక్తి, తన డయస్పోరా జీవనం మూలంగా సంపాదించిన కొత్త దృక్పధంతో ఆ పాత సమాజాన్నీ, పాత సంస్కృతినీ కొత్త దృష్టితో పరిశీలిస్తాడు.  అలాంటి పరిశీలన ఉన్న కథ డయస్పోరా కథే అవుతుంది, దాని కథాస్థలం ఎక్కడ ఉన్నా.

· పాత్రలు డయస్పోరా కథల్లో పాత్రలు పూర్తిగా తెలుగువాళ్ళే కావచ్చు, తెలుగు వారూ, ఇతర భారతీయులూ కావచ్చు, తెలుగు వారూ, ఇతర భారతీయులూ, విదేశీయులూ కావచ్చు.  అయితే రచయిత ఆంధ్ర ప్రదేశ్‌ లోనే ఉంటూ, విదేశీ పాత్రలను సృష్టించి రాసిన, రాసే కథలూ లేకపోలేదు.  అవి డయస్పోరా రచనలు అనిపించుకుంటాయా?  ఆ విదేశీ పాత్రల మీద సరైన అవగాహన కలిగి, పైన చెప్పిన కొత్త దృక్పధం తో రాస్తే, అవికూడా డయస్పోరా రచనలనిగానీ, లేక ఇదివరకు చెప్పిన bicultural literature  అని గానీ పిలవచ్చు.  ఇలాంటి కథలో కూడా, రచయిత, లేక కథలో ఒక పాత్ర, ఈ విదేశీ పాత్రల ద్వారా పరిచయమైన కొత్త సంస్కృతి వల్ల కొత్త దృక్పధమూ, కొత్త దృష్టీ అలవర్చుకుంటారు.  కాబట్టి అది డయస్పోరా రచన అనవచ్చు.

· కథనం కథనం లో డయస్పోరా రచనలకీ, డయస్పోరా కాని రచనలకీ ఎక్కువ తేడా కనిపించదు.  డయస్పోరాలో ప్రచురితమయ్యే పత్రికలకోసమూ, సావనీర్లకోసమూ ఉద్దేశింపబడిన రచనల్లో విదేశీ జీవనవిధానానికి ఎక్కువ వర్ణన ఉండదు.  ఎందుకంటే, చదువుతున్న అందరికీ అది తెలుసుననే భావన రచయితకుంటుంది.  ఆంధ్ర ప్రదేశ్‌ లో ప్రచురణకి పంపించే కథల్లో ఇలాంటి వర్ణన కొంచెం ఎక్కువగా ఉంటుంది.  ఒక్కొక్కసారి కథ మొత్తం ఈ వర్ణనతోనే సరిపోతుంది.  ఇది డయస్పోరా రచనలో తొలిమెట్టుగా మనం భావించవచ్చు.  కొత్తగా చేరిన సమాజానికీ, వారి ఆచారాలకీ అలవాటు పడాలనీ, అందులో ఇమడాలనీ చేసే ప్రయత్నానికి తార్కాణం ఇది.  ఉదాహరణకి, 1960 దశకంలో అప్పుడే కొత్తగా తెలుగు వారు అమెరికాకి వస్తున్న రోజుల్లో “అమెరికాలో కూరగాయలు”, “అమెరికాలో మన వంటలు” వగైరా శీర్షికలతో చాలా వ్యాసాలు వచ్చేవి.  వీటిని కూడా డయస్పోరా రచనలనవచ్చు.

· భాష డయస్పోరా రచనల్లోనూ, డయస్పోరా రచనలు కానివాటిలోనూ, మనకు కనిపించే ముఖ్యమైన తేడా భాష.  ఈ నాడు ఆంధ్ర ప్రదేశ్‌ లో ప్రచురితమౌతున్న చాలా కథల్లో ఇంగ్లీషు మాటల వాడకం ఎక్కువైనా, ఒక్కొక్కసారి తెలుగు వాక్యాలే ఇంగ్లీషు వ్యాకరణం ప్రకారం రాస్తున్నా, నేను చెప్పే భాష ప్రభావం ఇది కాదు.  డయస్పోరా రచనల్లో సాధారణంగా రెండు భాషలు కనిపిస్తాయి తెలుగూ, ఇంగ్లీషూ (ఇంత వరకూ వస్తున్న రచనలు చాలా మట్టుకు ఇంగ్లీషు మాట్లాడే దేశాలలోనించి వస్తున్నాయి కాబట్టి).  కానీ డయస్పోరా రచనల్లో ఇంగ్లీషు భాష వాడుక పూర్తిగా పాత్రోచితమైనది.  సాధారణంగా విదేశాలలో స్థిరపడిన కుటుంబాలలో ఉన్న పరిస్థితి ఏమిటంటే తల్లి తండ్రులకు తెలుగు భాష వచ్చు, విదేశాలలో పుట్టి పెరుగుతున్న పిల్లలకి రాకపోవచ్చు, అర్ధం మాత్రమే అవచ్చు, లేక వచ్చినా మాట్లాడ్డానికి ఇష్టంలేకపోవచ్చు.  ఈ మూడు పరిస్థితులనూ ప్రతిబింబించేటట్టు డయస్పోరా రచనల్లో సాధారణంగా సంభాషణల్లో తల్లి తండ్రుల పాత్రలు తెలుగులో మాట్లాడితే, పిల్లల పాత్రలు ఇంగ్లీషులో జవాబిస్తూ ఉంటాయి. అలాగే వేరే దేశాల్లో స్థిరపడిన పెద్దలు కూడా దైనందిన జీవితంలో ఇంగ్లీషు మాట్లాడే అలవాటు కొద్దీ, ఇంట్లో వాళ్ళతో కూడా తెలుగూ, ఇంగ్లీషూ మిశ్రమం చేసి మాట్లాడుతూంటారు.   డయస్పోరా జీవనాన్ని వాస్తవికంగా చిత్రించాలంటే ఇలాంటి భాషా ప్రయోగం తప్పనిసరిగా అవసరమే.   డయస్పోరాలో ఉంటున్న వాళ్ళకి ఇలాంటి ద్విభాషా ప్రయోగం ఏమీ ఇబ్బందిని కలిగించదు కూడా.  ఇబ్బందల్లా తెలుగు మాత్రమే వచ్చి ఇంగ్లీషు రాని పాఠకులకు మాత్రమే.

డయస్పోరా సాహిత్యపు ప్రయోజనం

డయస్పోరా రచనలు ఎవరికోసం రాస్తున్నారు?  ఇందాక చెప్పినట్టు, డయస్పోరా రచనల్లోని కొన్ని ప్రయోగాలు డయస్పోరాలో లేని పాఠకులకు చదవడానికీ, అర్ధం చేసుకోవడానికీ కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు.  ఈ వ్యాసంలో మొట్టమొదట అసలు డయస్పోరా రచనలకు అవసరం ఎందుకు కలిగింది? అన్న ప్రశ్నకు తమ చుట్టూ ఉన్న కొత్త సమాజాన్నీ, తామనుభవిస్తున్న కొత్త జీవితాన్నీ అర్ధం చేసుకునే ప్రయత్నమని జవాబు చెప్పుకున్నాం.  దీన్ని బట్టి డయస్పోరా రచనలు ముఖ్యంగా డయస్పోరాలో ఉన్న పాఠకులను ఉద్దేశించి రాసినవని తెలుస్తుంది.

కానీ డయస్పోరా సాహిత్యం కేవలం డయస్పోరా పాఠకులకే పరిమితమా? కాదు.  ముఖ్యంగా ఉద్దేశింపబడిన పాఠకులు డయస్పోరాలో ఉన్నవాళ్ళే అయినా, వేరే వాళ్ళు చదవకూడదనే నిషేధమేమీ లేదు.  ఆ మాటకొస్తే డయస్పోరాలో లేని వాళ్ళు కూడా చదవడం చాలా అవసరం.  ఎందుకంటే, ఈ రచనల ద్వారా తెలుగు వారు వేరే వేరే దేశాల్లో ఎలా జీవిస్తున్నారో స్వదేశంలోనే ఉన్న తెలుగు వారు అర్ధం చేసుకునేందుకు ఇది మంచి అవకాశం.  విదేశీ రచయితల  రచనలు చదవడం ఎంత వరకూ ప్రయోజనమో, డయస్పోరా రచనలు చదవడం కూడా అంత వరకే ప్రయోజనం.

ఈ సందర్భంలో ఈ మధ్య అమెరికా తెలుగు రచనలని గురించి ఆంధ్ర ప్రదేశ్‌ లో వచ్చిన కొన్ని విమర్శలు నాకు కొంత వింతగా తోచాయని చెప్పక తప్పదు.  మొదటిది “అమెరికా తెలుగు కథానిక” (ఏ సంకలనమో మర్చిపోయాను); రెండవది ఈ మధ్యనే వచ్చిన “ఈ నేలా ఆ గాలీ” అన్న ఈమాట రచనల సంకలనం.  మొదటి పుస్తకం గురించి ఒక విమర్శకుడు, “ఇందులో కథలు చాలా మట్టుకు అమెరికా జీవితం గురించే ఉన్నాయి,” అని అదొక లోపమన్నట్టు వ్యాఖ్యానించారు.  “అమెరికా తెలుగు కథానిక” అనే పుస్తకంలోని కథలు అమెరికా జీవితం గురించి ఉండడంలో ఆశ్చర్యమేమున్నది?  అలాగే “ఈ నేలా ఆ గాలీ” సంకలనం గురించి కూడా ఒక విమర్శకుడు, ” …  ఆహ్లాదం కలిగించే ఈ పుస్తకంలో ఊరట కలిగించే విషయం అన్ని కథలూ అమెరికాలోనే జరగవు,” అని హాయిగా నిట్టూర్చారు.  ఈ రెండు వ్యాఖ్యానాలనీ బట్టి నాకర్ధమౌతున్నదేమిటంటే ఆంధ్ర ప్రదేశ్‌ లో ఉన్న తెలుగు వారు ఈ డయస్పోరా అన్న భావాన్నీ, ఆ మాట వర్ణిస్తున్న వాస్తవాన్నీ ఇంకా గుర్తించలేదు.  ఈ గుర్తింపు డయస్పోరాలోనే ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు.  ఈ భావాన్నీ, దానర్ధాన్నీ పూర్తిగా ఆకళింపు చేసుకునేందుకు వారికి ఇంకా కొన్నాళ్ళు పట్టవచ్చు.  తెలుగు వారే రాస్తున్నా, తెలుగు వారి జీవితం గురించే అయినా, డయస్పోరాలో నుంచి వచ్చే రచనలు తెలుగు దేశంలోనుంచి వచ్చే రచనలకు ప్రతిబింబాలు కావు.  నేడు తెలుగు సాహిత్యంలో ముఖ్యాంశాలు అనుకునే విషయాలు డయస్పోరా రచనలకు ముఖ్యమైనవి కావు.  ముందు ముందు వచ్చే డయస్పోరా రచనల గురించి ఆంధ్ర ప్రదేశ్‌ లో ఉండే విమర్శకులు ఒక కొత్త దృక్పధం ఏర్పరుచుకుని వీటిమీద వ్యాఖ్యానించాలని మనవి.

ఇక డయస్పోరా రచనల ప్రయోజనమేమిటి?  ఇంతవరకూ వచ్చిన రచనలను చూస్తే, వాటి ముఖ్య ప్రయోజనం విదేశాలలో స్థిరపడిన తెలుగువారి వలస జీవనాన్ని ప్రతిబింబించిడమే.  ప్రవాసులుగా వచ్చిన వారు డయస్పోరాగా ఎలా మారారో, నాలుగు రోజులు ఉండిపోదామని వచ్చిన వారు పౌరులుగా ఎందుకు మారారో, తరాల మార్పులతో అటు స్వదేశంలోని తల్లి తండ్రులతో, ఇటు విదేశంలో పిల్లలతో ఎదురయ్యే సమస్యలని ఎలా ఎదుర్కొంటున్నారో, జననీ జన్మభూమిశ్చ అంటూనే ఆ రెంటికీ దూరంగా బ్రతుకెలా వెళ్ళదీస్తున్నారో, ఇవీ, ఇలాంటివే మరెన్నో విషయాలకూ చారిత్రాత్మక మూలగ్రంధాలుగా ఈ రచనలు నిలుస్తాయి.  ఇదివరకు తెలుగు వారు వలస వెళ్ళి డయస్పోరాగా మారినా (ఉదాహరణకు 19వ శతాబ్దంలో ఫిజీ, మారిషస్‌ బర్మా వగైరా దేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయిన వారు), వారి అనుభవాలని గురించి మనకు తెలియజెప్పే సమకాలీన రచనలు ఎక్కువ లేవు.  కనీసం ఈ కొత్త డయస్పోరాకైనా అలాంటి లోటు ఉండదు.

డయస్పోరా సాహిత్యపు భవిష్యత్తు

అసలు డయస్పోరా అంటే ఏమిటో, డయస్పోరా సాహిత్యం అంటే ఏమిటో, ఇప్పుడిప్పుడే కొంచెం స్పష్టంగా ఊహలు ఏర్పరచుకుంటున్న సమయంలో కొంత మంది అప్పుడే ఈ సాహిత్యం ఈ తరం (అంటే భారతదేశం నుంచి వలస వచ్చిన మొదటి  తరం) తో అంతమవుతుందా, లేక ముందు తరాల వారు కూడా ఈ సాహిత్యాన్ని పెంపొందిస్తారా? అనే మీమాంసలో పడిపోయారు.  ఈ సందేహం రావడానికి ముఖ్య కారణాలు రెండు.  ఇక్కడ పుట్టి పెరిగిన వారికి ఈ సమాజం “కొత్త”గా అనిపించదనీ, వారు సులభంగా ఈ సమాజంలో ఇమిడిపోతారు కాబట్టీ, వారికి భారతదేశంతో సంబంధ బాంధవ్యాలు సడలిపోతాయి కాబట్టీ,  మొదటి తరంలో తలెత్తిన భిన్న సంస్కృతుల సంఘర్షణ వీరిలో ఉండదనీ, తద్వారా రచనలు చెయ్యాలనే ప్రేరణ ఉండదనీ ఒక భావన.  ఇంతకంటే ప్రాధమికమైన సందేహం అసలు ముందు తరాల వారికి తెలుగు భాష తో పరిచయమూ, అందులో రచనలు చేయదగినంత ప్రావీణ్యమూ ఉంటాయా అన్నది.  ఇప్పుడు వస్తున్న డయస్పోరా రచనలు ఈ తరం వారితోనే అంతరించిపోతాయా, అలా అయితే వాటి గురించి ఇంత మధన పడడం ఎందుకు? అని కూడా ఒక నిస్పృహతో కూడిన ప్రశ్న ఈ సందేహం లోనుంచి అవతరిస్తుంది.

ఈ రెండూ కూడా అనవసరమైన భయాలని నా ఉద్దేశం.  ఇక్కడ పుట్టి పెరిగిన రెండవ, మూడవ తరం వారికి భారతదేశంతో ప్రత్యక్ష అనుభవం అంత లేకపోయినా, విదేశీ సమాజంలో వారు తేలిగ్గా కలిసిపోయినా, భారత సంస్కృతీ, తెలుగు సంస్కృతీ వారిలో ఇంకా బలంగానే ఉన్నాయి, ఈ రెండు సంస్కృతులనూ (ఇంటా, బయటా ఉన్నవి) సమన్వయపరచుకోవడానికి వారు ఆరాటపడుతూనే ఉన్నారు.  తరాలు మారుతున్నకొద్దీ తెలుగు సంస్కృతి వాసనలు క్రమేణా తగ్గిపోవడం సహజం.  కానీ అప్పటి రచనలకి ప్రేరణ ఏమౌతుందో ఇప్పుడు చెప్పడం కష్టం.  ఇక భాష మాటకొస్తే, తెలుగు భాషకి భవిష్యత్తు ఉందా అని ఆంధ్ర ప్రదేశ్‌ లోనే తర్జన భర్జనలు జరుగుతున్నప్పుడు ఇది కేవలం డయస్పోరా వారికి పరిమితమైన సమస్యగా నాకు తోచదు.  అదీకాక, పైన చెప్పినట్టు, డయస్పోరా రచనల్లో ఎలాగూ రెండు భాషలు ఉపయోగించక తప్పదు.  కాలక్రమేణా ఒక భాష వాడకం తక్కువై, రెండవ భాషే (ఇక్కడ ఉదహరించిన రచనల్లో ఇంగ్లీషు) పూర్తిగా చోటుచేసుకున్నా అందులో ఆశ్చర్యమేమీలేదు.  అలాంటి పరిస్థితి వచ్చినా, తెలుగు వారి గురించి రాస్తున్నంత కాలం అవి డయస్పోరా రచనలవక తప్పదు.

తుదిమాటగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, డయస్పోరా సాహిత్యం ఇంకా శైశవావస్థలోనే ఉన్నది.  అసలది ఒక నిర్దిష్టమైన సాహిత్యమని ఇప్పుడే గ్రహింపుకొస్తోంది.  నిజానికి దాన్ని ఎలా నిర్వచించాలనేది కూడా ఇంకా వివాదాస్పదమైన అంశమే.  కాలం గడిచిన కొద్దీ ఈ నిర్వచనమూ, సాహిత్యమూ కూడా పరిణామం చెందుతూనే ఉంటాయి.  ముందు ముందు ఈ సాహిత్యం ఎలా రూపొందుతుందో చూడాలని నాకు చాలా కుతూహలంగానూ, ఉత్సాహంగానూ ఉన్నది.  వేచి చూద్దాం.

రచయిత మాచిరాజు సావిత్రి గురించి: జననం ఏలూరులో. తొమ్మిదేళ్ళ వయసు నుంచి అమెరికా, కెనడాలలోనే ఉన్నారు. నివాసం కేలిఫోర్నియాలో. వాతావరణకాలుష్య రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నాటకాలు, ఓ నవల రాసారు. ...