ముందుగా వచ్చిన ఈదురు గాలి
వర్షం అతిథి రాకను తెలుపుతుంటే-
దాని ఒళ్ళంతా దుమ్మని
నా శుభ్రమైన ఇంట్లోకి రానీకుండా
మొహమ్మీదే తలుపేసేశాను.
ప్రేమతో …
నన్నెలాగైనా కలవాలని వచ్చిన వానజల్లును
ఆపేశాను,అంతే వేగంగా
కిటికీలు మూసేసి!
ఉరుముల పిలుపులను
టీవీ అరుపుల్లోపడి వినిపించుకోనేలేదు
చిరుజల్లు తెచ్చిన మట్టి వాసనలు
చాట్ మసాల ఘుమఘుమల ముందు
పనికిరాలేదు.
సకల ప్రాణులను సంతోషపెట్టిన
ఆ స్వచ్ఛమైన వర్షపు చినుకులు-
నాకు మాత్రం
సమస్తాన్నీ బురదతో నింపే
పనికిరాని నీటి బిందువుల్లానే తోచేవి.
కానీ-
ఇప్పుడు అనుకోకుండా
ఈ వర్షంలో చిక్కుకుపోయినప్పుడు కదా,తెలిసింది…
షవర్లో ఎంత తడిస్తే మాత్రం
ఈ ఆనందం దొరుకుతుందా?
ఉప్పొంగే సముద్రాన్ని కలిసిన తర్వాత
స్విమ్మింగ్ పూల్ ఎంత ఇరుకనిపిస్తుందీ?
ఇదీ అంతేనేమో!!
తన ఆత్మీయతను నాపై గుమ్మరించి
తడిపి ముద్ద చేసి
నేను మెచ్చిన ఆనందాన్ని
మళ్ళీ మోసుకొస్తానని
సెలవు తీసుకుంటుంటే-
బాధగా చెప్పా!
ఈదురుగాలి కోసం
ఉరుములూ మెరుపుల కోసం…
మరీ ముఖ్యంగా, నీ కోసం
ఎదురు చూస్తూనే ఉంటా.
త్వరగా రా మళ్ళీ
నిన్నిలా కలిశాక
ఎదురు చూడడం నా వంతైంది అని.