పవిత్ర

రోజురోజుకీ పగలు తరుగుతూ రాత్రి పెరుగుతూ వస్తున్న శీతాకాలం. తెల్లారాక కూడా పలచగా మంచు కురుస్తూనే ఉంది. టొరాంటోలో ప్రసిద్ధుడైన మానసిక వైద్యుడిని వెతుక్కుంటూ వచ్చారు ఆ భార్యాభర్తలు. వాళ్ళక్కడికి రావడం అదే మొదటిసారి. రిసెప్షన్‌లో వున్న అమ్మాయికి వాళ్ళను చూడగానే ఏదో తేడాగా అనిపించింది. అయితే, అదేంటన్నది ఆమె పసిగట్టలేకపోయింది. సైకియాట్రిస్టును కలవడానికి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు; వాళ్ళను కూర్చోమనడం, డాక్టర్ గది నుంచి బెల్ మోగగానే పేషెంట్లను ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపడం చేస్తూ ఉంటుందీమె. ఇప్పుడొచ్చిన వీళ్ళకేదో విచిత్రమైన సమస్య అని ఊహించుకుంది. వీళ్ళ వంతు రాగానే తలుపును కొంచంగా తీసి వీళ్ళను లోపలికి పంపించింది.

డాక్టర్ వీళ్ళు లోపలికి నడిచి రావడాన్ని శ్రద్ధగా గమనించాడు. అతని వృత్తిలో పేషంట్ల నడకనీ బాడీ లాంగ్వేజ్‌నీ గమనించడం అతి కీలకమైన విషయం. కొన్ని సార్లు వచ్చినవాళ్ళ సమస్య ఏంటన్నది కూడా అందులోనే అర్థం అయిపోతుంటుంది. భర్తకి నలబైయేళ్ళుంటాయి. భార్య నాలుగేళ్ళు చిన్నదైయుండచ్చు అనిపించింది. వాళ్ళు వేసుకున్న ఓవర్‌కోట్ తియ్యలేదు. వాటిమీద మంచు ఇంకా పూర్తిగా కరిగిపోలేదు. ఆమె ఓవర్‌కోట్‌కి బటన్లు పెట్టుకోకుండా ఒకవైపుపైన ఇంకోవైపు కప్పుకుని వాటిపై చేతులు కట్టుకుని మొహమాటంగా నడిచి వచ్చింది. ఓవర్‌కోట్ కింద ఏం వేసుకుందో కూడా తెలియలేదు. బహుశా నైట్ డ్రెస్ కూడా అయుండచ్చు, అనుకున్నాడు డాక్టర్. డాక్టర్ టేబుల్ ముందర మూడు ఖాళీ కుర్చీలున్నాయి. వాళ్ళు దాంట్లో ఎలా కూర్చుంటారన్నది కూడా చాలా ముఖ్యమైన పాయింటే. డాక్టర్ శ్రద్ధగా చూస్తున్నాడు. భార్య కుడి పక్కనున్న కుర్చీలో కూర్చుంది. భర్త కొన్ని క్షణాలాగి, భార్యను దాటుకుని వచ్చి మధ్యలోనున్న కుర్చీలో కూర్చున్నాడు. డాక్టర్ భర్తనీ, భార్యనీ ఒకరిని మార్చి ఒకరిని చూశాడు. భార్య ఏదో పెద్ద ఆనందం కలిగిందన్నట్టూ పళ్ళు కనిపించకుండా లోలోపల ముసిముసిగా నవ్వుతూ ఉంది.

“చెప్పండి, ఏంటి సమస్య?” అన్నాడు డాక్టర్.

“పవిత్రకే సమస్య!” అన్నాడు భర్త.

“అవునా, ఏం సమస్య?

భర్త మొహమాటంగా నీళ్ళు నములుతున్నట్టు “ఎలా చెప్పాలో తెలీడంలేదు…” అన్నాడు.

“డాక్టర్ దగ్గరకొచ్చాక మొహమాటపడనక్కర్లేదు. ఎలాంటి మానసిక సమస్య అయినా మనసు విప్పి మాట్లాడితే సగం నయం అయిపోతుంది. అన్ని రకాల రుగ్మతలకీ పరిష్కారాలున్నాయి. అయితే ముందుగా మీరు ఇక్కడికొచ్చిన కారణం చెప్తేనే అది కుదురుతుంది.”

భర్త అసౌకర్యంగా కదిలాడు. భార్యవేపు చూడకుండా ఖాళీ కుర్చీలో చూపు నిలిపి, ముఖం తిప్పకుండానే “మొహమాటంగా ఉంది డాక్టర్!” అన్నాడు.

“ఇలా అయితే నేను ట్రీట్‌మెంటెలా ఇచ్చేది? ఏం సమస్యో మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది! మొహమాటాలు పక్కనపెట్టేసి మాట్లాడొచ్చు.”

“పవిత్ర పరుపు మీద పాస్ పోసేస్తుంది డాక్టర్!”

“ఇంతేనా? దీనికా ఇంత మొహమాటపడ్డారు! ఇదసలు పెద్ద సమస్యే కాదు. చాలా సాదారణమైన వ్యాధి. ఈ సమస్యున్న ఎంతోమందికి నేను ట్రీట్‌మెంట్ ఇచ్చి బాగుచేశాను. అయితే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలంతే!”

“మీరు అనుకుంటున్నంత సులువు కాదు డాక్టర్! ఇలాంటి సమస్యలకు టొరాంటోలో మీరే ప్రసిద్ధులని మన దేశస్తులందరూ అనుకుంటుంటే మిమ్ముల్ని వెతుక్కుంటూ వచ్చాము. ఇదివరకు ఇక్కడి డాక్టర్లిద్దర్ని చూశాము.”

“ఎప్పుడు?”

“ఈరోజే!”

“ఇద్దర్నీనా!”

“ఇద్దర్నీ ఒకరి తర్వాత ఒకర్ని కలిసేసి ఇప్పుడే మీదగ్గరకొచ్చాము.”

డాక్టర్ కొంచం కంగారుపడి ఎవరో తలుపు తట్టినట్టుగా నటిస్తూ రివాల్వింగ్ చేర్‌ని కొంచం వెనక్కి జరుపుకుని వంగి భార్యని చూశాడు. ఆమె ఏమీ జరగనట్టు ముసిముసిగా నవ్వునాపుకుంటూ డాక్టర్నే చూస్తూ ఉంది.

“వాళ్ళేం చెప్పారు?”

“ఈ జబ్బుని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారనీ, దీనికి హార్మోన్ చికిత్సలవీ ఉన్నాయనీ అన్నారు. పేషంట్‌కి ఈ జబ్బువల్ల ఎలాంటి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌గానీ విరక్తిగానీ ఒత్తిడిగానీ కలగకుండా చూసుకోవాలన్నారు.”

“సరే, అయితే నాదగ్గరకెందుకొచ్చారు మరి?”

“దీన్నెలాగైనా బాగుచెయ్యండి డాక్టర్! జీవితం నరకంలా మారిపోతూ ఉంది.” అన్నాడు భర్త.

“ఎన్నాళ్ళుగా ఉంది ఈ సమస్య?”

“మూడు నెలలుగా.”

“ఒక మార్గముంది. చాలా సులువైన పద్ధతే. రాత్రి ఎనిమిది తర్వాత నీళ్ళు తాగకుండా చూసుకోవాలి.”

“ఎందుకు?”

“మీరేగా అన్నారు, రాత్రుల్లో పక్క తడుపుతున్నట్టు?

“నేను రాత్రుల్లో అని ఎప్పుడన్నాను? పరుపుపైన పాస్ పోస్తుంది అని కదా అన్నాను?”

“అయితే పగలు నిద్రపోతారా ఆమె?”

“నిద్రపోతున్నప్పుడని ఎవరన్నారు డాక్టర్?

“మీరేమంటున్నారో నాకు అసలర్థం కావట్లేదు!” డాక్టర్ కొంచం తికమకపడ్డాడు.

“పట్టపగలు అందరి సమక్షంలో పవిత్ర బెడ్ మధ్యలో కూర్చుని పాస్ పోస్తుంది!”

డాక్టర్ ఇప్పుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇలాంటొక కేస్ ఆయనకి కొత్త. భార్యను చూశాడు. గోడకు వేలాడదీసిన ఫోటోలాగ అదే ముసిముసినవ్వు మొహంతో ఎటువంటి బెరుకూ బిడియమూ లేకుండా డాక్టర్నే చూస్తూ ఉంది. ఆ తర్వాత ఏం అడగాలో కొన్ని క్షణాలు తోచలేదు డాక్టర్‌కి.

“ఈ మూడు నెలల్లో మీ భార్యకి ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్లు నయం చెయ్యలేకపోయారా?”

“భార్యా! భార్య అని ఎవరన్నారు? సమస్య పవిత్రకి కదా?”

“పవిత్రంటే ఎవరు?”

“మా అమ్మాయి డాక్టర్!”

“మరి ఆమెక్కడ?”

“ఇదిగో!” అంటూ ఖాళీ కుర్చీని చూపించాడు.

(మూలం: “పవిత్ర“. 2010-11-22)


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.