పదేళ్ళ “ఈమాట” మాట

[శ్రీ కే. వీ. ఎస్. రామారావు గారు ఈమాట వ్యవస్థాపకులలో ఒకరు. 2004 వరకూ ముఖ్య సంపాదకులుగా ఈమాటని నడిపించారు. ఈమాటకి పదేళ్ళు నిండిన సందర్భంలో వారు పంపిన మాటలివి.]

1998 వేసవిలో ఆస్టిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ప్రాంగణాన్నానుకుని వున్న ఓ పాత చర్చి పార్కింగ్ ఏరియాలో తళుక్కుమన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచనకి ఇప్పుడు పదేళ్ళు నిండాయి. ఆ ఆలోచనకి అందమైన రూపాన్నివ్వటంలో నాటి నా సహశిల్పులు (అకారాది క్రమంలో) కొంపెల్ల భాస్కర్, కొలిచాల సురేశ్, విష్ణుభొట్ల లక్ష్మన్న; కొంతకాలం ఇండియా సంపాదకుడిగా వ్యవహరించిన ద్వా.నా. శాస్త్రి గారు – అందరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు. సాంకేతికంగా ఎంతో సహాయం అందించిన చోడవరపు ప్రసాద్, తొలినాళ్ళలో ఈ పత్రికని “హోస్ట్” చేసిన జువ్వాడి రమణ, కొన్నాళ్ళపాటు “పాఠకుల అభిప్రాయాలు” శీర్షికను “హోస్ట్” చేసిన నందుల మురళి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.

1998 లో “ఈమాట” జననం వెనక వున్నవి భవిష్యత్తు గురించి మాకు కలిగిన ఈ ఊహలు, నమ్మకాలు:

  1. కాగితపు పత్రికలకు కాలం అనుకూలం కాదు. వాటికి భవిష్యత్తు లేదు.
  2. తెలుగు పాఠకుల సంఖ్య కిందికే కాని పైకి వెళ్ళబోవటం లేదు. ఉన్న కొద్దిమందీ భౌగోళికంగా విస్తరించి వుంటారు. ఒకచోటనే వుండరు. వీరిలో ఎక్కువభాగం ఇంటర్నెట్ మీద, ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు చదువుకుంటారు.
  3. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు పాఠకులందరికీ ఎప్పుడూ అందుబాటులో వుండే విధానం మాత్రమే నాలుక్కాలాల పాటు నిలవగలుగుతుంది.
  4. రచయితలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నారు. వారి అనుభవాలు, అనుభూతులు ఆవిష్కరించే రచనల్ని ఆంధ్రదేశంలోని పత్రికలు ప్రచురించవు, ప్రచురించలేవు.
  5. ఇప్పుడు రాస్తున్న విదేశాంధ్రులు వాళ్ళ నిజమైన భావాల్ని వ్యక్తపరచలేకపోతున్నారు. మాతృదేశంలోని పాఠకుల అభిప్రాయాలకు అనుకూలంగా వుండేవో, కాకుంటే సార్వత్రికత లేని కృత్రిమమైన విషయాల గురించో మాత్రమే రాయగలుగుతున్నారు. అనవసరమైన హద్దులు లేని కొత్త వేదిక దొరికితే వారు మనసులు విప్పి చెప్పగలుగుతారు.
  6. పత్రికలు కేవలం చదువుకునేవిగానే వుండవు. దృశ్య, శ్రవ్య విభాగాలను కూడ కలిగివుంటాయి.

ఈ పదేళ్ళ కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు. మరికొన్ని నిజం కాలేదు. ఐతే మొత్తం మీద అప్పటి ఆ ప్రయోగం ఆశించిన కన్నా విజయవంతమైందనే చెప్పుకోవాలి.

అన్నింటిలోను ఐదో విషయం మాత్రం ఎంతో నిరాశను కలిగిస్తోంది. రచయితలు, వారి రచనలపైన అప్పుడు మేము పెంచుకున్న నమ్మకం చాలాకొంచెమే నిజమయ్యింది. అవధులు, ఆంక్షలు లేని వేదికను అందిస్తే వారి ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, ఆశానిరాశలను కొత్తగా, లోతుగా, సహజంగా, నిర్భయంగా చెప్తారన్న ఆశ ఆశగానే మిగిలివుంది. ముఖ్యంగా కథలు. ఆలోచనల్లో లోతు, శిల్పంలో పనితనం, వస్తువులో విస్తృతి అంతగా కనిపించటం లేదు. ఇంతెందుకు, కథల్లో ముందుగా వుండాల్సిన చదివించే గుణం కూడ అరుదైంది. రచయితల సంఖ్య సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్టుంది. కవితల్లోనూ విషయవిస్తృతి కనిపించదు. భాషాపాటవం, శిల్పసౌందర్యం, భావసాంద్రతల మాట సరేసరి. ఇక దృశ్య, శ్రవ్య విభాగాలు. వీటిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించటం లేదు. భవిష్యత్తు బాగుంటుందని ఆశ.

ఐతే వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది. ఒకప్పటి “భారతి” పత్రిక ఇలా పునర్జన్మ ఎత్తిందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యం వేసేటంత. వస్తువైశాల్యంతో పాటు ఆలోచనాత్మకత, తర్కనిబద్ధత ఈ విభాగంలో తరచుగా కనిపిస్తున్నాయి. ఇది అభిలషణీయం, ఆనందకరం. మిగిలిన భాగాలు కూడ ఇదే స్థాయికి త్వరలో చేరుతాయని నా ఆకాంక్ష.

సాంకేతికంగా “ఈమాట” మిగిలిన తెలుగు వెబ్ పత్రికలన్నిటికి ఆదర్శంగా నిలిచిందని నా విశ్వాసం. “ఎంబెడెడ్ ఫాంట్స్” ని ప్రవేశపెట్టినా, యూనికోడ్ వాడకాన్ని అనుసరించినా, “వెబ్ 2.0” పద్ధతుల్ని అన్ని రచనలకు అనువర్తింపజేసినా తొలిబాట వేసిన ఘనత “ఈమాట”దే కావటం విశేషం. వీటికి కారకులైన కొలిచాల సురేశ్, ఇంద్రగంటి పద్మ, చోడవరపు ప్రసాద్ అభినందనీయులు. గత నాలుగేళ్ళుగా వేలూరి వేంకటేశ్వరరావు గారి నేతృత్వంలో, కొలిచాల సురేశ్, ఇంద్రగంటి పద్మ, నాసీ, పాణిని, మాచవరం మాధవ్ పత్రికను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. వీరందరి కృషికి, దీక్షకు నా అభినందనలు.

రాయమని వెంటబడి ఎంత విసుగెత్తించినా భరిస్తూ సాదరంగా తమ రచనల్ని అందించిన రచయిత్రులు, రచయితలకు కృతజ్ఞతలు. వారందరూ  “ఈమాట” కి చిరజీవితం సమకూర్చారు.

పాఠకుల ప్రోత్సాహం లేకుంటే ఈ పదేళ్ళ ప్రయాణం సాధ్యమయేదే కాదు. వారందరికీ పదేపదే కృతజ్ఞతాంజలులు. వారి అఖండ ఆదరణే “ఈమాట” భవితకు పూలబాట.