సెప్టెంబర్ 2000

“ఈ మాట” పాఠకులకు స్వాగతం!

మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. మేం చూస్తున్న గణాంకాల ప్రకారం “ఈ మాట” ఒకో సంచికని దాదాపుగా వెయ్యి మంది పాఠకులు చదువుతున్నారు. ఇది మేం ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువ. ఈ ఆదరణకి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగటానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తామని అందరికీ మనవి చేస్తున్నాం.
 

వచ్చే నెలతో “ఈమాట” కు రెండేళ్ళ వయసు రాబోతోంది. కనుక నవంబర్‌ సంచికను మరిచిపోలేని సంచిగ్గా తయారుచెయ్యాలని ప్రయత్నిస్తున్నాం. ఐతే ఇది కేవలం సంపాదకుల వల్ల సాధ్యమయే పని కాదు. రచయితలూ, రచయిత్రులూ తమ సొంతబాధ్యతగా తీసుకుని ఈ పనిలో మాకు చేయూత నివ్వాలి. రాయగలిగిన వారందరికీ ఇదే మా ఆహ్వానం! మీ రచనల్ని వీలైనంత త్వరగా పంపించండి. అక్టోబర్‌ 15 లోగా పంపిన రచనలన్నీ ప్రచురణకి పరిశీలించబడతాయి.

ఈ సంచికలో హాస్య, వ్యంగ్య రచయితగా ఎంతో కాలంగా మనల్ని అలరిస్తున్న శ్రీ కవన శర్మ గారి రచన ఒకటి అందిస్తున్నాం. వేరే పని మీద అమెరికాకి వచ్చి మేం అడగ్గానే ఆనందంగా దీన్ని ఇచ్చిన శ్రీ శర్మ గారికి మా కృతజ్ఞతలు. శ్రీ శర్మ గారి అమెరికా ప్రయాణం గురించి తెలియజేసి వారితో పరిచయానికి కారకులైన శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారికి మా అభివాదాలు.

అలాగే, కర్ణాటక సంగీతంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో మేం జరిపిన సంభాషణని ఈ సంచికలో ఇస్తున్నాం. వారితో పరిచయం కలిగించిన శ్రీ కొడుకుల శివరాం గారికి మా కృతజ్ఞతలు. మాకు తెలియని ఎన్నోవిషయాలు వివరించారు వారు. “ఈమాట” పాఠకులకు కూడ అవి ఆసక్తికరంగా ఉంటాయని మా విశ్వాసం.

ఇక అమెరికా సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞా శాలులుగా మనందరికీ పరిచయమైన శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు, శ్రీమతి మాచిరాజు సావిత్రి గార్ల కథలు , ఇంకా ఎన్నో ఇతర రచనలు అందిస్తున్నాం. అందరూ ఆదరిస్తారనీ, ఆనందిస్తారనీ ఆశిస్తున్నాం.