“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
“పాఠకుల అభిప్రాయాలు” శీర్షిక ఇప్పుడు మళ్ళీ పనిచేస్తున్నది. దీన్ని ఉపయోగించుకుని ఎప్పటిలానే మీమీ అభిప్రాయాల్ని, సలహాల్ని అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాం.
ఈ మధ్య అనుకోకుండా ఒక రసవత్తరమైన చర్చ మొదలైంది. దీని ముఖ్యాంశం “తెలుగు సాహిత్యరంగంలో అమెరికా ఆంధ్రులకీ ఇండియా ఆంధ్రులకీ ఉన్న, ఉండవలసిన, సంబంధం ఎలాటిది?” అనేది. ఐతే యధాప్రకారం గానే వ్యక్తిగత ఆరోపణలూ నిందల మధ్య అసలు విషయానికి అంత ప్రాధాన్యత దొరుకుతున్నట్టు కనిపించదు. కాని ఇది చాలా ఆలోచించదగ్గ ప్రశ్న. దీనికి సమాధానం దొరికినా దొరకకపోయినా కనీసం అభిప్రాయాల్ని ఒకరితో ఒకరు పంచుకోవటం ఎంతో అవసరం. ఈ అంశం గురించి ఆలోచన ఎక్కువపాళ్ళలోనూ ఆవేశం తక్కువపాళ్ళలోనూ ఉండే రచనల్ని “ఈమాట” ఆహ్వానిస్తోంది.
క్రితం సంచికలో తెలిపినట్లు గత మూడేళ్ళుగా “ఈమాట”లో వచ్చిన రచనల్నుంచి ఎంచిన కొన్నింటిని పుస్తకరూపంలో తీసుకువస్తున్నాం. దీన్ని “ఆటా” సమావేశాల సందర్భంగా జులై తొలిరోజుల్లో విడుదల చెయ్యబోతున్నాం. “ఈమాట” జులై సంచికలో ఈ సంకలనం గురించిన అన్ని వివరాలు ఇస్తాం, దీనికి వెల్చేరు నారాయణరావు గారు రాసిన లోతైన విశ్లేషణ తో సహా.
మొన్నమొన్నటి వరకు ఉత్సాహంగా రాసిన రచయిత(త్రు)లు కొంతమంది కొన్నాళ్ళుగా మౌనం వహిస్తున్నారు. వీరు మళ్ళీ కలాలు పట్టవలసిన అవసరం ఉంది. అలాగే కొత్త రచయితలు, రచయిత్రులు ముందుకు రావాలి. అలాటి వారు మీకు తెలిసి ఎవరైనా ఉంటే వారికి “ఈమాట” గురించి తెలియజెయ్యండి. స్వేఛ్ఛగా, ఎలాటి ఒత్తిడులు లేకుండా, మనసున ఉన్న భావాల్ని గురించి రాయటానికి వెనకాడకండి. అంతగా అనుమానంగా ఉంటే కలం పేరుతో రాయండి. సహేతుకంగా, నిష్పక్షపాతంగా రాసిన రచనల్ని ప్రచురించటానికి “ఈమాట” సిద్ధంగా ఉందని మరిచిపోకండి.