మనకు తెలియని మన త్యాగరాజు – 2

త్యాగరాజుకి సంగీతంపై ఉన్న శ్రద్ధా, ప్రజ్ఞా ఆయన చిన్నవయసులోనే తండ్రి రామబ్రహ్మం గ్రహించాడు. సంగీత విద్వాంసుల కుటుంబం కావడంవల్ల అతి పిన్న వయసులో త్యాగరాజు చూపించిన ప్రతిభ సులభంగానే తెలిసింది. పదిహేనేళ్ళ వయసులో త్యాగరాజు మొట్టమొదట రాసిన “నమో నమో రాఘవాయ” కృతిని ఇంటి గోడలపై సున్నపు కణికలతో రాస్తే, అది చూసి రామ బ్రహ్మం స్నేహితులు అతన్ని తంజావూరులో ఉన్న ప్రసిద్ధ సంగీత విద్వాంసుల వద్దకు పంపమని చెప్పారు. రామబ్రహ్మం తంజావూరు ఆస్థానంలో రామాయణ వ్యాఖ్యానం చేసేవాడు. త్యాగరాజు కూడా చిన్నతనంలో తండ్రితో వెళ్ళేవాడు. తంజావూరు రాజ్యాధిపతి తుల్జాజీ ఆస్థానంలో శొంఠి వేంకటరమణయ్య అనే సంగీత విద్వాసుడుండేవాడు.

రామబ్రహ్మం త్యాగరాజుని శొంఠి వేంకటరమణయ్య దగ్గర శిష్యుడిగా చేర్పించాడు. త్యాగరాజు కొంతకాలం గురువు వద్దుండి, తంజావూరులోనే సంగీత విద్య నభ్యసించాడు. ఇది 1782లో, పదిహేనేళ్ళ వయసులో ఉండగా జరిగింది. అప్పటికింకా త్యాగరాజుకి వివాహం కాలేదు. గురువు వద్ద సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. అతి తక్కువ కాలంలోనే అందులో ప్రావీణ్యం సంపాదించాడు. శొంఠి వేంకటరమణయ్య త్యాగరాజు ప్రతిభని మెచ్చుకొని తన వద్దనున్న “తాన” పుస్తకం బహుకరించాడు. ఇందులో వివిధ రకాల తాళాల గురించీ, వాటి ఉప జాతుల గురించీ వివరంగా వుంది. దీన్ని వాలాజపేట శిష్యులు భద్రపరిచారు. అది ఇప్పటికీ మదురై సంగీత సౌరాష్ట్ర సభలో ఉంది. ఇది వారి చేతికెలా వచ్చిందో తెలీదు.

తిరువయ్యూర్ తంజావూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువయ్యూర్ చేరాలంటే పడవల్లో కావేరీ నది దాటి వెళ్ళాల్సిందే! త్యాగరాజు గురువు వద్ద ఎక్కువకాలం సంగీతం నేర్చుకున్నట్లాధారాలు లేవు. మాతామహుల మరణమూ, ఆ తరువాత కొంతకాలానికి త్యాగరాజు వివాహమూ ఒక దాని తరువాత ఒకటి జరగడంతో త్యాగరాజు వేంకట రమణయ్య వద్దకు తిరిగి వెళ్ళలేదు. కానీ గురువు గారంటే అమితమైన భక్తీ, గౌరవమూ ఉన్నాయి. త్యాగరాజుకు వివాహం అయిన తరువాత తండ్రి రామబ్రహ్మానికి సుస్తీ చేసింది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని వదిలి వెళ్ళ లేకపోయాడు. తాతగారి ఇంట్లో దొరికిన తాళ పత్ర గ్రంధాల్లో ఉన్న సంగీత రత్నాకరంలో విషయాలు కొన్ని బోధపడలేదు. గురువు గార్ని కలుద్దామని ఎంత ప్రయత్నించినా కుటుంబ బాధ్యతల వల్ల కుదర్లేదు. ఈ లోగా రామ బ్రహ్మం మరణించాడు.

రామబ్రహ్మం అనారోగ్యం వల్ల మంచం పట్టినప్పుడు, అతని భార్య సీతమ్మ తనూ భర్తతో సహగమనం చేస్తానని చెప్పినట్లుగా ప్రొఫెసర్ సాంబమూర్తి “ది గ్రేట్ కంపోజర్స్” పుస్తకంలో రాసారు. సహగమనం వద్దనీ, త్యాగరాజుని దగ్గరుండి చూసుకోమనీ, అతని సంగీత వైభవాన్ని కళ్ళారా చూడమనీ రామబ్రహ్మం ఆమెను వారింఛాడు. ఆయన కోరికను మన్నించి సీతమ్మ తన నిర్ణయం మార్చుకుందనీ రాసారు. దీని ఆధారాలు తెలీవు. ఈ కథనం మాత్రం సాంబమూర్తి గారి రచనలోనే కనిపించింది. దక్షిణాది బ్రాహ్మణ కుటుంబాల్లో సహగమనం ఆచారం అంతగా కనబడదు. మిగతా ఎవరూ దీని ప్రస్తావనే తీసుకు రాలేదు.

రామబ్రహ్మం 1787 లో చనిపోయాడు. అప్పటికి త్యాగరాజుకి సరిగ్గా ఇరవై ఏళ్ళు. ఈ విషయం వెంకటరమణ భాగవతార్ రాసిన చరిత్రలో ఉంది ( పేజీ 60 – Tyagaraja and the Renewal of Tradition, William. J. Jackson). ఇది జరిగిన కొంత కాలానికి, ఉపనయన సమయంలో నారదోపాసక మంత్రోపదేశం చేసిన రామకృష్ణానంద స్వామి ఆశీర్వాద ప్రభావం వల్ల, త్యాగరాజుకి స్వరార్ణవంలో అంశాలు అతి సులభంగా బోధపడ్డాయన్నట్లుగా ప్రొఫెసర్ సాంబమూర్తి రాసారు. సాక్షాత్తూ నారదుడే వచ్చి “నారదీయం” అనే గ్రంధాన్ని బహుకరించాడన్న ఇంకో కథ ఉంది. నారదుడే రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చారని హరికథ భాగవతులు అనుకొనుండచ్చు. త్యాగరాజు చూపించిన సంగీత ప్రతిభా, సృజనా మానవ మాత్రులకి సాధ్య పడదనుకొని, కేవలం దైవకృప వల్లే ఇది సంక్రమించిందని భావించే అవకాశముంది.


గురువు శొంఠి వేంకటరమణయ్య, త్యాగరాజు

త్యాగరాజు సంగీత ప్రాభవం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ఆనోటా, ఈనోటా త్యాగరాజు కృతులు ప్రచారం కావడంతో ఈ విషయం గురువుగారైన శొంఠి వేంకటరమణయ్య వరకూ ప్రాకింది. ప్రతీ ఏడూ ఉగాది పర్వదినాన తంజావూరు దర్బారు హాలులో సంగీత కచేరీలు జరిగేవి. వీలుని బట్టి రాజులు కూడా విచ్చేసేవారు. కేవలం ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులకే అందులో పాడే అవకాశం లభించేది. ఒక ఉగాది సంగీత కచేరీకి గురువుగారి నుండి త్యాగరాజుకి ఆహ్వానమొచ్చింది. త్యాగరాజుకి గురువంటే ఉన్న భక్తి వలన కచేరీ చెయ్యడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో రాగ విస్తారణకీ, ఆలాపనకీ ఎంతో ప్రాముఖ్యతిచ్చేవారు. ఆ సభలో త్యాగరాజు చూపించిన సంగీత విన్యాసం చూసి ఆశ్చర్యపోయారందరూ. ఈ సంగీత సభలో రాగాలాపన, నెరవులు లాంటి మనోధర్మ ప్రక్రియలను ప్రకటిస్తూ, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవ” (బిలహరి రాగం) కృతుల్నీ పాడాడు. త్యాగరాజు ప్రతిభ చూసి అమితానందభరితుడైన శొంఠి వేంకటరమణయ్య, పండితులందరి ముందూ అతన్ని సత్కరించినట్టు వెంకట రమణ భాగవతార్ రాసిన చరిత్రలో ఉంది.

శొంఠి వేంకటరమణయ్య వద్ద త్యాగరాజు సంగీత విద్యని ప్రదర్శించిన సంఘటన 1792లో త్యాగరాజు 25వ ఏట జరిగింది. దీనికాధారం కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్ర. “గురువు శొంఠి వేంకట రమణయ్య గారి పైనున్న భక్తీ, గౌరవంతో త్యాగరాజు తన 25వ ఏట స్వీయ కృతులని విద్వాంసులందరి ముందూ పాడాడు. తమ రాజవిధుల్ని విస్మరించి మరీ ఆ సంగీతంలో లీనమైపోయారందరూ. పండితులందరి ముందూ గురువుగారు త్యాగరాజుని సత్కరించాడు. తనకి రాజు బహూకరించిన కంఠాభరణాన్నీ, రాజ పతకాన్నీ ఇచ్చి గౌరవించాడు. “త్యాగరాజు సంగీత జ్ఞానం ఒక వనమైతే అందులో తన సంగీతం ఒక చిన్న మొలకనీ అభివర్ణించాడు…” అంటూ (Tyagaraja and Renewal of Tradition, William J. Jackson) రాసారు. ఈ సంఘటన గురించి వెంకటరమణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవా ” వంటి కీర్తనలు పాడారని చెబుతూ విపులంగా ఉంది. ఇంత విపులంగా కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో లేదు.

ఈ సందర్భంగా గురువుగారు తనకు బహుకరించిన బహుమానాల్ని త్యాగరాజు గురువుగారికే తిరిగి ఇచ్చేశాడు. గురువుగారి కూతురి పెళ్ళి సందర్భంలో త్యాగరాజు ఆభరణాలు తిరిగిచ్చేసాడని వెంకటరమణ భాగవతార్ రాస్తే, తన పెళ్ళికే విచ్చేసిన గురువుకి కానుకగా ఇచ్చాడంటూ కృష్ణభాగవతార్ రాసాడు. గురువు వద్ద మొదటి కచేరీ చేసిన సంఘటన, 1792 లో త్యాగరాజుకి ఇరవై అయిదు సంవత్సరాలప్పుడు జరిగింది. కానీ త్యాగరాజు మొదటి వివాహం పద్దెనిమిదో ఏటే జరిగింది. కాబట్టి ఇక్కడ 25 వ ఏట జరిగిన వివాహం బహుశా త్యాగరాజుకి కమలాంబతో జరిగిన రెండో వివాహ సందర్భమయి ఉండాలి.

ఈ సభలోనే “ఎందరో మహానుభావులు” అనే ఘన రాగ పంచరత్న కృతి పాడినట్లుగా ఇంకో ప్రచారం ఉంది. ఎవరూ అంతగా ఉపయోగించని జన్య రాగమైన శ్రీ రాగంలో స్వరపరిచాడా కృతిని. ఆ కృతిలో ఎంతో మందిని స్మరించినందువల్లా, ఆ సందర్భానికది కుదిరినందువల్లా ఎందరో మహానుభావులు కృతే పాడుండచ్చనీ చాలా మంది ఊహాగానం చేసారు (త్యాగరాజు సినిమాలో, కొన్ని పుస్తకాల్లో కూడా). కాకపోతే ఇది మాత్రం సరి కాదని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే త్యాగరాజు ఘన రాగ పంచరత్న కీర్తనలు నలభై ఏళ్ళు దాటిన తరువాతే రచించాడు. త్యాగరాజుకి తంజావూరు రామారావు అనే ఓ బాల్య మిత్రుడూ, శిష్యుడూ ఉండేవాడు. ఈయన ప్రోద్బలం తోనే త్యాగరాజు పంచరత్న కీర్తనలు రాసాడని ఉంది. వెంకటరమణ భాగవతార్ తో కలిసి త్యాగరాజు జీవిత చరిత్ర రాయడానికి మొట్ట మొదటసారి సంకల్పించింది ఈ తంజావూరు రామారావే!