దాదాపు అరవై ఏళ్ళనాటి సంగతి. ఢిల్లీ ఆలిండియా రేడియో వారు సంగీత సమ్మేళన్ కచేరీలు ఏర్పాటు చేసారు. ఈ కచేరీలు ప్రజా సమక్షంలో జరిగేవి. వీటిని రికార్డ్ చేసి తరువాత రేడియోలో ప్రసారం చేసేవారు. 1950లో ఆ కచేరీకి ఓ ముఫ్ఫైఏళ్ళ మహిళని పాడమని పిలిచారు. ఆమె వర్ణంతో కచేరీ ప్రారంభించి గణేశ ప్రార్థన, ఆ తరువాత దేవగాంధారి రాగంలో ‘సీతా వర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ పాడడం మొదలు పెట్టారు. ఇంతలో ఒక చిన్న భూకంపం రావడంతో ప్రేక్షకులు భయంతో ఆ హాలు విడిచి బయటకు పారిపోయారు. జనం వెళ్ళిపోవడం చూసి పక్క వాయిద్యకారులు కంగారు పడ్డారు కానీ అలాగే భయపడుతూ వాయించారు. పక్క వాయిద్యకారుల పరిస్థితి కానీ, జనం హాహాకారాలు చేయడం, భయంతో పరుగులు తీయడం ఇవేమీ కళ్ళు మూసుకుని పాడడంలో నిమగ్నమయిపోయిన ఆవిడకి తెలియవు. భూకంపం హడావిడి తగ్గాక ప్రేక్షకులు లోపలికి వచ్చారు. వారికి ఆశ్చర్యం కలిగించేలా ఆమె ఇంకా పాడుతూనే వుంది. పాట పూర్తయ్యాక కళ్ళు తెరిచి చూస్తే ప్రేక్షకులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడం కనిపించింది. ఆ తరువాత పక్క వాయిద్యం వాయిస్తున్న ఓ వ్యక్తి అసలు విషయం చెప్పారు. ఆ కచేరీ చేసిన మహిళ డి.కె.పట్టమ్మాళ్. భూకంపం సంగతి ఆమెతో తరువాత ప్రస్తావించినప్పుడు, “భూకంపం వచ్చి నా ప్రాణం పోవాలని రాసుంటే అదెలాగూ జరుగుతుంది. ప్రాణమ్మీద తీపితో కచేరీ చెయ్యకుండా ఇచ్చిన మాట తప్పిందన్న అప్రతిష్ట నాకు చావు లాంటిదే. నేను సంగీతానికీ కట్టుబడున్నాను. అదే నా ఊపిరి” అన్నారామె. ఈ సంఘటన చెప్పింది ఆమె భర్త ఈశ్వరన్. ఆనాటి కచేరీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ రావలసి ఉన్నా, ఎందుచేతనో రాలేకపోయారు. భూకంపం వచ్చినా కదలకుండా తన్మయత్వంతో ఆమె పాడడం గురించి తెలుసుకొని ఆ మర్నాడు ఆయనింట్లో మరో కచేరీ ఏర్పాటు చేయించుకున్నారు. ఆమె అసలు పేరు అలిమేలు. కానీ పదిమందికీ ఇంట్లో అందరూ పిలిచే ముద్దుపేరు పట్టమ్మ గానే తెలుసు. ఆచారాలకి వ్యతిరేకంగా, సాంప్రదాయలకీ భిన్నంగా పురుషులతో సమంగా కచేరీ చేసిన మొట్టమొదటి మహిళ ఆమె.
పిట్ట కొంచెం పాట ఘనం
పట్టమ్మాళ్ కాంచీపురంలో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1919లో జన్మించింది. తండ్రి కృష్ణస్వామి దీక్షితార్ సంగీత ప్రియుడు. తల్లి కాంతామణి కూడా సంగీత విద్వాంసురాలే అయినా పదిమంది ముందూ ఎప్పుడూ పాడలేదు. చిన్నప్పటి నుండీ పట్టమ్మాళ్ మంచి గొంతుతో పాడేది. తండ్రి వద్ద రామ కర్ణామృతం, కృష్ణ శతకం వంటివి నేర్చుకుంది. శాస్త్రీయ సంగీత పాఠాలంటూ ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోలేదు. పట్టమ్మాళ్ ఎనిమిదేళ్ళ వయసులో ఉండగా తండ్రితో కలిసి కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య నిర్వహించే నవరాత్రి ఉత్సవాలకి యశనూరు వెళ్ళింది. అప్పుడు ఆయన సమక్షంలో పాట పాడే అవకాశం పట్టమ్మాళ్‌కి వచ్చింది. ఆమె పాట విన్నాక నవరాత్రి తొమ్మిది రోజులూ పాడమని పరమాచార్య ఆమె తల్లి తండ్రులతో చెప్పడంతో ఒక్కరోజుకని వెళ్ళిన వారు ఆ ఉత్సవాలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉండిపోయారు. అక్కడ పరమాచార్య ఆశీస్సులు పొంది కాంచీపురం వచ్చాక మరో చిన్న సంఘటన ఆమె సంగీతాన్ని ఓ మలుపు తిప్పింది.
సుమారు 1920 ప్రాంతాల్లో సి. సుబ్ర్హమణ్య పిళ్ళై (ఈయన్నే నైనా పిళ్ళై అని కూడా పిలిచేవారు) అనే ఆయన ఏటా కాంచీపురంలో త్యాగరాజ సంగీత ఆరాధనోత్సవాలు చేసేవాడు. రాగం-తానం-పల్లవి పాడడంలో నైనా పిళ్ళైకి అప్పట్లో చాలా పేరుండేది. ఆ సందర్భంగా ఆయన నిర్వహించిన సంగీత పోటీల్లో భైరవి రాగంలో రక్ష బట్టరే కృతి పాడిన ఎనిమిదేళ్ళ పట్టమ్మాళ్‌కి మొదటి బహుమతి వచ్చింది. అతి చిన్న వయసులోనే ఎంతో మాధుర్యంగా పాడడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ సందర్భంగానే కందస్వామి అనే ఒక పట్టు చీరల వ్యాపారి ఓ వెండి పతకాన్ని బహుకరించారు. ఇది చూసి పట్టమ్మాళ్‌కి తండ్రి తన స్నేహితుడైన ఒక తెలుగాయన వద్ద సంగీత శిక్షణ ఇప్పించాడు. ఆ తెలుగు మాస్టారు ద్వారా త్యాగరాజూ, దీక్షితార్, శ్యామ శాస్త్రిల సంగీతమే కాకుండా, తెలుగు భాష కూడా నేర్చుకున్నారు. సాహిత్యం అర్థం తెలిసి పాడితే సంగీతానికి జీవమొస్తుందని ఆయన పట్టమ్మాళ్‌కి తెలుగు భాష కూడా నేర్పించారని ఆమె తరచూ చెప్పేవారు. చిత్రమేంటంటే ఆ తెలుగు మాస్టారి పేరు మాత్రం ఎవరికీ తెలీదు. అందరికీ తెలుగు మాస్టారుగానే పరిచయం (ఆయన పేరు ఈశ్వరన్ గార్నీ, పట్టమ్మాళ్ మనవరాలు గాయత్రి గారినీ అడిగినా తెలియలేదు). ఆ విధంగా తెలుగు మాస్టారి వద్ద చాలా కృతులూ, వర్ణాలూ నేర్చుకునే అవకాశం లభించింది.
పదేళ్ళ వయసులో ఉండగా మొట్టమొదటి సారి గ్రాంఫోన్ రికార్డు కంపెనీ వాళ్ళకి పాడే అవకాశమొచ్చింది. మొదట్లో పట్టమ్మాళ్ తండ్రి ఇష్టపడకపోతే ఆయన స్నేహితులు ఒప్పించారు. అప్పట్లో బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడవాళ్ళు ఇలా గ్రామ్‌ఫోన్ రికార్డులకి పాడే అలవాటు లేదు. సంగీత కచేరీలంటూ స్టేజిలెక్కి పాడడం ఆచారం కాదు. అందువల్ల కృష్ణస్వామి కుటుంబ సభ్యుల్నుండి తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. ముఖ్యంగా కృష్ణస్వామి ఏడుగురక్కలూ ఇలా పట్టమ్మాళ్ ని కచేరీలంటూ స్టేజెక్కిస్తే ఉన్న పరువు పోతుందనీ, పెళ్ళి చేసుకోడానికెవరూ ముందుకు రారని భయపెట్టారు. స్నేహితుల బలవంతం వల్లా, పట్టమ్మాళ్ మొండి పట్టు వల్లా కృష్ణస్వామి కాదనలేకపోయారు. ఈ గ్రామ్‌ఫోన్ రికార్డులో పాడడమన్న విషయం ప్రతీ వార్తా పత్రికా అప్పట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసాయి. ఇది తెలిసి మద్రాసు రేడియో కార్పరేషన్ వాళ్ళు పిలిచారు. ఇది జరిగిన మూడేళ్ళ తరువాత 1932లో మద్రాసు రసిక రంజని సభలో మొట్టమొదటి కచేరీ ఇచ్చింది.
గొంతెత్తిన ఆడ స్వరం
పూర్వం దేవదాసీ స్త్రీలు మాత్రమే సంగీత కచేరీలిచ్చేవారు. త్యాగరాజు కాలంలో తంజావూరు కమలం, ఆ తరువాత బెంగుళూరు నాగరత్నమ్మ అలా పేరొందిన సంగీత విదుషీమణులు. ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండొచ్చి స్టేజెక్కి కర్ణాటక సంగీత కచేరీలిచ్చిన మొట్ట మొదటి మహిళ పట్టమ్మాళ్. ఎం ఎస్ సుబ్బులక్ష్మి పదేళ్ళ వయసులో ఉండగా 1926లో మొదటి రికార్డ్ ఇచ్చినా మొదటి కచేరీ మాత్రం పట్టమ్మాళ్ ఇచ్చిన తరువాతే ఇచ్చారు. అంత వరకూ సంగీత కచేరీల్లో మగవాళ్ళదే పైచేయిగా ఉండేది. ఆడవాళ్ళ సంగీతాన్ని పెళ్ళి సంగీతంగానే అందరూ జమకట్టేవారు. వారందరి అభిప్రాయాలూ తప్పని రుజువు చేస్తూ కర్ణాటక సంగీతంలో ఓ నూతనాధ్యాయాన్ని సృష్టించిన తొలి మహిళ పట్టమ్మాళ్.
సినిమా సంగీతం
పట్టమ్మాళ్ కచేరీకి విచ్చేసిన పాపనాశనం శివన్ ఆమె ప్రతిభ చూసి సంగీతం నేర్పడానికి ముందుకొచ్చారు. ఆయన వద్దే ఎన్నో దీక్షితార్ కృతులూ, సుబ్రహ్మణ్య భారతి పాటలూ నేర్చుకున్నారు. ఈ పాపనశనం శివన్ ద్వారానే ఆమె సినీ నేపధ్య సంగీత ప్రవేశం కూడా జరిగింది. త్యాగ భూమి అనే చిత్రం ద్వారా 1939లో మొట్టమొదటి సారిగా సినిమాలో పాడిన కర్ణాటక సంగీత విద్వాసురాలీమె. కేవలం భక్తి గీతాలకే పరిమితమయ్యి అప్పట్లో శృంగార గీతాలు పాడడానికి సుముఖత చూపించలేదు. సుమారు 1951 వరకూ అనేక చిత్రాల్లో పాటలు పాడారు. ఆమె పాడిన చిట్ట చివరి సినిమా పాట కమలహాసన్ నిర్మించిన హే రామ్ చిత్రంలోది. మహాత్మా గాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో ఆమె పాడిన చివరి సినిమా పాట. తమిళ వెర్షన్లో పట్టమ్మాళ్ పాడిన పాట వుంచారు (బయట రికార్డుల్లో విభా శర్మ పాడిన పాట ఉంటుంది).
కర్ణాభరణం
కర్ణాటక సంగీతానికి పట్టమ్మాళ్ చేసిన కృషి ఎనలేనిది. సాధారణంగా మంద్ర,, అతి మంద్ర, తీవ్ర, అతి తీవ్ర స్థాయిలతో ఆడవాళ్ళు పాడడం చాలా తక్కువగా కనిపిస్తుంది. పట్టమ్మాళ్ గొంతు మంద్రం నుండి అతి తీవ్ర స్థాయి వరకూ చక్కగా సాగుతుంది. స్వర వుచ్ఛారణలోనూ, గమకాలను ప్రస్ఫుటంగా పాడడంలోనూ ఈమె ప్రతిభ కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. ఎన్నో కర్ణాటక సంగీతపు ఆల్బంలు రిలీజు చేసారు. దాదాపు అన్ని భాషల్లోనూ పాటలు పాడారు. ఎంతో శ్రద్ధా భక్తులతో కచేరీ నిర్వహిస్తారని ఈమెకు చాలా పేరుంది. ఈమె పాడిన శ్యామలా దండకం ఎంతో పేరు పొందింది. వాగ్గేయకారులు బాలమురళీ, జి.ఎన్.బి, సాంబమూర్తుల్లా ఈమె వాగ్గేయకారిణి కాదు, కానీ చాలా పాటలని స్వరపరిచారు. అందులో ‘పారుక్కుల్లె నల్ల నాడూ, ‘సాంతి నిలల్వ వెండుం‘, ‘చిన్న చిరు కిలియే, ‘రామ రామ’ వంటివి కొన్ని. ఇవే కాకుండా పెళ్ళి పాటలంటూ కొన్ని పాటలు స్వరపరిచారు. ముఖ్యంగా నలుగు పెట్టుకో రామా అన్న తెలుగు పాట ఎంతో శ్రావ్యంగా ఉంటుంది.
తన ఎనభైఏళ్ళ సంగీత స్రవంతిలో పట్టమ్మాళ్‌కి ఎన్నో అవార్డులూ, బిరుదులూ లభించాయి. గాన సరస్వతి, సంగీత సాగర రత్న పట్టమ్మాళ్‌కి ఉన్న బిరుదులు. ఉత్తరాదినిచ్చే సంగీత నాటక అకాడమీ అవార్డు 1961లోనే వచ్చినా, కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రసిద్ధమైన ‘సంగీత కళానిధి’ అవార్డు 1971లో వచ్చింది. కచేరీలు చేసి పలువురి ప్రశంసలూ, బిరుదులూ పొందినా ఈ సంగీత కళానిధి అవార్డు ముఖ్యంగా ఎం.ఎస్.సుబ్బులక్ష్మికిచ్చిన తరువాతే ఇచ్చారన్న ఆరోపణ ఉంది. “అవార్డులూ, బిరుదులూ మనకెప్పుడు రావాలని రాసుంటే అప్పుడొస్తాయి. అవి మన ఇంటికి రావాలి కానీ, కళాకారులు వాటి వెంట పడకూడదని” ఆమె చాలా ఇంటర్వ్యూలలో అనేవారు. భారత ప్రభుత్వం ఈవిడకి 1971లో పద్మ భూషణ్, 1998లో పద్మ విభూషణ్ అవార్డులిచ్చి సత్కరించారు.
ఎంత ఖ్యాతి లభించినా పట్టమ్మాళ్ అందరికీ అందుబాటులో ఉండేవారనీ, తనెంతో పేరొందిన వ్యక్తన్న గర్వమూ, ఎంతో విద్వత్తున్న వ్యక్తనే అహంకారామూ వీసమంత కూడా లేనిదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతారు. ఎవరైనా సరే పాడమని అడగగానే పాడడానికెప్పుడూ సంకోచించే వారు కారని చెబుతారు. ప్రతీ రోజూ పట్టమ్మాళింటికి కూరలమ్మే ఒకామె కూతురు పెళ్ళని పిలిస్తే, పట్టమ్మాళ్ వెళ్ళడమే కాకుండా అక్కడ తన పాటతో పెళ్ళికొచ్చిన పలువురినీ అలరించారన్న సంఘటన చెబుతూ, ఆమె తన సంగీతం లోనే కాదు, సాటి మనుషులతో ప్రవర్తించే తీరులో కూడా ఎంతో ఔన్నత్యాన్ని పాటించే వారని పట్టమ్మాళ్ మనవరాలు గాయత్రి చెప్పారు.
వసుధైక సంగీతం
కేవలం తనని పాడమని అడగితే పాడడమే కాదు, ఎవరైనా వచ్చి సంగీతం నేర్పమన్నా కూడా పట్టమ్మాళ్ ఎప్పుడూ వెనకాడే వారు కారని అంటారు. సంగీతానికి కుల,మత, జాతి భేదాలుండవన్న సత్యాన్ని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి పట్టమ్మాళ్. అందుకే ఆవిడకి ఎంతో మంది దేశ విదేశాల్లో శిష్యులున్నారు. అకికో అనే జపానమ్మాయి పట్టమ్మాళ్ వద్ద చాలా ఏళ్ళు శిష్యరికం చేసి, కర్ణాటక సంగీత కచేరీలు ఇచ్చింది. అకికోకి మంచి స్వర జ్ఞానముందని పలువురి వద్దా పట్టమ్మాళ్ ప్రశంసించేవారు. పట్టమ్మాళ్‌కి 150 మంది పైగా శిష్యులున్నారు. ఆవిడ పాత శిష్యురాలొకామె వద్ద సంగీతవిద్య ప్రారంభించిన స్యూసెన్ అనే ఒక మలేషియన్ అబ్బాయి 2005లో చెన్నై వచ్చి, పట్టమ్మాళ్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. అతన్ని ‘సాయి మదన మోహన్’ అనే పేరుతో పిలిచేవారు. ఈ మధ్యనే అతను తన దేశంలో సంగీత కచేరీ చేసి ఆ డి.వి.డిని పంపిస్తే ‘మా మనవడి కచేరీ ఎంత బావుందో కదా? వయసు భారం వల్ల వెళ్ళ లేకపోయినా ఈ విధంగా చూసే భాగ్యం కలిగిం’దని పట్టమ్మాళ్ ఎంతో సంతోష పడ్డారని కుటుంబ సభ్యులన్నారు.
అజరామరం
వయసు మీదపడినా ఆమె గాత్రం మారలేదు. ఆవిడ ఆఖరి సంగీత కచేరీ 2005 నారద గాన సభ, చెన్నై లో చేసారు. పట్టమ్మాళ్ మనమరాలు గాయత్రి వాళ్ళమ్మాయి పెళ్ళికి 2008లో పాడిందే ఆవిడ పదిమందిలో పాడిన చివరి పాట. జులై 16వ తేదీన చెన్నైలో పట్టమ్మాళ్ సహజమరణం పొందారు. “జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం, సాంబ మూర్తి, పాపనాశనం శివం వంటి దిగ్గజాలతో సమంగా సంగీతం గురించి లోతుగా మాట్లాడగల వ్యక్తి పట్టమ్మాళ్” అని ప్రముఖ సంగీత విద్వాంసుడూ, వాగ్గేయ కారుడూ బాలమురళీ కృష్ణ పట్టమ్మాళ్ మరణానంతరం ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
కర్ణాటక సంగీత ప్రియులూ, భారతీయులూ గర్వించదగ్గ వ్యక్తి పట్టమ్మాళ్. కర్ణాటక సంగీతంలో మహిళలకీ ప్రత్యేక స్థానం కల్పించిన విలక్షణమయిన వ్యక్తి పట్టమ్మాళ్. భౌతికంగా ఆమె దూరమయినా ఆమె పాట మాత్రం మన చెవుల్నంటి బెట్టుకునే వుంటుంది. నిస్సందేహంగా కర్ణాటక సంగీతానికి కర్ణాభరణం పట్టమ్మాళ్.
(ఈ వ్యాసం రాయడానికి సహకరించిన పట్టమ్మాళ్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా పట్టమ్మాళ్ భర్త శ్రీ ఈశ్వరన్ గారికీ, ఎన్నో వివరాలు ఎంతో ఓపిగ్గా అందించిన పట్టమ్మాళ్ మనుమరాలు గాయత్రి సుందరరామన్ కీ, నిత్యాశ్రీ మహదేవన్ కీ, మిత్రుడు విజయవర్థన్ కీ కృతజ్ఞతలు.)