రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈమాట – నామాట

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
నవంబర్ 2008

ఈమాటకి ఈ నవంబర్‌‌తో పదేళ్ళు నిండుతాయి. తెలుగు దేశంలో ప్రచురించబడే (సాహితీ) పత్రికల వయసుతో పోలిస్తే పదేళ్ళు పెద్ద వయస్సనే చెప్పాలి. కాని పాశ్చాత్యదేశాల్లో సాహితీ పత్రికల తోటి, ముఖ్యంగా అమెరికన్‌ సాహితీ పత్రికల తోటి పోల్చి చూస్తే ఈమాట ఇంకా పసిపిల్లే అని చెప్పవచ్చు. పోనీ పసిపిల్ల అనడం మరీ ఎబ్బెట్టుగా వినిపిస్తే, చిన్నపిల్లే అని మాత్రం ఒప్పుకోక తప్పదు. పదేళ్ళు అంటే, పాల పళ్ళన్నీ ఊడిపోయి కొత్త పళ్ళొచ్చిన వయస్సు అన్నమాట! పాల పళ్ళున్న రోజుల్లో కనిపించినదల్లా కొరికెయ్యాలనిపించేది. కొరికిన తరువాతే రుచి చూడటం! ఇప్పుడు, కాస్త జాగ్రత్తగా చప్పరించి రుచి చూడటం, ఆ తరువాతే కొరకడం అవసరం. అంత మాత్రం చేత అప్పుడప్పుడు ఊరికే తీపుతో కొరకబుద్ధి అవదని కాదు! ఇంకా చిన్నతనమేకదా!

పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి. లేకపోతే పడవలసిన శ్రమ ఇంతా అంతా కాదని అందరికీ తెలుసు. ఈ పత్రిక నిర్వహణలో కూడా ఇంతే! అందుకు తగిన బృందం మాకు ఉన్నదనే అనుకుంటున్నాను.

ఎప్పుడూ ఎక్కడో కొద్దిమందే కుతూహలంతో ఒక క్రొత్తపనికి అంకురార్పణ చేస్తారు. ఆ పని నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరగాలని కోరుకుంటారు. వ్యవస్థాపకుడు రామారావు, అతని సహచరబృందం ఎంతో ముందు చూపుతో ఈమాట పత్రికని స్థాపించారు. వారందరికీ ఈనాటి ఈమాట బృందం మనసారా అభినందనలు తెలుపుకుంటున్నది.

రామారావు చెప్పింది నిజమే! అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగటల్లేదు. ముఖ్యంగా కథల్లోను, కవితల్లోనూ వైవిధ్యం కనిపించటల్లేదు. కొత్తదనం చాలా తక్కువేనని ఒప్పుకోవాలి. వచ్చిన వాటిల్లో మంచివి ఏరుకోగలవే కానీ ఏ పత్రికా లేని గొప్ప రచనను చూపించలేదు, కదా. ప్రవాసజీవితం ప్రతిబింబించే రచనలు అరుదుగానే వస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా క్రొత్త రచయితలని ప్రోత్సహించడం, పాత రచయితలని వెన్నాడటం జరుగుతూనే ఉన్నది. అయినా చెప్పుకోదగ్గ ప్రతిఫలం కనపడటల్లేదు.

నిన్ననే ఎవరో అన్నారు, ‘మీ పత్రికకి రచనలు పంపించడం అంటే భయం,’ అని. ‘ఎందుచేత?’ అని ప్రశ్నిస్తే, ‘మీరు ప్రతి రచననీ కనీసం ఇద్దరి చేత సమీక్షించి, మార్పులు, చేర్పులూ కూర్పులూ, చేయిస్తారు, అందుకని భయం!’ నిజం చెప్పాలంటే, రచయితలకు సమీక్షలంటే భయం ఉండకూడదు. వాటిని ఆహ్వానించాలి. ఎందుకంటే, ఆ సమీక్షల మూలంగా రచన మరింత పరిపుష్టం అవుతుందనే విశ్వాసం ఉండబట్టే మేము ఈ సమీక్షలని (peer reviews) ప్రవేశ పెట్టాం. రచయితని, పాఠకులనీ దృష్టిలో పెట్టుకునే ఈ సమీక్షలు చేయడం జరుగుతున్నది. ఇకముందు ఇంతకన్నా శ్రద్ధగా సమీక్షలు చేయడం అవసరమని మేము నమ్ముతున్నాం. ఆషామాషీగా కాకుండా, పత్రికలో ప్రచురితమైన కథలపైన, కవితలపైన, వ్యాసాలపైనా ఇకముందు విమర్శనాత్మకమైన వ్యాఖ్యానాలు వ్రాయమని పాఠకులని కోరుతున్నాం. అటు వంటి లేఖలే ప్రచురించడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రక్రియ పాశ్చాత్యదేశాల్లో సాహితీపత్రికలలో వచ్చే అన్ని రకాల రచనలకే కాక, సంపాదకునికి వ్రాసే లేఖలకు కూడా వర్తింపజేయడం ఆనవాయితీ. అటువంటి పద్ధతే మనకి కూడా అవసరం. అందుకు మీరు సహకరిస్తారని భావిస్తున్నాను.అతిథి సంపాదకీయం లాంటి కొన్ని సరి క్రొత్త శీర్షికల గురించి, ప్రత్యేకసంచికల ప్రచురణ గురించీ ఆలోచనలు సాగుతున్నాయి.

కొన్ని పత్రికలు పాత చరిత్ర వెళ్ళిన పుంతలోనే బరి తప్పకుండా వెడతాయి. వాటి విషయం మనకి అనవసరం. కొన్ని పత్రికలు క్రొత్త దారిలో వెళ్ళి సరి క్రొత్త చరిత్రని సృష్టిస్తాయి. ఈమాట క్రొత్త చరిత్రని సృష్టించేదిగా చేయాలని మా అభిలాష. మరో పదేళ్ళ తరువాతో, ఇరవై ఏళ్ళ తరువాతో, పాత సంచికలు చూసే క్రొత్తవారు, ‘సెబాస్‌’ అని మెచ్చుకునేట్లుగా పత్రికని నడపాలని ఆశిస్తున్నాం. ఈ మెచ్చుకోలు చరిత్ర పరంగానే కాదు – సాహితీ పరంగా, సారస్వత పరంగా కూడా! అలా పాత సంచికలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునే సులువు కూడా ఈమాటకి ఉన్నది! ఇక్కడ చెకోవ్‌ గురించి ప్రచారంలో ఉన్నకథ అసందర్భం కాదనుకుంటాను. చెకోవ్‌ క్రొత్త రచయితలకి ఒక సలహా ఇచ్చాడు. ‘చందమామ గురించి చెప్పదలచుకుంటే ఆకాశంలో చందమామని వర్ణించకు. నీపాదాల ముందు పగిలిన అద్దంలో ఆ చందమామ ప్రతిబింబం చూపించు,’ అని! భవిష్యత్తులో పాఠకులకి ఇప్పటి మన సారస్వతజీవితం, అదే అద్దంలో ఏడు రంగులతో ఈమాటలో ప్రతిఫలిస్తుందని ఆశిస్తున్నాను.

ప్రస్తుతం మాబృందంలో సంపాదకులు పద్మ ఇంద్రగంటి, సురేశ్‌ కొలిచాల, పాణిని శంఖవరం, మాధవ్ మాచవరం, నారాయణ స్వామి (నాశి) – వీళ్ళకి అనుభవంతో పాటు విపరీతమైన ఆసక్తి. ఒక్కొక్కరికీ ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యత! అంతకన్నా ఎక్కువ passion! టీనా బ్రౌన్‌ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆవిడ ఆధ్వర్యంలో రెండు అమెరికన్‌ పత్రికలు దేదీప్యమానంగా వెలిగి అభివృద్ధి చెందాయి. మొదటిది, Vanity Fair, రెండవది The New Yorker. మా బృందానికి టీనా బ్రౌన్‌ లాంటి సంపాదకురాలు పద్మ ఇంద్రగంటి . ఒక్కటే తేడా! రచయితలకి, ఇతర సంపాదకులకీ టీనా బ్రౌన్‌ తో పనిచెయ్యడం చాలా కష్టం అయ్యేది అని చెప్పుతారు. కానీ మా పద్మతో పని చెయ్యడం మాత్రం తియ్య మామిడి పండు ముక్క తిన్నంత సులువు. అంతేకాదు, ఆఖరి నిమిషంలో ఈమాటను చూడముచ్చటగా తీర్చిదిద్ది, ముందుమాటతో సహా మీ ముందుకు తీసుకువచ్చేదీ తనే. ఈ ఐదుగురు సంపాదకులూ కష్టపడి పని చేస్తారు; ప్రతిష్ట మాత్రం నాది.

    
   

13అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Rohiniprasad November 2, 2008 9:31 am

    ఈ మాట సంపాదకులకి చేకూరిన అనుభవం commendable అని నా ఉద్దేశం. ఈ నేపథ్యంలో Peer Reivew చేయించడం ఎంతవరకూ అవసరమో రచయితలూ, సంపాదకులూ జాగ్రత్తగా ఆలోచించాలి. తక్కిన వెబ్ పత్రికలూ, మామూలు పత్రికలూ ఏం చేస్తున్నారు? దీనివల్ల ‘తలపండిన’ రచయితలు కొందరు వెనక్కి తగ్గుతున్నారు. Brain storming sessions జరిగి ఉంటే వాటి వివరాలు dispassionateగా నమోదు కావాలి. ఈ కామెంటుని తీసేసినా పరవాలేదు కాని వెంటనే కాకపోయినా ఈ చర్చ జరగాలి.

  2. 2
    Sai Brahmanandam Gorti November 2, 2008 10:38 am

    పాతికేళ్ళ క్రితం మాట. అమలాపురంలో మా నాన్న గారు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి విలేకరి గా పని చేసేవారు. అప్పట్లో ఎక్స్ ప్రెస్ కీ, హిందూ కీ పోటీ ఉండేది. తెల్లారగానే ఎక్స్ ప్రెస్ వచ్చి గుమ్మం ముందు వాలేది. హిందూ పేపరు మద్రాసు నుండి ట్రైన్ లో రావాలి. అందువల్ల సాయంత్రానికి కానీ వచ్చేది కాదు. ఎంత ఎక్స్ ప్రెస్ కి పనిచేసినా మానాన్న మాత్రం హిందూ కోసమే ఎదురుచూసేవాడు. అది చదివేకే తెల్లారినట్లు ఫీలయ్యేవాడు. అదేమిటి? మీరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి పనిచేస్తూ, హిందూ పేపర్ని ఇలా తనివి తీరా చదవడం ఏం బాగోలేదని ఆయన స్నేహితులు విమర్శిస్తే, “ఎక్స్ ప్రెస్ చదవడం సిగరెట్ లాంటి వ్యసనమైతే, హిందూ పేకాట లాంటిది. ఒక సారి దూకాక అందులోంచి రాలేం. ఓడితే పట్టుదలగా ఆడుతాం. గెలిస్తే ధైర్యంతో ఆడుతాం. వెరసి వ్యసనానికి తలొంచుతాం. సిగరెట్ మహాఅయితే రోజుకి పాతిక కాల్చగలం. పేకాటలో రోజల తరబడి కాలాన్ని తురపు ముక్కలా ఆడేయగలమంటూ” మా నాన్ననేవాడు.

    ఈమాట చదవడం పేకాట కన్నా పెద్ద వ్యసనం. రెండునెలలకోసారి తెల్లారినా, వెలుగు మాత్రం అంతకాలమూ ఉంటుంది. ఇందులో ఇంకో వెసులుబాటు కూడా వుంది. పదేళ్ళ క్రితం నాటి కిరణాలనికూడా మళ్ళీ తాకచ్చు.

    ఎన్ని వెబ్ పత్రికలొచ్చినా ఈ మాట ముందు దివిటీలే!

    ప్రతీ రోజూ గంటల తరబడి ఈ మాట సైటు కెళుతుంటే “ధాంక్ గాడ్ ! రోజూ వస్తే చచ్చుండే వాళ్ళం. ఈ మాట వాళ్ళు రెండు నెలలకోసారి రిలీజు చేసి మా కాపురాలు నిలబెడుతున్నారని.” మా శ్రీమతి మాట.

    ఎన్ని మాటలు చెప్పినా ఇంకోటి మిగుల్తూనే వుంటుంది. అదీ ఈ సాహిత్య విమానం గొప్పదనం.

  3. 3
    Madhav November 2, 2008 10:44 am

    నమస్తే. – ఈమాట సంపాదకుల అనుభవం ఎంత వున్నా కూడా, అన్నీ వారే రివ్యూ చేసేస్తూ ఉంటే ఒక బయాస్ ఏర్పడుతుందనీ కాలానుక్రమంలో multiple perspectives of evaluation ని కోల్పోతామనీ మా నమ్మకం. అంతే కాదు, కొన్ని విషయాల్లో మాకు తగినంత పరిజ్ఞానం ఉండదు. అందువలన కూడా external peer review తప్పనిసరి అనే మా అభిప్రాయం. అయితే రివ్యూ చేసేవారి ప్రజ్ఞ మీద నమ్మకం ఉంటేనే వారికి రచనల్ని పంపుతాము, కదా.

    వచ్చిన ప్రతీ రచననీ ముందర మేము రివ్యూ చేస్తాం. మా దృష్టిలో ప్రచురణార్హత ఉన్న రచనలు మాత్రమే మరింత నిశితంగా పరిశీలించ బడతాయి. కొన్ని కేవలం సంపాదకులే రివ్యూ చేస్తే కొన్ని బైటివారితో కూడా రివ్యూ చేయబడతాయి.

    కథ అయినా, కవిత, వ్యాసం అయినా ఇక్కడ బాలేదు, ఇలా రాస్తే బాగుంటుందేమో, అని సలహా ఇవ్వడంలో తప్పేమిటో ‘తల పండిన’ వారికొచ్చిన ముప్పేమిటో నాకు అర్ధం కాదు. రివ్యూ కామెంట్లు నచ్చకపోతే రచయితలు వాటిని తిప్పికొట్టవచ్చనీ, రచయితదే ఆఖరి నిర్ణయమనీ ప్రతీసారీ మేం చెప్తునే ఉన్నాం. కొన్నిసార్లు రివ్యూ అసమంజసం అనిపించినప్పుడు దానిని బుట్టదఖలు చేసిన సందర్భాలు లేకపోలేదు కూడా. అలాగే రివ్యూ కామెంట్లు సమంజసమని మాకు అనిపించి రచయితకు నచ్చకపోతే, మా అభిప్రాయాన్ని రచయితకు నిక్కచ్చిగానే చెపుతున్నాం. కానీ, ఇటువంటి వాటికి మా మేధా మా ప్రజ్ఞా అతీతం అనుకునే పండితుల కోసం ఈమాట రివ్యూ పద్ధతులు మార్చలేమనే చెప్పాలి. ఆఖరుగా ఏ రచనైనా ప్రచురించడమా మానడమా అనేది మా నిర్ణయం. అది తప్పో ఒప్పో నిర్ణయించేది పాఠకులే. వారి తీర్పే మాకు శిరోధార్యం.

    మాధవ్ మాచవరం
    ఈమాట సంపాదక బృందం తరఫున.

  4. 4
    Sai Brahmanandam Gorti November 2, 2008 12:03 pm

    ఈ మాట సంపాదక వర్గాన్ని ప్రచురణ ముందు “సమీక్ష” విషయంలో అభినందించాలి. ఇందులో రాసినట్లుగా తెలుగు వారికీ, ముఖ్యం గా రచయితలకి మూడో సమీక్ష ( “peer review” ) అనేది కొత్త విషయం. మొదటి సమీక్ష రచయితెలాగూ చేసుకుంటాడు. రెండోది సంపాదకులది. మూడోది చెయ్యడం వల్ల నిష్పాక్షిక అభిప్రాయం వచ్చే అవకాశముంది. రచయిత పేరు తెలీదు కాబట్టి వస్తువు మీదే గురి వుంటుంది. ఒక్కోసారి ఈ మూడో సమీక్షలు స్పష్టంగా ఉండవు. ఒక్కోసారి ఉపయోగపడతాయని నా అభిప్రాయం.

    అమెరికా యూనివర్శిటీల్లో ఏదైనా టెక్నికల్ పేపర్ని పదిమందీ రివ్యూ చేస్తే కాని ప్రచురించరు. అలాగే కంపెనీల్లో కూడా రాసిన ప్రతీ టెక్నికల్ పేపర్నీ పదిమందీ రివ్యూ చేస్తారు. అందువల్ల నాణ్యత పెరుగుతుంది. ఒక జత కళ్ళకంటే పది జతలెప్పుడూ మేలే!

    ఈ సమీక్ష అనేది తెలుగు వారికి కొత్త. తెలుగు రచయితలకి అహం ఎక్కువ, ఈగో ఇంగువ లాంటిది. ఎంత మూసినా వాసన వదల్దు. శృతిమించనంత వరకూ రివ్యూ అవసరమనే నా అభిప్రాయం.

    అనేక వెబ్ పత్రికలొచాయి. వస్తున్నాయి కూడా. రంగులతోముస్తాబవుతాయి. కొన్ని వ్యాసాలూ, కథలూ చదివాకా, అందులో వుండే తప్పులూ తడకల్లో సంపాదకుల అశ్రద్ధ వద్దన్నా కనిపిస్తుంది. కొన్నయితే మరీ గాసిప్ వ్యాసాలు. ఇవన్నీ చూసాకా ఈమాట చాలా బెటరనిపిస్తోంది నాణ్యత విషయంలో. కాకపోతే గత రెండేళ్ళల్లో ఈ మాటలో వచ్చిన కొన్ని వ్యాసాలూ, కథలూ చూసాక ఇవి సంపాదకుల సమీక్షనెలా తప్పించుకుని వచ్చాయాయన్న అభిప్రాయం వుంది.

    పత్రికలకి పైపై రంగులు కాదు కావల్సింది. లోపల రుచి నోరూరించాలి. పదిమందికీ పళ్ళెంలో పంచే ముందు, వండిన వస్తువుకి ఉప్పెక్కువా తక్కువా చూస్తే, అది వండిన వాళ్ళకీ, తినే వారి ఆరోగ్యానికి మంచిది. అభిరుచిని బట్టి ఆస్వాదిస్తారు.

  5. 5
    mOhana November 2, 2008 12:16 pm

    ఈమాటకు జన్మదిన శుభాకాంక్షలు. నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకొంటున్నాను. పీర్ రెవ్యూ గురించి ఒక రెండు మాటలు. నా తలలో ఏముందో ఎంత ఉందో తెలియదు, కాని నాకు తలేమో పండిందని ఒప్పుకోవాల్సిందే! సంపాదకుల, సమీక్షకుల సలహాలు రచన అందానికి మెరుగు తెస్తుంది కాని దానికి మసి పూయదు. రచయిత తన రచనను తన దృష్టినుండి మాత్రమే చూడడానికి అవకాశం ఉంది. కాని సంపాదకుల దృష్టి, సమీక్షకుల దృష్టి ఆ రచన పత్రికకు ఎలా సరిపోతుందో, పాఠకులను ఎలా ఆకర్షించ గలుగుతుందో అనే దానిపైన ఉంటుంది. ఈ రెంటికి మధ్య ఒక ఘర్షణ ఉందనుకోవడం పొరబాటు. “మంచి” సంపాదకత్వంవల్ల సామాన్యమైన రచన మంచి రచన అవడానికి, మంచి రచన ఇంకా మంచి రచన అవడానికి అవకాశం ఉంది. అన్ని రచనలను సంపాదకులు మాత్రమే సమీక్షించడానికి వీలుకాదు. వాళ్లకు పని ఉంది, కుటుంబం ఉంది, సరదాలు ఉన్నాయి. అది కాక బయస్ కూడా కలగడానికి అవకాశం ఉంది. కొన్ని రచనలలో వాళ్లు ఎంతో ఓపికతో తమ కాలాన్ని వినియోగిస్తారు. ఇది నాకు బాగా తెలుసు. కాని నాదొక కోరిక. ప్రతి ఏడాది చివర సమీక్షకుల పేరులు తెలియజేస్తే బాగుంటుంది. కొన్ని విజ్ఞాన శాస్త్ర పత్రికలకు ఈ వాడుక ఉన్నది. దీనివల్ల రచయితలకు, పాఠకులకు పత్రిక standard తెలుస్తుంది. పత్రిక ఔన్నత్యము పత్రిక రచనలపైన, రచయితలపైన, సంపాదకులపైన, సమీక్షకులపైన ఆధారపడి ఉంటుంది. వీటిలో మొదటి మూడు మనకు తెలుసు. నాలుగవది మాత్రం తెలియదు. అందుకే ఈ చిన్న సలహా.
    విధేయుడు – మోహన

  6. 6
    Sai Brahmanandam Gorti November 2, 2008 12:37 pm

    మోహన గారు మంచి సలహా ఇచ్చారు.
    ప్రతీ కథనీ, కవితనీ, వ్యాసాన్నీ సమీక్ష చేసి వేస్తామని సంపాదకులు సెలవిచ్చారు. బాగుంది. సంపాదక వర్గాన్ని మెచ్చుకున్నారు. రచయితలకీ, పాఠకులకీ కృతజ్ఞతలు చెప్పిన చేత్తోనే సమీక్షకులకి ( పేర్లు చెప్పనవసరం లేదు )కూడా చెప్పుంటే బావుండేది. ఈ వ్యాసంలో ఆ లోపం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది.

  7. 7
    వేలూరి వేంకటేశ్వర రావు November 2, 2008 2:03 pm

    సమీక్షకులకి కృతజ్ఞతలు చెప్పకపోవడం నాతప్పు. క్షమార్హుణ్ణి. తలపండినా తప్పులు చెయ్యడం మాత్రం తగ్గ లేదు!

    మరో విశేషం. ఈ నామాట, ప్రచురణకి ముందు సమీక్షించబడింది. వాళ్ళ సలహాలననుసరించి మార్పులు, కూర్పులూ చెయ్యడం కూడా జరిగింది! అయితే, నేను సమీక్షకులసంగతి మరిచిపోయానన్న సంగతి మా సమీక్షకులుకూడా నాకు చెప్పలేదు. నన్ను హెచ్చరించలేదు. నన్ను మందలించినందుకు బ్రహ్మానందంగారికి కృతజ్ఞతలు.

    మోహన గారి సలహా పాటించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నా.

    మళ్ళీ మరోసారి, నా క్షమాపణలు.
    విధేయుడు,
    వేలూరి వేంకటేశ్వర రావు.

  8. 8
    కొడవళ్ళ హనుమంతరావు November 2, 2008 8:11 pm

    ఈమాట సంపాదక, రచయిత, పాఠక వర్గానికి పదో జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు కాలాల పాటు ఈ పత్రిక వెలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంచికకీ రాత్రింబవళ్ళూ శ్రమించే సంపాదకులకి, ముఖ్యంగా నాకెక్కువ సాయపడే సురేష్ కీ, పద్మ గారికీ, కృతజ్ఞతలు. ఎంత చిన్న విషయాన్నయినా తేలిగ్గా తీసుకోకుండా ఉన్నత స్థాయిలో ప్రచురించాలనే వారి దీక్ష మెచ్చుకోదగ్గది. వాళ్ళు మార్చినది బాలేదని నేను పేచీ పెడ్తే ఓపిగ్గా సమాధానం ఇచ్చి సామరస్యంగా పరిష్కరించడం సంతోషకరం. వారి ఉద్యోగ బాధ్యతలని నిర్వర్తిస్తూ, బహుశా కుటుంబ బాధ్యతలని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఈమాట కోసం పాటుపడుతున్న సంపాదకుల అంకిత భావం స్ఫూర్తిదాయకం.

    Peer Review గురించి: సంపాదకులకి తలకి మించిన పనిభారం వలన గానీ, పరిమిత విషయ పరిజ్ఞానం వలన గానీ, కొన్నిటిని వేరే వాళ్ళని సమీక్షించమంటే సరే, కాని అది పత్రిక పద్ధతిగా పెట్టుకుంటే, నాదొక సందేహం. ఇది సాహితీ పత్రికలలో సాధారణంగా చేస్తారా? ఉన్నత ప్రమాణాలున్న, తెలుగులో లేకపోతే ఇంగ్లీషులోనే తీసుకోండి, ఇతర సాహితీ పత్రికలలో ఇదేనా ఆనవాయితీ? నాకు నిజంగానే తెలియకే అడుగుతున్నాను.

    ఈమాట సంపాదక వర్గం అంతా, రచయితల్లో చాలా మందీ, బహుశా పాఠకుల్లో కూడా చాలా వరకూ, విజ్ఞానశాస్త్రాల్లో విద్యాధికులూ, నిష్ణాతులూనూ. కాని సాహితీ పత్రిక అన్ని రంగాల వాళ్ళనీ ఆకర్షించేదిగా ఉండాలి. ఈమాటని Physical Review ప్రమాణాలతో నడుపుతాం అంటే శాస్త్రరంగాలలో లేనివాళ్ళకి కాస్త “భయం” కలగొచ్చు. The New Yorker పద్ధతిన నడుపుతాం అంటే బహుశా అందరికీ ఆమోదయోగ్యం కావొచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. 9
    baabjeelu November 3, 2008 7:05 am

    “పీర్ల” review.
    ఏదో ఒక పధ్ధతి పెట్టుకోవడం రైటే. ప్రతీ పధ్ధతి వల్లా లాభనష్టాలుంటాయి.
    మాధవ్ గారు చెప్పినట్టు సంపాదకవర్గానిదే ఆఖరు నిర్ణయం, “పీర్ల” reviews ఎలావున్నా అన్నది సరైన పధ్ధతేనని ఒప్పుకోవాలి. “పీర్ల” యందు “వెర్రి పీర్లు” వేరయా అనుకుని, సంపాదకులు “జేర్తగా” వుంటే పత్రిక్కి మంచిది.

  10. 10
    Madhav November 3, 2008 8:16 am

    మా నుంచి మరికొంచెం వివరణ (ఈమాట రివ్యూ పద్ధతి గురించి అపోహలేమన్నా ఉంటే తొలగిపోతాయనే నమ్మకంతో).

    1. ఈమాటను scientific journal లాగా మేము చూడటం లేదు. ఒక సాహితీ పత్రిక లాగానే నడుపుతున్నాం. అలాగే నడుపుతాం కూడా.

    2. పీర్ రివ్యూ అన్నపదం పదేపదే వాడడం వల్ల కొంచెం “భయం” ఏర్పడ్డదేమో, నిజమే అయుండచ్చు. అది పోగొట్టడానికి కృషి చేస్తాం.

    3. ఈమాటకు ప్రత్యేకంగా సమీక్షకులు లేరు. రచయితలూ, కవులూ వ్యాసకర్తలే మా సమీక్షకులు. (కొన్ని విశేష సాంకేతిక వ్యాసాల సమీక్షలకు తప్ప). అందువల్ల రచయితలూ సమీక్షకులూ ఒక తానులో ముక్కలే.

    4. ఈమాట విలువలు నిలుపుకుంటూ, “అన్ని రంగాల వారినీ” ఆకర్షించేదిగా మెలగాలనే మా కోరికా, తపనా కూడానూ. వచ్చిన ప్రతీ వ్యాసాన్నీ ప్రతీసారీ external review కి పంపము అని ఇంతకుముందే చెప్పా గదా. మోహనరావు గారు చక్కగా చెప్పారు. ఈమాట ఎలా ఉండాలి అనే విషయం మీద మాకు నిర్దిష్టమైన అభిప్రాయం లేదా దృక్పథం ఉంది. (అది మీకు నచ్చడం మా అదృష్టం). సంపాదకులుగా ఈమాటలో ప్రచురణలు ఎలా ఉండాలో వారికే తెలుస్తుంది, కాబట్టి మొదటి రివ్యూ సంపాదక బృందానిదే, ఆఖరి నిర్ణయం కూడా వారిదే. కానీ, బయాస్ కి తావు లేకుండా, (మాకు కొమ్ములు మొలవకుండా) an external perspective కోసం, వేరే వారితో రివ్యూ చేయించడం సబబు అనే మా నమ్మకం. అలాగే, సాంకేతిక, చారిత్రాత్మక, తదితర సంబంధమైన వ్యాసాలు కూడా. ఎందుకంటే అటువంటి వ్యాసాల్లో మేము వ్యాస లక్షణాలను సరిదిద్దుకోగలమే కానీ, ప్రతీసారీ వస్తుశీలతను నిర్ధారించలేం కదా! కొన్నిసార్లు కథలూ, కవితలకి కూడా ఈ అవసరం పడుతూ ఉంటుంది. అంతేకాదు, ఎవరికి రివ్యూకి పంపాలో వారి ప్రతిభ, పటిమ రెండూ ముందు తెలుసుకునే పంపుతున్నాం కూడా.

    (పనిభారం వల్ల మాత్రం కాదని ఒట్టేసి చెబుతున్నాను. 🙂 నాకు ఈ పని భారమనిపిస్తే నేనిక్కడ ఉండగూడదని అర్థం, అంతే. సహధర్మచారుల అభిప్రాయం వేరే అనుకోండి, అది వేరే విషయం)

    ఇక నిక్కచ్చిగానే కొన్ని విషయాలు చెపుతాను. అన్యధా భావించవద్దు.

    తెలుగు సాహితీరంగంలో సంపాదకుడు తన బాధ్యతను, కర్తవ్యాన్నీ మర్చిపోయి చాలా కాలమయిందనే “నా” అభిప్రాయం. మంచి సాహిత్యమనే నాణేనికి రచయిత ఒక వైపు ఉంటే పాఠకుడు రెండోవైపు. ఈ రెండు పార్శ్వాలనీ నిలబెడుతూ, రచయిత అందించే సాహిత్యాన్ని పరిష్కరించి పాఠకుడికి అందిస్తూ, అనుసంధానుకుడైన సంపాదకుడు ఆ నాణేనికి మూడోవైపు. పరిష్కర్త గా ఉండవలసిన వ్యక్తి కేవలం పేజీ కంపోజర్ గా మిగిలిపోడం దురదృష్టం. కారణాలేమిటన్నది అప్రస్తుతం. మంచి సాహిత్యానికి సమీక్ష, పరిష్కరణ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్న బలీయమైన నమ్మకమే ఈ రివ్యూ పద్ధతికి అంకురార్పణ.

    ఈ రివ్యూ పద్ధతి కొత్తగా తిరిగి నేర్చుకోవలసి రావడం వలన, రచయితలలో జంకు కలగడం సహజం. వారి కోకిలను సంపాదకుడు ఏ కాకిగా మారుస్తాడో అన్న భయం వల్ల. అందువల్ల, మేము మార్పులూ చేర్పులూ చేసిన ప్రతీసారీ, రచయితలకు ప్రివ్యూ చూపించి వారికి నచ్చి, ఒప్పుకున్న తర్వాతే వారి కథనూ, కవితనూ, వ్యాసాన్నీ ప్రచురిస్తున్నాం. ఒకవేళ వారికి నచ్చక పోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేమూ తిరస్కరించడమో జరుగుతుంది. నిజానికి ఈ ప్రివ్యూ పద్ధతి వేరే పత్రికలకు లేదు. సంపాదకులదే ఏకపక్ష నిర్ణయం. కానీ ఈమాట పద్ధతి అది కాదు. మనమందరమూ కలిసి ఒక మంచి సాహిత్యాన్ని ఆనందిద్దాము, అనేది మా అంతిమ లక్ష్యం.

    ఏదేమైనా ఈమాట రచయితల విశాల హృదయం, విమర్శను స్వీకరించే సహృదయతా మా రివ్యూ పద్ధతి కొనసాగడానికీ, ఈమాట ప్రమాణాలు నిలబడడానికీ కారణాలు. ఇలాగే మా కర్తవ్య నిర్వహణలో లోపాలున్నా, మా పద్ధతి నచ్చకున్నా చక్కగా విమర్శించడం మీ బాధ్యత. విని తప్పు దిద్దుకోడం మా కర్తవ్యం. (విలువలకి రాజీ పడి మాత్రం కాదని మీకూ తెలుసు, అలా రాజీపడితే మీరు ఏమాత్రం సహించరని మాకూ తెలుసు).

    ఇంతకంటే వివరణ అనావశ్యమనే మా భావన. శెలవు.

    మాధవ్ మాచవరం
    ఈమాట సంపాదకుల తరఫున.

  11. 11
    Srinivas Nagulapalli November 3, 2008 9:38 am

    సమీక్షా పద్దతి పై మాధవ్ గారి వివరణ బాగుంది. అవసరమని కూడా అనిపించింది.

    మొదట్లో వారు చెప్పిన “…ఇటువంటి వాటికి మా మేధా మా ప్రజ్ఞా అతీతం అనుకునే పండితుల కోసం ఈమాట రివ్యూ పద్ధతులు మార్చలేమనే చెప్పాలి” అన్న వాక్యం పానకంలో పుడకలాగ, సమీక్షా పద్దతి నొదిలేసి, అనవసరమైన రచయితల motive hunting ను ఈడ్చుకొచ్చింది. సంపాదకుల ఉద్దేశం అది కాదని తెలిసినా, ఈ మాట లెందుకో అని అనుకుంటుండగా, సత్వరమే వివరణ ఇవ్వడం హర్షణీయం.

    ఈమాట ప్రచురణకు స్వచ్చందంగా సాహిత్య సేవాసక్తితో పరిశ్రమించే వారెందరో అందరికీ కృతజ్ఞతాపూర్వక వందనములు.
    =======
    విధేయుడు
    -Srinivas

  12. 12
    వామనమూర్తి November 3, 2008 7:13 pm

    ఈ మాట సంపాదక వర్గానికీ, కవితల్నీ, కథల్నీ చూసే ‘పీర్ల ‘ కీ భారత ప్రభుత్వం ‘మహా పద్మ విభూషణ సమ్రాట్ శేఖర ‘ బిరుదులు ఎనౌన్స్ చెయ్యాలని ఒక ఉద్యమం చేపట్టాలనుకుంటున్నాము. మీ ‘పీర్లు ‘ అనుమతిస్తే తెలీయచేయండి.

  13. 13
    సుధాకర బాబు November 16, 2008 12:43 am

    పదేళ్ళ నిర్విరామ కృషికి కృతజ్ఞతగా ఈ మాట పత్రికకు, సంపాదకులకు నా శుభాభినందనలు. తెలుగు పత్రికా రంగంలో ఈ మాట ఒక చక్కని ఒరవడి సృష్టించిందని, తక్కిన వెబ్ పత్రికలకు మార్గదర్శకంగా నిలిచిందని భావిస్తున్నాను.

    అత్యాశ అనిపించినా నాకొక కోరిక కలుగుతున్నది. “భారతి” పత్రిక ఆగిపోయింది. ఆ స్థానాన్ని పూరించే నాణ్యత “ఈమాట”కున్నదని, అచ్చు పత్రికగా వెలువడి రోడ్ల ప్రక్క దుకాణాలలోను, విద్యాలయాల రీడింగ్ రూములలోను ఈమాట (భారతి-II) దర్శనమివ్వాలని ఆశిస్తాను.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీ శ్రీ గురించి మూడు మాటలు…
  • ఒకరికి నచ్చిన పద్యం
  • ఎమితిని సెపితివె?
  • ఇస్మాయిల్‌ కవితా సంస్మరణ
  • నా మాట

ఇటువంటివే…

  1. నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు
  2. నామాట
  3. నామాట: నూతన సంవత్సర శుభాకాంక్షలు
  4. నామాట
  5. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?)

నవంబర్ 2008 సంచికలో ...

  • 2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు
  • 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ
  • A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu
  • అసమర్థులు
  • ఈమాట – నామాట
  • ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం
  • కుతంత్రం
  • జనరంజని: మహానటి సావిత్రి
  • డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష
  • తరువాతేమిటి?
  • తెలుగు కథల పోటీ
  • నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం
  • నాచన సోమన అపురూప పద సంచయం
  • నేనొక సాధారణ పాఠకుణ్ణి
  • పదేళ్ళ “ఈమాట” మాట
  • పళ్ళెం మాత్రం పగలగొట్టకు
  • పురూరవ
  • పురూరవ: శ్రవ్య నాటిక
  • బాలమురళీకృష్ణ సంగీతం
  • మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి
  • మనకు తెలియని మన త్యాగరాజు – 2
  • మరచిపొమ్మంటున్నారు
  • మూడు జ్ఞాపకాలు
  • రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా
  • రామా కనవేమిరా!
  • రెండు తీరాలు
  • సార్ గారండీ… సార్ గారండీ…
  • సువర్ణభూమిలో …
  • స్మైల్ ఒఖడే… ఇహ లేడు!
  • హిమపాతము
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.