పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/06/2009 11:13 am

    ఈ సినిమాలో సుశీల పాడిన పిలువకురా బాగా పాప్యులర్ అయింది. జగదీశ్వరా పాటలు రెంటిలోనూ ఎక్కువగా వినబడేది సుశీలదే. నీ నీడలోన అనేది కూడా ఆమె చాలా బాగా పాడింది.
    నాకు లీల పాడిన బంగారు వన్నెల అనే పాట ఇష్టం. ఆ తరవాత నౌషాద్ చేసిన కారీ బదరియాకీ దీనికీ పోలికలున్నాయి.
    చాలామందికి కోపం వస్తుందేమోగాని హాయిహాయిగా పాటలో జిక్కీ పాడినది నాకు నచ్చదు. శాస్త్రీయసంగీతం నేర్చుకోనందువల్లనో ఏమో ఇందులో ఆమె శైలి నాకు నచ్చదు. ఘంటసాల ప్రతిభకూ, ఆదినారాయణరావు మేధస్సుకూ ఇది మంచి ఉదాహరణ.

    మోహనరావుగారు చెప్పినట్టు ఫ్లాప్ అయిన ఫూలోంకీ సేజ్ లోని పాటలు చాలా బావుంటాయి. అడాణా రాగంతో మొదలయే రాగమాలిక ఆ భీజా రసియా మొదలైనవి మంచి ఉదాహరణలు.

    వ్యాసం మాటకొస్తే రచయితకు ఈ పాట గురించి ఉన్న ఉత్సాహం ఇన్నేళ్ళుగా తరగనే లేదని తెలుస్తోంది. ఏ సినిమా పాటనైనా ఇదే పద్ధతిలో ‘కూలంకషంగా జర్చించి’ నేర్చుకోవచ్చు.

  2. ఫాదర్స్ డే గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/06/2009 3:07 am

    పితృదినోత్సవ సందర్భంగా కృష్ణమోహన్ గారు వెలువరించిన విచార ధార చాలా బాగుంది. నా 10వ ఏటనే కీర్తిశేషులైన మా తండ్రిగారి స్మృతులను, వారి మధురానురాగ వాత్సల్య భావాలను గుర్తుకు తెచ్చి హృదయాన్ని కదిలింప చేసింది. రచయిత గారికి అభివందనలు/ధన్యవాదాలు. మృదు మధు వాత్సల్యాదిక హృదయంగమ భావ భరితమై ఈ కృతి నన్ను చదివించి నిష్ఠతో మది కదిలించినదయ్య గళము గద్గదమవగా.

    భవదీయుడు

  3. రాగమాలిక గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/05/2009 8:50 pm

    అనుపమ రాగ మాలికల హారము నేరిచి గూర్చి తెచ్చి మా
    మనముల కింపు గూర్పగ సమంచిత రీతిని జూపినట్టి మీ
    ఘన వ్యవసాయ తత్పరత గాంచి, గణించి, నమస్కరించి, యెం
    తన పులకించి, మించిన ముదం బెద నెక్కొన ప్రస్తుతించెదన్

    మీ ఈ వ్యాసం ద్వారా బ్రహ్మానందం కలిగించి అన్వర్ధ నామధేయులయ్యారు. అనేకానేక అభివందనలు ధన్యవాదాలు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పల్లవి తప్ప అంతా మరచిపోయిన “నిత్య కళ్యాణి నిగమాంత సంచారిణి” రాగమాలికను పూర్తి పాఠం ఇచ్చినందుకు చాల కృతజ్ఞతలు.
    ఒక చిన్న సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను. కృష్ణా ముకుందా మురారి (పాండురంగ మహాత్మ్యం) రాగ మాలికలో లలిత లలిత మురళీ స్వరాళీ అనే చిరణం తరువాత పల్లవి శ్రుతి మారుతుంది (ఎక్కువ శ్రుతిలోకి సంధింప బడుతుంది) దీనికి కారణం ఏమిటి? సంగీత దర్శకుని ప్రతిభ/అసమర్ధతా? చరణాంతం తరువాత పల్లవి మొదలుపెట్టిన శ్రుతిలోకే అనుసంధింప బడాలి గదా.

    భవదీయుడు

  4. హాయిహాయిగా ఆమని సాగే గురించి mOhana అభిప్రాయం:

    07/05/2009 1:51 pm

    వ్యాసం బాగుంది. తిరుపతి మహావీర్ టాకీస్‌లో నేను ఇంటర్మీడియేట్ (పీయూసీకి ముందటి కాలం) చదివే రోజుల్లో ఈ చిత్రాన్ని ఈ పాటకోసం నాలుగుమార్లు
    చూచాను! ఈ పాట ఒక మధురాతిమధురమైన అనుభూతి. అప్పుడే సినీరంగంలో ప్రవేశించినారనో ఏమో ఈ పాటను సుశీలగారిచేత పాడించలేదు రావు గారు. ఇట్టి పాటలను జిక్కీగారు తరువాత తరువాత ఎందుకు పాడలేదో? హిందీ పాటను కింది లింకులో చూచి వినగలరు.
    http://www.youtube.com/watch?v=cQ6sTjW2-O8

    రఫీగారి గొంతు ANRగారికి బాగా సరిపోయింది! దీని తరువాతి హిందీ చిత్రం ఫూలోంకీసేజ్‌లో కూడా మంచి పాటలు ఉన్నా, ఆ చిత్రం బాగా దెబ్బ తిన్నది. ఆ నష్టాల ఎర్ర సిరాను నల్ల సిరా చేయడానికి అంజలీదేవి దంపతులకు దశాబ్దాలు పట్టింది.

    విధేయుడు – మోహన

  5. హాయిహాయిగా ఆమని సాగే గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/05/2009 10:51 am

    శ్రీకాంత్ గారూ:

    సంగీతంపై వ్యాసాల రాయటంలో ఉన్న చిక్కుల్లో ఇది ఒకటి.
    ని, నీ స్వరాల్లో మొదటిది కోమలం, రెండోది తీవ్రం అని కాదు. పాటలోని తాళం కోసం ఒక స్వరాన్ని సాగతీయాల్సి రావటమే తప్ప మరేమీ కాదు. యమన్ (కల్యాణి) రాగంలో కోమల స్వరాలు లేవు.

    చరణానికి, చరణానికి మధ్య ఉన్న స్వరాలను వ్యాసం మొదట్లో (నాల్గవ పేరా) లింక్‌లో ఇచ్చాను. అందులో యమన్ రాగంలో ఉన్న స్వరాలను చూడండి. అలాగే పాత సంచికల్లో కల్యాణి (యమన్ ) రాగంపై రెండు వ్యాసాలున్నాయి.

    నిరిగమ ధనిసా ధనిసా
    సనిసగరిగ సరినిసధని
    మధనిస నిరినిరి ధనిధని మధమధ గమగమ గమధనిసా గమధనిసా ధనిసా….

    అన్నీ తీవ్ర స్వరాలే!

    నేనూ సంగీతంలో ఒక పామరుడనే! ఈమాట పాఠకులకు రాగాలపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నట్టు తోస్తోంది. వచ్చేసంచికల్లో మరికొన్ని రాగాలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

    ప్రసాద్ గారూ:

    ఉత్సాహం ఉన్న వారు తమంత తామే (కొంత శ్రమ పడక తప్పదు) ఈ రాగమాలికలో ఉన్న రాగాల్లో ఉన్న మరికొన్ని పాటలు తెలుసుకుంటారనే కావాలనే వాటి వివరాలు ఇవ్వలేదు. ఉదాహరణకి “సాగర సంగమం” సినిమాలో ఒక పాట హంసానంది (సోహిని) రాగంలో ఉంది. కనుక్కోండి.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. పడమట సంధ్యారాగం గురించి MJ Thatipamala అభిప్రాయం:

    07/05/2009 7:58 am

    మంచి కథ. అనుమానం పెనుభూతం అంటారు. ముగింపు బాగుంది, అక్కడ 30సార్లు ఫోను మోగడం, ఇక్కడ 30సార్లు డోరు బెల్లు కొట్టడం, సంధ్య ఇంట్లో లేకపోవటం…
    కథ పేరుకి, కథావస్తువుకి పొంతన కుదరలేదేమో?!

  7. హాయిహాయిగా ఆమని సాగే గురించి Sreekanth అభిప్రాయం:

    07/04/2009 9:39 am

    లక్ష్మన్న గారు,
    చక్కటి వ్యాసం. నాబోటి సంగీత పామరులకు చాలా ఉపయోగపడుతుంది.
    ఒక చిన్న సందేహం. మీరు యమన్ స్వరాలు అన్నీతీవ్ర స్వరాలుగా ప్రస్తావించారు. కానీ, చివరి చరణంలో కోమల మరియు తీవ్ర స్వరాలు వాడారు. ఉదాహరణకు (ని, నీ), (మ, మా). ఇలా ఎందుకు రాసారో దయయుంచి విశదీకరించరూ?
    శ్రీకాంత్

  8. పెట్టె బయట గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/04/2009 3:07 am

    కధ చాలా బాగుంది. పాఠశాలలలోల బోధనావిధానాలు మారాలని అందరూ అంటారు గానీ ఎవ్వరు ఆ మార్పును స్వాగతించరు. అలవిమీరిన దురాశ వలన చదువుకొనడం పిల్లలకూ చదువు కొనడం తల్లిదండ్రులకూ దుర్భరమౌతోంది. మా బాల్యంతో పోల్చి చూస్తే నేటి పిల్లల బాల్య పరిస్థితులు జాలి కలిగిస్తున్నాయి.

    భవదీయుడు

  9. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/03/2009 11:13 pm

    ప్రభావం, అనుసరణ, అనుకరణ అనేవి ఏ మాత్రం తప్పు కాదు. మీ ఈ అభిప్రాయం సరైనదని నేను భావిస్తున్నాను. కవిత్వమే కాదు ఏ శాస్త్ర పురోగతి కైనా ఇవి అత్యంత ఆవశ్యకాలు. ముందు తరాల వారి విజయ రహస్యాలను ఆకళించుకొంటూ, వారి విజ్ఞానాన్ని మనది చేసుకొని దానిని మన తెలివితేటలతో ఇంకొంచెం ఉద్దీపనం చేయడమే పురోగమనం. మీ రిచ్చిన ఉదాహరణలోని రేవతీ దేవి గారు తిలక్ మహాశయుని కవితను చదివిన తరువాతనే తమ కవితను వ్రాసారనుకోండి. అప్పుడు ఆమె తన దైన శైలిలో దానిలోని భావ ప్రకటనా విధానాన్ని ఇంకా మెరుగు పరచారేమో ఆలోచించండి. మెరుగు కాదని కొందరనుకున్నా ఆమెకూ ఆమె లాంటి మరికొంతమందికి అది మెరుగైనదే అని అనిపించవచ్చుగా. అప్పుడు ఆమె తిలక్ మహాశయునితో సమానమైన లేదా మెరుగైన కవయిత్రి అని ఒప్పుకోవలసి వుంటుంది. కాలమొక్కటే ఇటువంటి సందిగ్ధతలను నివారిస్తుంది.

    భవదీయుడు

  10. హాయిహాయిగా ఆమని సాగే గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/03/2009 10:12 pm

    శ్రీ లక్ష్మన్న గారికి అనంత కోటి ధన్యవాదాలు
    నేను ఎంతో ఇష్టంగా వినాలనుకొనే 5-6 పాటలలో శివశంకరి (జగదేక వీరుడు) తరువాత పాట హాయి హాయిగా ఆమని సాగే రాగ మాలిక. ఈ పాట పాడడం వాయించడం కొంచెం వచ్చినా పూర్తిగా స్వరాలతో మీరిచ్చిన సమాచారం ఇంకా కొంచెం క్షుణ్ణంగా నేర్చుకొనడానికి సహకరిస్తుంది. దానికి కృతజ్ఞుడిని. దీనితో పాటు ఇందులోని రాగాల పేర్లు వాటి ఆకృతులూ ఇచ్చారు. ఎలాగూ ఈ రాగాల పేర్లు ఇచ్చారు వాటితో పాటు ఆ రాగాలలోని ఇతర ప్రసిద్ధ పాటలు కూడా ఇస్తే ఈ రాగాలను కూడా పరిచయం చేసినట్లుండేది గదా. మీరు గానీ శ్రీ రోహిణీ ప్రసాద్ గురువుగారుగాని మరి కొన్ని రాగాలను పరిచయం చేస్తారని ఎదురుచూస్తుంటాము.

    మరొక్క సారి ధన్యవాదాలతో

    భవదీయుడు