హాయిహాయిగా ఆమని సాగే

ఒకే రకంగా బాణీ కట్టిన అనేకానేక తెలుగు, హిందీ సినిమా పాటల్లో చెప్పుకోతగ్గ రాగమాలిక అయిన ‘హాయి హాయిగా ఆమని సాగే…’ పాట భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అద్భుతమైన పాటల్లో ఒకటి. యుగళగీతంగా సాగే ఈ రాగమాలికను తెలుగులో పాడింది ఘంటసాల, జిక్కీ. ఇదే పాట హిందీలో ‘కుహూ కుహూ బోలే కోయలియా…’ పాటగా రఫీ, లతలు పాడారు. సువర్ణ సుందరి సినిమాలో ఉన్న ఈ పాట మొదట తెలుగులో వచ్చి తరవాత డబ్బింగ్‌తో సినిమా పేరు కూడా మార్చకుండా హిందీలో విడుదలయ్యింది. ఈ సినిమాకి సంగీతం ఆదినారాయణ రావు. ఈ సినిమాలో పాటలన్నీ ఆణిముత్యాలే అనిపిస్తాయి! ఈ రాగమాలికలో ఉన్న రాగాల ఎంపికతో ఆదినారాయణ రావుకి (ఈయన అలనాటి ప్రఖ్యాత సినీ తార అంజలీ దేవి భర్త) హిందూస్తానీ సంగీతంతో ఉన్న పరిచయం, పట్టు విశదమవుతాయి.

//eemaata.com/Audio/july2009/Haiహాయి హాయిగా ఆమని సాగే (సువర్ణ సుందరి)

1957 సంవత్సరంలో వచ్చిన ‘సువర్ణ సుందరి’ సినిమాలోని ఈ పాట గురించి ప్రముఖ కథకుడు, సంగీత విమర్శకుడు ‘భరాగో’ అన్న మాటలు గుర్తు తెచ్చుకోటం సమంజసం. “సోయగాలను విరజిమ్ముకుంటూ హాయిహాయిగా సాగిన ఈ ఆమని పాటలో కవితాస్పర్శ, ఆ మాటల పొందిక రామకృష్ణశాస్త్రిగారిని పదే పదే గుర్తుకు తెస్తుంది.(ఈ రాగమాలిక రచన సముద్రాల అని కొన్ని చోట్ల రాసారు!) ఈ సినిమా హిందీలోకి వెళ్ళినపుడు లతామంగేష్కర్, మహమ్మద్ రఫీలు ఇదే రాగాలను, ఇవే స్వరాలలో మరింత కర్ణపేయంగా ఆలపించగా, ఒక దక్షిణాత్య సినీ సంగీత దర్శకుడికి ఒక సినిమా పాట తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డును సాధించి పెట్టిన సంగతిని గుర్తుంచుకొని ఆ పునాది తెలుగు పాటదే కదా అని మనం గర్వపడాలి.”

ఈ రాగమాలికతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ పాటను స్వరాలతో సహా నేర్చుకోవాలనుకొనే వారికి నా స్వానుభవాలను ఇక్కడ చెప్పటం అప్రస్తుతం కాదనుకుంటాను. ఈ రాగమాలిక మా ఇంట్లో అందరూ పాడటంతో నాకు చిన్నప్పుడే ఈ పాట బాగా పరిచయం. కానీ పాట నిర్మాణంలో రాగాలు, స్వరాలు ముడిపడి ఉంటుందన్న విషయం నాకు బొత్తిగా తెలియని రోజులవి. 1980 సంవత్సరంలో బొంబాయి ఐ.ఐ.టి ఇంజినీరింగ్ చదువుకోసం వచ్చిన నాకు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారితో పరిచయం కలగటం, ఔత్సాహిక సంగీతకారులతో అప్పటికే మంచి ఆర్కెష్ట్రాను నిర్వహించే ప్రసాద్ గారి సూచన మేరకు ఒక గాయకుడిగా మాత్రమే కాక ఏదైనా ఒక వాయిద్యాన్ని నేర్చుంటే బాగుంటుందని ఆయన అనటం, ఆ విధంగా వేణువుపై నా సాధన మొదలయ్యాయి.

కష్టమైనా ఈ రాగమాలికలోని స్వరాలన్నీ జాగ్రత్తగా రాసుకొని సాధన ప్రారంభించాను. మొదట్లో అంతా అగమ్యగోచరంగా ఉండేది. నా అదృష్టం ఏమిటంటే కొంచెం గాత్రం అప్పటికే పరిచయం ఉండటం వల్ల స్వరాలను నోటితో అనుకుంటూ వేణువు మీద పలికించే ప్రయత్నం చేసేవాణ్ణి. సంగీతం అనుకున్నంత తేలికగా పట్టుపడదు అన్న విషయం తొందరలోనే నాకు తేలిపోయింది. అయినా పట్టు విడవకుండా ఈ పాటనే సాధన చేసే వాడిని. ఈ పాట తప్ప మరే పాటా పాడకుండా దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రాగమాలికే సాధన చేసినట్టు గుర్తు. ఈ సాధనలో అటు వేణువు వాయిద్యంలోని కిటుకులు కొన్ని నేర్చుకోటం, తెలిసిన వారి దగ్గర తెలియని విషయాలు తెలుసుకుంటూ ఔత్సాహిక విద్యార్ధిలా సాధన మానకపోటం ముఖ్యం అని తెలియటం మొదలైంది. ఏ విద్యలోనైనా ఏకాగ్రత ఎంత ముఖ్యమో సంగీతం నేర్చుకోటంలో కనపడినంత స్పష్టంగా మరే విద్యలోనూ నాకు కనపడేది కాదు!

హాయిహాయిగా ఆమని సాగే

సా ధనీ ధమధ, సా ధనీ ధమధ నిధమగరిస
సగగస, గమమగ, మధధమ, ధరిస
సాధా నీమా ధాగా మాధా
సానిగారి సానిధాని

హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గనవోయీ సఖా… హాయీ సఖా…

లీలగా పువులు గాలికి ఊగ
సనిధమధనిస
గమగమధనిస
రిసనిధని సరిసని సరిసని
ధనిని ధనిని ధని
మధధ మధధ మధ గరిగమధని … లీలగా….

కలిగిన తలపుల వలపులు రేగ
ఊగిపోవు మది ఉయ్యాలగా, జంపాలగా ||హాయి||

గమగ మధమ ధనిసని రిసనిధమగ
గమగ మధమ ధనిసని రిససా

(పాట పై భాగమంతా సోహినీలో. బహార్ ఇక్కడ మొదలవుతుంది)

సరినిసమా మపగమనీ ధని1ధని2సా
సరినిస మాగ మారీసా
(నిసరి మాపని గామప రీసా)2
సారిని సారిని నీ1ధానీ2సా… సా…

ఏమో తటిల్లతికమేమెరుపొ?
మైమరపేమో, మొయిలు రాజు దరి మురిసినదేమో!
వలపు కౌగిళుల వాలీ సోలీ ఊగిపోవు మది ఉయ్యాలగా, జంపాలగా ||హాయి||

గమగ మధమ ధనిసని రిసనిధమగ
గమగ మధమ ధనిసని రిససా

(పై రెండు లైన్లు సోహినీలో)

సాధానీప మపసా గామరీసా
సరిమా పపధ ధనిసా నిరిసా
నిని సస రిరి గగ రిరిగగ సస నిని రిరి సా సా….

(పై స్వరాలు జోన్‌పూరిలో)

చూడుమా చందమామ!
అటు చూడుమా చందమామ..
కనుమా; వయ్యారి.. శారద యామిని కవ్వించే ప్రేమా…..
వగలా తూలె,
విరహిణులా… మనసున మోహము రేపు నగవులా… ||ఊగిపోవు మది||

గమగ మధమ ధనిసని రిసనిధమగ
గమగ మధమ ధనిసని రిససా

(పై రెండు లైన్లు సోహినీలో)

సనిరిసనీ సనిరిసనీధప ధపనిధపమప
గమప రిగమ సరిసా…

(పై స్వరాలు యమన్‌లో)

ఆ…

కనుగవ తనియగా, ప్రియతమా;
కలువలు విరిసెనుగా!
చెలువము కనుగొనా:
మనసానంద నాట్యాలు సేయునోయి…
ఆనంద నాట్యాలు సేయునోయి…

నిరిగమ ధనిసా ధనిసా సనిసగరిగ సరినిసధని
మధనిస నిరినిరి ధనిధని మధమధ గమగమ గమధనిసా గమధనిసా ధనిసా….

నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ తనియగా… యమన్ రాగంతో పాట పూర్తి అవుతుంది.

పాట స్వరాలను చూపేముందు, హిందూస్తానీ పద్ధతిలో కోమల, తీవ్ర స్వరాల నొటేషన్ ఉపయోగిస్తూ, ఈ నాలుగు రాగాలని ముందు కొద్దిగా పరిచయం చేస్తాను.

సోహిని: స, రి1, గ2, మ2, ధ2, ని2 (ఈ రాగంలో పంచమం నిషిద్ధం, ఆరోహణలో రిషభం నిషిద్ధం). సాయం సంధ్యా సమయం ఈ రాగానికి అనువైన సమయం. కర్ణాటక రాగాలలోని హంసానంది ఈ రాగానికి దగ్గర.

బహార్: స, రి2, గ1, మ1, ప, ధ2, ని1 & ని2 (ఆరోహణంలో తీవ్ర నిషాదం, అవరోహణంలో కోమల నిషాదం వాడతారు. అలాగే రిషభం అవరోహణలో మాత్రమే వాడతారు.) వసంత కాలం సూచించటానికి ఈ రాగాన్ని విరివిగా వాడతారు. మిగిలిన ఋతువుల్లో ఈ రాగాన్ని రాత్రి సమయాల్లో పాడతారు. చాలా వక్ర సంచారం ఉన్న రాగం ఇది.

జోన్‌పూరి: స, రి2, గ1, మ1, ప, ధ1, ని1 (ఆరోహణలో గాంధారం నిషిద్ధం.) అతి అందమైన రాగాల్లో ఇది ఒకటి. సంచారాల్లో ఈ రాగం యొక్క అందమంతా స, ప లలో ఉంటుంది.

యమన్: స, రి2, గ2, మ2, ప, ధ2, ని2 (అన్నీ తీవ్ర స్వరాలే) కర్ణాటక రాగాల్లోని కల్యాణి రాగం దీనికి చాలా దగ్గర. ఈ రాగం ఈమాట పాఠక-శ్రోతలకి పరిచయమే!