పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/11/2025 11:26 am

    నేను వేదాలనీ ఉపనిషత్తులనీ మధించలేదు కాని, వాటినీ సాపేక్ష సిద్ధాంతాలనీ తరచి చూచిన నండూరి “విశ్వరూపం” లో అంటారు:

    “ప్రాచీన హిందువులు ఖగోళ విజ్ఞానంలో ఆరితేరినవారే. కాని వారి విజ్ఞానం ఎంత ప్రాచీనమైనదనే విషయం ఈనాటికి కూడా వివాదగ్రస్తంగా వున్నది. మన సంప్రదాయం ప్రకారం మన నాగరికత అతి పురాతనం. మన ఖగోళ విజ్ఞానం కూడా అతి ప్రాచీనమైనదే. అసలు ఖగోళ విజ్ఞానమే కాదు, ఏ విజ్ఞానమైనా ముందు భారతదేశంలోనే పుట్టి ఇతర దేశాలకు వ్యాపించిందని వాదించే ఛాందసులు పలువురున్నారు. వారి దృష్టిలో అసలు ఈనాడు పాశ్చాత్యవేత్తలు కనిపెట్టిన కొత్త విషయం ఒక్కటీ లేదు. ఏ పాశ్చాత్యుడు ఏ నూత్న విషయాన్ని ప్రతిపాదించినా, అది మన వేదాలలోనే వున్నదంటారు. ఏదో శ్లోకాన్ని తీసుకుని దానికి నూత్న సిద్ధాంతానుగుణమైన అర్థం చెబుతారు. ఇంతేకాక, పాశ్చాత్యులు ఈనాటికీ కనిపెట్టలేని ఎన్నో మహత్తర విశేషాలు వేదాలలో వున్నాయని, వేదాలు అపౌరుషేయాలు కనుక మన విజ్ఞానం అనాది అని చెబుతారు. ఇది ఒక విధమైన జాత్యహంకారం.”

    సృష్టి ఆవిర్భావం మీద ఆసక్తి కలవాళ్ళు నండూరి, Weinberg [1] రచనలు చదవాలి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] The First Three Minutes: A Modern View of the Origin of the Universe. Steven Weinberg. Basic Books. 1993.

  2. చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/07/2025 2:45 pm

    “చెల్లియుండియు సైరణ చేయునతడు” అన్న భారత సూక్తి ఏ సందర్భంలోదని వెదుకుతుండగా, ఈ వ్యాసం 2022 ఏప్రిల్ “కొలిమి” లోనిదని తెలిసింది. “ఈమాట” ఆమాట చెప్పాల్సింది.

    “చెల్లియుండియు సైరణ సేయునతఁడుఁ
    బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ
    దనకుఁ గలభంగి నిచ్చునతండుఁ బుణ్య
    పురుషు లని చెప్పి రార్యులు గురువరేణ్య.”

    దానికి రెండు పద్యాల ముందరిది:

    “క్షమియించువారిఁ గని చా
    లమి వెట్టుదు రైననుం దలంప ననూన
    క్షమయ కడు మెఱయుతొడ వు
    త్తమరూపము గోరువారు దాల్తురు దానిన్.”

    (ఉద్యోగపర్వం, రెండో ఆశ్వాసం)

    ధృతరాష్ట్రుడికి విదురుడు హితోపదేశం చేసే సందర్భం లోని ఈ పద్యాల సారాంశం: సమర్థుడయి (చెల్లియు) కూడా శాంతం (సైరణ) వహించేవాడు పుణ్యపురుషుడు; క్షమించే స్వభావం కలవాళ్లకి జనులు అసమర్థతని ఆపాదిస్తారు (చాలమి+పెట్టుదురు) కాని, ఆలోచిస్తే క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం.

    రాజేశ్వరి పొందిన “లోపలి స్వేచ్చ” వలన కలిగిన క్షమ, ఓరిమి ఆమెకు ఆత్మవైశాల్యాన్ని చేకూర్చాయని వాడ్రేవు గారి ప్రశంస.

    అమీర్ కి మరొక స్త్రీ పై మోజు పడితే వారినిరువురినీ కలిపిన రాజేశ్వరిది ప్రకాశించే క్షమా? కడుపుతో ఉన్నప్పుడు కర్రతో బాదితే, తన్నితే సహించడం మెచ్చుకోదగ్గ ఓరిమా? బిడ్డని కనాలని ఉన్నా అమీర్ కోసం గర్భం పోగొట్టుకోవడం స్వాతంత్రమా? ఇదంతా తను సంపాదించిన “లోపలి స్వేచ్చ” వలనే అనడం విడ్డూరంగా ఉంది; కాదు, చాలా ఎబ్బెట్టుగా ఉంది. కొడవటిగంటి 1947 లో రాసిన “ఆడబ్రతుకే మధురం!” (https://drive.google.com/file/d/17zVmgoshDjspVZKH_yymzBm11HZEbHDC/view) అన్న కథలో పిల్ల అంటుంది: ” నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె.” ఓ చిన్న పిల్లకున్న స్వాభిమానం కూడా రాజేశ్వరి చూపించలేదే?

    ఇంతకీ తన 2002 సిద్ధాంత వ్యాసంలో [1], “మైదానంలో వ్యక్తి స్వేచ్చ గురించి మాట్లాడలేదు,” అని, ఇప్పుడీ “లోపలి స్వేచ్చ” సిద్ధాంతం తేవడమెందుకు?

    వాడ్రేవు గారు [1] కి అనుబంధంగా ఇస్మాయిల్ తో చేసిన ఇంటర్వ్యూ లో ఓ చక్కని జవాబుంది:
    ప్ర. స్త్రీవాదులు చలంలో తమకు అవసరమైనది తీసుకుని శతజయంతులు జరపడం మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?
    జ. చలం ఒక మహా కాసారం. అందులో స్వచ్ఛమైన జలముంది. అందమైన తామరలున్నాయి. రుచికరమైన చేపలున్నాయి. పచ్చటి నాచుంది. ఎవరికి అవరమైనది వారు తీసుకుంటారు.

    అలాగే “మైదానం” లో విశాలమైన పచ్చటి బయళ్లతో పాటు కొన్ని కలుపుమొక్కలున్నాయి. వాటిని వివరించే జయప్రభ వ్యాసం “మైదానానికి చెలియలి కట్ట” [2] (https://eemaata.com/em/issues/199907/1107.html) చదవదగ్గది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “సత్యాన్వేషి చలం: ఒక పరిశీలన,” డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి. 2006. (పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసం, 2002).
    [2] “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” జయప్రభ. 2003.

    [ఇది ఇదివరకే కొలిమి పత్రికలో వచ్చిందని మాకు తెలియదు – సం. ]

  3. కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు గురించి Rangarao అభిప్రాయం:

    06/04/2025 2:18 am

    శ్రీనివాస్ గారి కామెంట్ లో ఒక మాట అన్నారు. రచయిత మధ్యలో ఇంకేమైనా రాస్తే త్రెడ్ తెగిపోయింది అని. ఇది సరైన మాట కాదేమో! రచయిత తనలోని భావాలను బయట పెడితే ఒక భారం వదిలినట్లు మనసు తేలికపడుతుంది. హనుమంతరావు గారు చాలా సార్లు చిన్న కథలు రాశారు ఈ వేదిక మీద. మళ్లీ రాయవచ్చు కూడా రిలాక్సేషన్ కోసం. దానివలన ఈ శీర్షిక దారం ఎలా తెగిపోతుంది? ఈ పోగు వేరుగానే వుంటుంది కదా! మధ్యమధ్యలో ఆటవిడుపుగా కథలు రాయడం మానుకోవద్దని హనుమంతరావు గారిని కోరుతున్నాను.

  4. చలం గురించి… గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/01/2025 7:50 pm

    “స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలని మీరు పది కారణాలు చెబితే ఇవ్వకూడదు అని చెప్పి వంద కారణాలు చెప్పగలను. అది హృదయానికి తోచాలి. స్త్రీలు పురుషులు సమానులు, జనమంతా సమానులు అని హృదయానికి తోస్తుంది. అంతే కానీ హేతువుకి తోచదు.”

    ఎందుకు తోచదు?

    “But, if women are to be excluded, without having a voice, from a participation of the natural rights of mankind, prove first, to ward off the charge of injustice and inconsistency, that they want reason, else this flaw in your NEW CONSTITUTION, the first constitution founded on reason, will ever show that man must, in some shape, act like a tyrant, and tyranny, in whatever part of society it rears its brazen front, will ever undermine morality.”
    — Mary Wollstonecraft. Vindication of the Rights of Woman. 1792.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:

    05/16/2025 5:31 am

    హనుమంతరావు గారి సంకల్పం నెరవేరాలని, ఈ వ్యాసాలు పుస్తక రూపంలో రావాలని ఆకాంక్షిస్తున్నాను. కాకపోతే రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలు తెలుగులో వున్న ఈ వ్యాసాలను చదివి అర్థం చేసుకోగలరు అనేది ఒక ప్రశ్న. ఏదేమైనా, మన స్కూళ్లలో సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు వ్యాసాలు స్పూర్తినిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.

    వేమూరి గారి కామెంట్ చివరి వాక్యం లో తా.క. అని రాశారు. తా.క. ఎవరో తెలియడం లేదు. శ్రమ అనుకోకుండా పూర్తిగా రాస్తే చదివేవారికి అర్థం అవుతుంది అని మనవి.

  6. కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/13/2025 9:04 pm

    థాంక్స్ శ్రీనివాస్ గారు.

    మీరు “joy of discovery” అంటే నాకీ Claudius Ptolemy (100-160s/170s) ఉవాచ గుర్తొచ్చింది:

    “I know that I am mortal and the creature of a day; but when I search out the massed wheeling circles of the stars, my feet no longer touch the earth, but, side by side with Zeus himself, I take my fill of ambrosia, the food of the gods.”

    నా అనువాదం:

    “నేనీ భూమ్మీద ఇవాళ ఉండి రేపు వెళ్ళే వాడనని తెలుసు; కాని, నేను నక్షత్ర వృత్త రాశిని పరిశోధించేటప్పుడు నా కాళ్ళు నేల మీద నిలవవు; విష్ణువు ప్రక్కనే కూర్చొని తనివితీరా అమృతం త్రాగుతాను.”

    కొడవళ్ళ హనుమంతరావు

  7. కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/09/2025 1:23 pm

    ఓపిగ్గా చదివి, విపులంగా వ్యాఖ్యానించినందుకు రంగారావుకి థాంక్స్. కంప్యూటర్ చిప్ కీ అయస్కాంతానికీ ఏమిటి సంబంధం? సరయిన ప్రశ్నే. చిప్ గురించి చెప్పడానికి గ్రీకుల దాకా పోవాలా? అన్న సందేహం ఇతరులకూ వచ్చి ఉండొచ్చు. ఈ వ్యాసాలు రాయడానికున్న నేపథ్యమే వీటికి సమాధానం:

    పోయినేడు చిప్ డిజైన్ మీద విశేష కృషి చేసిన ఓ కంప్యూటర్ సైంటిస్ట్ చనిపోతే తన మీద తెలుగులో నివాళి రాద్దామనుకున్నాను. చిప్ గురించి చెపాలంటే ట్రాన్సిస్టర్ అంటే ఏమిటో వివరించాలి. ట్రాన్సిస్టర్ కి ముందర కంప్యూటర్ లో ఏమి వాడారు? శూన్యపు గొట్టం (vacuum tube). అదెలా వాడుకలోకి వచ్చింది? రేడియో ద్వారా. రేడియోకి ఆధారం? విద్యుదయస్కాంత తరంగాలు. విద్యుత్తు అంటే ఏమిటి? దానికీ అయస్కాంతానికీ ఏమి సంబంధం? దానిని ఎవరు ఎలా కనుగొన్నారు?

    కొన్ని పదార్థాలు విద్యుద్వాహకాలు (conductors), మరికొన్ని విద్యుద్బంధకాలు (insulators); అటూ ఇటూ కానివి అర్ధవాహకాలు (semi-conductors); చిప్ తయారుచేసేది అర్ధవాహకాల తోనే. ఈ పదార్థాల మధ్యనున్న భేదాలని తెలిపేది అణుశాస్త్రం.

    ఇలా ఆలోచించగా, ఒక వ్యాసం కాదు, సైన్సులోని అనేక ముఖ్యభాగాలని స్పృశిస్తూ, సైన్సు చరిత్ర పై ఓ వ్యాస పరంపర రాయొచ్చు అనిపించింది. దాంట్లో సైంటిస్టుల జీవితం కొంత, వారి కాలంలో కల మేధో వాతావరణం కొంత, ఉండటం ఉచితమే.

    రాయగలనా లేదా అన్న సందేహం, పూర్తి చెయ్యలేనేమోనన్న భయం నన్ను కొన్ని నెలల పాటు వెంటాడాయి; పైపెచ్చు నా “కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు” అన్న పరంపర ఇంకా అసంపూర్తిగానే ఉంది. అయినా చేపట్టాను; మీ ప్రోత్సాహంతో కొనసాగిస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:

    05/05/2025 11:03 am

    కొడవళ్ల హనుమంతరావు గారు రాసిన అయస్కాంత వ్యాసం ఆసక్తికరంగా వున్నది. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఆకర్షణ శక్తికి ఒక ప్రముఖమైన స్తానం వున్నది. మనకి దిక్కులు చూయించేది అయస్కాంతమేకదా. ఈ విషయం మీద పురాతన కాలం నుంచి మనిషి చేసిన ఆలోచనలు, శతాబ్దాల కాలగమనంలో ఆ ఆలోచనల్లో వచ్చిన మార్పులు, పరిశోధనలు జరిపిన మీదట ఆలోచనలో వచ్చిన మెచ్యూరిటీ ని విపులంగా వివరించారు రచయిత. సైన్స్ సాహిత్యం అంతా ఆంగ్లంలో వున్న తరుణంలో, సరళమైన తెలుగు విషయాన్ని సామాన్య మనిషికి అర్థం అయ్యేలా రాయటం తేలికైన విషయం కాదు. భాష మీద పట్టు వుండాలి. ముఖ్యంగా సైన్సు ను హ్యూమన్ యాంగిల్ లో చెప్పడం ముదావహం. సామాజిక స్పృహతో సబ్జెక్ట్ ను తాకిన విధానం బాగుంది. అయితే, కంప్యూటర్ తయారీ లో గానీ, చిప్ తయారీలో గానీ అయస్కాంతం యొక్క పాత్ర ను క్లుప్తంగా అయినా వ్యాసం మొదట్లో introductory para ఒకటి వుంటే it would have created a context conducive for comprehending the content అనిపించింది. Otherwise, the essay made an interesting reading in developing a basic understanding of a vital part of physics.

  9. కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:

    05/05/2025 6:59 am

    హనుమంతరావు గారు ఆకర్షణ శక్తిమీద రాసిన వ్యాసం ఆసక్తికరంగా వుంది. భౌతికశాస్త్రం అభివృద్ధిలో ఆకర్షణ అనే అంశం కీలకపాత్ర పోషించింది అన్న విషయం చదువుకున్న వారికి కాస్తో కూస్తో తెలుసు. అయితే, సైన్స్ బ్యాగ్రౌండ్ లేని నేను రెండుసార్లు చదివాల్సి వచ్చింది విషయాన్ని అర్థం చేసుకోవటానికి. వ్యాసాన్ని లోతైన పరిశోధన చేసి రాసినట్లు అర్థం అయింది; ఆది మానవుడి ఆలోచన దగ్గర నుంచి మొదలెట్టటం చూస్తే. ఎంతోమంది శాస్త్రవేత్తల ఆలోచనలను పొందుపరిచారు వ్యాసంలో. అయితే, కంప్యూటర్ చిప్ శీర్షికతో సాగుతున్న వ్యాసంలో కంప్యూటర్ ని గానీ చిప్ ని గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. మైసూరు బజ్జి లో మైసూర్ ని వెతకగూడదు కదా! అలాగే ఈ వ్యాసాల్లో కూడా బహుశా చివరివరకు కంప్యూటర్ లేక చిప్ లాంటి వాటికోసం చూడకూడదేమో! కానీ సైన్స్ బ్యాగ్రౌండ్ లేని నా లాంటి వారి సౌలభ్యం కోసం వ్యాసం మొదట్లోనే కంప్యూటర్ తయారీలో కానీ దాని చిప్ తయారీలో గానీ మనం దైనందిన జీవితంలో వాడే అనేక పరికరాల్లో గానీ అయస్కాంతం పాత్ర గురించి క్లుప్తంగా అయినా ప్రస్తావించితే బాగుండేది అనిపించింది. క్రితం వ్యాసంలో కూడా చెప్పలేదు, కానీ బల్బు లేనిదే బతుకు లేదుగనక బల్బు తో కనెక్ట్ అవ్వడం కష్టం కాలేదు. కానీ అయస్కాంతం సామాన్య మనిషి కంటికి కనిపించేదికాదు; వస్తువులలో దాగి వుంటుంది గనక సగటు మనిషికి దాని ప్రాముఖ్యత ఇట్టే అర్థం కాదు. కాస్త పరిచయం చేస్తే తప్ప. ఏదేమైనా, శాస్త్రపరిగ్ఞానాన్ని సామాజిక కోణంలో, సరళమైన భాషలో, హ్యూమన్ యాంగిల్ ని జతచేసి, వ్యాసాలు రాయాలన్న ఆయన ఆలోచన అభినందనీయం. ఈ వ్యాసాల నేరేటివ్ చూస్తుంటే ‘A Cultural History of Physics by Karoly Simonyi’ హనుమంతరావు గారిని ప్రభావితం చేసింది అనిపిస్తుంది! ఫిజిక్స్ భయాన్ని కలిగించే సబ్జెక్టు. దానిలోని ముఖ్యమైన అంశాలను సరళమైన భాషలో, హ్యూమన్ యాంగిల్ లో, అందులోనూ తెలుగులో, చెప్పాలన్న ఆలోచన ముదావహం. మనం taken for granted గా అనుభవించే శాస్త్ర పరిశోధనా ఫలాల వెనక శాస్త్రవేత్తలు చేసిన అవిరళ కృషిని, వ్యక్తిగతంగా వారి జయాపజయాలను పెద్దగా పట్టించుకోము. ఆ అంశాలన్నింటినీ సృజించుతూ సాగుతున్న ఈ వ్యాసాంగం తెలుగులో ఒక మైలురాయిగా నిలవాలని, ఇది పుస్తక రూపంలో వచ్చి ఎక్కువ మంది చేతుల్లో వుండాలని తద్వారా శాస్త్రీయ దృక్పథం పెంపొందాలని ఒక పాఠకుడిగా ఆకాంక్షిస్తున్నాను.

  10. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:

    04/30/2025 10:18 pm

    అద్భుతమైన వ్యాసం అందించారు, హనుమంతరావు గారూ! ఈ పరంపరలో తదుపరి వ్యాసాల కోసం అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఈమాట సంపాదకులకి ధన్యవాదాలు.