పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    10/08/2025 12:31 am

    ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నండూరి “విశ్వరూపం,” “నరావతారం,” రచనలకి ప్రేరకులు, కారకులు, అప్పటి “ఆంధ్రజ్యోతి” సంపాదకులు నార్ల. వాటికి నండూరితో పాటు కొడవటిగంటి, నార్ల, రాసిన ముందుమాటలు చదివితే ఈ ముగ్గురూ తెలుగువాళ్ళలో వైజ్ఞానిక దృక్పథం పెంచాలని ఎంత తపన పడ్డారో విశదమవుతుంది. మరి అవి వెలువడిన యాభై ఏళ్ల తర్వాత ఏమాత్రం ప్రగతి సాధించాం?

    శ్రీనివాస్ గారూ, “వివిక్త” కోసం ఆంధ్రభారతిని సంప్రదించాను; సంతసించాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:

    10/07/2025 12:42 pm

    చాలా సంవత్సరాల క్రితం నండూరి రామమోహనరావు గారు ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు నరావతారం, విశ్వరూపం అనే గొప్ప గ్రంధాలను సీరియల్ గా ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రతి వారం ప్రచురించారు. ఆ రచనా పరంపర కొనసాగినప్పుడు జ్యోతి వార పత్రిక కోసం జనం ఎదురు చూసేవారు. సామాన్య పాఠకులకు అర్థం అయ్యేలా మనిషి ఆలోచనలను, మేధస్సును ప్రభావితం చేసిన తత్వవేత్తలను తెలుగు వారికి పరిచయం చేసిన అద్భుత ప్రక్రియ. విశ్వరూపం అనేది ఖగోళశాస్త్రం గురించి అనుకుంటా. విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఏ యుగంలో ఏ విధంగా పరిణామం చెందింది అనేది సరళమైన భాషలో చెప్పారు. హనుమంతరావు గారి వ్యాస పరంపర చూస్తుంటే నాకు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సమగ్ర సమాచారం, లోతైన విశ్లేషణలతో కూడుకున్న ఈ వ్యాసాలు పుస్తక రూపం దాల్చాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వ్యాసాలు హైస్కూలు లో సైన్స్‌గా బోధించే ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గ్రామాల్లో కరెంటు లేని కాలంలో పుట్టిన నాకు చీకటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. స్విచ్ వేస్తే లైటు వెలిగే దశ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కరెంటు అంటే ఏమిటో తెలియని రోజుల్లో జీవితం ఎలా ఉండేది అనేది ఆ అనుభవాన్ని చూసిన వాళ్లకే తెలుస్తుంది. నేను ఆ అనుభవాలను ఇక్కడ నెమరు వేసుకోవాలని మనసు వువ్విళూరుతున్నది. ధన్యవాదములు.

  3. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    10/02/2025 8:21 pm

    శ్రీనివాస్ గారు, మీ ప్రోత్సాహనికి ధన్యవాదాలు. జిమ్ గ్రే తరం వారిలో ఇద్దరు ముగ్గురు తప్ప, అందరూ ఉద్యోగం నుండో, లోకం నుండో విరమించినట్లే. వారు మొదలెట్టిన సైన్సు విజయవంతంగా సాగుతున్నా, అకాలంలో అదృశ్యమైన వారి స్మరణ అశ్రువులు రాల్పిస్తుంది:

    The boat tilts frozen on the storm’s wild wave.
    The concert has halted between two notes.
    An interregnum, sufficiently extended,
    becomes an absence. When wise
    and kindly men die, who will restore
    disappeared excellence to its throne?
    — From “Stolen,” by John Updike.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. బైరాగి సూతాశ్రమం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/09/2025 8:54 pm

    రాణి గారి వ్యాసం నుండి:

    హేతువులోని నిశితత్వాన్ని మాత్రమే కాకుండా దాని వక్రత్వాన్ని ఆర్ద్రత లేనితనాన్ని కూడా ఆయన పసిగట్టాడు. … బైరాగి తన మిత్రుల సన్నిధిలో త్రిపురనేని రామస్వామి చౌదరిని తీవ్రంగా విమర్శించినట్లు రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు రాశారు. ఈ విమర్శ బైరాగికి … హేతువాదం పట్ల కూడా తీవ్ర సందేహాలు ఉండడాన్ని స్పష్టం చేస్తుంది. అందుకే, “సూతాశ్రమం” అనే కవితలో బైరాగి హేతువాదాన్ని “వంకర కత్తి” అన్నాడు.

    “సూతాశ్రమం” కవితలోని “వంకర” తనానికి రాణి గారు ఇచ్చిన అర్థంలో కొంతయినా పొరబాటు ఉందని నా విశ్వాసం. కనీసం దానికి మరికాస్త వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

    రత్నా టాకీస్ దగ్గర బైరాగి విమర్శించింది కుల నిర్మూలనం ప్రబోధిస్తూ కూడా దానిని ప్రోపు చేసే మేధావులని, హేతువాదాన్ని కాదు. “సూతాశ్రమం” కవిత నిండా తార్కికబుద్ధి మార్గాన్ని కొనియాడాడు:

    సూతాశ్రమ సశ్రమాధ్వం అందరికొరకు కాదు.
    శుభ్ర విద్యుత్ కాంతిలో శస్త్రకారుని శస్త్రం నవ్విన అందం
    స్వస్థ శ్వాసలాగ, ఎర్రని మూసలోన పారే లోహపు అందం
    కనుచూపుల కనుమ దాటి, మింటిని ఒంటరిగా
    పయనించే ఇనుపడేగ తెల్లని రెక్కల అందం.

    ఆర్ద్రత లేకపోవడాన్ని కూడా స్పృశించాడు:

    సహారా ఎడారిలోన పవలు కురిసే సూర్యుని తప్త హేమజ్వాల
    రేయి కురిసే తారకల ప్రఖర ప్రోజ్వల హైమజ్వాల.

    ఇసుకను చూచి బెదరే రసికులకు

    వారికేమి తెలుసు, ఇసుకలోనే దాగి ఉంది.
    మానవాత్మల మహాతీర్థం.

    మరి ఇంతటి అందాన్ని వంకరకత్తి అని బైరాగి ఎందుకన్నాడు? దానికి సమాధానం కూడా కవితలోనే ఉంది:
    డీను స్విఫ్ట్, ఆనటోల్ ఫ్రాన్సుల వంకర వ్యంగపుటందం
    అందరికీ కాదు.

    డీను స్విఫ్ట్ అంటే జానథన్ స్విఫ్ట్ (1667-1745). శుద్ధ హేతువాదాన్ని అనేక వ్యంగ్య (satire) రచనలలో విమర్శించాడు. “A Modest Proposal” లో పేదవాళ్ళు ఆర్థిక బాధలనుండి బయటపడటానికి తమ బిడ్డలని ఉన్నత వర్గాల ప్రజలకు అమ్ముకోవచ్చంటాడు. (రాయల్ సొసైటీ ఆధ్వర్యాన జరుగుతున్న సైన్సు ప్రయోగాల మూలంగా ప్రజలకు ఒరిగిందేమీ లేదని కూడా ఎద్దేవా చేశాడు.)

    మరో రెండు వందల ఏళ్ళ తర్వాత ఆనటోల్ ఫ్రాన్స్ (1844-1924) నిందాస్తుతి (irony) తో శుద్ధ తర్కాన్ని విమర్శించాడు. ఆయన ప్రఖ్యాత ఉల్లేఖనం:

    “ఉత్కృష్టమైన ధర్మశాసనం ప్రకారం సంపన్నులకూ దరిద్రులకూ సమానంగా ఒకే న్యాయం: వంతెనల కింద పడుకోకూడదు, వీధుల్లో యాచించకూడదు, అన్నం దొంగలించకూడదు.”

    స్విఫ్ట్, ఫ్రాన్స్ శుద్ధ తర్కానికి మానవత్వాన్ని జోడించాలని తమ వ్యంగ్య రచనల ద్వారా చెప్పారు. ఆ వ్యంగాన్ని బైరాగి వంకరకత్తితో పోల్చాడు. అదే సూతాశ్రమ మార్గం అంటుందీ కవిత.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. కవన మర్మయోగి బైరాగి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/08/2025 9:34 pm

    పాపినేని గారిది విలువైన వ్యాసం. అనేక పాత కొత్త రచనలతో, విస్తృత స్థాయిలో బైరాగి స్మరణ సంచికని అందించిన సంపాదకులకి ధన్యవాదాలు.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. అదే ఆకాశం — ఒక సమీక్ష గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/01/2025 5:12 pm

    In here, the first “when” is chronological. The second and third cases, “when” is used as causation. So, that translation tracks well.

    రామారావు గారి విభేదంతో విభేదిస్తున్నాను. మొదటి “When” కాలసూచకమే (chronological) కావచ్చు కానీ, అది కారణం (cause) కూడానూ. ప్రతి పాదం “When”తో మొదలవ్వటం వల్ల వచ్చిన భావలయ అనువాదంలో రాలేదన్న హనుమంతరావుగారి అభిప్రాయమే నాది కూడానూ. నిజానికి Wisława Szymborska పోలిష్ భాషలో రాసిన మూలంలో కూడా ప్రతి పాదం Kiedy (=when) అన్న పదంతోనే ప్రారంభమౌతుంది, చూడండి:

    Kiedy wymawiam słowo Przyszłość,
    pierwsza sylaba odchodzi już do przeszłości.

    Kiedy wymawiam słowo Cisza,
    niszczę ją.

    Kiedy wymawiam słowo Nic,
    stwarzam coś, co nie mieści się w żadnym niebycie.

    ఇక్కడ ఆంగ్లంలో కూడా కనిపించని చమత్కారం ఏమిటంటే, భవిష్యత్తుకు పోలిష్‌లో పదం Przyszłość. భూతకాలానికి పదం Przeszłość. భవిష్యత్తు అనడానికి Przy- అని ఒక్క క్షణం ఆగితే, అది భూతకాలానికి సమానార్థకమైన పదంలా వినిపిస్తుంది. అది ఆంగ్లంలో తీసుకురావడం కష్టం.

    కానీ తెలుగులో చిత్రంగా ఈ రకమైన శబ్దసామ్యం ఉండే పదాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తట్టింది: ముందు, మున్ను. తెలుగులో ముందు అన్నది భవిష్యత్తుకు వాడితే, మున్ను, మునుపు మొదలైనవి భూతకాలానికి వాడుతారు. ముందు-ముందు అని భవిష్యత్తు గురించి మాట్లాడడానికి మొదలు పెట్టి మున్- అనగానే అది మునుపటి కాలానికి వెళ్ళిపోతుంది.

    మరో విషయం: హనుమంతరావుగారు “చివరి పాదం మూలంలో కన్నా తెలుగులోనే బావుంది.” అన్నారు కానీ, నాకు ఆ చివరి పాదం అనువాదం ఆంగ్లంలోనూ, తెలుగులోనూ తృప్తికరంగా లేదనిపించింది. చివరిపాదమే ఈ కవితకు ప్రాణం. మనవాళ్ళు మాట్లాడిన సత్, అసత్ సంశయమే (సదసద్సంశయమే) ఈ కవితలో కూడా వినిపించేది: the existence of the concept of non-existence. ఆవిడ భాషచేసే గారడీల గురించి చెబుతూ, లేనివిషయమైన అసత్- (non-existence) గురించి మాట్లాడటం వల్ల అది సత్తు-గా (existence) మారిపోయింది అని.

    పోలిష్ మూలకవితను ఈ వీడియోలో వినవచ్చు:
    https://www.youtube.com/watch?v=mRoaKvZ2zbo

  7. అదే ఆకాశం — ఒక సమీక్ష గురించి Vasu అభిప్రాయం:

    08/20/2025 1:08 am

    హనుమంతరావుగారూ,

    మీరు ఎంతో లోతుగా అనువాదాలూ మూలాలూ చదివి రాసిన ఈ విమర్శ ఎంతో బాగుంది. మీ వంటి వారు ఇంకా రాయాలి.

    -వాసు-

  8. కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:

    08/06/2025 12:15 pm

    ఈ వ్యాసంలో బ్యాటరీ గురించి చదివినప్పుడు నేను యాభై ఏళ్లు వెనక్కి వెళ్ళాను. అది 1970 కి ముందు కాలం. అప్పటికి మన గ్రామాలకు విద్యుత్ రాలేదు. అయినా విద్యుత్ తో నడిచే పరికరాలు గ్రామాలకు వచ్చేవి. ఉదాహరణకు రేడియో. అప్పట్లో డబ్బా టీవీ అంత సైజు వుండేది రేడియో. టీవీలాగే అటు ఇటు కదిలించటానికి వీలులేకుండా ఒకేచోట స్థిరంగా వుండేది రేడియో. అది బ్యాటరీ మీద నడిచేది. దాని బ్యాటరీ సైజు కూడా వేరుగా వుండేది. పెళ్లిళ్లప్పుడు మైకు పెట్టేవారు. గ్రామఫోన్ రికార్డు ద్వారా ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని హిట్ పాటలు వేసేవారు. అది కూడా బ్యాటరీ మీదే నడిచేది. కొందరి ఇళ్లలో బ్యాటరీ లైట్ వుండేది. టార్చ్ లైట్ కి అది మరో పేరు. డి సైజ్ బ్యాటరీలు నాలుగు లేక ఆరుటితో వెలిగేటంతటి పెద్దపెద్ద టార్చ్ లేట్లు వుండేవి. రేడియో స్థానంలో ట్రాన్సిస్టర్ వచ్చాక డి సైజు బ్యాటరీలు రెండిటితో నడిచేవి బుష్, మర్ఫి, ఫిలిప్స్ కంపెనీల ట్రాన్స్సిస్టర్లు. వాటిని కూడా సామాన్య జనం రేడియో అనే పిలిచేవారు. ట్రాన్స్సిస్టర్ అనటం చాలా మందికి కష్టం కదా. ఆ రోజుల్లో బ్యాటరీ మరియు కిరోసిన్ అనేవి జీవితంలో విడదీయరాని వస్తువులుగా వుండేవి. బ్యాటరీ పని అయిపోతే టార్చ్ లైట్ లైట్ గా వెలిగేది. రేడియోలో మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. పని అయిపోయిన బ్యాటరీని తీసివెయ్యకపోతే వస్తువులు పాడయ్యేవి. అవి ప్రమాదకరమైనవని నయ్యిదిబ్బలో పారేసేవాళ్లు. ఆరోజుల్లో ఏ2, ఏ3,ఏ4 బ్యాటరీలు లేవు. అంతటా డి సైజే!

    విద్యుత్తు గ్రామాల్లోకి వచ్చాక బ్యాటరీ ప్రమేయం బాగా తగ్గిపోయింది చాలా కాలం. ఆ తర్వాత క్వాడ్జ్ గోడగడియారాలు బ్యాటరీతో నడిచేవి వచ్చాక మళ్లీ బ్యాటరీ తెరమీదకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏఏ, ఏఏఏ బ్యాటరీలు లేనిదే రోజులు ముందుకు సాగవు. గోడగడియారంలో ఏఏ, టీవీ ఏసీ రిమోట్ లో ఏఏఏ సైజు బ్యాటరీలు తప్పనిసరి. సెల్ ఫోన్ వచ్చాక లో బ్యాటరీ అనేది ఊతపదం అయ్యింది. 2000 సంవత్సరం ప్రాంతంలో విద్యుత్ కోత అధికంగా వుండటం వలన ఇన్వర్టర్ అనే పరికరం మార్కెట్లోకి వచ్చింది. పెద్ద బ్యాటరీలో విద్యుత్ ని స్టోర్ చేసి పవర్ కట్ అయినప్పుడు ఇన్వర్టర్ ద్వారా పరిమితంగా లైట్లు, పంఖాలు పనిచేసేవి. ఆ బ్యాటరీలోకి డిస్టిల్డ్ నీరు పోస్తూవుండాలి నెలకో రెండు నెలలకో.

    నేడు కరెంటు కోత అంతగా లేకపోయినా, కరెంటు ఎప్పుడు పోతుందో చెప్పలేం. అందువలన చాలామంది ఇళ్లలో ఇన్వర్టర్ లు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి వారు ఇన్వర్టర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని గమనించటం అలవాటు అయింది. బ్యాటరీ మీద వుండే పుల్లలో ఎరుపు రంగు కిందకు దిగింది అంటే బ్యాటరీ కి దాహం అయ్యిందని అర్ధం. డిస్టిల్డ్ వాటరు నాలుగైదు సీసాలు ప్రతి ఇంట్లో వుంటున్నాయి ఇటీవలి కాలంలో. హనుమంతరావు గారి వ్యాసంలో బ్యాటరీ గురించి చదువుతుంటే యాభై సంవత్సరాల క్రితం రోజులు మదిలో మెదిలినవి. స్విచ్ స్టేజ్ లో మరికొన్ని మరిచిపోయిన, మరికొన్ని మరిచిపోలేని స్మృతులు మదిలో మెదలటానికి వెంపర్లాడుతున్నవి. అవి ఒక ట్రిగ్గర్ కోసం వేచిచూస్తున్నవి. అదే తీగద్వారా ఇంటికి సరఫరా అయ్యే కరెంటు!

    జ్ఞాపకాలను యాభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినందుకు హనుమంతరావు గారికి ధన్యవాదములు.

  9. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/12/2025 12:33 am

    సవరించినందుకు దంతుర్తి గారికి కృతజ్ఞతలు. “నెవార్క్” పొరబాటే. “1752 జూన్ నెల వానా కాలం” బదులు “1752 జూన్ నెల; ఉరుములతో కూడిన జల్లులు పడే ఎండాకాలం” అనాల్సింది. సైన్సు చరిత్రకు సంబంధించిన వ్యాసం కనుక దీని గురించి మరికాస్త వివరణ:

    కారణమేమోగాని గాలిపటం ప్రయోగం గురించి ఫ్రాంక్లిన్ పూర్తి వివరాలు ఇవ్వలేదు. కొడుకూ, తనూ మాత్రమే సాక్ష్యం. కొడుకు దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఫ్రాంక్లిన్ కూడా కొన్ని నెలల మౌనం తర్వాత, 1752 అక్టోబరులో గజెట్ పత్రికలో ఓ చిన్న ప్రకటన ఇచ్చి, దానినే రాయల్ సొసైటీకి తెలపమని కాలిన్సన్‎ని కోరాడు. నేనిచ్చిన కథనం, పదిహేనేళ్ళ తర్వాత, 1767 లో జోసెఫ్ ప్రీస్ట్లీ రాసిన History of Electricity లోనిది (https://founders.archives.gov/documents/Franklin/01-04-02-0135). అసలా చరిత్ర రాయమని ప్రీస్ట్లీని కోరింది ఫ్రాంక్లినే. ప్రీస్ట్లీకి ఫ్రాంక్లిన్ స్వయంగా చెప్పి ఉండాలి.

    కొడవళ్ళ హనుమంతరావు

  10. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/02/2025 10:11 pm

    వి. శ్రీనివాసరావు గారికి,

    మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. లింకన్-జామెట్రీ మీద చిన్న వ్యాసం రాయడం ఇప్పట్లో కుదరదు కాని ఈ పెద్ద వ్యాఖ్య ఉపయోగపడుతుందని ఆశిస్తాను.

    ముందుగా, లింకన్ చదివింది యూక్లిడియన్ జామెట్రీ, కోఆర్డినేట్ (అనలిటిక్) జామెట్రీ కాదు. మొదటిది హైస్కూలులో, రెండోది కాలేజీలో చదువుతామని గుర్తు. సరళ, వక్ర, వృత్త రేఖలని బీజగణిత సమీకరణలద్వారా సూచించి సాధించేది అనలిటిక్ జామెట్రీ. దానిని ఫ్రెంచి తత్వవేత్త Descartes (1596-1650) కనిపెట్టాడు. అతని ప్రఖ్యాత ప్రవచనం: “I think, therefore I am.” పదిహేడో శతాబ్దపు శాస్త్రీయ విప్లవానికి Descartes, Francis Bacon ల తాత్విక రచనలు దోహదం చేశాయి.

    యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ కి చెందిన గణిత ప్రొఫెసర్ జోర్డాన్ ఎల్లెన్‎బెర్గ్ రాసిన జనరంజకమైన “Shape” [1] లోని మొదటి అధ్యాయం, “I Vote for Euclid,” ఇలా మొదలవుతుంది:

    In 1864, the Reverend J. P. Gulliver, of Norwich, Connecticut, recalled a conversation with Abraham Lincoln about how the president had acquired his famously persuasive rhetorical skill. The source, Lincoln said, was geometry. In the course of my law-reading I constantly came upon the word demonstrate. I thought, at first, that I understood its meaning, but soon became satisfied that I did not. . . . I consulted Webster’s Dictionary. That told of “certain proof,” “proof beyond the possibility of doubt;” but I could form no idea what sort of proof that was. I thought a great many things were proved beyond a possibility of doubt, without recourse to any such extraordinary process of reasoning as I understood “demonstration” to be. I consulted all the dictionaries and books of reference I could find, but with no better results. You might as well have defined blue to a blind man. At last I said, “Lincoln, you can never make a lawyer if you do not understand what demonstrate means;” and I left my situation in Springfield, went home to my father’s house, and staid there till I could give any propositions in the six books of Euclid at sight. I then found out what “demonstrate” means, and went back to my law studies.

    ఆ అధ్యాయంలో దీనికి సంబంధించి మీకు పనికొచ్చే విషయాలు ఉన్నాయి.

    స్టీవెన్ స్పీల్‎బెర్గ్ సినిమా, “లింకన్” (2012) లో, బానిసత్వాన్ని రద్దుచేసే రాజ్యాంగపు 13వ సవరణని సమర్థించే సందర్భంలో, లింకన్ తెల్లవారు ఝామున ఇద్దరు కుర్రవాళ్ళతో చేసిన సంభాషణ చూడండి: https://www.youtube.com/watch?v=M-m0I4H8nB4.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] Ellenberg, Jordan. Shape: The Hidden Geometry of Information, Biology, Strategy, Democracy, and Everything Else. Penguin Books. 2021.