పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/01/2009 6:42 am

    మంచి వ్యాసం. మరికొన్ని ముచ్చట్లు.

    రాజా పచ్చయప్ప కాలేజిలో చదువుతూండగా పాటల పోటీలో ఘంటసాల, భానుమతి లైలామజ్నూలో పాడిన చెలునిగని అనే పాట పాడి మొదటి బహుమతి పొందాడట. న్యాయనిర్ణేతగా ఘంటసాలే వచ్చారట.

    రాజా గురించి తన ఒక వ్యాసంలో పి.బి.శ్రీనివాస్ ఆసక్తికరమైన విషయాలు రాశారు.

    విప్రనారాయణ తీసే రోజుల్లో ఘంటసాలకు చుట్ట కాల్చే అలవాటుండేదట. అప్పట్లో యుగళగీతాలకు ఒకే మైక్ వాడేవారు కనక ఆ వాసన పడని భానుమతి ఘంటసాలతో పాడనని అన్నదట. అది రాజాకు వరప్రసాదం అయింది.

    అలాగే విజయావారు చంద్రహారం టైములో సినీనిర్మాణంలో అనేక డిపార్ట్మెంట్లు మొదలుపెట్టి నెల జీతాలు ఏర్పాటు చేశారట. ఉదాహరణకు కళాదర్శకుడు గోఖలే. అందులో వడ్రంగుల దగ్గర్నుంచీ అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలూ, నెల జీతాలూ. అలాగే సంగీతానికి ఘంటసాల. అయితే నిబంధన ఏమిటంటే వీళ్ళెవ్వరూ మరే సంస్థకూ పనిచెయ్యకూడదు. అప్పటికే అగ్రహీరోలిద్దరూ ఘంటసాల పాడకపోతే నటించము అని చెప్పే స్థితికి చేరుకున్నారట. ఇది గమనించిన ఘంటసాల విజయావారిని ఒక పెద్ద మొత్తం ఇమ్మని అడిగారట. అది సమ్మతం కాకపోవడంతో విజయావారు ఆయనను తమ ‘ఆస్థాన విద్వాంసుడి’ స్థానం నుంచి తొలగించి, మిస్సమ్మకు రాజేశ్వరరావును పెట్టుకున్నారట. ఇక పాడడానికి ఘంటసాలను పిలవడం ఇబ్బంది అవుతుందని రాజాను పిలిచారట. ఆ పాటలు సాధించిన విజయం రాజేశ్వరరావు ప్రతిభకూ, రాజా కంఠానికీ కూడా మంచి నిదర్శనం.

    కల్యాణ పరిశు విజయం తరవాత రాజాకు అహం పెరిగి, ఎక్కువ పారితోషికం అడగడం మొదలుపెట్టాడనీ, ఆ కారణంగా అతనికి అవకాశాలు తగ్గాయనీ అప్పట్లో మేము మద్రాసులో విన్నాం. శ్రీధర్ తీసిన తేన్ నిలవు సినిమాపాటలు కూడా బాగా జనాదరణ పొందాయి. కల్యాణపరిశు విజయం తలకెక్కిన హాస్యనటుడు తంగవేలు కూడా శివాజీ గణేశన్ తో సమానంగా పారితోషికం అడగనారంభించాడనీ, దానితో అతన్ని పక్కన పెట్టారనీ విన్నాం.

    అమరసందేశం సినిమాకు సంగీతాన్నిచ్చినది మా గురువుగారు ఎల్.ఆర్. కేళ్కర్. ఆయన మరాఠీవాడు కనక ఆయనకు తెలియకుండా ఆయనకు అసిస్టెంటుగా పనిచేసిన ప్రసాదరావు పేరు వేశారట (తెలుగు పేరు కదా అని). ఆ తరవాత ఆ సంగతి తెలిసి కేళ్కర్ గారు సినిమావాళ్ళని శాపనార్థాలు పెట్టి, సంగీతం టీచరుగా మాత్రమే మద్రాసులో కొనసాగారు. సినిమా ఫ్లాప్ అయింది. బైజూ బావ్రాలాగా పోటీ పాట పెట్టారుగాని రాజాకు అంతటి పటిమ లేదు. రఘునాథ్ పాణిగ్రాహితో పోటీ పాట మానస లాలస సంగీతం.

    రాజా కాస్త అనుమానం మనిషనీ, దగ్గరున్న రైలుపెట్టెలో ఎక్కకుండా జిక్కీ ఉన్న బోగీనే అందుకోవడానికి ప్రయత్నించి అనవసరంగా దుర్మరణం పాలయాడనీ అన్నారు. 1993లో న్యూయార్క్లో ఒక కార్యక్రమంలో రాజా కుమారుడూ, కోడలూ పాడారుగాని అంత ఇమ్ప్రెసివ్ గా అనిపించలేదు.

  2. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/01/2009 6:01 am

    అక్బర్ ఆస్థానంలో పనిచేసిన అబుల్ ఫజల్ అక్బర్నామా అనే మూడు సంపుటాల చరిత్ర రాశాడు. లియో తల్స్తోయ్ యుద్ధమూ శాంతి అనే తన ప్రసిద్ధ నవలలో తనకు రెండు తరాల ముందు జరిగిన నెపోలియన్ నాటి సంఘటనలను వర్ణించాడు. సురేశ్ గారి ఈ అద్భుతమైన వ్యాసం వాటిని మించుతుంది. సమకాలీన చరిత్రను నమోదు చెయ్యడంలోని లాభాలన్నీ ఈ రచనలో కనిపిస్తాయి.

    ఈ వ్యాసం చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనసులో మెదిలాయి. జర్నలిజంలోనూ, సినిమాల నిర్మాణంలోనూ ఇలా ఏ రంగంలోనైనా మొదట కృషి చేసినవారంతా మేధావుల్లా అనిపిస్తారు. కొత్త పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, తమ శక్తులని వినియోగించే ప్రయత్నాలు చేస్తారు. వారి కృషి ఫలితంగా ఆ పరిజ్ఞానం అందరికీ సులువుగా ఉపయోగపడుతుంది. ఇక ఆ తరవాత మజ్జిగ పలచనవడం ప్రారంభిస్తుంది! తాటాకులూ, గంటాల రోజుల్లో అపూర్వమైన సాహిత్యాన్ని సృష్టించగలిగినవారే రచనలకు పూనుకునేవారు. ఆరణాల కలాలు అందుబాటులోకి వచ్చాక రచయితల సంఖ్య పెరిగిపోతుంది. మళ్ళీ వారిలో ‘పుణ్యపురుషులు’ ఎవరో తేల్చుకోవటానికి సమయం పడుతుంది.

    ఈ వ్యాసంలో వర్ణించిన సంఘటనల క్రమం, కొందరి పేర్లూ అన్నీ భవిష్యత్తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. టెక్నాలజీతోనూ, తెలుగుభాషతోనూ, సాహిత్యంతోనూ సాన్నిహిత్యం ఉన్న సురేశ్ వంటి వ్యక్తులు ఎంత అరుదో వేరే చెప్పనక్కర్లేదు. ఆయన అంతగా చెప్పుకోకపోయినప్పటికీ యూనీకోడ్ వగైరా అంశాలమీద ఆయన చేసిన కృషి చాలా గొప్పది. దాన్ని గురించి ఒక చిన్న వ్యాసాన్నైనా రాయమని నేను ఈమాట సంపాదకులను కోరుతున్నాను. అబుల్ ఫజల్ సంగతి కూడా ఎవరైనా రాయాలి కదా!

  3. ఉత్తర కిష్కింధ (నాటిక) గురించి M.S.Prasad అభిప్రాయం:

    05/01/2009 3:47 am

    అయ్యా! ఈ మాటలో రామాయణ విషవృక్షం కూడా ప్రచురిస్తారా? అది కూడా చాలా చోట్ల అమితంగా హాస్య రసాన్ని ఒలికించి పాఠకుల్ని నవ్విస్తుంది. గతితార్కిక భౌతిక వాదంతో (దీని అర్థం నాకంతగా తెలియదిప్పుడు) కూడిన రచయిత్రి విమర్శలు ఆలోచింపజేస్తాయి. ఏమైనా వీటిద్వారా చెప్పదలచుకున్న విషయం నచ్చింది.
    ఐనా మనం ఏదైనా చెప్పదలుచుకుంటె దానికి ఎక్కువమంది ప్రజలు హృదయంలో నిలిపి అమిత భక్తితో ఆరాధించే పురాణపాత్రలను అపహాస్యం చేయడం యుక్తమైన మార్గమేనా? దయచేసి ఇటువంటివి ప్రచురించి కొందరిని దూరం/విముఖం చేసుకోరాదని విన్నపం. శ్రీరామాదులు ఐతిహాసిక పురుషులవునో కాదో చెప్పలేముకానీ, జగతి సుగుణ రాశి జడగట్టి ముడివెట్టి
    మలచి నట్టి దివ్య మనుజ మూర్తి గా కొందరి భావనలో నిలిచిఉన్నాడు గదా.

  4. “అంటరాని వసంతం” నవల గురించి దుప్పల రవికుమార్ అభిప్రాయం:

    04/30/2009 9:25 pm

    పుస్తకంలో ఇదే నవలపై రచయిత రాసిన కామెంట్ లోని లింక్ ద్వారా ఇక్కడకొచ్చేను. వ్యాసమ్ చదివాను. ఎంతో సానుభూతితో రాసిన పరిచయం బాగుంది. కాని, నాకనిపించింది ఏమిటంటే మన చూట్టూ మనల్ని నిండా ముంచీసేలా వున్న బ్రామ్మన సాహిత్యం మన మనసులను ఎలా ఆక్రమించిందో చూడండి. ఈ వ్యాసంలొనే ‘పురాణం’, ‘భారత భాగవతాల్ని సూతుడు శౌనకాది మునులకి కూర్చోబెట్టి చెప్పినట్టు’, ‘ఉప్మాలో జీడిపప్పు పలుకుల్లా’ లాంటి మాటలు.. నాకెందుకో ఇక్కడ ఎబ్బెట్టుగా అనిపించాయి. ఎందుకిలా అనిపించిందంటే ఈ నెల “అరుణతార” చదవడం వల్లనా? లేదంటే ప్రస్తుతం బి.ఎస్. రాములుగారి “కన్యాశుల్కంను ఇప్పుడెలా చూడాలి” వ్యాసం చదువుతున్నందుకా? వీరి వ్యాసం నిజానికి నాకు నచ్చింది. గానీ, ఎందుకో పదజాలంలో మరో వాసన కనిపిస్తోంది. ఈ విషయంలో నా ఆలోచనలు అస్పష్టంగానే వున్నాయనుకోండి. అదే ఇక్కడ చెప్పాలనిపించింది. తప్పయితే మన్నించండి.

  5. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/30/2009 2:14 am

    రంగ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మీరు చెప్పింది సమంజసమే అనిపిస్తుంది. శ్రీ నృసింహావిర్భావ ఘట్టంలో పోతన గారి పద్యం గుర్తు చేశారు. నతజన సఖముల్ అనుకుంటాను.
    చింతయామి ఉత్తమ పురుషైక వచనానికి సంబంధించిన క్రియ. యూయం మధ్యమ పురుష బహు వచనం. కాబట్టి ఇక్కడ చింతయామో వయం (చింతయామః వయం = మేము చింతన చేస్తున్నాము) అనే పాఠం గ్రాహ్యం అని అనుకుంటున్నాను.
    మరొక్కసారి కృతజ్ఞతలతో
    భవదీయుడు

  6. శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి hEma vempaTi అభిప్రాయం:

    04/29/2009 2:40 pm

    ఆర్కే గారూ! శ్రీనివాస్ గారూ! మీ అభిప్రాయమే నాకూ వచ్చింది. కాని నా మనసు వ్యతిరేకిస్తున్నా ఇలా రాయడమ్ జరిగింది. ఎందుకంటే, నేటి ప్రపంచం తీరును బట్టి చూస్తే, చాలామంది ఎత్తుకి పై ఎత్తు వేసి గెలవాలని చూసే వాళ్లే కదా! ఈ నాటి “ట్రెండ్”నే కొలికి ముత్యంగా ఉంచడం బాగుంటుందనిపించి అలా వ్రాశా. అలా రాస్తేనే సహజంగా ఉంటుందని మిత్రుల సలహా. ఎంత చెడ్డదైనా, చేతికి చిక్కిన అవకాశం జారవిడుచుకునే వారు చాలా కొద్దిమంది ఈ కాలంలో. ఏది యేమైనా, మీ సలహాకు కృతజ్ఞతలు.
    శ్రీనివాస్ గారూ! ఆలస్యం- అన్న మాటను నేను తప్పుగా వ్రాశాను. కాని ఉద్దేశ్యం – అన్నది తప్పు కాదు. టైపోలను ఇక నుంచీ ఎప్పటికప్పుడు సరిచేస్తాను. తెలుగును ఇంగ్లీషులో వ్రాయడం కొత్తగా నేర్చుకున్నాను. అక్కడక్కడ తప్పులు అనివార్యం ఔతున్నాయి. మన్నించండి.
    నెనరులతో
    వి. హేమ.

  7. పిఠాపురంలో నా మొదటి మజిలీ గురించి Sivaram J అభిప్రాయం:

    04/29/2009 3:31 am

    మీరు రాసిన కథ చాలా బావుంది. చాలా రోజుల తర్వాత పిఠాపురం గురించి చదివి చాలా ఆనందపడ్డాను. ఆ వూరు వదిలేసి 24 ఏళ్ళయింది.

  8. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/28/2009 9:16 pm

    మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా! పదనఖం చింతయామో వయం” అనే పాఠం ఎక్కువ గ్రాహ్యంగా తోస్తోంది. మాత్రలు కూడా సరిపోయి పాడడానికి అనువుగానే వుంది.
    త్ర్యక్షం, చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం – సందేహం తీరింది. నృసింహదేవుడిని ఫాలనేత్రం కలవాడిగా స్తుతించిన వారున్నారు అని తెలిసింది. ఐతే ఎక్కడా చిత్రాలలోగానీ, విగ్రహాలలో గానీ ఫాలనేత్రం నేను చూడలేదు. అందుకని ఈ సందేహం వచ్చింది.
    రంగ గారికి, రమా గారికి, శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. నా సందేహం ఇంకొక్కటి మిగిలే వుంది. దానికి రమ గారు సూచించిన మార్గమే శరణ్యమనుకుంటాను, ఎవరూ తెలుపకపోతే.

    మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు.

    భవదీయుడు.

  9. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి రంగ అభిప్రాయం:

    04/28/2009 4:17 pm

    M.S.Prasad అభిప్రాయం:
    మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా!
    పదనఖం చింతయామి యూయం
    చింతయామి యూయం అర్ధం.

    ప్రసాద్ గారూ,

    నఖస్తుతి మన స్తోత్రాలలో చాలా చోట్ల కనబడుతుంది. ఉదాహరణకు, ‘నఖధీధితి సంచ్ఛన్న నిమజ్జన తమోగుణా’ అని లలితా సహస్రం. కేశాది నఖ పర్యంత స్తుతులు మనకు కనబడతాయి. అందునా అన్నమయ్య అహోబల వైష్ణవుడు. నారసింహ నఖ ధ్యానం సంప్రదాయం. ‘స్ఫురిత విబుధజన ముఖములు, పరివిదళిత దనుజ నివహపతి తను ముఖముల్, గురురుచి జిత శిఖిశిఖములు, నరహరి కరనఖములమరు నతజన సుఖముల్’ అని పోతన.

    ‘పదనఖం చింతయామి యూయం’ అనేది సరైన పాఠమో, కాదో నాకు తెలియదు కానీ ‘యూయం’ అంటే ‘మీరు’ అని అర్థం. త్వం – యువాం -యూయం.

    రంగ

  10. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    04/28/2009 8:19 am

    “మాధవా! కేశవా! మధుసూదనా! విష్ణు! శ్రీధరా! పదనఖం చింతయామి యూయం”
    ఈ సంకీర్తన పల్లవి రేకులోనో పూర్వ ప్రచురిత పాఠాలలోనో సరిగా లేనట్లున్నది. 19986 లో ముద్రించిన “తాళ్ళపాక పద సాహిత్యం – నాలుగవ సంపుటంలో ఇలా ఉన్నది:
    “మాధవ కేశవ మధుసూదన విష్ణు
    శ్రీధరా పద నభం (ఖం?) చింతయామి యూయం (మో వయం?)”
    బ్రాకెట్టులలోని సూచన గౌరిపెద్ది రామ సుబ్బ శర్మగారిదనుకుంటాను.
    పదనఖం చింతయామః వయం అంటే కాలి గోటిని తలచుకుంటున్నాము అని అర్థమా?

    అరుదు అనే మాటకు ఆశ్చర్యము, అపూర్వము అనే అర్థాలు ఉన్నాయి (శబ్ద రత్నాకరం)