పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. దూతవాక్యం – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/05/2026 1:06 pm

    మధ్యమ లాగానే దూత రూపక అనువాదం కూడా చక్కగా ఉంది.

    (‘బడు’ ల వాడకం, “నా కోపమంతా ఎగురగొట్టబడింది,” “తీవ్రమైన గాలిచేత కొట్టబడిన,” బాగుండదు.)

    “ఐశ్వర్యం” లో కథకుడు సూర్యం తన బాబాయి ఇంట్లోని బీరువాలో చిలకమర్తి భాసనాటకాల అనువాదాలని చూసి, ఐదు నిమిషాలు చదివి, ఆశాభంగుడై, కిటుకంతా డాక్టరుగారు చదివి వినిపించడంలో ఉందా అని ఆశ్చర్యపోతాడు. అతిక్లుప్త పరిచయంలో ఆ అనువాదాల ప్రస్తాన ఉంది కానీ మూలాలలో కూడా చేర్చాలి. (https://upload.wikimedia.org/wikipedia/commons/2/25/Bhasuni_bharata_natakamulu.pdf)

    సుదర్శన, గద, ఖడ్గాదుల వృత్తాంతంతో నాటకం సాగదీసినట్లుంది. ద్రౌపదీపరాభవపు చిత్రపటంతో విభిన్న వ్యక్తుల మనోభావాల వర్ణన మాత్రం అమోఘం. వురుపుటూరి వచనమూ, చిలకమర్తి పద్యమూ మనసుకు హత్తుకుపోయాయి:

    “దుస్ససేనుండు తనుబట్ట ద్రుపదపుత్రి
    సంభ్రమోత్ఫుల్లనేత్రయై సంచలించి
    గ్రహణవేళ రాహువక్త్రంబునందు
    జొచ్చుచంద్రరేఖయుఁబోలె సొబగుమీరు.”

    కొడవళ్ళ హనుమంతరావు

  2. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    05/28/2026 3:02 am

    కొడవళ్ళ హనుమంతరావుగారికి, కె.వి.యెస్.రామారావుగారికి, మంథా వీరభద్రంగారికి, తఃతః గారికి, చదివి వెన్ను తట్టినందుకు ధన్యవాదాలు.

    1. ఇతర భాసనాటకాలను కూడా అనువదించాలనే ఆలోచన ఉన్నదండీ, ప్రయత్నిస్తాను. అన్నట్లు, అల్లప్పుడెప్పుడో, చందమామలో ప్రచురించిన భాసకథల గురించి చెప్పి, కుతూహలాన్ని కలిగించిన క్రెడిటు మీకే.
    2. ఫార్మాటింగ్ గురించి: మూలం– అనువాదం రెండు కాలమ్స్ ‌గా వేయాలని అనుకున్నాము. కానీ ఫోన్లోనో, ట్యాబులోనో చదివే పాఠకులకు కష్టమవుతుందని ఆ ఆలోచనను విరమించుకున్నాము.
    3. వీరభద్రంగారు చెప్పినట్లు “సింగంబాకట…”పద్యంలో కుంతీసుతమధ్యముడనే మాటను “సమరస్థేమాభిరామాకృతి” అయిన అర్జునుడికి వాడారు తిక్కన. అదెట్లా అని సందేహం కలిగి తి.తి.దే.వారి భారతం చెక్ చేసాను. “కుంతి కొడుకులు నిజానికి ముగ్గురే. వాళ్ళలో నడిమివాడు భీముడు. కాని కుంతి అట్లా అనుకొనలేదు. మాద్రీపుత్రులైన నకుల, సహదేవులనూ తన సొంతకొడుకులు అనే అనుకొన్నది. అందుచేత కౌంతేయులన్నా పాండవులన్నా ఒక్కటే! కాగా, ఐదుమందిలో మధ్యవాడూ అర్జునుడే. ఇట్లా అని వ్యాసుడే అన్నాడు. దాన్నే తిక్కన పాటించాడు,” అని వ్యాఖ్యానంలో చెప్పారు. భాసుడి భీముడు “భ్రాతౄణామపి మధ్యమః” అని చెప్పేసాడు.
    4. తఃతః గారు చెప్పినట్లు వ్యాయోగపు కథాకాలం ఒక పగలును మించకూడదు (“వ్యాయోగస్తు ఏకాహకృతః”). నేను మిస్ చేసాను.

    మరోసారి కృతజ్ఞతలతో
    వురుపుటూరి శ్రీనివాస్

  3. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/22/2026 2:00 pm

    Janamaddi saibaba గారు, let my writings and deeds reveal if I’m a man of hatred/weakness, but my perspective aligns with Nanduri’s intellectual legacy. Would you attribute hatred/weakness to him too? From his “విశ్వదర్శనం – భారతీయచింతన”:

    “నాసదీయసూక్తం ఈనాటికీ ఆశ్చర్యం కొలిపేటంత గంభీరమైన తత్వ వివేచనతో అలరారుతున్నది. మూడు వేల ఏళ్ళనాడు సప్తసింధునదీ తీరాలలో నక్షత్ర ఖచిత విశాల వినీలాకాశం క్రింద, ఉషోదేవి తూర్పున బంగారు వాకిళ్ళు తెరుస్తున్న సమయాలలో, నిబిడారణ్యాల తమాలతరుచ్ఛాయలలో, ఆశ్రమ వాటికలలో, సూర్యునికి అర్ఘ్యం విడుస్తూ హోమ గుండాన్ని పరివేష్టించి ఆసీనులై, భారతీయులైన కవులు, ఋషులు విశ్వ రహస్య ద్వారాలను తెరవడానికి ప్రయత్నం చేస్తూ తెరమరుగున దాగిన సత్యాన్ని కనుగొనడానికి తహతహలాడుతూ, ఈ సూక్తం పఠిస్తూ వుండేవారా అన్న ఊహే మనస్సులను ఏదో ఔదాత్యంతో నింపివేస్తున్నది.”

    పదార్థ నిర్మాణం గురించి ప్రాచీనుల అవగాహన గురించి ఇటీవల ఓ వ్యాసంలో (https://eemaata.com/em/issues/202605/42657.html), “అయితే, వీటిని చూసి గ్రీకులు గానీ, భారతీయులు గానీ ఆధునిక పరమాణు సిద్ధాంతాన్ని పూర్వమే కనుగొన్నారని అనుకోకూడదు. వారు చేసిన అసలైన మేలు, ప్రకృతిలోని సంక్లిష్టమైన విషయాలను సరళీకరించి (Reductionism) విశ్వ రహస్యాలను తెలుసుకోవచ్చునని చూపడం,” అని రాశాను.

    I responded to a comment by రాళ్ళబండి శ్రీధర్ గారు claiming Vedas had relativity and other modern scientific theories. Would you agree with him? Based on what? Let me end with a note from a renowned scientist [1]:

    “In short, the claims that all modern discoveries of science are of Vedic origin do not stand up to scientific scrutiny. In fact, they are counterproductive because they divert attention from the genuine discoveries attributable to ancient India. That our Vedic ancestors had the same scientific curiosity that drives modern science cannot be denied. The questions asked in Nasadiya Sukta of Rig Veda bear a striking resemblance to the questions asked by modern cosmologists. That they were curious about the universe is beyond doubt. But that they knew what modern science talks about today cannot be accepted.”

    మన సువిశాల సాహిత్యాన్ని చదివి గర్విద్దాం. కానీ, అందులోనే ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలన్నీ ఉన్నాయని భ్రమపడకుండా, వాస్తవాల్ని అంగీకరించే వినమ్రతను కూడా అలవర్చుకుందాం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] Jayant V. Narlikar. “The Scientific Edge: The Indian Scientist from Vedic to Modern Times.” Penguin Books. 2003.

  4. కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి G.RANGARAO అభిప్రాయం:

    05/12/2026 7:10 am

    ఈ వ్యాసం చదువుతుంటే 50 ఏళ్లనాటి జ్ఞాపకాలు కళ్ళముందు కదిలాడాయి. ఏవే రేడియో రోజులు. ఆ కాలంలో రేడియో ఒక చిన్న సైజు టీవీ పెట్టెలా ఉండేది. టీవీ లాగే ఒక చోటే స్థిరంగా ఉండేది. అటుఇటు కదల్చటానికి వీలుండేది కాదు. దానికి సిగ్నల్ రావటానికి ఇంటి ముందు రెండు బొంగులకు పొడవైన వైరు కట్టేవాళ్ళు. దాన్నే ఏరియల్ అనేవాళ్ళు.

    అవి కరెంటు లేని రోజులు. రేడియో బ్యాటరీ మీద నడిచేది. స్థితిమంతుల ఇళ్లలోనే ఉండేది రేడియో. దాని చుట్టూ జనం చేరేవాళ్ళు. ఆ కాలంలో రేడియో ఒక్కటే ప్రసార సాధనం. వార్తాపత్రికలు విజయవాడ నుంచి వచ్చేవి. పల్లెటూర్లకి ఆలస్యంగా వచ్చేవి. పత్రికలు చదివితే నిన్న ఏమి జరిగిందో తెలుస్తుంది. రేడియో వింటే ప్రస్తుతం ఏమి జరుగుతుందో తెలుస్తుంది. అంత తేడా రేడియోకి పత్రికలకు. వ్యవసాయం, వాతావరణం, రామాయణం, మహాభారతం మీద వ్యాఖ్యానం, వార్తలు, కార్మికుల కార్యక్రమం, సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం, హరికథ, బుర్రకథ అబ్బో ఒకటేమిటి ఎన్నో కార్యక్రమాలు వచ్చేవి. శ్రోతలను అలరించేవి. రేడియోలో సినిమా కూడా వచ్చేది. దాన్ని సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు. అంటే కేవలం ఆడియో అన్న మాట.

    ఆ తర్వాత రేడియో రూపాంతరం చెంది ట్రాన్సిస్టర్ గా మారిపోయింది. అది ఆ కాలంలో గొప్ప విప్లవాత్మక మార్పుగా భావించారు. ట్రాన్సిస్టర్ ఖరీదు తక్కువ. చేతితో పట్టుకొని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. మొదట్లో పెద్దదిగా వున్నా రానురాను చిన్న సైజు ట్రాన్సిస్టర్లు వచ్చాయి మార్కెట్లోకి. మర్ఫీ, బుష్, బాగా పేరుపొందిన బ్రాండ్లు. ఆ తర్వాత ఫిలిప్స్ వచ్చి మిగిలిన బ్రాండ్లను మార్కెట్లో లేకుండా చేసింది. ఖరీదైన ట్రాన్సిస్టర్‌లో బ్యాండ్లు ఉండేవి. మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1, షార్ట్ వేవ్ 2 లాగా. మీడియం వేవ్ లో స్థానిక స్టేషన్ల ప్రసారాలు వచ్చేవి. రేడియో టైం అంటే కచ్చితమైన సమయం అనుకునేవారు.

    రోజూ ఉదయాన్నే 5.55 కి వాల్టర్ కాఫ్మన్ అనే పాశ్చాత్య సంగీత పండితుడు కంపోజ్ చేసిన సంతక స్వరంతో మొదలై వినసొంపైన కంఠం పలికేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358 మీటర్లు అనగా 857 కిలోహెర్ట్స్ మీద జరిగే ప్రసారాలు అన్న మాటలతో మొదలయ్యేది ప్రసారం. వివిధ భారతిలో జనరంజని కార్యక్రమంలో రోజుకు మూడుసార్లు తెలుగు సినిమా పాటలు వచ్చేవి. అన్ని ఇళ్లలో ఆ సమయంలో అదే కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా వినేవారు. పలానా పాట కావాలని ఉత్తరం రాసిన శ్రోతల పేర్లు కూడా చదివేవారు. పిల్లలు తప్పిపోతే రేడియోలో ప్రకటన చేయించేవాళ్ళు. అనేక వస్తువుల ధరలు కూడా రేడియోలో చెప్పేవాళ్ళు. పురాణాల మీద ఉషశ్రీ వ్యాఖ్యానం కోసం ఎదురుచూసి మరీ వినేవాళ్ళు.

    మాది ప్రకాశం జిల్లా. మాకు విజయవాడ కార్యక్రమాలు బాగా వచ్చేవి. తర్వాత కడప నుంచి కూడా వచ్చేవి. విశాఖపట్నం హైదరాబాద్ కార్యక్రమాలు బలహీనంగా వచ్చేవి. సిగ్నల్ సరిగా లేనందువలన. షార్ట్ వేవ్ మీద సిలోన్ నుంచి వచ్చే బైబిల్ కార్యక్రమంలో సినిమా పాటలు మాత్రం వినేవాళ్ళు!

    రేడియోలో వార్తలు చదివే వాళ్లకు మంచి గుర్తింపు ఉండేది. మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ లాంటి పేర్లు ఇప్పటికీ గుర్తే. వీరు ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు చదివేవారు. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే అయ్యేవి. ఆదివారం రాత్రి భోజనాలు అయ్యాక సంక్షిప్త శబ్ద చిత్రం కోసం రేడియో చుట్టూ జనం మూగేవాళ్ళు. శనివారం రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు జాతీయ సంగీత కార్యక్రమం వచ్చేది. మంగళంపల్లి సహా అందరూ తమ సంగీత ప్రయాణాన్ని రేడియో ద్వారానే ప్రారంభించేవాళ్లు. బి అని బి హై అని, ఏ అని ఏ హై అని గ్రేడ్లు ఉండేవి సంగీత కళాకారులకు. రేడియో ఆర్టిస్ట్ అంటే అదో పెద్ద గౌరవం కళాకారులకు. క్రికెట్ మ్యాచ్ గురించి కామెంట్రీ వినాలంటే రేడియో ఒక్కటే మార్గం. రేడియోకి ఒక ఆదర్శం ఉండేది. అల్లరి చిల్లరి కార్యక్రమాలు అందులో వచ్చేవి కావు. ప్రతి కార్యక్రమంలో ఒక అభ్యుదయం నిమిడి ఉండేది.

    ట్రాన్సిస్టర్ రాకముందు పల్లెటూళ్లలో కమ్యూనిటీ రేడియో అని ఉండేది. అక్కడికి చేరేవారు పురుష జనం అంతా! రేడియోని గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రేడియోకి లైసెన్స్ ఉండేది 1970 దశకం చివరి వరకు. అలాగే సైకిల్‌కి కూడా లైసెన్స్ ఉండేదట! ఏడాదికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో కట్టాలి రేడియో లైసెన్స్ ఫీజు.

    ట్రాన్సిస్టర్ వచ్చాక కట్నం కింద రేడియో, సైకిల్, చేతి వాచీ లాంటివి కూడా చేరేవి. ఆ రోజులు చాలా బాగుండేవి. మనిషికి తెలిసిన రేడియోని రూపొందించటానికి ఎన్నో దశాబ్దాలుగా శోధించి, శ్రమించి విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తల గురించి హనుమంతరావు గారి వ్యాసం చదువుతుంటే మనసంతా నోస్టాల్జిక్ జ్ఞాపకాలతో నిండిపోయింది. మళ్ళీ రావుకదా ఆ తీపి రోజులు. ఒక్కసారిగా కాలాన్ని 50 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిన కొడవళ్ళ హనుమంతరావు గారికి కృతజ్ఞతలు.

  5. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/09/2026 6:21 pm

    1983 ప్రాంతంలో “అతడు-ఆమె,” “బతుకుపుస్తకం” చదవడాన తఃతః గారి January 18, 2019 వ్యాఖ్య మనసులో ఉండిపోయింది. ఇవాళ వికాసం వారి 2024 ప్రచురణ, “వుప్పల లక్ష్మణరావు రచనలు,” తెరిస్తే మొదట కనిపించింది 1971 నాటి వుప్పల ఉత్తరం:

    “మీ స్రుజనాత్మక సాహితీ క్రుషికీ, తెలుగు తల్లి మీద మీకున్న భక్తి గౌరవాలకీ నేనెంతో సంబరపడ్డానని నేనంటే నా మాటలు నీటిమూటలు కావు – నిజంగా నమ్మండి. మీ జట్టు కూడాలనుంది నాకు. నన్ను కూడా మీలో వొహణ్ణిగా తీసుకోండని నా మనవి.”

    కొత్తగా తెలుసుకున్న విషయం—తన జీవిత చరిత్రకు ఆయన మొదట పెట్టుకున్న పేరు “అసమర్థుని జీవయాత్ర.” వికాసం సభ్యులు గగ్గోలు పెట్టడంతో, దేవి (డా. దేవరకొండ సహదేవరావు?) గారి సూచన మేరకు “బతుకుపుస్తకం” పేరుకు ఒప్పుకున్నారు.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/05/2026 10:47 am

    నేనన్న “‘గౌరవనీయమైన స్థాయికి’ బదులు ‘దుస్థితికి’ అని ఉండాలి – లేకపోతే ఐరనీ పోతుంది,” తప్పేమో. ఐరనీ ఉండాలంటే వక్రత ఉండాలి కదా.

    కొడవళ్ళ హనుమంతరావు

  7. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/03/2026 6:57 pm

    కొడవటిగంటి నవల “ఐశ్వర్యం” లో డాక్టరు, incongruity తో భాసుడు హాస్యం పుట్టించాడన్నాడు (“మా అమ్మకి నర మాసం మీద కోరిక మళ్ళింది, మీ కొడుకుల్లో ఒకరిని ఇవ్వమని,” ఘటోత్కచుడు వినయంగా కోరడం). భాసుడి ప్రధాన గుణం నాటకీయ వక్రత (dramatic irony) అని వి. వెంకటాచలం రాశారు. ఈ చక్కని అనువాదం దానిని ప్రతిబింబిస్తుంది. “ఈమాట” లోని ఉరుపుటూరి వ్యాసాలు కొద్దివే అయినా తనకున్న ఉభయ భాషాపాండిత్యం వెల్లడవుతుంది. భాసుని ఇతర రూపకాలని కూడా అనువదిస్తారని ఆశిస్తాను.

    క్రింది స్వగతంలో “గౌరవనీయమైన స్థాయికి” బదులు “దుస్థితికి” అని ఉండాలి – లేకపోతే ఐరనీ పోతుంది (చందమామలో కథ).

    భీముడు:
    (తనలో) ఇదెక్కడి తల్లి ఆజ్ఞ! పెద్దవారిని సేవించడం విషయమై ఈ అమాయకుడికి ఎంత శ్రద్ధ!
    మనుషులకైనా, దేవతలకైనా తల్లియే దైవము. అమ్మ మాటను ఔదలదాల్చినందుకే కదా మేము ఈనాడు ఈ గౌరవనీయమైన స్థాయికి చేరుకున్నాము.

    సంస్కృతం-తెలుగు పైనా కిందా కాకుండా పక్కపక్కన ఉంటే చదవడానికి ఆటంకం కలగదు.

    వాడ్రేవు వ్యాఖ్య:
    “భారతీయ సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు కాలూనుకుంటున్న సమయాన్ని కాళిదాసు నాటకాలు ప్రతిబింబిస్తే, ఆ ధర్మాలు పూర్తిగా వేళ్ళుదన్నుకున్న కాలం భాసనాటకాల్లో కనిపిస్తుంది. కాళిదాసు నాటకాల్లో ఒక వర్ణం కన్నా మరొక వర్ణం గొప్పదనే భావనగానీ లేదా ఒక ఆశ్రమవిధికన్నా మరొక ఆశ్రమ విధి గొప్పదనే ప్రచారం కానీ కనిపించవు. కానీ సమాజంలో ‘నిమ్న’వృత్తులకు చెందిన మనుషుల పట్ల తక్కువ చూపు భాసనాటకాల్లో పాత్రలు తమకు తెలియకుండానే కనపరుస్తాయి. ఏళ్ళకిందట నేను మొదటిసారిగా ‘మధ్యమ వ్యాయోగం’ నాటకం చదివినతరువాత చాలాకాలం పాటు భాసనాటకాల్ని మళ్ళా తెరవడానికి మనసు ఇచ్చగించక పోవటానికి కారణమదే.”

    తనకు నిమ్నవృత్తుల వారితో చిన్నతనం నుండీ ఉన్న దగ్గరి సంబంధాల వలన కాని, ఉన్నత సంస్కారం వలన కాని వారిపై కల సానుభూతి వలన వాడ్రేవుకి ఈహాస్య రూపకంలోని సంభాషణలు జుగుప్స కలిగించి ఉండవచ్చు. దానిని పక్కనబెట్టి తను లేవదీసిన విషయం గురించి ఓమాట.

    వాడ్రేవు వ్యాఖ్యకి సందర్భం: “Metatheatre and Sanskrit Drama,” by Michael Lockwood and A. Vishnu Bhat (2005)లో వారు భాసుని నాటకాలు ఇప్పటివరకూ పండితవర్గం అతను కాళిదాసు (క్రీ. శ. 4-5 వ శతాబ్ది) కి పూర్వం వాడు అంటున్నది తప్పని తీర్మానించారు. కాళిదాసు రచనలో “భాస” అన్నది ఒక విశేషణమే కాని రచయిత పేరు కాదు అని వారి థీసిస్. అంతేకాక భాస నాటకాలు దక్షిణ భారతదేశపు రాజయిన మహేంద్రవర్మ (క్రీ.శ. 6-7 వ శతాభ్ది) రచనలయి ఉంటాయని వారి వాదన.

    వారిని సమర్థిస్తూ వాడ్రేవు అందుకు కొంత రుజువుగా, కాళిదాస నాటకాలలో వర్ణాశ్రమ ధర్మాలు కేవలం కాలూనుకుంటున్నవనీ (still establishing), భాసుని నాటకాలలో అవి పూర్తిగా వేళ్ళుదన్నుకున్నవనీ (deep rooted) అన్నారు.

    నా పరిమిత సాహితీ జ్ఞానంతో దానికి నా ప్రతివాదం: కాళిదాస శాకుంతలంలోని జాలరి కథని చదివితే వర్ణాశ్రమ ధర్మాలు అప్పటికే వేళ్ళుదన్నుకున్నట్లు అనిపించడం లేదా?

    కొడవళ్ళ హనుమంతరావు

  8. అటజని కాంచె కృషీవలుడు గురించి పద్మావతి వడ్లవల్లి అభిప్రాయం:

    04/10/2026 4:59 pm

    హనుమంతరావు గారు  ముఖాముఖి నాకు పరిచయం లేకపోయినా మా వారి మాటల ద్వారా, రవీంద్ర  మాటల ద్వారా నాకు తెలుసు. హనుమంతరావు గారు కష్టపడే వ్యక్తిత్వం కలవారని, కష్టపడి ఉన్నత స్థాయిలో ఉన్నారని, 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారని, సొంత గ్రామంలో గ్రంథాలయం స్థాపించారని మాత్రమే నాకు తెలుసు.

    కానీ తనకి ఇప్పుడా తెలుగు భాష అన్నా, తెలుగు గ్రంథాలన్నా, తెలుగు సాహిత్యం అన్నా మక్కువ అని తెలుసుకున్నాను. మహిమాలయం చదువుతూ తన చిన్న వయసు నుంచి చదివిన పుస్తకాలను మననం చేసుకుంటూ ఇప్పుడు మహిమాలయానికి మంచి వివరణ ఇచ్చారు. వివరణ చెప్పే ముందు హనుమంతరావు గారి ద్వారా చాలా పుస్తకముల పేర్లు, కవుల పేర్లు నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను. ఎలిజబెత్ బిషప్ అనే కవయిత్రి గురించి, సంజీవ్ దేవ్ గారి గురించి, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ గురించి, నాయని సుబ్బారావు గారి గురించి… చాలా మంది కవుల పేర్లు తెలుసుకున్నాను.

    మహిమాలయం గురించి హనుమంతరావు గారి వివరణ… అటజని కాంచె కృషీవలుడు అన్నారు. కృషీవలుడు ఇక్కడ వర్ణన చాలా బాగుందనిపించింది. ఎలిజబెత్ బిషప్ హిమాలయాల ప్రశ్నల వర్షాన్ని తను మననం చేసుకుంటూ మనందరికీ మరొకసారి తెలియజేశారు. ఇది కూడా బాగుంది. త్రిభువన్ చూసినప్పుడు మీకు గుర్తుకు వచ్చిన మీరు రాసిన కవితను రాస్తూ అందులో మిమ్మల్ని కూడా చేర్చారు. భావకవుల ప్రేయసి ఊహలలో అని, అభిమన్యు ప్రణయగీతి శశిరేఖ అని, నాయని సుబ్బారావుకు తన మేనమామ కూతురే తన భార్య అని, రవీంద్రుడికి ప్రేరణ సరోజిని అని, ఇక్కడ ప్రేరణ అంటే ప్రేయసి అని చాలా బాగా రాశారు.

    మిగతా పుస్తకాలతో పోలిస్తే మీది రెండు గుణాలలో విలక్షణంగా ఉందన్నారు. ప్రతి అధ్యాయంలోనూ తనది కానీ తను చదివినది కానీ కవితా రూపంలో రాయడం ఒకటైతే, రెండవది అక్కడి జనుల జీవనరీతిని తన బాల్యపు అనుభవాలకు అన్వయించుకుంటూ రాశారు. ఇలాంటి ప్రత్యేకత కలిగిన విషయాలను తన వివరణలో చాలా బాగా వివరించారు. జన్మభూమి జ్ఞాపకాల పరంపర. నాయని సుబ్బారావు గారికి జన్మభూమి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మీకు కూడా ఉందని ఉదాహరణలతో చెప్పారు. 

    తెగిన జ్ఞాపకాలు. హనుమంతరావు గారు యుక్త వయసులో చదివిన సంజీవ్ దేవ్ రాసిన తెగిన జ్ఞాపకాలు అనే పుస్తకం మననకు రావడం, గుండెలలో గూడు కట్టుకున్న విషాదం, దేశాటనకై నాలో చెలరేగిన ఆరాటం అన్న అధ్యాయంలో మానసంలోని తమస్సును తొలగించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళడానికి సంజీవ్ దేవ్ నిర్ణయించుకున్నారని, అతను హిమాలయాలకు 16 ఏళ్ళ వయసులో వెళ్లి రాసిన అతని భావోద్వేగం మరలా రవీంద్రలో కనిపించిందని రాశారు. ఇక్కడ కూడా వివరణ చాలా బాగుంది.

    శస్త్రకారుని సూక్ష్మ పరిశీలన. బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాతి గాంచిన న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ తన 65వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి తన మిత్రుడు దేవ్‌తో కలిసి నేపాల్‌లో పని చేస్తూ హిమాలయాలకు వెళ్ళడం, హిమాలయాలను చూసి వాటి అందాలు, అక్కడ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు, జీవన విధానం ఎలా వివరించారో మీరు కూడా చాలా బాగా వివరించి రాశారని వివరణ ఇచ్చారు. వివరణ విభాగలుగా చాలా బాగా ఇచ్చారు.

    ఇక విమర్శ గురించి చెప్పాలంటే హనుమంతరావు గారు వినయంతో కూడిన విమర్శ ఇచ్చారు. మొదటిది కవిత్వం పై ఉన్న మోహం వచనం మీద లేదని అన్నారు. కానీ నాకనిపించింది వచనం రాయడం కన్నా కవిత్వం రాయడం చాలా కష్టం కదా అని. రెండోది కళ్ళ ముందు ఉన్నది వర్ణించబోయి అంతలోనే జ్ఞాపకాల దొంతర్లోకి వెళ్లడం అని రాశారు. అది కవులకు సహజ లక్షణమే కదా అని నాకనిపించింది. మీ గత స్మృతులు వర్తమానాన్ని ముంచివేయకూడదని, వర్తమానంలో మీరు సాధించవలసింది చాలా ఉందని మరొక్కసారి మీ ఆప్త మిత్రునిగా మీకు తన సూచన తెలియజేశారు.

    అభినందన. అందరి అభినందనలు చాలా బాగున్నాయని పేరుపేరునా రాశారు. నేను కూడా చివర్లో ఒక మాట చెప్పాలనుకున్నాను. రవీంద్రుడు రాహులుడైన వేళ అని సాంకృత్యాయన్‌తో పోల్చారు సరస్వతీ పుత్రులైన కళారత్న భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు. పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత మొదట అందరి అభినందనలు చదివాను. అందరూ చాలా బాగా రాశారు కదా అనుకున్నాను. నాకు మొదట భూసరపల్లి గారు రాసిన రవీంద్రుడు రాహులుడైన వేళ అనేది అర్థం కాలేదు. తర్వాత పరిశీలించాను. పరిశీలిస్తే రాహుల్ సాంకృత్యాయన్ చాలా పెద్ద కవి అని, అతని గురించి తెలుసుకోవాలంటే నా జీవితం సరిపోదని తెలుసుకున్నాను. అంత పెద్ద కవితో మిమ్మల్ని పోల్చారు. ఇది చాలా గొప్ప విషయం. కాలం ఉన్నంత కాలం నిలిచిపోయే కవిగా మహిమాలయాన్ని రాసి అందించినందుకు మీకు మరొక్కసారి నా అభినందనలు తెలుపుతున్నాను.

    — వడ్లవల్లి పద్మావతి, హైదరాబాదు.

  9. కంప్యూటర్ చిప్ కథ – 11: హెర్ట్‌జియన్ తరంగాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    04/08/2026 9:57 pm

    >> నెల చివరి గడువు దగ్గరకొచ్చే కొలదీ, ఆఁ, ఈవ్యాసాలు ఎవరు చదువుతారులే అని ఉపేక్షిస్తుంటే, మీ వ్యాఖ్య ఎంతో ఉత్తేజాన్నిచ్చింది.

    మీరు ఎలా తిట్టుకున్నా సరే ఈ మాట చెప్పేస్తున్నాను. ఇది సంపాదకులు పబ్లిష్ చేయరు అని నా ధీమా.

    ఎవరో చదివి చప్పట్లు కొట్టడానికి మీరు ఏమీ రాయక్కర్లేదు. మీకు రాయలని ఉండి, అందరికీ మీకు తెల్సినది పంచాలని ఉంటే, నా లాంటి అర్భకులకి తెలిసేలా చెప్తున్నారు కనక రాయండి. చదివే వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టరు, కొట్టాలని ఉన్నా. అందరికీ తెలిసిన విషయాలు కావు మీరు రాసేవి. సులువుగా అర్ధం అయ్యేలా రాస్తున్నారని చదువుతాము. చదివిన వెంఠనే చప్పట్లు కొట్టడానిక్కానీ, ఒక వ్యాఖ్య రాయడానిక్కానీ అనేకానేక అడ్డంకులు ఉంటాయి. మీరు రాయకపోతే ఎవరికండీ నష్టం? కొన్నాళ్ళు చూసి చూసి అడుగుతాము సంపాదకులని. వాళ్ళు “మేము కూడా ఎదురు చూస్తున్నాం రచయిత దగ్గిర్నుంచి’ అంటారు. ఆ తర్వాత ఎవరి తలనెప్పులు వాళ్లకి ఉంటాయి కనక నోరు మూసుకుంటాం. ఆ తర్వాత మర్చిపోతాం. ఇహనో ఎప్పుడో ఎలాగా చచ్చేపోతాం కూడా ఏళ్ళు వస్తున్నాయి కనక. ఆ తర్వాత చదవడం అదీ ఎలాగా దిక్కు లేదు కదా?

    కొంతకాలం క్రితం కంప్యూటర్ గురించి రాయడం మొదలుపెట్టారు. అద్భుతంగా ఉంది అంటూ నాతో సహా చాలా మంది, మహాప్రభో అది కొనసాగించండి అని అడిగి అడిగి నోరు నెప్పెట్టేదాకా చెప్పాం. మీరు ఏ కళనున్నారో అది అర్ధాంతరంగా ఆపి ఇది మొదలుపెట్టారు. ఫలానా ఇన్ని కామెంట్లు వస్తే గానీ, ఇన్నేసి జేజేలు పలికితే గానీ, మరో కొన్ని చప్పట్లు కొడితేగానీ రాయను అని నియమం పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసాండి? మీకు తెల్సిన విషయాలు అక్కడే (మీ మెదడులో) ఉంటాయి. ఎవరికీ జేరవు. అదే మీకు కావాల్సినది అయితే అసలు రాయడం మొదలుపెట్టడమే అనవసరం కదా. ఆఖరికి మనందరికీ పితామహుల వంటి వేమూరి గారు కూడా రాయండి, రాయండి అంటూ ఎన్నో సార్లు చెప్పారు మీరు రాసినది మెచ్చుకుంటూ.

    లైకులు, నవ్వులూ కావాలంటే ఫేస్ బుక్కు అనే దరిద్రం ఒకటి ఉంది కదా. అక్కడ చూడండి.

    ఇంత నాలెడ్జ్ ఉండి, ఇన్నేళ్ళు పనిచేసి ఆఖరికి మీరు కూడా ఎవరు చదువుతారులే అని ఇలా ఉపేక్షిస్తున్నారు అంటే ‘ఏమిటి నేను చదివిన ఈ వాక్యం నిజమేనా, హనుమంతరావు గారు అన్నదేనా” అని చేతి మీద గిల్లుకుని చూసుకునే పరిస్థితి కల్పించారు మీరు. ఇదే ట్రెండ్ కన్నేగంటి రామారావు గారిది కూడా. ఏదో అద్భుతంగా మొదలుపెడతారు. ఈయన భలే రాస్తున్నారు, తప్పకుండా చదవాలి అని చూస్తూ ఉంటే ఒకటో రెండో వ్యాసాలు రాయడం ఆ తర్వాత నిశ్శబ్దం. ఏదైనా అడిగితే నేను బిజీ అంటారు. ఎవరండీ బిజీ కానిది? సురేష్ కొలిచాల గారు, మొన్నటివరకూ పనిచేసిన సంపాదకుడు మాధవ్ మాచవరం బిజీ కాదా? అయినా అంత బిజీ అయితే మొదలు పెట్టడం ఎందుకు? మమ్మల్ని ఏడిపించడానికా? ఏడిపించడానికి ఇంకా అనేక దార్లు ఉన్నాయి. అయినా మా ఏడుపులు మాకు ఉండనే ఉన్నాయి కదా మరోటి ఎందుకు లెండి?

    ఎందుకండీ ఈ తలనెప్పులు? పోనీ సగం రాసి ఆపేస్తే మీకేమైనా సంతోషమా? నాలాంటి అర్భకులు ఏదో కధో కవితో రాసి పంపిస్తే ‘ఛీ, పో’ అంటారు సంపాదకులు. మీరు రాస్తే వేయడానికి ఎర్ర తివాసీ పరుస్తున్నప్పుడు ఏమిటి మీ కష్టం? రామారావు గారు, మీరు కూడా చదువుతున్నారా? వింటున్నారా? ఇది మీ ఇద్దర్నీ దెప్పడానికే.

    మీరు ఏ భాషలో ఎలా తిట్టుకున్నా నేను పట్టించుకోను. చెప్పాల్సినది చెప్పేసాను వళ్ళు మండిపోయి. మీ ఇష్ట ప్రకారం కానీయండి. 🙂

  10. కంప్యూటర్ చిప్ కథ – 11: హెర్ట్‌జియన్ తరంగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    04/05/2026 1:49 am

    నెల చివరి గడువు దగ్గరకొచ్చే కొలదీ, ఆఁ, ఈవ్యాసాలు ఎవరు చదువుతారులే అని ఉపేక్షిస్తుంటే, మీ వ్యాఖ్య ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. Thank you.

    “జీవితం కల్పన కంటే ఆశ్చర్యకరమైనది. సరిగ్గా వివరిస్తే, … పిల్లల మనసులో ఉత్సుకతను రేకెత్తించగలడు,” అనే మాటలు చూడగానే, నేను ఈ మధ్యే చదివిన రిచర్డ్ డాకిన్స్ పుస్తకం [1] ఒకటి గుర్తొచ్చింది. ప్రశ్న శీర్షికగా ఉన్న ప్రతి అధ్యాయం (“మొదటి మానవుడెవరు?”, “ఇన్ని రకాల జంతువులెందుకున్నాయి?”, “పగలు-రాత్రి, చలికాలం-వేసవికాలం ఎందుకున్నాయి?”) మొదట్లో, రకరకాల సంస్కృతులలో ప్రశ్నకి సమాధానంగా ఉండే పురాణ గాథలను చెప్పి, వాటికంటే ఇంకా ఉద్వేగభరితమైన శాస్త్రీయ కథను వివరించే పుస్తకం. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఆ పుస్తకాన్ని ఇచ్చాను; మా ఊరు రావినూతలలోని గ్రంథాలయానికి కూడా పంపించాను.

    ఉదాహరణకి “ఎప్పుడు, ఎలా సర్వం మొదలయింది?” అధ్యాయంలో:

    “భారతదేశంలోని అనేక సృష్టి పురాణాలలో ఇది ఒకటి. కాలం మొదలవ్వక ముందు ఓ శూన్యమైన చీకటి మహా సముద్రం, దాని పైన చుట్టలు చుట్టుకొని ఓ మహా సర్పం ఉండేవి. ఆ సర్పం చుట్టల మీద నిద్రిస్తుండగా, సముద్రం అడుగునుండి వచ్చిన ఝంమనే శబ్దంతో విష్ణువు మేల్కొన్నాడు. ఆయన నాభి నుండి ఒక తామర మొక్క మొలిచింది. ఆ తామర పువ్వు మధ్యలో విష్ణు సేవకుడు బ్రహ్మ కూర్చుని ఉన్నాడు. విష్ణువు లోకాన్ని సృష్టించమని బ్రహ్మని ఆజ్ఞాపించగా, బ్రహ్మ దానిని పాటించాడు. అదే పనిలో సర్వప్రాణులనూ సులువుగా సృష్టించాడు.

    ఈ సృష్టి పురాణాలన్నిటిలో నాకు కొంచెం నిరాశ కలిగించే విషయం ఏంటంటే, అసలు ఈ విశ్వం పుట్టక ముందే ఏదో ఒక ప్రాణి ఉందని ఇవి చెప్తాయి. అది బంబ కావచ్చు, బ్రహ్మ కావచ్చు, పాన్ గు కావచ్చు లేదా అన్కులుకులు (జులు సృష్టికర్త), అబాసి (నైజీరియా), లేదా ‘ఓల్డ్ మ్యాన్ ఇన్ ది స్కై’ (కెనడాలోని రెడ్ ఇండియన్ తెగ) కావచ్చు. ఈ సృష్టికర్త తన పని మొదలుపెట్టడానికి ఒక చోటు ఉండాలి కదా, అంటే ముందే ఏదో ఒక విశ్వం ఉండాలి అని అనిపించడం లేదా? ఈ విశ్వ సృష్టికర్త అసలు ఎలా పుట్టాడో ఏ పురాణమూ వివరించదు. పైగా, ఆ సృష్టికర్తను దాదాపు ఎప్పుడూ పురుషుడిగానే ఊహిస్తారు.

    అందుకే వీటి వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు. దానికి బదులుగా, ఈ విశ్వం నిజంగా ఎలా మొదలైందో మనకు తెలిసిన కథను చూద్దాం.”
    – (అనువాదం AI సహకారంతో)

    డాకిన్స్ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మొదటి సైమొనీ ప్రొఫెసర్ ఫర్ ది పబ్లిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సైన్స్ గా పనిచేశాడు.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “The Magic of Reality: How We Know What’s Really True.” Richard Dawkins. Illustrated by Dave McKean. Free press. 2011. ఇండియాలో దొరికే ఎడిషన్ లో చక్కని బొమ్మలున్నాయి.