కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం

“అత్యంత చవకగా సుదూర దేశాలకు సందేశాలను పంపగలిగే రోజు వస్తుంది.”

— మార్కోనీ 1909 నోబెల్ ప్రసంగం

1896 మార్చి నెలలో, లండన్‌లోని బ్రిటీష్ పోస్ట్ ఆఫీస్ చీఫ్ ఇంజనీర్ విలియం ప్రీస్‌ని ఒకతను పేరున్న ఇంజనీర్ ఇచ్చిన పరిచయ లేఖతో కలిశాడు:

గౌరవనీయులైన ప్రీస్ గారికి,

ఈ ఉత్తరంతో పాటు మార్కోనీ అన్న ఒక ఇటాలియన్ యువకుడిని మీ దగ్గరకు పంపిస్తున్నాను. అతను మన దేశంలో తీగలు లేని కొత్త రకం టెలిగ్రాఫ్ ప్రవేశపెట్టాలనే ఆలోచనతో వచ్చాడు.

అతని విధానం హెర్ట్‌జియన్ తరంగాల పైనా, ఆలివర్ లాడ్జ్ కనిపెట్టిన కొహెరర్ (coherer) పైనా ఆధారపడినట్లున్నా, ఈ రంగంలో మిగిలిన వారు చేసిన దానికంటే అతను చాలా ముందున్నట్లు అనిపిస్తోంది.

మీరు దయచేసి అతన్ని కలిసి, అతను చెప్పేది వినగలరని ఆశిస్తున్నాను. అతను చేసిన పని మీకు ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.

విధేయుడు

A. A. C. స్వింటన్

పాతికేళ్ళయినా నిండని, చెప్పుకోదగ్గ విద్యార్హతలు ఏమీ లేని, పరాయి దేశస్తుడైన మార్కోనీ బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి వద్దకి ఇతర శాస్త్రజ్ఞులకంటే ముందున్నాడనే సిఫారసుతో వచ్చాడంటే మార్కోనీ అసామాన్యుడని తెలుస్తుంది. ఈ వ్యాసంలో ప్రపంచంలో నలుమూలలకీ సమాచారం అందించే అమోఘమైన సాంకేతిక సాధనాన్ని కనుగొన్న అతని కథ తెలుసుకుందాం.

మార్కోనీ బాల్యం


గుగ్లిఎల్మో మార్కోనీ

గుగ్లిఎల్మో మార్కోనీ (Guglielmo Giovanni Maria Marconi, 1874 – 1937) 1874 ఏప్రిల్ 25న ఇటలీలోని బోలోగ్నా (Bologna) నగరంలో జన్మించాడు. అతని తండ్రి గియుసెప్పె మార్కోనీ సంపన్న భూస్వామి. గియుసెప్పెకు ఇది రెండవ వివాహం.

మార్కోనీ తల్లి అన్నీ జేమ్సన్ (Annie Jameson) ఐర్లాండ్‌కు చెందిన ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చింది. ఆమె ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘జేమ్సన్ ఐరిష్ విస్కీ’ (Jameson Irish Whiskey) వ్యాపార సామ్రాజ్య స్థాపకుని మనమరాలు. సంగీతం నేర్చుకోవడానికి అన్నీ బోలోగ్నాలో ఉండగా అక్కడ ఆమెకు గియుసెప్పెతో పరిచయమయి అది ప్రేమగా మారింది. అయితే, వారి వివాహానికి ఆమె తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. గియుసెప్పె అప్పటికే ఒకసారి వివాహమై, భార్యను కోల్పోయి ఉన్నాడు, పైగా అన్నీ కంటే అతను వయసులో చాలా పెద్దవాడు. కానీ అన్నీ తన నిర్ణయానికి కట్టుబడి, తన కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా గియుసెప్పెను వివాహమాడింది. ఆమెకున్న పట్టుదల, స్వతంత్ర భావాలే మార్కోనీ తన ప్రయోగాల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ధైర్యంగా నిలబడటానికి స్ఫూర్తినిచ్చాయి.

మార్కోనీ అయిదారేళ్ళ వయసులో, తల్లీ, అన్న ఆల్ఫొన్సోతో కలిసి ఇంగ్లాండులోని బెడ్‌ఫర్డ్‌లో రెండేళ్ళ పాటు ఉండి, అక్కడే ప్రాథమిక విద్య పూర్తిచేశాడు. అందువల్ల, ఇంట్లో తల్లి ఇంగ్లీషులో సంభాషించడం వల్ల, మార్కోనీకి ఆంగ్లభాష పరాయి భాష కాలేదు.

తిరిగి ఇటలీ వచ్చిన తర్వాత టెక్నికల్ స్కూల్లో చేరి విద్యుత్తు గురించి చదవడం మొదలెట్టాడు, కానీ అక్కడ చదువు పూర్తి చేయలేదు. తండ్రి ప్రైవేట్ టీచర్లను పెట్టి మార్కోనీకి ఇంటి వద్దే చదువు చెప్పే ఏర్పాటు చేశాడు. తల్లి తన కొడుకుకు సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి, అతనికి మార్గదర్శకత్వం చేయమని విన్సెంజో రోసా (Vincenzo Rosa) అనే ఉపాధ్యాయుణ్ణి కోరింది. 1892-1894 మధ్య కాలంలో రోసా మార్కోనీకి ప్రైవేట్ పాఠాలు బోధించాడు. రోసా ప్రయోగశాలలో మార్కోనీ ఎన్నో గంటల పాటు గడిపేవాడు.

మార్కోనీ కుటుంబానికి సన్నిహితుడు, బోలోగ్నా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన అగస్టో రిఘీ (Augusto Righi), మార్కోనీ ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థి కాకపోయినా, రిఘీ తన పెద్దమనసుతో అతనిని తన ఉపన్యాసాలు వినడానికి, ప్రయోగశాలను సందర్శించడానికి అనుమతించాడు.

శాస్త్రీయ నేపథ్యం: అదృశ్య తరంగాల అన్వేషణ

1888లో హెన్రిచ్ హెర్ట్‌జ్ (Heinrich Hertz, 1857 – 1894) మొదటిసారిగా విద్యుదయస్కాంత తరంగాలని సృష్టించి, అవి కాంతి తరంగాలలాంటివేనని ప్రయోగపూర్వకంగా నిరూపించాడని గత వ్యాసంలో తెలుసుకున్నాం. భౌతిక శాస్త్రవేత్త అయిన హెర్ట్‌జ్, ‘మాక్స్‌వెల్ సిద్ధాంతాన్ని రుజువు చెయ్యడానికి తప్ప, ఈ తరంగాల వలన ఎలాంటి ఉపయోగమూ లేదు,’ అని భావించాడు.

హెర్ట్‌జ్ తన ట్రాన్స్‌మిటర్ ద్వారా పంపిన తరంగాలను సేకరించడానికి అతి సామాన్యమైన రిసీవర్ — రెండు చివరల మధ్య ఒక అతి చిన్న ఖాళీ గల వలయాకారంలో ఉన్న తీగ — వాడాడు. తరంగాలు వస్తున్నాయని తెలియాలంటే ఆ చిన్న సందులో మెరుపు రావాలి. ఆ మెరుపు చాలా బలహీనంగా ఉండి కటిక చీకటిలో చూస్తే కానీ కనిపించేది కాదు. కేవలం కంటితో రవ్వలను చూసి నిర్ణయించకుండా, ఇంకా మెరుగుపరిచే కృషిలో, ‘వైర్‌లెస్ స్విచ్’ వంటి ఓ ముఖ్య పరికరం వెలువడింది.

కొహెరర్


బ్రాన్లీ ప్రయోగం సర్క్యూట్ రేఖాచిత్రం

ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బ్రాన్లీ (Édouard Branly, 1844 – 1940) కనిపెట్టిన కొహెరర్‌ని మొదటి రేడియో డిటెక్టర్ అని చెప్పవచ్చు. చిన్న గాజు గొట్టం లోపల, రెండు లోహపు ఎలక్ట్రోడ్ల మధ్య ఉన్న కొద్దిపాటి ఖాళీలో లోహపు పొడి (ఇనుము లేదా నికెల్ రజను) నిండి ఉంటుంది.

గొట్టాన్ని సర్క్యూట్‌కు కలిపితే, ఆ పొడిలోని కణాల మధ్య ఉన్న గాలి వల్ల ఏర్పడే విద్యుత్ నిరోధకత్వం మూలంగా విద్యుత్తు ప్రవహించదు. కానీ రేడియో తరంగాలు గొట్టంపై పడినప్పుడు, ఆ కణాలు ఒకదానికొకటి అంటుకోవడం (Cohere) తో నిరోధకత్వం తగ్గి, విద్యుత్తు ప్రవహిస్తుంది. దీనిని బ్రాన్లీ ‘రేడియో-వాహకం’ (Radio-Conductor) అని పిలిచాడు.

కొహెరర్‌లో ఒక పెద్ద సమస్య ఉండేది. ఒకసారి లోహపు పొడి కణాలు అంటుకున్నాక, రేడియో తరంగాలు ఆగిపోయినా ఆ కణాలు అలాగే అంటుకుని ఉండిపోయేవి. తర్వాతి సిగ్నల్‌ను అందుకోవాలంటే, గొట్టాన్ని విదల్చి లేదా తట్టి ఆ కణాలను మళ్ళీ విడదీయాలి.


లాడ్జ్ కొహెరర్ - ఆటోమేటిక్ ట్యాపర్‌తో (1894)

ఆలివర్ లాడ్జ్ (Oliver Lodge, 1851 – 1940) గురించి మాక్స్‌వెల్ అభిమానులు వ్యాసంలో తెలుసుకున్నాం. ఆయన ఈ సమస్యకు ఒక సులువైన పరిష్కారాన్ని కనిపెట్టాడు: కొహెరర్ పక్కన ఒక చిన్న ఎలక్ట్రిక్ సుత్తిని అమర్చాడు. సిగ్నల్ రాగానే కణాలు అంటుకుపోయి విద్యుత్తు ప్రవహిస్తుంది; వెంటనే ఆ చిన్న సుత్తి గొట్టాన్ని మెల్లగా తడుతుంది (Tapper). ఆ దెబ్బకు లోహపు పొడి కణాలు విడిపోయి, రిసీవర్ మళ్ళీ తర్వాతి సిగ్నల్‌ను అందుకోవడానికి సిద్ధమవుతుంది.

ఆక్స్‌ఫర్డ్ ప్రదర్శన – చేజారిన మరో అవకాశం

లాడ్జ్ పిడుగుల మీద పరిశోధనలు చేస్తూ 1888 జూన్‌లో విద్యుదయస్కాంత తరంగాల ఉనికిని నిరూపించినా, ఫలితాల ప్రచురణలో జాప్యం చేయడం వల్ల, ఆగౌరవం హెర్ట్‌జ్‌కి దక్కిందని, మాక్స్‌వెల్ అభిమానులు వ్యాసంలో తెలుసుకున్నాం. లాడ్జ్‌కు అది ఒక చేజారిన అవకాశం; ఇప్పుడు మరొకటి.

1894 ఆగస్టు 14న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రతిష్టాత్మకమైన ‘బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్’ వార్షిక సమావేశం సందర్భాన, లాడ్జ్ బ్రిటన్‌లోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తల సమక్షంలో ఓ ప్రయోగం చేశాడు:


లాడ్జ్ ఆక్స్‌ఫర్డ్ ప్రయోగ ప్రదర్శన


ఒక భవనంలో ట్రాన్స్‌మిటర్, అరవై గజాల దూరంలో ఉన్న మరో భవనంలో రిసీవర్ ఉంచి, వాటి మధ్య దట్టమైన రాతి గోడలు ఉన్నా, ట్రాన్స్‌మిటర్ నుండి సిగ్నల్ పంపగానే, రిసీవర్‌లోని బెల్ గట్టిగా మోగింది.

వైర్‌లెస్ కమ్యూనికేషన్ సాధ్యమని ఇది ఖచ్చితంగా నిరూపించినా, లాడ్జ్ దీనిని కేవలం భౌతిక శాస్త్ర పరంగా, తరంగాల లక్షణాలను పరిశోధించే పరికరంగా చూశాడే కానీ సమాచార యంత్రంగా చూడలేదు. తన పరిశోధనల గురించి సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించాడు కానీ పేటెంట్లు తీసుకోలేదు. అలా లాడ్జ్ మరో అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ప్రయోగాలను మార్కోనీ ఎలా ఉపయోగించుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

కొండని దాటిన సందేశం

1894 లో ఆల్ప్స్ పర్వతాల్లో వేసవి సెలవులు గడుపుతుండగా, మార్కోనీ ఒక పత్రికలో ఆ జనవరిలోనే మరణించిన హెర్ట్‌జ్‌ చేసిన పరిశోధనల మీద వచ్చిన వ్యాసం చదివాడు. వెంటనే అతని మెదడులో ఒక ఆలోచన నాటుకుంది: ‘ఈ తరంగాలు ఒక గదిని దాటగలిగినప్పుడు, ఒక ఊరిని, ఒక దేశాన్ని, ఒక ఖండాన్ని, బహుశా మహాసముద్రాలను కూడా దాటగలవు కదా!’

దానితోపాటు ఓ సందిగ్ధం కూడా తల ఎత్తింది. ఆమాత్రపు ఆలోచన ఈరంగంలో తదేకంగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలకి ఎందుకు తట్టలేదు? తన ఆలోచనలో ఏమన్నా తిరకాసు ఉందా? అని మధనపడ్డాడు. ప్రయోగం చేస్తే తప్ప ఈ విషయం తేలదని, సెలవులైపోయి ఇంటికి వచ్చిన వెంటనే పని మొదలెట్టాడు.

ఒకటి రెండు నెలలు మిద్దె గదిలోని పరికరాలతో కుస్తీ పడ్డాడు. ట్రాన్స్‌మిటర్ నుండి రవ్వలు వస్తున్నాయి కానీ రిసీవర్‌లో వాటి ఉనికి లేదు. పరికరాలని ఎంత మార్చినా ఫలితం కనబడ లేదు. కాని ధైర్యం కోల్పోలేదు (“Ma non mi persi di coraggio”). పట్టు వదలని విక్రమార్కుడిలా రెయ్యంబవలు కృషి చేశాడు. నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్న కొడుకుని చూసి తల్లి గాభరా పడింది. మరో నెలరోజుల తర్వాత, ఓరోజు అమ్మా నాన్నలని పైన మూడో అంతస్తుకి రమ్మన్నాడు. అక్కడ ఓ బటన్ నొక్కాడు; మొదటి అంతస్తులో గంట మ్రోగింది – పైనుండి క్రిందకు తీగలేమీ లేవు.

కొన్ని రోజుల తర్వాత, సంకేతాలు ఇంటి ఒక చివర నుండి మరో చివరకు, ఆ తర్వాత ఇంటి నుండి బయట ఉన్న పచ్చిక మైదానం వరకు చేరాయి. తల్లికి ఇదంతా ఒక అద్భుతంలా అనిపించినా, తన కొడుకు ఏదో ఆటలాట ఆడటం లేదని ఆమెకు గట్టి నమ్మకం కలిగింది.

కానీ తండ్రి దీంట్లో గారడీ ఏమైనా ఉందా అని అనుమానించాడు. మోర్స్ కోడ్‌లో ‘S’ అనే అక్షరాన్ని పంపమని మార్కోనీకి చెప్పి, ఆయన స్వయానా తోటలో ఉన్న రిసీవర్ దగ్గరకు వెళ్లాడు. ఆ యంత్రం మూడు చుక్కలను (…) రికార్డ్ చేసిందని నిర్ధారించుకొని, సంతసించి కొడుకు ప్రయోగాల కోసం పెద్ద మొత్తం డబ్బు ఇచ్చాడు. మార్కోనీ పరికరాలను మెరుగుపరుస్తూ తరంగాల ప్రయాణ దూరం క్రమేపీ పెంచసాగాడు.


విల్లా గ్రిఫోన్: మార్కోనీ తొలి ప్రయోగ స్థలం


రిసీవర్‌ను విల్లా గ్రిఫోన్‌లోని ఇంటి నుండి 1,700 మీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ మీదికి తీసుకువెళ్లాడు. రిసీవర్ దగ్గర అన్న అల్ఫోన్సోను ఉంచి అతనికి ఒక సూచన ఇచ్చాడు — కొహెరర్ యొక్క సుత్తి మూడు చుక్కలను (మోర్స్ కోడ్‌లో ‘S’ అక్షరం) ట్యాప్ చేయగానే జెండా ఊపమని చెప్పాడు. మార్కోనీ టెలిగ్రాఫ్ కీ నొక్కగానే, అవతలి వైపు అతని సోదరుడు జెండా ఊపాడు. మార్కోనీకి విజయోత్సాహం కలిగింది. కానీ వైర్‌లెస్ నిజంగా ఉపయోగపడాలంటే సంకేతాలు కొండలు, భవనాలు దాటి చేరాలని ఆయనకు తెలుసు.

రిసీవర్‌ను కొండకు అవతలి వైపుకు, అంటే కంటికి కనిపించని దూరానికి మార్చాడు. గంట మోగగానే వెంటనే తుపాకీ పేల్చమని అల్ఫోన్సోకు సూచించాడు. మార్కోనీ మళ్ళీ కీ నొక్కాడు. అంతే, కొండ అవతలి నుండి వెంటనే తుపాకీ పేలిన శబ్దం వినిపించింది — వైర్‌లెస్‌కు దక్కిన మొదటి సెల్యూట్ అది! కొండ ఒక వైపు నుండి ఆవలి వైపు ముప్పాతిక మైలు దూరం. ఆ క్షణమే ఈ భూమ్మీద ఏ అడ్డంకి అయినా, ఎంతటి దూరమైనా తన వైర్‌లెస్‌ను ఆపలేదని మార్కోనీ గట్టిగా విశ్వసించాడు.

మార్కోనీ సాంకేతిక నైపుణ్యత

మార్కోనీ సాధించిన ఈ విజయం వెనుక గల సాంకేతిక వివరాలు:


    మార్కోనీ కొహెరర్

  1. బ్రాన్లీ కొహెరర్ సరిగా పనిచేయకపోవడంతో, దానిని ఆయన కొంత మెరుగుపరిచాడు: గాజు గొట్టంలో, రెండు వెండి తునకల మధ్య ఉన్న అతి స్వల్ప ఖాళీలోనే నికెల్–వెండి లోహపు రేణువులను ఉంచాడు.
  2. లాడ్జ్ ప్రయోగంలో కొహెరర్‌కు ఒక సుత్తి, ఓ గంట ఉంటే, మార్కోనీ ఆ గంటకు బదులు ఓ రికార్డింగ్ పరికరాన్ని పెట్టాడు. ట్రాన్స్‌మిటర్ సర్క్యూట్‌లలో ఒకదానిలో ఉంచిన ‘మోర్స్ టెలిగ్రాఫిక్ కీ’ ద్వారా, తక్కువ లేదా ఎక్కువ సమయం పాటు విద్యుత్ తరంగాలను విడుదల చేయడం ద్వారా సంకేతాలను (మోర్స్ కోడ్ – చుక్క, గీత) పంపేవాడు. ఈ తరంగాలు దూరంగా ఉన్న రిసీవర్‌ను ప్రభావితం చేసి సంకేతాలను మళ్ళీ సృష్టించేవి.
  3. అగస్టో రిఘీ రూపొందించిన ఆసిలేటర్‌కు లోహపు పరావర్తన పలకలను (Reflectors) తగిలించి, రేడియో తరంగాలు అన్ని వైపులా చెల్లాచెదురు కాకుండా, ఒకే దిశలో శక్తివంతమైన కిరణంలా ప్రయాణించేలా చేసి ప్రసార దూరాన్ని పెంచాడు. ట్రాన్స్‌మిటర్‌కే కాకుండా, రిసీవర్‌కి కూడా పలకలను అమర్చడం వల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే బలహీనమైన తరంగాలను ఒకే చోటికి కేంద్రీకరించగలిగాడు.

  4. భూమికి కలిపిన ట్రాన్స్‌మిటర్, రిసీవర్‌

  5. సమాచారాన్ని పంపగలిగే దూరాన్ని పెంచడానికే కాక, మధ్యలో ఉండే అడ్డంకులను అధిగమించడానికి, యాంటెన్నాలను (A) నిలువుగా బాగా పైకి పెట్టి వాటి రెండో వైపు ధ్రువాన్ని భూమికి (E) తగిలించాడు. యాంటెన్నాలకు ఆసరాగా స్తంభాలను (M – Mast) సమకూర్చాడు.
    మార్కోనీ కనిపెట్టిన గ్రౌండెడ్ వర్టికల్ యాంటెన్నా, రేడియో కమ్యూనికేషన్ చరిత్రలోనే ఒక విప్లవాత్మక మార్పు. హెర్ట్‌జ్‌ తన ప్రయోగాల్లో రెండు లోహపు కడ్డీలను గాలిలో భూమికి సమాంతరంగా పెట్టాడు. ఆ యాంటెన్నా తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న సిగ్నల్స్‌ను మాత్రమే పంపగలిగేది; అవి కొండలను, భవనాలను దాటలేవు.
    మార్కోనీ ఆ డైపోల్‌లోని ఒక కడ్డీని తీసివేసి, దానికి బదులుగా సర్క్యూట్‌ను నేరుగా భూమికి కలిపాడు. రెండో కడ్డీని నిలువుగా ఆకాశంలోకి ఎత్తాడు. ఒక నిలువు యాంటెన్నాను భూమికి కలిపినప్పుడు, భూమి లోపల సరిగ్గా అదే పరిమాణంలో మరొక యాంటెన్నా ఉన్నట్లుగా విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. దీనివల్ల యాంటెన్నా వాస్తవ పొడవు రెట్టింపై పొడవైన తరంగాలు ఏర్పడతాయి. అవి కొండల వంటి అడ్డంకుల అంచుల వద్ద వంగుతాయి. అంతేకాక అవి భూమి ఉపరితలాన్ని అనుసరిస్తూ అడ్డంకులను దాటి అవతలి వైపుకు చేరుకుంటాయి.
  6. 2 మీటర్ల ఎత్తున్న యాంటెన్నాతో 30 మీటర్ల వరకు, 4 మీటర్ల ఎత్తున్న దానితో 100 మీటర్ల వరకు, 8 మీటర్ల ఎత్తున్న దానితో 400 మీటర్ల వరకు సిగ్నల్ అందడం గమనించి, మార్కోనీ ఓ అనుభవ సూత్రాన్ని (Rule of thumb) పాటించడం మొదలెట్టాడు: యాంటెన్నా ఎత్తు రెట్టింపయితే, సిగ్నల్ అందే దూరం దాదాపు నాలుగింతలవుతుంది.

లండన్ ప్రయాణం

మార్కోనీ తన వైర్‌లెస్ ప్రయోగాల ఫలితాలను ఇటాలియన్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ శాఖ అధికారుల దృష్టికి తెచ్చాడు కానీ వారు ఏమంత ఆసక్తి చూపించలేదు. తగిన అవకాశం వచ్చేదాకా వేచి ఉండడం మార్కొనీ స్వభావం కాదు. తనది విప్లవాత్మకమైన టెక్నాలజీ అన్న ధృఢ విశ్వాసంతో, బ్రిటన్‌లో తగిన ఆదరణ దొరుకుతుందన్న ఆశతో, 1896 ఫిబ్రవరిలో తన ఇరవై రెండో ఏట, పరికరాలన్నిటినీ ఓ పెట్టెలో సర్దుకొని, తల్లిని తోడుగా తీసుకొని ఇంగ్లాండుకు బయలుదేరాడు..

ప్రముఖ వ్యాపారవేత్తలైన జేమ్సన్ కుటుంబానికి చెందిన మార్కోనీ తల్లి, అతనికి లండన్‌లోని తన దగ్గరి బంధువులను పరిచయం చేసింది. వారి సలహా మేరకు, మార్కోనీ 1896 మార్చి 5న తన ఆవిష్కరణకు పేటెంట్ కోసం దరఖాస్తు పెట్టాడు. వారే మార్కోనీ బ్రిటీష్ పోస్ట్ ఆఫీస్ చీఫ్ ఇంజనీర్ విలియం ప్రీస్‌ను (William Preece, 1834 – 1913) కలిసే అవకాశాన్ని కల్పించారు.

విలియం ప్రీస్ ఆఫీసులో మార్కోనీ చేసిన ప్రదర్శన ఆధునిక సమాచార వ్యవస్థకే ఒక మలుపు. ఎటువంటి తీగలూ లేకుండా గదికి ఒక చివర నుండి సిగ్నల్ పంపి, మరో చివరన గంటను మోగించి మార్కోనీ ప్రీస్‌ను ఆశ్చర్యపరిచాడు. అప్పటికే వైర్‌లెస్ కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్నా ఆశించిన ఫలితం దక్కని ప్రీస్‌కు, మార్కోనీ పరికరాలలో ఒక సులభమైన పరిష్కారం దొరికింది. ఆ యువకుడి ప్రతిభను గుర్తించిన ప్రీస్, అతనికి పోస్ట్ ఆఫీస్ ప్రయోగశాలల్లో పూర్తి స్వేచ్ఛను, వసతులను కల్పించాడు. అలా మార్కోనీ పరాయి దేశంలో తన విజయయాత్రను మొదలుపెట్టాడు.

అంచెలంచెలగా దూరాన్ని అధిగమించటం

1896 జూలై 27న జనరల్ పోస్ట్ ఆఫీస్ భవనాలపై మార్కోనీ తన మొదటి బహిరంగ ప్రయోగాన్ని నిర్వహించాడు. ఒక భవనం పైనుండి పంపిన వైర్‌లెస్ సంకేతాలు, సుమారు 300 గజాల దూరంలో ఉన్న మరో భవనంపై ఉన్న గంటను మోగించాయి. లండన్ వంటి రద్దీ నగరంలో, భవనాల మధ్య కూడా ఈ తరంగాలు ప్రయాణించగలవని మార్కోనీ నిరూపించాడు.

ఈ విజయం చూసిన విలియం ప్రీస్, మార్కోనీ ఆవిష్కరణ కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తును మార్చే ఒక మహా శక్తి అని గ్రహించాడు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం మార్కోనీకి మరిన్ని నిధులు, వసతులు కల్పించి భారీ ప్రయోగాలకు సిద్ధం చేసింది.

సెప్టెంబరులో విలియం ప్రీస్ మార్కోనీని సాలిస్‌బరీ మైదానానికి Salisbury Plain) తీసుకెళ్లాడు. అక్కడ మొదటిసారిగా మార్కోనీ పెద్ద ‘పారాబోలిక్ రిఫ్లెక్టర్లను’ (Parabolic reflectors) వాడి, సిగ్నల్‌ను రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పంపాడు.


మార్కోనీ వాడిన రిసీవర్

1896 డిసెంబర్‌లో లండన్‌లోని టాయిన్బీ హాల్ (Toynbee Hall) లో ప్రీస్, మార్కోనీని పరిచయం చేసి స్టేజీ మీద రెండు నల్లటి పెట్టెలను పెట్టాడు. ఆ రెండు పెట్టెల మధ్య ఎలాంటి తీగలూ లేవు. కానీ అతను ఒక పెట్టె మీద బటన్ నొక్కగానే, ఇంకో పెట్టెలో గంట మోగింది. గారడీ చేయడం లేదని నమ్మించడానికి, మార్కోనీ రిసీవర్ పెట్టెని గదిలో నలుమూలలకు తీసుకెళ్లి గంట మోగడం చూపెట్టాడు. వార్తాపత్రికలు దీని గురించి రాసి సంచలనం సృష్టించాయి. అప్పటి వరకూ ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలిసిన మార్కోనీ ‘పెట్టె’ గురించి ఇప్పుడు లండన్ ప్రజలందరికీ తెలిసింది.

మే 13, 1897న ఫ్లాట్ హోల్మ్ (Flat Holm) నుండి దాదాపు 5.3 కి.మీ. దూరంలో ఉన్న లావెర్నాక్ (Lavernock) కు బ్రిస్టల్ ఛానల్ (Bristol Channel) సముద్రంపై సిగ్నల్స్ పంపగలిగాడు. సముద్రంపై సంకేతాలు పంపడం అదే ప్రథమం. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే (మే 18న) ట్రాన్స్‌మిటర్‌ను మరో చోటికి మార్చి, బ్రీన్‌ డౌన్ (Brean Down) వరకు ఏకంగా 14 కి.మీ. దూరం సందేశాలను పంపి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మార్కోనీ కేవలం శాస్త్రవేత్తగానే మిగిలిపోక, తన బంధువులతో కలిసి 1897 జూలైలో, ప్రపంచంలో మొట్టమొదటి రేడియో కంపెనీ ‘ది వైర్‌లెస్ టెలిగ్రాఫ్ అండ్ సిగ్నల్ కంపెనీ’ పెట్టాడు. దానితో తన ప్రయోగాలకు కావలసిన నిధులు సమకూరాయి.

1898 జూలైలో ఐర్లాండ్‌లో జరిగిన ఒక పడవ పందెం (Regatta) ఫలితాలను మార్కోనీ సముద్రం మధ్యలో ఉన్న పడవ నుండి ఒడ్డుకు వైర్‌లెస్ ద్వారా పంపాడు. ‘డైలీ ఎక్స్‌ప్రెస్’ పత్రిక కోసం ఆయన సుమారు 700 సందేశాలను పంపి, పందెం జరుగుతుండగానే ఫలితాలను ప్రజలకు చేరవేశాడు. వార్తా సేకరణలో వైర్‌లెస్ ఎంత వేగంగా పనిచేస్తుందో నిరూపించిన మొదటి సందర్భం ఇది.

1899 మార్చిలో ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్‌కు ఇంగ్లీష్ ఛానల్ దాటి (50 కి.మీ. దూరం) అంతర్జాతీయ సిగ్నల్ పంపాడు. ఒక దేశం నుండి మరొక దేశానికి వైర్‌లెస్ ద్వారా సందేశం పంపడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి.

ఓ పొరబాటు కూర్చిన ఘన విజయం – అట్లాంటిక్ దాటిన వైర్‌లెస్ సందేశం

మార్కోనీ రేడియో తరంగాల ద్వారా ప్రపంచాన్ని కలిపే ప్రయత్నంలో సాధించిన అతిపెద్ద విజయం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సిగ్నల్ పంపడం.

ఈ ప్రయోగం కోసం మార్కోనీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. 1900 నాటికి మార్కోనీ తక్కువ దూరాలకు సిగ్నల్స్ పంపగలిగాడు. కానీ సుమారు 3,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాంటిక్ సముద్రం అవతలికి సమాచారం పంపడం అసాధ్యమని అప్పటి శాస్త్రవేత్తలు భావించారు. భూమి గుండ్రంగా ఉండటం వల్ల, రేడియో తరంగాలు వంగి ప్రయాణించలేవని, అవి నేరుగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయని వారు వాదించారు. కానీ మార్కోనీ తన పట్టు వదల్లేదు.

ఇతర శాస్త్రజ్ఞులు చెప్పేది నిజమైతే, తను యాభై కిలోమీటర్లకు పైగా కొండలను, సముద్రాన్ని దాటి సందేశం ఎలా పంపగలిగాడు? దిఙ్మండలం (భూమ్యాకాశాలు కలిసే చోటు) ఐదు కిలోమీటర్ల లోపలే కదా! సందేశాలు అంత దూరం ప్రయాణించడానికి కారణం, వాటికి తగిన శక్తి ఉంటే భూ ఉపరితలాన్ని అంటిపెట్టుకుని ఎంత దూరమైనా సాగిపోతాయని మార్కోనీ నమ్మాడు. అంతకు మించి వాదనలకు దిగకుండా, మరింత శక్తివంతమైన స్టేషన్లను ఎలా నిర్మించాలన్న దానిమీద దృష్టి పెట్టాడు.

1895 నుండి 1901 వరకు మార్కోనీ చేసిన ప్రయోగాలలో పరికరాలలో పెద్ద మార్పు లేదు. తరంగాలు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రసరించాలంటే, చాలా శక్తివంతమైన ట్రాన్స్‌మిటర్ కావాలి. అప్పటివరకు వాడిన బ్యాటరీలు సరిపోవు; భారీ ఎత్తున విద్యుత్తు పుట్టించగలగాలి. మార్కోనీకి భారీ విద్యుత్ ఉత్పాదన గురించిన శాస్త్ర విజ్ఞానం లేదు. అందుకు పవర్ ఇంజనీరింగ్ లో నిపుణుడైన జాన్ ఫ్లెమింగ్ (John Fleming, 1849 – 1945) ని నియమించాడు. ఫ్లెమింగ్ పేరున్న శాస్త్రవేత్త; మాక్స్ వెల్ దగ్గర చదువుకున్నాడు, విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్; ఎడిసన్ కంపెనీలో కన్సల్టెంట్ గా పని చేశాడని మొదటి వ్యాసంలో చెప్పాను.

మార్కోనీ కంపెనీ డైరెక్టర్లు మొదట్లో దీనికి అనుమతించలేదు. అంత శక్తివంతమైన ట్రాన్స్‌మిటర్ ప్రసారం, మిగిలిన మార్కోనీ స్టేషన్లలో ఉన్న ప్రసారాలకు అడ్డు తగులుతుందని వారు భయపడ్డారు. దీనికి పరిష్కారంగా, మార్కోనీ ట్రాన్స్‌మిటర్ మరియు రిసీవర్ ఒకే నియమిత తరంగ దైర్ఘ్యం (Wavelength) మీద పనిచేసే ట్యూనింగ్ పద్ధతిని కనిపెట్టాడు. దీనివల్ల వేర్వేరు స్టేషన్లు వేర్వేరు తరంగ దైర్ఘ్యాలతో ప్రసరిస్తాయి – ఒకదానికొకటి అడ్డుకోకుండా! 1900 ఏప్రిల్‌లో దీనిపై మార్కోనీ సంపాదించిన పేటెంట్ నంబర్ 7777 (ఫోర్ సెవెన్స్) గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

కంపెనీ అసలే ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉందనీ, ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమనీ డైరెక్టర్లు అభ్యంతర పెట్టారు. అట్లాంటిక్ ప్రయోగం సఫలమైతే కంపెనీ ఆర్థికంగా బాగుపడుతుందనీ, పోటీదారులెవరికీ అది సాధ్యం కాదనీ మార్కోనీ నచ్చజెప్పి ఒప్పించాడు. ఎట్టకేలకు 1900 జూలైలో డైరెక్టర్లు ఈ ప్రయోగానికి అనుమతి ఇచ్చారు.


పోల్డులో మొదటి యాంటెన్నా


ఇంగ్లాండ్‌లో లిజార్డ్ (Lizard) ద్వీపకల్పంలోని పోల్డు (Poldhu) అనే చోట ఫ్లెమింగ్ రూపకల్పన చేసిన భారీ పవర్ స్టేషన్‌ను మార్కోనీ నెలకొల్పాడు. 200-అడుగుల పొడవున్న ఇరవై కొయ్య స్తంభాలను వలయాకారంలో నిలబెట్టి, 200 తీగలతో భారీ యాంటెన్నాను తయారుచేశాడు.

అట్లాంటిక్ అవతల తీరాన, అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని కేప్ కాడ్ (Cape Cod) లో మరో స్టేషన్ పెట్టాడు. కేప్ కాడ్ అమెరికా ఈశాన్య దిక్కున ప్రధాన భూభాగం నుండి సముద్రం వైపుకు ‘చాచిన చేయి’ లాగా ఉండి, ఎదురుగా అంతులేని అట్లాంటిక్ మహాసముద్రం మాత్రమే కనిపిస్తుంది. అందుకే అమెరికన్ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో (Henry David Thoreau, 1817 – 1862), ‘అక్కడ మనిషి నిలబడితే అమెరికా అంతా అతని వెనుక ఉంటుంది’ అన్నాడు:

‘A storm in the fall or winter is the time to visit it; a light-house or a fisherman’s hut the true hotel. A man may stand there and put all America behind him.’

పరీక్షగా 1901 జూన్‌లో పోల్డు నుండి సిగ్నల్స్ పంపి, అవి 250 మైళ్ల దూరంలో ఐర్లాండ్‌లోని క్రూక్‌హేవన్ (Crookhaven) చేరినట్లు ధ్రువపరచుకున్నాడు. ఇంతలో పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. 1901 సెప్టెంబరు 17న తుఫాను రావడంతో పోల్డు స్టేషన్‌లోని ఇరవై కొయ్య స్తంభాలూ, 200 తీగలూ అన్నీ కుప్పకూలాయి. మరికొన్ని రోజులకు కేప్ కాడ్ స్టేషన్‌కు కూడా అదే గతి పట్టింది.

మరెవరికైనా గుండె బేజారై విరమించుకునేవారేమో కానీ, మార్కోనీ చెక్కుచెదరని ధైర్యంతో వెనుకంజ వేయక ముందుకు వెళ్లాడు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తన పథకంలో కొన్ని మార్పులు చేశాడు. మొదట అట్లాంటిక్ మీద ఇటు నుండి అటూ, అటు నుండి ఇటూ సిగ్నల్స్ పంపుదామనుకున్నాడు. కానీ ఇప్పుడు కేవలం ఒక వైపు నుండే (ఇంగ్లాండ్ నుండి అమెరికా వైపుకు) సిగ్నల్ పంపాలని నిర్ణయించాడు.


పోల్డులో వాడిన యాంటెన్నా


పోల్డులో ఈసారి మరీ భారీ ఎత్తున కాకుండా, నాలుగు కొయ్య స్తంభాలతో, 50 తీగలతో విసనకర్ర ఆకారంలో (Fan-like arrangement) యాంటెన్నా సిద్ధం చేశాడు. అక్టోబరు-నవంబరు నెలల్లో పరీక్షించగా, సిగ్నల్స్ క్రూక్‌హేవన్‌కు చేరుతున్నాయని నిర్ధారణ అయింది.

కేప్ కాడ్ లో మళ్ళీ యాంటెన్నాను నెలకొల్పడం కష్టమని భావించి, మార్కోనీ దానికి బదులుగా కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌లో ఉన్న సిగ్నల్ హిల్ (Signal Hill) ని తన రిసీవర్ స్టేషన్‌గా ఎంచుకున్నాడు. అక్కడ పెద్దగా నిర్మాణ పనులు చేపట్టే సమయం లేకపోవడంతో, సిగ్నల్ అందుకోవడానికి గాలిపటాలు, బెలూన్ల సహాయంతో యాంటెన్నా వైరును గాలిలోకి ఎగురవేశాడు.

1901 డిసెంబరు 10న మార్కోనీ తన లండన్ ఆఫీసుకు ఫోన్ చేసి, ‘S’ (మూడు చుక్కల) సిగ్నల్ ఎప్పుడు పంపాలో చెప్పాడు. వారు ఆయన చెప్పినట్లు చేయగా, డిసెంబరు 12న (మధ్యాహ్నం 12:30, 1:10, 2:20 గంటలకు), 13న (మధ్యాహ్నం 1:38 గంటలకు) వాతావరణం అనుకూలంగా లేకపోయినా సిగ్నల్స్ చేరాయి.


అట్లాంటిక్ దాటిన వైర్‌లెస్ సందేశం

డిసెంబరు 14న మార్కోనీ వార్తాపత్రికల వారికి తన విజయాన్ని ప్రకటించాడు. కొందరు నిపుణులు దీనిని నమ్మలేదు కానీ, సామాన్య ప్రజలు, వార్తాపత్రికలు మార్కోనీని గొప్పగా కొనియాడారు.

తరంగాలు భూఉపరితలాన్ని అంటిపెట్టుకుని సాగుతాయన్న మార్కోనీ ఆలోచన పొరపాటే. మరి అట్లాంటిక్ అవతల తీరానికి సందేశం ఎలా పంపగలిగాడు? అతనిని అదృష్టదేవత ప్రకృతి రూపంలో ఆదుకుంది. అంతరిక్షంలోకి వెళ్లే తరంగాలు అయానో ఆవరణాన్ని (Ionosphere) తాకి పరావర్తనం చెంది, సముద్ర ఉపరితలంపై పడి, తిరిగి పరావర్తనం చెంది, మరలా పైకి వెళ్లి… అలా వంకర టింకరగా పయనిస్తూ భూమి అవతలికి చేరుతాయి. ఆలివర్ హెవిసైడ్ గురించిన వ్యాసంలో దీనిని “కెన్నెల్లీ-హెవిసైడ్ లేయర్” (Kennely-Heaviside layer) అంటారని రాశాను.

వైర్‌లెస్ నివారించిన ఘోర ప్రమాదం

1909 జనవరి 23న “RMS రిపబ్లిక్” అనే విలాసవంతమైన ఓడ, దాదాపు ఏడు వందల మంది ప్రయాణీకులతో, న్యూయార్క్ నుండి బయలుదేరింది. నాన్‌టకెట్ ద్వీప సమీపాన, దట్టమైన పొగమంచు కారణంగా ‘SS ఫ్లోరిడా’ అనే మరో ఓడ రిపబ్లిక్‌ను బలంగా ఢీకొట్టింది. ఓడ మునిగిపోతుండటంతో, అందులోని వైర్‌లెస్ ఆపరేటర్ నిరంతరాయంగా సహాయం కోసం ఆపద సంకేతాలను (CQD) పంపాడు. దగ్గరలో ఉన్న రక్షక నౌకలు ఆ సంకేతాలను అందుకుని వెంటనే చేరుకుని, ప్రయాణీకులను సురక్షితంగా తరలించాయి. ఈ ఘటనతో మార్కోనీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు

మానవ చరిత్రను మార్చివేసిన మార్కోనీని అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఘనంగా సత్కరించాయి. ఆయన అందుకున్న పురస్కారాలలో 1909 భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి, ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, ఇటలీలో సెనేటర్‌షిప్ ముఖ్యమైనవి. అయితే, ఫాసిస్ట్ పార్టీలో చేరి, ఇటలీని మళ్లీ గొప్ప దేశంగా మార్చగల నాయకుడని బెనిటో ముస్సోలినీకి (Benito Mussolini, 1883 – 1945) మద్దతుగా పనిచేసి మార్కోనీ కొంత అపవాదు పాలయ్యాడు. 1937 జూలై 20న తన అరవై మూడో ఏట మార్కోనీ మరణించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో స్టేషన్లు అతనికి నివాళిగా రెండు నిమిషాల పాటు ప్రసారాలను నిలిపివేశాయి.

జగదీశ్ చంద్ర బోస్ పాత్ర

ఇప్పటి వరకు నేను రాసిన దాదాపు రెండు వేల సంవత్సరాల విజ్ఞాన శాస్త్ర చరిత్రలో భారతీయుల పాత్ర దాదాపు శూన్యమన్న విషయం బాధాకరమైనా వాస్తవం. పందొమ్మిదో శతాబ్దం చివరలో మాత్రం భారతదేశంలో భౌతికశాస్త్ర విజ్ఞాన దీపం వెలగనారంభించింది. అందుకు జగదీశ్ చంద్ర బోస్ (Jagadish Chandra Bose, 1858 – 1937) కృషి మన్నదగినది. మనమంతా ఆయన చేసిన జీవశాస్త్ర పరిశోధనల గురించి చదువుకున్నాం కానీ, బోస్ జీవశాస్త్రం కంటే ముందే రేడియో తరంగాలపై చెప్పుకోదగ్గ పరిశోధనలు చేశాడు.


రాయల్ ఇన్స్టిట్యూషన్ లో ప్రసంగిస్తున్న బోస్ (1897)

1895 నవంబర్‌లో కలకత్తా టౌన్ హాల్‌లో జరిగిన ఒక బహిరంగ ప్రదర్శనలో, మిల్లీమీటర్ శ్రేణి తరంగదైర్ఘ్యం గల సూక్ష్మ తరంగాలు (Microwaves) రెండు గోడలను దాటుకుని 23 మీటర్ల దూరం ప్రయాణించగలవని బోస్ చూపెట్టాడు. 1896-1897 మధ్యన ఆయన లండన్ వెళ్లి తన ప్రయోగ ఫలితాలతో అగ్రశ్రేణి శాస్త్రవేత్తల మన్ననలు పొందాడు.

వాటి గురించి తెలుసుకున్న రవీంద్రనాథ్ టాగోర్ తన స్నేహితుడైన బోస్‌ను అభినందిస్తూ రాసిన కవిత:

ఆంగ్ల అనువాదం


To: Professor Jagadish Chandra Bose
Across the oceans, on the western shore,
Reigns the temple of the Goddess
Of wealth of science.
There you have journeyed, my friend,
And returned richly crowned.
You anointed the motherland,
Modest at heart, poor and shy.

The great and the gloried
Of these far-off lands
Assembled and acclaimed
Your work in unison,
The words resounding their message,
Far and wide, the seas beyond.

Her eyes welled up in tears,
Mother sends you the Message
Of her humbled heart,
Through a poet of whom
The world of science has never heard.
Only in the inner self of yours,
Will these words echo
As gentle murmurs of
Mother’s whispered tone.
– Tagore’s message to Bose (19th July 1897), translated by Sugata Basu Sengupta

బెంగాలీమూలం తెలుగులిపిలో


భారతేర్ కోనో బృద్ధ ఋషిర్ తరుణ్ మూరతి తుమి హే ఆర్య సుహృద్,
బిద్యానిధి జగదీశ్.
బిదేశేర్ జయడంకా ఘోషిఛే యఖన్,
తుమి ఏకా దాఁడాఇయా సే బిజయ్-మాఝే
బిస్మయ్-బిముగ్ధ చోఖే హేరిఛ్ జననీ
అపూర్బ మహిమా లభి’ భారతేర్ కోలే.

యేదిన్ శునిలే తుమి సాగరపారేతే
లక్ష్మీర్ మందిరతలే బిజ్ఞానేర్ సరస్బతీ బిరాజే,
సేదిన్ బాల్యబంధు మోర్,
శూన్యహస్తే చలిలే సేథాయ్,
ఫిరే ఏలే జయీ హయే మాతృ-అభిషేకే.
సజ్జాహీన్ దీనా హీన్ జననీ తోమార్
లభిల్ గౌరబ్ ఆజి జగత్-సమక్షే.

ఏకదా యశేర్ లాగి దేశబిదేశేర్ ద్వారే
హే బిజ్ఞాన్-తపస్బీ, ఫేరో నాఇ కభు.
నిభృత్ సాధనా తబ్ జయయుక్త హోక్ ఆజ్,
స్వదేశేర్ ఆశీర్వాద్ లఓ శిర్ పాతి.

బెంగాలీమూలానికి తెలుగు అనువాదం


భారతీయ ప్రాచీన మహర్షుల నవయుగరూపానివి నీవు,
ఓ ఆర్యమిత్రమా, విద్యానిధి జగదీశ.
విదేశీ జయఢంకా మ్రోగే విజ్ఞానవేదికలపై
వారి విజయనాదాలమధ్య నీవొంటరివై నిలిచి
విస్మయ విముగ్ధ నేత్రాలతో మాతృమూర్తినే తలచి
అపూర్వ మహతిని సాధించావు — ఆ జనని కోసం.

సాగరమున కవ్వల, పశ్చిమ తీరాన,
సిరిసంపదల లక్ష్మీదేవి మందిరములో
విజ్ఞాన సరస్వతి కొలువై ఉందని విన్ననాడు,
నా బాల్య మిత్రమా!
రిక్త హస్తాలతో నీవు అక్కడికి పయనమయ్యావు;
కానీ తిరిగి వచ్చేటప్పుడు విజయ కిరీటముతో వచ్చి
మాతృమూర్తికి పట్టాభిషేకం చేశావు.
అభూషిత-దీన-వినమ్ర అయిన నీ జననీ
నేడు జగత్తు ముందు నీ వల్లనే మహోన్నత గౌరవాన్ని పొందింది.

కీర్తికాంక్షతో విదేశాల ద్వారాల చెంత
ఓ విజ్ఞాన తపస్వీ! నీవు ఎన్నడూ నిలబడలేదు.
నీ నిభృత సాధన నేడు జయప్రదం కానీ!
స్వదేశీయుల ఆశీస్సులను శిరసావహించి స్వీకరించు.

మార్కోనీ మొదట్లో వాడిన లోహపు పొడి కొహెరర్‌లో, రేడియో తరంగాలు తగిలినప్పుడు ఆ పొడి కణాలు ఒకదానికొకటి అంటుకుపోయేవి. మళ్ళీ రెండో సిగ్నల్ తీసుకోవాలంటే ఆ గొట్టాన్ని ఒక చిన్న సుత్తి (Tapper) తో తట్టి, ఆ కణాలను విడదీయాల్సి వచ్చేది (లాడ్జ్ కనుగొన్నది ఇదే). 1899లో, బోస్ ‘సెల్ఫ్-రీస్టోరింగ్ మెర్క్యురీ కొహెరర్’ (దానంతట అదే యథాస్థితికి వచ్చే పాదరస గ్రాహకం) అన్న పరిశోధనా పత్రాన్ని ప్రచురించాడు. బోస్ రూపొందించిన పాదరస కొహెరర్‌లో, సిగ్నల్ ఆగిపోగానే పాదరసం తన సహజ స్థితికి వచ్చేసేది. దీనివల్ల ‘తట్టుడు’ అవసరం లేదు.

మార్కోనీ తన 1901 అట్లాంటిక్ ప్రయోగంలో వాడిన రిసీవర్‌ను “ఇటాలియన్ నేవీ కొహెరర్” అని పిలిచాడు. దీనిని తన స్నేహితుడు లూయిగి సోలారీ (Luigi Solari) తనకు ఇచ్చాడని మార్కోనీ చెప్పాడు. సోలారీ తాను ఏదో పత్రికలో దాని గురించి చదివాననీ, వివరాలు గుర్తు లేవనీ అన్నాడు.

కొందరు చరిత్రకారుల ప్రకారం, ఆ రిసీవర్ డిజైన్ ఖచ్చితంగా జె.సి. బోస్ కనిపెట్టిన డిజైనే అనీ, మార్కోనీ దాన్ని వాడుకున్నాడు కానీ, ఎక్కడా బోస్ పేరును ప్రస్తావించలేదు అనీ ఆరోపించారు.

ఇది వివాదాస్పదమైన విషయం. ఎవరి గొప్ప వారిదే అని వదిలేసి, బోస్ ప్రాముఖ్యతని అతని పరిశోధనా పత్రాల సంకలనానికి ఉన్న ముందుమాటతో గుర్తుంచుకుందాం:

“విద్యుత్ తరంగాలపై హెర్ట్‌జ్‌ చేసిన ప్రయోగాల ఫలితాలు వెలువడిన కొత్తలో, ఆ రంగంలో పరిశోధనలు చాలా ఉత్సాహంగా జరుగుతున్న కాలంలో, అప్పట్లో సాధారణంగా వాడే తరంగాల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన విద్యుత్ తరంగాలను సృష్టించి బోస్ ఈ పరిశోధనలని సులభతరం చేశాడు.

కేవలం భౌతిక శాస్త్రానికే పరిమితం కాకుండా, భౌతిక శాస్త్ర పద్ధతులను జీవపదార్థాల అధ్యయనానికి అన్వయించడం గురించి కూడా కొన్ని వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన పరిశోధనలన్నీ ఎక్కువగా ఈ అంశంపైనే సాగాయి.

ఈ వ్యాసాలు చదవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిలోని మరొక ముఖ్యమైన కోణం —ఇండియాలో భౌతిక శాస్త్ర పరిశోధనల పట్ల మళ్లీ ఆసక్తి చిగురించడానికి ఇవి నాంది పలికాయి. గత ముప్పై ఏళ్లుగా ఇండియాలో కనిపిస్తున్న ఈ పరిశోధనా విప్లవానికి సర్ జగదీశ్ చంద్ర బోస్ కృషీ, ప్రభావమే ప్రధాన కారణం.”

కొలంబస్ — కోడిగుడ్డు

ఇంగ్లాండుకు వచ్చిన ఏడాదికే, అంటే 1897 నాటికి మార్కోనీ పేరు ప్రఖ్యాతులు చూసి అసూయపడిన విమర్శకులు అతన్ని తక్కువ చేసి మాట్లాడేవారు: ‘హెర్ట్‌జ్‌ తరంగాలను కనిపెట్టాడు, బ్రాన్లీ కోహెరర్‌ను తయారు చేశాడు, లాడ్జ్ దానిని మెరుగుపరిచాడు; ఇందులో మార్కోనీ సొంతంగా సాధించింది ఏముంది?’

ఆ విమర్శకులకు సమాధానంగా విలియం ప్రీస్ ఈ ‘కొలంబస్ కోడిగుడ్డు’ కథను చెప్పాడు. కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత కొందరు ‘సముద్రంలో ప్రయాణిస్తే ఎవరైనా కొత్త భూమిని కనుగొనవచ్చు, ఇందులో విశేషమేముంది?’ అని ఎద్దేవా చేశారు. అప్పుడు కొలంబస్ ఒక కోడిగుడ్డును తీసుకుని, ‘దీన్ని నిలువుగా నిలబెట్టండి’ అని వారికి సవాలు విసిరాడు. ఎవరూ సాధ్యం కాదన్నప్పుడు, కొలంబస్ ఆ గుడ్డు అడుగు భాగాన్ని మెల్లగా బల్ల మీద కొట్టి, అది కాస్త చదునుగా అయ్యేలా చేసి నిలబెట్టాడు. ‘ఇంతే కదా! ఇది మేము కూడా చేయగలము’ అని వారు అనగా, ‘నేను చేసి చూపించే వరకు ఇది ఎవరికీ తట్టలేదు, అదే నా ప్రత్యేకత’ అని కొలంబస్ సమాధానమిచ్చాడు.

మార్కోనీ విషయంలో కూడా ప్రీస్ ఇదే వాదన చేశాడు. హెర్ట్‌జ్, బ్రాన్లీ, లాడ్జ్ వంటి వారు పరిశోధనలు చేసినప్పటికీ, వాటన్నింటినీ కలిపి ఒక పని చేసే వైర్‌లెస్ వ్యవస్థగా మార్చాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. ఆ పనిని మార్కోనీ చేసి చూపించాడు. అందుకే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలవడానికి ఆయన పూర్తిగా అర్హుడు.

1800లో వోల్టా బ్యాటరీని కనుగొనడంతో మొదలైన విద్యుత్ శక్తి, ప్రారంభంలో కేవలం శాస్త్రవేత్తల పరిశోధనలకే పరిమితమైంది. మరో వంద ఏళ్లకు ఫారడే, మ్యాక్స్‌వెల్, హెర్ట్‌జ్, మార్కోనీ తదితరుల కృషితో సామాన్య మానవుని నిత్య జీవితంలో అత్యంత కీలకమైంది. కానీ విద్యుత్ ప్రవాహం వెనుక నిజంగా కదిలేది ఏమిటన్నది పందొమ్మిదో శతాబ్దం చివరి నాటికీ అగోచరంగానే మిగిలిపోయింది. ఆ రహస్యాన్ని ఛేదించి ‘ఎలక్ట్రాన్’ను కనుగొన్న శాస్త్రవేత్త, బోస్ పరిశోధనా పత్రాల సంకలనానికి ముందుమాట రాసిన జె.జె. థామ్సన్. ఆ కథ వచ్చే సంచికలో.

మూలాలు:

  1. Gugliemo Marconi. Wireless telegraphic communication. Nobel Lecture. 1909.
  2. Orrin E. Dunlap Jr. Marconi: The Man and his Wireless. The Macmillan Company. 1937.
  3. Sungook Hong. Marconi’s Error: The First Transatlantic Wireless Telegraphy in 1901. Social Research, Vol. 72, No. 1, Errors: Consequences of Big Mistakes in the Natural and Social Sciences (SPRING 2005), pp. 107-124.
  4. Mark Raboy. Marconi: The Man Who Networked the World. Oxford University Press. 2016.
  5. Kunal Ghosh. Unsung Genius: A Life of Jagadish Chandra Bose. Aleph Book Company. 2022.

కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి:

పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది వాషింగ్‌టన్ రాష్ట్రంలో సియాటల్ నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో.

దాదాపు నలభై యేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత కొంతకాలంలో కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం – అదీ ప్రస్తుత వ్యాపకం.

 ...