సీత గడియ

ఒక చిన్న ముందుమాట:

ఊర్మిళాదేవి నిద్రను గురించి నేను రాసిన వ్యాసం చాలా చర్చకి దారితీయడం నేను గమనించాను. నా వ్యాసాన్ని శ్రద్ధగా చదివి దానిమీద విమర్శలని అంత శ్రద్ధగానూ చెప్పిన పాఠకులకి నా నమస్కారాలు. చర్చలన్నీ చదవడానికి సరదాగా వున్నాయి. చక్కని స్నేహపూర్వక సంభాషణల్లో ఆ దగ్గరతనం ముచ్చటగా ఉంది. ఒకటో అరో knee-jerk reactions. అయినా, మొత్తం అందరిలోనూ కనిపించే ఉత్సాహాన్ని చూసి నేను హర్షిస్తున్నాను. అంచేత మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా వ్యాసం బాగుందని మెచ్చుకున్న మద్దిపాటి కృష్ణారావుగారికి, లైలాగారికీ, బాధ్యత తీసుకుని అమెరికాలో folklore మీద వచ్చిన పరిశోధనలని సంపుటీకరిస్తూ ఆలోచనాత్మకంగా రాసిన పరుచూరి శ్రీనివాస్‌గారికీ, ఈ వాద ప్రతివాదాల్లో ఈ పాటని అర్థం చేసుకునే విధానం ఉందని గుర్తించిన రవిగారికీ నా ధన్యవాదాలు. నా వ్యాసం మీద విమర్శలలో ప్రధానమైనది:

శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ][1] సృష్టిలో నేను యెరుగ

అనే చరణాలు ఎలా చదవాలి, అనేది. కామేశ్వరరావుగారు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం ఈ చరణాలతో ఆగిపోదు. మొత్తం ఈ పాటని నేను అర్థం చేసుకున్న తీరుతో ఇది ముడిపడి వుంది. చాలాకాలంగా మరుగున పడిపోయిన ఈ పాటలు ఇప్పుడు పాడుతున్న వాళ్ళు తగ్గిపోయారు. అచ్చుతప్పుల్తో, చరణాల మార్పుల్తో నాసిరకం కాగితాలమీద పడివున్న ఈ పాటలు ఎలా చదవాలి, ఎలా బోధపరుచుకోవాలి, వీటిని ఎలా పరిష్కరించాలి, అనేవి నన్ను ఆలోచింపజేసిన సమస్యలు.

నాకు తెలిసి ఈ పాటలమీద ఆలోచన చేసిన వాళ్ళు ముగ్గురు: ఇల్లిందల సరస్వతీదేవి (1951), శ్రీపాద గోపాలకృష్ణమూర్తి (1955), కోలవెన్ను మలయవాసిని (1986). వీరిలో మలయవాసినిగారిని నేను బాగా ఎరుగుదును. ఆవిడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలొ నాకు సీనియరు. ఆవిడ ఈ పాటలు చక్కగా పాడతారు కూడా. ఈ పాటల గురించి ఆవిణ్ణి చాలాసార్లు సంప్రదించాను.

నేను దాదాపు 1980 ప్రాంతాల నించి వీటిని చదవడం మొదలుపెట్టాను. నాకు మనస్సులో వున్నవల్లా ఇవి నా చిన్నతంలో విన్న జ్ఞాపకాలే. వీటిని నిశ్శబ్దంగా చదువుతున్నా కూడా ఆ గొంతుకలు నామనస్సులో మెదిలేవి. ఈ పాటల్ని నేను అర్థం చేసుకున్న తీరుకి ఈ జ్ఞాపకాలే ఆధారం. చాలాకాలం నా ఊహల్ని తెలుగులో కాగితం మీద పెట్టలేదు, మలయవాసినిగారి పుస్తకానికి నేను రాసిన చిన్న అభిప్రాయంలో తప్ప. ఇంగ్లీషులో చాలా రాశాను కాని అవి తెలుగు విమర్శకులకి అందినట్లు లేదు.

నేనెరుగున్న చాలామంది పాతకాలపు ఆడవాళ్ళు ఇలాటి పాటలు ఒక పుస్తకంలో రాసుకుని పెట్టుకునేవారు. అవి పాడే బాణి నేర్చుకుని ఆ పుస్తకం చూసి పాడేవాళ్ళు. తరుచు పాడడం వల్ల కొన్ని పాటలూ, పాటలో కొన్ని భాగాలూ వాళ్ళకి కంఠతా వొచ్చేవి. అంటే, ఈ పాటలు మన కావ్య సాహిత్యంలో వున్న పద్యాల లాటివే. ప్రాచీన సాహిత్యం చదివేవాళ్ళకి కావ్యం అంతా కంఠతా రాదు, కాని పద్యం చదివే పద్ధతి తెలుసు, కొన్ని పద్యాలు కంఠతా వొచ్చు. జానపద వాఙ్మయం అని ఆధునికులు ఇంగ్లీషులో folkloreకి పర్యాయ పదంగా కృతకంగా తయారు చేసిన విభాగంలో ఈ పాటలు చేర్చడం పొరపాటు. ఈ మాట సంపాదకుల సౌహార్దత వల్ల, ఎవరికీ పట్టకుండా మూలపడిపోయి, నశించిపోతున్న ఈ పాటలు పాఠకుల దృష్టికి వొచ్చినందుకు సంతోషంగా వుంది. వీటివిషయంలో, ఎవరికైనా ఆసక్తి వుంటే, చెయ్యవలసింది చాలా వుంది.

మీ ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఎవరేనా ఈ పాటలు పాడుతూ వుంటే, దయచేసి వాటిని శ్రద్ధగా రికార్డ్‌ చెయ్యండి. ఆ పాడిన వాళ్ళతో మాట్లాడి అవి వాళ్ళు ఎక్కడ, ఎవరి దగ్గర్నించి ఎలా నేర్చుకున్నారో తెలుసుకోండి. వాళ్ళకి చదవడం రాయడం ఎంతవరకూ వొచ్చో తెలుసుకోండి. వాళ్ళు పాడే సందర్భం, పాడే జాగా, పాడేటప్పుడు ఎవరు శ్రోతలుగా వుండేవాళ్ళు, వాళ్ళ వయస్సులూ, చుట్టరికాలూ, ఇలాటి వివరాలు అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఈ పాటలు రాసుకున్న రాత పుస్తకాలు ఏవన్నా దొరికితే దయచేసి అవి జాగ్రత్త పెట్టండి. వాళ్ళు పాట అంతా జ్ఞాపకం ఆధారంగా పాడుతున్నారా, రాసుకున్న పుస్తకం చూసి పాడుతున్నారా అన్న సంగతి గమనించండి. నాకు తెలిసినంత వరకు, ఈ పాటలకి ప్రత్యక్ష సాక్షుల ఆచూకీ ఆధారంగా వీటిని 150యేళ్ళ వెనక వరకూ తీసికెళ్ళచ్చు. అంతకన్నా వెనక్కి వెళ్ళగలమేమో చూడండి. ఒట్టి వూహల ఆధారంగా నిర్ణయాలు చెయ్యకండి. పాడిన పాట విని, కాగితంమీద రాయండి. బాధ్యతగా, స్పెల్లింగులు మార్చకుండా పాడింది పాడినట్టు రాయండి. ఈ పాటలు పరిష్కరించడానికి ఇది ఒక ముఖ్యమైన ఆధారం.

ఈ పాటల గుజిలీ ప్రతులూ, ఆంధ్ర సారస్వత పరిషత్తు వాళ్ళు వేసిన స్త్రీల రామాయణపు పాటలు రెండోముద్రణా తేలికగానే దొరుకుతాయి. మలయవాసినిగారి పుస్తకం అచ్చులో వున్నట్టు లేదు. మంజువాణీప్రెస్సు నందిరాజు చలపతి రావుగారు ప్రకటించిన స్త్రీల పాటలు మూడోభాగం మాత్రం (పరుచూరి ధర్మమా అని) నాకు దొరికింది. మిగతా భాగాలు మీకు దొరికితే ఈమాట ద్వారా చెప్పండి.

నందిరాజు చలపతి రావుగారు ప్రకటించిన వాట్లో స్త్రీలు పాడుకునే పాటలూ, స్త్రీల కోసం చలపతిరావు గారు రాసిన పాటలూ కలిసిపోయాయి. వీటిని విడదియ్యడం పెద్ద కష్టం కాదు కాని, విడదియ్యాలి. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి ప్రచురణలో కూడ పురుషులు రాసిన పాటలు కలిసిపోయాయి. అవీ విడదియ్యడం కష్టం కాదు. స్త్రీల పాటలకి ఒక గొంతుక వుంది, ఒక విశిష్టమైన పద సంపద వుంది. ఆ మాటలు ఈ పాటల్లో తప్ప ఇతర తెలుగు సాహిత్యంలో కనిపించవు. వీటిలో చాలా వాటికి అర్థాలు తెలియడంలేదు. అవి స్త్రీలలో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ముందు ఒక పదప్రయోగ సూచిక తయారు చేస్తే తరవాత వాటి అర్థాల గురించి ఆలోచించవచ్చు.

ఈ పాటల్లో నిజంగా మంచి కవిత్వం స్థాయికి వచ్చే రచనలున్నాయి. అందులో మచ్చుకి ఒకటో, రెండో రచనలు నేను ఈమాటలో పరిశీలిద్దామని మొదలుపెట్టాను. ఈ వ్యాసం కూడా ఓపికగా చదువుతారనీ మీ అభిప్రాయాలు చెప్తారనీ ఆశిస్తాను.

విధేయుడు
నారా


సీత గడియ

శ్రీరామ. భూసతికి చేడెయై పుట్టీ
కూర్మితో జనకునీ కూతురై పెరిగీ

అంటూ ఈ పాట మా అమ్మ పాడడం నా కిప్పటికీ గుర్తుంది. ఈ పాట పేరు సీత గడియ అని ఉండడం ఒక విశేషం. నిజానికిది రాముడు పెట్టిన గడియ. అంచేత రాము(డి) గడియ అవాలి. కాని సీత గడియ అని ఈ పాటకి పేరు పెట్టడంలో ఒక చమత్కారం ఉంది. గడియ పెట్టినవాడు రాముడైతే కావచ్చు గానీ అది తీయించింది సీత. ఆ గడియ తీయించడంలో సీత చూపించిన నేర్పు ఈ పాటలో ప్రధాన విషయం. అందుకని ఇది సీత తీయించిన గడియ. ఆ ప్రకారంగా ఇది సీత గడియ.

ఈ పాట శ్రీరాముడికి నమస్కారంతో మొదలౌతుంది. మొన్నమొన్నటి వరకు కాగితం మీద ఏది రాసినా పైన శ్రీరామ అని రాయడం తెలుగువాళ్ళకి అలవాటుగా వుండేది. “ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండు గావుత”[2] అనే మాట ఈ నమ్మకానికి ఒక గుర్తు. ఈ పాటలో కవయిత్రి మొదట్లో ‘శ్రీరామ’ అని, తరవాత పాట మొదలుపెట్టడం వల్ల, ఈ పాట మొదట రాయబడిందని అనుకోడానికి ఒక ఆస్కారం కలుగుతోంది. ఇది ఎవరో చదువుకున్న కవయిత్రి తన తోటివాళ్ళు పాడుకోడానికి రాసిన పాట[3].

తలుపు దగ్గర పాటలు తెలుగులో కొన్ని పరిచితంగా ఉన్నాయి. విష్ణుమూర్తి తన ప్రియురాలు చెంచులక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తే, లక్ష్మీదేవి అతన్ని లోపలికి రానీయకుండా నిలబెట్టిన సందర్భాన్ని గురించి పాడిన పాట ముచ్చటగా ఉంటుంది. 1888 సెప్టెంబరులో Indian Antiquaryలో పండిత S.M. నటేశశాస్త్రి గారు ఈ పాటని Epithalamia అనే వర్గంలో చేర్చవచ్చునని చెప్పి ప్రకటించారు. దానిలో లక్ష్మి విష్ణుమూర్తిని రకరకాలుగా ఆట పట్టిస్తుంది. చివరికి విష్ణుమూర్తి తన తప్పుని ఒప్పుకుని క్షమార్పణ చెప్పుకున్నాకనే తలుపు తీస్తుంది. ఇలాంటి పాటలు స్త్రీల పాటలలో కనీసం ఇప్పటికీ కొన్నైనా దొరుకుతాయి.

కాని సీత గడియ అలాటి పాట కాదు. తేలిగ్గా కనిపించే ఈ పాటలో బలమైన నిర్మాణదక్షత ఉంది; ప్రతిభావంతమైన భావనాశక్తి ఉంది. మాటని జాగ్రత్తగా, పొదుపుగా వాడే ప్రత్యేకత ఉంది. అంతకు మించి తన నైపుణ్యంతో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, సమిష్టి కుటుంబంలో నిబ్బరంగా మెలగగల స్త్రీ ప్రత్యేకతని సున్నితంగా చిత్రించిన నేర్పు ఉంది.

ఈ పాట దొంతరదొంతరులుగా నిర్మించబడింది. మొదటి దొంతరలొ సీత తన అత్తగారికీ, మామగారికీ భక్తిశ్రద్ధలతో ఉపచారాలు చెయ్యడం వర్ణించింది కవయిత్రి. ఇది రెండు పంక్తులలో క్లుప్తంగా ముగించినా ఈ పని పూర్తిచేసుకోడానికి సీతకి చాలా సేపు పట్టిందని శ్రీరాముడు పిలిచినప్పుడు పడకగదిలోకి ఆమె వెళ్ళలేదని చెప్పడం వల్ల తెలుస్తుంది. ఆయన చక్కగా

జాజులు తలదాల్చి జవ్వాది యలది
వేచియు తానుండి వేడుకను విభుడు

అప్పుడు మొగవాళ్ళు తలలో పువ్వులు పెట్టుకునే వాళ్ళు. అయినా ఇక్కడ ఆ సంగతి ప్రత్యేకించి చెప్పినప్పుడు రాముణ్ణి ప్రబంధనాయిక అయిన వాసకసజ్జికకి మొగ రూపంగా కవయిత్రి ఊహించిందని ఒక్క క్షణం ఆలోచిస్తే తడుతుంది.

ఎదురెదురు చూచెను వెలది రాదనుచు
తడవయ్యె రాదని తొందర పడుచు
సూర్యవంశజు డపుడు సొరిది కోపించి
ఘడియ గ్రక్కున బెట్టె కాకుత్సుడపుడు
సీతరో నీ పనులు చేయుట కాద
అవనిజ మైమరిచి నీవు వున్నావ
అని తలపంకించి కడు భ్రమ జెంది
శయ్యపై పవళించె రామచంద్రూలు.

ఎప్పటికీ సీత రాకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి పడకగది తలుపు గడియ పెట్టేస్తాడు. నీ పనులిలా ఉన్నాయా, నీకు వొళ్ళూ పై తెలియడం లేదు అని తల పంకించి ‘కడు భ్రమ చెంది’ పక్కమీద పడుకుంటాడు. ఇక్కడ ‘భ్రమ చెందడం’ చాలా అర్థవంతమైన మాట. లేనిది ఉన్నదని ఊహించుకోవడం భ్రమ. రాముడు తనకి సీత మీద లేని అధికారం ఉన్నదని ఊహించుకుంటున్నాడు. అది అతని భ్రమ. ఇది వొళ్ళూ పై తెలియని కోపంలొ కలిగే స్థితి. లేదా ఇది శృంగార చేష్టల్లో ఒకటి. ఏ సంగతీ మనకి తరవాత తెలుస్తుంది.