ఒక చిన్న ముందుమాట:
ఊర్మిళాదేవి నిద్రను గురించి నేను రాసిన వ్యాసం చాలా చర్చకి దారితీయడం నేను గమనించాను. నా వ్యాసాన్ని శ్రద్ధగా చదివి దానిమీద విమర్శలని అంత శ్రద్ధగానూ చెప్పిన పాఠకులకి నా నమస్కారాలు. చర్చలన్నీ చదవడానికి సరదాగా వున్నాయి. చక్కని స్నేహపూర్వక సంభాషణల్లో ఆ దగ్గరతనం ముచ్చటగా ఉంది. ఒకటో అరో knee-jerk reactions. అయినా, మొత్తం అందరిలోనూ కనిపించే ఉత్సాహాన్ని చూసి నేను హర్షిస్తున్నాను. అంచేత మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా వ్యాసం బాగుందని మెచ్చుకున్న మద్దిపాటి కృష్ణారావుగారికి, లైలాగారికీ, బాధ్యత తీసుకుని అమెరికాలో folklore మీద వచ్చిన పరిశోధనలని సంపుటీకరిస్తూ ఆలోచనాత్మకంగా రాసిన పరుచూరి శ్రీనివాస్‌గారికీ, ఈ వాద ప్రతివాదాల్లో ఈ పాటని అర్థం చేసుకునే విధానం ఉందని గుర్తించిన రవిగారికీ నా ధన్యవాదాలు. నా వ్యాసం మీద విమర్శలలో ప్రధానమైనది:
శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ][1] సృష్టిలో నేను యెరుగ
అనే చరణాలు ఎలా చదవాలి, అనేది. కామేశ్వరరావుగారు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం ఈ చరణాలతో ఆగిపోదు. మొత్తం ఈ పాటని నేను అర్థం చేసుకున్న తీరుతో ఇది ముడిపడి వుంది. చాలాకాలంగా మరుగున పడిపోయిన ఈ పాటలు ఇప్పుడు పాడుతున్న వాళ్ళు తగ్గిపోయారు. అచ్చుతప్పుల్తో, చరణాల మార్పుల్తో నాసిరకం కాగితాలమీద పడివున్న ఈ పాటలు ఎలా చదవాలి, ఎలా బోధపరుచుకోవాలి, వీటిని ఎలా పరిష్కరించాలి, అనేవి నన్ను ఆలోచింపజేసిన సమస్యలు.
నాకు తెలిసి ఈ పాటలమీద ఆలోచన చేసిన వాళ్ళు ముగ్గురు: ఇల్లిందల సరస్వతీదేవి (1951), శ్రీపాద గోపాలకృష్ణమూర్తి (1955), కోలవెన్ను మలయవాసిని (1986). వీరిలో మలయవాసినిగారిని నేను బాగా ఎరుగుదును. ఆవిడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలొ నాకు సీనియరు. ఆవిడ ఈ పాటలు చక్కగా పాడతారు కూడా. ఈ పాటల గురించి ఆవిణ్ణి చాలాసార్లు సంప్రదించాను.
నేను దాదాపు 1980 ప్రాంతాల నించి వీటిని చదవడం మొదలుపెట్టాను. నాకు మనస్సులో వున్నవల్లా ఇవి నా చిన్నతంలో విన్న జ్ఞాపకాలే. వీటిని నిశ్శబ్దంగా చదువుతున్నా కూడా ఆ గొంతుకలు నామనస్సులో మెదిలేవి. ఈ పాటల్ని నేను అర్థం చేసుకున్న తీరుకి ఈ జ్ఞాపకాలే ఆధారం. చాలాకాలం నా ఊహల్ని తెలుగులో కాగితం మీద పెట్టలేదు, మలయవాసినిగారి పుస్తకానికి నేను రాసిన చిన్న అభిప్రాయంలో తప్ప. ఇంగ్లీషులో చాలా రాశాను కాని అవి తెలుగు విమర్శకులకి అందినట్లు లేదు.
నేనెరుగున్న చాలామంది పాతకాలపు ఆడవాళ్ళు ఇలాటి పాటలు ఒక పుస్తకంలో రాసుకుని పెట్టుకునేవారు. అవి పాడే బాణి నేర్చుకుని ఆ పుస్తకం చూసి పాడేవాళ్ళు. తరుచు పాడడం వల్ల కొన్ని పాటలూ, పాటలో కొన్ని భాగాలూ వాళ్ళకి కంఠతా వొచ్చేవి. అంటే, ఈ పాటలు మన కావ్య సాహిత్యంలో వున్న పద్యాల లాటివే. ప్రాచీన సాహిత్యం చదివేవాళ్ళకి కావ్యం అంతా కంఠతా రాదు, కాని పద్యం చదివే పద్ధతి తెలుసు, కొన్ని పద్యాలు కంఠతా వొచ్చు. జానపద వాఙ్మయం అని ఆధునికులు ఇంగ్లీషులో folkloreకి పర్యాయ పదంగా కృతకంగా తయారు చేసిన విభాగంలో ఈ పాటలు చేర్చడం పొరపాటు. ఈ మాట సంపాదకుల సౌహార్దత వల్ల, ఎవరికీ పట్టకుండా మూలపడిపోయి, నశించిపోతున్న ఈ పాటలు పాఠకుల దృష్టికి వొచ్చినందుకు సంతోషంగా వుంది. వీటివిషయంలో, ఎవరికైనా ఆసక్తి వుంటే, చెయ్యవలసింది చాలా వుంది.
మీ ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఎవరేనా ఈ పాటలు పాడుతూ వుంటే, దయచేసి వాటిని శ్రద్ధగా రికార్డ్ చెయ్యండి. ఆ పాడిన వాళ్ళతో మాట్లాడి అవి వాళ్ళు ఎక్కడ, ఎవరి దగ్గర్నించి ఎలా నేర్చుకున్నారో తెలుసుకోండి. వాళ్ళకి చదవడం రాయడం ఎంతవరకూ వొచ్చో తెలుసుకోండి. వాళ్ళు పాడే సందర్భం, పాడే జాగా, పాడేటప్పుడు ఎవరు శ్రోతలుగా వుండేవాళ్ళు, వాళ్ళ వయస్సులూ, చుట్టరికాలూ, ఇలాటి వివరాలు అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఈ పాటలు రాసుకున్న రాత పుస్తకాలు ఏవన్నా దొరికితే దయచేసి అవి జాగ్రత్త పెట్టండి. వాళ్ళు పాట అంతా జ్ఞాపకం ఆధారంగా పాడుతున్నారా, రాసుకున్న పుస్తకం చూసి పాడుతున్నారా అన్న సంగతి గమనించండి. నాకు తెలిసినంత వరకు, ఈ పాటలకి ప్రత్యక్ష సాక్షుల ఆచూకీ ఆధారంగా వీటిని 150యేళ్ళ వెనక వరకూ తీసికెళ్ళచ్చు. అంతకన్నా వెనక్కి వెళ్ళగలమేమో చూడండి. ఒట్టి వూహల ఆధారంగా నిర్ణయాలు చెయ్యకండి. పాడిన పాట విని, కాగితంమీద రాయండి. బాధ్యతగా, స్పెల్లింగులు మార్చకుండా పాడింది పాడినట్టు రాయండి. ఈ పాటలు పరిష్కరించడానికి ఇది ఒక ముఖ్యమైన ఆధారం.
ఈ పాటల గుజిలీ ప్రతులూ, ఆంధ్ర సారస్వత పరిషత్తు వాళ్ళు వేసిన స్త్రీల రామాయణపు పాటలు రెండోముద్రణా తేలికగానే దొరుకుతాయి. మలయవాసినిగారి పుస్తకం అచ్చులో వున్నట్టు లేదు. మంజువాణీప్రెస్సు నందిరాజు చలపతి రావుగారు ప్రకటించిన స్త్రీల పాటలు మూడోభాగం మాత్రం (పరుచూరి ధర్మమా అని) నాకు దొరికింది. మిగతా భాగాలు మీకు దొరికితే ఈమాట ద్వారా చెప్పండి.
నందిరాజు చలపతి రావుగారు ప్రకటించిన వాట్లో స్త్రీలు పాడుకునే పాటలూ, స్త్రీల కోసం చలపతిరావు గారు రాసిన పాటలూ కలిసిపోయాయి. వీటిని విడదియ్యడం పెద్ద కష్టం కాదు కాని, విడదియ్యాలి. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి ప్రచురణలో కూడ పురుషులు రాసిన పాటలు కలిసిపోయాయి. అవీ విడదియ్యడం కష్టం కాదు. స్త్రీల పాటలకి ఒక గొంతుక వుంది, ఒక విశిష్టమైన పద సంపద వుంది. ఆ మాటలు ఈ పాటల్లో తప్ప ఇతర తెలుగు సాహిత్యంలో కనిపించవు. వీటిలో చాలా వాటికి అర్థాలు తెలియడంలేదు. అవి స్త్రీలలో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ముందు ఒక పదప్రయోగ సూచిక తయారు చేస్తే తరవాత వాటి అర్థాల గురించి ఆలోచించవచ్చు.
ఈ పాటల్లో నిజంగా మంచి కవిత్వం స్థాయికి వచ్చే రచనలున్నాయి. అందులో మచ్చుకి ఒకటో, రెండో రచనలు నేను ఈమాటలో పరిశీలిద్దామని మొదలుపెట్టాను. ఈ వ్యాసం కూడా ఓపికగా చదువుతారనీ మీ అభిప్రాయాలు చెప్తారనీ ఆశిస్తాను.
విధేయుడు
నారా
సీత గడియ
శ్రీరామ. భూసతికి చేడెయై పుట్టీ
కూర్మితో జనకునీ కూతురై పెరిగీ
అంటూ ఈ పాట మా అమ్మ పాడడం నా కిప్పటికీ గుర్తుంది. ఈ పాట పేరు సీత గడియ అని ఉండడం ఒక విశేషం. నిజానికిది రాముడు పెట్టిన గడియ. అంచేత రాము(డి) గడియ అవాలి. కాని సీత గడియ అని ఈ పాటకి పేరు పెట్టడంలో ఒక చమత్కారం ఉంది. గడియ పెట్టినవాడు రాముడైతే కావచ్చు గానీ అది తీయించింది సీత. ఆ గడియ తీయించడంలో సీత చూపించిన నేర్పు ఈ పాటలో ప్రధాన విషయం. అందుకని ఇది సీత తీయించిన గడియ. ఆ ప్రకారంగా ఇది సీత గడియ.
ఈ పాట శ్రీరాముడికి నమస్కారంతో మొదలౌతుంది. మొన్నమొన్నటి వరకు కాగితం మీద ఏది రాసినా పైన శ్రీరామ అని రాయడం తెలుగువాళ్ళకి అలవాటుగా వుండేది. “ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండు గావుత”[2] అనే మాట ఈ నమ్మకానికి ఒక గుర్తు. ఈ పాటలో కవయిత్రి మొదట్లో ‘శ్రీరామ’ అని, తరవాత పాట మొదలుపెట్టడం వల్ల, ఈ పాట మొదట రాయబడిందని అనుకోడానికి ఒక ఆస్కారం కలుగుతోంది. ఇది ఎవరో చదువుకున్న కవయిత్రి తన తోటివాళ్ళు పాడుకోడానికి రాసిన పాట[3].
తలుపు దగ్గర పాటలు తెలుగులో కొన్ని పరిచితంగా ఉన్నాయి. విష్ణుమూర్తి తన ప్రియురాలు చెంచులక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తే, లక్ష్మీదేవి అతన్ని లోపలికి రానీయకుండా నిలబెట్టిన సందర్భాన్ని గురించి పాడిన పాట ముచ్చటగా ఉంటుంది. 1888 సెప్టెంబరులో Indian Antiquaryలో పండిత S.M. నటేశశాస్త్రి గారు ఈ పాటని Epithalamia అనే వర్గంలో చేర్చవచ్చునని చెప్పి ప్రకటించారు. దానిలో లక్ష్మి విష్ణుమూర్తిని రకరకాలుగా ఆట పట్టిస్తుంది. చివరికి విష్ణుమూర్తి తన తప్పుని ఒప్పుకుని క్షమార్పణ చెప్పుకున్నాకనే తలుపు తీస్తుంది. ఇలాంటి పాటలు స్త్రీల పాటలలో కనీసం ఇప్పటికీ కొన్నైనా దొరుకుతాయి.
కాని సీత గడియ అలాటి పాట కాదు. తేలిగ్గా కనిపించే ఈ పాటలో బలమైన నిర్మాణదక్షత ఉంది; ప్రతిభావంతమైన భావనాశక్తి ఉంది. మాటని జాగ్రత్తగా, పొదుపుగా వాడే ప్రత్యేకత ఉంది. అంతకు మించి తన నైపుణ్యంతో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, సమిష్టి కుటుంబంలో నిబ్బరంగా మెలగగల స్త్రీ ప్రత్యేకతని సున్నితంగా చిత్రించిన నేర్పు ఉంది.
ఈ పాట దొంతరదొంతరులుగా నిర్మించబడింది. మొదటి దొంతరలొ సీత తన అత్తగారికీ, మామగారికీ భక్తిశ్రద్ధలతో ఉపచారాలు చెయ్యడం వర్ణించింది కవయిత్రి. ఇది రెండు పంక్తులలో క్లుప్తంగా ముగించినా ఈ పని పూర్తిచేసుకోడానికి సీతకి చాలా సేపు పట్టిందని శ్రీరాముడు పిలిచినప్పుడు పడకగదిలోకి ఆమె వెళ్ళలేదని చెప్పడం వల్ల తెలుస్తుంది. ఆయన చక్కగా
జాజులు తలదాల్చి జవ్వాది యలది
వేచియు తానుండి వేడుకను విభుడు
అప్పుడు మొగవాళ్ళు తలలో పువ్వులు పెట్టుకునే వాళ్ళు. అయినా ఇక్కడ ఆ సంగతి ప్రత్యేకించి చెప్పినప్పుడు రాముణ్ణి ప్రబంధనాయిక అయిన వాసకసజ్జికకి మొగ రూపంగా కవయిత్రి ఊహించిందని ఒక్క క్షణం ఆలోచిస్తే తడుతుంది.
ఎదురెదురు చూచెను వెలది రాదనుచు
తడవయ్యె రాదని తొందర పడుచు
సూర్యవంశజు డపుడు సొరిది కోపించి
ఘడియ గ్రక్కున బెట్టె కాకుత్సుడపుడు
సీతరో నీ పనులు చేయుట కాద
అవనిజ మైమరిచి నీవు వున్నావ
అని తలపంకించి కడు భ్రమ జెంది
శయ్యపై పవళించె రామచంద్రూలు.
ఎప్పటికీ సీత రాకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి పడకగది తలుపు గడియ పెట్టేస్తాడు. నీ పనులిలా ఉన్నాయా, నీకు వొళ్ళూ పై తెలియడం లేదు అని తల పంకించి ‘కడు భ్రమ చెంది’ పక్కమీద పడుకుంటాడు. ఇక్కడ ‘భ్రమ చెందడం’ చాలా అర్థవంతమైన మాట. లేనిది ఉన్నదని ఊహించుకోవడం భ్రమ. రాముడు తనకి సీత మీద లేని అధికారం ఉన్నదని ఊహించుకుంటున్నాడు. అది అతని భ్రమ. ఇది వొళ్ళూ పై తెలియని కోపంలొ కలిగే స్థితి. లేదా ఇది శృంగార చేష్టల్లో ఒకటి. ఏ సంగతీ మనకి తరవాత తెలుస్తుంది.
రామయ్య తనకోసం ఎదురుచూస్తున్నాడు కాని సీతకింకా చాలా పనులున్నాయి. అత్తగారు కౌసల్యకి అడుగులొత్తి, మామగారు దశరథుడికి తమలపాకుల మడతలు అందించి, సుమిత్రకి వింజామరలు వీచి, కౌసల్యకి పక్క వేసి – ఈ పనులన్నీ చేసేసరికి చాలా సేపు అయిందని మనకు బోధపడుతుంది. ఇంత వరకు ఇంటికి మంచి కోడలుగా, తన సుఖాలకన్నా అత్తమామల పరిచర్యలే ఎక్కువని భావించే ‘ఉత్తమ స్త్రీ’గా సీత మనకి కనిపిస్తుంది.
ఇక తరవాత దొంతర, సీత సావకాశంగా తనను తాను ముస్తాబు చేసుకోవడం గురించి చెప్పేది. దాదాపు నూటరెండు పంక్తులున్న ఈ పాటలో 24 పంక్తులు ఇందుకోసమే వినియోగిస్తుంది కవయిత్రి. సీత స్నానం చేసింది. పసుపు పూసుకుంటుంది. బంగారు పూల చీర కట్టుకుంటుంది. తల దువ్వుకుని పాపిట తీసి వరసగా రకరకాల నగలు పెట్టుకుంటుంది. ఆ నగలు వర్ణించిన తీరు చూడండి.
దువ్వి పాపిట తీసి తింత్రిణీ పెట్టి,
తింత్రిణిలొ ముత్యాల పతకంబు బెట్టి
రవ్వల ముత్యాల జల్లి దిగవేసి [4]
ఇక అక్కడితో ఆగకుండా కవయిత్రి ఆ పెట్టుకున్న నగలని గురించి వాటి విలువతో సహా వేరువేరుగా చెప్పడం మొదలు పెడుతుంది.
వేయి జేయు కమ్మలు వెలయంగ బెట్టి
రెండువేలు జేయు హారములు వేసి
మూడువేలు జేయు ముక్కెర బెట్టి
నాలుగువేలు జేయు నాను మెడవేసి
పదివేలు జేయు పతకంబు బెట్టి
ఈ నగల విలువ పనిగట్టుకుని అంత గొప్పగా చెప్పాల్సిన అవసరమేమిటి? ఆడవాళ్ళకి ఆస్తిహక్కులు వేరే లేని సమాజంలో వాళ్ళ నగలే వాళ్ళ ఆస్తి. అది స్త్రీ ధనం కాబట్టి కుటుంబంలో మగవాళ్ళెవరూ వాటిని ముట్టుకోరు. వాటి విలువ వల్లే ఆడవాళ్ళకి నిబ్బరం, ధైర్యం, ఒకపాటి గర్వం కూడా. అందుకని ఆ నగల చక్కదనంతో పాటు వాటి విలువ, ఒకదానికన్నా ఒకటి ఎక్కువగా, విశృంఖలంగా వర్ణిస్తుంది కవయిత్రి.
ఆ తరవాత గంటల వడ్డాణం, నీలాలు తాపిన కీలుకడియాలు[5] పెట్టుకుంటుంది. వీటితో అలంకరించుకున్న తరవాత కన్నులకు కాటుక పెట్టుకుని అప్పుడు స్తిమితంగా నిలువుటద్దంలో తన రూపం చూసుకుని, తన అందానికి తానే ముచ్చటపడి చిరునవ్వు నవ్వుకుంటుంది సీత. ఈ అలంకరణ అంతా తన కోసం, తన ముచ్చట కోసం అనే సూచన వుంది ఈ వర్ణనలో.
ఇంక ఇప్పుడు సీత సావకాశంగా భోజనానికి కూచుంటుంది. ‘పంచభక్ష్యాన్నములు భుజించి’ లేచి చేతులు కడుక్కుని బంగారపు జరీతో చేసిన బుటేదారు శాలువ కప్పుకుని, బంగారు చెంబుతో మంచినీళ్ళు, ఒక పళ్ళెంలో ఆకులూ, వక్కలూ, అత్తరూ, పునుగూ, జవ్వాదీ, పన్నీరూ, గంధమూ, పళ్ళూ ఫలహారాలూ పెట్టుకుని, మల్లెలూ మొల్లలూ విరజాజులూ కొప్పులో ముడుచుకుని భర్త దగ్గరికి వెళుతుంది.
ఈ పాటికి రాముడు పడకగది తలుపు గడియపెట్టేశాడని సీత చూస్తుంది. ఇక్కడితో పాటలో మరో దొంతర మొదలౌతుంది. ఇందులో ఉన్న ఆలోచనల వరస చూడంది.
విరులను దెస్తినో వీరావతార
పుడమిలో వీరులకు తలనొగ్గకుండా
పరశురాముని భంగపరచితిరి మీరు.
‘మీకు పువ్వులు తెచ్చాను,’ అని భార్య అనడం ఏమిటి? మామూలుగా ఆడవాళ్ళ కోసం మొగవాళ్ళు పువ్వులు తెస్తారు. వాళ్ళని సంతోషపెట్టడం కోసం, వాళ్ళమీద తమకి ప్రేమవుందని తెలియపరచడం కోసం. ఆ పువ్వులు అలంకరించుకుంటే ఆ అందాన్ని చూసి ఆనందించడం కోసం. ఇక్కడ పరిస్థితి అందుకు వ్యతిరేకం.
ఇక తర్వాత రెండు చరణాలూ రాముణ్ణి పొగడడం. ఇక్కడ శ్రీరాముని వీరాన్ని పొగడడంలొ ఒక సుకుమారమైన సూక్ష్మం వుంది. శృంగారానికి పూర్వరంగం ఇది. శృంగార వీరాలని సమయోచితంగా కలపడం మంచికవులకి మాత్రమే తెలిసే ఒడుపు[6].
సరే ఈ పాచిక పారలేదు. శ్రీరాముడు తలుపు తియ్యలేదు. ఇక తనచేతిలో రెండవ ఆయుధం; శ్రీరాముడికి జాలి కలిగేలా తన అసహాయతని చెప్పడం;
నన్ను యేలే స్వామి కాకుత్సతనయ
తలుపేయ కోపంబు తాళంగ గలనా
నిలుచున్న పాదాలు చేతులును నొచ్చె
గడియ ఆలిసమైన గడియ బెట్టితిరా
తప్పులు పట్టక తలుపు తీయండీ[7]
ఇక ఇది పని చెయ్యకపోతే, వాన వొస్తోందని, తను తడిసిపోతున్నాననీ (అబద్ధం) చెపుతుంది.
దంతంపు తలుపులూ తియవోయి నాథా
వొంటొంటి చినుకుకె ఒక చెంగు తడిసె
కాముడ తియవోయి కనకంపు గడియ,
పట పట చినుకులకు పై కొంగు తడిసె
పచ్చలబాలుడా[8] తియవోయి గడియ
ఇక్కడ అకస్మాత్తుగా ఒక విశేషమైన చరణం ఒకటి కనిపిస్తుంది.
రత్నహారంబిస్తు తియవోయి గడియ.
ఈ చరణం బహుశా ఇంకా ముందు ఉండి ఉండొచ్చు, లేదా దీని తరవాత ఇలాంటివే మరి కొన్ని చరణాలు ఉండి ఉండవచ్చు. కాని ఇది వొదిలెయ్యడానికి వీలులేని చరణం. భార్యలకి భర్తలు నగలు ఆభరణాలూ (లంచంగా) ఇవ్వడం అందుమూలంగా వాళ్ళ అభిమానం సంపాదించుకోవడం అప్పటి కుటుంబాలలో (కొన్ని ఇప్పటి కుటుంబాలలో కూడా) పాదుకున్న వ్యవస్థ. కాని ఇక్కడ భార్య భర్తకి లంచం ఇవ్వజూపుతుంది.
కాని, ఇవేవీ పనిచెయ్యవు. శృంగార విశేషంగా సున్నితంగా వుండవలసిన కోపం శ్రుతి తప్పుతోందా? పైగా,
[నీవు లేకుంటేను] నాకేమి సీత
గంటవలే దీపమ్ము అదినాకు తోడు
[నీవు లేకుంటేను] నాకేమి సీత
పువ్వులూ బుక్కాయి అది నాకు తోడు
[నీవు లేకుంటేను] నాకేమి సీత
గంధమూ కస్తూరి అదినాకు తోడు
[నీవు లేకుంటేను] నాకేమి సీత
పట్టెమంచము పరుపు అది నాకు తోడు[9]
అని ఎదురు బుకాయిస్తాడు రాముడు. సీతని అవతలపెట్టి గడియవేశాడు సరే, కాని ఇంకోరకంగా తనని తాను గదిలో బంధించుకుని ఒంటరివాణ్ణి చేసుకున్నాడు. ఈ ఒంటరితనం పైమాటల్లో వినిపిస్తుంది. తిరస్కారపూర్వకంగా వినిపించే ఈ మాటల వెనకాతల ఒక దైన్యం వుంది, నిశ్శబ్దంగా. దీపమూ, పువ్వులూ, బుక్కాయీ, కస్తూరీ, పరుపూ, మంచమూ – ఇవా తనకి తోడుండేవి! కాని రాముడు పంతానికి పోతే పట్టు వదలడు అనే సూచన కూడా వుంది ఈ గొంతుకలో.
ఇక సీతకి మిగిలిన ఆఖరి ఆయుధం – తన అత్తగారు. అత్తగారు తన పక్షాన వుంటే రాముడి ఆట కట్టినట్లే. కోపంతో వెళ్ళి, సీత తన అత్తగార్ని పిలుచుకొస్తుంది.
అత్త కౌసల్యకు అన్ని దెల్పగను
తల్లి కౌసల్యొచ్చె రాము దగ్గరకు
సీత కౌసల్యకి ఏం చెప్పిందో ఊహించుకోవొచ్చు. అన్నీ చెప్పలేదనీ కూడ మనం ఊహించగలం. ఉదాహరణకి తాను అలంకరించుకోడానికి సావకాశంగా అంతసేపు తీసుకుందని చెప్పివుండదు. కౌసల్యకి తను శ్రద్ధగా సేవ చేసింది కాబట్టి, తన మాట ఆవిడ విని తన పక్షాన వుంటుందని సీత నమ్మకం.
దశరథుని పుత్రుడవు జనకులల్లుడవు
భూదేవి అల్లుడవు బుద్ధటర నీకు
సీత చేసిన తప్పు శీఘ్రాన చెప్పు
నాకు ఎరిగించరా నను గన్న తండ్రి
రాముణ్ణి నీకు బుద్ధిలేదా, అని రాముణ్ణి అనగలిగింది కౌసల్య ఒక్కర్తే. మళ్ళా ప్రేమగా నను గన్న తండ్రీ అనగలిగిందీ ఆవిడే.
ఇంక రాముడికి తలుపు తియ్యక తప్పలేదు. అమ్మా నీ కోడలిని ఇలా ముద్దు చేస్తే నా మాట ఇంక వింటుందా, అని ఫిర్యాదు చేస్తూ, తప్పనిసరి చిరునవ్వు తెచ్చుకుని తలుపు తీస్తాడు రాముడు. అత్త కోడలిని వెనకేసుకుని వొచ్చి, కొడుకుని తప్పు పట్టడం నిజంగా విడ్డూరం. తెలుగు కుటుంబాల్లో పెళ్ళాం చెప్పిన మాటల్లా వింటున్నాడని తల్లి కొడుకుని సాధించడం మనకి పరిచితమైన విషయం. ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా, కోడల్ని వెనకేసుకుని వొచ్చి తల్లి కొడుకుని తిడుతుంది. రాముడు తలుపు తియ్యగానే అత్తగారితో పని అయిపోయింది సీతకి. ఆవిణ్ణి మరియాదగా సాగనంపాలి.
మా మామ దశరథులు ఒక్కరున్నారు
అత్త మీరు పొండి మా మామ కడకు
అని సీత చక్కగా సాగనంపుతుంది కౌసల్యని. ఇంక మేం ఏకాంతంగా వుండవలసిన సమయం ఇది అని అత్తకి సుకుమారంగా చెప్పడం ఇది. వాల్మీకి రామాయణంలో దశరథుడు ఎక్కువ కైక దగ్గిరే గడుపుతున్నట్టు కనిపిస్తుంది. కాని ఈ రామాయణంలో దశరథుడు పెద్ద భార్య దగ్గిరే వుంటాడు. అంటే కౌసల్యకి తన జీవితంలో అసంతృప్తులు ఏవీ లేవు. తన జీవితంలో సుఖంగా వున్న అత్తగారే కోడల్ని సుఖంగా చూడగలదని ఒక సూచన ఇది.
కథ ఒక్కసారిగా నవ్వుతుంది. కథ చివరికి వొస్తోందని చెప్పే ఆఖరి దొంతర మొదలౌతుంది.
సిగ్గుతో శ్రీ లక్ష్మి విభుని సన్నిధికి
చేరగానే దివ్వె కల కలా నవ్వె
వరసగా ఊపిరి తీసుకోకుండా సువాసనలని వర్ణిస్తుంది కవయిత్రి.
ఆకుల వాసనా పానుపు మీద
పోకల వాసనా పానుపు మీద
పువ్వుల వాసనా పానుపు మీద
బుక్కాల వాసనా పానుపు మీద
అంటే సీత పానుపుమీద పడుకుందని మనం ఊహించుకోవాలి. మంచం పక్కనే తను తెచ్చిన పువ్వులు, ఆకులు వక్కలూ, ఇతర పరిమళద్రవ్యాలూ పెట్టిందని అనుకోవాలి. రాముడికోసం తెచ్చానని చెప్పినవి ఏవీ రాముడికి తన చేత్తో ఇవ్వలేదు. అంటే తన కోపానికి అది సూచన అన్నమాట. ఇంతవరకూ సీతని బయట నించోబెట్టిన రాముడు ఆవిడ అలక తీర్చడానికి తనే ఏదో ఒకటి చెయ్యాలి. కాని అంత మాటకారిలా కనిపించడంలేదు రాముడు.
ఆడవారి కోపము ఎట్టిదో యనుచు
మళ్ళి పరుండెను రవివంశజుండు
ఆడవాళ్ళ కోపం గ్రహించగలగడం, దాన్ని తీర్చగలగడం చేతనైనవాడు కాడన్న మాట ఈ భర్త గారు. ఇక్కడ ఈ సమస్యని సరిదిద్దగలిగింది మళ్ళ సీతే.
అగ్గి చెంతను వెన్నెంత తడవగు నోడ
ఆడవారి కోపము అట్టిదే యనుచు
శీఘ్రాన కలిసెను శ్రీ లక్ష్మి యంత
ఎవరు నిప్పు, ఎవరు వెన్న? ఇది సంస్కృతంలో తరుచుగా చెప్పే ఉపమానానికి సరిగ్గా తల్లకిందులు. ఉదాహరణకి వరాహపురాణంలో ఈ శ్లోకం చూడండి.
అగ్నికుండ సమా నారీ ఘృతకుండ సమః పుమాన్
ఘృతకుంభో గ్నియోగేన ద్రవతే నతు దర్శనాత్
పుమాన్ స్త్రీ దర్శనాదేవ ద్రవతే యద్ విమోహితః[10]
ఆడది నిప్పుకొలిమి లాంటిది, మొగవాడు వెన్నకుండ లాటివాడు. వెన్న నిప్పు తగలగానే కరిగిపోతుంది, కాని నిప్పును చూసినంత మాత్రాన కరగదు. కాని, మొగవాడు ఆడదాన్ని చూడగానే కరిగిపోతాడు, స్త్రీ అంటే మోహం కొద్దీ.
మగవారికి వర్తించే ఈ ఉపమానాన్ని తిప్పి ఆడవాళ్ళకి వర్తింపజెయ్యడంలో వుంది ఇక్కడ విశేషం. సరిగ్గా అలాటిదే ‘శీఘ్రాన కలిసెను శ్రీ లక్ష్మి యంత’ అన్న చరణంలో ‘కలిసెను’ అన్న పదం. ‘కలియు’ అనే మాట స్త్రీ పురుషుల సంయోగానికి మృదువైన పర్యాయ పదంగా బహువచన పదం కర్తగా వున్న వాక్యాలలో వాడుకలో వుంది. పురుషవాచక పదం కర్తగా ఉన్న వాక్యంలొ కలియు అనే మాట వాడడం కూడా వుంది. కాని ఈ క్రియ స్త్రీ కర్తగా ఉన్న వాక్యంలో వాడడం తరుచు కనిపించదు.
ఈ పాటలో కొస మెరుపు: ఫల శ్రుతి.
పుడమిలో ఈ పాట పాడినా విన్నా
ఐశ్వర్యవంతులై అతివలుండెదరు.
మామూలుగా ఫలశ్రుతిలో స్వర్గమో, మోక్షమో ఉంటాయి. అందుకు భిన్నంగా ఇందులో కేవలం ఐశ్వర్యం మాత్రమే ఉంది. ఒక విలక్షణమైన ప్రాపంచిక దృక్పథానికి గుర్తుగా.
ముగింపు
ఈ పాట మొత్తం అంతా చూస్తే దీనిలో రాముడూ, సీతా ఆలంబనాలే అని తెలుస్తుంది. నిజానికి ఇది ఆడవాళ్ళ నిత్యజీవితాన్ని గురించిన పాట. ఇది కుటుంబ వాస్తవికతకి ప్రతిరూపం అని అంటే కవిత్వంగా దీని పటిమని తగ్గించినట్టవుతుంది. తన కాలం కన్న ముందుండగల కవులూ కవయిత్రులూ ఊహ ద్వారా జీవితాన్ని రమణీయతరంగా చూపిస్తారు. ఇది యధార్థానికి కల్పనాజనిత ప్రతిరూపం. ఇది నిజం కాదు. నిజం ఇలా వుంటే బాగుంటుందనిపించేది. మంచి కవిత్వం జీవితానికి పరిపూరకం, పరివర్థకం. ఈ ఊహని నిత్య జీవితం కన్న దూరంగా వుంచడం కోసం ఇందులో పాత్రల పౌరాణికత పనిచేస్తుంది. అయినా సంఘటనలు నిత్యజీవితంలో సమిష్టి కుటుంబలో ఎదురయ్యేవి కాబట్టి, ఈ పాత్రలు దగ్గిరగా వొస్తాయి. ఇలాటి కవిత్వం రాయగల స్త్రీలు ఉండడం ఈ సమాజంలో ఎలా జరిగింది? ఈ కుటుంబాలు ఎలాటివి? అందులో స్త్రీల జీవిత పరిస్థితులు ఏమిటి? అనే ప్రశ్నలకి ఈ కవిత్వం సమాధానం చెప్పదు. కాని ఇలాటి కవయిత్రి పుట్టి పెరగడానికీ, ఇలాటి రచన చెయ్యడానికీ, దానికి తోటి ఆడవాళ్ళ మెప్పుదలా, ఆదరణా ఉండడానికీ కావలిసిన పరిస్థితులు ఉన్నాయని మాత్రం నిబ్బరంగా చెపుతుంది.
- ఇందులో [చెప్పుడీ] నేను మార్చిన మాట, అచ్చులో, నోటి పాటలో ఈ చరణం రెండు మూడు రకాలుగా ఉంది. ఇల్లిందల సరస్వతీ దేవిగారు ఈ చరణాల్ని చదివిన తీరూ, నేను చదివిన తీరూ ఒకటేనని ఈ మధ్యే గుర్తించాను.
- ఇది సంపూర్ణ రామాయణం సినిమాలో చివర వుందని కె వి.ఎస్ రామారావుగారు చెప్పారు.
- ‘రాసిన’ అని, ‘చదువుకున్న’ కవయిత్రి అని ఉద్దేశ్యపూర్వకంగానే అంటున్నాను. అయితే, రాసిన అనే మాటకున్న అర్థచ్చాయలు వేరే వ్యాసంలో చెప్తాను, ఇప్పుడవి ఈ వ్యాసం విషయానికి అడ్డొస్తాయి.
- ఇందులో ఉన్న నగల పేర్లనిబట్టి ఇవి ఎలాంటి నగలో, ఏ కాలపు నగలో గుర్తించొచ్చు. కాని నేను గుర్తించలేకపోయాను. కోలవెన్ను మలయవాసినిగారూ, మొక్కపాటి లలితాదేవిగారూ కొన్ని నగల గురించి చెప్పారు, వాళ్ళకి నా కృతజ్ఞతలు. కాని ఇంకా చాలా తెలియాల్సింది వుంది. వాటిని బట్టి ఈ పాట రాసిన కాలం సుమారుగా చెప్పొచ్చనుకుంటాను.
- కీలు కడియాలంటే సీల వుండి, కావలసినప్పుడు పెట్టుకుని, అక్కర్లేనప్పుడు తీసెయ్యాడనికి వీలుండే కడియాలు. మామూలు వెండి కడియాలలా కాళ్ళకి పట్టుకుని, తియ్యడానికి వీల్లేని నిర్బంధం కలిగించేవి కావు. పైగా ఇవి నీలాలు తాపినవి, కాబట్టి విలువైనవి. బహుశా బంగారంవి కూడా. తెలుగు దేశంలో ఒక్క రాజవంశాల ఆడవాళ్ళే బంగారం కాళ్ళకి కూడా పెట్టుకుంటారు మిగిలిన వాళ్ళు నడుముకి కింది భాగంలో బంగారం పెట్టుకోరు.
- ఊర్మిళాదేవి నిద్ర లో కవయిత్రి సరిగ్గా ఈ పనేచేస్తుందని ఇంతకుముందు వ్యాసంలో చెప్పాను. నిద్రలేచిన వెంటనే ఊర్మిళ
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చె
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండెఅని లక్ష్మణుడి చేతకాని తనాన్ని సున్నితంగా, అయినా చురుగ్గా ఎత్తి పొడిచినా – సరిగ్గా పడకగదిలో అతని శౌర్యాన్ని ప్రకోపింపజేస్తూ
సింహవిక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ
అని అంటుంది. అవసరమైన భావాల్ని సమయాన్ని గమనించి కలపడం మంచి కవులకి మాత్రమే తెలిసిన విద్య.
- ఈ చరణాలు అచ్చులో లేవు, మలయవాసినిగారు పాడుతూంటే విన్నవి. అవి ఆవిడే పెన్సిల్‌తో నా అచ్చుపుస్తకంలో రాశారు.
- పచ్చల బాలుడు అన్నది విలక్షణమైన మాట. పచ్చ అంటే బంగారం, బంగారు బాబూ అంటామే, అలాటి మాట.
- ఇందులో చదరపు కుండలీకరణాలలో ఉన్న మాటలు నేను మార్చినవి. అచ్చుపాఠంతో పోల్చి చూడండి. మలయవాసిని గారు తమ పుస్తకంలో ఈ పాటని గురించి రాసిన వ్యాసంలో చాలా చోట్ల వేరే చరణాలు వున్నాయి. ఆవిడ ఆంధ్ర సారస్వత పరిషత్తు ముద్రణంలో వున్న పాఠాన్ని కాక వేరే పాఠాన్ని అనుసరించారు. “మా నాన్నగారు సేకరించిన పుస్తకాలలొ ఉన్న రామాయణపు పాటలు, కృష్ణశ్రీగారి స్త్రీల రామాయణపు పాటలూ, మా బామ్మ దగ్గిర, బామ్మ కోసం వచ్చే బామ్మగార్ల దగ్గర వ్రాసుకుకున్నవీ ఈ రచనకు ఆధారాలు.” అని తన పుస్తకానికి తొలిపలుకులో రాసినదాన్ని బట్టి ఈ సంగతి గ్రహించొచ్చు. చూ. మలయవాసిని. ఆంధ్ర జానపద సాహిత్యము: రామాయణము. విశాఖపట్నం, 1986. పుటలు. iv, 28-33. ‘సీత గడియ’కి ఆవిడ ఆధారంగా తీసుకున్న పాఠం చూసే అవకాశం నాకు కలగలేదు.
- వరాహపురాణమ్ సం. హృషీకేశ శాస్త్రి. కలకత్తా, 1893, 146:38-39. ఈ శ్లోకం తెలుగుదేశంలో సంస్కృత పండితులు తరుచు ఉదాహరిస్తారు. బహుశా ఇది ఇతర పురాణాల్లో కూడా ఉండొచ్చు.