టైటానిక్‌

చిక్కబడిన చీకటిలాంటి నిశ్శబ్దం.

గోడ పక్కన ఎండిపోయిన నాలుగైదు అరటి తొక్కలు. మూలగా చెత్తకుప్ప లోంచి బయలుదేరిన  చీమలబారు వంటింటి గుమ్మం మీదెక్కి, మలుపుతిరిగి, ఓ మూలగా సింకుకింది కన్నంలోకి మాయమవుతోంది. (ఆ కన్నంలో నీళ్ళెండి  పోయి నాలుగు రోజులు దాటింది). పైన సింకులో సగంకుళ్ళిన వంట పాత్రలూ, పొడి అంటుకు పోయిన టీ గిన్నే, పక్కన అరుగుమీద ఈగలు ముసురుతున్న పంచదార తునకలు. అరుగుమీది గ్యాస్‌ స్టవ్వు  నుంచి కారి నేలమీద  చారికలు కట్టిన ఎండిన టీ ఆనవాళ్ళు. పక్కన పల్లీ తొక్కలూ, దుమ్మూ. ఆ దుమ్ము తివాచీ  వంట గది అంతటా వ్యాపించి, ఆ గది గుమ్మం దాటి, నడిమిగది సోఫా కిందుగా ముందు గదిలో చెప్పుల స్టాండు దాకా  పరుచుకొని ఉంది. స్టాండు పక్కనే గ్రిల్‌ లోంచి లోపలికి జారి  గత వారం రోజులుగా పోగుపడిన ఇంకా తెరువని దిన పత్రికలు.

నడిమిగదిలో సోఫా మీద ఓ కాలుజారేసి నేల మీద వెల్లకిలా పరుండి ఉన్న  అతను.

బయట ఎక్కడో ఆటో స్టార్ట్‌ అయిన చప్పుడు. కింద కాంపౌండ్‌లో కూరలమ్మి  కేక.  ఎవరిదో నవ్వు.

ఏదీ గమనించని నిద్రో మెలుకువో కాని స్థితి. అతనా  అస్థవ్యస్థమయిన భంగిమలో పరుండి పదిహేడు గంటలు దాటుతోంది బయట ఎవరో తలుపు తట్టిన  సమయానికి.

*               *               *

ఉదయం పదింటికే ఎండ చితచిత లాడుతోంది. కొత్తగూడెంపైన ఆకాశం మెగ్నీషియం తీగలాగా మండుతోంది.  కళ్ళు మిరుమిట్లు గొలిపే గ్లేరింగ్‌. నిప్పుల కుంపటి లాంటి సన్నటి సెగ. పట్టుకున్న ప్రతి వస్తువూ చురచుర కాలుతోంది.

“మీరు మనుషులు కాదు స్వామీ” అన్నాడు ప్రసన్న డ్రైవర్‌ పక్క సీట్లోంచి వెనక్కు తిరిగి. అతడు తల మీదగా జేబురుమాలు కట్టుకొనే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు.

“పశువుల మంటావా?” అన్నాడు శ్రీహరి  చిరాకుగా తన నెత్తిమీంచి జేబురుమాలు లాగేసి.అతడి కివతలగా కూర్చొని ఎటో చూస్తున్న రాజా రావు, అవతలగా  రత్న కిషోర్‌,  స్వరూప్‌.

“ఈ టయంలో ఇలాటి జీపులో బయల్దేరామంటే అలా అనుకోవటంలో ఏ మాత్రమూ తప్పులేదు. కాన్నా ఉద్దేశ్యం మాత్రం మీరు  మగాత్ములని” అన్నాడు ప్రసన్న.

ఆ సమయంలో బయట కనుచూపు మేరలో పిట్ట వాలటానికి చెట్టుకూడా లేదు. అక్కడక్కడా ఎండిపోయిన  పొదలు. అవి అవతలగా ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ గాల్లోకి వదులుతున్న బూడిదలో మునిగి  తలలు వేలాడేసి కూచొని ఉన్నాయి. అంతటా గడ్డకట్టినట్టున్న వికారమయిన నిశ్శబ్దం.  జీపు గతుకుల్లో ఎగిరి పడినపుడల్లా రోడ్డు మీద తివాచీలా  పరుచుకొనిఉన్న బూడిద, మేఘంలా కమ్ముకొంటోంది. జీపు దాటిన వెంటనే మళ్ళీ యధావిధిగా సర్దుకుంటోంది.

ఇంతలోనే కొత్తగూడెం పాలొంచ మధ్యగా ఎడమవైపు రోడ్డుమీదకు మళ్ళింది జీపు. ఆ మలుపు దగ్గర రోడ్డుకి  అడ్డంగా విస్తరించుకొని ఒక బోర్డు ఉంది. దాని మీద తుప్పుపట్టిన  “ఆంధ్రా స్టీల్స్‌” అక్షరాలను  ఎవరూ గమనించినట్టు లేదు.(అక్కడినించే ఆ ఫ్యాక్టరీ ఆవరణ మొదలవుతుంది).

“అబ్బ! ఈ రోడ్డుమీద మనుషులు తిరిగి ఎన్నాళ్ళయిందో సార్‌” అన్నాడు జీపు డ్రైవరు గతుకులు పడిఉన్న రోడ్డు మీదకి దృష్టి మళ్ళించి.

“ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళని అడుగు. ఏం సార్‌” అన్నాడు శ్రీహరి  రాజారావును మోచేత్తో తట్టి.

అతను ఏదో అనబోయి దూరంగా గుట్టల వెనగ్గా కనపడుతున్న ఆంధ్రా స్టీల్స్‌ కట్టడాల్ని మెడరిక్కించి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

డెఝావు.

ఈ దారి, ఈ బూడిద, ఈ వేసవి… అంతా ముందే అనుభవించేసినట్టు లోపల ఎదో చుట్టలు చుట్టుకున్న పాములా  కదలాడుతోంది. ఈ దిక్కుమాలిన ప్రయాణం తనీ జన్మలోనే చేయాల్సివస్తుందని అతను కలలో కూడా అనుకొన్నట్టులేదు.

“అప్పటికే మనిషి మొత్తం షేకయిపోయినట్టు అగుపిచ్చాడు” అన్నాడు శ్రీహరి బోసుతో తర్వాత ఒకసారి. ఆ రోజు వాళ్ళిద్దరూ మాదాపూర్‌ దగ్గర ఆటో పట్టుకొని హబ్సిగూడా వైపు వస్తున్నారు.

“ఎందుకని అంతలా?” అడిగాడు బోసు.

శ్రీహరి కాసేపు మాట్లాడలేదు. తర్వాత అన్నాడు.

“చివరికెలాగో నోరువిప్పి అన్నాడు”

“ఏమనీ”

“నాలుగేళ్ళు. అప్పుడే నాలుగేళ్ళు… ఇది మూతబడి” గొణుక్కున్నట్టు అన్నాడు రాజారావు. మళ్ళీ తనే అడిగాడు.

“ఏం శ్రీహరీ! నీకూ తెల్సుగా నువ్వూ ఉన్నట్టున్నావు చివర్లో?”

“లేద్సార్‌. నైన్టీటూ డిసెంబర్‌లో అనుకుంటా …నేను బయట పడ్డా లక్కీగా. మీరుమాత్రం చివరిదాకా ఉన్నట్టున్నారు”

చివరిదాకా…పరధ్యానంగా తలూపాడు రాజారావు.

ఇంతలోనే డ్రైవరు జీపును ఎడమవైపుకి సర్రున కోసి మరొక వంద గజాలు పోనిచ్చి అక్కడి గేటుముందు సడన్‌బ్రేకు కొట్టాడు.

అప్పటికే ఆ గేటుకివతలగా  ఇరవయిమంది దాక జమయ్యి ఉన్నారు ఇంజనీర్లూ , సూపర్‌వైజర్లూ. అవతలగా రెండు జీపులూ , మూడు అంబాసెడార్‌ కార్లూ. ఇంకా అవతల పది పదిహేనుమంది వర్కర్లు టేపులూ, వేష్టుకాటనూ, పెయింటు బ్రష్షులూ పట్టుకొని ఇటే చూస్తున్నారు.

ఆ గుంపులోంచి విద్యాసాగర్‌ ఎండకువాలుగా చెయ్యడ్డం పెట్టుకొని జీపు దగ్గరకు వచ్చాడు.

“ఎందయ్యోవ్‌! ఆర్చుకు తీర్చుకు వొచ్చారు. మేమిక్కడ దిగడి గంటయ్యింది. వాడేమో పర్మిషన్‌ లెటర్‌ లేందే గేటుకూడా తియ్యనంటున్నాడు” అన్నాడు గొంతు పెంచి.

జీపుకు అటువైపు దిగిన శ్రీహరి ఠపీమని ఎదో అనబోయి ఎందుకీ ఎలక్ట్రికల్‌ వాళ్ళతో లేనిపోని తంటా అనుకొని గేటు మీద ఆర్చిలాగా రెండు చివర్లనూ కలుపుతున్న బోర్డును చూస్తున్నాడు. దానిమీద పొరలు పొరలుగా పెయింట్‌ ఊడుతున్నది. లీలామాత్రంగా అక్షరాలు మాత్రం కనిపిస్తున్నాయి.

“ఆంధ్రా స్టీల్స్‌ (ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ సంస్థ) ”

“అవునిదే ఆంధ్రా స్టీల్స్‌ ” అన్నాడు అక్కడ నిలబడిఉన్న సెక్యూరిటీ గార్డు సరిగ్గా అయిదేళ్ళ క్రితం అదే గేటు ముందు నిలబడి ఉన్న శ్రీహరిని అనుమానంగా చూసి. అప్పటికి శ్రీహరి నూనూగు మీసాల యవ్వనంలో ఉన్నాడు. నలిగిన బట్టలూ, పెచ్చులూడిన సూట్‌కేసూ , పీల ఆకారం. అతను లోహ శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్న క్వాలిఫైడ్‌ ఇంజనీరంటే గమ్మున నమ్మటం ఎవరికయినా కష్టమే.

ఆ గార్డు కోరచూపులకి తడబడిన శ్రీహరి పై జేబులోంచి ఓ కాగితం లాగి హడావిడిగా అతనికిచ్చాడు. దాన్ని పైనుంచి కిందకి శల్య పరీక్ష చేసి గేటుకానుకొని కుడిపక్కగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసులోకి పోయి “సార్‌ కొత్త ఇంజనీర్‌ ట్రైనీ ” అన్నాడతను.

కాసేపటికి శ్రీహరికి లోపలికి వెళ్ళటానికి అనుమతి లభించింది.

గొలుసు ఊడదీసి గేటు తీశాడు గార్డు.

చెప్పరాని ఉద్విగ్నత.

జీవితంలో మొదటిసారిగా ఇంకా క్యాంపస్‌ జీవితం, హాస్టల్‌ గదీ, కాలేజీ నేస్తాల జ్ఞాపకాలు వొదలని లేత యవ్వనం చెంపల మీద జీరాడుతుండగా ఇరవయ్యేళ్ళ వయసులోనే అతనా గేటుదాటి ఆంధ్రా స్టీల్స్‌ ఆవరణలోకి అడుగుపెట్టాడు బాధ్యత కలిగిన ఇంజనీర్‌గా.

లోలోపల ఒక రాగం … అతని వెన్ను జలదరించింది.

“జిస్‌ దేశ్‌కీ ధర్‌తీ… సోనా ఉతలే ఉతలే ఉతలే మోతీ…”

జలజల పారే నీళ్ళూ…బంగారు పంటలూ…భారీ డ్యాములూ…పరిశ్రమలూ…రైతులూ…కార్మికులూ… ఆనందం వెల్లివిరిసే మొహాలూ…విజన్‌ 1947.

అదొక బంగారు స్వప్నం.

“వీడొక వెర్రి నాయాలు” అన్నారు ఆడిటోరియంలో అతని క్లాస్‌మేట్లు కన్నార్పకుండా మనోజ్‌కుమార్‌ని చూస్తున్న శ్రీహరిని వాళ్ళు సెకండియర్‌లో ఉన్నప్పుడు. (ఆ రోజు ఆడిటోరియం అంతా పిల్లికూతలతో, టార్జాన్‌ అరుపులతో హోరెత్తి పోతోంది. ఫిల్మ్‌కమిటీలో ఉన్న స్టూడెంటు నాయకులు అవమానంతో కుంగిపోతూ ఉన్నారు ఆ సినిమా పొరపాటున తెచ్చినందుకు).

వాళ్ళందరూ ఫైనల్‌ ఇయర్‌లోకొచ్చాక క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సమయంలో మై డ్రీం కంపెనీ ఆప్షన్‌ కింద లాయిడ్స్‌, ఎస్సార్‌, టిస్కో కంపెనీల్ని ఎన్నుకోగా శ్రీహరి ఒక్కడూ ఆంధ్రా స్టీల్స్‌ అని రాసేశాడు.

“అయితే ఇదేనన్నమాట అప్పటి నీ డ్రీం కంపెనీ” అన్నాడు వెనగ్గా జీపులోంచి దిగిన ప్రసన్న గేటులోంచి లోపల కనపడుతున్న రేకులూడిన సెక్యూరిటీ ఆఫీసునూ, సగం కూలిన స్కూటర్‌ స్టాండునూ, గోతులుపడిన ఆవరణనూ చూస్తూ.

శ్రీహరి మాట్లాడలేదు.

“సారీసార్‌ జీపు అరేంజయ్యేసరికి లేటయ్యింది” రాజారావు విద్యాసాగర్‌కి క్షమాపణ చెప్తూ హడావిడిగా నడిచి గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆఫీసరుకి ఓ లెటర్‌ అందించాడు.

మరి కాస్సేపటికి గేటుకి వేలాడే పెద్ద తాళం  తెరిచి, భారీగొలుసును  ఊడదీశారు. గేటు కిరకిర లాడుతూ తెరుచుకుంది.

అందాకా బయట ఎండకుమాడుతున్న ఇంజనీర్లూ, వర్కర్లూ కోలాహలంగా మాట్లాడుతూ లోపలికి నడిచారు.

గేటునుంచి లోపల మెయిన్‌ బిల్డింగ్‌కి దాదాపు రెండు ఫర్లాంగుల దూరం ఉన్నట్టుంది. అందాకా పరుచుకొని ఉన్న సన్నటి తార్రోడ్డు గతుకులు పడి , నెర్రెలు కొట్టి ఉంది. నెర్రెల్లోంచి ఇంతెత్తున లేచిన రెల్లు పొదలూ, గడ్డి దుబ్బులూ.

“గమ్మత్తుగా లేదూ? రోడ్డు మధ్యలో చెట్లు” అన్నాడు రత్నకిషోర్‌ ప్రసన్నతో.

“అబ్బాయిలూ! జాగ్రత్త. కొండచిలువలుంటాయి. నిజంగా” సివిల్‌ కృష్ణ నవ్వు.

రాజారావు తలొంచుకొని నడుస్తున్నాడు. ఒకప్పుడీ రోడ్డుమీద రోజుకి కొన్ని వందల లారీలు లోడు వేసుకొని పరిగెత్తేవి. వేలమంది జనం నడిచి పోయే వాళ్ళు.

మరికొద్ది నిముషాల్లో వాళ్ళు ఓ భారీ షెడ్డు ముందుకొచ్చారు.

అది నాలుగైదు తాటిచెట్ల ఎత్తున మొత్తం గాల్వనైజ్డ్‌ ఇనుప రేకులతో కప్పబడి ఉంది. ముందువైపున లారీలు కూడా వెళ్ళటానికి వీలుగా ఒంటి నిట్టాడి ఎత్తున ఒక ద్వారం ఉంది. ఎండలో రావటం వల్ల వాళ్ళకి షెడ్డు లోపల చిమ్మ చీకటి అలుముకొన్నట్టు కనిపిస్తోంది.

రాజారావు కళ్ళు  ఆ చీకటిలో చిక్కుబడి ఉన్నాయి.

అబ్బాయిలూ ఇక్కడ్నించి మనం నాలుగైదు టీములుగా విడిపోదాం. స్విచ్‌గేర్‌ రూంకీ, కంట్రోల్‌రూంకీ మావాళ్ళు పోతారు. మిగిలిన వాటిల్లో మినిమం ఒక ప్రొడక్షను ఇంజనీరూ , ఒక ఎలక్ట్రికల్‌ ఇంజనీరూ , ఇంకా ఇద్దరు హెల్పర్‌లూ ఉండాలి. ఏం రాజారావ్‌? ఇవ్వాళ సాయంత్రం దాకానే మనకి టైముంది. ఈ లోగా మొత్తం సర్వే అయిపోవాలి. ఏమంటావ్‌?” అన్నాడు విద్యా సాగర్‌.

రాజారావు తలూపాడు.

అలా ఆరు టీములు ఏర్పడ్డాయి. విద్యాసాగర్‌ ప్లాన్‌ ప్రకారం వాళ్ళు తలా ఒక దిక్కు కదిలారు.

చివరి టీములో  విద్యాసాగర్‌ , రాజారావు, శ్రీహరి, ప్రసన్న, రత్నకిషోర్‌.

“సత్తెన్నారాయణా! నువ్వు జలీల్‌నీ, ఇంకిద్దర్నీ తీసుకొని మావెంటరా. ఎత్తులు ఎక్కాల్సిఉంటది. వాడయితే కోతిలాగా ఎగబాకుతాడుగా” విద్యాసాగర్‌ అక్కడే నిలబడి ఉన్న ఓ కాంట్రాక్టర్‌ని పిలిచి చెప్పాడు.

“అలాగే సార్‌” అన్నాడు సత్యన్నారాయణ.

“సార్‌! ఇప్పుడే వస్తా. మీరు పదండి” శ్రీహరి స్వరూప్‌ని పిలుస్తూ ఇంకోవైపు కదిలాడు.

ముందుగా రాజారావు ఆ షెడ్డులోకి  అడుగుపెట్టాడు.

సన్నటి చీకటి. కొంచెం సేపటికి కళ్ళు అలవాటుపడ్డాక ఒక్కొక్కటీ కనిపించాయి రంగస్థలం మీద తెర లేచినట్టు.

ఎదురుగా షెడ్డుకి ఆ చివరిదాకా విస్తరించి ఉంది గాంట్రీ బే. బే నిండా గోతులు పడి ఉన్నాయి పైన రేకులు ఊడిన చోట్ల నుండి వర్షాకాలం కారే నీళ్ళవల్ల. షెడ్డుకటూ ఇటూ సపోర్టుగా భారీ కాలమ్స్‌ వాటి మీద పొడుగాటి రెయిల్స్‌. రెయిల్స్‌కా చివర ఎన్నో ఏళ్ళుగా విశ్వసనీయంగా నిలబడిఉన్న ఈ.ఓ.టీ క్రేన్‌. దానికింకా పైన రేకులకి సపోర్టుగా అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్న పైపులూ, ఏంగిల్సూ. వాటి జాయింట్లలో పావురాలు గూళ్ళు కట్టాయి.  కొన్ని ఏళ్ళ తర్వాత ఆ షెడ్డులో మళ్ళీ వినిపించిన మనిషి తాలూకూ అలికిడికి అవి ఆశ్చర్యపోయినట్టు కిందకి చూశాయి.

వెనక ద్వారంలోంచి పడుతున్న ఎండ వెలుగులో, ఆ విశాలమయిన షెడ్డుకి ఒక చివరగా నిలబడి ఉన్న  రాజారావు రోమ్‌ నగరంలోకి ప్రవేశించిన గ్రీకు యోధుడంత చిన్నగా ఉన్నాడు…

కదల లేనట్టు.

అతని చూపులు గాంట్రీబే మధ్యన నిలువెత్తుగా నిలబడిఉన్న ఫర్నేస్‌ మీద నిలిచి ఉన్నాయి. తొమ్మిది మీటర్ల ఎత్తూ, ఆరు మీటర్ల వ్యాసం ఉన్న దాని జైజాంటిక్‌ నడుము మీది మెటాలిక్‌ అక్షరాలు ఇంకా చెక్కు చెదరనట్టు ఈ చివరి దాకా కనిపిస్తున్నాయి.

“కంకాష్ట్‌ మెషీన్‌”

దాని నడుముమీద వడ్డాణంలా గుండ్రటి ప్లాట్‌ఫాం. దానిమీద నుంచి నేలకు జారి ఉన్న ఇనుప నిచ్చెన. ముదురు జేగురు రంగులోకి మారుతున్న ఫర్నేస్‌ బాడి అక్కడక్కడా కన్నాలు పడి జల్లెడలా తయారయి ఉంది. చర్మం లోంచి బొమికలు పొడుచుకొచ్చినట్టు ఆ కన్నాల్లోంచి మోర్టారూ, ఫైర్‌బ్రిక్సూ వికృతంగా బయటకు వేళ్ళాడు తున్నాయి.

ఫర్నేస్‌కి ఆ పక్కన రా మెటీరియల్‌ను ఫీడ్‌ చేసే ఏటవాలు కన్వేయర్‌. ఇప్పుడు దాని బెల్టు నడుము విరిగిన కొండ చిలువలా నేలమీదకు జీరాడుతోంది.

షెడ్డు అంతటా గడ్డి గాదంతో , పావురాల రెట్టలతో ఒకలాంటి మాగువాసన. పావురాలు రివ్వున ఎగిరినప్పుడు తప్ప అంతటా గాఢమయిన నిశ్శబ్దం.

అది కాదు రాజారావు చూస్తున్నది.

ఫర్నేస్‌ ప్లాట్‌ఫాం మీద నిలబడి ఉన్న నాగభూషణం . అతని ముఠా.

వాళ్ళు ఫర్నేస్‌ మూతి మీద బిరడాలా బిగుసుకుపోయి ఉన్న ఫైర్‌క్లేను పొడవాటి ఇనుప రాడ్డుతో లయబద్ధంగా మోదుతున్నారు ఏడెనిమిది మందీ ఒకరి శరీరం ఒకరికి అనుసంధానించినట్టు ఒకేలా దెబ్బ మీద దెబ్బ.

అరె పిల్లా చూడూ          హైస్సా
అరె పిల్లా నవ్వూ         హైస్సా
మొగలి పువ్వూ            హైస్సా
పిల్లా …..             హైస్సా
నిమ్మ పళ్ళూ             హైస్సా
………..
………..

పచ్చిబూతు పాట. (“ఎండీ గాదు. వాడి ముత్తాత మొగుడొచ్చినా ఈ పాట మాత్రం ఆగదు సారూ!  పాటగానీ ఆగిందా. ఇగ జూస్కోండి. మీ వింజనీర్లొచ్చి మెటలు తీయాల్సిందే” అనేవాడు నాగభూషణం రాజారావుతో పరాచికాలాడేప్పుడు).

ఫర్నేస్‌ మూతిలోంచి ముదురు ఎరుపు రంగు లోహద్రావకం భగ్గున మండుతూ…మిరుమిట్లు గొల్పుతూ… బయటకు దూకింది. కింద ఉన్న పెద్ద పెద్ద తొట్లలో అది పడేప్పుడు కాకర పువ్వొత్తులు పేలినట్టు చిటపటమని ఎగురుతోంది. (“అబ్బాయ్‌! అది గినా ఒక్కబొట్టు మీద పడిందా. సేఫ్టీషూసూ, గీఫ్టీషూసూ జాంతా నై. షూ పైనుంచి కిందకు బొక్కడి పోవాల్సిందే. మధ్యలో నీ అరికాలు…”). ఆ మండేలోహపు ఎర్రని వెలుగు షెడ్డులో ఉన్న ప్రతిలోహపు వస్తువుమీదా ప్రతిఫలించింది. చెమట ధారల్లో స్నానం చేస్తున్న నాగభూషణం మనుషులు ఆ వెలుగులో చిత్రంగా మెరుస్తున్నారు. వాళ్ళ తలల మీద హెల్మెట్లూ, కారు నలుపు కళ్ళద్దాలూ, సేఫ్టీషూసూ.

హఠాత్తుగా వాళ్ళు ఫర్నేసు నుంచి లేస్తున్న పొగమేఘంలో అదృశ్యమయ్యారు. ఆ బూడిద మేఘం మెల్లగా పైకి లేచి షెడ్డు మొత్తం అలుముకుంది. షెడ్డు మొత్తం ఇంజనీర్ల హడావిడితో, సూపర్‌వైజర్ల అరుపులతో ,వర్కర్ల పరుగులతో హోరెత్తిపోతోంది. పైనెక్కడో కేబిన్‌లో కూచున్న ఈ.ఓ.టీ క్రేన్‌ ఆపరేటర్‌ సత్యన్నారాయణ పెద్దగా వదరుతున్నాడు. అతనికి ఊపిరాడుతున్నట్టు లేదు.

వెనకనుంచి దగ్గాడు సత్యన్నారాయణ.

“ఇక మొదలెట్టండి . సతెన్నారాయణా! మీ వాళ్ళకు చెప్పు” విద్యాసాగర్‌ ఆదేశించాడు.

“దీని డ్రాయింగులుంటే బాగుండు” రత్న కిషోర్‌ అన్నాడు ఫర్నేస్‌ వైపు చూస్తూ.

“ఎందుకు సార్‌! దీని కొలతలన్నీ రాజారావు గారికి నోటిలెక్కలే” అన్నాడు సత్యన్నారాయణ.

“ఓ! అప్పుడు నువ్వూ ఇక్కడే తగులడ్డావు కదూ” విద్యాసాగర్‌ అన్నాడు ఒకలాంటి నిరసనతో.

“అవున్సార్‌. ఈనె క్రేన్‌ఆపరేటర్‌ అప్పట్ల” అందించాడు జలీల్‌.

“అహా! ఆ సోకుకూడా అయిందీ?”

“ఆయనకేమి సార్‌. పెద్ద కాంట్రాక్టరయ్యిండు. ఇందట్ల పంజేసిన వందలమంది మాత్రం…అయిన గిదుండాలె సార్‌ దునియల ” నుదుటిమీద గీత గీసి చూపించాడు జలీల్‌.

నిజానికి జలీల్‌ చెప్పినంత సులభంగా జరగలేదు సత్యన్నారాయణ ప్రయాణం. ఇక్కడ పొగలో , బూడిదలో మునిగితేలిన పదేళ్ళూ తన భవిష్యత్తు గురించీ, నిలవ బెట్టటం గురించీ అతనంత పట్టించుకుంది లేదు. తనూ , తన క్రేనూ ఎల్లకాలం ఉండిపోతాయన్న భరోసా ఉండేది. కానీ చూస్తుండగానే ఆ క్రేను ఆగిపోయింది. బతుకు కాలనీలోంచి బజార్న పడింది. ఒకటి రెండేళ్ళు ఫాక్టరీ మళ్ళీ తెరుస్తారన్న ఆశతో యూనియన్‌ల చుట్టూ తిరగటం ,అర్ధాకలితో వెళ్ళమార్చటం చేశాడు. తర్వాత పాలొంచ ధర్మల్‌ పవర్‌ ష్టేషన్‌లో పంజేసే స్వకులస్థుడయిన ఒక కాంట్రాక్టరు జాలిపడి రమ్మనటంతో అక్కడ కొంతకాలం మొబైల్‌క్రేను ఆపరేటరుగా చేరి , అక్కడే చిన్నచిన్న పనులు సబ్‌కాంట్రాక్టుకి తీసుకొని ఇప్పుడు ముప్పై మంది వర్కర్లను  మెయింటెయిను చేస్తున్నాడు.

“నిజం సారూ! తలరాత. లేదంటే నేనీడి కింద కూలిపనులు చేసుడేంది?” మళ్ళీ అన్నాడు జలీల్‌. జలీలు కూడా అప్పట్లో క్రేన్‌ ఆపరేటరే. వేర్వేరు షిఫ్టులు ఇద్దరివీ.

“ఒరే మూసుకుంటావా? మళ్ళీ సుంతీ చేయించేదా?” బూతులు తిట్టాడు సత్యన్నారాయణ.

“అందరూ కల్సి దీని కొంప ముంచారు కదరా! ఇప్పుడు సమ్మగా ఉందా?” చీత్కరించాడు విద్యాసాగర్‌.

జలీల్‌ గొణుక్కుంటూ అవతలికి పొయ్యి ఫర్నేస్‌ కొలతలు తీసుకోవటం మొదలెట్టాడు. యాంత్రికంగా అతని వెనకే కదిలారు మిగిలిన వర్కర్లు.

రాజారావు గొంతు విప్పి అన్నాడు.

“జలీల్‌! దీని సంగతి నాకొదిలి మీరు మిగతా పన్లు చూడండి”

అతను ఓ తెల్లకాగితం మీద ఎవో లెక్కలు వెయ్యటం మొదలెట్టాడు ఓ స్థంభానికి ఆనుకొని. ఫర్నేస్‌ క్రాస్‌ సెక్షను గీస్తుంటే వేళ్ళు వణుకు తున్నాయి.

అప్పుడే బయటనుంచి వచ్చిన శ్రీహరి “మైగాడ్‌ కంకాష్ట్‌ మెషీన్‌” అన్నాడు తన కళ్ళని తనే నమ్మలేనంత విభ్రాంతిగా.

ఆటోలో బోసుతో మాట్లాడినప్పుడు కూడా అతని గొంతులో అదే ధ్వనించింది.

“జస్ట్‌ ఊహించుకో బోసూ! కొన్ని వందలమంది ఉద్యోగులూ, కార్మికులూ, పరిగెత్తే లారీలూ..చేతినిండా పనితో పాలొంచ నిండా చిన్న చిన్న వర్క్‌షాపులూ , ఫౌండ్రీలూ, వాళ్ళ కుటుంబాలలో వేల కొద్దీ జనాలూ… అన్నీ ఎవడో మాంత్రికుడు చెయ్యి ఊపినట్టు మాయమయిపోయాయి. హిరోషిమా నగరాన్ని మనం ఎప్పుడూ చూడలేదు గానీ ఆ రోజు అక్కడ…”

అతని మాటల సాయంతో ఆ విధ్వంస దృశ్యాన్ని కళ్ళముందు నిర్మించు కొంటున్నాడు బోసు. మూడేళ్ళ తర్వాత కూడా శ్రీహరికి అక్కడ ఆ రోజు జరిగిన ప్రతి విషయమూ గుర్తుండటమే ఆశ్చర్యం.

అదే అన్నాడు బోసు.

“దాందేముంది. ఆ రోజే కాదు. అంతకు అయిదేళ్ళ ముందు నేనా షెడ్డులో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ..అక్కడ ఎవరెక్కడ నుంచొని ఉన్నారో కూడా చెప్పగలను”.

శ్రీహరి మాటల్లో అతిశయోక్తి లేదు.

ఆ రోజు సెక్యూరిటీ ఆఫీసులోనే తన పెచ్చులూడిన సూట్‌కేసుని వదిలి అతను ఆ షెడ్డులో అడుగుపెట్టే సరికి ఈ.ఓ.టీ.క్రేను కిరకిర లాడుతూ అతని నెత్తి మీదగా వస్తోంది. కొంచెం ఉంటే దాని భారీ ఇనుపకొక్కెం తగిలేసును.

పైనుంచి సత్యన్నారాయణ పెద్దగా వొదరుతున్నాడు.

ఎవరో కార్మికుడు అతన్ని మెరుపులా పక్కకి లాగేశాడు. (ఆ తర్వాత అతని పేరు “సనా” అని తెల్సింది).

“కొత్తగా జేరావా?” అదోలా అడిగాడతను.

“ఇవ్వాళే” తేరుకోవటానికి టయిం పట్టింది.

“జేగర్త” కదిలాడు.

“ఒక్క నిముషం” శ్రీహరి ఖంగారుగా అడిగాడు. “బుచ్చిరెడ్డి గారనీసీనియర్‌ జనరల్‌ మానేజర్‌ ఎక్కడుంటారు?”

తను రిపోర్టు చేయాల్సిందతనికే.

“వాడే ఆ పిచ్చి లం…కొడుకు” అన్నాడు సనా పదడుగులవతల నిలబడి  ఎవరిమీదో అరుస్తున్న పిప్పిళ్ళ బస్తా లాంటి మనిషిని చూపిస్తూ .

బుచ్చిరెడ్డి అటు తిరిగి అక్కడ గుంపుగా నిలబడి ఉన్న  కార్మికుల  మీద అరుస్తున్నాడు. వెనగ్గా నిలబడిన వాళ్ళు పరిహాసంగా తమలో తాము మాట్లాడుకొంటున్నారు.

“మట్టి కొట్టుకు పోతార్రా నీయమ్మ” అంటున్నాడతను.

“ఇప్పుడు మాత్రం మాకేమి మిగిలిందని. అంతా మీరే …తిన్నాక” అన్నాడో కార్మికుడు అంతే స్థాయిలో. ఎవరో సూపర్‌వైజర్‌ సర్ది చెప్పలేక సతమతమవుతున్నాడు.
శ్రీహరికి ఆ షాక్‌ నుంచీ తేరుకోవటానికి ఆరేడు  నెలలు పట్టింది. అందాకా అతనికి ఇండస్త్రీ అంటే ఎవో ఊహలుండేవి. పరస్పర గౌరవాలూ, ఆప్యాయతలూ, ఉమ్మడి లక్ష్యాలూ వగైరా…

కాసేపటికి ఆ అరుపులు ముగించి ఇటు తిరిగిన బుచ్చిరెడ్డిని బిక్కుబిక్కు మంటూ సమీపించి తన జాయినింగ్‌రిపోర్టు ఇవ్వబోయాడు శ్రీహరి.

ధుమధుమలాడుతూ ఇంతెత్తున లేచాడు బుచ్చిరెడ్డి.

“ఇక్కడా…ఇక్కడా రిపోర్టు చేసేది. ఆఫీసుకి తగలడు మానర్‌లెస్‌…” ఎటో వెళ్ళిపోయాడు అరుస్తూ.

శ్రీహరి బిక్క చచ్చి పోయాడు. అవతలగా నుంచొని ఇటే చూస్తున్న కార్మికులు. కొందరు జాలిగా. ఈ నేల ఇప్పుడే చీలి తనందులో దూకేస్తే…అలా అతనెంత సేపున్నాడో  గానీ…అప్పుడే ప్రొడక్షన్‌ అఫీసు నుంచి చంకలో రెండు డ్రాయింగులు పెట్టుకొని మెట్లు దిగి వచ్చిన రాజారావు అక్కడి వాళ్ళనేదో అడిగి శ్రీహరి దగ్గరకి నడిచాడు.

“సారీ. సారీ గురూ. ఇక్కడి పరిస్థితేమీ బాగోలేదు. ఇప్పుడెందుకు జేరినట్టూ?” అన్నాడు.

అతని స్నేహ పూర్వకమయిన నవ్వు. మొహంలో ప్రసన్నత.

“మనిషిలో ఏదో ఉంది. లేదంటే ఫాక్టరీ మొత్తం మీద అతనొక్కడి మాటే ఎందుకు వింటారు కార్మికులు. మిగతావాళ్ళకి వాళ్ళతో పనిచేయించాలంటే గుడ్లు వెళ్ళుకొచ్చేవి. ఓరి నాయనోయ్‌…నీకు తెలీదు. ఒక్కోడూ ఒక్కోరకం…” అన్నాడు శ్రీహరి బోసుతో.

“ఎమీ అంత హడలి పోతున్నావు?” అడిగాడు బోసు. అతనికి  వినోదంగా ఉన్నట్టుంది.

“చెప్పానుగా నువ్వు గానీ చూస్తే…”

అతనికింకా లీలగా గుర్తు.

మొదటిసారి నైట్‌షిఫ్ట్‌లోనే వాళ్ళకు దొరికిపోయాడు. ముందొకరిద్దరు వినయంగా అడగటం మొదలేశారు. మెల్లగా చుట్టూ ఒక గుంపు జేరింది. అతని పేరూ, ఊరూ, తల్లిదండ్రుల వివరాలూ, పొలమూ చివరిగా కులమూ అడిగారు.( అప్పటికే అతని మొహం ఎర్రబడి పోయింది). తర్వాత అతని సబ్జెక్టు పై ప్రశ్నలు. టెంపరేచర్లూ, మెల్టింగ్‌ పాయింటులూ, హార్డ్‌నెస్సూ వగైరా. నాలుగేళ్ళకు పైగా మధించిన లోహ శాస్త్రం అతన్నాదుకోలేకపోయింది. అతనిచ్చిన ప్రతి జవాబుకి సానుభూతిగా తల అడ్డంగా తిప్పటమూ, అందులో తప్పులు వివరించటమూ. వెనక నిలబడిన వాళ్ళు “చ్చొ..చ్చొ” అంటున్నారు.

ఇంకెంతసేపు ఆ రాగింగ్‌ సాగేదో గానీ ఈ లోగా రాజారావు అటుగా వొచ్చి అతన్ని రక్షించాడు. శ్రీహరిని తీసుకొని గాంట్రీబే పక్కకి నడిచాడు.

“శ్రద్దగా నేర్చుకోవాలి. అన్నీ గమనిస్తుండు. లేదంటే వీళ్ళు తాటాకులు కట్టేస్తారు” అన్నాడు. ( అతనికి వాళ్ళమీద చిన్నచూపూ లేకపోవటమూ , పైగా అదోలాటి కన్సర్న్‌ ఉండటమూ గమనించాడు శ్రీహరి).

“అలాగే సార్‌ కానీ…”

“ఊ! చెప్పు”

“లేద్సార్‌ నిన్న మీరన్నారు. ఇక్కడ పరిస్థితి బాగోలేదు. ఇప్పుడెందుకు జాయినవటం అని” శ్రీహరిలో ఒకలాటి ఆందోళన ధ్వనించింది.

నిజానికి అతనికది కాలేజీలోనే మొదలయింది. తను ఆంధ్రాస్టీల్స్‌ని ఎంచుకున్నందుకు ట్రైనింగ్‌ అండ్‌  ప్లేస్‌మెంట్స్‌ ఇన్‌చార్జ్‌ అదోలా చూసి “మే గ్లాడ్‌ బ్లెస్‌యూ” అన్నాడు అపాయింటుమెంట్‌ లెటర్‌ అందిస్తూ. “నిజంగా వీడొక ఎరుపు” అని మిత్రులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు చివరి రోజు కాలేజీగేటు ఎదురుగా చారియట్‌లో మూడోబీరు ముగించాక. (ఆ తెల్లారే అందరూ పెట్టే బేడా సర్దుకొని హాస్టల్‌ వేకేట్‌ చేసి తమ తమ ఉద్యోగాల్లో చేరటానికి బయలు దేరారు ఖాజీపేట జంక్షన్‌లో వీడ్కోళ్ళు చెప్పుకొని. శ్రీహరి ఒక్కడూ డోర్నకల్‌ జంక్షన్‌లో దిగి ఈసురోమంటున్న కొత్తగూడెం పాసింజరులోకి మారాడు).

“అదా?” నిట్టూర్చాడు రాజారావు అతని ఆందోళనని అర్ధం చేసుకొన్నట్టు.

అతడు దీర్ఘంగా నిశ్వసిస్తూ ఓ పక్కకి నడిచి వర్కర్లు డ్రస్సులూ, బూట్లూ, పళ్ళాలూ దాచుకొనే జాజి చెక్క పెట్టెల వరస మీద కూర్చొన్నాడు.

“కూచో చెప్తా. నిజంగానే పరిస్థితి బాగోలేదు” ఎక్కడ మొదలుపెట్టాలా అన్నట్టు సాలోచనగా వంగి తన కాళ్ళకున్న బూట్లు ఊడదీసి దులుపుతున్నాడు. వాటిలోంచి గుప్పెడు శ్లాగ్‌ రాళ్ళు రాలి పడ్డాయి. అతడి కాలి చిటికెన వేళ్ళ పక్కగా చింతగింజంత లావున నల్లటి కాయలు.

“నువ్వేదో ఊహించుకొని  ఇక్కడ జేరినట్టున్నావు పదేళ్ళ క్రితం నేను జేరినట్టు. నిజానికిదంత తీసివేయదగ్గదేమీకాదు. విశాఖ తర్వాత అంత పేరుంది. నెల నెలా వేలకొద్దీ టన్నుల ఆర్డర్లుండేవి. కార్మిక రత్న , యాజమాన్య రత్న వగైరా అవార్డులొచ్చేవి ప్రతియేటా. 88 లో ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో మంది మూడో ఉత్తమ కంపెనీగా లెక్క గట్టారు. అయితే ఇప్పుడది గతించి పోయిన స్వర్ణయుగం. రెండేళ్ళ నుంచి అంతా తలకిందులయింది. ఇప్పుడు పరిస్థితేంటంటే  గత నాలుగు నెల్లగా నెలజీతాలివ్వటం కూడా కనాకష్టంగా మారింది. బోనస్‌ల మాట దేవుడెరుగు. ఇన్సూరెన్సూ, పి.యఫ్‌ కట్టటం కూడా మానేశారు. కంపెనీ బస్సులు కూడా రద్దయ్యాయి. ఇప్పుడు రోజూ క్యాంటీన్‌ నడవటమే గగనం”.

“ఎందుకని సార్‌? ఒక్క సారిగా…”

“ముఖ్యంగా ఆర్డర్లు…ఆర్డర్లు లేవు. ఇప్పుడు నెలకో రెండువేల టన్నుల లోడు తీయటమే గొప్ప. ఇంకా సవాలక్ష కారణాలు. ఇంతకు ముందున్న యం.డీ దారుణంగా తినేసి పోయాడు. నువ్వు చూసే ఉంటావు పేపర్లో వచ్చిందే”.

అప్పుడు గుర్తొచ్చింది శ్రీహరికి. ఆ యం.డీ ఒక ఐయ్యేయస్‌ అధికారి. ఎప్పట్నించో అవినీతి ఆరోపణలు. కొద్ది నెల్ల క్రితమే కంపెనీ అంత దివాళా స్థితిలో ఉన్నా రెండు కిలోల ముత్యాలు కొని ఒక మంత్రికి బహుమతిగా ఇచ్చాడనీ, ఆ మంత్రి వాటితో తన తిరుపతి మొక్కు తీర్చుకొన్నాడనీ, దానిపై విచారణకు ఆదేశించామనీ ప్రభుత్వ ప్రకటన.

“అదీ పరిస్థితి. అక్కడున్న కొద్దినెలలూ ఎంత గిల్టీగా గడిపానో చెప్పలేను” అన్నాడు శ్రీహరి.

“ఎందుకూ?” అడిగాడు బోసు.

“చెప్పాను కదూ. అక్కడ క్యాంటీన్‌ నడవటమే కష్టంగా ఉంది. ఫాక్టరీ మొత్తం ఆ ఒక్క ఫర్నేస్‌ మీదే నడుస్తోంది. ఆ కార్మికులు చావుకు తెగించి ఆ భగ్గుమనే మంటల్లోంచి తీసిన మెటలూ దాని మీద వచ్చే ఆదాయమూ మా కడుపు నింపాయి. ఆ తిండి తిన్నప్పుడల్లా…”

“అంత ఫీల్‌కాకు. నువ్వు మట్టుకు ఏం చేస్తావు?” బోసు శ్రీహరి భుజం తట్టాడు.

“అవును. కానీ…ఎంత మరిచిపోదామన్నా ఆ రోజు ఆ ఫర్నేస్‌నూ…  రాజారావునూ….ఊహించుకోవటానికే కష్టంగా ఉంది” అన్నాడు శ్రీహరి…ఫర్నేస్‌ ఎదురుగా  పాలిపోయి ఉన్న మొహంతో నిలబడిఉన్న రాజారావునే చూస్తూ.

“ఊ! కంకాస్ట్‌ మెషీనే … ఇంకెంత సేపు చూస్తావు గానీ పని చూడు” అన్నాడు విద్యాసాగర్‌ ఫర్నేసునీ, రాజారావునూ చూస్తున్న  శ్రీహరిని ఆ రోజు.

శ్రీహరి విసుగ్గా అవతలికి కదిలాడు ప్రసన్న వైపు.

“మన్ని చూసుకొని ఎస్టిమేషన్‌ వేసుకొమ్మన్నారు బానే ఉంది. కానీ ఇవరం తవరం లేకుండా ఏదెక్కడుందో తెలీకుండా ఈ అడవిలో ఏం చూస్తాం? ఇంక మనది మనం విప్పి చూసుకోవాలి” అంటున్నాడు రత్నకిషోర్‌ ప్రసన్నతో.

ప్రసన్న నవ్వి “నీకంత శ్రమ అక్కర్లేదు. పెద్ద లిష్టు ఇచ్చార్లే ఇక్కడి  ఆస్తుల వివరాలు. మీ బాసుడి దగ్గర చూడలా?” అన్నాడు.

అప్పటికే విద్యాసాగర్‌ ఒక కాపీ రాజారావుకిచ్చి తనొకటి తీసుకొని కదిలాడు. అక్కడ్నించి వాళ్ళు సాయంత్రం దాకా ఊపిరి సలపనంత వేగంగా పనులు కానిచ్చారు.

ప్రతి గదికీ  ప్రతి మెషీన్‌ దగ్గరికీ పోవటం , దాని స్పెసిఫికేషన్లు తీసుకోవటం, ఇనుమూ ఉక్కూ అయితే  వాటి బరువులు అంచనా కట్టటం, లిష్ట్‌లో ఆ అయిటం ఎదురుగా ఉజ్జాయింపుగా దాని ధర రాయటం.

“అబ్బాయిలూ! స్క్రాపు రేటు వేసెయ్యండి అన్నిటికీ” ముందే హెచ్చరించాడు విద్యాసాగర్‌.

సబ్‌స్టేషన్‌, పంప్‌ హవుస్‌, కూలింగ్‌టవర్లూ, ఎక్జాష్టు ఫ్యానులూ, కన్వేయర్లూ, కంప్రెషర్లూ, వేయింగ్‌ బ్రిడ్జిలూ, వర్క్‌షాపులూ, గ్యాస్‌క్లీనింగ్‌ ప్లాంటూ , స్టోర్‌ రూం, ఎనిమిదివేల టన్నుల స్టీలు బిల్లెట్లు, రోలింగ్‌ మిల్లూ…చివరకు కప్పు మీది రేకుల్తో సహా వాళ్ళు పరిశీలించారు.

అయితే సివిలు వాళ్ళు గొప్ప గందరగోళంలో పడి పోయారు.

డ్రాయింగుల ప్రకారం చూస్తే ఏ ఒక్క బిల్డింగూ ఉన్న చోట లేదు. పైగా కొన్ని మాయమయిపోయాయి.

“సార్‌ పంప్‌ హవుసు కనపట్టంలేదు” కిచ కిచ నవ్వుతూ వచ్చాడు సివిల్‌ కృష్ణ. చివరకి సత్యన్నారాయణ మనుషులు కత్తులతో చెట్లూ పుట్టలు ఛేదించుకొని వెళ్తే ప్రహరీ గోడ పక్కన రెల్లు దుబ్బుల్లో ప్రత్యక్షమయిందది. కొలంబస్‌ అమెరికాను కనుక్కొన్నంత సంబర పడ్డారు వాళ్ళు.

అలా కనుక్కున్న వాటిలో రెష్ట్‌రూం ఒకటి. అది ప్రొడక్షను ఆఫీసుకి వెనగ్గా ఉంది.

శ్రీహరి ఆ గది గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూస్తుండి పోయాడు. కొన్నేళ్ళ తర్వాత తలుపులు తెరవటం వల్ల గది మొత్తం ఒక ధూళి  మేఘం వ్యాపించి ఉంది. అది మెల్లగా మనిషి గా మారి అతని ఎదురుగా నిలబడింది.

“సనా” గొణుక్కున్నాడు .

తను ఇక్కడ రిజైన్‌ చేసి స్వతంత్ర స్టీల్సులో చేరబోయే చివరి రోజు ఈ గుమ్మంలోనే నిలబడి వీడ్కోలు ఇచ్చాడు సనా. ఈ గదిలోనే తన కళ్ళ ముందు దశాబ్దాల చరిత్రను పరిచాడతడు. నైట్‌ షిఫ్టులు ముగిశాక గడిపిన నిద్రలేని తెల్లవారుఝాములు..తల దిమ్ము .. కళ్ళు మంటలు..

సనా కింకా గుర్తు.

తన చిన్నతనంలో బొగ్గు గనులు తప్ప కొత్తగూడెం ప్రాంతమంతా దట్టమయిన అడవులు.  అక్కడక్కడా విసిరేసినట్టున్న ఊళ్ళూ, లంబాడా గిరిజన తండాలూ. భద్రాచలం మేన్‌రోడ్డు మీద రోజుకొకటి రెండుసార్లు ఈసురోమని నడిచే ఎర్రబస్సులు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో పెనుఘోష పెట్టే ఆవిరితో నడిచే గూడ్సు బళ్ళూ. వాటి చీదుడు మైళ్ళకొద్దీ వినిపించేది.

ఏ పండక్కో పబ్బానికో పెళ్ళిళ్ళకో తప్ప ఊరు దాటి ఎరుగని జనం. వర్షాధార పంటలు. కోస్తా నుంచి వలస వచ్చిన చిన్నాచితకా రైతులు. ఏడాదికి రెండు మూడు నెలలు మించి దొరకని పనులు. అడవుల్లో కాయా కసరు ఏరుకోవటం.

మేన్‌రోడ్డుకి దారితీసే మోకాల్లోతు బురదలో మునిగి ఉండే సన్నటి కాలిబాటలు. రోడ్డు మీద నిలబడి వచ్చే పోయే బొగ్గు లారీల్నీ, ఎర్ర బస్సుల్నీ కళ్ళు విప్పార్చి చూసే పిల్లలు. అప్పుడే సనా వాళ్ళతో కలిసి  డ్రైవరు లేకుండా నడిచే లారీల్నీ, తలకాయలు లేకుండా మోటారు సైకిళ్ళు నడిపే వాహన ధారుల్నీ చూసింది.

ఏ పుష్కరాలకో దూర ప్రాంతాలనుంచి పేంటూ , చొక్కా వేసుకొని వచ్చే బంధువులూ, నాలుగైదేళ్ళకోసారి ఓట్ల పండక్కి దిగే తెల్ల చొక్కాల బాబులూ, జీపులూ. తండా జనమంతా గుమిగూడి జోరుగా , ఆశ్చర్యంగా వేసే ప్రశ్నలకి వాళ్ళు ఓపిగ్గా , చిరాకుగా సమాధానాలిచ్చేవాళ్ళు.

“మన దేశము భారత దేశము. మన ప్రధాని ఇందిరా గాంధీ. మన ఎన్నికల గుర్తు ఆవూదూడా”.

అప్పటి ముఖ్యమంత్రి కేంద్ర స్థాయిలో మంతనాలు జరిపి తన స్వంత జిల్లాలో కనీసం కొన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలయినా  ఉండాలనీ, బొగ్గుగనుల్ని ఉపయోగించుకోవాలనీ పట్టు పట్టటం వల్ల మూడు నాలుగు భారీపరిశ్రమలు వెలిశాయి 1970 ప్రాంతంలో. అత్తారింటికి పోయొచ్చినంత తరచుగా రష్యా వెళ్ళొచ్చే ఒక బెజవాడ ప్రముఖుడు వెనక బడిన ప్రాంతపు సబ్సిడీలన్నీ తనకు వర్తించేట్టు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవటం వల్ల ఒక ప్రయివేటు పరిశ్రమ కూడా ప్రారంభమయింది.

అలా సరిగ్గా మైలు దూరంలో ప్రభుత్వ రంగంలో ఆంధ్రా స్టీల్సు, ప్రైవేటు రంగంలో స్వతంత్ర స్టీల్సు స్థాపించ బడ్డాయి సరిగ్గా అంతకు ఇరవయ్యేళ్ళ ముందు పండిత నెహ్రూ కన్న కలలా. ఆయన ప్రతిపాదించిన నమూనాలా.(అయితే మరి ఇరవయ్యేళ్ళ కల్లా మొదటిది దివాళా తీసింది. రెండవది ఐదులక్షల పెట్టుబడి నుంచీ ఐదొందల కోట్లకు విస్తరించి మొదటిదాన్ని కొనేందుకు ముందుకొచ్చింది).

“అబ్బో అదంతా ఎప్పటి మాట” అన్నాడు సనా టీ కుర్రాడు అప్పుడే అందించిన చాయ్‌ చప్పరిస్తూ. ఫాక్టరీ అంతా నియాన్‌ లైట్ల వెలుతురులో మునిగిఉంది. మునగదీసుకున్నట్టున్న యంత్రాలూ, రెష్ట్‌రూంలో కునికి పాట్లు పడుతున్న కార్మికులూ.

“అదంతా యాదికొస్తే దిమాక్‌ ఖరాబయిపోద్ది” మళ్ళీ అన్నాడు తనే.

“చెప్పు చెప్పు” అనేవాడు శ్రీహరి. కాదనకుండా అతను గతంలోకి జారేవాడు.

రెండు మూడేళ్ళలో పునాదుల నుంచీ పెద్ద పెద్ద కట్టడాలు లేచాయి. దేశ విదేశాలనుంచి (ఎక్కువగా రష్యా నుంచి) ఇంజనీర్లు రావటం మొదలయింది. తెలతెల వారుతుండగా ఓ ఉదయాన “బొయ్యి” మని సైరన్లు కూశాయి. తండాలన్నీ ఉలిక్కిపడి నిద్ర లేచాయి.

అది మొదలు.

ఓ తుఫాను కేంద్రం ప్రచండమయిన వేగంతో సరివితోటల మీదుగా ప్రయాణించినట్టు ఊళ్ళకు ఊళ్ళన్నీ ఆ సుడిగాలిలో కొట్టుమిట్టాడాయి. దశాబ్దాలుగా అక్కడ గడ్డకట్టుకొని ఉన్న నిశ్శబ్దం మంచు పలక పగిలినట్టు పగిలింది. నిశ్చలజనజీవనం ఒక్కసారిగా పోటెత్తే ప్రవాహంగా మారిపోయింది.

కాలిబాటలు కంకర్రోడ్లయ్యాయి. నాలుగైదు టెంటు థియేటర్లు వెలిశాయి. (దేవదాసు సినిమాలో చచ్చిపోయిన నాగేశ్వర్రావు దసరాబుల్లోడులో గంతులు వేస్తూండడాన్ని సహించలేని జనం తిరగబడ్డారు. ఒక టెంట్‌ థియేటర్‌ నేల మట్టమయింది).

వైను షాపులూ, బార్లూ, చికెన్‌సెంటర్లూ, కిరాణా దుకాణాలూ, డాబా ఇళ్ళూ, కరెంటు స్థంబాలూ, బల్బులూ, చిట్టీపాటలూ, తాకట్టు దుకాణాలూ, మార్వాడీలూ, అప్పులూ, ఫర్నిచర్‌ షాపులూ, టేకు మంచాలూ, పాన్‌ షాపులూ  వచ్చేశాయి. మరి పదేళ్ళకల్లా చిట్‌ఫండ్‌ కంపెనీలూ, లాడ్జింగులూ, త్రీస్టార్‌ హోటళ్ళూ, ఇన్‌స్టాల్‌మెంట్లమీద వాహనాల అమ్మకాలూ, సూపర్‌మార్కెట్లూ, సినిమా హాళ్ళూ, చికెన్‌ కబాబు సెంటర్లూ, రోజ్‌వుడ్‌ తలుపులూ, వాటిమీద పూలపూల డిజైన్లూ, ఆయుర్వేదం స్థానే అల్లోపతీ, అరెంపీల స్థానే యంబీబీయస్సులూ, అయిదు రూపాయల దవాఖాన్ల పక్కన ఐదు నక్షత్రాల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులూ ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో జేరటానికి తగినన్ని రోగాలు రావటం కూడా మొదలయ్యింది.

“ఇంకో ముచ్చట జెప్పాలె సారూ! ఈని తండల ఈడే మిలియనీరన్నట్టు” అప్పుడే క్రేను దిగి వచ్చిన జలీల్‌ సనాని బనాయించాడు.

అందులో కొంత నిజం లేక పోలేదు.

ఆ తండాలో మొదటిసారిగా సైకిలు కొన్న వాడు సనా. తెలతెల వారుతుండగా తండా నిద్రలేచే సమయానికి నైటుషిఫ్టు నుంచి తిరిగొచ్చి నిద్రలోకి జారుకొనే వాడు. నాలుగైదు ఏళ్ళు గడిచాక ఇల్లెందు నుంచీ పెంకులు తెచ్చి సిమెంటు గోడల ఇల్లు లేపాడు. మొదటిసారిగా లైసెన్సు తీసుకొని రేడియో కొన్నవాడు అతనే, ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో మొదటిసారిగా కరెంటు బల్బు వెలిగిందీ అతని ఇంటిలోనే. (అతని గురించీ  రెండు మూడు తరాలవరకూ తల్లులు తమ పిల్లలకు  కథలు కథలుగా చెప్పారనీ, అతనింట్లో అతిధులకి  దొరికే టీ గురించీ అనేకమంది అతన్ని చూడవచ్చేవాళ్ళనీ జలీల్‌ అనేవాడు).

“ఏమి మిలియనీరో సారు. కొడుకు కాలేజీ చదువుకీ, బిడ్డ పెండ్లికీ, బారియ రోగాలకీ పాతిక వేలు అప్పు పడిన. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు. మా తండల జనం నాలా ఈ ఉజ్జోగాల బారిన పడి అప్పులు పాలవకుండా బతుకు నెట్టుకొచ్చిన్రు. నేను మాత్రం అయినకాడికి ఆ ఇల్లు కుదవ బెట్టి మన కాలనీలో తేలిన. తండల ఉన్నప్పుడు గంజో గటకో తాగి బతక బడితిమి. ఇక్కడ కంపెనీ లెవెలు మెయింటెయిను జేయను ఫ్యాన్లు, టీవీలూ, గ్యాసు పొయ్యిలు, కాన్వెంటు చదువులు, కట్నాలు , మోపెడ్లు , అప్పులు”

సనా ఇంకా ఆ గుమ్మంలో నిలబడి విస్మయం నిండిన గొంతుతో మాట్లాడుతూనే ఉన్నాడు.

సివిలు వాళ్ళు టేపులు తీసి కొలతలు మొదలు పెట్టారు. శ్రీహరి వెనక రాజారావు , జలీలు లోపలికి అడుగు పెట్టారు.

రెష్ట్‌రూం మధ్యలో పొడవునా జాజి చెక్క బల్లా, చుట్టు ఏడెంది కుర్చీలూ, అవతలగా సగం తలుపులు తెరిచిఉన్న అలమరా… అన్నీ బూజులో , దుమ్ములో కప్పడిపోయి ఉన్నాయి. మనుషుల అలికిడికి అందాకా బల్ల కింద పడుకొని ఉన్న కొండచిలువ ఒకటి కదిలి కిటికీ లోంచి భారంగా బయటకు జారనారంభించింది. అందరూ గుసగుస లాడుతూ ఊపిరి బిగబట్టి దాన్నే చూస్తున్నారు విగ్రహాల్లా నిల్చుండిపోయి.

అదికాదు రాజారావు చూస్తున్నది. ఆ బల్ల చుట్టూ కుర్చీలు…అడ్డదిడ్డంగా తలా ఒక దిక్కుకి తిరిగి ఉన్నాయి…పాంపే నగరం మీద లావా విరుచుకుపడినప్పుడు ఎక్కడివక్కడ వదిలేసి పోయినట్టు…సరిగ్గా నాలుగేళ్ళ క్రితం వాటిల్లో కూచొని ఉన్న మనుషులు హడావిడిగా ఇప్పుడే లేచిపోయినట్టు…

ఆ కుర్చీల్లో కూచున్న వాళ్ళు ఎక్కడివక్కడ వదిలేసిపోయిన ఆ రోజు రాజారావుకి  బాగా గుర్తు.

ఫాక్టరీ గేటు దగ్గర గలాటా మొదలయ్యింది. సెకెండు షిఫ్టుకి రావలసిన ఉద్యోగులూ, కార్మికులూ  బయట నుంచి అరుస్తున్నారు. జనరల్‌ షిఫ్టులో ఉన్నవాళ్ళను వాళ్ళ వాళ్ళ వస్తువులు తీసుకొని బయటకు పొమ్మని హెచ్చరిస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు. రెండు పాలపిట్ట రంగు వాన్ల నిండా చిప్పటోపీల , బారు తుపాకుల పోలీసు ఫోర్సు దిగింది.

రెష్ట్‌రూంలో ఉన్న సనా మరికొందరూ  ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తారు. గేటు దగ్గర యండీ కారును చుట్టుముట్టి నిలేసిన ఉద్రిక్తత నిండిన మొహాలు. ఏది ఏమయినా కంపెనీని తామే నడుపుతామంటున్నారు ఉద్యోగులూ, కార్మికులూ.

ఫాక్టరీలో నిరవధికంగా లాకవుట్‌ ప్రకటించబడింది. వాగ్యుద్దం… తోపులాట… టియర్‌గ్యాస్‌… తుపాకీమందు వాసన.

కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు వదిలారు. సనా, నాగభూషణం కూడా వాళ్ళల్లో ఉన్నారని మరుసటి రోజు పేపర్లో వచ్చింది.

అంతకుముందు రోజు వచ్చిన దినపత్రిక అదే జాజి చెక్క బల్ల మీద గత నాలుగేళ్ళుగా ఇంకా భద్రంగా అలాగే ఉంది. రాజా రావు ఆ బల్ల దగ్గరకి నడిచి దాని మీది దుమ్ము దులిపి , గోధుమ రంగుచారికలతో అతుక్కుపోయిన పేజీలని జాగ్రత్తగా తెరిచి చూస్తున్నాడు. మొదటి పేజీలో హెడ్‌లైన్‌ గా ఉంది ఆ వార్త.

“అబ్బాయిలూ! ఇక లైసెన్సురాజ్‌ శకం ముగిసింది. సరళీకరణ ఉద్యమం మొదలయింది. మన ప్రజలు మరో పదేళ్ళలో స్వర్ణ యుగాన్ని అనుభవించ బోతున్నారు” అని ఎర్రకోట మీంచి అప్పటి ప్రధాని ప్రకటన.

ఇంతలో బయటినుంచి లంచ్‌కి కబురొచ్చింది.

తనకాకలి లేదని రాజారావూ , పాలొంచ పోయొస్తానని శ్రీహరీ చెప్పటంతో మిగిలిన వాళ్ళతో కార్లూ , జీపులూ కదిలాయి. షెడ్డులో ఇద్దరే మిగిలారు.

“ఏంటి సార్‌ ఇలా జరిగింది. ఇదంతా ఇలా చూడటమే కష్టంగా ఉంది” అన్నాడు శ్రీహరి.

రాజారావు దీర్ఘంగా ఊపిరి విడిచి గాంట్రీబే పక్కన అప్పట్లో వర్కర్లు ఉపయోగించిన చెక్క పెట్టెల మీద కూర్చున్నాడు. అవి కిరకిర లాడాయి.

“జాగ్రత్త సార్‌! అసలే చెదలు పట్టి ఉన్నాయి” అన్నాడు శ్రీహరి తనూ పక్కనే కూచొంటూ. రాజారావు బూట్లు ఊడదీసి దులుపుతున్నాడు.

“శ్రీహరీ! అప్పుడు మనం ఇక్కడే కూచొని మాట్టాడుకున్నాం. గుర్తుందా?”

“ఉంది సార్‌”

“అంతకు ముందు రోజే బుచ్చిరెడ్డి నిన్ను…”

“అవును. ఆ రోజు వర్కర్లూ ఆయనా పోట్లాడుకున్నారు”

“ఎందుకనుకున్నావ్‌?”

“నేను అప్పుడే అడుగుదామనుకున్నా సార్‌. ఎందుకూ?”

“ఆ రోజు చెప్పాను కదూ అంతకు రెండేళ్ళ ముందు నించి సడన్‌గా లాసు రావటం మొదలయ్యింది. ప్రభుత్వం నుంచి మనకొచ్చే ఆర్డర్లు హఠాత్తుగా స్వతంత్రాకి మళ్ళాయి. అదేమని అడిగితే వాళ్ళు తక్కువకి కోట్‌ చేశారనీ,  మనం టైమ్లీ డెలివరీ చెయ్యలేమనీ , క్వాలిటీ సమస్యలనీ అన్నారు. ఇంక మనం తేరుకోలేమనీ, మళ్ళీ వెనకటి ప్రొడక్షను అందుకోలేమనీ భరోసా వచ్చాక స్వతంత్ర వాళ్ళు మనకంటే ఎక్కువ కోట్‌ చెయ్యటం మొదలెట్టారు. అయినా ఆ ఆర్డర్లని  మాత్రం వెనక్కి తెచ్చుకోలేకపోయాం. హైదారాబాదులో ముఖ్యమయిన వాళ్ళని స్వతంత్ర వాళ్ళు బాగా సంతృప్తి పరిచారనీ , మంత్రుల స్థాయిలో ఇన్‌ఫ్లూయెన్సు చేశారనీ అంటారు. అప్పుడే  మనకి రా మెటీరియల్‌ అమ్మే ప్రైవేటు కంపెనీలూ ధరలు రెట్టింపు చేశాయి. అలా ఎక్కువకి కొని తక్కువకి అమ్మి  సరిగ్గా మన పని ఐస్‌బర్గుల మధ్య ఇరుక్కున్న గుడ్డి తిమింగలంలా అయింది. ఈ లోగా మన వాళ్ళు పైన సీనియర్‌ మేనేజర్ల నుంచీ కింద ఆఫీసు ఫ్యూను దాకా స్వతంత్ర తో లాలూచీ పడి పొయ్యారు. ఇక్కడ మనం ఏం చేసినా తెల్లారే సరికి స్వతంత్ర యండీకి తెలిసిపోయేది” అన్నాడు రాజారావు.

నిజానికి శ్రీహరికి ఆంధ్రాస్టీల్సులో చేరిన కొత్తలోనే అర్ధమయింది.

“రన్నింగ్‌ కండిషన్‌లో ఉన్న మెషీన్లని స్క్రాపుకింద అమ్ముకు నూకారు”

“రా మెటీరియల్‌ సప్లై చేసే వాడు ఫలానా మంత్రికి  మేనల్లుడు. వాడు మార్కెట్‌ రేటుకు  రెట్టింపు కోట్‌ చేసి  అంటగడతాండు”.

“గూడ్సు బళ్ళయితే  లేటవుద్దని వంక చెప్పి ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుకి లీజు కిచ్చారు. పదిహేను లక్షల లాసు”.

” అవుట్‌గోయింగ్‌ మెటలు బరువు తప్పుల తడక. వేయింగు బ్రిడ్జి ఇన్చార్జ్‌ ఏడాదిలో బంగ్లా కట్టిండు”.

“రోలింగు మిల్లు ప్రపోజలు పెట్టి రెండు కోట్లు ముంచేసినారు. అదసలు మనకు పనికే రాదు. దానికి తాళం వేసి మూల బెట్నారు”

“యూనియన్‌ లీడర్‌ పాపారావు ఏ.సీ కారు కొన్నాడు. వాడూ యండీ కలిసి తిరుగుతాండ్రు”

ఇంకెన్నో.

ఏడాది చివర్లో జీతాలివ్వటం ఆపేశారు. శ్రీహరికి ఇంటి దగ్గర్నించి యం.వో వస్తుండేది.

“అప్పుడే బుచ్చిరెడ్డికి అంటగట్టారు ప్రొడక్షను డిపార్టుమెంటు. ఆయన పని పులుసులో పడి నట్టయింది. సరిగ్గా నువ్వప్పుడు జాయినయ్యావు” అన్నాడు రాజారావు.

అవును. ఇటు వర్కర్లు పని చెయ్యమని మొండికెత్తి కూచున్నారు. అటు పైనుంచి షంటింగ్‌. మధ్యలో పిచ్చి చూపులు చూస్తూ, బీ.పీ పెరిగిపోతూ బుచ్చిరెడ్డి.

“నేనిక్కడున్న ఏడాదిలో చూసాను సార్‌. ఒక్కడూ సరిగ్గా పని చెయ్యలేదు. ఓ రోజు మెటలు లాడిల్సులో పట్టాక క్రేన్‌ ఆపరేటరు టీ టైం అయ్యిందని  ఆపన్నే పొయ్యి అరగంటకొచ్చాడు. అది గడ్డకట్టి , దాన్ని మళ్ళీ బద్దలు కొట్టించి …లక్షకు పైగా లాసు. ఘోరం కాదా సార్‌” అన్నాడు శ్రీహరి.

” అవును పని దొంగలున్నారు… అన్ని చోట్లా, అన్ని కాలాల్లో. ఇప్పుడు మన స్వతంత్రాలో లేరూ? ప్రైవేటుదే అయినా పని తప్పించుకొనే సెక్షను ఒకటి పైనుంచి కిందకు ఉంటూనే ఉంటుంది. అయితే ఆ లోడు వేరే వాళ్ళు మోయాల్సి వచ్చేది. ఇక్కడ అప్పట్లో సనా , నాగభూషణం..వీళ్ళెలాంటి వాళ్ళనుకొన్నావు . స్నానం పానం లేకుండా ఏకబిగిని ఐదారు షిఫ్టులు చేసే వాళ్ళు ఆర్డర్లు మీటవ్వటానికి. అయితే చివరకు నెల జీతాలు రాకపోవటంతో వాళ్ళూ మొండికెత్తారు. ఆఖరికి నా మాట వినటం కూడా మానేశారు” అన్నాడు రాజారావు.

అవును. చివర్లో అంతా ఒక అసంబద్ధ చిత్రంలా ఉండేది. కరెంటు బిల్లు కట్టక పోవటంతో బోర్డు వాళ్ళు కనెక్షన్లు పీకేశారు. జనరేటరుకి  ఆయిలు కొంటం కూడా కష్టమయ్యింది. చీకటి గదుల్లో రోజల్లా ఉలుకూ పలుకూ లేకుండా కూచొని, తమ షిఫ్టులు ముగించుకొని, నిశ్శబ్దంగా పోతుండే వాళ్ళు. క్యాంటీన్‌లో ఏం దొరుకుతుందా అని రోజంతా ఎడతెగని ఆలోచనలు. పంప్‌ హవుస్‌ ఆగిపోవటంతో మంచినీళ్ళకి కూడా కటకట. ఫలానావాడి పెళ్ళాం ఫలానా వాడితో…ఫలానావాడింత కూడ పెట్టాడు…గుసగుసలూ …కీచులాటలూ…కుక్కజట్టీలు.

కంపెనీ బీ.ఐ.ఎఫ్‌.ఆర్‌ ముందుకి పొయ్యాక .. దీన్నెంత త్వరగా మూసేస్తే అంత మంచిదని అది ప్రకటించాక …ఇక ఉద్యోగులు కంపెనీకి రానవసరంలేదనీ జీతాలు(?) ఇళ్ళకు పంపుతామనీ నోటీసు బోర్డులో పెట్టారు. కంపెనీని కొంటానికి ఎవరయినా ముందుకొస్తే దాంతో బకాయిలు తీర్చి , జీతాలు చెల్లిస్తామని కొనే వాళ్ళనుంచి బిడ్లు ఆహ్వానిస్తూ మరొక పత్రికా ప్రకటన. కంపెనీకున్న రెండొందరెకరాల భూమిలో సగం అమ్మి దాన్ని పెట్టుబడిగా పెట్టి కంపెనీని మళ్ళీ లాభాల బాటలో నడపొచ్చని ఉద్యోగ, కార్మిక సంఘాల ఎదురు ప్రకటన. లోకల్‌ ఎమ్మెల్యేలూ, మంత్రులూ, స్వతంత్ర స్టీల్సు గెష్ట్‌ హవుసులో దిగి పరిస్థితిని జాగ్రత్తగా గమనించ సాగారు. ఏసీకార్లు కార్మిక నాయకుల ఇళ్ళచుట్టూ, యండీ బంగ్లా చుట్టూ తిరగనారంభించాయి. అప్పటికే ఆంధ్రా స్టీల్సుకి చెందిన ఉత్పత్తుల డిజైన్లూ , డ్రాయింగులూ, ప్రాజెక్టుల వివరాలూ స్వతంత్ర స్టీల్సు కి చేరిపొయ్యాయి. వాటిని కొంచెం అటిటు మార్చి మార్కెట్లోకి వదిలారు.

అదీ చివరి చావు దెబ్బ.

నడి సముద్రంలో టైటానిక్‌ మునగటం ప్రారంభించింది. చావుబతుకుల యుద్దం మొదలయ్యింది.

ఉద్యోగులూ , ఇంజనీర్లూ కొత్త కంపెనీల్ని వెతకటం మొదలు పెట్టారు. కొద్ది మంది ఎలాగో గట్టెక్క గలిగారు (రాజారావుని స్వతంత్ర ఎండి స్వయంగా అహ్వానించి ఉద్యోగం ఆఫర్‌ చేశాడు). వర్కర్లు అనేక ఏళ్ళు ఆంధ్రా స్టీల్సు కాలనీ లోనే ఆశలు చావక ఎదురుచూశారు. కాలనీకి కరెంటు , నీళ్ళ కనెక్షన్లు పీకేశారు. కొంత మంది పాలొంచలో రిక్షాలు తొక్కటం, హమాలీలుగా జేరటం, చెప్పులు కుట్టటం. కొద్దిమంది  పేట రౌడీలుగా ఎదిగారు.

పదిహేడుకి పైగా ఆకలి చావులు. కాదని ప్రభుత్వ ప్రకటన. ఆ అనుమానానికి కూడా ఆస్కారం లేకుండా ఎనిమిది మంది ఉరి పెట్టుకున్నారు. ఇళ్ళల్లో గలాటాలూ, భార్యాపిల్లల్ని రాళ్ళతో మోదటాలూ. కొద్దిమంది బొంబాయి రెడ్‌లైట్‌ ఏరియాలో తేలారు. కొంతమంది “ఇప్పుడే వస్తా”మని చెప్పి భార్యా పిల్లల్ని వదిలి దేశాలు పట్టి పోయారు. మణుగూరు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో  చెదిరిన లుంగీలతో, చాతీమీద తుపాకీగుండు రంధ్రాలతో, వచ్చిన ఫొటోల్లో ముగ్గురు ఆంధ్రాస్టీల్సు కార్మికులున్నారు. ఇద్దరు తప్పించుకు పోయారు.

“సరే. ఇంతకూ ఆ రోజు ఏం జరిగింది?” అడిగాడు బోసు.

” జరగాల్సిందే జరిగింది” నిట్టూర్చాడు శ్రీహరి.

సాయంత్రానికల్లా జీపులూ, కార్లూ తిరుగు మార్గం పట్టాయి. సెక్యూరిటీ వాళ్ళు టార్చ్‌లైట్లు వెలిగించి ప్లాంటు మొత్తం ఒకసారి తనిఖీ చేసి మళ్ళీ తాళాలు బిగించారు. మళ్ళీ ఆంధ్రాస్టీల్సు చీకటిలో మునిగి పోయింది.

అక్కడ స్వతంత్రాలో తెల్లవార్లూ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. కాలిక్యులేటర్లూ, డ్రాయింగులూ దగ్గర పెట్టుకొని టీ , సిగిరెట్టు పొగల మధ్య తెల్లవారు ఝాముకి రిపోర్టు తయారు చేశారు. శ్రీహరీ , రాజారావూ, విద్యాసాగర్‌ ఇంకా అనేకమందికి కళ్ళు  చింతనిప్పుల్లా తయారయ్యాయి.(ముందు జాగ్రత్తగా ఒక టైపిష్టుని దగ్గరే ఉంచుకున్నారు).

“మరి మేం పొద్దున ఏడింటికి ఇళ్ళకిపోయి ఒక కునుకు తీసి లంచ్‌ టైంకి తిరిగొచ్చేసరికి రాజారావుకి ఒక కవరు ఇచ్చారు. అందులో ఇంక మీ సేవలు మాకవసరంలేదనీ, మరి వారంలో డ్యూటీ నుంచి రిలీవ్‌ కావొచ్చనీ ఆర్డరు కాగితం ఉంది”

“అదేమి? రాజారావు ఎఫీషియంటనే కదా మీవాళ్ళు పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది?” బోసు నివ్వెరపోయి అడిగాడు.

శ్రీహరి చిత్రంగా నవ్వాడు.

“ఊ! సమర్ధత అంటే నాకు చచ్చే నవ్వొస్తుంది. అసలు సమర్ధతంతా మా యండీది. ఎప్పటికయినా ఆంధ్రాస్టీల్సుని కొనేసి నడుపుదామనే మా అందర్నీ పిలిచి మరీ తీసుకొంది. కానీ ఆ రోజు ఉదయానికల్లా ఆయన ఆలోచన మారిపోయింది”.

“ఎమీ కొననే లేదా?”

“ఊహూ! కొన్నారు”

“మరి?”

“కొని మూసేశారు”

“అదేంది గురూ లాసు కాదూ?”

“కాదు ముప్పయ్‌కోట్ల లాభం. ఆ రోజు మేం తయారు చేసిన రిపోర్టులో ఆంధ్రాస్టీల్సు మెషీనరీ అంతా  స్క్రాపు రేటుకే కోట్‌ చేసాం”

“ఆ మాత్రానికే?”

“ఊహూ! అసలు మతలబు కంపెనీ భూముల విషయంలో జరిగింది. రెండొందల ఎకరాల భూమి 1970 నాటి రేటుకే పళ్ళెంలో పెట్టిమరీ …తాంబూలాలతో సహా…అందించింది ప్రభుత్వం.

“అదేంటి గురూ! ఇంత ఘాతుకమా? పత్రికలూ ప్రతిపక్షాలూ ఊరుకుంటాయీ?”

“ఏం చేస్తారని నీ ఊహ? సనత్‌నగర్‌ నడిబొడ్డున చదరపు గజం ఐదువేలు చేసే ఆల్విన్‌ అస్థుల్ని వందరూపాయల చొప్పున అమ్ముకోలేదూ?”

“మై గుడ్‌నెస్‌”

“ఊ! ఇంక మన సాఫ్ట్‌వేర్‌ భాష మాట్లాడకు. హబ్సిగూడ వచ్చేశాం” అన్నాడు శ్రీహరి. ఆటో ఎన్జీఆరై మొదటిగేటు దగ్గర మలుపు తిరిగి పది నిముషాలు ప్రయాణించి ఆ కాంపౌండ్‌లోకి ప్రవేశించింది.

” ఆ పైనుండేదే” శ్రీహరి దిగి ఆటో అతనికి డబ్బులిస్తున్నాడు. బోసు తలెత్తి పైపోర్షన్‌ని చూశాడు.

“ఇక్కడుంటున్నాడని ఎవరు చెప్పారు గురూ?”

“సత్తెన్నారాయణ . మొన్న జూబ్లీహిల్సులో గృహప్రవేశానికి పిలిచాడు”

ఇద్దరూ నిశ్శబ్దంగా మెట్లెక్కుతుండగా కిందనించి కూరలమ్మి కేక.

బోసు గుస గుసగా అన్నాడు “ఏంది గురూ! గచ్చంతా మొత్తం దుమ్ముకొట్టుకొనుంది. ముగ్గుపెట్టి కొన్ని నెలలయినట్టుంది?”

“నీకింకా చెప్పలేదు కదూ! ఆయన భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళి రెండేళ్ళు దాటింది. ఈ మధ్యనే మ్యూచువల్‌ కన్సెంటుమీద విడాకులకి అప్లయి చేశారు”.

“ఎందుగ్గురూ?”

“ఎందుకంటే ఏమని చెప్తాం? ఈ మనిషికి పని తప్ప మరోటి తెలీదు. పదిహేనేళ్ళ కాలాన్ని ఆంధ్రాస్టీల్సుకీ, స్వతంత్రాకీ ధార బోశాడు”

కొంచెం ఆగి తలుపు కొడుతూ మళ్ళీ అన్నాడు “చివరకు తన యవ్వనాన్ని కూడా”.

కాసేపటికి తేరుకున్న బోసు మామూలుగా అవ్వటానికి ప్రయత్నిస్తూ ఒక అసంబద్ధమయిన నవ్వు నవ్వి అనుమానంగా అడిగాడు.

“లోపల ఉన్నాడంటావా?”

“చూద్దాం”

*               *               *

మెల్లగా అతను కదిలే ప్రయత్నం చేశాడు. తలుపుమీద ఆగకుండా చప్పుడు.

ప్రయత్నం మీద లేచి నుంచోవటంతో కళ్ళు చీకట్లు కమ్మాయి. సోఫాని ఆసరాగా చేసుకొని నిలబడ్డాక …పేంటు జారి పోయింది.

వణుకుతున్న చేతులతో బెల్టు వెతికిపట్టుకొని …బిగించి కట్టబోయి విఫలమై…తలుపు మోత ఎక్కువవటంతో …అలాగే అడ్డదిడ్డంగా నడిచి వెళ్ళి గడీ తీశాడు. ఒక్కసారిగా పడిన వెలుతురును భరించలేనట్టు చేతులతో మొహం కప్పేసుకున్నాడు.

కాసేపటికి కళ్ళు తెరిచాక…వేళ్ళ సందుల్లోంచి …ఎదురుగా చేష్టలు దక్కి తననే చూస్తున్న శ్రీహరి.

జారిపోయి ఉన్న ఫ్యాంటునూ , మోకాళ్ళదాకా వేలాడే షర్టునూ కాదు శ్రీహరి చూస్తున్నది. రాజారావు కాళ్ళు… పుల్లల్లా అయిపోయాయి. మెడ మీద బొమికలు వెళ్ళుకొచ్చాయి. పొడుచుకొచ్చిన కళ్ళ కింద నల్లటి ముడతలు.

“ఇదేంటి సార్‌?” శ్రీహరి గజగజ వణికిపోతూ రాజారావును కావలించుకో బోయాడు.

అతను తొట్రుబాటుతో శ్రీహరి చేతుల్ని విడిపించుకొని వెనక్కి వెళ్ళి సోఫాలో కూల బడ్డాడు.

గదంతా ముక్క వాసన . నిశ్శబ్దం . చీకటి.

బోసు ఆ చీకటిని భరించలేనట్టు గోడ దగ్గరకు నడిచి చేతికందిన మీటలు నొక్కాడు. ట్యూబులైటు వెలిగి ఫ్యాను గిర్రున తిరగటం మొదలు పెట్టింది. టివీ ఆన్‌ అయింది.

శ్రీహరి గొంతు పెగుల్చుకొని “ఇప్పుడేమయిందని సార్‌. ఎవరి పరిస్థితి బాగుందని? స్వతంత్రాని వదిలేశాక నాకు మాదాపూర్‌లో జాబొచ్చింది.  రెండేళ్ళు బానే గడిచాక  ఇవాళ పొద్దున్న మా కంపెనీ బోర్డు మారిపోయింది. రాత్రే శామ్‌స్‌ ఇంక్‌ వాళ్ళు మా సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఓవర్‌టేక్‌ చేసారు. ఇక్కడి కంటే చైనాలో బెటరని హైదరాబాద్‌ కంపెనీని మూసేశారు. గేటు దగ్గరే మా వస్తువులు కలెక్టు చేసుకొని తిన్నగా ఆటోలో ఇటొచ్చాం”  అన్నాడు

టివీ తెరమీద ప్రత్యక్షమయిన న్యూస్‌రీడర్‌ రాత్రి ఏడుగంటల వార్తలను హడావిడిగా చడవటం మొదలు పెట్టింది.

“ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటు పరం చేస్తూ …ఆర్ధిక మంత్రి…లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా …జాతికి హామీ ఇచ్చారు… ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ  బీ.యస్‌.ఈ ఇండెక్స్‌ రికార్డు స్థాయిలో నూట ఇరవై పాయింట్లు… అయితే మాజీ ప్రధాని దీన్ని ఖండిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకొనే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని… తన సంస్కరణల్ని దారి మళ్ళించారనీ…”

బోసు హఠాత్తుగా రాజారావు వైపు తిరిగి అన్నాడు.

“సార్‌! ఇప్పుడు మనమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం”

అదేమీ పట్టని రాజారావు ఎటో చూస్తున్నాడు.

ఎదురుగా చీకటి. తాటిచెట్టంత ద్వారం. పావురాల శబ్దం. మాగువాసన. పాడుబడిన రెష్ట్‌రూం. ధూళి మేఘం. చెల్లాచెదురయిన కుర్చీలు. జాజి చెక్క బల్ల. కింద కొండచిలువ. పైన గోధుమ రంగు దిన పత్రిక. మూలగా ఆ ప్రకటన. ఆ గదిలోనే కూచొని రోజులు , నెలలు, ఏళ్ళ  తరబడి తన ప్రాంతం గురించీ, తన జాతి గురించీ విస్మయమయిన గొంతుతో అవిరామంగా మాట్లాడుతున్న సనా.