Comment navigation


15790

« 1 ... 1305 1306 1307 1308 1309 ... 1579 »

  1. సువర్ణభూమిలో … గురించి ఆరి సీతారామయ్య గారి అభిప్రాయం:

    12/02/2008 3:11 pm

    సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు.

    ఈ కవితలో మూడు దృశ్యాలున్నాయి. మొదటిది ఒక కొండమీది (ఒక భక్తుడు ఎన్నో మెట్లెక్కి వచ్చాడు కదా) బౌద్ధ దేవాలయం. బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్న విద్యార్ధులు ఎదురెదురుగా కుర్చోనున్నారు. దేవాలయం లోపలికి వెళ్ళేముందు భక్తులు కాళ్ళుకడుక్కోవటానికి ఒక పెద్ద నీళ్ళతొట్టె ఉంది. అందులో కలువలున్నాయి. ఒక కలువ మీద తేనెటీగ వాలి ఉంది. అగరొత్తుల పొగ దేవాలయం అంతా వ్యాపించి ఉంది. ఎర్ర చారల పిల్లి ఒకటి ఉంది ఆ దృశ్యంలో. కవి చూస్తుండగానే కొండ పైదాకా వచ్చిన భక్తుడొకడు పైకప్పుకు అంటుకొనిఉన్న గబ్బిలాలను అదలించాడు. మన కవి, అతని భార్య (మేము అన్నాడు కదా? అరుంధతి గారికి కవితను అంకితం ఇచ్చాడు) బంగారు బుద్ధుడికి కలువలు సమర్పించారు.

    రెండో దృశ్యం పర్యాటకులు చూసే ఒక శిధిలమైన దేవాలయం. ఒక పర్యాటక బృందానికి మన కవికి తెలియని ఏదోభాషలో గుడి గురించి చెప్తున్నాడు గైడ్. దేశం మీద జరిగిన దాడుల్లో దేవాలయంలోకూడా విధ్వంసం జరిగింది. విగ్రహాల తలలు తెగిపోయాయి. దేవాలయపు గోడలమీద ఇప్పుడు పెద్దపెద్ద చెట్లున్నాయి. వాటి వేళ్ళలో ఒక బుద్ధ విగ్రహానికి చెందిన తల ఇరుక్కుపోయి ఉంది. మొండెం మాత్రం ఇంకా ధ్యానం చేస్తున్నట్లే ఉంది. మామూలు కవికీ మంచి కవికి తేడా – ఆ పర్యాటకుల బృందంలో ఒకావిడ అక్కడకొచ్చిన కుక్క పిల్లని ఒడిలోకి తీసుకున్నది అని చెప్పటం. చరిత్రలోనుంచి మనల్ను బయటకు తీసుకొచ్చాడు కవి.

    మూడో దృశ్యం సముద్రపు నీళ్ళలోతుల్లో జంతుజాలాన్ని చూడటానికి వెళ్ళే పర్యాటకులు. కొంచెం అటూ ఇటూ అయితే ప్రమాదం. బాగా ఈత వచ్చిన వాళ్ళు పర్యాటకులను రక్షించాల్సి వస్తుంది.

    ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్‌ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Krishna గారి అభిప్రాయం:

    12/02/2008 1:21 am

    సంగీత ప్రతిభలో ఇళయరాజానో, ఏ ఆర్ రెహ్మానో లాగానే త్యాగరాజుకూడాననీ, ఎటొచ్చీ భక్తిలోనే ఆయన చాలా గొప్పవాడని నాకున్న ఓ అభిప్రాయం. అంటే ఈలాంటి వ్యక్తుల జీవితాలు, రచనలు, సంగీతం (మిగిలిన భారతీయ కళారూపాల మాదిరిగానే) ఆధ్యాత్మికమైనవి. కాబట్టి ఈ పోలిక సరియైనదిగా అనిపించకపోవచ్చు. కానీ, సంగీత పరంగా పలురకాలు సంగీతాలు అని పిలువబడ్డా, కొన్ని వ్యాపారాత్మక సంగీతాలు కూడా ఆత్మానందం కలిగిస్తాయంటే ఎవరూ కాదనలేరుగా! అందుకని ఒక్క సంగీత పరంగానే కాకుండా, ఆయన్ని నేను ఒక ఆధ్యాత్మక మార్గదర్శిగా చూసుకుంటాను. ప్రాపంచిక విషయాలలో ఉంటూనే ఆధ్యాత్మికంగా/ భక్తిపరంగా ఎదగడం ఎలా అని చూసుకుంటూ, పోతనలోనూ, త్యాగరాజులోనూ ఒక సామీప్యం కనుగొన్నాను : ఇద్దరూ రాజాస్థానాన్ని కాదనటం. పోతనగారు ఒకే దెబ్బలో వద్దనేశారు. త్యాగరాజుగారు తనదైన శైలిలో “నిధిచాల సుఖమా, రాముని సన్నిధి సుఖమా” అని ప్రతి మనిషిలో వచ్చే ఓ అంతర్మథనాన్ని ఆవిష్కరించి, మరీ కాదన్నారు.అలా (గాంధీగారిలా) మహాత్ములు కూడా మెల్లిగానే తయారవ్వొచ్చునని నాకు మరో దృష్టాంతం ఇచ్చారు. మానవ ప్రయత్నానికి, ప్రతిభకి త్యాగరాజు పెద్దపీట వేశారనీ, భాగవతుల కథల్లోలా నారదుడు ఠపీమని సంగీత జ్ఞానాన్ని ప్రసాదించేయలేదని కొందరు వాదిస్తే నిజమేననిపిస్తుంది.ఎందుకంటే చాలా కృతుల్లో ఆయన మనసుకు కబుర్లు చెబ్తారు. అందుకే అవి ప్రతి వ్యక్తి తన మనసుకి చెప్పుకోవటానికి ఉపకరిస్తాయి.( మనవి ఆలకించరాదటే, మర్మమెల్ల దెల్పెద ఓ మనసా.)

    మీరు చెప్పిన చరిత్రతో నాకున్న రెండు సంశయాలు మళ్ళీ నిద్ర లేచాయి.
    1. రాజాస్థానాన్ని రెండుసార్లు కాదనటం – భక్తి అంటారా! లేక వేరేవాళ్ళకు తొత్తులయిన ఇలాంటి రాజుల దగ్గర ఇమడలేని attitude probleమా!> ఎందుకంటే నా అధికారుల అడుగులకు మడుగొలొత్త లేనితనం నా ప్రాబ్లం. నా భక్తి కాదు. (సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి వద్దంటే అదేమీ త్యాగం కాదు. రాజకీయం అంతే. గాంధీగారిది ఏంటి అంటే -> ఇదిగో భాగవతుల కథ అయితే ఆయన చనిపోయేటప్పుడు “హే రామ” అన్నాడుకాబట్టి మహాత్ముడే! ; నచ్చని వాళ్ళకి అదీ రాజకీయమే!)
    2. అన్నమయ్య కూడా పాట చివర వెంకటశ్వరుడినే తలుస్తాడు.అదే ఆయన ముద్ర. సంగీతంలో దాన్నేదో అంటారు.పేరు గుర్తులేదు. మరి ఇంత త్యాగరాజు మాత్రం తన పేరు నిలబడేలా ప్రతి కృతి చివర పెట్టేశాడు? ఇది self effacing character ఎలా అవుతుంది!?

    ఎందుకడుగుతున్నానంటే త్యాగరాజు ఇంకా నా ఆధ్యాత్మిక మార్గదర్శి అనుకుంటున్నాను కాబట్టే!

  3. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/01/2008 11:05 pm

    స్వచ్ఛమైన గాఢమైన అస్పష్టత 🙂

    కామేశ్వరరావు గారికి,

    నన్ను కరెక్ట్ చేసినందుకు థాంక్స్. నాకు పాత సాహిత్యంతో పరిచయం నామమాత్రంగా కూడా లేదు. నేను పాపినేని ని paraphrase చేశానంతే. ఆయన మాటల్లో:

    “భావ కవిత్వానికి ముందు తెలుగు కవిత్వంలో అస్పష్టత (ambuguity), దానిని గూర్చిన భావన కన్పించవు. వెనకటి ఏ ప్రసిద్ధకవి పద్యమైనా భాషాకాఠిన్యం వల్ల, అన్వయక్లేశం వల్ల అర్థంకాక పోవటమంటూ వుందిగానీ అస్పష్టం కావటమంటూ లేదు. ప్రాచీన కావ్యాల్లో కవి ఉద్దేశ్యాన్ని ప్రతి పద్యంలోనూ సుళువుగానే గ్రహించవచ్చు. కవి ఉద్దేశ్యం తెలియకపోవటం అనే ఇబ్బంది ఆధునిక కవిత్వంలోనే ఎదురవుతోంది. ఈ ఇబ్బందిని గూర్చి ముచ్చటించుకోవాలంటే ముందుగా అస్పష్టత అనే భావనను నిర్వచించుకోవాలి.”

    అస్పష్టతకి ఉదాహరణగా పాపినేని ఇచ్చిన ఒక కవిత – “పోలికలు”:

    “అద్దాలమేడ – అందాల భామ
    బృహదారణ్య కోపనిషత్తులో
    సీలియాని కుట్టి చంపేసిన కిం గం జా ఐలండ్ చీమలు
    వేదాల పనసలు – ఉల్లిపాయ పొరలు.
    నిలువుటద్దాల్ని నిట్టూర్పులతో కొలువ్
    షాపెనోవర్ పడుకున్నచోట
    పడిపోయిందొక క్షురకర్మ అద్దం.
    పగిలిన అద్దంలో అతనొక
    అనంత శయన ఐక్యతా శతమూర్తి.
    సంసారి కొలిమిలో సన్యాసి ఊపిరి ఊదు
    దీపాల కొలువులో పాపాల చీకటి చిమ్ము
    నిలువుటద్దాలపై పడకటద్దాలు పడితే
    కళ్ళు విరిగి కాళ్ళు పగుల్తాయ్.
    వాలుటద్దాలపై కార్నర్ అద్దాలు రగిలితే
    స్ప్లింటర్స్ లో సిన్నర్స్ మిగుల్తారు.
    అద్దాల మేడలో గాజుసూదుల కంపలో
    గాయపడ్డ వాళ్ళని చూచి డాక్టరే కట్టుకుంటాడు.”

    ఎలియట్, డెరీడా, షెల్లీ లకి అధోదీపికలున్నాయి! ఎవరు రాసిందో చెప్పనవసరం లేదు కదా. పాత కవిత్వంలో కూడా ఇంతటి అస్పష్టత కలవి ఉన్నాయంటారా? పాతా కొత్తా, రెండూ ఎరిగిన మీరే చెప్పాలి.

    నాకిది అర్థమయితే ఒట్టు. అందంగా ఉందని మాత్రం ఒప్పుకోవాలేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  4. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    12/01/2008 10:41 am

    మొదటిది: …
    రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో […] అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.

    హమ్మయ్య!ఇన్నాళ్ళకు, KHR గారు రాసిన ప్రతి వాక్యంతోను ఏకీభవిస్తున్నాను :-).చాలా కాలంగా నేనుమొర పెట్టుకుందామనుకుంటున్న విషయాన్ని చాలా క్లుప్తంగా, బలంగా చెప్పారు!

    — శ్రీనివాస్

  5. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    12/01/2008 5:51 am

    “భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు.”
    అని హనుమగారన్నది సరి కాదు. భావకవిత్వం ముందర వాక్యగతమైన (వ్యాకరణ ధిక్కారంతో వచ్చే) అస్పష్టత చాలా వరకూ లేదు. కాని భావగతమైన అస్పష్టత ఉంది. వాక్యగతమైన అస్పష్టత కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అంతకన్నా పై మెట్టు మరొకటి ఉంది! అది కవిత్వంలో పొరలు (layers). అంటే పైకి స్పష్టంగా ఒక అర్థాన్నిస్తూనే అంతర్గతంగా మరొక (మరికొన్ని) అర్థాన్ని స్ఫురింపజెయ్యడం. ఇక్కడనేనంటున్నది శ్లేష గురించి కాదు.

    “కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.” అని వినీల్ గారన్నారు.

    But I cannot! ఒక పాఠకుడికి, తనకి అర్థం కాని కవిత్వాన్ని అర్థం కాలేదని చెప్పడానికి అధికారం ఉంది కానీ, దాన్నసలు కవిత్వమే కాదనడానికీ, విమర్శించడానికీ హక్కు లేదని నా ఉద్దేశం. ఆ కవిత్వం వేరెవరికైనా అర్థం కావచ్చు, వాళ్ళా కవిత్వాన్ని అనుభవించవచ్చు. ఏదైనా కవిత్వం ఎవరికీ అర్థం కాకుండా పోతే, దానికి ఆదరణ లేక అది సహజమరణం పొందుతుంది. దాని గురించి విమర్శించడం అనవసరం.

    ఈ వ్యాసంలో వేలూరివారు ప్రస్తావించిన కవిత్వానికి కొలమానాలు కాని, టెక్నిక్కు కానీ మొత్తం కవిత్వానికంతకీ వర్తించేవి తయారుచెయ్యడం అసాధ్యం, అనర్థం కూడా. ఒకో “రకమైన” కవిత్వానికీ (కొన్ని ప్రత్యేక కొలమానాలతో) ఒకో టెక్నిక్కు సృష్టించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ఒక రకమైన కవిత్వానికి సంబంధించిన టెక్నిక్కుని మరొక రకమైన కవిత్వమ్మీద ప్రయోగించడం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం వెయ్యడమవుతుంది!

  6. అసంపూర్ణ చిత్రం గురించి nagaraju raveender గారి అభిప్రాయం:

    12/01/2008 3:15 am

    ఈ కవిత ఒక నిశబ్దపు అనుభూతిని మిగిల్చింది.

  7. చంద్రుణ్ణి చూపించే వేలు గురించి nagaraju raveender గారి అభిప్రాయం:

    12/01/2008 2:47 am

    హైకు కవితాత్మను ఆవిష్కరింప జేస్తే , ఈ వ్యాసం హైకూను సాక్షాత్కరింప జేసింది.

  8. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/30/2008 11:16 pm

    To Give Credit Where It Is Due

    సంపాదకులకి: ఈ అభిప్రాయాన్ని “గ్రంథచౌర్యం గురించి,” అన్న మే 2008 సంపాదకీయం కింద వెయ్యవచ్చు కాని, ఇక్కడే ఉంచమని మనవి.

    గట్టు వినీల్ నా కొటేషన్స్ ని ప్రస్తావించి సమర్థించినందుకు థాంక్స్. ఆ సందర్భంలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిది అల్పమైనది, రెండోది ముఖ్యమైనది.

    మొదటిది: కొటేషన్స్ ఇవ్వడం నా బలహీనత. సృజనా లోపమని భావిస్తాను. సాహిత్యం నా వృత్తీ, ప్రవృత్తీ కానందుకు బతికిపోయాననుకుంటాను. 🙂 పదే పదే నేను కోట్ చెయ్యడం విమర్శించదగ్గ విషయమే.

    రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో ఇతరులని భయపెట్టడానికో కాదు. భావమో, వ్యక్తీకరణో మనది కానపుడు, ఎవరిదో సూచించడం నైతిక బాధ్యత. సైన్సు రంగంలో ఉండటానో, పాశ్చాత్య ప్రభావమో నాకిది దాదాపుగా అలవాటు. అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.

    ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినపుడు, మూలం మనది కాకపోతే విధిగా కారకులని గుర్తించాలి. మొన్ననే ఇస్మాయిల్ పుస్తకాన్ని ప్రస్తావించాను. దాంట్లోనే “ఇద్దరు భాష్యకారులు,” [1] అన్న 1980లో రాసిన వ్యాసం ఉంది. చలం “మ్యూజింగ్స్” ప్రస్తావనతో మొదలయిన వ్యాసంలో రెండో పేరా చూడండి:

    “అప్పుడప్పుడూ రంగులు లేతగానో, ముదరగానో మారుస్తుండటమూ, లేదా ఎడమొహం పెడమొహం వేసి రెంటిగా చీలిపోవటమూ మార్క్సిస్టు ఉద్యమాలన్నిటికీ సామాన్య లక్షణమనుకుంటాను. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం.”

    వెంటనే పక్కా ఇస్మాయిల్ అనిపిస్తుంది కదూ. 🙂 మార్క్సిస్టు విమర్శకుల్లో రెండు రకాలు – ఛాందసులు, అఛాందసులు – అని వాళ్ళలో తేడాలని వివరించే వ్యాసం. నాకు చాలా నచ్చింది. కాని అఛాందసుల మీద మామూలుగా ఇస్మాయిల్ మార్క్సిస్టుల మీద వేసేటన్ని వాతలు పడనందుకు ఆశ్చర్య మేసింది. తెలుగు వాళ్ళు కానందువల్లనేమో నని సమాధానపడ్డాను. వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుందాం అని వెతికితే ఓ George Steiner పుస్తకం [2] కనబడింది.

    నేనీ Steiner వేమీ చదవలేదు. ఆదివారం కదా అని లైబ్రరీకెళ్ళి తెచ్చుకొని తిరగేశాను. దాంట్లోని “Marxism and the Literary Critic,” అన్న వ్యాసం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇస్మాయిల్ వ్యాసం దీనికి సంక్షిప్తానువాదం! మంచి అనువాదం, సందేహం లేదు. కాని మూలంలో లేనిది ఒక్క అక్షరం కూడా లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇస్మాయిల్, “ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం,” అన్న దాంట్లో ఆవగింజంతయినా ఔచిత్యం ఉందా? తను సొంతంగా ఏం ఆరా తీశారు?

    ఇస్మాయిల్ ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు. సాహిత్యం, తత్వశాస్త్రాల్లో విద్యాధికుడు. సొంతంగా ఇలాంటి వ్యాసం రాసే సత్తువ ఆయనకుంది, నాకెలాంటి సందేహం లేదు. కాని ఈ వ్యాసం మూలం మాత్రం ఇస్మాయిల్ ది కాదు. Steiner పేరు ప్రస్తావించకపోవడం పెద్ద నేరం.

    ఆ రీతిలో కాకపోయినా, ఇక్కడే ప్రస్తావించిన మో “నిరాకారుడు” కవితని చూద్దాం. మొదలొకటే అయినంత మాత్రాన “The Listeners,” తో పోల్చకూడదన్నాడు మో. అది ఒక పేజీ, ఇది ఆరు పేజీలు, అనువాదం కాదు. కాని కవితలోని వాతావరణం అదే, అనుమానం లేదు. మో ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదివిన వాడు. స్పూర్తి దానినుండే వచ్చి ఉండాలి. పేరు చెప్తే సొమ్మేం పోయింది? సాధారణ పాఠకులకి ఆ కవిత చేరేదేమో కూడాను.

    చివరగా, మరో విషయం. మూలాలు చెప్తే, పాఠకులు పోయి ఇంకాస్త చదువుకొని లాభించే అవకాశం ఉంది. చెప్పకపోతేనే నష్టం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “కవిత్వంలో నిశ్శబ్దం,” ఇస్మాయిల్. పేజీలు 102-106.
    [2] “George Steiner: A Reader,” Oxford University Press, 1984. పేజీలు 37-53. “Marxism and the Literary Critic,” వ్యాసం మొదట ప్రచురించింది 1958లో.

  9. మూడు జ్ఞాపకాలు గురించి phani గారి అభిప్రాయం:

    11/30/2008 10:17 am

    [సూచన: ఈమాటలో ఒక రచయిత రచన చదివేటప్పుడు ఆ రచయిత పేరు మీద క్లిక్ చేస్తే, ఆ రచయిత ఈమాటలో రాసిన రచనల జాబితా వస్తుంది. లేదా, ప్రతిపేజీలో ఎడమవైపు పైన ఉన్న లింకులలో “ఈమాట రచయితలు” మీద క్లిక్ చేస్తే ఇప్పటిదాకా ఈమాటలో రాసిన రచయితల జాబితా వస్తుంది. – సం.]

    సంఘటనలు చెప్పిన తీరు అద్భుతం. చదువుతున్నట్టు కాక సంఘటన జరుగుతున్న ప్రదేశంలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ముందు వ్రాసిన కథలు చదవడమెలా?

  10. కుతంత్రం గురించి phani గారి అభిప్రాయం:

    11/30/2008 9:03 am

    కథ ఆసాంతం చదివిన తరువాత బాగుందనిపించింది. అయితే, చిక్కల్లా చివరి దాకా చదివించ లేక పొవడమే. కథ సగం దాక చదవడానికి ఇబ్బందిగా వుంది.

« 1 ... 1305 1306 1307 1308 1309 ... 1579 »