Comment navigation


15820

« 1 ... 1165 1166 1167 1168 1169 ... 1582 »

  1. రాగలహరి: హిందోళం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    04/21/2010 3:40 pm

    మేళకర్త పేరు నఠభైరవి. దాన్ని తమిళుల పద్ధతిలో నటభైరవి అనో, నడభైరవి అనో అంటే కటపయాది సూత్రం పనిచెయ్యదు.

  2. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి శ్రీహర్ష గారి అభిప్రాయం:

    04/21/2010 2:46 pm

    చక్కటి వ్యాసం. మొదలుపెట్టాక చివరకంటూ అలా చదువుతూనే వున్నాను. శైలి, విషయం రెండూ బావున్నాయి.

    మొబైల్ ఫోనులు రాని క్రితం నాకు బాగా గుర్తుండే ఫోను సంగతి – STD కి రోజులో ఒక్కో సమయంలో ఒక్కో రేటు వుండడం – సగం రేటు, పావు రేటు ఇలా. సరిగ్గా గుర్తులేదు కాని, పొద్దున్న ఐదున్నర లేక ఆరు ముందర పావు రేటు వుండేదనుకుంటా. మా అమ్మ వాళ్ల అక్కచెళ్లల్లందరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండగ శుభాకాంక్షలు వగైరా వగైరా… ఆ పావు రేటు వున్న సమయంలోనే చెప్పేసుకునేవారు. పొద్దున్నే ఆ ఫోనులో గట్టి గట్టిగా చెప్పుకునే పండగ పలకరింపులూ, కుశల ప్రశ్నలతోటే మాకు శుభోదయమయ్యేది, పైగా ఎవరయినా ఫుల్ రేటు లో ఫోన్చేసి మాట్లాడుకుంటుంటే, “వీళ్ళు ఎంత దుబారా చేస్తారు? ఎంచక్కా పొద్దున్నే పావు రేటులో మాట్లాడుకోవచ్చు కదా” అని అనేవారు.

  3. సా విరహే తవ దీనా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    04/21/2010 2:17 pm

    బ్రహ్మానందంగారూ,

    ఈ చర్చలో అందరూ ఉదహరిస్తున్న పాటల్లో చాలామటుకు నాకు తెలియవు కనక రాగాల పేర్లు చెప్పలేను. ఎటొచ్చీ ఏ మాత్రమూ పోలిక లేని రాగాల విషయంలో కనబడుతున్న వ్యాఖ్యలను చదివాక నేను వాటి సంగతి వదిలెయ్యమన్నాను. ఈమాట పాఠకులకు సాహిత్యం మీదున్న అభిమానం, ప్రవేశం సంగీతంలో కనబడటంలేదు కనకనే నేనలా చెప్పాను.

    ఓపిక ఉన్నప్పుడు ఈమాటలో ఒక సంగీతపు విభాగాన్ని మొదలుపెట్టవచ్చునేమో ఆలోచించాలి. నిజమైన సంగీతాభిమానులెవరూ సాహిత్యపత్రికల జోలికి రాకపోవడం కూడా బాధాకరమే. రాగాలనూ, స్వరాలనూ గుర్తించే పద్ధతుల గురించి నేను గత వ్యాసాల్లో కొంత ప్రస్తావించాను కాని మనవాళ్ళకు సాహిత్యం లేని సంగీతం ఒకంతట అర్థం అవుతున్నట్టుగా అనిపించలేదు. పాట గురించి రాయగానే సాహిత్యం గురించిన చర్చ మొదలవుతుంది.

    పబ్లిక్‌గా కాకపోయినా వ్యక్తిగతంగా నాకు ఎవరైనా సందేహాలు పంపితే నాకు తెలిసినంతవరకూ వాటికి సమాధానాలివ్వగలను.

  4. సా విరహే తవ దీనా గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    04/21/2010 1:59 pm

    రోహిణీ ప్రసాద్ గారూ,

    ఈ వ్యాసం సంగీతానికీ, సాహిత్యానికీ సంబంధిచినది కాబట్టి వ్యాఖ్యలు వచ్చాయి. తప్పులేమయినా వుంటే చెప్పండి. సరిదిద్దుకుంటాము. మీ వంటి పెద్దలూ, సంగీత విద్వాంసులూ కొత్త విషయాలూ, దొర్లిన తప్పులూ చెబితే నేర్చుకోడానికి నేను సిద్ధమే! ఎటువంటి అభ్యంతరమూ లేదు. నాకు సంగీతంలో లోతైన అనుభవమూ, పరిజ్ఞానమూ లేదు. కాబట్టి తప్పులు వచ్చే అవకాశముంది.
    మీరు అవి చెప్పకుండా కేవలం సంగీత చర్చ చేయకూడదనడం భావ్యం కాదు. మీ వ్యాఖ్య అభ్యంతరకరంగానూ, బాధాకరంగానూ వుంది. క్షమించండి.

  5. తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/21/2010 1:39 pm

    అభిప్రాయాల్లో సైతం ఆట వెలదులని భరించే ఓపిక తెలుగు వారి స్వంతం.

  6. తెలగాణెము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    04/21/2010 12:58 pm

    “కవులు తమకు వెన్నెముక ఉందని వానపాములకూ తమకు భేదం ఉందని నిరూపించుకునే తరుణం ఆసన్నమయింది.”
    పద్యాలొదిలేసి, పదకొండు లైన్ల సత్యనారాయణగారి అభిప్రాయానికి యాభైలైన్లకు మించిన భూషణ్‌ గారి స్పందన ఆశ్చర్యం విస్మయం కలిగించింది.

    అసలు కవులంటే నాకు భయం. కవులు కూడా నిరూపించుకోవడం మొదలుపెడితే ఇంకా భయం.కవి వర్ణనలంటేనే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఉపమానాలు,అతిశయోక్తులు,అలంకారాలు వగైరా. ఇక వాటితో కవులు నిరూపణలు సైతం మొదలుపెడితే కవితాసౌందర్యం మాటేమో కాని, వాస్తవాలు నిజాలు హుష్ కాకి అని చచ్చేంత భయం. అయినా కవులను ఆదరిస్తున్నారంటే తెలుగువాళ్ళు ఎంత మంచివారో లేక ఎంతటి అమాయకులో!
    ======
    విధేయుడు
    _Srinivas

  7. సా విరహే తవ దీనా గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    04/21/2010 10:58 am

    రమగారు,

    మోహనగారు ఇచ్చిన అర్థాలకి మరికొన్ని జత చేర్చే ఉద్దేశం తప్ప ఎవరికి ఎన్ని నిఘంటువులు తెలుసన్న పోటీ కోసం కాదు. నాకన్నా మీకు ఎక్కువ నిఘంటువులు తెలుసన్న విషయంలో నాకెటువంటి సందేహం లేదు. నా పై అభిప్రాయంలో ప్రత్యేకించి మిమ్మల్ని సంబోధించనూ లేదు.

    కారాశం

  8. తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    04/21/2010 10:26 am

    “కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. “

    మీకు గాని కర్ణ పిశాచి గాని ఉందా ?? తెలంగాణా ప్రజానీకం మనసులో ఏముందో తెలుసుకోవడానికి ?? .తెలంగాణా ప్రజల మనోభీష్టం గురించి మీకు ఎంత తెలుసో /తెలియదో ఇతరులకు కూడా అంతే తెలుసు /తెలియదు అని తెలుసుకోవడమే అసలు సిసలు ప్రజాస్వామికం.ప్రజలు పట్టం గడితే గానీ ప్రభువులు కాలేరు ,అదే ప్రజాస్వామ్యం.మనది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం.ఒకప్పటి రష్యా ,ఇప్పటి చైనాలా ఏకశిలా పార్టీ (ప్రజా స్వామ్య?) వ్యవస్థలో ఇటువంటి అవకాశం లేదు. కావున, ఎటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు తిరునగరి సత్యనారాయణ గారు ?? స్వేచ్చకు తావులేని ఏక పార్టీ ఏకాభిప్రాయం గల అప్రజాస్వామిక వ్యవస్థా ?? బహుళ పార్టీ బహుళాభిప్రాయాలు గల ప్రజాస్వామిక వ్యవస్థా ?? నాకు చూడగా తిరునగరి సత్యనారాయణ గారు మొదటి దారినెంచుకొన్నట్లే కనిపిస్తుంది. అది ప్రమాదకరమని వేరే చెప్పాలా ?? భారత రాజ్యాంగం ఒకసారి కూడా తెరిచి చూడని వారు ప్రజాస్వామ్యం అన్న పదాన్ని తోచిన రీతిలో వాడటం వారి రాజకీయ అపరిపక్వతనే సూచిస్తుంది.

    “ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా?”

    కవి గణాంక శాస్త్ర వేత్త కాలేడు; కావున ఎన్ని పల్లెల్లో ఎందరు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో గణించి పట్టీలు కట్టడానికి.పోనీ సత్యనారాయణ గారు ఆ పని చేశారా అంటే అదీ లేదు.అయినా సరే , “పల్లె పల్లెనా మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవే” అని ప్రకటిస్తున్నారు. నా ప్రశ్న అసలు మీకు ఆ అభిప్రాయం ఎలా కలిగింది ?? ఏ ధైర్యంతో అలా ప్రకటిస్తున్నారు ?? ఆ అభిప్రాయం ఏర్పరచుకోవడానికి మీరు అవలంబించిన శాస్త్రీయ పద్ధతులు ఏవి ??

    నేను తెలంగాణా లో ఇటీవల జరిపిన పర్యటనలో దినకూలీలతో భేటీ అయ్యాను. వారు తెలంగాణా భావననే తిరస్కరిస్తున్నారు. రాజకీయ నాయకులను వారికి వత్తాసు పలికే మీడియాను అసహ్యించు కొంటున్నారు. అంత మాత్రం చేత తెలంగాణాలో అందరూ తెలంగాణాను వ్యతిరేకిస్తున్నారు అని నేను అన వచ్చునా ?? నా శాంపిల్ స్పేస్ సరిపోదు, ఆ నిర్ణయానికి రావడానికి. ప్రజల అభీష్టం తెలిసేది ఎన్నికల ద్వారా ; అంతవరకూ ,కర్ణ పిశాచి ఉన్నా సరే, ప్రజాభీష్టం తెలిసినట్టు ఫోజు పెడితే అబోరు దక్కదు. కాబట్టి , ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా / అనుకూలంగా కవిత్వం చెప్పారా అన్న ప్రశ్నే ఉదయించదు.

    “పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.”

    వచన కవిత్వం రాయడం తెలంగాణా ఉద్యమ స్ఫూర్తిలో భాగం అని చాలా విలువైన మాటను తెలిపారు. దేశికాచారి గారు ఆదినుండి పద్యకవి ; ఆయనకు పద్యరూపంలో రాయడంలోనే నేర్పు గలదు. ఇవాళ కొత్తగా ఆయన పద్యాన్ని చేపట్టి ఉంటే మీ సిద్ధాంతానికి బలం చేకూరేది. మరి , ఆయనను ఖండిస్తూ పద్యాలు రాసిన శ్రీనివాసులో ఉద్యమస్ఫూర్తి కొరవడిందా ??

    మీ అభిప్రాయాన్ని వచనంలో ఎందుకు రాశారు; ఏదైనా జానపదుల వరుసలో పాట కట్టి ఉంటే ఉద్యమస్ఫూర్తి వెలిగి పోయేది కదా. ఎవరి మనసుకు తోచినట్టు వారు రాసుకొంటారు. అదే రీతిన విమర్శ ,ప్రశంస వస్తాయి. నీవు వచన కవిత్వం రాసి ఊదర కొడితేనే / పాట రాసి గజ్జె కట్టి ఆడితేనే ఉద్యమ స్ఫూర్తి ఉన్నట్టు. వచన కవిత్వం , పాట వదిలి వచనంలోనో ,పద్యంలోనో రాస్తే ఉద్యమ స్ఫూర్తి లేనట్టు అనడం అసలు సిసలు అర్థంలో అప్రజాస్వామికమే కాదు మిగుల అజ్ఞాన జనితం.

    భావ ప్రకటనా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. దాన్ని దెబ్బ తీసే ఉద్యమాల మీద ,వాటి వెనుక ఉన్న అరాచక శక్తుల పట్ల సానుభూతి చూపడం ప్రమాద కరం. బాధ్యత గల కవిగా దేశికాచారి గారు దారి చూపారు. కవిదాటు ,గొర్రెదాటు ఒకటి కాదు అని నిరూపించడం బాధ్యత గల తెలంగాణా కవులు సాహిత్య వేత్తలు చేయదగిన పని. గుంపులో గోవింద కొట్టే వాడు ఎన్నటికి కవి కాలేడు అని తెలుసు కోవడం మంచిది. కవులు తమకు వెన్నెముక ఉందని వానపాములకూ తమకు భేదం ఉందని నిరూపించుకునే తరుణం ఆసన్నమయింది.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  9. సా విరహే తవ దీనా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    04/21/2010 9:24 am

    మరీ మించిపోయే లోపల రాగాల గురించిన చర్చ మానేసి కామెంట్లను సాహిత్యానికి పరిమితం చేస్తే బావుంటుంది!

  10. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Chandrakaladhar Reddy గారి అభిప్రాయం:

    04/21/2010 8:47 am

    చాలా బాగుంది. అద్భుతముగా నున్నది. కండ్లకు కట్టినట్టు ఉంది. చదివీన తర్వాత చాలా ఆనందించాను.

« 1 ... 1165 1166 1167 1168 1169 ... 1582 »