Comment navigation


15823

« 1 ... 1129 1130 1131 1132 1133 ... 1583 »

  1. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి mOhana గారి అభిప్రాయం:

    07/13/2010 12:01 pm

    అనినన్ గన్నులు జేవుఱింప, నధరం బల్లాడ, వేల్లత్పునః
    పునరుద్యద్భ్రుకుటీ-భుజంగ-యుగళీ-ఫూత్కార-ఘోరానిలం-
    బున నూర్పుల్ నిగుడన్, లలాటఫలకంబందంద ఘర్మాంబువుల్
    చినుకన్, గంతు-దిదృక్షు-రూక్ష-నయన-క్ష్వేళా-కరాళ-ధ్వనిన్
    – అల్లసాని పెద్దన, మనుచరిత్రము, 5.18

    కన్నులు కెంపు రంగయ్యాయి, పెదవులు వణకాయి, ఎగురుచున్న రెప్పలనే పాములు బుసలుకొట్టగా వచ్చే విషవాయువులలా నిట్టూర్పు విడుస్తున్నాడు, నుదుటిపైన అక్కడక్కడ చెమట బిందువులు కనబడుతున్నాయి, మన్మథుడిని వాడియైన దృక్కులతో చూసిన శివుడిలా సింహ భయంకరమైన కంఠముతో మాట్లాడడానికి ప్రారంభించాడు.

    విధేయుడు – మోహన

  2. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    07/13/2010 11:09 am

    సోదాహరణంగా కవితా పంక్తులు ఎత్తి చూపుతూ, పదేళ్ళ కిందటి ఇంకో సంకలనంతో సందర్భానుసారంగా పోల్చుతూ సమీక్షంచడం ఎంతో పరిశీలన, ఓపిక,సహృదయంతోనే సాధ్యం. వేలూరిగారికి కృతజ్ఞతలు.

    ఒకే వస్తువు ఎన్ని రకాల అనుభూతులకు అద్దంపడుతుందో ఎన్ని సార్లు చూసినా నిరంతరం ఆశ్చర్యపరుస్తూ ఉండే నిజమేమో.
    “తొలకరి వాన కొండల్ని తలబాధుకొని ఏడుస్తుంది”
    “నిశ్శబ్దంలా వాన సుధీర్ఘమౌనానికి నిరసనలా వాన ఇవ్వాళింక తెరపిలేదు”

    చదివితే,ఎదలో హర్షం కురిపించే వర్షం, ఆవేదనలు సైతం గుప్పించడం గుర్తుచేస్తుంది. వర్షమే కాదు, కామెంట్ల వర్షం అని ఇక్కడ తెలిసింది.

    “కదులుతున్న ఉరికంబం నా వూరు,
    సూర్యచంద్రుల్ని వెలేసిన ఆకాశం నాది”

    తెలంగాణా పల్లెల దైన్యాన్ని అక్షరీకరించినట్లున్నా,మొక్కవోని స్థైర్యానికి పోరాటపటిమల పురిటిగడ్డను ప్రతిబింబించినట్టుగా లేక ఎందుకో గుచ్చుకుంది.
    “ఉగ్రమైన వేసంగి గాడ్పులు ఆగ్రహించిపైబడినా అదిరి పోవకు
    ఒక్కుమ్మడిగా వర్షా మేఘం వెక్కి వెక్కి రోదించినా లెక్క చేయకు”
    అన్న దేవులపల్లి మాటలకు
    “కదులుతున్న చైతన్యం నా వూరు,
    సూర్యచంద్రులకు సైతం అవకాశం ఇచ్చిన ఆకాశం నాది” అనాలనిపిస్తుంది.
    ============
    విధేయుడు
    _శ్రీనివాస్‌

  3. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    07/13/2010 10:31 am

    శ్రీనివాస్ కందాళం గారూ,

    మీ పూర్తి పేరు, అదీ కేవలం గుర్తించడానికి వీలు కోసం, అడిగాను తప్ప వేరే వుద్దేశ్యమేమీ లేదు. మీ పూర్తి వివరాలు నేను అడగలేదు. ఈ వ్యాఖ్యల్లోనే మీ పేరున్న రెండు కామెంట్లు వచ్చాయి. పలానా అని తెలుసుకోడానికే పూర్తి పేరడిగాను. అదే నే చేసిన తప్పయితే క్షమించండి.
    మారుపేర్లతో కామెంట్లు రాసేవారి ఇష్టం వారిది. అవి ఎవరైనా సులభంగానే గుర్తించగలరు. సరే, అదొదిలేద్దాం. మిమ్మల్ని వివరాలడిగి వూరికే బాధ పెట్టడం నా అభిమతం కానే కాదు.

    ఇహ – అఫ్సర్ కవిత్వమంటే నాకిష్టమే! నేను ఊరిచివర లో కొన్ని కవితల్ని చాలా ఇష్టంగా చదివాను. కానీ అన్నీ కాదు; ముఖ్యంగా నినాద కవిత్వం. ఏ డొంకతిరుగుడూ లేకుండా కవితలన్నీ సూటిగా, స్పష్టంగా వుంటాయి. అనవసర భావ పటాటోపం కనిపించదు. అఫ్సర్ ఒక మంచి ఆధునిక కవనే నా అభిప్రాయం.

    మీరు అమెరికన్ తెలుగు రచయితలన్న పదం నేను మొదట వాడిందిగా చెప్పారు. కాదు. అఫ్సర్ గారి కామెంటు మరోసారి చూడండి.
    “ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో! ” అని రాస్తే దానికి నేను స్పందించాను తప్ప ఆ ఆలోచన నా బుర్రలో పుట్టింది కాదు. ఇక్కడకి ( ప్రస్తుతానికి అమెరికా అనుకుందాం ) వలస వచ్చిన వారు అమెరికా తెలుగు రచయితలెలా అవుతారో, అదేవిధంగా అఫ్సరూ కదా అన్న భావనతో అడిగాను. ఇందులో వెటకారమూ, వెక్కిరింతా లేవు. తీరి కూర్చుని ఇతరులని బాధ పెట్టే నైజం నాకు లేదు. కానీ నా వ్యాఖ్యలు మీకలా అనిపించకపోతే మరోసారి క్షమించండి.

    ఎక్కడో మొదలయిన చర్చ మరెక్కడికో పోతోంది. ఇహ నేను ఇందులోంచి తప్పుకుంటున్నాను.

    సెలవ్
    -బ్రహ్మానందం.

  4. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి shanmukham గారి అభిప్రాయం:

    07/13/2010 5:37 am

    షణ్ముఖం అభిప్రాయం
    ఇందీవరాక్షుని వృత్తాంతం అని మాకు SSC లో పాఠం ఉండేది. అది మనుచరిత్ర లోని పంచమాశ్వాసము లోనిదని మిత్రుల ద్వారా తెలిసినది అలగే అందులో ఇంకొక పద్యం “అనినన్‌ కన్నులుజేవురింప ” అనే పద్యము కూడా వున్నది “ ఈ పద్యం ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియచేయమని కోరుతున్నాను.

    ఇట్లు
    మీ షణ్ముఖం
    తప్పులు ఏమైనా ఉన్న మన్నించమని కోరిక.

  5. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి srinivas kandaalam గారి అభిప్రాయం:

    07/12/2010 10:09 pm

    బ్రహ్మానందం గారు:

    నేను చర్చని తప్పు దారి పట్టించడం లేదు. అందులో అనుమానమే లేదు. అఫ్సర్ ని అమెరికా తెలుగు కవి అన్నది మీరె కదా?! ఇదిగొ ఇదీ మీ మాట:

    చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం.

    అమెరికన్ తెలుగు రచయిత అనే మాట మీది కూడా. కాదని ఎలా అంటారు? పైగా, ఆ “శతకోటి నమస్కారాల” వెటకారం హేమిటో నాకు అర్ధం ఆవలేదు.

    అది అవతల పెట్టండి. కాని, కవిత్వ విమర్శకుడిగా మీ ఆలోచనల మీద ఇష్టం వుండబట్టే, నెను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను తప్ప మిమ్మల్ని గిచ్చి సంతసిద్దామని కాదు. రమా భరద్వాజ గారి లాగానె నాకూ మీ రచనలు అంటే ఇష్టమే. అఫ్సర్ గారి కవిత్వం గురించి మీ మాట వినాలన్న వుత్సుకతతో మాత్రమే అడిగాను.

    నా ప్రవర అడిగారు కదా మీరు? మారుపేర్లతో రాసే అందరినీ కూడా అలా ప్రవర అడిగే సాహసం చెయ్యగలరా, మీరు గానీ, ఈమాట సంపాదకులు గాని?

    గత పదేళ్ళుగా నేనూ, నా మిత్రులం ఈమాట చదివి, అందులో విషయాలు చర్చించుకునే అలావాటు చేసుకున్నాం. చదవడమే గాని, ఎప్పుడూ ఒక ముక్క రాసే సాహసం చెయ్యలేకపొయాము. ఇప్పుడు ఈమాటలో కామెంటడానికి అర్హత ఏమిటో ఇక్కడ కొందరి వ్యాఖ్యలు చదవిన తరవాతే తెలిసింది. అంతకు ముందు ఈమాట లో ఒక్క అక్షరం పడ్డా కళ్ళకి అద్దుకుని చదువుకునే వాళ్ళం నేనూ, నా నిజామాబాద్ మిత్రులం! అలాంటిది, ఇప్పుడు ఈ రాతలకి అర్ధమే లేని స్థితి వచ్చే సరికి బాధ పడి, ఇక తప్పని సరయి రాస్తున్నాను.

    అయినా మీరు అడిగారు కాబట్టి, మీ మీది గౌరవంతో ఇదీ నా ప్రవర. నా పేరు శ్రీనివాసాచార్యులు కందాళం. నేను ఒక కాలేజీ లెక్చరర్ని. సాహితీ చైతన్య స్రవంతి సభ్యుడిని. ఈమాట పాఠకుడిని అని చెప్పుకోవడం నాకు ఒక ఇష్టం. నేను నా విద్యార్ధులకి కూడా ఈ వెబ్ పత్రిక గురించి చెబుతూ వుంటాను. కవిత్వం రాయను కాని ఇష్టంగా చదువుతాను, విద్యార్ధులకి వినిపిస్తాను. నా చిరునామా ఇతర వివరాలు కూడా కావాలా?

    [Post edited – Eds.]

    [ఈమాటలో కామెంట్లు అసభ్యంగా ఉంటున్నాయని బాధపడుతూనే, వ్యక్తిగత దూషణలకి పూనుకోడంలో అంతరార్థం మాకు అంతుపట్టడం లేదు. దయచేసి ఎవరికి వారు, వారి కామెంట్లను నియంత్రించుకోండి. – సం.]

  6. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Srinivas Chilakapati గారి అభిప్రాయం:

    07/12/2010 5:26 pm

    మనిషి ఎదుగుదలలో సాహిత్యం పాత్ర over rated అన్న నా నమ్మకాన్ని సాహిత్యంపై చర్చలెప్పుడూ బలపరుస్తూనే ఉంటాయి. ఈ విసుర్లూ, కసుర్లూ, “ఆహా! ఏం కొట్టాను దెబ్బ”లూ (దీన్ని కూడా 🙂 పక్కన పెట్టేసి సామరస్యంగా చర్చించుకోలేమా? వ్యక్తుల్ని వదిలేసి విషయం మీద దృష్టి పెట్టలేమా?
    మంచి కవిత్వానికి అందరూ వొప్పుకునే ఒక నిర్వచనముందా? మంచి కవిత్వమేదో గుర్తించడానికి ఆ నిర్వచనం తెలిసి ఉండాలా? ఏది మంచికవిత్వమో సాహిత్య పూర్వాపరాలు తెలిసినవారు నిర్ణయిస్తారా? అంత తేలిగ్గా మంచికవిత్వమేదో నిర్ణయించగలిగినప్పుడు కవిత్వానికంతా గ్రేడింగు చేస్తే కొత్త పాఠకులకు పని సులువు కాదా? ఈ కొలబద్దలేవీ లేవు, మనసును తాకిందే కవిత అనుకున్నప్పుడు ఒకరి కవిత్వం మరొకరికకవిత్వమవుతుందనీ అంగీకరించక తప్పదు కదా? ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు వెలిబుచ్చుకోగలం కానీ భిన్న మనస్తత్వాలూ, జీవితానుభవాలూ గల ఇంతమంది ఏకాభిప్రాయానికి రావాలని ఎలా అనుకోగలం? ఒక కవిత నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పడం, లేదా చెప్పలేకపోయినప్పుడు బావుందని మాత్రం చెప్పడం, నచ్చనప్పుడు ఎందుకు నచ్చలేదో చెప్పడం మాత్రమే కదా మనం చేయవలసింది? రుజువులేవీ లేనప్పుడు అభిప్రాయాల్ని సార్వజనీన సత్యాలుగా ఎందుకు చలామణీ చేయాలని చూడడం?

    -ఇంకో శ్రీనివాస్

  7. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    07/12/2010 11:53 am

    మరొక్క విషయం. అమెరికా తెలుగు వారూ, ఆంధ్రా తెలుగు వారూ అంటూ ఎవరూ ప్రత్యేకంగా లేరు. ఉన్న అందరూ వలస వచ్చిన తెలుగువారే! వాళ్ళే ఏం చేసినా, రాతలయినా, కోతలయినా! మా పిల్లల తరం అంటారా? రాసే నాలుగు ముక్కలూ చక్కగా ఇంగ్లీషులో రాసుకుంటారు. మొదట్లో మా పోరు పడలేక కాస్త తెలుగులో నాలుగు మాటలు కెలికినా, పెళ్ళయ్యాక అవి కూడా ఎగిరిపోతాయి.

  8. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    07/12/2010 11:45 am

    అఫ్సర్ గారూ,

    మీ జవాబుకి సంతోషం. మీ వ్యాసంకోసం ఎదురు చూస్తాను. మీ ఇప్పటి వ్యాఖ్య పైనే ఇంకోటి.
    “అమెరికా తెలుగు రచయిత/ అమెరికా తెలుగు పాఠకుడు అనే పదాలు ఇంకా కొన్ని ఏళ్ళు మాత్రమే బతుకుతాయి అనిపిస్తోంది, అని ప్రస్తుతానికి చెప్పగలను, ఈ తరం అమెరికా తెలుగు వాళ్ళు తెలుగులో రాస్తే తప్ప, కనీసం చదవాలి అనే ఆసక్తి చూపిస్తే తప్ప.” అని మీరన్నారు. ఈ పరిస్థితి కేవలం అమెరికాకే కాదు. ఆంధ్రాకీ వర్తిస్తుంది. ప్రస్తుత తరంలో తెలుగు రచనాసక్తి వున్న తెలుగు యువత ఎంత? రాసే తెలుగువాళ్ళు అక్కడా, ఇక్కడా ఇంచుమించు ఒకేసారి తగ్గిపోతారు. ఓ పదేళ్ళు లేదా ఇరవై ఏళ్ళు దాటితే ఈమాటకే కాదు, తెలుగునాట పత్రికలక్కూడా ఇలాంటి పరిస్థితే రావచ్చు.
    ““ఈమాట” లాంటి వెబ్ పత్రికలు క్రమంగా ఆంధ్రా పాఠకులు/ రచయితల మీదే బతకగలవు. లేకపోతే, వాటికి రచనలు కూడా పుట్టవు.” అని మీరెంత గట్టిగా చెప్పగలరో ఇదే పరిస్థితి తెలుగునాటా వచ్చే ముప్పుందని నేనూ బల్లగుద్ది చెప్పగలను.
    ప్రస్తుత తెలుగునాటున్న యువతరంలో సగానికిపైగా తెలుగు రాయడం రాదు. కేవలం మాట్లాడడం తప్ప. వారి పిల్లలకి అదికూడా పోతుంది. అంటే రాబోయే కాలంలో రాసే వాళ్ళే చదువుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగానే వుంది.
    ప్రస్తుతమంతా శూన్రుత విజ్ఞానమే కనుక తెలుగు అవసరం ఏం వుంటుంది? ఏం కావాలన్నా గూగిలిస్తే పేగుల వివరాలు పేజీలకొద్దీ లభిస్తాయి. అలాంటప్పుడు తెలుగు అవసరం ఏమీ ఉండదని నా అంచనా.
    సాహితీ సభలకొచ్చేదే ముసలీ, ముతకా అని మొన్నొకాయన మా సాహితీ సదస్సులో వ్యాఖ్యానించారు. ఇది పచ్చి నిజం. సినిమాలూ, రాజకీయాలూ తప్ప తెలుగు వారికేం ఎక్కవు. కనీసం తెలుసుకుందామన్న ప్రయత్నమూ లేదు. అది వేరే సంగతి.
    ఇప్పటి అమెరికా తెలుగు యువతరానికి రాయడం, చదవడం వచ్చినా సాహిత్యాభిలాష కలగడం ఒక పెద్ద కలే! ఒకవేళ అవి వచ్చినా తెలుగు పుస్తకాలు చదివించేటంత ఆసక్తీ, అవసరమూ వుంటుందని నేనుకోను.
    ఈ పరిస్థితి ఒక్క తెలుగు భాషకే కాదు, మిగతా వాటికీ మెల్ల మెల్లగా దాపురిస్తుంది. తెలుగు నాట విద్యావిధానం మారిస్తే తప్ప. ప్రస్తుతం అది జరుగుతుందన్న ఆశ కనుచూపు మేరలో కూడా లేదు. కాబట్టి కాస్త అటూ ఇటూ తేడాలో అంతా ఒకేలా ఉంటుంది.
    భాషా, సాహిత్యమూ బ్రతకాలంటే ఒకటి నుండి పన్నెండు తరగతుల వరకూ తెలుగు తప్పనిసరిగా చదవాలి. పలు రకాల సాహిత్య పరిచయాలూ జరిగితే తప్ప రాసే వాళ్ళ సంఖ్య పెరగదు. చదివేవాళ్ళ సంఖ్యా అంతే! ఈ ఇద్దరి మీదే పత్రికలూ బ్రతుకుతాయాన్నది మరొక పచ్చి నిజం.

  9. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    07/12/2010 9:47 am

    శ్రీనివాస్ గారూ,

    మీరు అఫ్సర్ గారి వ్యాఖ్యా, ఆ తరువాత నే చేసినదీ మరోసారి చదవండి. నేను ఊరిచివర కవిత్వంపై విమర్శ చెయ్యలేదు. అఫ్సర్ గారు రాసిన వ్యాఖ్య దురుసుగా అనిపించి దానిపై రాసాను. మీరు అది వదిలేసి, కొత్త కొత్త తెలివైన ప్రశ్నలేస్తే జవాబిచ్చే సత్తా, ఓపికా నాకు లేవు.

    అఫ్సర్ గారు అక్కడ కవిత్వం రాసినా, ఇక్కడ కవిత్వం రాసినా నాకభ్యంతరం లేదు. నాకొరిగేదీ ఏమీ లేదు. బావుంటే చదివి ఆనందిస్తాను. లేదంటే చదివినంత వేగంగానే మర్చిపోతాను. అక్కడా, ఇక్కడా అంటూ గీత గీసింది అఫ్సర్ గారు. ఆయన్నొదిలేసి నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. కాబట్టి మీరు ఆయన్ని సంప్రదించాలి. నన్ను కాదు.

    మీరిచ్చిన వలస కవులూ, రచయితల లిస్టు నాకూ తెలుసు. వారందరూ ఇక్కడే ఉండిన అక్కడి వారయితే, ఇక్కడే ఉండిన ఇక్కడి తెలుగువారెవరూ ఉండరు. ఈ వసుధైక కుటుంబంలో వలస పక్షులు కానిదెవరు?

    మీరు చర్చని తప్పుదారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు.

    చివరగా – గతంలో ఆంధ్రాలో ” సుబ్బారావూ” అని రోడ్డు మీద అరిస్తే కనీసం పదిమందైనా వెనక్కి చూసేవారు. ప్రస్తుతం సుబ్బారావుని శ్రీనివాస్ పేరు ఆక్రమించుకుంది. మీ పూర్తిపేరుతో వ్యాఖ్య రాస్తే పలానా అని తెలిసేది. :)- ఆ అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలేసి తప్పించుకున్నారు. :)-

  10. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి afsar గారి అభిప్రాయం:

    07/12/2010 9:01 am

    రామారావు గారికీ, బ్రహ్మానందం గారికీ:

    మంచి మాటలకు ధన్యవాదాలు.ఆలశ్యానికి మన్నించండి. మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ “ఊరి చివర” చర్చలో ఒదగవు కాబట్టి, అది వేరే వ్యాసం రాస్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి. కాని,తెలుగు పాఠకుల సంఖ్య ఎక్కడ పెరుగుతూందో, ఇప్పటి అమెరికా తెలుగు రచయితల పరిమితులేమిటో ఆ వ్యాసం చర్చిస్తుంది. కాని, అమెరికా తెలుగు రచయిత/ అమెరికా తెలుగు పాఠకుడు అనే పదాలు ఇంకా కొన్ని ఏళ్ళు మాత్రమే బతుకుతాయి అనిపిస్తోంది, అని ప్రస్తుతానికి చెప్పగలను, ఈ తరం అమెరికా తెలుగు వాళ్ళు తెలుగులో రాస్తే తప్ప, కనీసం చదవాలి అనే ఆసక్తి చూపిస్తే తప్ప.

    “ఈమాట” లాంటి వెబ్ పత్రికలు క్రమంగా ఆంధ్రా పాఠకులు/ రచయితల మీదే బతకగలవు. లేకపోతే, వాటికి రచనలు కూడా పుట్టవు.

    ఇవి చిలక జోస్యాలు కావు, చేదు నిజాలు. ఇప్పటికీ అమెరికాలో తెలుగు సాహిత్య సభలకి వస్తున్న వాళ్ళలో ఈ తరం తెలుగు వాళ్ళు ఎంత మంది వున్నారు? ఆలోచించండి.

    వ్యాసం వచ్చే “ఈమాట” కోసం అనుకుంటున్నా. చూద్దాం.

« 1 ... 1129 1130 1131 1132 1133 ... 1583 »