Comment navigation


15823

« 1 ... 1130 1131 1132 1133 1134 ... 1583 »

  1. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    07/12/2010 7:26 am

    Ramanath-gaaru,

    Yes, its the voice of Srirangam Gopalaratnam. See Veturi’s preface above.

    Regards,
    Sreenivas

  2. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/12/2010 12:52 am

    రామారావు గారి “నిస్సంకోచమైన విన్నపం” వలన కవితా విప్లవాల స్వరూపపు పుస్తక కాపీలు మరికొన్ని అమ్ముడైతే నాకు సంతోషమే గానీ .. “రచనా సందర్భం” మారితే వచ్చే అవకాశాలనీ.. అంటే వీలూ సాలూ అంటాం తెలుగులో వాటి గురించి మాట్లాడుకుందికి ఉపకరిస్తుందేమో గానీ అది మంచి కవిత్వమా కాదా అని గుర్తించడానికి ఎందుకూ ఉపకరించదు. మనం చాలా సార్లు తెలివైన మాటల వెనక తచ్చాడి తప్పుకుంటూంటాం..అంతే!! కవితా విప్లవాల స్వరూపం ప్రకారం భావకవిత్వమేనా, “దిగంబర కవిత్వమూ” ఒక గొప్ప మార్పుకి సంకేతంగానే గుర్తించాడాయన. కానీ అది ఎటువంటి మార్పో కాలం చెప్పనే చెప్పింది. కవితావిప్లవాల స్వరూపాన్ని దాటి ముందుకెళ్ళవలసిన “సందర్భం” కూడా ఏనాడో వచ్చింది. నారాయణరావు గారి థియరీ భాషలో చెప్పాలీ అంటే విమర్శా సందర్భం ఏనాడో మారింది. ఆ దృష్ట్యా కవితా విప్లవాల స్వరూపం ఒక పాత పుస్తకం. ఇవాళ్టికాలపు అవసరానికి అది ఎందుకూ ఉపయోగపడదు.

    ఇంక ఆ థియరీని పొడిగించి చూస్తే “టెక్నాలజీ” వాడకం కవిత్వాన్నీ లేదా ఇతర సృజనాత్మక కళలనీ ఏమన్నా ప్రభావితం చేస్తుందా అన్నది చర్చనీయాంశం కావాలి. భావకవిత్వం కాలంలో ఏకాంతం కవికీ పాఠకుడికీ ఒక వెసులుబాటు కల్పించిందన్న ఊహకి కొనసాగింపుగా!! అది ఇవాళ “ఇంటరాక్టివ్ టెలివిజన్” ఇంకా ఓట్లు అడిగి వారి వారి కళలకి ఆయా కళాకారులు గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి లాంటిది. దానిని కవిత్వానికి అన్వయించి చూడాలి.అప్పుడు కవితాసందర్భం ఎలా మారుతుందీ అన్నది. మీరంతా ఈ విషయంలో నిష్ణాతులే గనక ఊహించండి. ఇన్ని లక్షల “బైట్స్” కారణంగా ఇన్ని అభిప్రాయాలని మీరు ఇబ్బంది లేకుండా అచ్చువేసేస్తున్నారు. స్పేస్ కావలసినంత ఉంది గనక. ప్రింట్ మీడియాకి పాపం ఆ వీలు లేదు గనక వాళ్ళు ఈ విషయం లో “పొదుపు” గా ఉండాలి. మీకు ఆ పొదుపు అవసరం ఇంకా పడలేదు.గనక పస ఉన్నా లేకపోయినా రాసేవాళ్ళ అన్ని అభిప్రాయాలనీ పొందుపరుచుకుపోతున్నారు.

    జపాన్ లో కాబోలు ఈ తొందర కాలంలో చదవడానికి అనువుగా యస్ మ్ యస్ నవలలు రోజుకో పేరా చొప్పున మొబైల్ ఫోన్స్ ల్లో ఇస్తూ “మార్కెటింగ్” చేసుకుంటున్నారని విన్నాను. అలా ఇవాళ ఈ బ్లాగుల వెసులుబాటు రానే వచ్చింది. అందులో ఎవరి రచనలని వాళ్ళే ప్రచురించుకోవచ్చు. [ఈమాట వంటి పత్రికలకి కూడా కాలం చెల్లుతుందేమో ఇటుపైన.. వాళ్ళకి ఎడిటర్ ల బెడద కూడా ఉండదాయె!!] అలా కొత్త కవిత్వం అంటే యస్ మ్ యస్ కధలూ నవలలూ కవిత్వాలూ రావొచ్చు. సృజన కొత్త పుంతలు తొక్కవచ్చు. కొత్త తరహా ప్రక్రియలూ పుట్టుకు రావచ్చు. అయితే అప్పుడు కూడా చిరస్మరణీయమైన కవిత్వమూ లేదా అలాంటి భావాలే కదా మనం మాట్లాడుకుందికి మిగలవలిసింది? ఇంటర్నెట్ లో కాళిదాసులూ భారవి లూ ఉదయిస్తారనీ మారిన ఆ రచనా సందర్భం లోంచి రాబోయే ఆ సృజనమీద మరో కవితావిప్లవాల స్వరూపాన్ని మీరంతా ఆశించి ఎదురు చూడనూ వచ్చు. తప్పేమీ లేదు. కానీ నాకు అంత ఓపిక లేదు. అప్పుడు కూడా నేను నాకు నచ్చిన కాళిదాసులకోసం మాత్రమే వెతుక్కుంటాను. లేదా వెనక్కి వెళ్ళి కాళిదాసునే చదువుకుంటాను మళ్ళీ.!! ప్రతీ కాలంలోనూ సృజనాత్మకులైన కవి, రచయితలు కొందరే ఉన్నారు. ఉంటారు. అన్ని కాలాల్లోనూ కూడా!! అన్ని దేశాల్లోనూ కూడా!! అయితే మిగతా వాళ్ళూ రాసి పుస్తకాలు వేసుకోరా? అంటే వేసుకుంటూనే ఉంటారు. విమర్శకులు మారే ” రచనా సందర్భం” కోసం అలా ఎదురుచూస్తూనే ఉంటారు. అప్పటి ఎప్పటి పుస్తకాలనో చదవమని ఇలా చెప్తూనే ఉంటారు.

    రమ.

  3. About eemaata గురించి KLN RAO గారి అభిప్రాయం:

    07/11/2010 10:03 pm

    తెలుగులో ఒక ఆన్ లైన్ పత్రిక చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పత్రిక ఇన్నాళ్ళూ నా కంట్లో పడకపోవడం బాధగా కూడా ఉంది. Anyhow, my first visit to this magazine satisfied my thirst of telugu reading online. Thanks for the efforts put by you. Keep it up.

  4. అ, న్యాయం గురించి KLN RAO గారి అభిప్రాయం:

    07/11/2010 9:58 pm

    కథ బాగుంది. కాకపోతే అమెరికాలో కూడా ఇంతేనా అనిపించింది. ఇండియాలో అయితే ఇన్సూరెన్సు ఏజెంటు డబ్బులు తీసుకుని కంపెనీకి బదులు క్లెయిం చేసిన వాళ్ళకి లాభం చూపించేవాడు. మనకి మానవత్వం ఎక్కువ కదా!

  5. నీడ గురించి Chandra గారి అభిప్రాయం:

    07/11/2010 2:49 pm

    Though this happens with almost every generation, and a known story, the narration is very good, and gripping. The author has a good command on the Rayalaseema accent that brought nativity with the story. Keep up the good work,

    Chandra.

  6. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    07/11/2010 9:31 am

    అయితే, రమా భరద్వాజ గారు మిగతా వాళ్ళని చదవకుండా తిట్టిపోస్తారన్న మాట. బాగుందండీ వరస! “ఊరి చివర” మీరు చదివిన ఆధారాలు మీ మాటల్లో లేవు.

    సరే, పెడసరం రమ గారు సెలవు పుచ్చుకున్నారు కనుక, ఇక్కడ ఇప్పుడు వేలూరి కి, కాకపోతే సాయి బ్రహ్మానందం గారికి ఒక ప్రశ్న. “ఊరి చివర”లో అఫ్సర్ గారి అమెరికా పద్యాలు వున్నాయా? వుంటే, అవి డయాస్పోరా గురించి మాట్లాడే వేలూరి గారి కంటిలో ఎందుకు పడలేదు? అఫ్సర్ గారి కవిత్వాన్ని శ్రద్ధగా చదివే బ్రహ్మానందం గారు అఫ్సర్ గారిని అమెరికా తెలుగు కవి అని అనడానికి ఆధారాలు చూపగలరా?

    నాకు రామారావు గారు చెప్పింది కొంత నిజం కావచ్చుననిపిస్తున్నది. అఫ్సర్ గారికి “అక్కడి” దృస్టి ఎక్కువ. ఆయన తెలంగాణా, దలిత, ముస్లిం కవితలు అట్లా కనిపిస్తాయి. నేను పాఠకుడిని మాత్రమే. విశ్లేషణ చెయ్యలేను. పెద్దలు వేలూరి గారు, బ్రహ్మానందం గారు, ఇంకా ఎవరయినా చెప్పాలి.

    ఈ విషయం విమర్శ వైపు నించే కాక, చాలా కాలం ఆంధ్రాలో వుండి, అమెరికా వలస వచ్చిన కవులు- స్వామి, రవి శంకర్, కన్నెగంటి చంద్ర, రవికిరణ్, మరువం ఉష, యదుభూషణ్, కల్పనా రెంటాల, కె.గీత – వంటి వారున్నారు.

    అఫ్సర్ గారు “అక్కడి” పక్షం ఎక్కువ వున్నారా? “ఇక్కడి” అనుభవాలని లోకువ చేస్తున్నారా? “ఊరి చివర” లో “ఇక్కడి” అనుభవం ఎంత?!

  7. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    07/11/2010 7:50 am

    సమకాలీన కవిత్వం మీద లోతైన విమర్శ రాక పోవటానికి కారణం కవి నామధేయులు విరుచుకు పడతారన్న భయం అన్నది వట్టి మాట. సమకాలీన వచన కవిత్వం పట్ల ఏక వాక్య అభిప్రాయాలు వెలిబుచ్చటమే తప్ప విమర్శించటానికి కావలసిన పరికరాలు ఎవరిదగ్గరా లేవు. అవి తయారు చేసుకోవటానికి మనకున్న సాంప్రదాయాల పట్ల అవగాహన ఉండడం ఎంత అవసరమో మారుతున్న సందర్భం పట్ల అవగాహన కూడా అంటే అవసరం. ఈ రెండింటినీ అనుసంధానం చేయవలసిన బాధ్యత అందరిమీదా ఉంది. ఈ మాట పాఠకులలో చాలా మందికి సాహిత్యపు పూర్వాపరాలు తెలియవు అని రమ గారు అన్న మీదట ఆ అభిప్రాయానికి కారణమేమిటి అని సంపాదకులు అడిగితే కారణం చెప్పకుండా తమకు నచ్చే రచయితల జాబితా ఇచ్చారు రమగారు. వీరంతా పూర్వాపరాలు తెలిసిన వాళ్ళని వారి అభిప్రాయం కావచ్చు. చూడబోతే ఆ జాబితాలో సాహిత్యపు పూర్వం తెలిసిన వారు చాలా మందే కనపడ్డారు కానీ పరం గురించి బలమైన అభిప్రాయాలు వెలిబుచ్చిన వారెవరూ అందులో నాకు కనపడలేదు. ఇది ఆ జాబితాలో ఉన్న వారి పట్ల అగౌరవంతో అంటున్న మాట కాదు. మనమున్న సందర్భం అటువంటిది.

    ముతక సామెతలూ, నాసి రకం అభిప్రాయాలూ, అరకొర విషయ పరిజ్ఞానంతో, సాహితీ పరురాలమురా అన్న ఆలాపనతో అసహన ప్రకటనలు గుప్పించడం తమ హక్కు అని ఎవరైనా అనుకుంటే వేపకాయంత వెర్రి లేని వారెవరులే అని ఊరుకోవచ్చును. కానీ దానికి హద్దులు ఉండాలి..

    ప్రాంతీయత అన్నది (ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమా కావచ్చును) ప్రామాణికంగా చలామణీ అవుతున్న సాంస్కృతిక నిర్మాణాలకి భావ జాలాలనీ ప్రశ్నించటానికి పుట్టుకొచ్చినది. దాన్ని ఆధారంగా చేసుకుని ఎగబాకటానికి ప్రయత్నం చేసిన నేల బారు మనుషులూ ఉన్నారు. దాన్నే ఆధారంగా చేసుకుని అద్భుతమైన సార్వజనీనతని కనుగొన్న వారూ ఉన్నారు. ఏది ఏమిటో సోదాహరణంగా చర్చించుకోవలసిన అవసరం ఉండగా – అసలు ప్రాంతీయత అన్నదే సర్వారిష్టాలకూ మూలం అన్నట్టు కొట్టి పారేస్తే – ఇదంతా ప్రామాణికంగా చలామణీ అవుతున్న (కాళోజీ మాటల్లో చెప్పాలంటే) రెండు జిల్లాల ప్రాంతీయతలోని నేలబారు తనమేననీ అనుకోక తప్పదు.

    ఇంత పొడుగ్గా రాద్దామని నేను అనుకోలేదు కానీ కృష్ణదేవరాయల మీద జరిగిన చర్చలో – ‘తురకలను’ నమ్మరాదని కృష్ణదేవరాయలు తెలుసుకున్నాడు – అన్న మాటని ప్రస్తుత సందర్భంలో ఎడిట్ చేయవలసిన అవసరం ఉన్నదన్న విషయాన్ని సంపాదకవర్గం గుర్తించక పోగా అది మరెవరి దృష్టికీ కూడా రాక పోవటంతో సమస్య చాలా తీవ్రంగానే ఉన్నదనిపించి రాయవలసి వచ్చింది.

    [సంపాదకులు గమనించినా ఎడిట్ చేయలేదు. అందుకు కారణం వేరేగా ఇక చెప్పక్కర్లేదు కదా! – సం.]

  8. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/11/2010 12:57 am

    రమా భరద్వాజ గారికి,

    పేర్లో ఏవుంది, ఇంకా పీర్లలో నైనా కాస్త నమ్మకవుంది జనాలకి. నేను బళ్ళో చదువుకుని నాకు తెలిసి, గ్నాపకవున్నది కొంచం ఇంజినీరింగ్, కొంచం కంప్యూటర్ సైన్సు. దాంట్లో కూడా నేను గొప్పవాడ్ని కాదు, మామూలు ఏవరేజోడినే. పన్నెండో క్లాసు దాకానే నా తెలుగు చదువు. అది కూడా తెలుక్లాసంటే లీలా మహల్లో ఇంగ్లీషు సినిమా లేకపోతేనే. అందుకని నేనొక సాహిత్యవేత్తనని నేను అనుకోను, కనీసం నలుగురిముందు ఫోజెయ్యను. కానీ నాకు తెలుగు క్లాసులెగ్గోట్టినా తెలుగంటే నా కిష్టవే. కావ్యాలు, ప్రభందాలు, మీకు తెలిసినంతగా సాహిత్య పూర్వపరాలు నాకు ఖచ్చితంగా తెలియవు, బహుశా మీకు తెలిసినదాంట్లో 10% కూడా తెలియవు. కానీ నాకేది ఇష్టవో, ఏది కాదో నాకు తెలుసు. నా బతుకు నాకిచ్చిన అనుభవాన్నుంచి నాకు తెలిసిన మంచేదో, చెడ్దేదో నాకు తెలుసు. తెలుగు కవితని చదివి నచ్చితే ఆనందించడానికి, నచ్చకపోతే విమర్సించడానికి, మరీ మనసులో అలజడి పుడ్తే, ఆ అలజడిని అక్షరాల్లోకి అనువదించడానికి (మీ మెప్పు కోసం కాదు), తెలుగులో పిహెచ.డి, కాకపోతే అమరకోశాలు, వాటి దుంపదెగా అవేవిటో అవన్నీ చదివిన అమ్మా నాయన్లు వుండాలని మీ ఉద్దేశంలాగుంది. వైద్య్హ శాస్త్రం తెలియకపోతే వైద్యం చెయ్యొద్దన్నట్టే, పాకశాస్త్ర పూర్వ పారాలు, దాంట్లో నైపుణ్యం లేకపోతే తిండి మానెయమన్నట్టుంది. మాకు చెప్పుకోడానికి మాకు చెప్పుకోదగిన గురువెలెవరూ లేరు తెలుగులో, కానీ మా అధ్యాయనం గురుముఖతా కాకుండా, మా అనుభవాల్లోంచి, మా బతుకుల్లోంచి, అది మీకు విచిత్రంగా అనిపించినా సరే. అందుకని మా రచనలు, మా విమర్శలు మీకు తెలిసిన, మీరు చదివిన, మీకు ప్రామాణికవనిపించే మీ పరిధి నుంచి కాకుండా మాకు అనుభవైన మా బతుకుల నుంచి వస్తాయని గమనించండి. మీ విమర్శలు మాకు నచ్చనందువలన మీ గురించి అర మాటలు మేవు మాట్లాడవు. మా అభిప్రాయాలు రచనలు, విమర్సలు మీకు నచ్చకపోయినందువలన ప్రపంచవేవీ మునిగిపోదు కానీ మీరు కూడా కనీసం మా వానా కాలపు తెలుగు చదువుల సభ్యతనన్నా చూపించండి మీ వ్రాతల్లో. వీధికి పెద్దకావడం పెద్ద పని కాదు, కానీ ఆ పెద్ద కాకపోవడవే గొప్పేవో ఒక సారి ఆలోచించండి.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  9. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/10/2010 5:13 pm

    వెల్చేరు నారాయణరావు గారు “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” అనే గ్రంథంలో కొత్త రకమైన కవిత్వం రావటానికి “రచనా సందర్భం” అనే అంశాన్ని ఒక మఖ్య ప్రేరకంగా గుర్తించారు. (ఈ పుస్తకాన్ని చదవమని ఈమాట పాఠకులందరికీ నిస్సంకోచంగా విన్నవిస్తున్నాను.) ఉదాహరణకు, ప్రింటింగ్ ప్రెస్ రాకతో ఓ పుస్తకాన్ని ఎవరికి వారు ఓ కాపీ కొనుక్కుని చదువుకునే అవకాశం కలిగింది; ఆంగ్లవిద్యా విధానాలతో విద్యార్ధులు తమ కుటుంబాల నుంచి దూరంగా వెళ్లి ఉండటం జరిగింది; ఈ రెండూ కలిసి ఏకాంతంగా ఎవరికి వారే చదువుకుని ఆనందించగలిగే కవిత్వానికి (భావకవిత్వం) దారి తీశాయి. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ , ఆంగ్లవిద్యాలయ వ్యాప్తి – వీటి నుంచి ఒక కొత్త రచనా సందర్భం తయారైందన్నమాట.

    ఇప్పుడూ ఒక సరికొత్త రచనా సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది Web 2.0 వల్ల కలిగింది. ఎవరికి వారు ఓ కవితని చదువుకున్నా, దాని గురించిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా వున్న పాఠకుల మధ్య జరగటమే కాదు, కవికి కూడ అవి ఎప్పటికప్పుడు అందుతున్నాయి. సాహిత్యచరిత్రలో ఇదివరకు ఎప్పుడూ ఇది సాధ్యపడలేదు. ఈ కొత్త రచనా సందర్భం తెలుగులో ఎలాటి కొత్త కవిత్వానికి దారితీస్తుంది అనేది ఇంకా స్పష్టంగా లేదు. అలాగే అందులో పాఠకుల, వారి చర్చల పాత్ర ఏమిటనేది కూడ తెలియదు. ఐతే ఈ కొత్త కవితాప్రపంచంలో పాఠకులకు ఇదివరకెప్పుడూ లేని పెద్దపాత్ర వుంటుందనిపిస్తున్నది.

    ఒక ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే – ఈ కొత్త రచనాసందర్భం, నాకు తెలిసినంతవరకు, ఆంగ్లసాహిత్యం మీద పెద్ద ప్రభావం చూపలేదు; ముఖ్యంగా అమెరికాలో ఇంటర్నెట్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటున్న కవులు చాలా తక్కువగా కనిపిస్తారు. (ఈ విషయం నాకన్నా బాగా తెలిసిన వారు ఎందరో వుంటారు. వారి నుంచి ఇంకా అధికారికమైన సమాచారం వినాలని వుంది)

    నారాయణరావు గారి సిద్ధాంతం ప్రకారం రచనా సందర్భాల మార్పుని గమనించలేని తక్కువరకం కవులు పాతకవిత్వమే రాస్తారు. నిశితదృష్టి వున్న కవులు ఈ మార్పుకి అనుకూలమైన కొత్తరకం కవిత్వం సృష్టిస్తారు.

    ఇలా ఒక విప్లవాత్మక సమయంలో పాఠకులం కావటమే కాదు, నారాయణరావు గారి కవితావిప్లవకారకాల సిద్ధాంతం భవిష్యత్తుని ఎంతగా predict చేస్తుందో చూసే ఒక ఆసక్తికరమైన కాలంలో వున్నాం మనం.

    ఈ సంధికాలంలో రకరకాల ప్రయోగాలు తప్పవు. వాటిలో చాలాభాగం విఫలం కావటమూ తప్పదు. ఇప్పుడు ఈమాట లోనూ, ఇతర వెబ్ పత్రికలలోనూ జరుగుతున్నవి ఇలాటి ప్రయోగాలే. నా ఉద్దేశ్యం – వీటిలో ఫలానావి మంచివీ ఫలానావి కావు అని చెప్పగలిగే స్థితి ఇంకా రాలేదు గనుక, తొందరపడి పాఠకులు కాని సంపాదకులు గాని వేటినీ ఆపటం, అడ్డుపెట్టటం మంచిది కాదేమో (వ్యక్తిగత దూషణలు మరీ శృతి మించుతుంటే తప్ప).

  10. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/10/2010 4:38 pm

    మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.

    నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..

    సెలవు,
    భవదీయ..
    రమ.

« 1 ... 1130 1131 1132 1133 1134 ... 1583 »