Comment navigation


15828

« 1 ... 1087 1088 1089 1090 1091 ... 1583 »

  1. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/28/2011 2:20 am

    రమగారూ,
    నేనసలు కవుల జోలికే పోలేదండి! తమ కవిత్వంలో పదాలని రకరకాల అర్థాలలో ప్రయోగించే స్చేచ్ఛ కవులకి ఎప్పుడూ ఉంది. అది లేకపోతే కవిత్వమే లేదు. నేను చెప్పినది విమర్శలు, లక్షణ చర్చల విషయంలో. అందులోని పరిభాషకి స్పష్టత నిర్దిష్టత అనివార్యం కదా.
    ఈ చర్చని ఈనాటి వచన కవులు చదవలేదంటే అది ఆ కవుల తప్పు కాదా? ఇందులోని అభిప్రాయాలని పరిగణించాల్సిన అవసరం లేదు. కాని విషయం ముఖ్యమైనది అనుకున్నప్పుడు, దాని గురించి తమ అభిప్రాయాలని చెప్పాలి కదా. వచనకవిత్వ రూపాన్ని గురించి, పాదవిభజన గురించి మరింత అవగాహన కవులకి, పాఠకులకి అవసరమని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు కనీసం ఈ చర్చ ద్వారానైనా కవులు ముందుకువచ్చి తమ అనుభవాలనూ, ఆలోచనలనూ పంచుకుంటే బాగుంటుంది కదా?

    మాధవ్ గారూ,
    పద్య నిర్మాణపు చట్రం గురించి మీరు ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. పాటకి స్వరం మౌలిక లక్షణం. మీరు చెప్పిన ఇతర “గీత” లక్షణాలు “పాట”లన్నిటికీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ దాన్ని పాటగా “స్ఫురింప”జెయ్యడం అంటూ ఏమీ లేదు. అది ముమ్మాటికీ సిసలైన పాటే! పాదవిభజన కవితకి అలాంటి మౌలిక లక్షణం కాదని నేను భావిస్తాను. అయినా మీరు “స్ఫురణ” విషయంలో చెప్పింది నాకు అర్థమయ్యింది. పాదవిభజన చెయ్యడం వలన అది కవిత అన్న స్ఫురణ ఎందుకు కలుగుతోంది అన్న విషయమై ఆలోచించాలి. కేవలం పరంపరగా కవిత్వం పాదబద్ధం కావడం మూలాన ఆ స్ఫురణ కలుగుతోందంటే, అది అంత విలువైన విషయం కాదు. కాలాగతిలో అది చెరిగిపోతుంది. అంతకన్నా విలువైన ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి.

  2. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/27/2011 1:03 pm

    కామేశ్వరరావు గారూ !!

    మీరు నా అభిప్రాయం విన్న తర్వాత కూడా “పద్యాన్ని” ఇంకా రూప పరంగా చూస్తున్నారు. వచనకవితా ప్రక్రియ ఆధునిక కాలంలో గణనీయమైన పాత్రనే పోషించిన విషయం ..ఆధునిక కవులు “పద్యాన్ని” రూపపరంగా వాడుక చేయకపోవడం నేను ఈ సరికే ప్రస్తావించి ఉన్నాను. ఇక్కడ మీరు అంటున్న ” అయోమయం” ఈ పదప్రయోగం చేస్తున్న కవులకి లేదు. “శాస్త్రీయత” అని మీరు అనడం నాకు వింతగా అన్పించింది. ఏది శాస్త్రీయతా?? ప్రయోగాలు సృజనకారులే కదా చేస్తారూ?? భాషలో గాని..ఊహల్లో గానీ!! నువ్వు మూడు వక్ర రేఖల్లో ఆడదాని బొమ్మ ని గీస్తావేమయ్యా అని ఎవరన్నా పికాసో ని ప్రశ్నిస్తే పికాసో ఏం జవాబు చెప్పాలీ?? లేదా అసలు ఏమన్నా ఒక జవాబు ఆయన ఇచ్చి ఉండేవాడా?? శాస్త్రాన్ని దాటి తన స్వాతంత్రాన్ని చూపేవాళ్ళే సృజనశీలులు.

    అసలింతకీ నాదో సందేహం సుమా !!. ఈ చేరా.. సంపత్కుమారల చర్చని ఎంతమంది ఇవాళ్టి వచన కవులు చదివేరూ?? ఎంతమంది వీరి అభిప్రాయాలని పరిగణించారూ?? ఒక చర్చ నిజంగా అది ఉద్దేశ్యించిన వర్గానికి గనక అందకపోతే చర్చగా అది బోల్తాపడ్డట్టే కదా!! పాయింట్లు చాలని చర్చని ఎంత సాగదీస్తే మాత్రం ఫలితం ఏముందీ??

    రమ.

  3. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav గారి అభిప్రాయం:

    01/27/2011 12:21 pm

    కామేశ్వర రావు గారూ – నా ఉద్దేశాలని స్పష్టంగా చెప్పనందుకు క్షమించండి.

    1. ఒక రచన బారుగా కాకుండా పొట్టీ పొడుగు పాదాలుగా విరక్కొట్టి రాయబడ్డది చూడగానే అది కవిత్వ రచన (లేదా ఈ రచన కవిత అని రచయిత ఉద్దేశిస్తున్నాడు) అనే స్ఫురణ రావడం సహజం. దూరపు ఉదాహరణ ఒకటి: గుల్జార్ పాటలు కొన్ని శుద్ధవచనాలు. అంటే గీతలక్షణాలు – ప్రాస, పల్లవి, చరణం ఇలా – లేనివి. ఏ బర్మనో, రహ్మానో వాటికి స్వరం ఇచ్చి పాటగా వాటిని స్ఫురింపజేశారు. (మేరా కుచ్ సామాన్ పాటకే అనుకుంటాను, ఆ సాహిత్యం చదివి ఆర్.డీ. బర్మన్ గుల్జార్‌తో “రేపు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వార్తలకి నన్ను ట్యూన్ కట్టమంటావు” అని అన్నాడని ఒక పిట్టకథ.) పద్య నిర్మాణ చట్రం అని నేనన్నది ఈ స్ఫురణను కలిగిస్తున్న రూపం. ఈ స్ఫురణనే నేను కవితా లక్షణం అన్నది. ఎందుకంటే ఒక్కసారి ఆ స్ఫురణ కలిగినతర్వాతే గదా మనం ఆ రచనని కవిత అన్న దృష్టితో చదువుతాం. అందువల్లనే పాదవిభజన లేదా బద్ధత వచన కవితకి ఒక నిర్మాణ లక్షణం (ఆభాసమైనది) అని నాకు తోచింది. అయితే ఇది నియతం కాదు. కవి ఇష్టాఇష్టాలపై ఆధారపడింది. పాదబద్ధత అనేది నియతమైన నిర్మాణలక్షణంగా అనిపిస్తున్నదేమో. అందుకని పాదవిభజన అని మాత్రమే వాడతాను.

    ఈ పాదవిభజన మీరన్నట్టే కవిత కవితకీ ప్రత్యేకం. అది కేవలం కవ్యుద్దిష్టమే. సందేహమేమీ లేదు. ఉండచ్చూ, ఉండకపోవచ్చు కూడా. చంద్ర దుఃఖం కవిత పాదవిభజన లేకపోవడం వల్ల మరింత తీవ్రమయింది. అదేవిధంగా ఆయన ఇతర కవితల్లో చేసిన పాదవిభజన. అందువల్ల కవికి తన ఏ కవితను ఏ రూపంలో ప్రచురించాలీ అన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నదని తెలుస్తున్నది. మీరుదహరించిన కవితలో భూషణ్ కూడా ఒక కారణం తోటే ఆ పాదవిభజన చేసుండాలి. పాదవిభజన చేస్తున్నప్పుడూ, చేయనప్పుడూ కూడా కవికి తన కవిత నిర్మాణంపై స్పష్టత ఉండాలని మాత్రమే నేనంటున్నది.

    2. “పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!” – ఈ వాక్యం రాస్తున్నప్పుడే ఇది అపోహకి తావిస్తుందనే అనుమానం నాకొచ్చింది. అప్పుడే సరిదిద్దుకోపోవడం నేను చేసిన తప్పు. నా ఉద్దేశం సంపత్కుమార భావగణాలు చదువరికి విరామం ఇవ్వడానికి ఉద్దేశించారని కాదు. భావగణాలను ఆయన ఏ రకంగా ఉద్దేశించారో అర్థం చేసుకుంటే ఆ రకంగా కూడా ఆలోచించడం ద్వారా కవికి తన పాదాల విరుపులో (కవిత నిర్మాణంలో) మరికొంత స్పష్టత రావడానికి ఆస్కారముంది, అని నా ఊహ. కేవలం అంతే.

    3. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందించడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను.

    కవితానిర్మాణం – పాదవిభజనతోనో, లేకుండానో, సౌష్టవం, లయ, గతులతోనో, అవేమీ లేకుండానో, మరేదైనానో – ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుందని నా అభిప్రాయం. అందువల్ల కవులు ఈ నిర్మాణంపై మరింత శ్రద్ధ చూపాలని, అందులో మెళకువలు అర్థం చేసుకోవాలనే నేనంటున్నది కూడా. అయితే, ఈ లక్షణాలని సాధారణీకరించమనిగాదు నా ఉద్దేశం. సాటి కవులు లేదా విమర్శకులు, ఏ కవి తన ఏ కవితలో ఎటువంటి నిర్మాణాన్ని వినియోగించాడు, అందువల్ల కవితకి మేలు జరిగిందా, హాని జరిగిందా? ఎలా? అని చర్చిస్తే, ఒక నిర్ధారణకు వచ్చినా లేకున్నా, ఆ చర్చలు ఈ విషయంలో ఇతర కవులకి, ఔత్సాహికులకీ ఉపయోగపడతాయని నేనన్నది. కవిత్వ విమర్శలో ఈ నిర్మాణ ప్రసక్తి లేకపోవడం ఒక లోటే (రూపవాదులని ఆక్షేపిస్తారని భయం కాబోలు). ఆ లోటు తీరాలనే నా కోరిక.

  4. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/27/2011 5:37 am

    రమగారూ,
    “పద్యం” అన్న పదాన్ని “కవిత” అనే అర్థంలో కొంతమంది కవులు, విమర్శకులు వాడారన్న విషయం నాకు తెలుసు. అయితే అది శాస్త్రీయం కాదన్నదే నా అభిప్రాయం, దానికే నా ముందు వ్యాఖ్యలో హేతువులు చూపెట్టాను. ముఖ్యంగా అలాంటి వాడుక అయోమయానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటి చర్చాంశమైన వ్యాస పరంపరలో, “వచన పద్యం” అన్న పదంలో పద్యం అంటే పాదబద్ధత ఉన్న రచన అనే ఉద్దేశ్యంలోనే తీసుకున్నారు కాని కేవలం “కవిత” అనే అర్థంలో తీసుకోలేదు. వచనకవితలని వచనపద్యాలు అనుంటున్నాం కాబట్టి అవి కచ్చితంగా పాదబద్ధం కావలసిందేనని సంపత్కుమారగారన్నారు. దాన్ని చేరాగారు కూడా ఖండించ లేదు! కవిత అనే అర్థంలో మాత్రమే “వచనపద్యాలు” అని, అవి వచనపద్యాలు కాబట్టి వాటికి పాదబద్ధత ఉండాలనడం సరైన వాదన కాదు కదా!

    వచనకవితా స్వరూపాన్ని గురించి వచనకవులు మరింతగా చర్చించాలన్న విషయమై మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా వ్యాఖ్యలోకూడా అదే అన్నాను. అలాంటి చర్చ చెయ్యడానికి అడ్డంకి ఏముంది? ఈమాటలో వ్రాసే/ఈమాటని చదివే వచనకవులు/కవయిత్రులు ఇప్పటికీ ఈ చర్చలో ఎందుకు పాల్గొనటం లేదో మరి!

    మాధవ్ గారూ,
    “ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది.” ఇక్కడ “పద్య నిర్మాణపు చట్రం” అంటే ఏమిటన్నది నాకు పూర్తిగా అర్థమవ్వలేదు. పాదబద్ధతా? లేక అక్షర, గణ, మాత్రా ఛందస్సా? అలాగే ఆ చట్రంలో ఉండటం వల్ల వచ్చే “కవితాలక్షణం” ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.

    “పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!”. రెండిటికీ తేడా ఉంది. ఎక్కడ విరామం ఇవ్వాలన్నది కవి ఊహబట్టి, కవిత బట్టి ఉంటుంది. దాన్ని భావము, భావాంశము అనే చట్రంలో బిగించడం సాధ్యం కాదు. ఒక కవితలో ఒక భావం పూర్తి కాకుండానే సగంలో పాఠకుణ్ణి హఠాత్తుగా ఆపాలని కవి అనుకుంటే, అక్కడ మధ్యలో పాదాన్ని ఆపవచ్చు. అది సంపత్కుమారగారు నిర్వచించిన “భావాంశం” అని చెప్పలేం. ఉదాహరణకి ఈ నెల ఈమాటలో వచ్చిన భూషణ్ గారి “శిశిరచిత్రాలు” కవితలో ఈ పంక్తులు చూడండి.

    కలిసిన రోజుల
    రంగురంగుల
    జ్ఞాపకాల ఆకులను
    పెళుసు కొమ్మలతో
    దులుపు కోవడమే
    మేలు.

    ప్రేమగా వీచినా అసలు
    ఆకులు రాల్చనంది

    ఇక్కడ “రంగురంగుల” అన్నది ఏ కోశానైనా భావాంశం అవుతుందా? “ప్రేమగా వీచినా అసలు” అన్న వాక్యంలో భావం కాని భావాంశం కాని పూర్తయ్యిందా? అయినా కవి పాదాలని అక్కడ విరిచాడంటె ఎందుకు? సంపత్కుమారగారు ఇలాంటి వాటిని exceptionsగా లేదా ఛందోదోషాలుగా పరిగణించారు. ఒక చట్రాన్ని ఊహించి దానికి లొంగని వాటిని దోషాలుగా పరిగణించడం కన్నా, ప్రతి కవితకీ తనదైన చట్రం కవి గీసుకుంటాడని అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ప్రస్తావించిన సౌష్టవం విషయమై కూడా నాదిదే అభిప్రాయం. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందిచడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను. ఇంగ్లీషు సాహిత్యంలో కవితా నిర్మాణం గురించి సాధారణీకరణలేమైనా చేసారేమో అందులో పరిచయమున్నవారెవరైనా చెప్పాలి. అది మనకి ఉపయోగపడే అవకాశం ఉంది.

  5. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/26/2011 3:38 pm

    లయ నీ .. కవిత్వ భావావేశాన్నీ.. కవితా రూపాన్నీ కట్టగలిపేసుకుంటూ మాట్లాడుకుంటూంటే అనేకమైన ఇబ్బందులు వస్తాయి. కవితావ్యక్తీకరణకి అవసరమైన రూపం ఆయా కవులు బతికిన కాలానికి అనుగుణం గానే రూపుదిద్దుకుంటుంది.మన ఇస్టాయిస్టాలతో ప్రమేయం లేకుండా కవితా రూపం మారుతూ వచ్చింది అన్ని కాలాల్లోనూను. చర్చ ఆ దిశగా సాగితే ఆధునిక కవితా రూపానికీ ఆధునిక కాలానికీ ఆధుని భావ వ్యక్తీకరణకీ ఉన్న లింకు దొరకొచ్చు.

    ఇకపోతే కవిత్వం రాయడం వరకూ కవుల పాత్ర గానీ అది అలాగే ఎందుకుందో..ఇంకెలాగో ఎందుకులేదో “వివరించడం”..విశ్లేషించడం” వగైరాలు కవులు చేసితీరవలసిన విషయాలు కావు. ఆ సమస్య అంటూ ఒకటి ఉంటే అది ఆ రూపాన్ని గురించి తర్జనభర్జనలు పడుతున్నవారిది మాత్రమే అవుతుంది. సృజనకారుల స్వభావం సృజనకి సంబంధించినంత వరకే!! వారి సృజనని గురించి వివరణలూ వ్యాఖ్యానాలు ఇచ్చుకోవడం కాదు.

    అలాగే మోహన గారు చెప్పినట్టు వాక్యాల్లో సైతం చందస్సుంటుంది. పద్యాలు సైతం వాక్యాల్లోనే ఉంటాయి. మామూలు వాక్యానికీ కవితా స్పురణతో ఉన్న వాక్యానికీ ఉన్న తేడావే సృజనలోని అందం అంతాను.ఇందుకు కవిత్వాన్ని తీసుకుని వివరిస్తూ చెప్పడం ఒక్కటే దారి. అయితే ఆ దారిని తీసేవాళ్ళు ఎవరైనా కావొచ్చు. కవులుకూడా కావొచ్చు. కవులుమాత్రమే కానవసరమూ లేదు. ఇది ఆసక్తికీ ఓపికకీ కలిపి సంబంధించిన విషయం గనక ఆ రెండూ పుష్కలంగా ఉన్న వారు ఇందుకోసం శ్రమించవచ్చు. చిట్టచివరికి అలాంటి వారికి తెలిసిన విషయం ఏమైనప్పటికీ అందువలన కవితా వస్తువూ కవితా రూపమూ మాత్రం ఏమీ ప్రభావితం మాత్రం కావు.

    రమ.

  6. సిరుల సంక్రాంతి గురించి _R.దమయంతి. గారి అభిప్రాయం:

    01/26/2011 10:58 am

    రావు గారూ, కిరణ్ గారూ! థాంక్సండి.

    R.దమయంతి.

  7. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి మోహన గారి అభిప్రాయం:

    01/26/2011 1:19 am

    తెలుగులో చంపూ కావ్యాలలో వచనము ఒక ముఖ్య భాగమే. కొన్ని వచనాలు పద్యాలంత అందంగా ఉంటాయి. వచనం వేరు, గద్యం వేరు. ఆశ్వాసాంతాలలో వచ్చేవి గద్యాలు, మిగిలిన పద్యేతరములు వచనములు. గణపవరపు వేంకటకవి వంటివారు వచనాలలో పద్యాలనే చొప్పించారు. ఎన్నో నవలలలో కొన్ని వర్ణనలు పద్యాలవలె అందంగా ఉంటాయి. ఆధునిక యుగంలో వచన కవితలనే వచన పద్యములని భావించవచ్చు. పద్యాలు కూడ ఒక విధంగా చూస్తే ఛందస్సు అనే చట్రములో రాయబడిన వచనాలే. పోతే పాద విభజన అనేది చదివే విధానంపైన ఆధారపడి ఉంటుంది. ఈ వచన పద్యం అనే పేరు ఆంగ్లములోని prose poem అనే పదానికి భాషాంతరీకరణ మేమో? వచన పద్యాన్ని గట్టిగా చదివితే పాద విభజన మనకు అవగతము కావచ్చు. ప్రతిరోజు Garrison Keillorగారి Writer’s Almanac చివర పద్యం వారు చదివేటప్పుడు వచన పద్యం నాకు జ్ఞాపకం వస్తుంది. ఛందఃపరముగా వచన పద్యపు పాదాన్ని ఒకే నిడివి లేని గణాల సముదాయమని భావించవచ్చును, ఒక విషమ వృత్తములాటిది. దీనిని గురించి నేను ఒకప్పుడు రచ్చబండ, ఛందస్సు సదస్సులో చర్చించాను. దానిని ఇక్కడ చదువగలరు. భావగణాలు వచనపద్యంలో మాత్రమే కాదు, పద్యాలలో, గేయాలలో కూడా ఉన్నాయి. భ-ర-న-భ-భ-ర-వ త్రిక గణాలతో రాయబడిన నాలుగు పాదాల ఉత్పలమాలను కూడ భావగణాలుగా విడదీయవచ్చు, దండాన్వయము ఒక విధముగా చూస్తే ఇలాటిదే.

    విధేయుడు – మోహన

  8. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav గారి అభిప్రాయం:

    01/25/2011 4:25 pm

    చక్కగా చెప్పారు కామేశ్వరరావు గారూ! ఈ చర్చ ద్వారా తెలుసుకునే కొసరు విషయాలే ఎక్కువ. లక్షణ నిరూపణమే ప్రధానమైన ఈ చర్చలో పాదవిభజన ప్రయోజనం గురించి చర్చ లేదు. అయినా, ఆ దిశలో ఈ చర్చ కొన్ని కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. ఈమధ్యనే వెల్చేరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకమాటన్నారు. (ఇది నామాటల్లో) ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది అని. ఆధునిక వచన కవిత్వానికి పాద బద్ధత ప్రయోజనం కూడా అదేనని నాకనిపిస్తుంది. ఇంగువ కట్టిన గుడ్డకి ఆ వాసన అంటినట్టు, పాద విభజన ద్వారానో, పద్యరూపం ద్వారానో కవితగా ఒక రచనని కనీసం స్ఫురింపచేయవచ్చు. ఇది రూపానికి సంబంధించిన వివరమే గానీ కవితాంశ (poesy)కు సంబంధించింది కాదనుకోండి.

    పాదబద్ధత లేని వచనకవిత్వం అనగానే నాకు చప్పున గుర్తుకొచ్చింది కన్నెగంటి చంద్ర రాసిన దుఃఖం కవిత. ఆయన ఆ కవితని ఒక పేరాగ్రాఫులా రాశారు. (కానీ అందులో కామాలు పాదాంత విరామాలుగానూ, పాదాంతాలు అంత్యప్రాసతోనూ ఉంటాయి. అందువల్ల అది పేరాగ్రాఫులా ఉన్నా చదివేటప్పుడు ఒరవడి ద్వారా ఒక అంతర్లయ ఆ కవితలో స్పష్టమవుతుంది.) ఇంకో ఉదాహరణ, శ్రీకాంత్ అనే కవి కొంతకాలం కింద ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించిన కవితలు, పూర్తి వచనంలా రాయబడినవి. ఇలా పాదబద్ధత ఏ మాత్రమూ లేని కవితలని ఉదాహరణలుగా చూపించి పాదవిభజన కేవలం కవి ఐచ్ఛికమే అని ఒప్పుకోవచ్చు. కానీ, సంపత్కుమార ప్రతిపాదించిన భావగణాల వివరణ, ఒక కవి పాదవిభజన – ఐచ్ఛికంగానే – చేయదలచుకుంటే, ఆ విభజనలో కవికి కొంతైనా సహాయపడుతుందని నాకనిపిస్తుంది. కానీ, ప్రయోజనం అన్నమాట వచ్చేటప్పటికి కవికి తన రచనపైన స్పష్టత ఉండాలనేది నిర్వివాదం.

    నాకిప్పటికీ ఎంతో ఆశ్చర్యాన్ని (కించిత్తు బాధనీ) కలిగించే విషయం ఒకటుంది. అది కవిత్వం అనేది హృదయాన్నుంచి ఒక భావావేశంలో ఉబికేదనీ, అందువల్ల దానికో సహజమైన స్వరూపం ఉంటుందనీ దానికి ఏరకమైన మార్పులు, పరిష్కరణలు చేసినా (అంటే మేధని ఉపయోగించడంతో) ఆ ఉద్వేగం పోతుందనీ ఇప్పటికీ నూటికి తొంభై మంది (ఎక్కువమంది కవులే) పైనే నమ్మడం. ఆవేశంలో తడబడుతూ మాట్లాడినప్పుడు, తన తడబాటు తనకే తెలియటం లేదనీ, కవి ఆవేశం మనకు అర్థమయినా తను ఏం మాట్లాడుతున్నాడో మాత్రం అర్థం కాదనీ, ఈ రెంటికీ తేడా ఉందనీ గమనించకపోవడం. అంటే చెప్పాలన్న ఆవేశమే తప్ప ఎలా చెపితే బలంగా ఉంటుంది అన్న విషయాన్ని విస్మరించడమే.

    కవితాంశను పక్కనపెడితే, ఈ నమ్మకం వల్ల కలిగే పెద్ద నష్టం, కవిత నిర్మాణంలో కొట్టొచ్చినట్టు కనపడే లోపాలు, అస్పష్టతానూ. ఉదాహరణకి, మీరన్నట్టే పాద విభజన ఒక విరామం కోసం అనే అనుకున్నా, అది కవి ఒక స్పష్టమైన ఆలోచనతో చేయవలసిందే కదా! అందరి విషయంలో కాకపోయినా, కవిత్వమనేది కేవలం హృదయ సంబంధి అనే నమ్మకం వల్ల, ఈ స్పష్టత కవికి అవసరం లేదు అని తప్పించుకునే వీలు ఒకటి ఏర్పడింది. పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా! (పాదవిభజన నియతమైనంత మాత్రాన వచన కవిత్వం ఛందోబద్ధమైనదన్న వాదన నాకు మింగుడు పడని విషయం.) అందువల్ల, ఈ చర్చ కవికి తన కవితను నిర్మాణ సంబంధమైన దృష్టితో మరొక్కసారి పరిశీలించడానికి, ఆ నిర్మాణాన్ని సరిదిద్దుకోడానికీ (అది ఎంత ఐచ్ఛికమైనా) కొంతైనా తోడ్పడుతుందని నా అభిప్రాయం. (నా స్నేహితులు వాళ్ళ కవితలని నాకు చూపించినప్పుడు, నేను గమనించే ఒక లక్షణం పాదం ఎక్కడ ఎందుకు విరిచారా అని. నేను అర్థం చేసుకోలేని ప్రతిసారి, ఆ విరుపు వెనకాల గల కారణాన్ని వివరించమనీ అడిగేవాణ్ణి. నాకు అర్థమైనా కాకపోయినా కవికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలన్నది నా అభిప్రాయం.) మొదటిసారి చదివినప్పుడూ, మళ్ళీ ఈ సంచికకోసం తయారు చేస్తున్నప్పుడూ, వచన కవిత్వ రూపంపై నా ఆలోచనలకి మరికొంత స్పష్టతనిచ్చింది ఈ చర్చ.

    ఉదా: వచనకవిత్వానికి ప్రాస, గతి, లయ ఇత్యాది నియమాలేవీ లేవు కాబట్టి అవి స్పష్టంగా ఉన్నా, అంతర్లీనంగా ఉన్నా పట్టింపేమీ లేదు అనుకోవచ్చు. అసలు లేక పోతే ఏ నష్టమూ లేదు. కానీ ఉన్న పక్షంలో కవితలో వాటికి ఒక సౌష్టవం ఉండాలా, అక్కర్లేదా? సౌష్టవం కేవలం శబ్దసంబంధిగానే కాదు, భావసంబంధిగా కూడా. ఒకే భావం లేదా పదం లేదా ఒక ఎక్స్‌ప్రెషన్ రికర్సివ్ ఎలిమెంట్‌గా ఉంటే ఆ రికరెన్స్ లో యూనిఫార్మిటీ ఉండాలా? అక్కర్లేదా? అలాగే, ఒక కవిత మొత్తం వేర్వేరు అలంకారాలతోనో, భావవ్యక్తీకరణలతోనో ఒకే అంశం గురించి పునః ప్రస్తావించే సందర్భాల్లో ఈ సౌష్టవం రూపంలోకానీ భావపునశ్చరణలో గానీ ఉండటం అవసరమా? ఉంటే అందువల్ల నిర్మాణం మరింత బలంగా ఉంటుందా? ఇది సౌష్టవం వల్ల స్ఫురించే లయ ప్రభావమా? (నిర్మాణం బలంగా ఉండటమంటే, కవి ఉద్దేశించిన భావం పాఠకుడికి మరింత స్పష్టంగా చేరడానికి సహాయపడేట్టుగా ఉండటం.) కనకప్రసాద్ గారి భాషలో చెప్పాలంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో తక్కువవుతుందా? ఇలా ఎన్నో.

    వచన కవిత్వ రూపం గురించి మరింత చర్చ జరగాలన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే, ఇందుకు ముందడుగు వేయాల్సింది కవులు. (రమ గారనుకుంటున్నట్టు వారినెవరూ ‘అటుంచ’లేదు, ‘అడగకుండా ఉండా’ లేదు. వారే ఏమీ మాట్లాడ్డం లేదు ఈ విషయం గురించి. ఎవరైనా మాట్లాడి వుంటే నాకు తెలిపితే చాలా సంతోషిస్తాను.) సమర్ధులైన కవులకి ఇవన్నీ సహజప్రతిభతో అర్థమయిన అంశాలై, అవి వారి కవితల్లో ప్రతిఫలిస్తాయని అనుకుందాం. అటువంటి కవితల నిర్మాణాన్ని పరిశీలించి విమర్శించాల్సిన బాధ్యత సాటి కవులదే ముందుగా. అయితే చేరాగారన్నట్లు కవిత్వం గురించి కవిత్వంలొ చెప్తే అది లక్షణం కాదు. ఆ విమర్శల ద్వారా ఏ నిర్మాణ లక్షణాలని ఉపయోగించుకోడం ద్వారా కవిత మరింత బలంగా తయారవుతుందో సామాన్య కవులకు, ఔత్సాహికులకు అర్థమవుతుంది. (కవులు అంటే కవితలు అచ్చువేసినవారే అని కాదు, కవిత్వాన్ని ఆనందించి, దాని లక్షణాలను గురించి ఆలోచించేవారు కూడానూ.) ఈ నిర్మాణ లక్షణాలని వాడినంత మాత్రాన ఇత్తడి బంగారమవదు. కానీ, బంగారం ఇత్తడిలా కనిపించకుండా పోడానికి చిన్న ఆస్కారం ఉంటుంది.

  9. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/25/2011 2:28 pm

    “నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
    పద్యాల నడుముల్ విరుగదంతాను:” [ ఆత్మకధ అనే తన వచన పద్యం లో పఠాభి]……………….అని పఠాభి అన్నప్పుడూ లేదా అదే అర్ధం లో మిగతా వచనకవులు అన్నప్పుడూ పద్యాన్ని “కవిత్వం” అనే అర్ధం లోనే వాడుతున్నట్టుగా అర్ధం అవుతుంది.

    పద్యాలకి చందస్సులోరాయబడినవన్న ప్రముఖమైన అర్ధం ప్రచారంలో ఎలా ఉందో అలాగే ఉదాహరణకి తిక్కనగారు మంచి పద్యాలు రాసేరు” అని అన్నప్పుడు అలాంటి వాక్యాలనించి ఆయన మంచి చందస్సుని రాసేరు అనేదాని కన్నా మంచి కవిత్వం రాసేరు అనే అర్ధమే వస్తుంది. అంటే అలాంటి మెచ్చుకోలు వాక్యం ఆయన కవిత్వానికి సంబంధించినదే అవుతుంది.. ఇది వ్యవహారంలో వాడుకకి సంబంధించినది. ఒక పదాన్ని ఒక కాలంలో దాని అర్ధాన్ని విస్తరించి వాడితేనో..లేదా కవిత్వం అన్న అర్ధ స్పురణలో దాన్ని ప్రయోగిస్తూ దాన్ని కవిత్వానికి పర్యాయంగా వాడుతున్నట్టుగా సూచన చేస్తూ దానికి ఉన్న చందోలక్షణాన్ని దాటి వాడుతున్నట్టు ఆ సూచనలో నే ఆ పదానికి ముందు “వచన” అన్న విశేషణాన్ని కూడా చేర్చి ప్రాచుర్యంలోకి తెచ్చినప్పుడో మరింక కామేశ్వరరావుగారి సందేహానికీ..లేదా అభ్యంతరానికీ అక్కడ చోటు లేదు.

    ఇక వచన కవిత్వానికి ఇంకా సరైన లక్షణ నిర్దేశమే స్పష్టంగా జరగకుండానే..దాని రూపం మీద ఇధమిథ్థమైన అభిప్రాయానికి కూడా రాకుండానే అది పొడుగూ పొట్టి వాక్యం … ఫ్రీ వెర్స్ ని “పొలై పొలై” కవిత్వం అన్న అబ్బూరి వ్యంగ్యం …అలాగే వచన కవిత్వం అన్న మాటే “మిల్లు ఖద్దరు” లాంటిదంటూ అబ్బూరి వరద వెక్కిరించిన రీతి లోనే…చందస్సుని అభిమానించేవారూ..అటువంటి తోవలో నడిచేవారూ భావించడమే తప్ప..అసలు వచన కవిత్వం తాలూకు ఉద్దేశ్యమూ.. అది సాధించిన ప్రయోజనమూ..ఆధునిక జీవితంలో ఈ ఆధునిక కవితాప్రక్రియ తెచ్చిన పఠనానుభవమూ వీటిని నిగ్గుతేల్చే దిశగా జరిగిన ప్రయత్నాలు ఇప్పటికీ తక్కువే !!

    ఇంక ఈ కవిత్వంలో ప్రధాన పాత్ర అయిన కవులని అటుంచి ఈ చర్చలు ఎన్ని చేసినా ఏమిటీ ప్రయోజనం?? అసలు కవులైన వాళ్ళు మాట్లాడవలసిన విషయాలని వారితో సంబంధం లేకుండానే తమలోతాము చర్చలు చేసుకుంటూ ఇలా ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా మాత్రం ఏమి ఫలితం ఉంటుందీ??

    అదీ కాదూ..ఆధునిక వచన కవిత్వంలో ముఖ్యమైన కవులనీ వారికవిత్వాన్నీ ఆయా కవుల మనోభావాలనీ [ ఆ కవితా నిర్మాణంలో] ముఖ్యంగా పరిగణించినప్పుడుకదా కొంతైనా వీలుచిక్కేది ఈ సందేహాలకి. ఆ దిశగా ఏ విమర్శకులూ ఎందుకని ప్రయత్నాలు చేయలేదూ??

    ఒక అంతర్ లయ ఎలాంటి భావనకైన వ్యక్తీకరణలో ఉందేమో గమనించాల్సి ఉంటుంది ముందు. వచనకవితానిర్మాణపు వాక్యాల వ్యాకరణ చట్రాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాల్సిఉంటుంది. సమస్య ఏమంటే సమకాలం లో ఉన్న కవులని పక్కకి నెట్టి వారిని తమ సందేహ నివృత్తి చేయమని ఒక్క విమర్శకుడూ అడగకుండానే ఇలాంటి చర్చలు నడపడం విమర్శకుల చర్చల్లోని పాక్షిక దృష్టికి ఒక మచ్చుతునక తప్ప వేరుకాదు మరి. అందువలన ఇటువంటి చర్చలు చేసిన వాళ్ళూ ..వీటిపై తమతమ సగంసగం సందేహాలతో ప్రశ్నలు గుప్పించేవాళ్ళూ కూడా వచనకవిత్వం పట్ల వచనకవిత్వం రాసిన వారి విషయంలోనూ అపరిణితమైన సంకల్పం కలిగి ఉన్నట్టు కనిపిస్తూంది.

    రమ.

  10. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/25/2011 9:15 am

    సంపత్కుమార, చేరాగార్ల యీ చర్చ కొద్ది కాలం కిందటే నేను చదివాను. దాని వల్ల అసలు విషయం కన్నా కొసరు విషయాలు అనేకం తెలుసుకున్నాను. ముఖ్యంగా, వృత్తాలకి “భరనభభరవ – ఉత్పలమాల” అన్నట్టుగా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న లక్షణం, ఈ వ్యాసాలు చదివాకే అనుకుంటాను, అది కేవలం వెసలుబాటుకే తప్ప అసలు లక్షణం గురులఘు క్రమమే అన్న realization కలిగింది! అలానే మరెన్నో ఛందోవ్యాకరణాంశాలు కూడా తెలిసాయి. ఇక అసలైన, “వచన పద్య లక్షణం” విషయానికి వస్తే, దాని గురించి నా అభిప్రాయాలివి:

    1. అన్నిటికన్నా ఈ చర్చలో నన్ను ఆశ్చర్యపరచిన విషయం, “వచన పద్యం” అన్న పేరుకి చేరాగారు కాని నాగరాజుగారు కాని పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం. నాకున్న పెద్ద అభ్యంతరం ఆ పేరు! “పద్యం” అన్నది ప్రక్రియా రూపాన్నే కాని కవిత్వాన్ని సూచించే పదం కాదన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రాచీన సాహిత్యంలో కూడా పద్యాలలో శాస్త్రాలవంటి కవిత్వేతర రచనలూ, అలాగే గద్యంలో కావ్యాలూ ఉండనే ఉన్నాయి. మరి “వచన” అన్న పదం కూడా అది కవిత్వం అన్న విషయాన్ని సూచించదు. అది దేన్ని సూచిస్తుందో ఈ వ్యాసాల్లో స్పష్టంగా ఎవరూ నిర్వచించినట్టు లేదు. వాడుకలో “ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్య” అన్న అర్థం ఉంది. అంటే ఇది కూడా రూపాన్నే సూచిస్తోందన్న మాట. ఇందులో “కవిత్వం” అని సూచించే పదమే లేకపోతే ఈ ప్రక్రియకి కథ, నవల మొదలైన ఇతర ప్రక్రియలతో ఉన్న తేడా ఎలా తెలుస్తుంది? అంతే కాదు, “వచన”, “పద్యం” అనే పదాలకున్న వ్యతిరేకార్థాల వల్ల ఆ రెండూ కలిపిన పదం ఒక oxymoron అవుతుంది! వచన కవిత్వానికి పాదబద్ధత మౌలికమైన లక్షణం అనుకుంటే, అది ఇప్పటి వరకూ ఉన్న ఛందస్సు కన్నా విభిన్నమైనది అనుకుంటే, అలాంటి ఛందస్సుకి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి – వృత్తాలు, జాతులు, ఉపజాతులు, గేయాలు (మాత్రా ఛందస్సులోని పద్యాలు) అన్న పేర్ల లాగా. ఉదాహరణకి భావుకములు అందాం (భావ ప్రాధాన్యం కలిగినవి కాబట్టి). ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన పద్యాలు కలిసి పద్య కవితా ఖండిక అయినట్టుగానే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన భావుక పద్యాలు కలిస్తే మనం మామూలుగా చెప్పే “వచన కవిత” అవుతుంది. అందువల్ల, “వచన కవిత”కి “వచన పద్యం” అన్న పేరు సమంజసం కాదు.

    2. నాకు ఆశ్చర్యంగా తోచిన మరొక విషయం అందరూ ఆధునిక వచన కవిత్వానికి పాదబద్ధతని అంగీకరించడం. వచన కవిత్వంలో కనిపించే పాదా విభజన ఐచ్ఛికమా, నియతమా అని ఎవరూ ప్రశ్నించినట్టు లేదు! పాద నిర్మాణానికి నిర్దిష్ట నిర్వచనం సాధ్యమవ్వదు అన్న చేరాగారు కూడా, పాదవిభజన మాత్రం తప్పనిసరే అనుకున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా అప్పట్లో వచ్చిన కవిత్వం (ఇప్పటికీ కూడా) చాలా వరకూ పాదాలుగా విభజించబడే ఉండడం దీనికి కారణం కావచ్చు. నా దృష్టిలో అలంకారాల మాదిరిగానే, పాద విభజన కూడా వచనకవిత్వంలో ఐచ్ఛికమే తప్ప కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదు. కాబట్టి వచన కవితలు అసలు పద్యాలు అవ్వాల్సిన అవసరమే లేదు. ఆధునికంగా వచ్చిన వచన కవిత్వానికి ఊపిరే స్వేచ్ఛ. ఛందస్సు (కొండొకచో వ్యాకరణ) శృంఖలాలను తెంచుకోడమే వాటి వెనకనున్న స్ఫూర్తి. కాబట్టి, ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని, పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?

    3. నా ఉద్దేశంలో ఈ చర్చలో ప్రస్తావనకి నోచుకోని అతిముఖ్య విషయం ఒకటుంది. వచన కవితల్లో పాదవిభజన ప్రయోజనం ఏమిటి అన్నది. వచన కవితలు చాలా వాటిల్లో పాదవిభజన కనిపిస్తుంది. దానికి నిర్దిష్టమైన సూత్రాలు లేకపోయినా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి కవులీ పాదవిభజన చేస్తారు? పాదవిభజనతో కూడిన రూపం, కవితకి ఎలాంటి అదనపు విలువని చేకూరుస్తుంది? వచన కవిత్వ రూపానికి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు విమర్శకుల దృష్టికి అంతగా వచ్చినట్టు లేదు. దీనివల్ల అటు వచనకవిత్వం రాసే కవులకి గాని, దాన్ని చదివే పాఠకులకి గాని ఈ విషయమ్మీద సరైన అవగాహన ఏర్పడ లేదనిపిస్తుంది. వచనకవిత్వ రూపమ్మీద జరిగిన ఈ చర్చలో ఈ విషయాన్ని పరిశీలించడానికి చక్కని ఆస్కారం ఉన్నా, కేవలం లక్షణ నిరూపణ వైపే దృష్టంతా కేంద్రీకరించడం వల్ల, అది జరగలేదు. ఇప్పటికైనా దీనిపై ఎవరైనా, ముఖ్యంగా వచనకవిత్వం రాయడంలో చెయితిరిగిన కవులు, దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు వచనకవితా రూపంలో పాదవిభజన ఒక శక్తివంతమైన పరికరంగా మారే అవకాశం కలుగుతుంది. పాదవిభజన వల్ల నాకు కనిపించే రెండు సాధారణ ప్రయోజనాలు ఇవి:

    ఒకటి, ఆ పాదంలో చెప్పిన విషయం పాఠకుడి మనసుకి పట్టేందుకు ఒక విరామం ఇవ్వడం. ఇది పాదవిభజన లేకుండా కామా, ఫుల్స్టాప్ వంటి గుర్తులతో కూడా చెయ్యవచ్చు. అయితే, అచ్చులో కవితని చదివేటప్పుడు, ఈ రెండు చిహ్నాలు కన్నా కూడా మొత్తం వాక్యాన్ని ఆపి వేస్తే చదువరి మరింత ఎక్కువసేపు అక్కడ విరామమిచ్చే అవకాశం ఉంటుంది.

    రెండు, సాధారణ వచనంలోని వాక్యాలు వ్యాకరణబద్ధంగా ఉంటాయి. కాని, ఆధునిక కవిత్వంలో వ్యాకరణ అతిక్రమణ చాలా చోట్ల కనిపిస్తుంది. అంచేత అది మామూలు వచనంలాగా రాసుకుంటూ పోతే చదివే పాఠకునికి చిరాకు కలిగే అవకాశం ఉంది. అదే పాదవిభజనతో రాస్తే, అవి వాక్యశకలాలుగా అనిపించి పాఠకుడికి చిరాకు కలగదు.

    ఈ సాధారణ ప్రయోజనాలు కాకుండా కవి ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పాదవిభజనని వాడుకోవచ్చు. అలాంటి సందర్భాలుంటే వాటిని పాఠకులు, విమర్శకులూ గుర్తించగలిగే మార్గాలు అన్వేషించాలి.

« 1 ... 1087 1088 1089 1090 1091 ... 1583 »