2025వ సంవత్సరానికిగాను జ్ఞానపీఠ పురస్కారం వైరముత్తుకు లభించింది. దీని చుట్టూ సాహిత్యప్రపంచంలో రకరకాల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పురస్కారం వైరముత్తును వరించడం సముచితమేనని సమర్థించేవారు ఒకవైపు, ఆయన ఈ పురస్కారానికి అనర్హుడని జ్ఞానపీఠ కమిటీని విమర్శించేవారు మరొకవైపు ఉండటంతో సాహిత్యలోకం రెండుగా విడిపోయింది. ముఖ్యంగా తమిళ సాహితీవేత్తలు సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
సాధారణంగానే పురస్కారాల చుట్టూ ఏదో ఒక రాజకీయం నడుస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎన్నడూ లేనంత స్థాయిలో వ్యతిరేకత రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది: వైరముత్తుకు ఈ పురస్కారం ఇవ్వడం ద్వారా తమిళ సాహిత్యపు ఔన్నత్యాన్ని తగ్గించారని. రెండవది: వైరముత్తుపై పలువురు స్త్రీలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు.వ్యతిరేకిస్తున్న వారి వాదనలేంటి?
- సినిమా సాహిత్యం vs సీరియస్ సాహిత్యం: వైరముత్తు రాసిన సినిమా పాటలకు ఈ పురస్కారం ఇచ్చారా? ఒకవేళ అదే నిజమైతే, జ్ఞానపీఠ పురస్కారాన్ని సినిమా సాహిత్యానికి ఇవ్వడం ఎప్పటినుండి మొదలుపెట్టారు? గతంలో బాబ్ డిలన్‌కు నోబెల్ బహుమతి ఇచ్చినట్టు, వైరముత్తు సినీ సాహిత్యానికి ఇస్తున్నామని స్పష్టంగా చెప్పి ఉంటే వివాదం ఉండేది కాదన్నది వీరి వాదన.
- కవిత్వ స్థాయి: ఒకవేళ ఆయన కవిత్వానికి ఈ పురస్కారం ఇచ్చి ఉంటే, అందులో కవిత్వపు విలువలు చాలా తక్కువని విమర్శకుల భావన. వైరముత్తు రచనలు గొప్ప ఆధునిక కవిత్వమని దేశవ్యాప్తంగా చాటిచెప్పడం, ఆధునిక తమిళ కవిత్వస్థాయిని తక్కువగా చూడడమేనని వారు వాదిస్తున్నారు.
- కథా, నవలా సాహిత్యం: ఆయన రాసిన నవలల్లో కానీ, కథల్లో కానీ వస్తువు (సారం) లేదని, ఆ రచనలు కేవలం ‘పల్ప్ ఫిక్షన్’ (సాధారణ స్థాయి రచనల) కంటే తక్కువని కొందరి అభిప్రాయం. అటువంటి రచనలకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం తమిళ సాహిత్యాన్ని అవమానించడమేనని వారు భావిస్తున్నారు.
మొత్తానికి ఆయన కవిత్వంలోనూ, నవలల్లోనూ సాహితీ విలువలు అధమస్థాయిలో ఉన్నాయని వీరి ఆరోపణ. అంతేకాకుండా, వైరముత్తు మొదటినుండి ఉన్నత పదవుల్లో ఉన్నవారిని ప్రసన్నం చేసుకుని, వారి ద్వారా పురస్కారాలు పొందడంలో దిట్ట అని విమర్శలు ఉన్నాయి.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో అణ్ణాదురై, కరుణానిధి వంటివాళ్ళు తమిళ భాషా అస్తిత్వ ఉద్యమాన్ని తమ పార్టీ సిద్ధాంతంగా చేసుకుని రకరకాల ఉద్యమాలు చేశారు. కరుణానిధి, అణ్ణాదురైవంటివాళ్ళు వాళ్ళ సిద్ధాంతాల ప్రచారానికి పత్రికలు నడిపారు, సినిమాలకు కథలు రాశారు, సంభాషణలు రాశారు. ముఖ్యంగా కరుణానిధి సంభాషణలు రాసిన ఎన్నో సినిమాల్లో వాళ్ళ పార్టీ సిద్ధాంతాలే సంభాషణలకు ముడిసరుకులు. ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయగల ప్రాసలతో కూడిన సంభాషణలు రాయడంలో కరుణానిధి దిట్ట. రాష్ట్రమంతా కరుణానిధి ఆధ్వర్యంలో కవిసమ్మేళనాలు నిర్వహించేవారు. ప్రచార దృష్టితో నిర్వహించే ఆ కవిసమ్మేళనాల్లో చదివే ఆ కవితల్లో ప్రధానంగా ఉండాల్సింది వినేవాళ్ళని రెచ్చగొట్టి ఆవేశపూరితులను చేయగల ప్రాసలు, అలంకారాలు, మాటల గారడీలు, పాలకులను దుయ్యబట్టే భావాలేగానీ కవిత్వం కాదు. వీటికి లభించిన ప్రజాదరణను చూసి ఎంతోమంది ప్రభావితులయ్యి ఈ పంథాలోనే కవితలు రాస్తూ కవులుగా అవతారమెత్తారు. అప్పట్లో వీళ్ళు రాసే ఈ తరహా కవితలు అత్యధికంగా ‘వానంబాడి’ అన్న పత్రికలో వెలువడేవి. ఆ కారణం చేత ఈ రీతిలో కవితలు రాసేవాళ్ళను వానంబాడి కవులు అనేవారు.
ఆ దశకాల్లో బడిలో చదువుకుంటున్న వైరముత్తు మీద వాళ్ళ ప్రభావం బాగా పడింది. ఆ స్ఫూర్తితోనే బాలుడైన వైరముత్తు కవితలు రాసేవాడు, కరుణానిధి సినిమా డయలాగులు కంఠతా పట్టి తన తోటి విద్యార్థులకు వినోదం కల్పించేవాడు. కణ్ణదాసన్ సినిమా పాటలకీ, కరుణానిధి మాటలకీ వీరాభిమాని అయ్యాడు.
బడి చదువులు పూర్తయ్యి పచ్చయప్ప కాలేజీలో బి.ఎ చదువుకై మద్రాసు చేరిన వైరముత్తు 19 ఏళ్ళ వయసులో ‘వైగఱై మేఘంగళ్’ (వేకువ మేఘాలు) పేరిట కవితా సంపుటం రాశారు – అందులో ఉన్న కవితలన్నీ ఛందోబద్ధమైనవే! ఆ పుస్తకానికి ఏ కవిచేతనో కాక, సినీ గేయ రచయిత, తన మానసిక గురువూ అయినట్టి కణ్ణదాసన్ చేత ముందుమాట రాయించుకున్నారు. చిన్నతనంలోనే సినిమాలకు పాటలు రాయాలన్న తన కలను సాకారం చేసుకోడానికి కావలసిన మార్గాలవైపుకు అప్పుడే తన ప్రయత్నాలన్నిటినీ మొదలుపెట్టేశారు.
కాలేజీలో చేరాక రాష్ట్రవ్యాప్తంగా ద్రావిడ ఉద్యమ కవిసమ్మేళనాల్లో పాల్గొని కవితలు చదివేవారు. ఈయనకున్న అపారమైన వాగ్ధాటి వినేవారిని కట్టిపడేయగలదు! ఈ రకంగా కరుణానిధికి బాగా దగ్గరివారై పోయారు. ఎటువంటివారినైనా పొగిడి తన బుట్టలో పడేసుకోగల ప్రతిభ వైరముత్తు సొంతం. ఎమ్.ఏ. చదువు ముగించేలోపు మరో రెండు కవితా సంపుటాలను వెలువరించారు.
కరుణానిధి సిఫారసుతో ప్రభుత్వ ఉద్యోగం, పెళ్ళి అని జీవితంలో స్థిరపడగానే తన పక్క ఊరివారైన దర్శకుడు భారతీరాజా చేతికి తన రెండో కవితా సంపుటాన్ని అందజేసి సినిమా పాటల అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తొలి పాటతోనే ఇళయరాజాతో కలిసి పనిచెయ్యడం, పాట సూపర్ హిట్ కావడం, ఆ తర్వాత ఐదారేళ్ళు దాదాపుగా ఇళయరాజా సంగీతం చేసిన సినిమాలన్నిటిలోనూ వైరముత్తుకు అవకాశాలు రావడంతో వైరముత్తు కీర్తి ఎంతో ఎత్తుకు ఎదిగింది. అప్పటివరకూ కొనసాగుతూ వస్తున్న తమిళ చలనచిత్ర గీతాల సాహిత్యపు రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేసి కొత్తగా తీర్చిదిద్దడమే అందుకు కారణం. అప్పటివరకు పండిత భాషతోనూ, ప్రాచీన సాహిత్య పద్ధతిలో సాగిన ఉపమానాలనూ పక్కకు నెట్టి వచన కవిత్వపు భాషనూ, పల్లెటూరి మాటలనూ, కొత్త తరహా ఉపమానాలనూ సినీగేయ సాహిత్యంలో పొందుపరిచారు వైరముత్తు.
ఈ రకంగా వైరముత్తు చేసిన వినూత్న ప్రయోగాలు ఇళయరాజా పాటలకు కూడా మరింత కొత్తదనాన్ని చేకూర్చాయి అంటే ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు. చెప్పాలంటే వైరముత్తు సినీరంగ ప్రవేశం చేశాక కణ్ణదాసన్ రాసిన అతి కొన్ని పాటల్లో కూడా ఈ కొత్త పోకడను గమనించవచ్చు.
వరుసగా భారతీరాజా, బాలచందర్, శ్రీధర్, సింగీతం శ్రీనివాసరావు, కె.విశ్వనాథ్, వంశీవంటి పెద్ద దర్శకుల తమిళ సినిమాలకు వైరముత్తు తప్పనిసరి గేయరచయిత అయ్యారు. గేయరచయితగా తన ప్రయాణం మొదలు పెట్టిన ఐదేళ్ళకే ‘ముదల్ మరియాదై’ సినిమాకుగాను ఉత్తమ గేయరచయితగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఆ పురస్కారం వచ్చిన ఏడాదికే ఇళయరాజాతో మనస్తాపాలొచ్చి విడిపోయారు.
దర్శకులు అటు ఇళయరాజానీ వదులుకోలేక, ఇటు వైరముత్తునీ వద్దనుకోలేక కొన్ని సినిమాలకు ఇళయరాజాని, మరికొన్ని సినిమాలకి వేరే సంగీత దర్శకులనీ అమర్చుకున్నారు. ఇలా నాలుగైదేళ్ళు కొనసాగింది – అప్పట్లో భారతీరాజా, బాలచందర్ వంటి దర్శకులు పలువురు కొత్త సంగీత దర్శకులను కేవలం వైరముత్తు కోసమే సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చారు. ఆ కొత్త సంగీత దర్శకులను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగానే ఎ.ఆర్.రహ్మాన్ అన్న యువ సంగీత దర్శకుణ్ణి పరిచయం చేశారు దర్శకులు మణిరత్నం – ఈ సినిమాకు నిర్మాత బాలచందర్.
ఎ.ఆర్. రహ్మాన్ రాక వైరముత్తు జీవితంలో మరో కొత్త అధ్యాయానికి రెక్కలు తొడిగింది. రహ్మాన్ పాటలు ఇతర భాషల్లోకి వెళ్ళడం, వాటిమూలంగా వైరముత్తు మూలభాషలో రాసిన సాహిత్యంలోని వినూత్న ప్రయోగాలను చూసి ఇతర భాషల వారు కూడా వైరముత్తు అన్న గేయరచయిత పేరును గుర్తుపట్టడం జరిగింది. వరుసగా మళ్ళీ జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారాలు వైరముత్తును వరించడం మొదలైంది. ఈ దశలో టీవీ, ఇంటర్నెట్ మాధ్యమాలను వైరముత్తు చక్కగా వాడుకున్నారు.
సినిమా పాటలు రాస్తూనే ఆయన తన ధోరణిలో కవితా సంపుటాలు, వ్యాస సంపుటాలు, నవలలూ కూడా రాస్తూ వచ్చారు. ప్రతి సంవత్సరమూ తన పుట్టినరోజుకు ఒక పుస్తకాన్ని కరుణానిధి చేతుల మీదుగా ఆవిష్కరించేవారు వైరముత్తు. తనకున్న ధనబలంతోనూ, రాజకీయ పలుకుబడితోనూ ఈ ఆవిష్కరణ సభలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించి అన్ని మాధ్యమాల్లోనూ ఆయన పేరు మారుమ్రోగేలా చేసుకున్నారు. సభకు హాజరైన ముఖ్యాతిథులను, ప్రేక్షకులను, కార్యనిర్వాహకులనూ, పాత్రికేయులనూ అందర్నీ తన వాగ్ధాటితో పొగిడి తన వశం చేసుకుంటారు.
కరుణానిధికి సన్నిహితంగా ఉంటూనే జయలలిత పార్టీలోని మంత్రులతోనూ సత్సంబంధాలతో మెలిగేవారు వైరముత్తు. వైరముత్తు విమర్శకులు ముద్దుగా వైరముత్తును ‘కాకా కవి’ అని అంటారు – అంటే తన లబ్ధి కొరకు ఎవరినైనా కాకా పట్టగలడు అని. వాజపేయీ ప్రధానమంత్రి అయిన రోజుల్లో, వాజపేయీ హిందీ కవితలను అరవభాషలోకి అనువదించి ఆ పుస్తకాన్ని వాజపేయీ చేత ఆవిష్కరింపజేసారు.
భారత ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ గేయరచయిత పురస్కారాన్ని ఇప్పటివరకు వైరముత్తు ఏడుసార్లు అందుకున్నారు. వీటితోబాటు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలూ అందుకున్నారు. 2003వ సంవత్సరం ‘కళ్ళిక్కాట్టు ఇతిహాసం’ అన్న నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్నారు.
ఉత్తమ గేయరచయితగా ఆయనకు లభించిన పురస్కారాలలో కొన్ని ఆయన ప్రతిభకు న్యాయమైన గుర్తింపుగా పరిగణించినప్పటికీ, మరికొన్ని పురస్కారాలు రాజకీయ లాబీయింగ్ కారణంగా తెచ్చుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటివి వచ్చినప్పుడు ఎవరూ వాటి గురించి వివాదాలు రేకెత్తించలేదు. సాహిత్య అకాడమీ పురస్కారానికి అతి స్వల్పంగానే వ్యతిరేకత వచ్చింది.
ఇప్పుడు వైరముత్తుకు ఇచ్చిన ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని తమిళ సీరియస్ సాహిత్యం రాసే పెద్ద రచయితలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పలు రచయితల సంఘాల వారు జ్ఞానపీఠ కమిటీకి ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలు రాస్తున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఖండిస్తూ వ్యాసాలు రాస్తున్నారు.
మరోకోణం – మీటూ ఆరోపణలు
మరోవైపు, మీటూ (#MeToo) ఉద్యమ సమయంలో గాయని చిన్మయి వంటి వారు ఆయనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, ఇటువంటి గౌరవప్రదమైన పురస్కారం ఆయనకు ఇవ్వడం ఏమాత్రం సమర్థనీయం కాదని మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి.
ముగింపు
వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం దక్కడం అనేది కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు; అది ఆధునిక సాహితీరంగంలో పరస్పరవిరుద్ధమైన విలువల మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధానికి ప్రతీక. ఒకవైపు కోట్లాదిమందిని అలరించగల జనరంజక రచనాశైలి, మరోవైపు ఆయన సాహిత్యంలోని లోతు లేమిని, నీతిరాహిత్యాన్ని ప్రశ్నించే విమర్శకుల గళం. పురస్కారాలు ప్రతిభకు గుర్తింపు మాత్రమే కాదు, వాటి ద్వారా సమాజానికి ఒక సందేశం అందుతుంది కూడా.
అత్యున్నత పీఠంపై కూర్చున్న వ్యక్తి కేవలం అక్షరవిన్యాసాల్లో మేటి అయితే సరిపోతుందా? లేక ఆ అక్షరాల వెనుక ఉన్న వ్యక్తిత్వం కూడా ఆ పీఠానికి గర్వకారణంగా ఉండాలా? అన్నది నేడు సాహిత్యలోకం ముందున్న అతిపెద్ద ప్రశ్న. రాజకీయ పలుకుబడి, ప్రజాకర్షణ తాత్కాలికంగా పురస్కారాలను తెచ్చిపెట్టవచ్చు కానీ, చరిత్ర పుటల్లో ఒక రచయితకు దక్కే గౌరవం ఆయన సృష్టించిన సాహిత్యపు విలువల మీద, పాటించిన నైతికత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అక్షరం సత్యం కావాలి, ఆ అక్షరాన్ని నడిపించే కలం నిష్కళంకం కావాలి. అప్పుడే ఆ పురస్కారానికి, పురస్కారాన్ని అందుకున్న వ్యక్తికీ పరిపూర్ణమైన సార్థకత లభిస్తుంది.
చివరికి, కాలమే అన్నిటికీ అతీతమైన న్యాయనిర్ణేత. అధికార బలం, ప్రచార ఆర్భాటాల నడుమ దక్కిన ఈ ‘జ్ఞానపీఠం’ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందా, లేక వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

