ఐదు రోజులు గడిచాయి.
ఆరవ రోజు ఘాప్ నుంచి మా ట్రెక్‌లోని రెండవ ఘట్టం మొదలయింది. ఈ రెండవ భాగంలో మేము మధ్య హిమాలయాల్లో సంచరిస్తామన్నమాట. మెల్లమెల్లగా ఎత్తులు పెరుగుతూ వెళతాయి. అయినా మొదటి విడత దిగువ హిమాలయాల్లో మేము నడిచిన దారులతో పోలిస్తే ఈ భాగం స్థూలంగా సులువైనది అని విన్నాం. ఐదు రోజులుగా గడించిన అనుభవం, ఆత్మవిశ్వాసం ఎలానూ మాకు తోడుగా ఉంటాయి.గంటసేపు నడిచాక ఓ చిరుగ్రామం తటస్థపడింది. గ్రామపు మొగలో పొడవాటి మణికుడ్యం… ఊళ్ళోని ఇళ్ళ ముంగిళ్ళలో బాగా పండిన యాపిల్ చెట్లు… నోరూరింది. చెట్టుమీద పండిన యాపిల్ పళ్ళను కోసుకు తినడమన్నది అరుదైన అనుభవం. మా తరఫున బాబు గురుంగ్ వెళ్ళి ‘ఈ యాపిళ్ళను అమ్ముతారా?’ అని అడిగాడు. ‘నిరభ్యంతరంగా… కాకపోతే మీరే కోసుకోవాలి,’ ఆ ఇంటి యజమానురాలి సమాధానం. ‘మీరు ముందుకు సాగండి’ అని చెప్పి బాబు ఆగిపోయాడు. అరగంట తర్వాత చక్కగా పండిన యాపిళ్ళను సంచిలో నింపుకుని వచ్చి మాతో చేరాడు.
చిక్కని ఆడవులగుండా నడిచాం. ఓక్, రోడోడెండ్రాన్, పైన్, జూనిపర్ వృక్షాలు… నాచు, బదనికలు నిండిన వాటి కాండాలు… గాలిలో నిండి నాసికాపుటాలకు అందుతోన్న సున్నితమైన పైన్ పరిమళం… మనసులో, ఈ అడవికి అంతం లేకపోతే బావుణ్ణు అన్న ఆశలు… చెట్ల కాండాలనూ, పడిపోయిన చెట్ల మొదళ్ళనూ ఆధారంగా చేసుకుని స్వతంత్ర జీవనం సాగించే చిట్టి మొక్కలు (Epiphytes)… చెట్ల దిగువన పరచుకున్న అనేకానేక పచ్చికలు, పొదలు… వసంత ఋతువులో రోడోడెండ్రాన్లు పరిపూర్ణంగా వికసిస్తాయట… ఇప్పటిదాకా మూడుసార్లు హిమాలయాల్లో రోజుల తరబడి తచ్చాడినా ఆ ప్రయాణాలన్నీ ఆకు రాలు కాలంలోనే సాగాయి. అంచేత అందరూ మురిపెంగా చెప్పుకునే అరుణ వర్ణపు పూలతో నిండిపోయిన రోడోడెండ్రాన్ వృక్షసమూహాలను చూసే అవకాశం ఇంతవరకూ మాకు కలగలేదు. ఆ పూలు విరగబూసిన సమయంలో వాటిని చూడటానికి రెండు కళ్ళూ చాలవట. ఇంకోసారి వసంతకాలంలో నేపాల్ హిమాలయాల ప్రయాణం పెట్టుకొని వాటిని చూడాలన్న కోరికనూ తీర్చుకోవాలి. అన్నట్టు ఈ రోడోడెండ్రాన్ పువ్వు నేపాల్ దేశపు జాతీయ పుష్పం.వృక్షాల నడుమ దోబూచులాడే ఎన్నో హిమశిఖరాలను గమనిస్తూ ముందుకు సాగాం. వాటి పేర్లూ పూర్వోత్తరాలూ వివరించడానికి బాబు గురుంగ్ ఉండనే ఉన్నాడు. గణేష్ హిమల్, హిమల్ చౌలి, సిరింగి హిమల్ – ఇలా సాగిపోయింది మా హిమశిఖరాల దర్శనం. అన్నట్టు హిమల్ అన్న పదానికి మంచుపర్వతం అని అర్థమట. దారంతా పరచుకున్న వృక్షాల శాఖలు పచ్చని చిక్కని పందిరిని తలపిస్తున్నాయి. అడపాదడపా వాటిలోంచి చొచ్చుకు వస్తోన్న సూర్యకిరణాలు ఆ పచ్చటి ఆకులను మరకతమణులుగా మార్చేస్తున్నాయి. అమిత ఆహ్లాదకరం ఈ అడవి నడక!
ఏటవాలు బాట ఆరంభమయింది. ఎత్తులు పెరగడం మాకు అనుభవంలోకి రాసాగింది. ముందునుంచీ మాకు సహచరిలా ఉరకలు పెడుతోన్న బుధిగండకి నది రాతిబండల మధ్య ఇరుకైన మార్గాలు ఏర్పరచుకుని, తన ఉద్ధృతిని పెంచుకుని మహా చురుగ్గా మాకు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతోంది. ఒకచోట అయితే రెండు పెద్ద బండల మధ్య, మూడు మీటర్లయినా వెడల్పు లేని చోట, మహోగ్రరూపంలో చెలరేగిపోతోన్న ఆ నదిని చూసి తీరాలి… విభ్రమ కలిగించే దృశ్యమది. అక్కడికి దగ్గరలోనే ఒక ఉయ్యాల వంతెన ఉంది. ఆ వంతెన మీదకు చేరి ఆ ఉగ్రప్రవాహాన్ని చూడటం అరుదైన అనుభవం.అలా బుధిగండకి నదిని చూస్తోన్న సమయంలో ఒక మలి నడివయసు ఇజ్రాయెల్ జంట, రాజ్-మేరి, పరిచయమయ్యారు. వారితోపాటు వాళ్ళ టీనేజి కూతురూ ఉంది. ఆ పాప పేరు అయోల. వాళ్ళు మాకన్నా రెండు రోజుల తర్వాత నడక ఆరంభించారట. మాఛా ఖోలా దగ్గర మాకు బాగా అడ్డం పడిన లాండ్‌స్లైడ్ ఇపుడు సద్దుమణిగి స్థిరపడిందట. వీళ్ళు సులభంగా దాటగలిగారట. అలాగే వీరికి మాకన్నా మెరుగైన వాతావరణం స్వాగతం పలికింది. ఇపుడు ఈ అదృష్టవంతులు మాతో కలిసారు కాబట్టి వారితోపాటు మాకూ ముందుముందు మంచి వాతావరణం లభించవచ్చని ఆశించాం. మామూలుగా ఇలాంటి సహయాత్రికులు మనతోపాటు మొదటినుంచి చివరిదాకా కలసి నడవటం కద్దు. మేము మధ్యలో మళ్ళీ సెరాంగ్ గొంపా వేపు వెళ్ళి వచ్చాంగాబట్టి మాకన్నా రెండు రోజుల తర్వాత బయల్దేరిన ఈ కుటుంబం ఇపుడు మాతో కలిసిందన్న మాట.
దాదాపు మూడు గంటలు నడిచాక కాస్తంత సమతల ప్రదేశం చేరాం. అప్పటిదాకా అడవి మాటున దాక్కుని ఉన్న పర్వతాలు మరింత స్పష్టంగా కనిపించాయి. కొండ చరియల్లో బక్‌వీట్, బార్లీ పంటలతో నిండిన చెలకలు… ఇంకాస్త నడిచాక రకరకాల పళ్ళ ఉత్పత్తులతో కూడిన ఆరుబయలు దుకాణం ఒకటి కనిపించింది. ఏపిల్ పళ్ళు, ఏపిల్ ‘పై’లు, పళ్ళ జామ్‌లు, ఇతర పదార్ధాలు – ఆహ్లాదకరంగా అమర్చబడి మా దృష్టిని ఆకర్షించాయి. వాటితోపాటు ఆ దుకాణం నడుపుతోన్న మలి ఏభైల వయసు మనిషి కూడా మహా ఆకర్షణీయంగా కనిపించాడు. టిబెట్ సంప్రదాయపు దుస్తులు: గాఢమైన ఎరుపు రంగు కోటు, దానితో సరితూగే ప్యాంటు, నడుముకు వెడల్పాటి బెల్టు, తలపై తోలు టోపీ – చూడగానే ఆకట్టుకొనే ఆకారం, ఆహార్యం అతనిది. మమ్మల్ని చూసి ఆయన ఎంతో ఉత్సాహంగా మర్యాదగా పలకరించాడు. ‘ఏమన్నా తీసుకుంటారా’ అనీ అడిగాడు. వద్దని సున్నితంగా చెప్పాం.ఆ దుకాణం దగ్గరి బాట ఆ సమయంలో కంచరగాడిదల సమూహంతో నిండిపోయి ఉంది. అవన్నీ తమ వీపుల మీద సామాన్లు ఎక్కించుకోవడం కోసం వరసకట్టి నిలబడిపోయి ఉన్నాయి. వాటిల్ని దాటుకుని వెళ్ళడం సాధ్యం కాదని అర్థమయింది. ఆ దుకాణం మనిషి మా అందర్నీ కూర్చోబెట్టి గబగబా తాజా యాపిల్ పళ్ళు ముక్కలు కోసి అందించాడు. అతనితో మాటల్లో పడ్డాం. ఆ దుకాణం తనదేనని చెప్పాడు. ఆ చుట్టుపక్కల ఉన్న యాపిల్ తోటల్లోని పళ్ళను తన ఆధ్వర్యంలో ఖాట్మండూకు చేరవేసే పనిలో ఆ కంచరగాడిదలు నిమగ్నమై ఉన్నాయని వివరించాడా దుకాణదారు.
సంభాషణ సహజంగానే యాపిల్ పళ్ళ వైపు మళ్ళింది. తమ ప్రాంతపు వాతావరణం యాపిల్ చెట్ల పెంపకానికి ఎంతో అనువైనది అని చెప్పుకొచ్చాడాయన. మాకు ఇంగ్లండ్‌లో దొరికే యాపిల్ పళ్ళకన్నా ఇక్కడివే ఎక్కువ రుచిగా ఉన్నాయి అని మేము అభినందన అందించాం. “మీకో విషయం చెప్పమంటారా – యాపిల్ పళ్ళు యూరప్‌కు చెందినవి అన్న అపోహ సర్వదా వ్యాపించి ఉంది. నిజానికి అవి మధ్య ఆసియాకు చెందినవి. ఈ హిమాలయ పర్వతాల సోదరి శ్రేణి ‘టియాన్ షాన్’ పర్వతాలతో తొలిసారి ఆవిర్భవించిన పళ్ళు ఇవి” అని చెప్పుకొచ్చాడాయన. మంచి మాటకారి; వినసొంపుగా మాట్లాడే మనిషి.
“నా పేరు దందప్ లామా… అంతా నన్ను లామా అన్న పొట్టి పేరుతో పిలుస్తూ ఉంటారు,” అని పరిచయం చేసుకున్నాడు. “ఇవి మా ఇంట్లో మా ఆవిడ చేసినవి,” అంటూ కొన్ని ‘యాపిల్ పై’లు అందించాడు. చాలా రుచిగా ఉన్నాయవి. ఆ మాటే అతనికి చెప్పాం. వాళ్ళావిడ పాకప్రావీణ్యాన్ని మెచ్చుకున్నాం. తన కంచరగాడిదల శ్రేణి మా గమనానికి ఆటంకం కలిగిస్తున్నందుకు ఆయన విచారం వ్యక్తపరిచాడు. ఈ రాత్రి ఎక్కడ ఉండబోతున్నారూ అని వాకబు చేసాడు. నామ్రుడ్ (Namrung) గ్రామంలో ‘నుబ్రి ఫోర్ సీజన్స్ రిసార్ట్’లో అని రేషమ్ సమాధానం. “ఓహ్ – అక్కడా! సరే – సాయంత్రం మీకు మా యాపిల్ బ్రాందీ రుచి చూపిస్తాను,” అని చిరునవ్వుతో చెప్పాడు. ఆ రిసార్ట్ ఈయనదేనట.
మరో గంట అలసట లేని నడక తర్వాత ఆనాటి మా గమ్యం నామ్రుడ్ గ్రామం చేరాం. 2650 మీటర్ల ఎత్తున ఉన్న గ్రామమది. అక్కడ భోజనం చేసాక అందరం ఆ ముచ్చటైన గ్రామాన్ని మరి కాస్త దగ్గరగా చూడాలనుకున్నాం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఈలోగా ఒక చిరుజల్లు మమ్మల్ని పలకరించి వెళ్ళింది. అది వెలిసాక గ్రామంలోకి అడుగు పెట్టాం. అన్నీ చదునైన పై కప్పుల రాతి ఇళ్ళు. చక్కగా చెక్కిన కిటికీలు. అందాల నుబ్రీ లోయకు ప్రవేశద్వారంలా అమరిన గ్రామం నామ్రుడ్. ఆ లోయలో మేము రాబోయే కొన్ని రోజులపాటు చేయబోతున్న ట్రెక్‌కు ఈ నామ్రుడ్ గ్రామపు నడక నాందీ ప్రస్తావన అన్నమాట. క్యాబేజీ, బంగాళాదుంపలు, ఇతర కూరగాయలు పండించే చిట్టి కమతాలతో గ్రామం కళకళలాడుతోంది. మనస్లు సర్క్యూట్ ట్రెకర్లందరికీ ఈ గ్రామం కీలకమయిన ప్రదేశం కదా – ఊళ్ళో టీ హౌస్‌లు బాగానే ఉన్నాయి.
మేమున్న నుబ్రి ఫోర్ సీజన్స్ రిసార్ట్ అన్నది కాస్తంత ఖరీదైన వసతి. ఊరి మొగలో ఓ మోస్తరు ఎత్తున ఉన్న చదునైన ప్రదేశంలో కట్టిన రిసార్టది. అక్కడనుంచి ఎటు చూసినా సుదూర తీరాల సుందర దృశ్యాలు… పచ్చదనం నిండిన కొండలు అడవుల మధ్య ప్రస్ఫుటంగా కనిపిస్తున్న పిరమిడ్ ఆకృతిలోని సువర్ణమందిరం ఒకటి మా దృష్టిని ఆకట్టుకుంది. 7893 మీటర్ల గొగ్గురు గొగ్గురు హిమల్ తులి మంచుకొండ అక్కడ కనిపిస్తున్న ఇతర దృశ్యాల మీద ఆధిపత్యం చెలాయించడం గమనించాం. ఆ సంగతి ఎలా ఉన్నా ఆ శిఖరం ఆ ప్రాంతమంతటికీ ఎంతో ఘనమైన నేపథ్యదృశ్యంగా అమరిందన్న మాట నిజం. దిగువనున్న లోతైన గండిలో బుధిగండకి చేస్తున్న సందడి సరే సరి… మేమున్న రిసార్ట్ ప్రవేశద్వారాన్ని బౌద్ధాలయాల స్వాగత ద్వారాల బాణీలో నిర్మించారు. ముఖ్యభవనంలో రెస్టారెంట్ ఉంది. చుట్టూ సమతల ప్రదేశాల్లో నిర్మించిన కాటేజీలు మాకు వసతి సౌకర్యం కలిగిస్తున్నాయి. మెత్తని పక్కలు, వేడినీళ్ళ షవర్లు, వాష్ బేసిన్లు… కొండల్లోని ప్రమాణాలతో పోలిస్తే అది విలాసవంతమైన వసతి గృహమనే చెప్పాలి.సాయంత్రమయేసరికి చలి ముంచెత్తింది. అందరం డ్రాయింగ్ రూమ్ లోని కట్టెల చలిమంట చుట్టూ చేరి వెచ్చదనాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశాం. మాతోపాటు ఊరు చూడడానికి రాకుండా ఉండిపోయిన కొంతమంది మిత్రులు అప్పటికే చలిమంట దగ్గర చేరి కనిపించారు.
మేమంతా నామ్రుడ్ కు చేరువలో ఉన్నపుడు దారిలో కనిపించి ఎన్నెన్నో కబుర్లు చెప్పిన పళ్ళ దుకాణం యజమాని దందప్ లామాగారి సతీమణి, చలిమంట దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించింది. ‘మీరు చేసిన అతి చక్కని ఆపిల్ పైలు ఇప్పటికే రుచి చూసాం’ అంటే ఆమె నవ్వేసి, ‘అయితే మా ఆయన మీకు దారిలో కనిపించాడన్నమాట’ అంది. ఇంతలో గోపి ‘మీ అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేత్తే మరో రుచికరమైన సంఘటన జరగబోతోంది’ అని ప్రకటించి మాలో ఆసక్తి రేకెత్తించాడు. ఏమిటా సంఘటన అని ఊహాగానాలు చేస్తూ ఉండగానే వేడివేడి ఉల్లిపాయ పకోడీలు, పొగలుగక్కే మసాలా టీ మా ముందు ప్రత్యక్షమయ్యాయి. చిరుముసురు ముసిరిన చలి చలి సాయంత్రం వేళ, చలిమంట చుట్టూ చేరి వెచ్చదనం కోసం ఆరాటపడుతున్న మాకు ఉల్లిపాయ పకోడీలు మసాలా టీలు అందుకోవడంకంటే మహాభాగ్యం ఏముంటుంది? నేపాల్ హిమాలయ సీమలో భారతదేశపు మౌలిక రుచులు… వాహ్ రే వాహ్! అక్కడి రిసార్ట్ మేనేజర్ అమర్‌తో కలిసి గూడుపుఠాణి చేసి రహస్యంగా వాటిని వండించి మాకు అందించిన గోపి ఆ క్షణాల్లో అందరికీ అత్యంత ప్రీతిపాత్రుడు అయిపోయాడు.
ఆరోజు ఆ రిసార్ట్‌లో మేమే అతిథులం. మా మేనేజరు అమర్ ఖాట్మండు మనిషట. అక్కడ చాలా హోటళ్ళలో పనిచేసిన అనుభవం ఉందట. మా రిసార్ట్ యజమాని ఈ అమర్‌ను ఏరి కోరి తెచ్చి నియమించుకున్నాడట.
కాసేపట్లో లామాగారు వచ్చి మాతో చేరారు. భోజనం చేస్తూ అందరం కబుర్లలో పడ్డాం. లామాగారి రిసార్ట్‌ది ఆసక్తికరమైన నేపథ్యం.
రిసార్ట్ ఉన్న స్థలంలో నాలుగు శతాబ్దాల క్రితం అప్పటి రాజుగారి రాజప్రాసాదం ఉండేదట. 1768లో పృథ్వీ నారాయణ్ అనే గోర్ఖా రాజు నేపాల్‌లోని చిన్నచిన్న రాజ్యాలు అన్నిటినీ ఏకీకృతం చేసినప్పుడు ఈ ప్రాంతపు రాజ్యపు రాజుకు ఉనికి లేకుండా పోయిందట.
మేము అడగబోయే ప్రశ్నను ముందే ఊహించిన లామా తనకూ ఆ రాజవంశానికీ ఏ సంబంధబాంధవ్యాలూ లేవని స్పష్టం చేసాడు. ఒకప్పుడు రాజప్రాసాదం ఉన్నచోట తాను పుట్టడం కేవలం యాదృచ్ఛికం అన్నాడు. అయినా అప్పటి జ్ఞాపకాలనూ సంప్రదాయాలనూ భవిష్యత్తు తరాల కోసం అట్టే పెట్టడం కోసం తానా భూమిని కొన్నాననీ, తన ఇల్లూ రిసార్టూ నిర్మించాననీ, పురాతన రాజప్రాసాదం ఇంకా కొంత నిలచే ఉందనీ, మర్నాటి ఉదయం దాన్ని మాకు చూపిస్తాననీ చెప్పాడు.
లామా టిబెటన్ మూలాలకు చెందిన మనిషి. అక్కడి లవణ వ్యాపారుల కుటుంబానికి చెందిన వ్యక్తి. లవణాలతోపాటు ఆ కుటుంబాల వారు జడల బర్రె ఉన్నితో నేసిన దుస్తుల వ్యాపారమూ చేసేవారట. నుబ్రీ లోయ టిబెట్ సరిహద్దు ప్రాంతం అవడం వల్ల దానికి అనాదికాలంనుంచీ సాంస్కృతికంగా టిబెట్‌తో అనుబంధం ఉంది. అందువల్ల నుబ్రీ లోయలో టిబెటన్ మూలాలకు చెందిన వాళ్ళు స్థిరపడి నివసించడం ఎన్నో తరాలుగా సాగుతోంది.
మాటల్లో లామాగారు తన జీవిత విశేషాలూ చెప్పుకొచ్చాడు. 17 సంవత్సరాల వయసులో సింగపూర్ చేరి అక్కడ వ్యాపారాలు చేసాడట. మరో 17 సంవత్సరాలు సింగపూర్‌లో గడిపి స్వస్థలం తిరిగి వచ్చినపుడు నామ్రుడ్ ప్రాంతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఏ మార్పూ లేకుండా మిగిలిపోవడం, మారుమూల ప్రాంతం అవడంవల్ల స్థానిక ప్రజలు కనీసావసరాల కోసం కూడా అష్టకష్టాలు పడటం గమనించాడట. పేదరికం, తీవ్ర నిరుద్యోగం సరేసరి.
ఆ పరిస్థితులన్నీ చూసి ఆయన ఆలోచనలో పడ్డాడు. తిరిగి సింగపూర్ వెళ్ళిపోవడమా, నిలబడి స్వస్థలంలో పరిస్థితిని మెరుగుపరచడమా అని ఆలోచించి, ఉన్న ఊర్లోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ ప్రాంతంలో సహజవనరులు ఉన్న విషయం గమనించాడు. ఆర్గానిక్ వ్యవసాయానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గ్రహించాడు. అలాగే టూరిస్టులను రప్పించగల శక్తి ఉందనీ అర్థం చేసుకున్నాడు. అంచేత అక్కడే ఉండిపోయి, తాను సింగపూర్‌లో సంతరించుకున్న వ్యాపారదక్షత సాయంతో స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అక్కడి యవతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి నడుం కట్టాడు.
టిబెట్ ప్రాంతాన్ని 1950 ల మలి దినాల్లో చైనీయులు ఆక్రమించాక అక్కడ రాజకీయ అస్థిరత నెలకొనడం, దానివల్ల అసంఖ్యాకమైన టిబెటన్లూ, చైనా వ్యతిరేక పోరాట యోధులూ సరిహద్దులు దాటి నేపాల్‌లో ప్రవేశించి ఆశ్రయం పొందారు. అంచేత నేపాల్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ‘నియంత్రిత ప్రదేశం’గా ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు బాగా మారినా, సరిహద్దు ప్రదేశం కాబట్టి ఆ నియంత్రిత ప్రదేశం అన్న వర్గీకరణ ఇంకా నిలిచి ఉంది. ఆ ప్రాంతపు పర్యావరణ పరిరక్షణ కోసం ఆ వర్గీకరణను నిలిపి ఉంచడం అవసరమని కూడా ప్రభుత్వ భావన.
మనస్లు సర్క్యూట్‌లో 1991 నుంచి ట్రెకింగ్ అనుమతించడం మొదలయ్యింది. ఆ సర్క్యూట్ పర్యావరణ వైవిధ్యాన్నీ సాంస్కృతిక వారసత్వాన్నీ పరిరక్షించడం కోసం 1998లో ఆ ప్రాంతాన్ని ‘మనస్లు కన్జర్వేషన్ ఏరియా’గా ప్రకటించారు. అందులో ఈ నుబ్రి వ్యాలీ ఒక ప్రముఖ భాగం.
మారుమూల ప్రదేశం అవడం, నియంత్రణలు అమలులో ఉండటం – వీటివల్ల ఈ ప్రాంతానికి పర్యాటకులు రావడం బాగా తక్కువ అన్నాడు లామా. ట్రెకర్‌లలో కూడా ఈ ప్రాంతపు అసమాన సౌందర్యం గురించీ, సాహసయాత్రలకు ఉన్న అవకాశాల గురించీ అవగాహన బాగా తక్కువ. పోల్చి చూసినట్లయితే యూరప్‌లోని స్విట్జర్లాండ్‌లాంటి అతి చిన్న దేశాలు తమ పర్వతశ్రేణులకు ఉన్న విస్తృత ప్రాచుర్యంవల్ల ఏటా లక్షలాదిమంది టూరిస్టుల్ని ఆకర్షించగలుగుతున్నాయట.
తీరా చేసి మొత్తం యూరప్‌లో 5000 మీటర్లు దాటిన శిఖరాలు ఎనిమిదే ఎనిమిది. మళ్ళా ఆ ఎనిమిదీ కాకసస్ పర్వతశ్రేణుల్లో ఉన్నాయి. బాగా పేరు మోసిన ఆల్ప్స్ పర్వతశ్రేణిలో ఒక్కటంటే ఒక్కటైనా లేదు. అదే నేపాల్ దేశంలోని గోర్ఖా జిల్లాను చూస్తే ఆ జిల్లాలో 5000 మీటర్లు దాటిన శిఖరాలు ఏకంగా 51 ఉన్నాయి. మనస్లు శిఖరమైతే 8000 మీటర్లు దాటిన అరుదైన వర్గానికి చెందుతుంది. ఎత్తులే కాకుండా ప్రకృతి సౌందర్యం విషయం చూసినా అది సామాన్యుల ఊహలకైనా అందనిది. మరి ఈ ప్రాంతానికి మరింత విరివిగా పర్యాటకులు వచ్చి సౌందర్య సాహసాల రుచి చూసి స్థానిక జనానీకానికి ఉద్యోగావకాశాలు కల్పించాలి అనుకోవడం అత్యాశా? అన్నది లామాగారి ఆవేదన.
తన ఆవేదనకు కార్యరూపం ఇస్తూ ఆయన నుబ్రీలోయనుంచి ఖాట్మండువరకూ భారీ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించాడట. ఆ దూరమంతా పాదరక్షలు లేకుండా తన సహచరులతో నడచి వెళ్ళి తమ కోర్కెల డిమాండ్ పత్రాన్ని పార్లమెంటుకు సమర్పించాడు. నేపాల్ దేశపు ఆనాటి రాజుగారి మద్దతు కూడా సాధించాడు. ఆ కార్యాచరణ ప్రజలను ఆకర్షించి వారి మద్దతు కూడా పొందింది. దాని ఫలితంగా ప్రభుత్వం ఆ ప్రాంతం మీద ఉన్న ఆంక్షలు కాస్తంత సడలించింది. నిరసనలు, ప్రదర్శనలే కాకుండా ఆయన 165 మంది స్థానిక యువకులకు ట్రెకర్లకు గైడ్లుగా ఉండటానికి తర్ఫీదు ఇచ్చాడట.
ఇంత చేసినా తమ ప్రాంతపు సామాన్య ప్రజల ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉండే ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయంటాడు లామా. ఉదాహరణకు, అక్కడ హెలికాప్టర్లు దిగాలంటే చెల్లించవలసిన రుసుము మహాభారీగా ఉంటుందట. స్థానికులు అంత ఖర్చు భరించలేరు. అంచేత వారికి అత్యవసర సమయాల్లో వైద్యసహాయం అందకపోవడం, ఫలితంగా అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఇంకా జరుగుతోందని వాపోయాడు లామా.
ఆ విషయంలో తన కృషి ఇంకా కొనసాగిస్తున్నానని, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. తన సింగపూర్ సంపాదనను నుబ్రీ వ్యాలీలో ఆపిల్ తోటలను పెంచడం మీదా, పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించడం మీదా వినియోగించాడు. వాటి ద్వారా లభించే ఆర్థిక ఫలితాల సంగతి ఎలా ఉన్నా ఆ ప్రాంతపు పురోభివృద్ధి మీదా ఉద్యోగావకాశాలు పెరగడం విషయంలోనూ ఆయన ఎంతో తపనతో కృషి చేస్తున్నాడన్నది నిర్వివాదం.
మాటలు సాగుతూ ఉండగానే మేము డిన్నర్ ముగించాం. మధ్యాహ్నం చెప్పినట్టుగానే లామాగారు మాకు ఇంట్లో తయారు చేసిన ఆపిల్ బ్రాందీ రుచి చూపించారు. ఆయన సంజ్ఞను అందుకున్న రిసార్ట్ మేనేజర్ అమర్ చిన్న చిన్న గ్లాసుల్లో గాఢమైన పరిమళం కలిగిన బ్రాందీ నింపి ఇచ్చాడు. ఆ పరిమళం చూసి మేమంతా సందేహిస్తుంటే ‘అనుమానపడకండి, పేరులో బ్రాందీ అని ఉంది కానీ ఇది ఇతర బ్రాందీల్లా స్ట్రాంగ్ పానీయం కాదు. వైన్ లాంటి సరళ పానీయం. ఇందులో ఆల్కహాల్ 18 శాతమే,’ అని వివరించి ప ్రోత్సహించాడు. అందరం లామాగారికీ ఆయన సతీమణికీ టోస్ట్ చెప్పి తల ఒక గుటక వేసాం. నిజమే. ఆ బ్రాందీ ఎంతో సరళంగా మనసును శరీరాన్ని తాజాపరిచేలా ఉంది.
నామ్రుడ్ ప్రాంతపు ప్రజల మనసుల్లో లామా తన ముద్ర వేశాడన్నది స్పష్టం. ఆయనలో స్వీయానురాగపు పాళ్ళు ఎక్కువ అని కొంతమంది అనుకోవచ్చు. ఏదేమైనా మాలాంటి అపరిచిత అతిథుల విషయంలో ఆయన చూపించిన శ్రద్ధ, ఆసక్తి, ఆప్యాయత, తన ప్రాంతం అంటే ఆయనకు ఉన్న అనురక్తి మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి. తనను తాను తన ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్‌గా భావించుకుంటాడాయన. ఆ పాత్రను ఎంతో అంకితభావంతో పోషిస్తున్నాడు. ఆయనకూ ఆయన సతీమణికీ మేమంతా మనస్ఫూర్తిగా అభినందనలు అందజేశాం. నేపాల్ హిమాలయాల్లో మేము ఇప్పటిదాకా చేసిన మూడు విడతల ట్రెక్‌లలో ఇంత చక్కని ఆతిథ్యం అందించిన అతిథి గృహం మరొకటి లేదు అని మనసు విప్పి చెప్పాం.
మేము మాటలు చెప్పుకుంటూ గడిపిన సమయంలో లామాగారి భార్య ఏ హడావుడీ లేకుండా వంటింటి పనులు పర్యవేక్షించింది. అడపాదడపా చిరునవ్వుతో మా దగ్గరికి వచ్చి మాకు అన్నీ సవ్యంగా అందుతున్నాయో లేదో గమనించింది. నేను ఇప్పటిదాకా లామాగారి గురించే ఎక్కువగా చెబుతున్నానుగాని ఆయన ఆలోచనలు, కార్యాచరణల వెనుక ఆమె నిశ్శబ్ద సహకార ప్రోత్సాహాలు ఉన్నాయన్నది నిస్సందేహం. పైగా ఆ దంపతులిద్దరూ కష్టజీవులు. సంపదలూ సౌకర్యాల నీడన సుఖంగా బ్రతికేసే మనుషులు కాదు. అతిథుల బాగోగులూ సుఖసౌకర్యాలూ పట్టించుకోవడం విషయంలో అద్వితీయులు. ఆ విషయం ఎవరికైనా కరదీపికలుగా నిలవగల వ్యక్తులు.
ముందు చెప్పినట్టుగానే మర్నాటి ఉదయం లామాగారు అమర్‌తో కలిసి మాకు పురాతన రాజప్రాసాదం చూపించాడు. అది మరి పెద్దదేం కాదు. బాగా శిథిలావస్థలో ఉంది. దాని ప్రస్తుత రూపానికి పేరుతో పొంతన లేనట్లున్నా, ఒకప్పటి వైభవపు ఛాయలు అక్కడక్కడ కనిపించాయి. ‘ఈ భవనానికి రిపేర్లు చేయించాలి. పునరుద్ధరించాలి. అవి చేశాక దీన్ని ముందు తరాల వాళ్ళ కోసం మ్యూజియంగా రూపొందించే ఆలోచన ఉంది,’ అని చెప్పుకొచ్చాడు లామా.ఈ ట్రెక్ అంతటిలోనూ మేము నిజంగా విశ్రాంతి అనుభవించింది ఈ నామ్రుడ్ గ్రామంలోనే అని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం భోజనాల సమయంలో వచ్చాం. సాయంత్రమంతా విరామసౌఖ్యం అనుభవించాం. విరామంతోబాటు లామా గారి పుణ్యమా అని స్థానిక చరిత్ర, సంస్కృతుల గురించి అవగాహన కల్పించుకోగలిగాం. ఎలా చూసినా మా నామ్రుడ్ మజిలీ కలకాలం గుర్తుండే అనుభవం.
మా ఏడవ రోజు ప్రయాణం నామ్రుడ్‌లో బాగా ఉదయాన్నే మొదలైంది. గ్రామంలోని రాతిబాటగుండా ముందుకు సాగి అవతలి వేపున గ్రామంనుంచి బయటపడ్డాం. వెంటనే పైన్, ఫిర్, రోడోడెండ్రాన్, జూనిపర్ వృక్షాలతో నిండిన కొండల నడుమన ఉన్న లోయ అంచుల మీదుగా ముందుకు సాగాం. దిగువన పారుతున్న బుధీగండకి గలగలలు మాకు సహజంగా అమరిన, తప్పించుకోజాలని నేపథ్య సంగీతం.
మేము నడుస్తున్న బాట క్రమక్రమంగా ఎగువకేసి సాగింది. కొన్నిచోట్ల బాగా నిడుపాటి బాటగా పరిణమించింది. ఆనాటి మా నడక సుదీర్ఘకాలం సాగుతుందని తెలుసు. మా గమ్యం శ్యాలా చేరేసరికి అంతా కలిసి తొమ్మిది వందల మీటర్లు ఎగువకు చేరుకుంటాం. అలాగే 3000 మీటర్లు దాటిన ‘గాలి పలచన’ ప్రాంతాల్లోకి అడుగు పెడతామన్నమాట.
దారిలో లిహి అన్న గ్రామంలో కనిపించిన బౌద్ధమందిరం దగ్గర కాసేపు ఆగాం. బూట్లు బయట వదిలి మందిరం లోపలికి వెళ్ళాం. మందిరప్రాంగణంలో స్థూపాకారం గల పెద్ద ప్రార్థనాచక్రం ఒకటి ఉంది. ఆ స్థూపాన్ని గిరగిరా తిప్పి మా ప్రయాణం మంచి వాతావరణంలో విజయవంతంగా సాగాలని ప్రార్ధించాం. అక్కడ ఉన్న బౌద్ధభిక్షువు ఒకాయన స్థూపాన్ని గడియారమార్గంలో తిప్పితేనే శుభం కలుగుతుందని, వ్యతిరేకమార్గంలో తిప్పితే అశుభ హేతువు అవుతుందని సూచించాడు. అది పాటించాం.తర్వాత వచ్చిన షో అన్న గ్రామ పొలిమేరలో గాఢ ధవళవర్ణం నిండిన బౌద్ధ స్వాగతద్వారం మాకు స్వాగతం పలికింది. దానిమీద చక్కని చిత్రాలు ఉన్నాయి. బుద్ధుని నేత్రాలు కూడా చిత్రించి ఉన్నాయి. అక్కడ మంచినీళ్ళు, తినుబండారాల కోసం ఆగాం. అలా ఆగినపుడు సింగపూర్‌లో స్థిరపడిన రెండవ తరం నేపాలీ యువకుడొకడు కనిపించి పలకరించాడు. అతనితోపాటు మరో ఇద్దరు సింగపూర్ స్నేహితులూ, మరో డచ్ ట్రెకర్ల బృందమూ ఉన్నారు. ఈ డచ్ ట్రెకర్‌లందరూ 60 సంవత్సరాలు నిండినవాళ్ళు. వీళ్ళంతా ముందు ముందు మాతోపాటు ట్రెక్ చేస్తారన్నమాట. షో గ్రామం దాటాక మా బాట మరింత ఎగువ ప్రదేశాలకు దారితీసింది.
దారిలో మాకు 7422 మీటర్ల గణేష్ హిమల్ శిఖరం కనిపించింది. హిందువులకూ బౌద్ధులకూ పవిత్రమైనదా హిమశిఖరం. పేరులో గణేష్ అని ఉన్నా ఆ శిఖరం అన్ని శిఖరాల్లానే ఉంది. ‘మరి ఆ పేరూ ప్రాముఖ్యతా ఎలా అమిరాయీ?’ అన్న సందేహం మాలో తలెత్తింది. అది గమనించిన మా మహిళా గైడ్ సామి, ‘ఇక్కడ మనకు కనిపించడం లేదుగానీ సరైన కోణంలో చూస్తే గణేశుని ఆకృతి బాగా కనిపిస్తుంది. రేపటి ట్రెక్‌లో ఆ ఆకృతి చూపిస్తాను,’ అని వివరించి మమ్మల్ని సమాధానపరచింది. ఆ ఆకృతివల్లనే దానికి హిందువుల ప్రియదైవం గణేశుని పేరు వచ్చి ఉండాలి. ఆ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అమరి ఉండాలి.
బుధిగండకి నది మీద ఒక ఉయ్యాల వంతెన దాటాం. మరో రెండు గంటలసేపు నడక కొనసాగింది. ఎత్తులు పెరుగుతున్న సంగతి స్పష్టంగా తెలిసిపోతోంది. చెట్లు పలచబడి, పచ్చిక బయళ్ళు తమ ఉనికి చాటుకోవడం మొదలైంది. అలా చుట్టుపక్కల ఆల్పైన్ దృశ్యాలు పరుచుకుంటున్న ఒక నిట్టనిలువ బాట దాటి ల్హో (Lho) అన్న గ్రామం చేరాం.
ఊరి మొగలో మూడు అంతస్తుల ‘కణి’ కనిపించింది. గంభీరమైన ఆకృతి. రెండవ అంతస్తు గోడమీద బుద్ధుని నేత్రాలు, తోరణాలుగా కట్టిన ప్రార్థనా పతాకాలు – మమ్మల్ని బాగా ఆకట్టుకుందా కట్టడం. అది దాటాక మా బాట పొడవాటి మణికుడ్యం పక్కగా సాగింది. ఆ కుడ్యపు శిలల మీద అక్కడక్కడ వివిధ యోగముద్రలలో ఉన్న బుద్ధుని ఆకృతులు చిత్రించి ఉన్నాయి. కొన్ని రాళ్ళమీద టిబెటన్ లిపిలో అక్షరాలు ఉన్నాయి. దారిలో కనిపించిన ఓ స్థానిక యువకుడిని ‘ఏమిటా అక్షరాల ప్రాముఖ్యత? అని అడిగాను. ‘ఓం, మణి పద్మే ఓం’ అంటూ వాటిని చదివి అది హిమాలయ ప్రాంతాలన్నిటా వినవచ్చే ప్రముఖ బౌద్ధమంత్రం అని వివరించాడా యువకుడు. ఆ మంత్రం నాకు బాగా పరిచయమే అనిపించింది. ‘మీరెక్కడ నుంచి వస్తున్నారూ?’ అని హిందీలో అడిగాడు. క్లుప్తంగా వివరించాం. అతను ల్హో గ్రామానికి చెందిన, ఖాట్మండూ యూనివర్సిటీలో చదువుకుంటున్న మనిషట. దసరా శెలవలు కుటుంబంతో గడపడానికి వచ్చాడట. ‘మీకు వీలయితే మా ఊళ్ళో ఉన్న రిబంగ్ మానెస్ట్రీలో ఈ రాత్రి గడపండి. టిబెటన్ బుద్ధిజం గురించి మంచి అవగాహన కలుగుతుంది’ అన్నాడు. రాత్రి అక్కడ ఆగే ఆలోచన మాకు లేదు. పోనీ వెళ్ళి కాసేపు గడుపుదామా అంటే ఆ మధ్యాహ్నం వేళ మానెస్ట్రీ మూసేసి ఉంది. ఊళ్ళోని బౌద్ధ స్వాగతద్వారం, ప్రార్థనా పతాకాలు, ఛోర్టన్లు, మణికుడ్యం, ప్రార్థనా స్థూపాలు – ఇవన్నీ కలసి ల్హో గ్రామానికి చక్కని సాంస్కృతిక ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని సంతరించి పెట్టాయనిపించింది. నాకేమో భారత ఉపఖండంలో కనిపించే బౌద్ధ సంస్కృతి అంటే అమితమైన అనురక్తి. స్థానికులు ప్రశాంతంగా స్తిమితంగా తమతమ దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నులై ఉండే కాలాతీతమైన బౌద్ధ గ్రామాలలో నింపాదిగా తిరుగాడటమంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. అలా తిరిగే అవకాశం వస్తే అది అంతరాంతరాలను స్పృశించే అనుభవం అయి తీరుతుంది. ఆనాడు ల్హో గ్రామంలో నాకు అలాంటి అనుభవమే కలిగింది.3180 మీటర్ల ఎత్తున, ఒక సన్నపాటి లోయ అంచున నిలచి ఉన్న ల్హో గ్రామం చదరపు పై కప్పులు కలిగిన రాతి ఇళ్ళతో కూడిన అందమైన పురాతన ప్రదేశం. ఆ రోజు వాతావరణం చక్కని సూర్యరశ్మితో వెలిగిపోతూ ఉంది. సుదూర ప్రాంతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా ప్రయాణంలో మొట్టమొదటిసారిగా దూరాన ఉన్న మనస్లు శిఖరం చూసాం. ఆ శంఖువు ఆకారపు హిమశిఖర రాజస దృశ్యం మమ్మల్ని ముగ్ధులని చేసింది. కానీ మరికాసేపట్లో మబ్బులు కమ్ముకు వచ్చి శిఖరాన్ని మాకు దూరం చేసాయి. కొద్ది క్షణాల పాటైనా ఆ సుందర గంభీర శిఖరాన్ని చూడగలిగినందుకు అంతా ఎంతో సంతోషించాం.
గ్రామంలో సుందర సాంస్కృతిక గాంభీర్యంతోబాటు చకచకా సాగే వ్యవసాయ కార్యకలాపాల సందడి కూడా కనిపించింది. ఊరి వాళ్ళు బార్లీ, బక్‌వీట్ మళ్ళల్లో పని చేస్తూ కనిపించారు. ఇళ్ళల్లోనే ఉన్న కూరగాయల మళ్ళను సంభాళించుకుంటూ మరి కొంతమంది… మా ప్రయాణాల్లో మహిళలు ఇంటి ముందరి ప్రాంగణాల్లో తృణధాన్యాలనూ పప్పు దినుసులనూ ఆరబెట్టడం గమనించాం. అలాగే ధాన్యాలు దంచడం, కూరగాయల ముక్కలు కొయ్యడం – ఈ పనులు వారి వంతు. గొర్రెలు, కంచరగాడిదలు, జడల బర్రెలు తమ తమ ఉనికిని చాటుకుని గ్రామీణ జీవితంలో భాగంగా నిలవడం గమనించాం. ఇక్కడ పండే పప్పు దినుసులు ఎంతో నాణ్యమయినవనీ, రుచికరమైనవనీ బాబు గురుంగ్ వివరించాడు.మాకు ఎదురుగా వస్తూ ఒక కంచరగాడిదల వరుస కనిపించింది. అక్కడి పద్ధతి ప్రకారం మేము వాటికి మర్యాదగా దారి వదిలి పక్కన నిలబడ్డాం. ఓ స్థానిక మహిళ గోడల మీద పిడకలు కొడుతూ కనిపించింది. మన వేపు గ్రామాలు గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడు అలా పిడకలు కొట్టడం, ఎండాక వాటిని తీసి వరసల్లో పేర్చడం, వాటితో పొయ్యంటించి వంట చెయ్యడం నాకు బాగా గుర్తు. అదంతా గతం. గత 50 సంవత్సరాలలో భారతదేశంలో పరిస్థితులు బాగా మారాయి. పిడకలు అదృశ్యమయ్యాయి. పశువులు తగ్గిపోయాయి. ఈ నేపాల్ హిమాలయ గ్రామాలు అప్పటి జ్ఞాపకాలను తిరగదోడుతున్నాయి.
పిడకలనుంచి గ్యాసూ కరెంటు వేపు వెళ్ళగలగడం అభివృద్ధిని సూచిస్తుంది అంటారు. ఆ విషయంలో నాకు పేచీ లేదు. పేడ వంట చెరుకుగాకన్నా పంట ఎరువుగా ఎక్కువ ఉపయోగకరం అన్న మాటా నిజం. అయినా శతాబ్దాలుగా సాగి వస్తోన్న పద్ధతులూ సంప్రదాయాలూ ఆధునిక సాంకేతిక ప్రగతి నీడలో అదృశ్యమైపోతున్నపుడు మనసు కలుక్కుమంటుంది. ఈ పురోగతి సహజం, వాంఛనీయం అని తెలిసినా పురాజ్ఞాపకాల తడి మనసును వదలదు!
నా మనసులోని ఆలోచనలు గ్రహించినట్టుగా, ‘ఈ పిడకలు మా ఊళ్ళల్లో ఎంతో అవసరం. శీతాకాలంలో పొయ్యిలోకి కట్టెలు దొరకవు. పిడకలే మాకుండే వంట చెరుకు,’ అంటూ బాబు గురుంగ్ మాట కలిపేసరికి నేను ఆలోచనల్లోంచి బయటపడ్డాను.
మెజెస్టిక్ మనస్లు అన్న టీ హౌస్‌లో అందరం భోజనం చేసాం. అక్కడ వడ్డించిన పప్పు ఎంతో రుచికరంగా ఉంది. అందరం అడిగి అడిగి మారు వడ్డించుకున్నాం. “ఇది మా ఊళ్ళో పండిన ఆర్గానిక్ పప్పు. ఈ ప్రాంతాల్లో మా ఊరి పప్పు అంత రుచికరమైనది మరొకటి లేదు,” అని చెప్పాడా టీ హౌస్ యజమాని.
ముందే చెప్పుకున్నట్టు మా బృందంలోని మోహన్ మహా చురుకైన మనిషి. మరెందుకో ఆ రోజు నిస్త్రాణంగా కనిపించారు. లంచ్ ముగిసాక అక్కడి బెంచీ మీద చేరగిలబడి నిద్రపోయాడు. లేచేసరికి జ్వరం. మందులు మింగి నడక కొనసాగించాడు. అది తాత్కాలికమైన సమస్యే అనీ మరింతగా ముదిరి ఇబ్బంది పెట్టదనీ అందరం ఆశించాం.
అలాగే టీ హౌస్‌లోంచి బయట పడుతున్నపుడు అనిల్ కాలు జారి పడ్డాడు. వెంటనే లేచి చూసుకున్నాడు. అదృష్టవశాత్తు దెబ్బలేం తగలలేదు. మాలో శారీరక పటుత్వం, చురుకుదనం ఎక్కువగా ఉన్న మనిషి అనిల్. అలాంటి మనిషి ఇలా జారిపడటం ఆశ్చర్యం కలిగించింది. ఏదేమైనా ఏక్సిడెంట్లూ గాయాలూ ఇలాంటి ట్రెక్‌లలో అంతర్భాగం. ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకోసారి అవి జరిగిపోతూ ఉంటాయి. సామాన్యంగా అదృష్టాన్ని నమ్మని వాళ్ళకు కూడా ఆ సంగతి గుర్తుకొచ్చే సమయాలవి.
భోజనం ముగించి గ్రామంనుంచి బయట పడగానే ఓ భారీ లాండ్‌స్లైడ్ దారిని అడ్డగిస్తూ మాకు స్వాగతం పలికింది. స్థానికులు ఆ రాళ్ళూ రప్పలూ తొలగించే పనిలో నిమగ్నమై కనిపించారు. ఈ ప్రయాణంలో మేము చవిచూసిన లాండ్‌స్లైడ్లు లెక్కకు మించిపోయాయి. మేమంటే జన్మానికి ఒకసారి వచ్చి పోయేవాళ్ళం. మా ఇబ్బంది వేరు. ఇలా రోడ్లు మూతపడటం, కష్టించి ఆ అవరోధాలను తొలగించుకోవడం – పాపం ఇక్కడి స్థానికులకు ఎంతో తరచుగా ఎదురయ్యే ఇబ్బంది అని గుర్తొచ్చి మనసు చివుక్కుమంది.
ఆ లాండ్‌స్లైడ్ దాటాక ఆనాటి మా లక్ష్యం శ్యాలా గ్రామం కేసి సాగిపోయాం. ఆ ఊరు ఇంకో నాలుగు గంటల దూరాన ఉంది. పైన్ అడవులు, జడల బర్రెలు మేసే పచ్చిక బయళ్ళు, బార్లీ మళ్ళు మాకు తోడుగా వచ్చాయి.
ముందు కలసిన ఇజ్రాయెల్ కుటుంబం మరోసారి ఎదురయింది. వాళ్ళంతా చెట్టు నీడన చేరగిలబడి తినుబండారాలు తింటూ కనిపించారు. వాళ్ళ పాప అయోల మాకు బిస్కట్లు అందించింది. కబుర్లలో పడ్డాం. 2013 డిసెంబర్‌లో ఇజ్రాయెల్ వెళ్ళడం, అక్కడ భారీగా మంచు కురవడం గుర్తు తెచ్చుకున్నాను. కాసేపట్లో మా మాటలు గాజా ప్రాంతంలో సాగుతోన్న ఘర్షణల వేపు మళ్ళాయి. ఆరోజే, 2025 అక్టోబర్ 9న, శాంతి ఒప్పందం మీద సంతకాలు పడ్డాయని రాజ్ చెప్పాడు. 2023 అక్టోబర్‌లో అన్నపూర్ణ సర్క్యూట్‌లో మేము ట్రెక్ చేస్తున్నపుడు గాజా ప్రాంతంలో ఘర్షణలు మొదలవడం, దానివల్ల మాతోపాటు ట్రెక్ చేస్తోన్న ఇజ్రాయెల్ సైనికులు వెంటవెంటనే ట్రెక్ వదిలి స్వదేశం వెళ్ళడం గుర్తు చేసుకున్నాం. ఈనాటి ఒప్పందం వల్ల మళ్ళా శాంతి నెలకొంటుందన్న ఆశాభావం అందరం వ్యక్తపరిచాం. ఎక్కడ ఎలాంటి ఘర్షణ జరిగినా అది యావత్ప్రపంచానికి విఘాతం కలిగించగల సమయసందర్భాలలో ఉన్నామన్న విషయం గుర్తుచేసుకున్నాం.
మరిన్ని మరిన్ని నిడుపాటి బాటలను జయిస్తూ సంధ్యాసమయపు వేళ శ్యాలా గ్రామపు పొలిమేరలు చేరుకున్నాం. దారంతా పైన్ వృక్షాలు, వాటి నడుమనుంచి కనిపించే శ్వేత శిఖరాలు. శ్యాలా గ్రామం 3575 మీటర్ల ఎత్తున ఉంది. ఆ గ్రామంలో అడుగు పెట్టేసరికి చీకటి పడనే పడింది. ఆకాశంలో మేఘాలు – అంచేత కనిపించీ కనిపించని దృశ్యాలు… అయినా మనస్లు శిఖరం, ఇతర శిఖరాలు రేఖామాత్రంగా కనిపించాయి. వాటి పరిపూర్ణ సౌందర్యం ఆస్వాదించాలంటే మర్నాటి ఉదయం దాకా ఆగాలన్నమాట.
ఆపూట మేము బస చేసే హోటల్ మౌంటైన్ వ్యూ అన్న టీ హౌస్ శ్యాలా గ్రామం ఆరంభంలోనే ఉంది. పెంబ – పేమ అన్న స్నేహశీలి దంపతులు నిర్వహిస్తోన్న వసతి గృహమది. పేమ వంటింటి విషయాలు చూసుకొంటే పెంబ మిగిలిన అన్ని బాధ్యతలూ నిర్వహిస్తున్నాడు. భోజనాలూ తినుబండారాలూ కావాలంటే వారికి గంట ముందుగా చెప్పాలి; తాజా తాజాగా వండి అందిస్తారు.
పెంబా మాతో చేరి తమ గ్రామపు విశేషాలు చెప్పుకొచ్చాడు. ఊళ్ళో అంతా కలసి 200 జనాభా అట. టిబెటన్ మూలాల మనుషులు. నుబ్రీ లోయలో దాదాపు అందరివీ టిబెటన్ మూలాలే… చిన్నచిన్న మళ్ళలో వ్యవసాయం, జడల బర్రెల పెంపకం వారి ముఖ్య జీవనోపాధి. బార్లీ, బక్ వీట్, బంగాళాదుంపలు పండిస్తారు. పాలు, మాంసం, ఉన్ని జడల బర్రెలు అందిస్తాయి.
వెచ్చవెచ్చని తాజా భోజనం అందించింది పేమ. మాతో తెచ్చుకున్న పచ్చళ్ళు ఇతర సంభారాలు భోజనానుభవాన్ని ద్విగుణీకృతం చేసాయి. అందుకు సందీప్ కు అభినందనలు చెప్పాలి. రాత్రి అయిపోయింది గదా – చిక్కని చలిగాలి వచ్చి ఉన్ని బట్టలు తొడుక్కోమని చెప్పి వెళ్ళింది. ఆ సూచన పాటించాక అందరం డైనింగ్ హాల్లో ఉన్న నెగడు చుట్టూ చేరి వేడిమి సౌఖ్యం అనుభవించాం. కబుర్లు ముగించి, పేమ-పెంబాలకు ధన్యవాదాలు చెప్పి మా గదుల వేపుకు సాగాం. ఎవరన్నా టీ హౌస్‌కూ హోటల్‌కూ తేడా ఏమిటీ అని అడిగితే నేను ఒకటే చెపుతాను. టీ హౌస్‌లో మానవీయ స్పర్శ లభిస్తుంది. స్వంత ఇంట్లో ఉన్న భావన కలుగుతుంది. హోటళ్ళలో మెరుగైన సౌఖ్యాలు దొరకవచ్చునేమోగానీ అక్కడ అందే సేవలో మానవీయ స్పర్శ ఎంతో అరుదు. టీ హౌసుల్లో కూడా వాటి పరిమాణం పెరిగే కొద్దీ ఆత్మీయస్పర్శ మందగించి సేవల్లో యాంత్రికత చోటు చేసుకోవడం నేను గమనించాను. ఏదేమైనా ఇక్కడి పేమ-పెంబాలు ఎంతో ఆత్మీయతతో అతి చక్కని హిమాలయన్ టీ హౌస్ నడుపుతున్నారని నేను ఘంటాపథంగా చెప్పగలను.
‘ఉదయం ఐదింటికల్లా లేచి మేడ మీదకు వెళ్ళి మనస్లు శిఖరం పైన సూర్యోదయం జరిగే దృశ్యాన్ని తప్పకుండా చూడండి’ అని పేమ విడివడేముందు పదే పదే చెప్పింది.
(ఇంకా ఉంది)









