హాసనకు చేరుకుని, సామాన్లు తీసుకుని రూమ్ ఖాళీ చేసి, కారును ధర్మస్థళ దారి పట్టించేసరికి దాదాపు ఒంటిగంట కావస్తోంది. 113 కిలోమీటర్ల దూరమనీ, 2 గంటల 25 నిముషాలు పడుతుందనీ గూగులమ్మ చెప్పింది. ఆరోజు ఒక జ్ఞానోదయం కలగబోతోందని మాత్రం చెప్పలేదు. కారు బాళ్ళుపేటె, దోణిగల్ మీదుగా పరుగులు తీసింది. దారికి రెండువైపులా చిన్న చిన్న పల్లెలు, పొలాలు. పుష్కలంగా పచ్చదనం. ముచ్చటైన ఇళ్ళు. చాలా ఇళ్ళకు చూరులు తిరగేసిన V ఆకారంలో కనపడి కనువిందు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తోంటే కనపడే కట్టడాలన్నీ పురోగమనం మీద మాత్రమే దృష్టి నిలిపి కట్టినవి అనిపిస్తాయి. కానీ కర్ణాటక ప్రజలకు తమ కట్టడాల విషయంలో సౌందర్యదృష్టి ఒక పాలు ఎక్కువే అనిపించింది.
కొంత దూరం హైవే మీద సాగిపోయాక దారి ఒక మలుపు తిరగబోతోందని GPS సూచిస్తోంది. అంతవరకూ 80-90 కిలోమీటర్ల వేగంతో తిరిగిన చక్రాలు అక్కడ వేగం తగ్గించుకోవలసి వచ్చింది. మలుపు తిరిగాక తెలిసింది ఎందుకు వేగం తగ్గిందో. రోడ్డు పని జరుగుతోందక్కడ…
రెండుగా చీలిపోయి ఉందా దారి. కుడి వైపు దారిలో పని జరుగుతున్నది. అదంతా దాదాపు రెండు ఫర్లాంగుల మేర గుంతలతో ఎగుడుదిగుడుగా ఉంది. ఎడమవైపున మరో దారి. కుడివైపుకా, ఎడమవైపుకా అన్నది GPS స్పష్టంగా సూచించేలోపే, కారు ఎడమవైపున్న దారి పట్టేసింది.
సన్నటి ఆ దారి దాదాపు ఖాళీగా ఉంది. ఘాట్‌రోడ్డులా మలుపులూ తిరుగుతోంది. చిత్రంగా, మా వెనుక మరే కారూ రాలేదు. ఎదురునుంచి కూడా వాహనాలేవీ రావడం లేదు. ‘దారి తప్పామా’ అన్న అనుమానాన్ని నిర్ధారిస్తున్నట్లు, GPS లో రోడ్డును సూచించే నీలం రంగు గీతకూ, మా కారును సూచించే చిహ్నానికీ మధ్య ఇప్పుడు ఎడం కనిపిస్తోంది! పెరుగుతోంది కూడా.
కారును రోడ్డు పక్కకు చేర్చి ఆపాను. ముందునుంచి ఒకావిడ నడుచుకుంటూ వస్తోంది. “ధర్మస్థళక్కె… ఎల్లి హోగ బేకు?” తెలిసిన కన్నడ పదాలు కూడదీసుకుని అడిగాను. “అయ్యో, ఇటు బది ఇష్టు దూర యాకె…” (ఇటు వైపు ఇంత దూరం ఎందుకొచ్చారు? మీరు వెళ్ళవలసింది అటు)” అంటూ మేము వచ్చినదారినే వెనక్కు వెళ్ళి, ఇందాక దారులు చీలిన చోట ఉన్న మరో దారిన సాగాలని చెప్పిందావిడ. వెనక్కు వెళ్ళకుండా ముందుకే వెళితే మరెక్కడికో చేరతామట.
ఆవిడ సూచనను పాటించాం. రోడ్డు వేస్తున్న కొద్ది దూరం తప్ప మిగిలిన దారంతా సాఫీగానే ఉంది. రెండువైపులా పచ్చదనం షరా మామూలే. అలా ఆ దారిలో కొన్ని కిలోమీటర్లు సాగాక మళ్ళీ ట్రాఫిక్ స్లో అయింది. అప్పుడు కనబడిందా బోర్డు.
“కుక్కె సుబ్రమణ్యాలయానికి దారి ఇటే” అంటూ T-పాయింట్‌లా ఎడమవైపుకు మళ్ళిన దారిని చూపింది. 22 కిలోమీటర్లు అంటూ దూరాన్ని కూడా చూపింది.
ఆ క్షేత్రం చాలా గొప్పదని, ఎక్కడెక్కడినుంచో భక్తులు అక్కడికి వెళ్ళి సుబ్రమణ్యస్వామిని దర్శనం చేసుకుంటారనీ బంధువులు చెప్పగా విన్నాం. పైగా ధర్మస్థళకు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం కదా, అటునుంచి సాగే రోడ్డు మళ్ళీ ఈ రోడ్డులో కలుస్తుందేమోలే అనిపించింది. అనుకోకుండా కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడమే మంచిదని, కారును ఆ రోడ్డులోకి మళ్ళించాను.
సమయం మూడు కావస్తోంది. ఇరవై రెండు కిలోమీటర్లే కాబట్టి, కుక్కె సుబ్రమణ్యస్వామిని దర్శించుకుని, చీకటి పడేలోపు ధర్మస్థళకు చేరుకోవచ్చు. చీకటి పడ్డ తర్వాత డ్రైవ్ చేయడానికి అంతగా ఇష్టపడను.
దట్టమైన పచ్చని అడవి మధ్యనుంచి సాగిందా నల్లటి, నున్నటి తారు రోడ్డు. రోడ్డు అంచులను చూచిస్తూ రెండువైపులా తెల్లని పట్టీలు. అప్పుడొకటీ అప్పుడొకటీ ఎదురవుతున్న వాహనాలు.
అనుకున్నట్టుగా ఆ చక్కటి అడవి దారి పచ్చదనాన్ని అనుభవిస్తూ త్వరలోనే ఆలయానికి చేరుకున్నాం.
విశాలమైన ప్రాంగణం ఉంది ఈ కుక్కె సుబ్రమణ్యస్వామి ఆలయానికి. కారును పార్క్ చేసిన చోటినుంచి దాదాపు అరఫర్లాంగు మేర విస్తరించింది. గుడి గుమ్మంవరకూ ఆ ప్రాంగణం నిండా తినుబండారాలు, పూజాసామగ్రి అమ్మే దుకాణాలు సరేసరి.
ఈ దేవాలయాల్లోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా పాటించవలసిన సాధారణ నియమాలతోబాటు ఒక డ్రస్ కోడ్ కూడా ఉంది. మగవారు చొక్కా, బనియన్ తీసేయాలి. పంచె కట్టుకోవడం వాంఛనీయమే అయినా, పాంట్‌తో ప్రవేశించవచ్చు. ఆడవారు చీర/రవికగానీ, కుర్తా పైజమాలుగానీ ధరించి ప్రవేశించవచ్చు. జీన్స్, కురచ దుస్తులు నిషిద్ధం, ఎవరికైనా.
రద్దీ ఎక్కువే ఉన్నా, దర్శనానికి ఎక్కువ సమయం పట్టలేదు. ‘స్పెషల్ దర్శనం’లాంటి వ్యాపార లక్షణాలేవీ లేవిక్కడ. ప్రసాదాలు మాత్రం రెండు మూడు మోతాదుల్లో, అందుకు తగిన ధరల్లో లభిస్తున్నాయి. దర్శనం చేసుకుని, నాలుగున్నర కావస్తుండగా అక్కడినుంచి బయల్దేరాం. యాభై కిలోమీటర్ల దూరమనీ గంటకు పైగా పడుతుందనీ చెప్పింది GPS.
కారు పరుగులు తీస్తోంది. ఇది కూడా సన్నటి సింగిల్ రోడ్డే. ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వాలంటే స్లో చేయక తప్పదు. ఖాళీగా ఉన్నప్పుడు 60-70 స్పీడులో సాగిపోవచ్చు. అంతకంతకూ ధర్మస్థళ దగ్గరపడుతోంది…
నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఢిల్లీలో స్థిరపడ్డ ఈ ఇరవై ఏళ్ళలోనూ జైపూర్, ఆగ్రా, అమృత్‌సర్ వంటి పట్టణాలకే కాక నైనితాల్, లాన్స్‌డౌన్, అల్మోరా, ధనోల్టి, టిహ్రీవంటి హిల్ స్టేషన్లలోని ఘాట్‌రోడ్ల గుండానూ డ్రైవ్ చెయ్యడంలో ఎంతో ఆహ్లాదాన్ని అనుభవించాను. ముఖ్యంగా హల్ద్వానీ దాటాక నైనితాల్‌కు చేర్చే ఘాట్‌రోడ్డు, ధనోల్టి, టిహ్రీల మధ్యలో సంబా మీదుగా సాగే ఘాట్‌రోడ్లయితే, సగటున ప్రతి యాభై గజాలకూ ఒక ‘హెయిర్ పిన్ బెండ్’ ఉంటుంది. ఎంతో టైట్‌గా కారును మలుపు తిప్పాలి. చాలాసార్లు, ఆ మలుపుల్లో దారి ఏటవాలుగా, ఎక్కుడుగా ఉంటుంది కూడా. మైదానాల్లో డ్రైవ్ చేసేటప్పుడు కారును మలుపు తిప్పాలంటే, ఏక్సిలరేటర్ పైనుంచి కాలు తొలగించి, స్పీడు తగ్గించి, వెళ్ళవలసిన వైపుకు స్టీరింగ్ ని తిప్పుతాం.
అదే అలవాటున, దారి ఏటవాలుగా మలుపు తిరుగుతున్నప్పుడు కారును మలుపు తిప్పుతూ ఏక్సిలరేటర్ పైనుంచి కాలు తొలగిస్తే, స్పీడ్ తగ్గిపోయి ఆ ఏటవాలును కారు ఎక్కడం కష్టం కావచ్చు. అందుకని స్పీడ్‌ను కొనసాగిస్తూనే ఆ విన్యాసం చేయాలి. అలాగే, పల్లంవైపుకు ఆగి ఉన్నప్పుడు వాహనాన్ని రివర్స్ చేయడం కూడా ఒక కళే. ఒకేసారి బ్రేక్, ఏక్సిలరేటర్ రెండిటినీ తొక్కే విన్యాసం చెయ్యాలి. ముంగాలితో బ్రేక్, మడమతో ఏక్సిలరేటర్! కొండల్లో మెలికలు తిరుగుతూ సాగే ఆ దారుల పొడవునా ఒకవైపు కొండ, మరోవైపు లోయ ఉంటాయి. ఆ లోయల్లో మేఘాలు తేలియాడుతుండటాన్ని, కొండరాళ్ళలోంచి దారి చేసుకుని గలగలమంటూ కిందకు జారే నీళ్ళ ధారలనూ గమనించడం ఒక వింత, ఒక సంతోషం, ఒక దివ్యానుభూతి.
ఇక హైవేల సంగతి చెప్పేదేముంది! 90-100 కిలోమీటర్ల స్పీడుతో వెళ్ళడం అలవాటే. అయితే ఇప్పుడు మేము వెళ్తున్న ఈ కర్ణాటక రోడ్డు మీద అంత వేగం అనవసరమేనని, 50-60 స్పీడుల్లో దూసుకుపోతున్నాం.
అప్పుడు జరిగిందది.
ఎదురుగా వేగంగా వస్తున్న బస్‌కు దారి ఇవ్వడానికి, కొద్దిగా ఎడమవైపుకు చేర్చాను కారును. బస్ రివ్వున మమ్మల్ని దాటిపోయింది కానీ, వేగంగా రోడ్డు అంచు దిగింది కారు. ఎడమవైపు ముందు చక్రం ఫట్‌మన్న చప్పుడు వినిపించింది. కొద్ది క్షణాల్లోనే స్పీడ్ సున్నాకు చేరింది.
కారును వీలైనంత ఎడమపక్కకు చేర్చి, దిగి చూశాను. టైర్ పంక్చర్ అయింది.
ట్యూబ్‌లెస్ టైరే కదా, మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి, పంక్చర్ వేయిద్దామనుకుంటూ కారెక్కాను. ఫస్ట్ గేర్ వేసి ముందుకు సాగే ప్రయత్నం చేశాను. అబ్బే! మరో రెండు మీటర్ల తర్వాత కదలడానికి బాగా ఇబ్బంది పడుతున్న కారును అతి కష్టం మీద రోడ్డు పక్కకు చేర్చి ఆపక తప్పలేదు.
సాయంత్రం అయిదున్నర కావస్తోంది. ఇంకా చీకటి పడలేదు – కానీ వెలుతురు వేగంగా తగ్గిపోతోంది. ధర్మస్థళకు దగ్గర్లోనే ఉన్నామని GPS ధైర్యం చెప్తున్నా, ఆ జాడలేవీ ఇంకా ప్రారంభం కాలేదు. తెలియని ప్రదేశంలో మూడు కిలోమీటర్లు కూడా ఎక్కువ దూరమే అనిపిస్తుంది. పైగా ఆగిపోయింది అడవి మధ్యలో అన్న వాస్తవం తెలిసి రాగానే, అక్కడనుంచి ఎంత తొందరగా బయల్దేరగలిగితే అంత మంచిది అన్న భావన బలపడసాగింది.
స్పేర్ టైర్ కోసం డిక్కీ తెరిచాను. మా సూట్‌కేసులని తీస్తే కానీ వాటి కింద బిగించి అమర్చిన స్పేర్ టైర్‌ను తీయడం కుదరదు. వాటిని తీసి బయట రోడ్డువారగా పెట్టాను. ‘ఎమర్జెన్సీ కార్ బ్రేక్ డౌన్ వార్నింగ్’ – ఎర్రగా మెరిసే ప్లాస్టిక్ ముక్కోణాన్ని తీసి రోడ్డు మీద పెట్టాను, కారుకు కొద్ది దూరంలో. ఇప్పుడు ‘జాక్’ ను బయటకు తీయాలి. విప్పవలసిన చక్రం కింద దాన్ని అమర్చి, కారును ఆ వైపు కొద్దిగా పైకెత్తి…
మా స్వంత కార్లో, స్పేర్ టైర్‌కు పక్కనే అందుబాటుగా అమర్చి ఉంటాయి ఈ పరికరాలన్నీ. ఈ కారు డిక్కీలో, ఒక పక్కన ఉన్న గూడులో ప్యాక్ చేసి ఉందా ‘జాక్’. అంతవరకూ ఎప్పుడూ దాని అవసరం పడిన దాఖలాలు కనపడలేదు. ‘జూన్ 2025 మోడల్ కారు సార్ ఇది,’ అని యజమాని చెప్పాడు కూడా, కారు తాళం చేతిలో పెడుతూ.
ఆ జాక్‌ను బయటికి లాగేందుకు ప్రయత్నించాను. అంగుళమైనా కదల్లేదది. మళ్ళీ బలాన్నంతా ఉపయోగిస్తూ దాన్ని కదిల్చేందుకు, బయటకు లాగేందుకూ ప్రయత్నించాను. మరోసారి, ఇంకోసారి… లాభం లేకపోతోంది. భుజాలు అలసిపోతున్నాయే కానీ, జాక్ మాత్రం బయటకు రావడంలేదు.
నిముషాలు వేగంగా గడుస్తున్నాయి. చీకటి చిక్కనవుతోంది. స్ట్రీట్ లైట్ల ప్రసక్తే లేదు. ఇంతవరకూ మరో వాహనమేదీ అటువైపు రాలేదు. శ్రీమతికి గాభరా పెరుగుతోంది. తన నిస్సహాయత నాకూ తెలుస్తోంది. వెళ్ళి కార్లో కూర్చుని డోర్ వేసుకోమన్నాను. పర్వాలేదని, నా పక్కనే నిలబడింది తను కూడా. ఏం చేయాలిప్పుడు? ఈ జాక్‌ను బయటకు తీయలేకపోతే ఎలా? నా బలం చాలడం లేదు. ఇక్కడే రాత్రి అయేలా ఉంది. ఏం చెయ్యను?
రివ్వున దూసుకెళ్తూ మమ్మల్ని దాటిపోబోయిన ఒక కారు, మాకు దగ్గర్లో ఆగింది. “హెల్ప్ బేకా?” అంటూ అడిగాడు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఒక యువకుడు. తలాడిస్తూ నేను జవాబివ్వబోయేంతలోనే, కారును మాకు పదడుగుల దూరాన ఆపి, అందులో ఉన్న వాళ్ళందరూ చకచకా దిగి మా దగ్గరకొచ్చారు.
అయిదారుగురున్నారు ఆ కుర్రాళ్ళందరూ కలిపి. అందరూ ఇరవైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళెవరి ముఖాలూ కనిపించనంత చీకటి అలుముకుందిప్పుడు.
ఎవరు వీళ్ళు? ఈ అడవిదారిలో, అర్ధరాత్రిలా అనిపిస్తున్న చీకట్లో, అర్థమయ్యీ కాని భాష మాట్లాడుతూ సాయం చేస్తామని ముందుకొస్తున్న ఈ అపరిచితులని నమ్మాలా వద్దా? నమ్మకూడదని – జీవితం పదేపదే నేర్పిన ఫార్ములా మెదడులో గణగణమని మోగుతోంది. కానీ నమ్మక తప్పని పరిస్థితి. అయినా, ఏం చేస్తార్లే? వాళ్ళు సరే. ఒకవేళ వాళ్ళేదైనా చేస్తే, నేను చెయ్యగలిగింది ఏమిటి? ఫోన్ తప్ప? ఎవరికి చేయగలను ఆ ఫోనైనా?
అనుమానాలూ ప్రశ్నలూ నాలో సుడులు తిరుగుతున్నాయి. సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. క్షణాలు వేగంగా పరుగెడుతున్నాయి. “పంక్చర్?” అంటూ అడిగాడు వాళ్ళలో కాస్త భారీగా కనిపిస్తున్న ఒకతను. తలూపాను.
కన్నడంలో తమలో తాము హడావుడిగా మాట్లాడుకుంటూ దెబ్బతిన్న టైర్‌ను పరిశీలించారు వాళ్ళు. “జాక్ ఇదెయా?” అడిగాడతను. డిక్కీ వైపు చూపాను. దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. మరో కుర్రాడు కూడా ప్రయత్నించాడు. ఫలితం శూన్యం. ఈసారి ఇద్దరూ కలిసి రకరకాలుగా దాన్ని కదిపేక, మొత్తానికి బయటకు వచ్చిందది.
హమ్మయ్య. ఊపిరి పీల్చుకున్నాను. ఇంకెంత? మరో పది నిముషాలు మహా అయితే.
చకచకా స్పేర్ టైర్‌ను బయటకు తీసి, మొబైల్ ఫోన్ల వెలుతుర్లో కారు కిందకు జాక్‌ను అమర్చబోతుండగా తెలిసింది వాళ్ళకి.
అది ఎలాయ్ వీల్. ‘ఆఫ్టర్ మార్కెట్,’ అంటే కారును షోరూమ్‌లో కొన్న తర్వాత, ఫాక్టరీ బిగించిన రిమ్‌లను కొత్త కారునుంచి తొలగించి, వాటి స్థానే ఎలాయ్ వీల్స్‌ను బయట వేరే షాపులో కొని అమర్చాడు యజమాని. మామూలు రిమ్ అయితే, డిక్కీలో ఉన్న పరికరాలతో చక్రాన్ని కారునుంచి వేరు చేయవచ్చు. ఈ రిమ్‌ను విప్పాలంటే ‘L’ ఆకారంలో ఉండే ఒక ప్రత్యేకమైన రెంచ్ కావాలి.
చకచకా డిక్కీని వెతికారు ఆ కుర్రాళ్ళు. ఆ రెంచ్ కనపడలేదు.
కారు యజమానికి ఫోన్ చేశాను. మా పరిస్థితిని గబగబా వివరించాను. ఏమాత్రం గాభరాపడకుండా “ఆ రెంచ్ కార్లో లేదు సార్,” అంటూ చావు కబురు చల్లగా చెప్పాడతను.
కుర్రాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఏదో గలగలా చర్చించుకున్నారు. “అంకుల్, మీరూ ఆంటీ మా కార్లో ఎక్కండి. మా వాళ్ళు తీసుకెళ్తారు. దగ్గర్లో ఏదైనా పంక్చర్ల షాపు ఉంటే, అక్కణ్ణించి ఆ రెంచ్ తెండి. మేం చక్రం మార్చేస్తాం,” అన్నాడు ముందుగా దిగిన కుర్రాడు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ కలగలిపి.
“మీ సామాన్లు మీ కార్లోనే పెట్టేసి, లాక్ చేసేయండి,” అన్నాడు తనే, నేను నోరు విప్పక ముందే!
ఆ చీకట్లో, ఆ పరిస్థితిలో, అంతకన్నా మంచి ఉపాయమేదీ నాకూ తోచలేదు. అదే చేశాం. “ఎక్కడనుంచి వస్తున్నారు మీరు?” వాళ్ళ కారుని డ్రైవ్ చేస్తున్నతన్ని అడిగాను. “బెళగావి,” అన్నాడతను. “బెళగావి మాలుమ్ అంకల్ ఆప్ కో?” తెలుసన్నాను.
“ఏం చేస్తుంటారు మీరు?” అడిగాను.
“నేను బ్యాంక్‌లో. ఇతను హోటల్,” అన్నాడు పక్కన కూర్చున్న కుర్రాడిని చూపుతూ. “మీరు?”
చెప్పాను.
“ఓ, చాలా దూరం వచ్చారే! ఎక్కడికి వెళ్తున్నారు?”
“ధర్మస్థళ. ఆ తర్వాత శృంగేరి. హంపి. మీరెక్కడివరకూ వెళ్తున్నారు?”
“మేం కూడా ధర్మస్థళకే. అక్కడినించి ఎక్కడికి వెళ్ళాలో రేపు డిసైడ్ చేసుకుంటాం”.
మాటల్లోనే ధర్మస్థళ చేరుకున్నాం. మొదటగా కనపడిన పంక్చర్ షాపులో రెంచ్ కోసం అడిగారు ఆ కుర్రాళ్ళు. దొరకలేదు. రెండో షాపు, మరికొంత దూరం వెళ్ళి మరో షాపు. ఊహూ. ఎక్కడా ఆ రెంచ్ దొరకలేదు. చివరి షాపులో అతను చెప్పాడు “ఈ పక్క సందులో ఓ గేరేజ్ ఉంది. అక్కడ ఉండొచ్చు”.
ఆ గేరేజ్‌కి వెళ్ళాం. అక్కడి మెకానిక్ అడిగిన మేరకు, ఈ కుర్రాళ్ళు మా కారు దగ్గర ఉన్న కుర్రాళ్ళకు ఫోన్ చేసి, ఆ రిమ్‌ను ఫోటో తీసి పంపమన్నారు. ఆ ఫోటోను చూసిన ఆ మెకానిక్, “రెంచ్ ఉంది. కానీ ఇవ్వను. నేనే వస్తాను. అయిదొందలు అవుతుంది,” అన్నాడు.
ఇద్దరిలో ఒక కుర్రాడు బేరమాడబోయాడు. నేను వారించి, మెకానిక్‌ను బయల్దేరమన్నాను. కారు ఎక్కడుందో చెప్పమని, కుర్రాళ్ళు చెప్పిన దారిలోకి తన స్కూటీ మీద తుర్రున వెళ్ళాడు మెకానిక్. కారు వెనక్కి తిప్పి మేమూ వెళ్ళాం.
ఏడు కావస్తోంది. అంతే. అయినా చీకటి బాగా ముదిరింది. వచ్చిన దార్లోకి వెళ్తున్నామనుకుంటూనే, ఆ చిమ్మచీకట్లో కారును మరో దారి పట్టించాడు డ్రైవ్ చేస్తున్న యువకుడు. దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్ళాక అనుమానం వచ్చి, వెనక్కి మళ్ళాం. ఈసారి మా కారును చేరుకోగలిగాం.
అప్పటికే మెకానిక్, పంక్చర్ అయిన చక్రాన్ని విప్పి, డిక్కీలోని స్పేర్ టైర్‌ను బిగించేసి వెళ్ళిపోయాడు కూడా!
ఊపిరి పీల్చుకున్నాం.
“థాంక్యూ బాబూ, థాంక్యూ. మీకు ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే,” అని వాళ్ళందరికీ ఎన్నోసార్లు, మనసారా ధన్యవాదాలు చెప్పాను. “నో ప్రాబ్లమ్ అంకల్… మీరు ఇంత చీకట్లో ఇక్కడ రోడ్డు మీద ఉండటం అంత మంచిది కాదు. అందుకే మిమ్మల్ని మా కార్లో వెళ్ళమన్నాం. పర్వాలేదు. ఓకే అంకల్, బై,” అంటూ వాళ్ళంతా, దిగినంత చకచకా తమ కార్లో ఎక్కి వెళ్ళిపోయారు, అయిష్టంగానే డబ్బు తీసుకుని. వాళ్ళ ముఖాలయినా సరిగ్గా కనపడలేదు.
కారును కదిలించాను. కొద్దిసేపట్లోనే ఊరు – ధర్మస్థళ మొదలైంది. ఆ ఆలయం పార్కింగ్ లోకి కారును చేర్చి, సామాన్లు తీసుకుని రూమ్ కోసం దగ్గర్లోని ఒక గెస్ట్ హౌస్ వైపు దారి తీశాం. ఆ రోజు స్థానికంగా జరిపే ఒక ప్రత్యేకమైన ఉత్సవంవల్ల ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇది మేము అనుకోని మరో పరిస్థితి. గదికోసం నాలుగైదు గెస్ట్ హౌసుల్లో ప్రయత్నించి అలసిపోతుండగా, చివరికి ఒక చక్కటి గది దొరికింది – రజతాద్రి గెస్ట్ హౌస్‌లో.
భోజనం చెయ్యడానికి ఆ గెస్ట్ హౌస్‌ను ఆనుకుని వున్న రెస్టారెంట్‌లోకి అడుగు పెడుతుండగానే ఎదురుగా దర్శనమిచ్చింది, కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకమైన యక్షగాన కళారూప వైఖరిలో ఉన్న ఒక విగ్రహం. ఆకర్షణీయమైన ఆ నిలువెత్తు విగ్రహం చూసీ చూడగానే ఢిల్లీలో, విద్యా కొళ్యూర్ అనే మా సహకళాకారిణి ఒకరు యక్షగాన ప్రదర్శనలివ్వడమూ, ఈ మధ్యనే యక్షగానం గురించిన ఒక వ్యాసాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేయడమూ ఇష్టంగా గుర్తొచ్చాయి. ఆ విగ్రహాన్ని తనివీదీరా కాసేపు చూస్తుండిపోయాను.
స్టేజి మీద జరిగే యక్షగాన ప్రదర్శనల్లో పాల్గొనడానికి ఆహార్యమూ, అభినయమూ ఎటూ కావలసిందే. వాటితోపాటు అపరిమితమైన శరీర దారుఢ్యం (stamina) కూడా కావాలన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే, ఈ నాట్యరూపంలో ఛెంగున ఎగరవలసిన, మెలికలు తిరగవలసిన సందర్భాలెన్నో ఉంటాయి. వాటికి తగ్గ చురుకుదనం, శారీరక దృఢత్వం సాధారణంగా పురుషులకే ఉంటాయన్న భావన ఉండేది. అందుకనే, చాలాకాలంపాటు యక్షగాన ప్రదర్శనల్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరించేవారు. అలా పురుషులకు మాత్రమే ప్రత్యేకమన్నట్లు సాగుతున్న ఆ కళాయానాన్ని, మూకాంబికా వారంబళ్ళి అనే కళాకారిణి ఒక మలుపు తిప్పారు. 1976లో మొట్టమొదటిసారిగా స్త్రీలు మాత్రమే ఉన్న తన బృందంతో ఒక యక్షగాన నాటకాన్ని ప్రదర్శించి, ఆవిడ చరిత్ర సృష్టించారు!
ఇంతకీ ఆ కళాకృతి ఇక్కడ ఈ హోటల్లో ఎందుకుంది? తొలినాటి యక్షగానబృందాల్లో ఒకటై, ఎంతో కీర్తిని సాధించిన ‘ధర్మస్థళ మేళా’ అనే బృందం, ఈ మంజునాథ స్వామి ఆలయానికి అనుబంధంగా ఉందట!
మంజునాథస్వామిని దర్శనం చేసుకుని, కారును ఉడిపి దారి పట్టించాం. మళ్ళీ చక్కని సింగిల్ రోడ్డుమీద పరుగులు తీస్తోంది కారు. నిన్నటి సంఘటన గుర్తుంది కాబట్టి, కొద్దిగా పెరిగిన జాగ్రత్తతో డ్రైవ్ చేశాను. మధ్యాహ్నానికల్లా ఉడిపి శ్రీకృష్ణమఠం ముందుకు చేరుకుని ఆగాం.
ఈ ఆలయంలో ప్రవేశించడానికోసమనే ప్రత్యేకించి తెచ్చుకున్న పంచె కట్టుకుని అలా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించబోయామో లేదో, ఎదురుగా ప్రత్యక్షమయారు – నిన్నటి మా దేవతలు! మమ్మల్ని చూసి వాళ్ళూ వాళ్ళను చూసి మేమూ ఒక్కసారిగా సంతోషంలో మునిగి తేలాం. ఈసారి వాళ్ళను మరికొంత స్పష్టంగా చూడగలిగాం. సెల్ఫీలూ తీసుకున్నాం. వాళ్ళు అక్కడినుంచి గోకర్ణం వెళ్తున్నారట. మనసారా మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుని విడిపోయాం.
అదేమిటో, పేర్లు తెలుసుకోవాలన్న ఆలోచన ఇప్పుడూ రాలేదు!
“నిజంగా ఆ సుబ్రమణ్యస్వామే పంపాడండీ ఆ కుర్రాళ్ళని,” అంది శ్రీమతి.
ఆ ఎపిసోడ్ అప్పుడే నా మనసులోనూ మెదులుతోంది. “అవును. చాలా పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. లేకపోతే ఆ చీకట్లో ఏం జరిగుండేదో ఎవరికి తెలుసు?” అన్నాను. ఆ వూహ మరోసారి బెదిరించింది. “అయినా, కుర్రాళ్ళు మంచివాళ్ళు కాబట్టీ, ధైర్యం చేసి నేను వాళ్ళని ఆపాను కాబట్టీ సరిపోయింది. లేకపోతేనా…”
“అంత లేదులెండి. నేను చెయ్యెత్తాను కాబట్టే వాళ్ళు ఆగారు!”
(సశేషం)







