లోకం

నిన్ను చూసి అరుస్తుందీ లోకం
అన్నా! వదలకు ఆత్మస్థైర్యం
రెండు నాలుకల బుసకొడుతుందది
గుండె దిటవుచెయ్ తమ్మీ! బెదరకు

రెండు మాటలీ లోకం పోకడ
విచిత్రమైనది భాయ్, తెలుసుకో!
నాకు జరిగిన అవహేళన అంతా
చెప్తానిప్పుడు ఎదను రాసుకో

ఉలగం కవిత. సంగీతం – ఇళయవన్. స్వరం: వైరముత్తు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.


అలతిపదాలను కూర్చి పాడితే
చిక్కందనమే లేదు పొమ్మంది
సినిమా పాటలొ సమాసం వేస్తే
చిన్నయసూరికి తమ్ముడు అంది

నన్నయ పెద్దన నావాళ్ళంటే
బావికప్ప అని పరిహసించింది
ఎలియెట్ నెరుదా పేర్లు చెప్పితే
పరుల భావాల తస్కరణన్నది

నిరాడంబరముగ నేనున్నప్పుడు
అలగా మనిషని అలుసు చేసింది
కాస్త మొహానికి పౌడరద్దినా
గాడిదకెందుకు గంధమన్నది

కాలు మీద కాలేసి కూర్చుంటె
చదువులు తెచ్చిన పొగరిది అంది
పెద్దలు వస్తే లేచి నిలబడితే
కవి కాదొట్టి కాకారాయుడన్నది

గొప్పను నిజాయితీగా పొగిడితే
చెవిలో పువ్వులు – జాగ్రత్తంది
గోరంత విమర్శ చేస్తే, బాబోయ్
కత్తి దూశాడు ప్రమాదం అంది

వెన్నుపోటుకు నే నేలకూలితే
అతితెలివికి అదే శాస్తి అన్నది
ఊపిరి బిగించి తిరిగి నిలబడితె
తాంత్రికుడమ్మో దూరం అన్నది

పగ ఎందుకని తప్పుకుపోయాను
పాపం భయపడ్డాడని అంది
ఢీకొని మొహాన ఉమ్మేశాను
చూశారా! ఒక మృగమితడన్నది

డబ్బూదస్కం పట్టనట్టున్నాను
వాడిది దరిద్రపు పుట్టక అంది
రక్తం కరిగించి ఓ మండపం కట్టాను
కవికాదు ఇతడు బూర్జువా అంది

సొంతూళ్ళో భూమయినా లేదు
ఇతడేం మట్టిమనిషీ అంది
కొబ్బరిచెట్లు కొన్ని కొన్నానంతే
అబ్బో! కవి భూస్వామయ్యాడంది

మోసగాళ్ళకు డబ్బివ్వనన్నాను
పిల్లికి బిచ్చం పెట్టడు అంది
నిజమున్నప్పుడు ఆదుకొన్నాను
వట్టి దుబారాగాడని అంది

మగువలతో మౌనంగా ఉన్నా
కవి అని ఎంతటి గర్వం! అంది
కొందరు స్త్రీలతో మాటాడాను
చూడు, కళ్ళలో కామం అంది

అవార్డులేవో వచ్చిపడ్డాయి
గుడ్డివాటు అదృష్టం అంది
మరిన్ని బిరుదులు అందుకున్నాను
ఢిల్లీలో ఎవరో తెలుసును అంది

సభలన్నిటికీ సరే అన్నాను
అయ్యో! కీర్తికి వెంపర్లాటంది
సమయం దొరక్క వద్దన్నప్పుడు
కవి లెక్కలు వేస్తున్నాడంది


అలాగ ఉంటే అది ఒక తప్పు
ఇలాగ ఉంటే ఇదీ ఒక తప్పు
మొరిగే కుక్కకు కారణమెందుకు?
తన నీడ చూసే మొరుగుతుందది

లోకం నోటిని కుట్టేయ్, లేదూ,
రెండు చెవులనూ గట్టిగ మూస్కో
లోకం నోటిని కుట్టడం కష్టం
నీ చెవులను మూసుకోవడం సులువు


[మూలం: తమిళ కవి వైరముత్తు, తమిళుక్కు నిఱముండు – 1995 (తమిళానికి రంగుంది) కవితా సంపుటి నుంచి ఉలగం అన్న కవిత. మూల కవిత తెలుగు, తమిళ లిపిలో. ]