1. కొసరు ప్రయాణం
ఎప్పట్లాగే ఈ సంవత్సరపు ఇండియా ట్రిప్‌లో కూడా ఒక సైడ్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఎక్కడకా అని ఆలోచించి, ఆగస్ట్ నెలలో అనువైన వాతావరణం ఉండి, కొంతకాలంగా నా బకెట్ లిస్టులో ఉన్న సౌత్ ఆఫ్రికా మీదుగా ఇండియాకి టికెట్లు కొనుక్కున్నా. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆగస్ట్ ఒకటిన బయల్దేరి పన్నెండున ఇండియా చేరేట్టు పథకం. సౌత్ ఆఫ్రికాలో పూర్తిగా ఎనిమిది రోజుల సమయం గడపొచ్చు.
అసలు సౌత్ ఆఫ్రికా నా బకెట్ లిస్టులోకి ఎలా చేరిందంటే, నేను న్యూయార్క్ రాష్ట్రంలో చదువుకునే రోజుల్లో క్రిస్టాఫనే స్నేహితుడుండేవాడు. అతను ఫ్రాన్సునుంచి కొద్ది నెలలపాటు మా యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడానికి వచ్చిన విజిటింగ్ స్కాలర్. అతనికి అమెరికా రావడం అదే మొదటిసారి. అతనుండేది కొద్ది నెలలు మాత్రమే. అందువల్ల తను చూడాలనుకున్న ప్రదేశాలన్నీ, వీకెండుకు ఒకటి చొప్పున గబగబా చూస్తుండేవాడు. ఒక వారం అతను బోర్డర్ దాటి మాంట్రియాల్ చూడ్డానికి వెళ్ళాడు. ఓ నాలుగొందల సంవత్సరాల క్రితం అక్కడ స్థిరపడ్డ ఫ్రెంచ్ వలసదారుల్ని చూడ్డం అతని ఉద్దేశ్యం. తిరిగొచ్చిన తర్వాత అతని ట్రిప్ గురించి అడిగితే నవ్వి “అక్కడి ఫ్రెంచ్ అంతా చాలా పాతకాలం నాటిది. ఫ్రాన్స్‌లో ఇప్పుడెవరూ అలాంటి భాష మాట్లాడరు. రెస్టారెంటుల్లో మెన్యూలు కూడా చాలా వింతగా ఉన్నాయి” అన్నాడు క్రిస్టాఫ్. ఒక నాలుగు వందల సంవత్సరాలనాటి ఫ్రాన్స్ అలా ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రవాస సమాజాల్లో నా ఆసక్తికి క్రిస్టాఫ్ అబ్జర్వేషనే మూలమనుకుంటాను. నేనూ ఒకరోజు ప్రవాసుడిని అవుతానన్న విషయం అప్పుడు నాకు తట్టనేలేదు. అప్పట్లో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్సులో చాలామందిమి వెనక్కి వెళ్ళిపోదామనే కలలుగనేవాళ్ళం.
ఇది జరిగిన కొన్ని నెలలకు నేను మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ఇండియా వెళుతూ, క్వాలలంపూర్లో ఫ్లైట్ మిస్సయ్యి ఒక రోజు పగలంతా అక్కడే ఉండిపోవాల్సొచ్చింది. ఆ ఫ్లైట్‌లో ఇండియా వెళ్తున్న యువత చాలామందిమే ఉన్నాం. మాకందరికీ ఎయిర్‌లైన్ వాడు ఒకే హోటలుకి వోచర్లు ఇవ్వడంతో మేమంతా కలిసి ఒక మినీ వాన్ మాట్లాడుకుని సిటీ టూరుకెళ్ళాం. మా డ్రైవర్ ఒక ప్రవాస భారతీయుడు. దాదాపు మా వయసువాడే. మేము అతన్నే గైడులా కూడా వాడుకుని పెట్రోనాస్ టవర్స్‌లాంటి ముఖ్యమైన టూరిస్టు స్పాట్సన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశాం. మేము హోటల్‌కి తిరిగి వెళుతుండగా అతనొక వింత రిక్వెస్ట్ చేశాడు. గ్లవ్ కంపార్ట్‌మెంట్‌లోంచి ఒక ఆడియో కేసెట్ (సినిమా పాటల టేప్ అది) తీసి ప్లే చేస్తూ అది ఏ భాషో మాలో ఎవరికన్నా తెలిస్తే చెప్పమని కోరాడు! ఆ టేపుని వాళ్ళ నాన్న వింటూ వుండేవాడట. అతను కొన్నేళ్ళ క్రితమే చనిపోయాడు. ఇతడికి అదే భాషో కూడా తెలీదు. తెలిస్తే ఏదో ఓ రోజు ఇండియాలో ఆ రాష్ట్రాన్ని చూసొద్దామని అతని కోరిక! (అన్నట్టు, ఇది ఇంటర్నెట్ రాకముందు జరిగిన విషయం. మా గ్రూపులో అన్ని దక్షిణాది రాష్ట్రాల వాళ్ళమూ ఉండడంతో, అది మళయాళమన్న సంగతి సులువుగానే చెప్పగలిగేం అతనికి). ఎందుకో ఆ సంఘటన నా హృదయానికి హత్తుకుని ప్రవాస భారతీయుల మీద ఆసక్తిని పెంచింది!
ఆ తర్వాతి కాలంలో, నేను అమెరికన్ పౌరసత్వం తీసుకున్నాననీ, నేను ప్రపంచంలో ఎక్కువ కాలం నివసించిన సిటీ ఫ్రీమాంటనీ, నేనిక్కడి ప్రవాస సమాజంలో భాగమైపోయాననే సత్యాల్ని జీర్ణించుకున్నప్పట్నుంచీ, నా తర్వాతి తరాల వారెలా ఉంటారన్న కుతూహలం మొదలైంది. నా మనవలు, మనవరాళ్ళు, వారి సంతానంలో నా భారతీయత లేశమాత్రమైనా మిగుల్తుందా? ఇదీ నా సంధ్యా సమస్య!
ఇంతకీ ప్రవాస సమాజాల్లో నా ఆసక్తికీ, సౌతాఫ్రికాకీ సంబంధమేంటంటారా? చాలానే ఉంది! సౌతాఫ్రికాలో పదిహేడు లక్షలకు పైగా ప్రవాస భారతీయులున్నారు. ఇటీవలి కాలంలో మనవారు స్టూడెంట్స్‌గానో లేదా నానా రంగాల్లో నిపుణులుగానో వెళుతున్న దేశాల్ని — అంటే గల్ఫ్, అమెరికా, యూకే, కెనడాల్నీ, పొరుగునున్న బర్మానీ ప్రక్కన పెడితే, ప్రవాస సమాజాలున్న దేశాల్లో మలేషియా తరువాతి స్థానం సౌతాఫ్రికాదే! ఇదెలా జరిగిందంటే, 1860-1911 మధ్య కాలంలో బ్రిటిష్‌వాళ్ళు ఒక లక్షన్నరమంది భారతీయుల్ని సౌతాఫ్రికా తీసుకెళ్ళారు. ఇది ఇండెంచర్డ్ లేబరర్స్ (indentured labourers) గా వెళ్ళిన వారి సంఖ్య. అదే కాలంలో తమ ఇష్టానుసారం వ్యాపారం రీత్యా వెళ్ళిన వాళ్ళూ, వర్ణవివక్ష (apartheid) ముగిసిన తరవాత, అంటే 1994 తరవాత వెళ్ళిన వాళ్ళూ అందరూ కలిసి ప్రస్తుతం 17 లక్షలకు పైగా ప్రవాసులున్నారక్కడ! వాళ్ళలో ఎక్కువమంది తమ పూర్వీకులు వెళ్ళిన నటాల్ రాష్ట్రంలో, ముఖ్యంగా డర్బన్ నగరంలో ఉంటారు. ప్రపంచంలో ప్రవాస భారతీయులు ఎక్కువమంది ఉన్న నగరం డర్బన్! అక్కడ 8 లక్షలకు పైగా ప్రవాసులున్నారు. అది ఆ నగరపు జనాభాలో దాదాపూ ఇరవై శాతం! ఒక వందా రెండొందల ఏళ్ళ తర్వాత నా వారసులెలా ఉండబోతున్నారో ఊహించడానికి నమూనా ఇక్కడ దొరుకుతుంది అనిపించింది.
నేను సౌతాఫ్రికాను ఎంచుకోవడానికి ప్రవాస సమాజాల్లో నా ఆసక్తి మొదటి కారణమైనా, ట్రిప్పు కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ చూడాల్సినవి చాలా కనబడ్డాయి. ముఖ్యంగా, భారత స్వాతంత్ర్యోద్యమం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు సౌతాఫ్రికా తప్పక చూడాల్సిన దేశం! గాంధీగారు సౌత్ ఆఫ్రికాలో కొంత కాలమున్నారని చిన్నప్పుడు స్కూలు పుస్తకాల్లో చదువుకున్నా, ఇండియన్ ఇండిపెండెన్స్‌లో సౌతాఫ్రికాది ఒక కీలకపాత్ర అన్న విషయం ఈ ట్రిప్పు వరకూ నాకు తెలీదు. ఇరవై నాలుగేళ్ళ వయసులో, అప్పుడే తీసుకున్న లా డిగ్రీతో, బ్రతుకుతెరువు కోసం సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టిన గాంధీగారు ఒక ఇరవయ్యేళ్ళ తర్వాత ఇండియాకి తిరిగి వెళ్ళి, అక్కడి స్వాతంత్ర్యోద్యమానికి సారధ్యం వహించారంటే, దానికి ఆయన సౌతాఫ్రికాని ట్రెయినింగ్ గ్రౌండ్‌గా వాడుకోవడమే కారణం! ఆయన వాడిన సత్యాగ్రహంలాంటి ఆయుధాలన్నీ సౌతాఫ్రికాలో సానపెట్టుకున్నవే! మరోలా చెప్పాలంటే, గాంధీగారి పాత్ర లేకుండా కూడా, ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చుండేదే. కానీ సౌతాఫ్రికాకి వెళ్ళకుండా గాంధీగారు స్వాతంత్ర్యోద్యమానికి నాయకులయ్యుండేవారు కాదేమో!
ఇక, నా ఆఫ్రికా ట్రిప్పు గురించి మిత్రులతో ప్రస్తావిస్తే ఆఫ్రికా వెళ్లి సఫారీ చూడకపోవడమేమిటన్నారు. దాంతో, సఫారీక్కూడా సమయం కేటాయిస్తూ నా ప్రణాళిక ఖరారు చేసుకున్నాను. ఎనిమిది రోజుల్లో రెండ్రోజులు జొహానెస్‌బర్గ్‌లో, మూడ్రోజులు క్రూగర్ నేషనల్ పార్కులో, మిగతా మూడు రోజులూ డర్బన్‌లో — అదీ ప్లాన్. నా ట్రావెల్ ప్లాన్ చూసి ముచ్చటపడి నా సహోద్యోగీ, స్నేహితుడూ అయిన జగదీష్ కూడా నాతో వద్దామని నిర్ణయించుకున్నారు. తను రావడంవల్ల మంచి తోడు దొరకడమే కాకుండా మంచి నేవిగేటర్ కూడా దొరికినట్టయింది. లేకపోతే, తెలీని దేశం, తెలీని రోడ్లమీద ఎడమ ప్రక్క డ్రైవింగ్‌తో చాలా కష్టపడుండేవాణ్ణి. సౌతాఫ్రికాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ గొప్పగా లేదు. డ్రైవ్ చెయ్యకుండా మనం చూడాలనుకున్న ప్రదేశాల్ని చూడ్డం కష్టం!
జగదీషూ నేనూ SFO నుంచి లండన్ మీదుగా ప్రయాణం చేసి జొహానెస్‌బర్గ్ O. R. Tambo International Airport చేరుకున్నాం. ఆలివర్ టాంబో అనే ఆయన మండేలాకి కుడిభుజంలాంటి వ్యక్తి. అపార్టైట్ (apartheid) పై ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) చేసిన పోరులో ముఖ్యుడు. ఇలా ఎయిర్‌పోర్టులూ, రోడ్లూ, స్టేడియాలూ ANC ప్రముఖుల పేర్లతో ఉండడం మనకి చాలా పరిచయమున్న విషయమనిపించింది. వారి అపార్టైట్ పోరాటమూ మన స్వాతంత్ర్యోద్యమమూ ఒకటే!
మేం జొహానెస్‌బర్గ్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగేసరికి అప్పుడే తెల్లవారింది. ఆ సమయంలో ఎయిర్‌పోర్టు పెద్ద రద్దీగా లేకపోవడంవల్ల ఇమ్మిగ్రేషన్ త్వరగానే పూర్తయింది. అమెరికన్ సిటిజెన్స్‌కి వీసా అవసరం లేదు. అలానే, ఏ దేశం ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఇంగ్లీషులో ఉన్నదైతే చాలు, చెల్లుతుంది. ఇక మా సెల్‌ఫోన్లకి ఇంటర్నేషనల్ రోమింగ్ ఉన్నా కూడా, లోకల్ నంబర్లకు కాల్ చేయడం సులువవుతుందని ఒక లోకల్ SIM కార్డు తీసుకున్నాం.
జొహానెస్‌బర్గ్‌కి చాలా ముద్దుపేర్లున్నాయి. దీన్ని జోౙీ అనీ, జోబర్గ్ అనీ, ఇగోలి (City of Gold) అనీ పిలుస్తారు. ఇది చాలా ధనిక నగరం! ఇక్కడ మిలియనీర్ల సంఖ్య చాలా ఎక్కువని చెబుతారు. JNB ఎయిర్‌పోర్టులో మాత్రం మెయింటెనెన్సు తక్కువైన విషయం కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. రెస్ట్‌రూముల్లో వేన్నీళ్ళున్న దాఖలాలు కనబళ్ళేదు. హీటింగ్ కూడా సరైన మోతాదులో లేదు. లగేజీ మోసేందుకు సహాయపడతామని పోర్టర్లలాంటి వ్యక్తులు వెంటబడితే వాళ్ళని వదిలించుకున్నాం. ఇక జగదీష్ SIM కొనడానికి వెళితే, తను అడిగింది కాకుండా అవసరానికి మించింది అంటగట్టేరు. సౌతాఫ్రికాలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువనీ, నిరుద్యోగం ఎక్కువనీ (30 శాతానికి మించి), అందువల్ల నేరాలు (కార్‌జాకింగ్‌లూ, దారి దోపిడీలూ వగైరా) ఎక్కువనీ ట్రావెల్ గైడ్లు పదేపదే హెచ్చరించడంవల్ల మేము స్ట్రీట్ క్రైమ్‌కి సిద్ధపడే వచ్చేంగానీ, ఎయిర్‌పోర్ట్‌లో మోసాల్ని ఊహించలేదు! లక్కీగా, JNBలో ఎదురైన అనుభవాలు మళ్ళీ ఎక్కడా మాకు ఎదురవ్వలేదు. కార్ రెంటల్ ప్రాసెస్ అమెరికాలోకంటే మెరుగనిపించింది. అదనపు బీమా తీసుకోవాలని మమ్మల్ని ఒత్తిడి చెయ్యకపోవడమే కాకుండా, వాళ్ళే వాహనాన్నిపూర్తిగా ఇన్స్పెక్ట్‌చేసి మాకు వీడియో క్లిప్పు పంపించడం బాగుందనిపించింది.
ఎయిర్‌పోర్టునుంచి హోటల్‌కి చేరేసరికి డ్రైవర్‌గా నేనూ, నేవిగేటర్‌గా జగదీషూ — మా పాత్రలకి అలవాటుపడ్డాం. దార్లో గమనించింది హోటల్సూ, మాల్సూ, ఆఫీసు భవనాలూ.. అన్నిటికీ ఎత్తయిన ప్రహరీగోడలూ, మెయిన్‌గేటు దగ్గర సెక్యూరిటీ గార్డులూ… మాకు అమెరికాలో అలవాటైన దానికి భిన్నంగా కనబడింది. బహుశా అక్కడి నేరాల గణాంకాల కు అనుగుణంగా అనుకుంటా!
ఇక మిగతా ప్రయాణ వివరాలు కాలక్రమంలో కాకుండా అంశాలవారీగా చెప్తాను.
2. 1860 హెరిటేజ్ సెంటర్
సౌతాఫ్రికాలోని ప్రవాస భారతీయుల పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోడానికి, డర్బన్ నగరంలో ఉన్న ఈ “1860 హెరిటేజ్ సెంటర్” అనే మ్యూజియాన్ని చూడ్డం తప్పనిసరి! సౌతాఫ్రికాలో అపార్టైట్ మ్యూజియాలు చాలా నగరాల్లో ఉన్నాయిగానీ, ఇండియన్ ఇండెంచర్డ్ లేబర్ గురించి తెలుసుకోడానికి ఇదొక్కటే మ్యూజియం. ప్రవాసులకి మొదటినుంచీ ప్రధాన స్థావరంగా ఉన్న డర్బన్ నగరంలో ఈ మ్యూజియం ఉండడం సహజం. (డర్బన్ నగరం క్వౙూలూ నటాల్ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని పూర్వం నటాల్ అని వ్యవహరించేవారు. డర్బన్‌ని పోర్ట్ నటాలనే వారు). మా హోటలున్న గోల్డెన్ మైల్ బీచ్ ఏరియాకి ఈ మ్యూజియం దగ్గర్లోనే ఉండడంతో సులువుగానే వెళ్ళగలిగేం.
ఇంకా ముందుకు వెళ్ళేముందు… ‘ఇండెంచర్డ్ లేబర్’ని తెలుగీకరిద్దాం. “ఒప్పంద కార్మికులు” అని Google Translate చూపెడుతుంది. అంటే ఒక ఒప్పందం ప్రకారం పనికి కుదురుకున్న మనుషులని అర్థం. (Bonded labour అంటే, తీసుకున్న అప్పుని పనిచేసి చెల్లించుకొనేవారట). నిజానికి ఒప్పంద కార్మికుడనేది ఇండెంచర్డ్ లేబర్‌కి అనువాదమైతే, మనలో చాలామందిమి ఆ జాబితాలోనే చేరతామేమో! నా ఉద్దేశ్యంలో ఈ ఇండెంచర్డ్ లేబర్ అనేది బ్రిటిష్ వారి మార్కెటింగ్ పరిభాష. ఇండియానుంచి వారి ఇతర కాలనీలకి బ్రిటిష్ వారు ఎక్కువ సంఖ్యలో మనుషుల్ని తీసుకెళ్ళింది – వ్యవసాయ కార్మికులుగా. ముఖ్యంగా చెరుకు పండించడానికి. ఇకపోతే, బ్రిటిష్ వారి చట్టాల్లో, వారు చాలా సాధారణ పదం ‘కూలీ’ని దాని అసలు అర్థంలోనే (unskilled labour) వాడారు. దానికున్న అవమానకరమైన జనరలైజేషన్‌ని పక్కనబెట్టి, నేను ఈ పదాన్నే ఈ వ్యాసంలో వాడతాను.
చరిత్రలోకి వెళితే, 1833 లో బ్రిటిష్ వారు బానిసత్వాన్ని నిషేధిస్తూ చట్టాలు చేసి దాని అమలుకు 1834 వరకూ గడువిచ్చుకున్నారు. బ్రిటిష్ కాలనీలలోనైతే ఈ గడువు 1838 వరకూ. అయితే బ్రిటిష్ వారు ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఈ చట్టాలు చేయలేదు. ఎందుకంటే, బానిసత్వ నిషేధం అమల్లోకి రాకముందే, అంటే 1834 కు ముందునుంచే, వారి కాలనీలకి బానిసల స్థానంలో ఇండియన్ కూలీలని తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టించిన గ్రామీణ పేదరికం, కరవు పరిస్థితులు ఈ కూలీలని సేకరించే ప్రక్రియను చాలా సులువు చేసినై. వీళ్ళని ముఖ్యంగా చెరుకు పండించడానికి తీసుకువెళ్ళారు. ఒప్పంద కాలం ఐదు సంవత్సరాలుండేది. బ్రిటిష్ వారు ఏ కాలనీకి, ఎంతమంది కూలీలని తీసుకెళ్ళారన్న వివరాలు దిగువ పట్టికలో ఇచ్చాను.
| ఎక్కడికి | ఎప్పుడు | ఎంతమందిని |
|---|---|---|
| మారిషస్ | 1834-1920 | 500,000 |
| వెస్టిండీస్ & గయానా | 1838-1917 | 550,000 |
| నటాల్ (సౌతాఫ్రికా) | 1860-1911 | 152,000 |
| ఫీజీ | 1878-1916 | 60,000 |
నటాల్ సంగతి కొస్తే, 19వ శతాబ్దం మధ్యలో ఇది చాలావరకూ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతం. వీరు దీన్ని స్థానిక ౙూలూ తెగనుంచి యుద్ధాల ద్వారానూ, ఒప్పందాలతోనూ లాక్కున్నారు. తమని ఓడించి, తమ నేలను ఆక్రమించిన బ్రిటిష్ వారి చెరుకు పొలాల్లో పనిచేయడానికి ససేమిరా అన్నారు పరాక్రమానికి పేరున్న ఆ ౙూలూలు. దాంతో బ్రిటిష్ వారికి ఇండియానుంచి వ్యవసాయ కార్మికుల్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. 1860 లో నటాల్ కి కూలీలని తీసుకురావడం మొదలుపెట్టేనాటికి, ఈ ప్రక్రియలో బ్రిటిష్ వారికి పాతిక సంవత్సరాల అనుభవముంది. అయినా కూడా అది చాలా లోపభూయిష్టంగా ఉండేదని అర్థమవుతుంది.
1860 నవంబర్‌లో మొదటి విడతగా, రెండు ఓడలు నటాల్‌కి బయల్దేరాయి. మద్రాసునుంచి బయల్దేరిన ట్రూరో (Truro) లో 339 మందీ, కలకత్తానుంచి బయల్దేరిన బెల్వెడీర్ (Belvedere) లో 313 మందీ కూలీలుండగా, డర్బన్ చేరేసరికి 29 మంది రకరకాల రోగాలతో మరణించేరట. డర్బన్‌లో కాలు పెట్టినప్పటినుంచీ ఆ కూలీలకి ఎదురైన పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండడంతో, ఇంకో 13 మంది అక్కడకు చేరిన కొద్ది రోజులకే మరణించేరు! తర్వాత కూడా వారికి ఎదురైన అవమానాలని భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కూలీల అజమాయిషీకి ‘సర్దార్’ అనే హోదాలో ఇండియన్స్‌నే వాడేవారట. వీరి క్రూరత్వానికి ఒక ఉదాహరణ… ఒక రోజు తమకు ఉదయానే ఇచ్చే గంజిలో ఉప్పు తక్కువైందని కూలీలు మొరపెట్టుకుంటే, ఆ సర్దార్ అందులో మూత్రం పోసి, ‘ఇప్పుడు ఉప్పు సరిపోయుంటుంది; తాగమ’న్నాడట. ఆ సంఘటన తర్వాత పలు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయట.
ఇలా కూలీలుగా నటాల్‌కి వెళ్ళిన వారిలో ప్రతి ఒక్కరికీ బ్రిటిష్ వారు సీరియల్ నంబర్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ ప్రవాసులు వారి పూర్వీకుల సీరియల్ నంబర్లు చెపుతారు.
ఈ 1860 హెరిటేజ్ మ్యూజియంలో ఈ కూలీలు వచ్చిన పరిస్థితులూ, వారు పడ్డ కష్టాలూ, తరువాతి కాలంలో సమాజంలో వారి ఎదుగుదలా, అపార్టైట్‌ని ప్రతిఘటించడంలో ప్రవాసుల పాత్ర మీద ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఇది పెద్ద మ్యూజియం కాదు. పట్టుమని పది గదులుంటాయేమో… కానీ ఒక అయిదు గంటలు ఇందులో గడిపినా చాలలేదనిపించింది. ముఖ్యంగా మద్రాసునుంచి వెళ్ళిన ట్రూరో పాసెంజర్ లిస్టు చదువుతుంటేనో, ఫొటోల్లో వాళ్ళ ముఖాలు చూస్తుంటేనో — వీళ్ళు మనవాళ్ళు, పాపం ఎంత కష్టపడ్డారో అని హృదయం ఆర్ద్రం కాక మానదు!
ఈ కూలీలని తీసుకు రావడంలోనూ, తీసుకొచ్చిన తర్వాతా బ్రిటిష్‌వాళ్ళు ప్రదర్శించిన అమానుషత్వం పక్కన పెడితే, వారి పేర్లని టోకున “నామ రూపాల్లేకుండా” చేయడం, పుండుమీద కారం జల్లడమే! పాపం ఈ ఇండెంచర్‌కి సిద్ధపడి వచ్చిన వాళ్ళందరూ చక్కగా వాళ్ళ పేర్లని ఓ కాగితమ్ముక్కమీద రాసో రాయించుకునో తీసుకొస్తే, బ్రిటిష్ గుమస్తాలు వాటిని చెత్తబుట్టలో పారేసి, ప్రతి ఒక్కరితోనూ తమ పేరు చెప్పించి, దాన్ని వారికి తోచినట్టు ఇంగ్లీషులో వ్రాసేవారట. తర్వాత జరిగిన మార్పులు చేర్పులతో కలిసి, ప్రవాసుల పేర్లు మనం గుర్తు పట్టలేని రకంగా ఉంటాయి. ఉదాహరణకి Moodley అనే పేరుని ముదలియర్ గా గుర్తుపట్టడానికి చాలా క్రియేటివిటీ కావాలి! అలానే, విశాఖపట్టణం అనే పేరు వైజాగ్‌గా ఎలా రూపాంతరం చెందిందో కూడా ఈ పాసెంజర్ లిస్టులో మనకి తెలుస్తుంది. అలానే హిందువుల్ని Gentoo అనే మాటతో వ్యవహరించేవారని అర్థమవ్వడానికి గూగుల్ అవసరమైంది.
కూలీలని తీసుకెళ్ళిన బ్రిటిష్ వాళ్ళు ఒక్క విషయంలో మాత్రం మాట నిలబెట్టుకున్నట్లు కనబడుతుంది. ఒప్పందం పరిమితి అయిదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూలీలని నిజంగానే విడుదల చేసేవాళ్ళు. మొదట్లో కొంతమంది ఇండియాకి తిరిగి వెళ్ళిపోయినా, తర్వాతి కాలంలో ఎక్కువమంది, నటాల్లోనే ఉండి వేరే బ్రతుకుతెరువులు వెతుక్కున్నారు. కూరగాయలు పండించి బౙార్లలో అమ్ముకోవడం, హోటళ్లలో పనిచేయడం, రైల్వేల నిర్మాణంవంటి పనుల్లో స్థిరపడి, వీళ్ళు ఒక ప్రవాస సమాజంగా ఏర్పడ్డారు.
ఆ తర్వాత వారికెదురైన సమస్యలన్నీ బ్రిటిష్ / ఆఫ్రికానర్ ప్రభుత్వాల వర్ణవివక్ష విధానాలవల్ల వచ్చిన కష్టాలు. వీటిని ప్రతిఘటించడంలో గాంధీగారి పాత్ర ఉంది. ఐతే ఆయన కాక చాలామంది స్థానిక నాయకుల పాత్ర కూడా చాలా ఉంది. నిజానికి తరువాతి కాలంలో (ముఖ్యంగా అపార్టైట్‌లో) వచ్చిన వర్ణవివక్ష తీవ్రత గాంధీగారి సమయంలో లేదు. ప్రవాసుల తరఫున బ్రిటిష్ వారిని ప్రతిఘటించడంలో గాంధీగారికి అవసరమైన దానికంటే ఎక్కువ గుర్తింపు దొరికిందనే అభిప్రాయం ప్రవాసుల్లో ఉందన్న భావన కలిగింది నాకు.
అలానే, మిగతా యూరోపియన్ కాలనిస్టులతో పోలిస్తే బ్రిటిష్ వారి ప్రవర్తన కొంత మెరుగనిపిస్తుంది. సౌతాఫ్రికా పర్యటనకి చేసిన పరిశోధనలో నాకర్థమయిన విషయం ఇది. బ్రిటిష్ వారు ఇండియన్స్‌ని కూలీలుగా తీసుకెళ్ళడం మొదలుపెట్టక ముందునుంచీ, డచ్చి వారు ఇంకా ఘోరంగా వందలమంది ఇండియన్స్‌ని (స్త్రీలు, పిల్లలతో సహా) రకరకాల ఆశలు చూపెట్టో, కిడ్నాప్ చేసో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌కి తీసుకెళ్ళి బానిసలుగా వాడేరట! అపార్టైట్ గురించి వ్రాసినప్పుడు దీని గురించి మరికొన్ని వివరాలిస్తాను.
నిరుద్యోగం, పేదరికం పెద్ద ఎత్తున ఉన్నంతవరకూ, ఏ కాలంలోనైనా ఇలాంటి దోపిడీకి గురయ్యే ప్రజలు ఉంటూనే ఉంటారు. దీనికి దృష్టాంతం ప్రస్తుత రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో కూడా వందలమంది భారతీయుల్ని సైనికులుగా రష్యా సమకూర్చుకోగలగడం.
3. Keeping Up with the Kandasamys
డర్బన్ నగరపు శివార్లలో ఉన్న చాట్స్‌వర్త్ (Chatsworth) ని సౌతాఫ్రికాలో ప్రవాస (భారతీయుల) కేంద్రంగా వర్ణించవచ్చు. అపార్టైట్ విధానం (apartheid policy) లో కీలకమైన అంశం శ్వేతేతరులను భౌగోళికంగా విభజించడం; తద్వారా వారిని అణగదొక్కే పనిని సులువు చేసుకోవడం! ఈ విధానంలో భాగంగా ఆనాటి ప్రభుత్వం 1960లలో, డర్బన్ నగరంలోని ప్రవాసులందరినీ చాట్స్‌వర్త్‌కి తరలించింది. చాట్స్‌వర్త్‌ని స్థానిక నల్లవారికీ, తెల్ల యూరోపియన్లకీ మధ్య కంచె (buffer zone) గా నిర్దేశించింది. ఈ చాట్స్‌వర్త్ ప్రాంతం ఇప్పటికీ దాదాపు నూరు శాతం ప్రవాసులుండే పట్టణం. తర్వాతి కాలంలో, ప్రవాసులు ఎక్కువగా ఉండే ఫీనిక్స్ లాంటి టౌన్‌షిప్పులు వెలిసినా, మొట్టమొదటి ప్రవాస కేంద్రం చాట్స్‌వర్త్.
2017 లో విడుదలై ప్రశంశలందుకున్న సౌతాఫ్రికన్ సినిమా ‘Keeping Up with the Kandasamys’ ఇక్కడి ప్రవాస సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి చిత్రం. ఖచ్చితంగా చూడతగ్గది, ముఖ్యంగా సామాజిక మానవ శాస్త్రం (Social Anthropology) మీద ఆసక్తి ఉన్నవారికి. ఈ సినిమాకి మూడు సీక్వెల్సున్నాయి గానీ, కొంత-నుంచీ-బాగా పేలవంగా ఉంటాయి.
అన్నట్టు, నాకు జొహానెస్‌బర్గ్‌లోనూ ప్రవాసులు కనబడ్డారుగానీ, నిజంగా సౌతాఫ్రికన్ ప్రవాస సమాజాన్ని చూడాలంటే, డర్బన్ – ముఖ్యంగా చాట్స్‌వర్త్ వెళ్ళాల్సిందే!
అమెరికాలో ఇండియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో నేనుండే శాన్‌ఫ్రాన్సిస్కో – బే ఏరియా ఒకటని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడి ప్రవాస వాతావరణానికీ, ఏ హైదరాబాదూ వైజాగుల్లోనో కనబడే వాతావరణానికీ తేడా ఉండదు. ఎందుకంటే అమెరికన్ ప్రవాసుల్లో ఎక్కువ భాగం ఇక్కడికి గత రెండు మూడు దశాబ్దాలలోపు వచ్చినవారే. దానికి తోడు, ఇండియా అమెరికాల మధ్య ప్రయాణ సమయమూ ఖర్చూ బాగా తగ్గిపోవడం, సౌకర్యం పెరగడం, అక్కడి వార్తలు, సినిమాలు, సంగీతం, పుస్తకాలు వగైరా వెనువెంటనే ఇక్కడ అందుబాటులోకి రావడం మొదలైన కారణాల మూలంగా ఇక్కడ ఇంకా ప్రత్యేకమైన ప్రవాస వాతావరణం ఏర్పడలేదు.
క్రూౙ్ షిప్ పరిభాషలో చెప్పాలంటే, గత రెండు మూడు దశాబ్దాలలో భారతదేశంనుంచి అమెరికాకు వచ్చిన ప్రవాసులకు ఇక్కడి జీవనం ఒక షోర్ ఎక్స్‌కర్షన్ (shore excursion) లాంటిది మాత్రమే. క్రూౙ్ షిప్ ఇంకా పోర్టులోనే ఉంది. క్రూౙ్ షిప్ మనల్ని వదిలేసి వెళ్ళిన తర్వాతగానీ ఎక్స్‌కర్షన్ ముగియదు. ప్రవాస ఐడెంటిటీ ఏర్పడదు!
ఆహారం:
ఇండియన్ రెస్టారెంట్‌లు చాలానే కనబడ్డాయి జొహానెస్‌బర్గ్‌లో. అయితే నేను ట్రై చేసిన ఒకటి రెండిటిలో మాత్రం, ‘మన వంటలు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇలా ఉండి ఉండవు’ అనిపించింది. డర్బన్‌లో, ముఖ్యంగా చాట్స్‌వర్త్‌లో మాత్రం ఫర్వాలేదు. రెస్టారెంట్స్‌లో మసాలాలు వాడడం మన ఇండియన్ రుచులకు అనుగుణంగానే ఉంది. డర్బన్‌లో నేను గమనించిన రెండు విశేషాలు ఇవి:
ఇకపోతే సౌతాఫ్రికన్ ప్రవాసుల గురించి వ్రాస్తూ, ‘బన్నీ చౌ’ని ప్రస్తావించకపోవడం నేరం! టిక్కా మసాలాలూ సమోసాలూ బిర్యానీలను మించి, సౌతాఫ్రికన్ భోజనప్రియులకి ప్రవాసులిచ్చిన కానుక బన్నీ చౌ! నిజానికి ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉన్న వంటకం ఇంకొకటుండదేమో!
దీని చరిత్రకి రెండు మూడు కథనాలున్నాయి. ఒకటి చెపుతాను. కారణాలు తెలియదుగానీ, 1920ల్లో ప్రవాస కార్మికులు లంచ్‌బాక్సుల్లో భోజనం తెచ్చుకోడాన్ని నిషేధించారట తెల్ల యజమానులు. దానికి జవాబుగా, కొంతమంది తెలివైన వ్యాపారులు బ్రెడ్ (లోఫ్) ని డొల్ల చేసి పప్పుతోనో, కూరతోనో నింపి మళ్ళీ మూసివేసే విధానం మొదలుపెట్టారట. బాక్సు అవసరం లేకుండా ఆ బ్రెడ్డుకి ఒక కాగితం చుట్టుకుని తీసుకెళ్ళేవారట వర్కర్స్. ఈ రకం బ్రెడ్‌ని అమ్మిన వ్యాపారుల (బనియాల) పేరిట దీన్ని “బనియా చౌ” అనే వారట. అదే తర్వాత “బన్నీ చౌ” గా రూపాంతరం చెందింది.
ఇది ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఇండియన్ రెస్టారెంట్లలో పాప్యులర్ మెన్యూ ఐటం కావడమే కాకుండా, దాదాపు అన్ని రెస్టారెంట్లలోనూ దొరుకుతుంది. దీన్ని ఆర్డర్ చేసేటప్పుడు తమక్కావలసిన ఫిల్లింగ్‌తోపాటూ దాని సైౙు కూడా (ఫుల్ లోఫ్ చాలా పెద్దదవుతుంది కనక) చెపుతారు. ఉదాహరణకి: క్వార్టర్ చికెన్ అంటే, చికెన్ కర్రీతో నింపిన క్వార్టర్ లోఫ్ అని అర్థం. ఈ బన్నీ చౌ ఇప్పుడు హైదరాబాద్‌లాంటి చోట్లకూడా దొరుకుతుందని విన్నాను.
వేషధారణ:
ఆడవారి వస్త్రధారణ దాదాపు పాశ్చాత్యంగానే ఉంది. కానీ, దాదాపు అందరూ బొట్టు (చిన్ని నల్ల తిలకపు బొట్టు) పెట్టుకోవడం విశేషంగా కనబడింది. చీరల్లాంటి సంప్రదాయ దుస్తులు శుభకార్యాలకు మాత్రం వేసుకుంటారట. చాట్స్‌వర్త్ మాల్‌లో భారతీయ ఆభరణాల షాపులు చాలానే కనబడ్డాయి.
భాష:
ఇండియానుంచి కొత్తగా వచ్చినవారు తప్ప దాదాపు అందరూ ఇంగ్లీషుకి మారిపోయినట్టు తెలుస్తుంది. దీనికి విరుద్ధంగా, ఫీజీలో ప్రవాసులందరూ ఇప్పటికీ హిందీని మాట్లాడతారట. భారతీయ భాషల వాడకం పూజా పునస్కారాల్లో మాత్రం మిగిలినట్టుంది. నేను AirBnB వసతి కోసం చూస్తూ, తెలుగు/హిందీ మాట్లాడే హోస్టు కావాలంటే, హిందీ మాట్లాడతామన్న వాళ్ళు చాలామందే తగిలేరు. వీరు ఇటీవలి ఇమ్మిగ్రంట్స్ అనుకున్నాను.
మాతృదేశ భావన:
తమ పూర్వీకుల దేశంగా ఇండియా పట్ల అభిమానముంది కానీ, ఆ దేశాన్ని చూసి వద్దామన్న తపన కానీ, తమ బంధువులని వెతుక్కుందామన్న ఆసక్తిగానీ వీళ్ళకు లేవని నా సంభాషణల్లో గ్రహించాను. నేను మాట్లాడిన వారిలో ఎక్కువమంది ‘ఎప్పుడూ వెళ్ళలేదు, వెళదామన్న ఆలోచన లేదు’ అనే అన్నారు. జొహానెస్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో పరిచయమైన అవేష్ మట్టుకు తను ఇస్కాన్ సభ్యుణ్ణనీ, ప్రతీ సంవత్సరం మైసూర్ వెళతాననీ చెప్పారు. 1920ల్లో వచ్చిన తన కుటుంబానికి భారత పౌరసత్వపు రికార్డులు బాగానే ఉండడం వల్ల తను PIO హోదాకి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
ఐడెంటిటీ:
అవేష్ చెప్పినదాని ప్రకారం, ప్రస్తుతం, ప్రవాస యువతరంలో వారి భవితకి భారతీయులన్న ఐడెంటిటీకంటే ఇండో-ఆఫ్రికన్ లేదా పాన్ ఆఫ్రికన్లుగా ఏర్పడిన ఐడెంటిటీని అనుసరించడమే ముఖ్యమన్న వాదన వినిపిస్తుందట. ముఖ్యంగా 1994 తర్వాత, సమాజంలో పూర్తిగా కలవాలంటే, ఇదే మార్గమని వాదనట. ఆ వాదన సబబుగానే ఉందనిపించింది. అన్నట్టు ఇక్కడి ప్రవాసులు వివాహాలకి తమవారినే ఇష్టపడతారన్నది కూడా నా సంభాషణల్లో అర్థమైన విషయం.
కొసమెరుపు: ప్రపంచమంతటా పాప్ సంగీతాభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న, టైలా (Tyla) సౌతాఫ్రికన్ భారత సంతతికి చెందిందే! ఈమె తండ్రి ప్రవాసుడు కాగా, తల్లి ౙూలూతెగకు చెందిన మహిళ.
(సశేషం)











