తీర్పు: వ్యాఖ్య
కాఫ్కా కథ చదవడమంటే మంచుగా గడ్డకట్టిన సముద్రాన్ని గొడ్డలితో తవ్వడమే. అస్తిత్వవాదాన్ని కాసేపు పక్కనపెట్టి యీ “తీర్పు” కథ చదువుదాం. కాఫ్కా ప్రముఖ నవల “ది ట్రయల్” ముగింపుకు ముందు, ఒక ద్వారము, ద్వారపాలకుడు దృశ్యం వస్తుంది. ఆ ద్వారం ఎప్పుడూ తెరచి ఉంటుంది. అనుమతి అడిగినవాడికి నిరాకరించడం ఉండదు. “మరి యింతవరకు ఎవరైనా లోపలికి వెళ్ళారా?”, అని అడుగుతాడు కథానాయకుడు. ద్వారపాలకుడు లేదంటాడు. “ఎందుకు?” ” ఎవరూ అనుమతి అడగలేదు. ” కాఫ్కా కథలలో అర్థం నిరాకరించబడిన పాఠకుడుండడు.
బైబిల్, షేక్స్‌పియర్, కాఫ్కా, షేక్స్‌పియర్ “హేమ్లెట్” తర్వాత కాఫ్కా “తీర్పు” పై వచ్చినంత విమర్శ మరే రచనపై రాలేదట. “తీర్పు” పది పేజీల కథ. ప్రపంచంలోని ఏ యితర కథకు లేని వివరణకు విశ్లేషణకు అవకాశం యిచ్చింది. విమర్శకులమాట అటుంచి, కాఫ్కా యీ కథ గురించి చెప్పుకున్నంత తన మరే యితర రచనగురించి చెప్పుకోలేదు. అతని రచనాసామర్థ్యంమీద అతనికి పెద్దగా నమ్మకం లేని దశలో యీ కథ పుట్టుక ఎలా జరిగిందో, తను ఎటువంటి ప్రసవవేదన అనుభవించాడో చాలా చోట్ల, చాలా వివరంగా చెప్పుకున్నాడు. ఈ కథతో కాఫ్కాను ప్రపంచం రచయితగా గుర్తించకపోయినా, కాఫ్కా తనను రచయితగా గుర్తించాడు.
ఈ కథ రాయడం ఒకే రాత్రి ఎనిమిది గంటలలో ముగించానని చెప్పుకున్నాడు కాఫ్కా. తన “దేహము, ఆత్మ పూర్తిగా తెరచుకొని, తనలో మగ్గుతుండిన కథను బయటికి వదిలేశాయి”, అన్నాడు. కథ మొదలు పెట్టినప్పటినుండి ముగించే వరకు అతడు పడింది ప్రసవవేదన. అప్పుడే ప్రపంచంలోకి వచ్చిన ఆ కథ, “గర్భంలోని మావితో, మురికితో సహా బయటికి వచ్చిన పసిగుడ్డులా ఉండింది”, అన్నాడు కాఫ్కా.
ఏమిటా మురికి? ఏమా కథ? లేక, కథల పొరల
పాత్రలు:
ప్రత్యక్షంగా యిద్దరు: జార్జ్ (కొడుకు): బెండెమన్ (తండ్రి)
పరోక్షంలో యిద్దరు: (పేరులేని) మిత్రుడు, ఫ్రీడా (పెళ్ళికూతురు)
పరలోకంలో: తల్లి (బహుశా కథలో యీమే ప్రధానపాత్రేమో?)
కథలో రెండు భాగాలు.
మొదటి భాగం: రష్యా వెళ్ళిపోయి అక్కడే వ్యాపారం చేసుకుంటూ ఉండిపోయిన తన మిత్రుడికి కొడుకు, జార్జ్ (Georg) ఉత్తరం రాయడం.
రెండవభాగం: రాసిన ఉత్తరంతో అతడు తండ్రి గదిలోకి వెళ్ళడం. అక్కడ తండ్రికొడుకుల మధ్య జరిగిన సంభాషణ, సంఘర్షణ, కొడుకుకు మరణశిక్ష విధిస్తూ తండ్రి తీర్పు, దానిని అమలుచేయడం కొరకు కొడుకు నదిలో దూకడం. మొదటి భాగం వాస్తవికకథనవిధానం. రెండవభాగం అధివాస్తవికం. కాఫ్కా రచనల్లో వాస్తవికకథనవిధానం అరుదు.
కథలోని అనేకమైన పొరలలో ఒక పొర:
జార్జ్ మిత్రుడికి ఉత్తరం రాస్తూ, అతడి గురించి నెమరు వేసుకుంటున్నాడు. మిత్రుడు స్వదేశంలో స్థిరపడలేక రష్యా వెళ్ళాడు. అక్కడ మొదట్లో తన వ్యాపారం బాగా నడిచినా, క్రమంగా క్షీణించడం మొదలయింది. తన దేశానికి రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అనుబంధాలు తగ్గిపోయాయి. జార్జ్ వ్యాపారం బాగానే సాగుతోంది. తల్లి పోయిన తరువాత, తన వ్యాపారకౌశలంకూడా బాగా పెరిగింది. తల్లి పోయిన తరువాత, తన తండ్రి వ్యాపారంలో పూర్వంలా కలగజేసుకోడంలేదు. కనుక తనపై మొత్తం భారం పడింది. తన సామర్థ్యం పెరిగింది. పెళ్ళి చేసుకునే వయసు, చేసుకోగలిగిన ఆర్థికస్థితి. ఫ్రీడాతో పెళ్ళి నిశ్చయం అయింది. ఆ విషయం మిత్రుడికి ఉత్తరం రాస్తున్నాడు. అక్కడ మిత్రుడి ఆర్థికస్థితి బాగాలేదు. పరదేశంలో పరిచయాలు లేవు. స్వదేశంలో అనుబంధాలు తెగిపోయాయి. అతడు పెళ్ళి ఆలోచన వదిలేశాడు. తన పెళ్ళి వార్త అతడికి చెప్పడానికి జార్జ్ జంకుతున్నాడు. అతడున్న పరిస్థితిలో, వ్యాపారంలో తన అభివృద్ధి. పెళ్ళి అతణ్ణి నిస్పృహలోకి దించవచ్చు. ఈ విషయాలు అతడికి చెప్పకూడదనే అనుకున్నాడు. మరెవరి ద్వారానో తెలిస్తే తెలియనీ.
మిత్రుడివైపునుండి ఆలోచించే అతడికి తానుగా చెప్పవద్దు అన్న నిర్ణయం తీసుకున్నాడు. (“కేవలం వాడి గురించి ఆలోచించి. “)
కాని తను పెళ్ళి చేసుకోబోతున్న ఫ్రీడా, “అంత సన్నిహితుడైన మిత్రుడు రాకుండా, పెళ్ళి ఎలా చేసుకుంటావు?”, అన్నది. అప్పటికీ, ఊపిరాడని ముద్దులతో ఆమె నోరు మూసే ప్రయత్నం చేశాడు. కాని ఆమె, ముద్దులమధ్య కూడా ఊపిరి తీసుకుని అడిగేసింది, మరీ అంత ముద్దుగా కూడా అడగలేదు. “అటువంటి మిత్రుడున్నపుడు నీవసలు పెళ్ళి ఎలా చేసుకుంటావు?”, అని. మొదటికే మోసం. ఇక ఉత్తరం రాయకతప్పదు.
[షేక్స్‌పియర్, ముద్దుకోసం మాట మధ్యలో ఆపి, ముద్దు ముగిశాక, మాట 5. (And this, and this, the greatest discords be/
(Kissing her)
That e’er our hearts shall make! (2: 2. 1. )]
కాఫ్కా ముద్దు ఆపి మాట చెప్పిస్తాడు.
ఉత్తరం రాశాడు. రాసిన ఉత్తరంతో తండ్రి గదికి వెళ్ళాడు, మిత్రుడికి తన పెళ్ళి విషయం చెప్పేస్తున్నానని చెప్పడానికి. తండ్రి ఆశ్చర్యంతో, “అసలు నీకు రష్యాలో ఒక మిత్రుడున్నాడా?”, అని అడుగుతాడు. అసలు కథ అక్కడ మొదలవుతుంది. తండ్రి పెద్దవాడైనాడు. మతిమరుపు. తన మిత్రుణ్ణి తండ్రికి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. కాని, తండ్రి ఏమీ మరచిపోలేదు. పైగా, “నీవు నీ మిత్రుడు అంటున్న వాడు, వాడే అసలు నాకు కొడుకు”, అంటాడు. “నీవు వాడికేమీ రాయనక్కరలేదు. వాడికి నీ పెళ్ళి గురించి ఎప్పుడో తెలుసు. నేను వాడికి ఉత్తరాలు రాస్తూనే ఉంటాను. వాడి యిష్టంగా చదివేది నా ఉత్తరాలే. నీ ఉత్తరాలు ఎడం చేత్తో నలిపేస్తూ, నా ఉత్తరం చదువుతాడు. ”
ఇది సాధారణంగా లోకంలో ఎక్కడైనా జరిగేదే. నిద్రలేచింది మొదలు తనను చూచుకుంటున్న కొడుకును నిరాదరించి, మూడేళ్ళకో అయిదేళ్ళకో అమెరికానుంచి చెప్పుల జత తెచ్చి యిచ్చే కొడుకును యిష్టపడతాడు తండ్రి. బెండెమన్ అటువంటి తండ్రి.
తండ్రికి కొడుకుపై కోపానికి మరో కారణం. తన భార్య పోయింది. తను ఒంటరివాడైనాడు. తల్లి పోయినందుకు కొడుకు ఏమీ బాధపడలేదట! పైగా పెళ్ళి చేసుకుంటున్నాడు? ఇది లోకంలో అసహజమేమీ కాదు. “కొడుకుకు పెళ్ళి కావాలి, కోడలు మాత్రం వద్దు”, అనేది తరచు వినబడే మాట.
కథ ముగింపులో తండ్రి తీర్పు, కొడుకు తన మరణశిక్షను తానే అమలు చేయడం. ఈ ముగింపు తప్ప తక్కిన కథ అంతా వాస్తవమే. కాఫ్కా కథలు సాధారణంగా ఒక అనూహ్యఘటనతో మొదలవుతాయి. అందుకు భిన్నంగా యీ కథ అనూహ్యంగా అంతమవుతుంది.
తండ్రి “తీర్పు” ఎంతవరకు న్యాయం?
కథాప్రారంభం:
“ఆదివారం ఉదయం. వయసొచ్చిన వసంతకాలం, జార్జ్ యువకుడు. వ్యాపారి. ”
“ఆదివారం” సెలవు. వ్యాపారి అంగడి తెరవడు. “వయసొచ్చిన వసంతకాలం. జార్జ్ యువకుడు. “పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కలగడం సహజం. కలగకపోవడం అసహజమవుతుంది. ఇక జార్జ్ వ్యాపారంలో సమర్థుడు. వివాహవిషయంలో అదృష్టవంతుడు. ఫ్రీడా సంపన్నులకుటుంబంనుండి వస్తోన్న అమ్మాయి. తనకు సమాజంలో మంచి పరిచయాలు సంబంధాలున్నాయి. ఇతడి మిత్రుడు యితడికి అన్ని విషయాలలో భిన్నం. ఇద్దరూ వ్యాపారులే. కాని ఒకడు ఉన్నచోట బతకలేక పరదేశం వెళ్ళిపోయాడు. అక్కడా వ్యాపారం సాగలేదు. పరదేశంలో పరాయి వాడు, స్వస్థలంలో సంబంధాలు అనుబంధాలు లేవు. మిత్రుడు తల్లి పోయినవార్త తెలిసినపుడు అతడేమీ పెద్దగా కదిలిపోలేదు. సంతాపలేఖలో ఏవో పొడిమాటలు నాలుగు రాశాడు. అతడి పరిస్థితి అర్థం చేసుకున్నాడు కనుక జార్జ్ తన గురించి అతడికి చెప్పడానికి సందేహించే వాడు, (“కేవలం వాడి గురించి ఆలోచించి. “) ఇందులో జార్జ్ ను తప్పుపట్టవలసింది లేదు. “నీ మిత్రుడికి నీవు ద్రోహం చేస్తున్నావు”, అని అతడి తండ్రి చేసిన అభియోగం సమర్థించదగింది కాదు.
రెండవ అభియోగం: అతడి తల్లి మరణానికి అతడు తనలాగా బాధపడలేదట, ఆమె పోగానే పెళ్ళికి సిద్ధమవుతున్నాడు. తల్లి పోయిందని ఏ కొడుకూ పెళ్ళి మానడు. ఇది గొప్ప పాపమనో, శిక్షార్హ మైన అపరాధమనో అనలేము.
మూడవ అభియోగం: ఇన్నాళ్ళు తన సామర్థ్యంతో అభివృద్ధిచేసిన తన వ్యాపారాన్ని, యిప్పుడు తనను పక్కకు తోసేసి, కొడుకు తను పెత్తనం చేస్తున్నాడు. తాను త్వరగా చనిపోవాలనికూడా కోరుకుంటున్నాడట! ఇది సగమే నిజం. భార్యపోయిన దుఃఖంలో తండ్రి వ్యాపారంలో అంత ఆసక్తి చూపించలేదని జార్జ్ అంటాడు. కొడుకు వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహిస్తుంటే తండ్రి సంతోషించాలి కాని, తనకు ప్రత్యర్థి అని భావించడం గుణమా దోషమా?
నాలుగో అభియోగం: తల్లి పోయిన తరువాత, కొడుకు పెళ్ళి చేసుకుని యింటి పెద్దగా తన స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు. తనను పట్టించుకోవడం లేదు. ఇది సాధారణంగా తండ్రులు చేసే అభియోగమే. నిజంగానే జార్జ్‌కు తండ్రిపట్ల ఆదరం లేదా?
“తండ్రి గదిలోకి వెళ్ళాడు. కొన్ని నెలలయింది ఆ గదిలోకి అడుగుపెట్టి. వెళ్ళవలసిన అవసరం కూడా లేకుండింది. వ్యాపారవిషయాలలో కలుస్తూనే ఉండేవాళ్ళు. మధ్యాహ్నం యిద్దరూ బయటకు వెళ్ళి తినేవారు. రాత్రి ఎవరికి కావల్సింది వారు వడ్డించుకుని తినేవారు. ”
నిజమే. తండ్రిపట్ల చూపవలసినంత శ్రద్ధ చూపలేదు. కొడుకు కూడా అదే తెలుసుకుంటున్నాడు. కాని, యీ దూరం తండ్రికొడుకులను దూరంచేయవలసినంత దూరం కాదు. బెండెమన్ మంచంలో పడిఉండవలసినంత ముసలాడేమీ కాదు. పైగా బలంలో, శారీరక మానసికబలంలో, కొడుకును చిత్తుచేయగలనంటాడు.
“హాల్లో యిద్దరూ కలిసి కూర్చొనేవారు, ఎవరి వార్తాపత్రిక వాళ్ళు చదువుతూ. ఒక్కోసారి కొడుకు బయటకు వెళ్ళేవాడు, స్నేహితుల్నో, ఫ్రీడానో కలవడానికి. ”
పెళ్ళినిశ్చయమైన అమ్మాయితో ఎప్పుడో ఒకరోజు, అదీ వ్యాపారం ఎగగొట్టి అంగడి మూసేసి కాదు, సాయంత్రప్పూట, బయటికి వెళ్ళకూడదా? కొడుకు ముసలాడి మంచం పట్టుకుకూచుంటే. ఏమంటాం మనం? అసాధారణం (abnormal) అంటాం. అలా అని తన ప్రవర్తనను తాను సమర్థించుకున్నాడా? పశ్చాత్తాపపడ్డాడు. తండ్రిని చూచుకోడానికి వ్యాపారం మానేయడానికికూడా సిద్ధపడ్డాడు.
వెయ్యిమంది స్నేహితులైనా మా నాన్నకు సమానం కారు. నాకేమనిపిస్తోందో తెలుసా నీకు? నీ విషయం నీవు ఏమాత్రం పట్టించుకోడం లేదు. వయసు పైబడుతోంది. దాన్ని గుర్తించాలి కదా? వ్యాపారంలో నీవు నాకు చాలా అవసరం. కాని నీ ఆరోగ్యం? రేపు వ్యాపారం మొత్తం మూసేస్తాను. ఇలా జరక్కూడదు. మరో మార్గం చూడాలి. మొత్తం మార్చెయ్యాలి. ఇక్కడ యీ చీకటిగదిలో కూర్చుంటావు. హాల్లో వెలుతురుంటుంది కదా? పొద్దున టిఫిన్ ఏదో తిన్నాననిపిస్తావు. కిటికీమూసి మూల కూర్చుంటావు. ఇలా కాదు. రేపు డాక్టర్ ను పిలుస్తాను. ఈ చీకటిగదిలో నుండి ముందుగదిలోకి మారు. ”
ఇందులో కొంత తాత్కాలికమైన ఆవేశం ధ్వనించవచ్చు. “వెయ్యిమంది స్నేహితులైనా మా నాన్నకు సమానం కారు. ” (“Forty thousand brothers cannot make up for my love. ” Hamlet) కాని పశ్చాత్తాపం లేదనగలమా?
తమ ఆధిపత్యాన్ని పిల్లలు ప్రశ్నిస్తున్నట్టు భావించడం పెద్దలకు సామాన్యమే. కాని ఏ తండ్రి కొడుక్కు మరణశిక్ష విధించేటంత క్రూరుడుండడు. ముగిస్తూ, కథ మొదటివాక్యం మరొకసారి చూద్దాం.
“ఆదివారం ఉదయం. మంచి వసంతకాలం. (“the most beautiful time in spring. ” Tr. Johnston; “the nicest time of Spring”. Tr. Eulenspargel). జార్జ్ యువకుడు. వ్యాపారి. ” ఆప్తమిత్రుడికి ఉత్తరం రాయడానికికూడా ఆదివారం ఉదయం వరకు వ్యవధి దొరకదు. జార్జ్ వ్యాపారి, పనిలో శ్రద్ధ ఉన్నవాడు.
“మంచి వసంతకాలం. ” ఆదివారం ఉదయం ఆలయాలకు వెళ్తారు, యువకులే కాదు, అందమైన అమ్మాయిలుకూడా, చాలా తొలిచూపులు ఆలయప్రాంగణంలో కలుస్తాయి. ఆ అనురాగబంధాలు అపవిత్రాలు కానవసరంలేదు. అందులో అసహజమేమీ లేదు. జార్జ్ చర్చికి వెళ్ళలేదు. అతడికి పెళ్ళి నిశ్చయమైంది. “జార్జ్ యువకుడు. ” జీవితంలో అతడికి వసంతోదయం.
ఇంత సహజమైన ప్రవృత్తిని స్ఫురింపజేస్తూ కథా ప్రారంభం చేసాడు కాఫ్కా. కనుక యిది అతి సాధారణమైన సహజమైన మానవప్రవృత్తిని, కుటుంజీవితాన్ని వాస్తవతతో చిత్రించిన కథ. ఇందులోని “తీర్పు” ఏవిధంగానూ సమర్థనీయం కాదు. పితృస్వామ్య ఆధిపత్యాన్ని, దాని అన్యాయాన్ని, నిర్దయను చెప్పే కథ. తండ్రి తీర్పుకూడా లోకసామాన్యమే. సహజమే. కాకపోతే తీర్పు రూపం, తీర్పు అమలు మాత్రమే అసహజం. తీర్పు ఆంతర్యమైనపితృస్వామ్యభావన అవాస్తవము అసహజము ఏమీ కాదు. పాఠకుడు పై కోర్టుకు వెళ్ళి, యీ తీర్పును సవాలు చేయడమే సమంజసం. పాఠకుడే పై కోర్ట్.