శా.
క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్ దానవో–
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా–
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.
(పోతన భాగవతము, మొదటి స్కంధం, 1)
భాగవతారంభపద్యమిది. ‘శ్రీకైవల్యపదంబు’ అందుకోవడానికి రచన చేస్తున్నట్లు చెప్పి, ధ్యానపూర్వకంగా శ్రీకృష్ణభగవానుడికి నమస్కరించి ఆశీర్వాదాన్ని కోరారు. తొలిపద్యంలోనే భాగవతంలోని పన్నెండు స్కంధాలలో ప్రముఖంగా చెప్పబోతున్న ‘నందాంగనాడింభకుని’ కథలను సూక్ష్మంగా ధ్వనింపజేసారు భక్తకవి పోతన.
భాగవతంలో ప్రధానరసం భక్తి. వామనచరిత్ర, గజేంద్రమోక్షణం, ప్రహ్లాదచరిత్ర, రుక్మిణీకల్యాణం మొదలైన ఉపాఖ్యానాలన్నీ భక్తి ప్రబోధక గాథలే! మంచి ఎత్తుగడలతో కథను ప్రారంభించడం, వస్తువుకు న్యాయంచేస్తూ పాఠకులకు ఆసక్తి కలిగించేలా కథను కళ్ళముందు చూపించడం, పాఠకులు సంతుష్టులయ్యే రీతిలో కథను ముగించడం ఈ ఉపాఖ్యానాలలో కనిపించే ఉత్తమ గుణాలు.
మొదటి అధ్యాయంలో కథా శిల్పానికి సంబంధించి కథను ‘చెప్పడం కన్నా చూపించడం’ ఉత్తమ శిల్పమని, పోతన కవిత్వలక్షణాలలో ఈ ఉత్తమశిల్పగుణం ఉందని విశదీకరించాను. కవిత్వంలో దృశ్యీకరణం గురించి, పాఠకుల మనోనేత్రం ముందు కథను సాక్షాత్కరింపజేయడానికి దృశ్యీకరణం ఎలా ఉపకరిస్తుందో వివరించాను. వ్యాస భాగవతంలో రేఖామాత్రంగా వున్న దృశ్యీకరణాన్ని పోతన ఎలా విస్తరింపజేసాడో సోదాహరణంగా వివరించాను. పోతనకు పూర్వం వచ్చిన కావ్యాలలోని దృశ్యీకరణను కొన్ని పద్యాలను, సందర్భాలను ఉదాహరణలుగా తీసుకుని చూపించాను.
వామనుని చరిత్రను పోతన తన కథనంతో చాలా ఉత్కంఠభరితమైన కథగా మలిచారు. అడుగడుగునా ఆసక్తి కలిగించే కథగా తీర్చిదిద్దారు.
రెండవ అధ్యాయంలో వామనచరిత్రలో చలనచిత్రదృశ్యీకరణను మించిన రీతిలో వామనుని విరాడ్రూపాన్ని పాఠకుల కళ్ళముందు సాక్షాత్కరింపచేసిన సందర్భాలను, మరికొన్ని సన్నివేశాలను దృశ్యీకరణ కోణంలోంచి వివరించి, నేటి కాలపు ఛాయాగ్రహణ కటకాలలోంచి పరిశీలించి ప్రస్తుతించాను.
మూడవ అధ్యాయంలో గజేంద్రమోక్షణంలోని దృశ్యీకరణాంశాలను విశ్లేషించాను. ఆసక్తి కలిగించే ఎత్తుగడ, ప్రధాన వస్తువును విస్మరించకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపిన పద్ధతి, ఆహ్లాదకరమైన ముగింపు గజేంద్రమోక్షణం కథను చిరంజీవిని చేసాయి. అర్థాలంకారసౌందర్యం, రూపాన్ని సాక్షాత్కరింపజేసే విధానం, శబ్దాలంకారాలతో సన్నివేశానికి పుష్టి కలిగించే పద్ధతి – కలగలిసి ఈ గజేంద్రమోక్షణం కథకు మరింత అందాన్నిచ్చాయి. ఈ కథను పోతన దృశ్యీకరించిన తీరు అనితరసాధ్యమనిపిస్తుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలను, సందర్భాలను ఎన్నుకుని, వాటిలోని దృశ్యీకరణాంశాలను వివరించాను.
తెలుగు భాగవతం చంపూ కావ్యం కనుక, వామనచరిత్ర, గజేంద్రమోక్షణం ఉపాఖ్యానాలలోని వచనాలలో దృశ్యీకరణలను కూడా గమనించాను.
నాల్గవ అధ్యాయంలో పోతన సమకాలీన కవులు, తర్వాతి కవుల రచనల్లో దృశ్యీకరణను పరామర్శించాను. పోతనకు దరిదాపు సమకాలీనులైన ఉద్దండ కవులు శ్రీనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య. ఒకరు పద్యసాహిత్యంలో కవిసార్వభౌముడు, మరొకరు పదకవితాపితామహుడు. వీరి రచనలను కొన్నింటిని పరిశీలించి, వాటిలోని దృశ్యీకరణాంశాలను సోదాహరణంగా వివరించాను.
పోతన తరువాతి కాలంలో కావ్యరచన ఒక పెద్ద మలుపు తీసుకుంది. కవులు ప్రబంధాలను నిర్మించడం మొదలుపెట్టారు. ప్రబంధ సాహిత్యంలో కొన్ని కావ్యాలను పరిశీలించి వాటిలోని దృశ్యీకరణలను ఉదాహరణలతో వివరించాను. అలాగే దక్షిణాంధ్రయుగం కవుల కావ్యాలు, ఆ తదుపరి ఆధునిక పద్య కావ్యాలను సంప్రదించి ఆ కావ్యాలలోంచి కొన్ని పద్యాలను ఎంచుకుని దృశ్యీకరణను వివరించాను.
ఈ వ్యాసానికున్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని పద్యకావ్యాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకున్నాను. ఎన్నో పద్యకావ్యాలను పరిశీలించినా కొన్ని పద్యాలను మాత్రమే విశ్లేషించి, వాటిలోని దృశ్యీకరణలను వివరించాను.
కథను చెప్పడం కన్నా చూపించడం మెరుగైన పద్ధతి అని నమ్మిన కవులు, రచయితలు చాలా మందే ఉంటారు. మొదటి అధ్యాయంలో చెప్పినట్లు, పాశ్చాత్యులు 19 వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ సిద్ధాంతాన్ని మన ప్రాచీనకవులు కొన్ని శతాబ్దాల పూర్వమే ఆచరణలో పెట్టడం, వారి కవితాశక్తికి, ఋషిత్వానికి, ఔన్నత్యానికి, దార్శనికతకు, ప్రతిభకు తిరుగులేని నిదర్శనం.
దృశ్యీకరణం అన్నది పద్యకవిత్వానికే పరిమితమైంది కాదని మనందరికీ తెలిసినదే. పదసాహిత్యం, గేయ కవిత్వం, వచనకవిత్వం, కథలు, నవలలు మొదలైన ప్రక్రియల్లో దృశ్యాలను చిత్రీకరించడాన్ని మనం గమనించవచ్చు.
పోతన కవిత్వంలో దృశ్యీకరణ మీద చాలా స్థూలంగా జరిపిన పరిశీలన ఇది. రాబోయే కాలంలో పద్య కావ్యాలలోని దృశ్యీకరణం మీద మరిన్ని పరిశోధనలకు అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. పద్యసాహిత్యంలోనే కాకుండా ఇతర సాహితీప్రక్రియలలోను ఈ అంశం మీద పరిశోధనలు జరిగి, తెలుగు సాహిత్యానికి మేలు జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాను.
ఈ పరిశోధనావ్యాసంలో వెలిబుచ్చినవన్నీ ఆయా కవులను నాకు చేతనైనంత అర్థం చేసుకుని వ్యక్తీకరించిన అభిప్రాయాలే. ఈ వ్యాసంలో వున్న మంచి విషయాలు పోతనపై, ఇతర ప్రాచీన, అర్వాచీన కవులపై, భాగవతం మీదా ఎంతో భక్తితో, అభిమానంతో, ఆసక్తితో, జిజ్ఞాసతో పరిశీలించి పరిశోధనలు చేసిన పండితకవుల కృషి ఫలితమే!
ఏమైనా పొరపాట్లు దొర్లివుంటే, అవి ఆయా రచనలను నేను సరిగా అర్థం చేసుకొనక పోవడం వలన జరిగివుండవచ్చునని భావించి, మన్నించ ప్రార్థన.
ఉపయుక్త గ్రంథాలు, వనరులు
- అన్నమాచార్యులు, తాళ్ళపాక (1998), శృంగార సంకీర్తనలు (సంపుటం 5), తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
- ఆంధ్రభారతి అంతర్జాల పుటలు – తెలుగు సాహిత్యం
- ఈమాట అంతర్జాల పత్రికలోని పలు వ్యాసాలు.
- ఎఱ్ఱాప్రగడ (1926), హరివంశము, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి.
- కామేశ్వరరావు, భైరవభట్ల – తెలుగు పద్యం బ్లాగ్
- తిక్కన సోమయాజి (2013), కవిత్రయవిరచిత శ్రీమదాంధ్రమహాభారతము (సంపుటం 6), తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
- తిమ్మన, నంది (1933), పారిజాతాపహరణము సురభివ్యాఖ్యాసహితము, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి.
- ధర్మారావు, తాపీ (1987), చేమకూర వెంకటకవి విజయవిలాసము హృదయోల్లాస వ్యాఖ్య, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- కరుణశ్రీ (సంపాదకులు) (1983), భాగవత వైజయంతిక (వ్యాస సంపుటం), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాద్.
- పాపరాజు, కంకటి (1951), శ్రీమదుత్తరరామాయణము, సి.వి.కృష్ణబుక్ డిపో, మదరాసు.
- పోతన, బమ్మెర (2015), పోతన భాగవతము (ఐదు సంపుటాలు), తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
- ప్రసాదరాయ, కులపతి, ఆంధ్రభాగవత విమర్శ, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సమర్పించిన పరిశోధనాగ్రంథం (ప్రచురణ వివరాలు అలభ్యం).
- యూట్యూబు వీడియోలు – కొన్ని.
- వేంకటకవి, చేమకూర, విజయవిలాసము, ఆంధ్రభారతి అంతర్జాల సాహిత్య పుటలు.
- వెంకట మురళిమోహన్, గోదావరి (2013), పోతన భాగవతం – అలంకార వైభవం (మధురై కామరాజ్ యూనివర్సిటికి సమర్పించిన పరిశోధనాగ్రంథం).
- వేంకటేశ్వర్లు, వీపూరి (2016), పోతన భాగవతము – ప్రతీకాత్మక సౌందర్యము (పరిశోధనా సిద్ధాంత గ్రంథం). కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం, కర్నూలు.
- వేద వ్యాసుడు (1958), భాగవత్ మహాపురాణ్ తెలుగు – శ్రీమద్భాగవతం (గోపాల చక్రవర్తి ‘కలం కలలు’ పీఠిక), నవ్య సాహితీ సమితి, హైదరాబాదు
- వికి సోర్స్, పుస్తకం డాట్ నెట్ తదితర వెబ్ సైట్లు.
- శ్రీనాథుడు (1916), హరవిలాసము, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి.
- శ్రీరామమూర్తి, ధూళిపాల (1972), శ్రీమదాంధ్ర మహాభాగవతానుశీలనము. గ్రామస్వరాజ్య ప్రెస్, విజయవాడ.
- సత్యనారాయణ, విశ్వనాథ (1992), శ్రీమద్రామాయణ కల్పవృక్షము – అయోధ్య కాండము, విశ్వనాథ పబ్లికేషన్స్, విజయవాడ.