Franz Kafka (1883-1924) German speaking Bohemian
కాఫ్కా వచనాలు
- “నేనొక పంజరం, పక్షిని వెదుకుతూ.“
- “గమ్యం ఉంది, దారిలేదు.“
- “ఉన్నవి రెండే. నిజము, అబద్ధము. నిజం విడదీయరానిది, కనుక తనను తాను గుర్తించలేదు; దానిని గుర్తించదలచినవాడు అబద్దం కావలె.“
- “లొంగకు. నీరుగార్చకు. హేతుబద్ధంచేయచూడకు. నీవు లోకానికి నచ్చవలెనని నీ ఆత్మనే పరిష్కరించకు.“
- “నేననుకుంటాను, మనల్ని పొడిచి గాయపరిచే పుస్తకాలే మనం చదవవలసినవి.నెత్తిమీద బలంగా మొత్తి మనల్ని నిద్రలేపని పుస్తకాన్ని మనం చదవడమెందుకు ?… మనకు ఎటువంటి పుస్తకాలు అవసరం ? ఒక మహోపద్రవంలా వచ్చి మనల్ని ముంచేసేవి; ఆప్తుడి మరణంలా మనల్ని తీవ్రశోకంతో కదిపేవి; నిర్జనారణ్యాలలోకి నిష్కాసితులను చేసేది; ఆత్మహత్య లాంటిది,
గడ్డకట్టిన సముద్రాన్ని తవ్వే గడ్డపారలాంటిది. అది నా నమ్మకం.“
(Notebooks)
ముఖ్యరచనలు
నవలలు:
– America
– The Trial
– The Castle
నవలిక:
– The Metamorphosis
కథలు:
– The Hunger Artist
– In the Penal Colony
– The Judgement
ఇతరరచనలు:
– Diaries
– Book of Aphorisms
జీవితం
వానలో తడవనివారు. కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి, తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు. ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని. చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడు. తన నలభయ్యవ ఏట.
1883లో జూలై 3వ తేదీ నాడు కాఫ్కా జననం. ప్రాగ్ లో. (ప్రాగ్ (Prague). ప్రస్తుతం చెక్ (Czech) రిపబ్లిక్ రాజధాని. అప్పుటి ఆస్ట్రో హంగేరియన్ రాజ్యంలో భాగం) యూదు కుటుంబంలో పుట్టాడు. హెర్మన్-జూలీలకు కాఫ్కా మొదటిసంతానం. తన తరువాత యిద్దరు మగపిల్లలు పుట్టిపోయారు. ముగ్గురు చెల్లెళ్ళకు ముందు చనిపోయాడు కాఫ్కా. కాఫ్కా న్యాయశాస్త్రం చదివాడు. ఇతడి రచనల్లో రెండింటి పేర్లు The Trial, The Judgement.
న్యాయకళాశాలలో మేక్స్ బ్రాడ్ (Max Brod) యితడి సహాధ్యాయి, జీవితకాలమిత్రుడు. ఇతడికి సాహిత్యలోకం ఋణపడి ఉంది. కాఫ్కా చివరికోరికను ఉల్లంఘించి కాఫ్కా రచనలను భవిష్యత్ తరాలకు అందించినవాడు. కాఫ్కా బీమా కంపెనీకి న్యాయవాదిగా పనిచేసాడు. కంపెనీ నియమనిబంధనలను సవరించి, కంపెనీ పరిధిలోకి వచ్చే పనివారి పరిస్థితులు మెరుగుపరచడానికి ఎంతో చేసాడు. రచనలలో నిష్క్రియత, జీవితంలో క్రియాశీలత!
ఆగస్టు 1912లో కాఫ్కా ఫెలిస్ బోయర్‌ను (Felice Bauer) కలిశాడు. ఈమెతో కాఫ్కాకు రెండుసార్లు పెళ్ళి నిశ్చయమై రెండు సార్లు భగ్నమయింది.
1917లో అతడికి క్షయవ్యాధి పట్టుకుంది.
1919లో జూలీ వోరిజెక్‌తో (Julie Wohryzek) పెళ్ళి నిశ్చయమయింది. కాని జరగలేదు. ఎంతకాలం బతుకుతాడో తెలియని స్థితిలో ఒక వివాహితతో (మిలెనా – Milena Jesenská) కలిసి జీవించాడు. బహుశా, అతడి జీవితంలో అతడు ఆనందంగా జీవించింది ఆమెతో గడిపిన ఆ చివరి కొద్ది రోజులేనట. మిలెనా కాఫ్కా రచనలను కొన్నిటిని చెక్ (Czech) భాషలోకి అనువదించింది.
1922లో అనారోగ్యకారణంగా తన ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. (కాఫ్కా ఒక ప్రభుత్వకార్మికబీమాసంస్థలో పనిచేసేవాడు.) వియనా (Vienna) దగ్గర కొన్ని క్షయరోగుల చికిత్సాకేంద్రాలలో కొంతకాలం గడిపి చివర 1924లో జూన్ 3వ తేదీన చనిపోయాడు.
జీవితము:రచనలు
కాఫ్కా రచనల్లో సాధారణ కావ్యవస్తువులు రెండు: మొదటిది, జరగని పెళ్ళి; రెండవది, తండ్రికొడుకుల మధ్య స్పర్ధ. ఈ వస్తువులు అనేకరూపాలు ధరించి కనిపిస్తాయి అతని కథలలో, మూడవ వస్తువు కూడా ఉన్నది, మొదటి రెండిటికంటే కూడా ముఖ్యమైనది. ఆ రెంటి అడుగున అంతస్స్రోతస్సుగా సాగేది. అది రచయిత- రచనా ప్రవృత్తి-రచనాప్రక్రియ.
కీర్క్‌గార్డ్ (kierkegaard), కాఫ్కాల జీవితాలలో, తండ్రీ కొడుకుల సంబంధాల విషయంలో, వివాహవైఫల్యవిషయంలో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. పెద్ద భేదమూ ఉన్నది. ఇద్దరి రచనలలో అంతటా పరచుకుని ఉన్న ప్రధానవిషయం, యీ రెంటి ప్రభావమే. ఈ వైఫల్యకారణాలు వెదుక్కోడమో, కనిపెట్టడమో వారి రచనలకు ప్రధాన ఆశయం. (నీచకు (Nietzsche) అసలు వివాహవ్యవస్థ మీదే నమ్మకమే లేదు. అతడికి పెళ్ళంటే “ఉంచుకోడం” (concubinage), వ్యవస్థీకృతవేశ్యావృత్తి.) కీర్క్‌గార్డ్ భావంలో తన తండ్రి ఒక అబ్రహాం, తను ఒక ఐజక్. తనను తన తండ్రి భగవంతుడికి బలి యిచ్చాడు. అలాగే తను రెజినా పట్ల తన ప్రేమను భగవంతుడికి బలి యిచ్చానంటాడు. కాఫ్కా తన రచనాప్రవృత్తి కొరకు వివాహాన్ని త్యాగం చేశాను అంటాడు. (కాఫ్కా తండ్రి ఆధిపత్యం కూడా తన నిర్ణయానికి, లేక నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణమని, కాఫ్కా భావం. తన తండ్రి తన పాలిట మత్సరగ్రస్తుడైన “యెహోవా”, ( “I, the LORD thy God, a jealous God.” (2004: 42)
కాఫ్కా తండ్రి బృహత్కాయుడు. చండశాసనుడు. (ఇది కాఫ్కా భావం కావచ్చు. తండ్రి కొడుకులమధ్య స్పర్ధ, వైరుద్ధ్యం సృష్టిలో సాధారణమే. తల్లికి దగ్గరైనంత తండ్రికి కారు మగపిల్లలు. కాఫ్కా తన రచనలకు అవసరమైనంతగా యీ వైరుద్ధ్యాన్ని మరింత పరిపుష్టం చేసిఉండవచ్చు.) “తీర్పు” కథలో యీ తండ్రి పాత్ర, తండ్రికొడుకుల స్పర్ధ, వైరుధ్యము ప్రధానవస్తువు. జరగని పెళ్ళి రెండవ వస్తువు. అంతస్స్రోతస్సుగా రచనాప్రవృత్తి మూడవ వస్తువు. అతడు తన వృత్తిని ప్రవృత్తితో సమన్వయం చేయడంలోని ఘర్షణ కూడా ముఖ్యకథావస్తువు.
కాఫ్కా విమర్శకులు అతని కథలను వివరిస్తూ, అతని జీవితపరిస్థితులతో, అతని జీవితంలోని సంఘటనలతో సమన్వయం చేస్తారు. అందుకు సమర్థకంగా అతడి డైరీలనుండి, నోట్‌బుక్స్ నుండి. లేఖలనుండి వాక్యాలు విస్తృతంగా ఉదాహరిస్తారు. కాని, ఈ విధమైన విమర్శ కాఫ్కా సాహిత్యకళకు అన్యాయం చేస్తుందనే చెప్పాలి. కాఫ్కా డైరీలు రాసి ఊరుకోవచ్చు కదా? కథలు కూడా రాయడమెందుకు? బయట డైరీలలో ఉత్తరాలలో, ఎన్ని కథలైనా చెప్పగలవు. కథలో “కథలు” చెప్పలేవు. చచ్చినట్టు నిజం చెప్పవలె. చెప్పిస్తుంది. “అంతా నిజమే చెబుతాను. నిజం మాత్రమే చెబుతాను.నిజం తప్ప మరేమీ చెప్పను.” అని. తను కోరినట్టు తాను ఎదగడానికి తన తండ్రి పెద్ద అవరోధమని అతడు తన తండ్రికి రాసిన ప్రసిద్ధలేఖ చెబుతుంది. కాని ఆ లేఖ సగమే నిజం చెబుతుంది. మిగతా సగం అతని కథలలో దొరుకుతుంది. ముఖ్యంగా “తీర్పు”లో. లేఖలో కాఫ్కా వ్యక్తి. కథలో అతడు మనిషి.
కాఫ్కా జీవితకాలంలో మొదటి ప్రపంచయుద్ధం, రష్యా విప్లవం ప్రముఖసంఘటనలు. యూదులపై హింస ఐరోపా అంతటా పెచ్చరిల్లుతూ వుండింది. తన ముగ్గురు అక్కచెల్లెళ్ళు యీ హింసకు బలి అయ్యారు. ఇరవై సంవత్సరాల తరువాత జరగబోయే ఊచకోత ఊహించడం కాఫ్కాకు కష్టం కాదు. కాఫ్కా తన నలభయ్యవ ఏట క్షయవ్యాధితో చనిపోయాడు.
ఫ్రాయిడ్ రచనల ప్రభావం తన రచనలపై చాలా ఉన్నదని కాఫ్కా చెప్పుకున్నాడు. డోస్టోవ్‌స్కీని, కీర్క్‌గార్డును కూడా బాగా చదివాడు. డోస్టోవ్‌స్కీ పాత్రలు నేరాలు చేసి శిక్ష అనుభవిస్తారు. కాఫ్కా పాత్రలు ఏ నేరము చేయకుండా శిక్ష అనుభవిస్తారు. (నేరం చేయనివాడు లేడనేది కాఫ్కా ప్రాథమిక సాహిత్యవస్తువు. ప్రతి ఒక్కడు శిక్షింపబడకపోవచ్చు కాని శిక్షార్హుడు కానివాడు లేడు, రాజు తలచుకోవాలేకాని!) ధర్మం తనను సొంతం చేసుకున్నదన్నాడు కీర్క్‌గార్డ్. కాఫ్కా ఆ అంతుచిక్కని ధర్మాన్ని సొంతం చేసుకోవాలని జీవితకాలమంతా ప్రయత్నించాడు.
కాఫ్కాను అస్తిత్వవాదరచయితగా చెప్పడం కష్టమే. అస్తిత్వవాదంలో ప్రధానాంశమైన భయము, ఆందోళన, బాధ (Fear, Dread, Anxiety) యితని రచనలనిండా ఉన్నాయి. కాని, అస్తిత్వవాద ఎంపికలోని ఆందోళన (existential choice) ఉండదు. అస్తిత్వవాదంలో మూలమైన అంశం చర్య (action; Existence is doing.) కాఫ్కా పాత్రలు ఏమీ చేయరు. ఏ నిర్ణయమూ తీసుకోలేని మనిషి. నిర్ణయం తీసుకోనివ్వని వ్యవస్థ యితడి రచనలలోని ప్రధానవస్తువు. నిజానికి కాఫ్కా తనపై ఏ ముద్రను ఆమోదించడు. అతన్ని గురించి చెప్పుకోవలసిన మాట, అతడు సాహిత్యం తప్ప మరేమీ రాయడు. ఏ భావమైనా, ఏ వాదమైనా, ఏ సిద్ధాంతమైనా సాహిత్యపు కరెన్సీలోకి మార్చికాని రాయడు. ఈ విషయంలో కాఫ్కాను గుస్తావ్ ఫ్లోబే తో (Gustave Flaubert) పోలుస్తారు. అతడి రచనాశిల్పమే అతని కథావస్తువు. రూపము, సారము విడదీయలేని విధంగా కలిసిపోతాయి కాఫ్కా కథలలో.
కాఫ్కా పేరు యిప్పుడు నామవాచకంకాదు, విశేషణం. ఒక విధమైన వింతకు కాఫ్కా మారుపేరు అయింది. అతడి సాహిత్యప్రపంచంలో అడుగుపెట్టిన క్షణం మన ప్రపంచం మనల్ని వదిలిపోతుంది. మనం ఒక పీడకలలోకి జారుకుంటాం, భయంగా, కాని వదలలేనంత యిష్టంగాకూడా.
(సశేషం)