
చరిత్రలాగే సాహిత్య విమర్శ అనేది ఒక నిరంతర ప్రవాహం. అది గతసాహిత్యాన్ని వర్తమానంతో అనుసంధానించి పునర్విశ్లేషించే ఒక వారధి. దండి రాసిన కావ్యాదర్శమ్, విద్యానాథుని ప్రతాపరుద్రీయమ్, ముమ్మటుడి కావ్యప్రకాశమ్, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకమ్, రాజశేఖరుడి కావ్యమీమాంసవంటి ప్రాచీన లాక్షణిక గ్రంథాలను చదివినప్పుడు, వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు విమర్శనాత్మక దృక్పథాన్ని ఎంత శాస్త్రీయంగా విశ్లేషించారో అర్థమవుతుంది. అయితే, ఆ ప్రాచీనజ్ఞానాన్ని ఆధునిక సాహిత్యానికి, ఆధునిక సామాజిక కోణాలకు ఎలా అన్వయించుకోవాలి అన్నదే నేటి విమర్శకుల ముందున్న ప్రధానాంశం.
ప్రాచీన కావ్యమీమాంసలో చర్చించిన అనేక వర్గీకరణలు, రస-ధ్వని సిద్ధాంతాలు నేటి సాహిత్యానికి అనువర్తనీయాలే. ప్రాచీన భారతీయ కావ్యవిమర్శనుండి మనం ప్రధానంగా అలవర్చుకోవాల్సింది సత్యాన్ని శోధించే తత్త్వాభినివేశలక్షణాన్ని. ఆధునిక సాహిత్యం కేవలం ఆనందాన్ని, రసాన్ని మాత్రమే ఇవ్వదు; అది సామాజిక అస్థిరతలను, వర్గపోరాటాలను, మానసిక సంఘర్షణలను చర్చిస్తుంది. ఇక్కడే పాశ్చాత్య విమర్శన సిద్ధాంతాలు మనకు కొత్త ఆయుధాలను అందిస్తాయి. ఉదాహరణకు, ఝాక్ డెరిడావంటి వారు ప్రతిపాదించిన వినిర్మాణవాదం ఒక రచనలో ఒకే స్థిరమైన అర్థం ఉండదని చెబుతుంది. అవి సామాజిక సంఘర్షణలకు, మానవ మనస్తత్వ సంక్లిష్టతలకు, అస్తిత్వవాదాలకు ప్రతీక. ప్రసిద్ధ రష్యన్ సాహిత్య విమర్శకుడు మిఖాయిల్ బాఖ్తిన్ సిద్ధాంతం ప్రకారం, గొప్ప క్లాసిక్ రచనలు ఎన్నటికీ ఒకే కాలానికి లేదా ఒకే కోణానికి పరిమితం కావు; అవి బహుళ స్వరాలను, బహుళార్థాలను (polyphony) కలిగి ఉండి, తరాలు మారేకొద్దీ పాఠకులకు ఎన్నెన్నో కొత్త అర్థాలను స్ఫురింపజేస్తూనే ఉంటాయి. పాఠకుడినిబట్టి, కాలాన్నిబట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఒక ఆధునిక కవితనో, కథనో విశ్లేషించేటప్పుడు ప్రాచీన లాక్షణికులు ప్రతిపాదించిన రస, ధ్వని సిద్ధాంతాల మూలాలను మనం విస్మరించలేం. అంతర్లీనంగా ఉండే భావాన్ని పట్టుకోవడానికి ధ్వని సిద్ధాంతం నేటికీ అద్భుతమైన సాధనమే. కానీ, అదే సమయంలో సాహిత్యంలోని భావాల విస్తృత సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక ప్రభావాల వివేచనకు ఆధునిక మానవీయశాస్త్ర సిద్ధాంతాలు అత్యావశ్యకం.
నిజమైన విమర్శకుడు ప్రాచీన సాహిత్యంలోని గాంభీర్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని జీర్ణించుకోవాలి. అలాగే, ఆధునిక విమర్శ సిద్ధాంతాలైన నిర్మాణాత్మకవాదం, సామాజికశాస్త్ర దృక్పథం, మనోవిశ్లేషణలను తన పరిశీలనకు ఆయుధాలుగా మలచుకోవాలి. వెల్చేరు నారాయణరావుగారిలాంటి పండితులు చేసిన కృషిలో మనకు కనిపించేది ఈ సమన్వయమే. వారు ప్రాచీన ప్రబంధాలను విశ్లేషించినా, ఆధునిక కవిత్వాన్ని అంచనా వేసినా అందులో ప్రాచీన మీమాంస తాలూకు సునిశితత్వం, ఆధునికత తాలూకు సామాజికశాస్త్ర దృష్టి కలగలిసి ఉంటాయి. ఈ రెండింటి సమన్వయమే భారతీయ భాషలలో సాహిత్య విమర్శకు ప్రాణం పోస్తుంది. కొత్తపాతల మేలుకలయికగా సాగే ఇటువంటి విమర్శే తెలుగు సాహిత్యానికి శ్రీరామరక్ష.
[వేలూరి వేంకటేశ్వరరావుగారు సాహిత్యవిమర్శ గురించి మాతో పంచుకొన్న అనేకానేక ఆలోచనల్లో కొన్ని సంభాషణలు పై ముందుమాటకు స్ఫూర్తి. ఇప్పుడు ఆయన ఇంద్రసభలో కూర్చుండి ‘స్వర్గంలో స్ట్రిప్‌టీజ్’ చూస్తున్నా అక్కడినుండే మనల్ని గమనిస్తూ, బహుశా తన మరణవార్తపై వచ్చిన స్పందనలపై ఇప్పటికే ఒక వ్యంగ్యకథను అల్లుతూ ఉంటారని ఊహించవచ్చు. వీడ్కోలు వేలూరి గారూ! మీరు పరిపూర్ణంగా జీవించారు, ప్రపంచాన్ని, సాహిత్యాన్ని, మనుషుల్ని మనసారా ప్రేమించారు. మీ మాటలు, రచనలు, ఎత్తిపొడుపులు, శ్రేయోక్తులు ఈమాట కుటుంబానికి సదా స్మరణీయాలు — సం.]