‘నాకు జీవితం … నిరాసక్త వ్యసనం
జీవితానికి నేను .. అజాగళస్తనం
ఈ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం… కాల ప్రవాహం
చిత్రం! ఇది గుర్తొచ్చే కొద్ది క్షణాలూ మాత్రం ఇది అబద్ధం.
ఆ క్షణం… కాలం జడం
ఆ అబద్ధపు క్షణాలకై, దానిని నిజం చేస్తూ
ఒకరినొకరు భరిస్తున్నాం!’
ఒకపక్క ప్రెజెంటేషన్ తయారుచేస్తూ, మరొక ప్రక్క కాఫీ త్రాగుతూ, వేరొక ప్రక్క జంతువుల ముఖాలు పెట్టి కొడుకును నవ్విస్తూ, యథాలాపంగా టీవీ వంక ఒక చూపు, వాట్సప్ వంక ఒక చూపు విసరుతూ పలురకాలుగా ఆలోచిస్తున్నాడు ప్రసిద్ధ్.
“ఏంటి, ఏదో ఆలోచనలో ఉన్నారు?” భార్య ఉమ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు. ‘అలా ఎలా తెలిసిపోతాయో? ఒక్క ఉమకేనా? ఆడవాళ్ళందరికీ ఈ ప్రజ్ఞ ఉంటుందా?’
“ఆశ్చర్యపోయింది చాలు విషయం చెప్పండి” చిరు అలకతో పలికింది ఉమ.
“ఏంలేదు ఉమా. వానలో చినుకు చినుకుకూ మధ్యలో ఏ చినుకు స్పర్శా తెలియకుండా, ఏ వానలో తడవకుండా గుఱ్ఱాన్ని నడపగలిగేవాడట నకులుడు. అలా ఇప్పుడు క్షణక్షణాల మధ్యలో, ఏ క్షణమూ అనుభూతి చెందకుండా నిర్జీవంగా పరుగుపెడుతున్నట్టుగా ఉంది.”
“అబ్బో! బాగానే ఉంది కవిత్వం. మీరు నకులుడైతే మరి నేను?” ఉత్సాహంగా అడిగింది ఉమ.
“నేను నకులుణ్ణి కాదు… గుఱ్ఱాన్ని. ఆగలేని నకులుడి గుఱ్ఱాన్ని.” నిట్టూర్చాడు ప్రసిద్ధ్.
ఉమ మాట్లాడేలోపే ప్రసిద్ధ్ ఫోన్ మ్రోగింది. గుఱ్ఱం దౌడు తీసింది.
కథ ముగించి సిగరెట్ వెలిగించాడు. ‘యాంత్రికత.. సమకాలీన సమస్య, ప్రాచీనమైన పోలిక, ఒక రెండు జాతీయాలు, గాఢంగా అనిపించే అనుభూతి… అన్నీ కుదిరాయి.’ ఒకసారి కథను మొత్తం చూసి, టైప్ చేసి ఉన్న హామీపత్రంలో కథ పేరు వ్రాసి, కథను జతచేసి కవర్లో పెట్టి అంటించి, సిగరెట్టు పూర్తిచేసి మరలా కూర్చున్నాడు యశ్వంత్ . ‘ఈ ఫార్మాట్ బాగుంది. తరువాత ఏం రాద్దాం?’ వ్రాసి పెట్టుకున్న పేర్లు చూస్తున్నాడు. ‘భానుమతి మొలనూలు’ ఎప్పుడో విన్న పాత కల్పిత కథ. కర్ణుడు, భానుమతి చదరంగం ఆడుతుండడం, దుర్యోధనుడు రావడం భానుమతి లేచి వెళ్ళబోవడం, అట మధ్యలో లేచి వెళ్ళకూడదని కర్ణుడు ఆమె కొంగు పట్టి లాగడం, ఆ విసురుకు ఆమె ముత్యాల మొలనూలు తెగిపోవడం, దుర్యోధనుడు ఆమెను కూర్చోబెట్టి ఆ ముత్యాలను ఏరడం. దుర్యోధనుని ఔదార్యము… దాన్ని ఉపయోగించవచ్చు. ఆధునిక మహిళ, సమానత్వం, సంకుచిత మనస్తత్వం. బ్లా-బ్లా-బ్లా… స్త్రీల పట్ల అమానుషం ఎవర్ గ్రీన్ టాపిక్. మంచి సరుకే. ఆలోచిస్తునాడు యశ్వంత్. అంతలో తనను విడిచిపెట్టి, విడాకులు కూడా ఇవ్వకుండా అల్లరిపెట్టి, మళ్ళీ పెళ్ళికాకుండా కూర్చోబెట్టిన ఒకప్పటి భార్య గుర్తుకు వచ్చింది. కథతో ఇవి లీక్ చేయవచ్చు. మంచి కాంట్రవర్సీ ఔతుంది. అయితే ప్రస్తుతం తాను పీక్ లోనే ఉన్నాడు, ఆ అవసరం లేదు. ఆ కథకు ఇంకా టైమ్ ఉంది. తరువాత శీర్షికపై దృష్టి మార్చాడు. ‘గాంధీగారి గొలుసు గడియారం’. ఆఁ, ఇది బాగుంది. చారిత్రకం. ఆనాటి తప్పిదాలను ఎత్తి చూపడం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అటో, ఇటో ఎటైనా త్రిప్పవచ్చు. బాగా పేలుతుంది. క్షణం ఆగి మొదలుపెట్టాడు.
నీ దిరుగుటచే రాట్నముం దిరిగె దేశ
భాగ్యచక్రముం దిరిగె చివరకు వెనుది
రిగెను రవియస్తమించని బ్రిటిషు పీఠి
గొలుసుగడియారమ! నిజముతెలుపుమమ్మ!
మొదలుపెట్టిన అతని పెన్ను అప్రతిహతంగా సాగుతోంది. చేతి సిగరెట్టు అనారతంగా పొగలు కక్కుతోంది.
రెండు నిమిషాలలో కథ మొత్తం చదివేసి “కథలో కథ. బాగుందబ్బా. ఆ గుఱ్ఱం – ఆ రచయిత నువ్వే కదో. నీ మీద నువ్వే జోకులేసేసుకున్నావు. వేద్దాంలే.” అన్నాడు వీరాస్వామి. ఆ మాటలకు హమ్మయ్య అనుకున్నాడు విరాట్.
‘పైకి కనపడడు కానీ బుఱ్ఱ పాదరసమే. తను చూపిన ధ్వనిని ఇట్టే పట్టుకున్నాడు.’ మురిసిపోయాడు విరాట్. తన కథ అందరూ చదివినట్టు, చర్చించుకున్నట్టు, తనను మెచ్చుకున్నట్టు, సమాజం మారిపోయినట్టు… వాస్తవం కాబోని ఊహలలో విహరిస్తున్నాడు విరాట్.
“అది సర్లే గానీ, నీ కథలో ఆ… భానుమతి కథేదో అన్నావు, అది కూడా రాయొచ్చు కదో” కథ నచ్చకున్నా విరాట్ కథనం నచ్చి తన దారికి తెచ్చుకోడానికి దువ్వుతున్నాడు వీరాస్వామి.
“అంటే అది…” ఏం చెప్పాలో తెలియక ఆగాడు విరాట్.
“మన మసాలాకథ సెక్షను ఉంది కదా. కొంచం ‘ఆ సరుకు’ జోడించి రాస్తే అందులో ఏద్దాం. హిట్టవుద్ది. పేమెంటు కూడా దానికే ఎక్కువ మరి. ఇక బో”
విరాట్ వెళ్ళగానే, మధురిమ పత్రిక సంపాదకుడు వీరాస్వామి అతడిచ్చిన కథను చెత్తబుట్టలో పడేశాడు. ఆ బుట్ట ఎప్పటికప్పుడు ఖాళీ ఔతూనే ఉంది, మరలా నిండుతూనే ఉంది. చిత్తు కాగితాలు తూకానికి పోతూనే ఉన్నాయి. మరలమరల రీసైకిల్ ఔతూనే ఉన్నాయి. ప్రచురణకు నోచుకోనిది కాస్త ముందు, ప్రచురింపబడినది కాస్త ఆలస్యంగా అదే చోటుకు… ఏ హృదయాన్నీ తాకకుండా, ఓ క్షణమైనా నిలువకుండా కథ కంచికి పరుగెత్తుతూనే ఉంది.
‘ఇది కథ కథ’ అని వచ్చిన మెసేజ్ చూశాడు. Read more వరకూ అలా అలా చదివేసి thumbs up emoji కొట్టి, రచయిత ఎవరో కూడా చూడకుండా తన కాంటాక్ట్స్‌లో కొందరికి, గ్రూపులు కొన్నిటికి forward చేశాడు ప్రసిద్ధ్. పంపిన ఉత్తరక్షణంలో అతనికి మరిన్ని నమస్కారాలు, హృదయాలు వగైరా emojiలు వచ్చేశాయి. కొందరెవరో కృతిమమేధనో లేక అలా తయారయిన తమ instant recipe బుద్ధినో ఉపయోగించి క్షణాలమీద ఊకదంపుడు పదాలతో కథ నిడివిని మించిన ప్రశంసావాక్యాలు క్రుమ్మరించారు. ఏదో సాధించిన గర్వంతో కాఫీ పూర్తిచేసి, ఇంకేవో నాలుగు posts forward చేసి, ల్యాప్‌టాప్ మూసి ఆఫీసుకు బయలుదేరాడు ప్రసిద్ధ్. నిమిషాల మీద ఆ కథ ప్రపంచమంతా చుట్టేసింది.
ఇంకా ఎక్కడో తిరుగుతూనే ఉంది. ఎవరి దృష్టీ తగలకుండా. నకులుని గుఱ్ఱం.