బాను ముష్తాక్‌ కథలు

కన్నడ రచయిత్రి, న్యాయవాది, కార్యకర్త అయిన బాను ముష్తాక్‌ కథల సంపుటి ‘హార్ట్‌ లాంప్‌’ (హృదయ దీపం)కు మే 20, 2025న అంతర్జాతీయ బుక్కర్‌ ప్రైజ్‌ లండన్‌లో ప్రకటించారు. ఈ సంపుటిని కన్నడ నుంచి ఇంగ్లీషులోకి దీప భాస్తి అనువదించారు. పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా వారు దీన్ని ప్రచురించారు. ఈ పుస్తకానికి 2024లో ఇంగ్లీష్‌ పెన్‌ అనువాద అవార్డు కూడా లభించింది. 2022లో గీతాంజలి శ్రీ హిందీ నవల ‘టూంబ్‌ ఆఫ్‌ సాండ్‌’ (ఇసుక సమాధి)కి బుక్కర్‌ ప్రైజ్‌ లభించింది. ఇప్పుడు 2025లో మళ్ళీ భారతీయ మహిళకు బుక్కర్‌ ప్రైజ్‌ లభించడం గర్వించదగ్గ విషయం. మొదటిసారిగా దక్షిణ భారతీయ భాషలలో ఒకటైన కన్నడకు ఈ గుర్తింపు కలగడం ప్రాంతీయ సాహిత్య విశిష్టతకు, వైవిధ్యానికి నిదర్శనం! అంతేకాకుండా మొదటిసారిగా ఒక కథల సంపుటికి ఈ ప్రైజ్ లభించడం అభినందనీయం.

తన కథల గురించి బాను మాట్లాడుతూ మతం, సమాజం, రాజకీయాలు ఎలా ముస్లిం స్త్రీలను ప్రశ్నించడానికి వీలు లేకుండా అసమానతలకు గురి చేశాయో, దాని వలన వారు ఎంత అమానవీయ దౌర్జన్యానికి, హింసకు గురయ్యారో ప్రస్తావించారు. బుక్కర్‌ ప్రైజ్‌ను గెల్చుకున్న మొట్టమొదటి భారతీయ మహిళా అనువాదకురాలు, కర్ణాటకలో కూర్గ్‌ ప్రాంతంలోని మడికేరిలో నివసించే దీప భాస్తి అంటారు: “హిందువును, ఉన్నత కులస్తురాలిని అయిన నేను ఒక అల్పసంఖ్యాక సమాజానికి చెందిన రచయిత్రి కథలను ఇద్దరికీ సంబంధించని వేరొక భాషలోకి అనువదించడంలో కొంత సంకోచానికి గురైన విషయం వాస్తవమే!” అయితే ఈ సంపుటిలోని స్త్రీల బాధలు కేవలం ఒక సమాజానికి సంబంధించినవి కాదని, ఇతర సమాజాల్లోని మహిళలు కూడా విభిన్న రూపంలో హింసకు గురయ్యారన్న విషయాన్ని గుర్తు చేస్తాయని అన్నారు. పెంగ్విన్‌ చీఫ్‌ ఎడిటర్‌ మానసి సుబ్రమణ్యం ఈ అవార్డు ప్రాంతీయ సాహిత్య విజయమని, మిగతా భారతీయ భాషల సాహిత్యాన్ని పరిశీలించవలసిన, చదవవలసిన అవసరాన్ని గుర్తు చేసిందని పేర్కొన్నారు.

డెబ్భై ఏడు సంవత్సరాల బాను ముష్తాక్‌ కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ ప్రాంతానికి చెందినవారు. మిగతా ముస్లిం బాలికల మాదిరిగానే ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. కానీ మొదటి నుంచి ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చిన, ఆమె ఉన్నతికి కారణమైన ఆమె తండ్రి, ఆమెకు మరిన్ని అవకాశాలు కలిగించాలన్న ఉద్దేశ్యంతో ఆమెను కన్నడ భాషా మాధ్యమం ఉన్న కాన్వెంట్‌ స్కూల్లో చేర్పించారు. కన్నడ భాషలో పట్టు సాధించడానికి బాను ఎంతో కృషి చేశారు. చివరకు తన సాహిత్య భాషగా కన్నడను ఎంచుకున్నారు. స్కూల్లో ఉన్నప్పుడే రాయడం మొదలుపెట్టారు. మిగతా ముస్లిం యువతుల లాగా కాకుండా కాలేజీకి వెళ్లి చదువుకున్నారు. 26 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. కానీ మొదట్లో ఎన్నో సంఘర్షణలను, విపరీత పరిస్థితులను ఎదుర్కొంటూ, నాలుగు గోడల మధ్య జీవిస్తూ, పిల్లల్ని కంటూ, ఇంటి పనులకు పరిమితమై బతికారు. తర్వాత ఆమె చేసిన ఆత్మహత్యా ప్రయత్నం భర్త వలన విఫలమైంది. అప్పటి నుంచి ఆమె జీవితం మలుపు తిరిగింది. లోకల్‌ టాబ్లాయిడ్‌లో రిపోర్టర్‌గా పది సంవత్సరాలు పని చేశారు. తర్వాత తన కుటుంబం కోసం న్యాయవాది వృత్తిని చేపట్టారు. 2000లో మహిళలకు కూడా మసీదుల్లో ప్రార్థించే హక్కు ఉండాలన్నందుకు బెదిరింపులకు గురయ్యారు. ఇస్లామ్‌ చట్టం ప్రకారం ఆమెకు విరుద్ధంగా ఫత్‌వా జారీ అయింది. ఒక వ్యక్తి కత్తితో ఆమె మీదకు రాగా, భర్త ఆమెను రక్షించాడు. కానీ ఈ సంఘటనలు ఆమెను భయపెట్టలేదు. సంప్రదాయ పితృస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా పోరాడారు, రచనలు చేశారు.

కన్నడ భాషలో బండాయ (విప్లవ) సాహిత్య ఉద్యమంలో భాగంగా 1980లలో రచనలు చేయడం మొదలుపెట్టారు. బండాయ సాహిత్యం అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలను, దళితులను వారి వారి కథలు చెప్పమని, హక్కుల కోసం పోరాడమని ప్రోత్సహించింది. అది బానుకు తన గొంతుకను వినిపించే అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పటి దాకా ఒక నవల, ఒక వ్యాస సంపుటి, ఒక కవితా సంపుటి, ఆరు కథా సంపుటాలు తీసుకొచ్చారు. ఈ ఆరు కథా సంపుటాలలో ఉన్న యాభై కథల నుంచి ఎంపిక చేసిన పన్నెండు కథలు ఇప్పుడు ‘హార్ట్‌ లాంప్‌’ పుస్తకంలో ఉన్నాయి. ఆమె కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, దానా చింతామణి అట్టింబె అవార్డు కూడా గెల్చుకున్నారు. న్యాయవాది అయిన తన దగ్గరకు వచ్చిన ముస్లిం మహిళల దుఃఖభరిత గాథలు వారి గురించి రాయాలన్న ప్రేరణ కలిగించాయని అన్నారు.

ఆమె కథల సారాంశాన్ని, సందేశాలను, నేపథ్యాలను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం అనిపించింది. బాను ముస్తాక్‌ బుక్కర్‌ ప్రైజ్‌ గెల్చుకున్న తర్వాత ఆమె గురించి అనేక వ్యాసాలు వచ్చాయి. కానీ ఆమె అసలు తన కథలలో ఏమి రాసిందో ఎవరూ ప్రస్తావించలేదు. అందుకే సంపుటిలోని పన్నెండు కథలను క్లుప్తంగా వివరిస్తాను. కథల ఇంగ్లీషు శీర్షికలను, వాటి అర్థాలను తెలియజేసే తెలుగు శీర్షికలను ప్రతి కథకు ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు సంపుటిలో ఇచ్చిన వరసలోనే కథలను ప్రస్తావించాను.

  1. స్టోన్‌ స్లాబ్స్‌ ఫర్‌ షాయిస్తా మహల్‌ (షాయిస్తా మహలు కోసం రాతి పలకలు): పురుషాధిక్యతకు ప్రతిబింబమైన ఇఫ్తికర్‌, అతని కంటే పది సంవత్సరాలు చిన్నది, ఎంతో అందమైనది అయిన షాయిస్తా కథ ఇది. యాభై ఏళ్ళ వయస్సులో కూడా తన భార్య పట్ల ప్రేమను బహిరంగంగా ప్రదర్శిస్తూ, తను షాజహాన్‌ లాంటి చక్రవర్తి అయితే తాజ్‌మహాల్‌కు మించిన మహలు కట్టి దానికి షాయిస్తా మహలు అని పేరు పెడతానని గొప్పలు చెబుతుంటాడు ఇఫ్తికర్‌. అతను కుటుంబ నియంత్రణకు వ్యతిరేకి అవడం వలన షాయిస్తా ఆరుగురు పిల్లల తల్లి అవుతుంది. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి పెద్ద కూతురు అసీఫా చదువుని హైస్కూలు తర్వాత మాన్పిస్తాడు. ఆడపిల్లలు అంతకంటే చదువుకోవాల్సిన అవసరం లేదని అతని అభిప్రాయం. షాయిస్తా ఏడవసారి గర్భిణీ అవుతుంది. మగపిల్లవాడిని కని అనారోగ్యంతో మరణిస్తుంది. ఆమె మరణించిన నలభై రోజుల తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండని యువతిని పెళ్లి చేసుకుంటాడు ఇఫ్తికర్‌. తన సుఖాలలో మునిగిపోయి బాధ్యతారహితంగా పిల్లల సంరక్షణ అసీఫా మీద వదిలేస్తాడు. ముస్లిం మహిళల పరిస్థితిని తెలిపే కథ ఇది!
  2. ఫైర్‌ రెయిన్‌ (అగ్ని వర్షం): ఒక మసీదు కమిటీ అధ్యక్షుడు (ముతవల్లీ సాహెబ్‌) మతం కోసం ఎటువంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు. కానీ ఇస్లాం చట్టం ప్రకారం తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిలో తన చెల్లెళ్లకు హక్కు ఇవ్వడానికి ఇష్టపడడు. వారి భాగాలు వారికి ఇవ్వమని భార్య చెప్పినా, ఒక స్త్రీ తనకు సలహా చెప్పడమేమిటని ఆమెను చులకన చేసి ఆమె సలహాని పట్టించుకోడు. నలుగురిలో ముగ్గురు చెల్లెళ్ళు తమ హక్కుల గురించి అవగాహన లేని, లేక అడిగే సాహసం లేని మహిళలుగా కనబడతారు. చిన్న చిన్న సహాయాల కోసం అతన్ని ప్రాధేయపడుతూ ఉంటారు. ఆఖరి చెల్లెలు మాత్రం తన భర్త ప్రోద్బలంతో వాటా ఇవ్వమని అడుగుతుంది. ముతవల్లీ సాహెబ్‌ తన పనులు ముగించుకుని ఇంటికి వెళ్లినప్పుడు అతని కూతురు ఆఖరి కొడుకు ఆరోగ్యం విషమిస్తే తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లిందని ఏడుస్తూ చెబుతుంది. హక్కుదారులు అసంతృప్తి చెందితే అగ్నివర్షం కురుస్తుందన్న మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయంటూ కథను ముగించడం బాగుంది.
  3. బ్లాక్‌ కోబ్రా (నల్ల నాగుపాము): అష్రఫ్‌కి ముగ్గురు కూతుళ్లు పుట్టగా, కొడుకు పుట్టలేదని భర్త యాకుబ్‌ మరో పెళ్లి చేసుకుంటాడు. కనీసం తన పిల్లల పోషణకు, జబ్బు పడిన ఆఖరి కూతురి మందులకు డబ్బు ఇప్పించమని మసీదు అధ్యక్షుణ్ణి (ముతవల్లీ సాహెబ్‌) వేడుకుంటుంది. అతను యాకుబ్‌ని సమర్థిస్తూ ఆమె అభ్యర్థనలను పట్టించుకోడు. అతను కూడా పది సంవత్సరాల నుంచి ప్రతి ఏడు కాన్పులతో విసిగిపోయిన భార్య అమీనాను నిర్లక్ష్యం చేస్తుంటాడు. అష్రఫ్‌ తనకు న్యాయం చేయమని మసీదుకి వస్తుంది. మసీదులో ఉన్న యాకుబ్‌ కోపంగా ఆమెని తోయగా, ఆమె చేతిలోని బిడ్డ కిందపడి మరణిస్తుంది. మసీదు అధ్యక్షుడు తర్వాత ఇంటి దారి పట్టినప్పుడు దారిలో మహిళలందరూ అన్యాపదేశంగా అతన్ని శపిస్తారు. ఇంటిలో భార్య ఎదురై కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవడానికి తల్లితో పుట్టింటికి వెళుతున్నానని, తిరిగి రావడానికి వారం పడుతుందని, పిల్లల్ని చూసుకోమని అధికార స్వరంతో చెప్పి వెళ్ళిపోతుంది. కథను స్త్రీలలో వచ్చిన మార్పుల్ని తెలియజేస్తూ సమర్థవంతంగా ముగించారు.
  4. ఎ డెసిషన్‌ ఆఫ్‌ ది హార్ట్‌ (హృదయ నిర్ణయం): మెహబూబ్‌ బి, అఖిల అత్తాకోడళ్లు. మెహబూబ్‌ బికి యూసఫ్‌ ఒక్కడే సంతానం. అతడు తల్లిని గౌరవిస్తూ, ప్రేమగా చూసుకుంటుంటాడు. అఖిలకు అది నచ్చక పోట్లాటకు దిగుతుంది. అత్తను సవతితో పోలుస్తూ తిడుతూ ఉంటుంది. చివరికి యూసఫ్‌ విసిగిపోయి, ఇంకా అందంగా కనపడే తల్లికి ఆమెకు తెలియకుండా మరో నిఖా చేయడానికి పూనుకుంటాడు. అఖిల ఇది భరించలేక పంచాయితీ వాళ్ళను పిలిపిస్తుంది. ఈ పని నీ ఆనందం కోసం, నిన్ను ఈ నరకం నుంచి తప్పించడానికి చేస్తున్నానని తల్లికి చెబుతాడు యూసఫ్‌. ఆమె కొడుకు బాధ అర్థం చేసుకుని తనకు ఇష్టమేనని, మీరందరూ పెళ్లికి రండి అంటుంది. నీకు కూడా నీ పిల్లలు పెళ్లి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నానని యూసఫ్‌ భార్యతో అంటాడు. అది అతడు తనకిచ్చే శాపమని తలచి అఖిల శోకగ్రస్త అవుతుంది. అత్తాకోడళ్ల వివాదాలు అన్ని సమాజాల్లో కనబడతాయని తెలుపుతుందీ కథ!
  5. రెడ్‌ లుంగీ (ఎర్ర లుంగీ): ఇస్లాంలో ఖితాన్‌ లేక ఖత్నా అని పిలువబడే సున్నతి విస్తృతంగా ఆచరించే సంప్రదాయం. ఇది మగపిల్లలకు ఎనిమిదేళ్ల లోపుగా చేస్తారు. అలా చేయించుకున్న వారినే ముస్లిం సమాజానికి చెందిన వారిలా పరిగణిస్తారు. ఆ పద్ధతిని పరిశుభ్రత మరియు శుద్ధీకరణ యొక్క రూపంగా చూస్తారు. మంగలి కత్తితో సున్నతి చేసిన తర్వాత గాయానికి బూడిద పూస్తారు. ఇది చేసే మంగలికి శక్తులుంటాయని, అందుకే పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు రావని, పైగా మెడికల్‌ డాక్టర్లతో చేయించుకున్న పిల్లలే అంటువ్యాధులతో బాధపడినట్లు కథలో చూపించారు. ఈ సున్నతి మసీదుల్లో పేద పిల్లలకు ఫ్రీగా చేసి, చేయించుకున్నందుకు వాళ్ళకు డబ్బులు, ధాన్యాలు ఇస్తారు. ఈ విషయంలో మనకు బాధ కలిగించే సంఘటనలు తటస్థపడతాయి. ఒక పేద తల్లి సున్నతి చేసిన తన కొడుక్కి మళ్ళీ చేయమంటుంది. వాళ్లిచ్చే డబ్బులకి ఆశపడి. ఇంకో పేదరాలు పాలు తాగే చిన్న పిల్లాడికి సున్నతి చేయమని ప్రాధేయపడుతుంది. ఈ సంఘటనలు ముస్లిం సమాజంలోని పేదరికాన్ని గుర్తు చేస్తాయి.
  6. హార్ట్‌ లాంప్‌ (హృదయ దీపం): నలుగురు పిల్లల తల్లియైన మెహరూన్‌లో వరుస కాన్పుల వలన అందం తరిగిపోతుంది. భర్త ఇనాయత్‌ ఒక నర్సు ప్రేమలో పడి ఆమెతో ఎక్కువ సమయం గడపసాగాడు. మెహరూన్‌ తన తల్లిదండ్రులు, అన్నల దగ్గరకు సపోర్ట్‌ కోసం వెళ్ళగా, వాళ్ళు ఆమెనే తప్పు పడతారు. ఆమె నిరాశతో ఆత్మహత్యా ప్రయత్నం చేయబోతుంది. పెద్ద కూతురు సల్మా గ్రహించి ఆమె కాళ్ళ మీద పడి ‘‘అబ్బా కోసం నువ్వు చనిపోతున్నావు, మా కోసం బ్రతకలేవా? మమ్మల్ని అనాథలను చేసి ఒక స్త్రీ దయాదాక్షిణ్యాల మీద వదిలేస్తున్నావా?’’ అని వేడుకుంటుంది. మెహరూన్‌ సల్మా స్పర్శతో, మాటలతో తనని అర్థం చేసుకునే స్నేహితురాలు దొరికినట్లు భావించి సల్మాని దగ్గరకు తీసుకుంటుంది.
  7. హై హీల్డ్‌ షూస్‌ (ఎత్తు మడమ బూట్లు): నయాజ్‌ ఖాన్‌ దృష్టి అంతా సౌదీ నుంచి వచ్చిన వదిన వేసుకు తిరిగే ఎత్తు బూట్ల మీదే ఉంటుంది. తన భార్య అసీఫాకు అటువంటి బూట్లు కొనివ్వాలన్న ఉన్మాదం అతనిలో ప్రవేశిస్తుంది. ఒకసారి బజారుకు వెళ్ళినప్పుడు షాపులో అలాంటివి కనపడితే, వెంటనే కొని అవి సరిగ్గా పట్టకపోయినా భార్యకు బలవంతాన తొడుగుతాడు. ఆ తర్వాత ఆమెని పట్టించుకోడు. అసీఫా వాటితో నడవలేక చాలాసార్లు పడబోతుంది. తను పడితే తన కడుపులో బిడ్డకు ప్రమాదమని గ్రహించి, బిగుసుకుపోయి ఉన్న వాటిని అతి కష్టం మీద వదిలించుకుంటుంది. కడుపుతో ఉన్నా, ఆమెకు ఒంట్లో బాగోపోయినా పట్టించుకోని భర్త ఈ విషయంలో చూపించిన ఆత్రం, పట్టుదల అతని మొండి వైఖరిని తెలియజేస్తుంది.
  8. సాఫ్ట్‌ విస్పర్స్‌ (సున్నితమైన గుసగుసలు): కథలో సాఫియా తల్లి ఆమెకు ఫోను చేసి తాత, ముత్తాతల ఊరైన మలేనహల్లిలో నెల చివర్లో ఉర్స్‌ జరుగుతుందని, సంప్రదాయం ప్రకారం చందన ఆచారం తమ కుటుంబం జరపాలి కాబట్టి సాఫియాని అక్కడికి వెళ్లమంటుంది. ఆ కార్యక్రమమంతా దర్గా అధిపతి అబిద్‌ చూసుకుంటాడని, అతను వచ్చి సాఫియాను కలుస్తాడని చెబుతుంది. సాఫియాకి తనకి పదిహేను, పదహారేళ్ల వయస్సులో మలేనహల్లిలో జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. తన చిన్నతనాన్ని, అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని అబిద్‌ ప్రవర్తించిన తీరు, ముఖ్యంగా తన బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్న వైనం, ఆ తర్వాత తను ఆ సంఘటనను అసహ్యించుకుంటూ ఏడుస్తుంటే నాయనమ్మ ఓదార్చడం గుర్తుకొస్తుంది. అలాంటి అబిద్‌ ఇప్పుడు ఇంటికి వచ్చి తనని అక్కా అని సంబోధిస్తూ ఉర్స్‌కి ఆహ్వానిస్తాడు. మాట్లాడినంత సేపు కళ్ళు దించుకుని అబిద్‌ మాట్లాడటం వలన వ్యక్తిగా అతన్ని అంచనా వేయలేకపోతుంది సాఫియా. టీనేజ్‌లో జరిగిన సంఘటనలు బాలికల మీద ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుపుతుంది ఈ కథ.
  9. ఏ టేస్ట్‌ ఆఫ్‌ హెవెన్‌ (స్వర్గాన్ని చేరిన అనుభవం): బి దాది సాదత్‌ తండ్రి చెల్లెలు. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని వారి పంచన చేరింది. సాదత్‌ భార్య ఆమె నుంచి ఇంటి పనులన్నీ నేర్చుకుంటుంది. బి దాది తను ప్రార్థన చేసుకునే వస్త్రాన్ని జాగ్రత్తగా, అపురూపంగా కాపాడుకుంటుంది. ఎందుకంటే దాన్ని ఆమె అక్క హజ్‌ యాత్రకు వెళ్ళినప్పుడు తెచ్చి బి దాదికిచ్చింది. సాదత్‌ పిల్లలు పొరపాటున దాన్ని పాత గుడ్డనుకుని బైక్‌ తుడవడానికి ఉపయోగిస్తారు. దానికి బి దాది తట్టుకోలేక తిండి తిప్పలు మానేసి, నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చునేది. ఒకరోజు సాదత్‌ పిల్లలు పెప్సీ కొని తెచ్చుకుని, స్వర్గపు పానీయం అని బి దాది చేత తాగిస్తారు. బి దాది పెప్సీకి అలవాటు పడి మామూలు మనిషవుతుంది. అన్నం తినకుండా అది తాగుతూ, స్వర్గంలో తన భర్తతో ఉన్నట్లుగా ఆనందపడుతుంది. ముసలివాళ్ళలో కనపడే మనోచాంచల్యాలను కథలో చక్కగా చూపించారు.
  10. ది ష్రౌడ్‌ (కఫాన్‌ : శవం మీద కప్పే తెల్లని వస్త్రం): షాజియా ఆమె భర్త సుభాన్‌ హజ్‌ యాత్రకు వెళ్ళాలనుకుంటారు. భర్త చనిపోగా తన పిల్లల్ని తన రెక్కల కష్టంతో పెద్ద చేసిన పేదరాలు వాళ్ళింట్లో పని చేసే యాసీన్‌ పెద్దమ్మ. ఆమె షాజియాకి ఆరు వేల రూపాయలిచ్చి తన కోసం మక్కా నుంచి పవిత్ర జలం చల్లిన కఫాన్‌ తెచ్చిపెట్టమని అడుగుతుంది. షాజియా తప్పకుండా తెస్తానంటుంది కానీ తన వ్యవహారాల్లో మునిగిపోయి మర్చిపోతుంది. యాసీన్‌ పెద్దమ్మ తనను చూడటానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే చాప, పూసలు ఇవ్వబోతుంది. యాసీన్‌ పెద్దమ్మ ఇవన్నీ నాకు అక్కరలేదు, నేనడిగిన కఫాన్‌ ఇవ్వమంటుంది. షాజియాకు కోపం వచ్చి ఆమె డబ్బు ఆమెకు తిరిగి ఇవ్వడానికి లోపలికెడుతుంది. వచ్చి చూస్తే యాసీన్‌ పెద్దమ్మ కనబడదు. ఆ తర్వాత తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ షాజియా దగ్గరకు మళ్ళీ రాదు. కొన్ని రోజులకు ఆమె చనిపోగా ఆమె కొడుకు కఫాన్‌ ఇవ్వమని షాజియా దగ్గరకు వస్తాడు. షాజియా కొడుకు అతనికి మరొక కొత్త కఫాను కొనిచ్చి, యాసీన్‌ పెద్దమ్మ అంతిమ యాత్ర సక్రమంగా సాగడానికి సహాయపడతాడు. షాజియా తన తప్పు తెలుసుకుని బాధపడుతుంది. తను పెద్దమ్మ కంటె దరిద్రురాలనని, దురదృష్టవంతురాలనని గ్రహిస్తుంది.
  11. ది అరబిక్‌ టీచర్‌ అండ్‌ గోబి మంచూరి (అరబిక్‌ ఉపాధ్యాయుడు మరియు గోబి మంచూరి): ఇది మౌల్వి హజరత్‌ అనే అరబిక్‌ ఉపాధ్యాయుడి కథ. అతడు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవాడు. అరబిక్‌లో ఖురాన్‌, మత సంబంధ విషయాలు బోధించే అతనికి గోబి మంచూరి అనే వంటకం అంటే విపరీతమైన ఇష్టం. తను బోధించే ఒక ఇంట్లో గోబి మంచూరి చేయమన్న పొరపాటు వలన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోసారి తను పెళ్లి చేసుకోబోయే కన్య ఎలా ఉంటుందో పట్టించుకోకుండా, ఆమెకి గోబి మంచూరి చేయడం వచ్చా లేదా అన్న దాని మీద ధ్యాస పెడతాడు. ఇది ఆ పిల్ల వైపు వాళ్ళకి విడ్డూరంగా అనిపించడం వలన సంబంధం చెడుతుంది. చివరికి మరో పెళ్లి కుదరగా, విందు భోజనంలో గోబి మంచూరి తప్పనిసరిగా వడ్డించాలని పట్టుబడతాడు. పెళ్లైన తర్వాత భార్యని గోబి మంచూరి చేయమని ఆమె వెంటపడటమే కాకుండా ఆమె సరిగ్గా చేయలేకపోతే కొడుతూ ఉంటాడు. చివరికి పెళ్లికూతురు అన్న అతని మీద పోలీస్‌ కంప్లైంట్ ఇవ్వాలని అనుకోవడం జరుగుతుంది. బాను రాసిన మిగతా కథలకు ఈ కథ భిన్నంగా ఉంటుంది.
  12. బి ఏ ఉమన్‌ వన్స్‌, ఓ లార్డ్‌ (భగవంతుడా, నువ్వొకసారి స్త్రీగా మారిపో!): దురదృష్టవంతురాలైన ముస్లిం యువతి కథ ఇది. ఆ పాత్ర పేరు చెప్పకుండా ఉత్తమపురుషలో ఆమె చేత కథ చెప్పిస్తారు రచయిత్రి. ఆమెకు భర్త ప్రేమ లభించదు. కేవలం లైంగిక వాంఛ తీర్చుకోవడానికి మాత్రమే ఆమె దగ్గరకు వస్తాడు భర్త. యాభై వేలు తెమ్మని ఆమెను పుట్టింటికి తరుముతాడు. ఆమె ఉత్తి చేతుల్తో తిరిగి వస్తుంది. తర్వాత ఆమె తల్లి చనిపోయినా పుట్టింటికి పంపడు. కొడుకు, కూతురు పుడతారు. ఆమె కడుపులో ట్యూమర్‌ రాగా ఆస్పత్రిలో చేర్పిస్తాడు. ఆమె మెడలో గొలుసు తను పెళ్లి చేసుకోబోయే మరో స్త్రీకి ఇవ్వమంటాడు. ఆమె నిరాకరిస్తుంది. ఎందుకంటే అది ఆమె తల్లి ఆమెకు ఇచ్చిన గొలుసు కాబట్టి. ఆమెను, పిల్లలను చూడటానికి ఆస్పత్రికి రాడు. ఆమెను డిశ్చార్జ్ చేయగా పిల్లలతో ఇంటికి వస్తుంది కానీ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఎదురు చూస్తూ బయట కూర్చుంటుంది. కొంచెం సేపట్లో ఆటో దిగి ధనవంతురాలైన కొత్త భార్యను చేతులతో ఎత్తుకుని ఆమె చూస్తుండగానే ఇంట్లోకి వెడతాడు భర్త. ఆమె శోకగ్రస్త అవుతుంది. ‘‘భగవంతుడా! నువ్వు స్త్రీగా మారితే నా బాధ అర్థం అవుతుంది’’ అనుకుంటుంది.

పైన విశ్లేషించిన కథలన్నీ దాదాపు ముస్లిం సమాజంలోని స్త్రీల పరిస్థితులను, బాధలను, వారు ఎదుర్కొంటున్న అసమానతలను, లింగ వివక్షను తెలిపే కథలు. ఒక్కోసారి అవి ముస్లిం మహిళల గురించే కాకుండా ముస్లిం సమాజాన్ని గురించి కూడా కొంతలో కొంత తెలుపుతాయి. కొందరు ఈ సంపుటిని అది వరకు బుక్కర్‌ ప్రైజ్ గెల్చుకున్న రచనలతో పోలుస్తూ, ఆ స్థాయిలో లేదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరి కొందరు ముస్లిం మహిళల పట్ల జరుగుతున్న వివక్షల సమగ్ర స్వరూపాన్ని ఈ పుస్తకం చూపగలిగిందా అన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనా పితృస్వామ్య ఆధిక్యతను ప్రశ్నించిన, ధిక్కరించిన అరుదైన ముస్లిం రచయిత్రుల స్వరాలకు ప్రతీకగా మనం ఈ కథలను ఆహ్వానించవచ్చు! అక్కున చేర్చుకోవచ్చు!