“దృశ్యాదృశ్యం” పై కొన్ని అభిప్రాయాలు

అభివృద్ధి పేరుతో ప్రకృతి మీద మానవుడు చేస్తున్న అఘాయిత్యాలనీ, వాటి వల్ల సహజ వనరుల మీద ఆధారపడిన ప్రజల జీవితాలు చితికిపోవటాన్నీ, భూగోళంపై ఉండే సహజ సంపద, జంతుజాలాల మీద శాశ్వతంగా మిగిలిపోయే సమస్యలనీ నేపథ్యంగా తీసుకొని వ్రాసిన నవల చంద్రలతగారి “దృశ్యాదృశ్యం”. ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయాలు చాలానే ఉన్నా, కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే ఇక్కడ చర్చిస్తాను.

వినూతనమైన కథాంశం: మన ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసే క్లిష్టమైన పర్యావరణ సమస్యనే మనసుకు హత్తుకుపోయేలా పాఠకుల దృష్టికి తీసుకువస్తుందీ నవల. తెలుగు సాహిత్యంలో ఈ సమస్యకి ఇంత ప్రాధాన్యతనిచ్చిన మొట్టమొదటి నవల ఇది (నాకు తెలిసినంతవరకూ).

Professional Ambition vs. Social Consciousness: శాస్త్రీయ పరిజ్ఞానంలోనూ, సాంకేతిక నిపుణతలోనూ పైపైకి పోవాలనే ఉద్వేగాన్నీ, తద్వారా వచ్చే సామాజిక సమస్యలనీ సరితూకం వేసుకోవటంలో శాస్త్రజ్ఞులూ, ఇంజనీర్లూ పడే సందిగ్ధాన్ని రచయిత్రి ఈ నవలలో చక్కగా విశ్లేషించారు. ఇటువంటి ఘర్షణకి లోనై సతమతమవుతున్న కేశవ మనఃస్థితిని ఎంతో లోతుగా పరిశీలించి సహజంగా, సున్నితంగా, పాఠకుల మనసుల్లో ప్రతిఫలించేలా చిత్రీకరించారు.

పరిశోధన: ఈ పుస్తకంలో చర్చించిన ప్రతి విషయాన్ని రచయిత్రి విస్తారంగా పరిశోధించినట్లు తెలుస్తోంది. ఆనకట్టల నిర్మాణం నుండి పసుపులోని రకాల వరకూ, చేపల జీవితచక్రాల నుండి ఎడ్ల పందేల వరకూ అన్నిటిలోని ఆసక్తికరమైన వివరాలను కథలో ఇమిడ్చి మనకందిస్తారు.

పాత్ర పోషణ: వాస్తవిక సమస్యను, కాల్పనిక సాహిత్యంతో సమ్మిళితం చేసి, నదితోను, ప్రక్కనే వున్న అడవులతోను అవినాభావ సంబంధం ఏర్పరుచుకొన్న ప్రజల జీవితాలు ఆనకట్ట నిర్మాణం వల్ల ఎలా అస్తవ్యస్తం అయిందీ రచయిత్రి అమోఘంగా మన కళ్ళముందుంచుతారు. చేపలు పట్టే శాయన్న నుంచి, భూస్వామి భూపాలయ్య వరకూ, చిన్న రైతు సిద్దయ్య నుంచి, మధ్యతరగతి దశయ్య వరకూ వివిధ పాత్రలనూ, వారి కుటుంబాలనూ మనకు పరిచయం చేసి, వాళ్ళ సమష్టి జీవనస్రవంతి నదితో, ప్రకృతితో ఎంత గాఢంగా పెనవేసుకుపోయిందీ మనకు చూపిస్తారు. సాంఘిక సమస్యలను మన దృష్టికి తేవడమేకాకుండా ప్రతి పాత్ర మనస్తత్వాన్ని సహజంగా, సజీవంగా చిత్రించారు. విభిన్న పాత్రలు, వారి మనోబలాలు, బలహీనతలు, వాటి ప్రభావాలవల్ల మారిపోతున్న సంబంధాలు నవలలో naturalగా evolve అవుతాయి. ఈ human aspect నవలకి జీవంపోసి పర్యావరణ సమస్య మనందరి జీవితాల్లో అంతర్భాగమనే నిజాన్ని బయటకు తెస్తుంది (makes explicit).

రచనాశైలి, భాష: నవలను చంద్రలతగారు చాలా సహజమైన శైలిలో, సులువైన భాషలో రచించారు. ప్రాంతీయ భాషను వాడటం వల్ల, సహజమైన పదజాలంతో కూడిన భావప్రవాహం వల్ల నవలలోని పాత్రలు, వాటి అనుభూతులు మనకు దగ్గరగా అనిపిస్తాయి. పుస్తకంలో అనేక చోట్ల తేలికైన భాషలో లోతైన భావాల్ని చెప్పి పాఠకుల మేధస్సుకు డైరెక్టుగా (భాషాసమస్య అంతరాయం కాకుండా) పదునుపెట్టగలిగారు. విశ్లేషణ కోసం పైన చెప్పిన మంచి లక్షణాల గురించి విడివిడిగా చెప్పుకున్నా, రచయిత్రి వీటన్నిటినీ, ఇంకా ఎన్నో మంచి లక్షణాలని, తగుపాళ్ళలో కలిపి దృశ్యాదృశ్యం సృష్టించారు. నిజానికి నవల ద్వారా మనకు వచ్చే message of universal harmony ఈ నవల రచనలో కూడా ఉందేమోననిపిస్తుంది. సామాజిక స్పృహ, ప్రస్తుత సమస్యల మీద వ్యాఖ్యానం, పాత్ర పోషణ, పరిశోధన, రచనాశైలి, వీటన్నిటి harmonious combination దృశ్యాదృశ్యం.

“As man proceeds toward his announced goal of the conquest of nature, he has written a depressing record of destruction, directed not only against the earth he inhabits, but against the life that shares it with him.” 1962 లో Silent Spring అనే పుస్తకం వ్రాసిన Rachel Carson అన్న మాటలివి. ఆ పుస్తకం ద్వారా విషపూరితాలైన అనేక పురుగుల మందుల {pesticides & insecticides) వల్ల పర్యావరణం, పక్షులు, చేపలు, వాటితో సహజీవనం చేసే జంతుజాలాలు (మనుష్యులతో సహా) ఎలా హానికి గురవుతున్నదీ విస్తారంగా చర్చించి Rachel Carson అమెరికాలో సంచలనం సృష్టించారు. ఆ పుస్తకం వల్ల అమెరికాలో environmental movement ఉధృతంగా పుంజుకొంది. Environmental Protection Agency సృష్టించబడింది. DDT లాంటి ప్రమాదకరమైన మందులు వాడటం రద్దుచేయబడింది. అది మొదలుకొని అమెరికాలోనూ, అనేక ఇతర దేశాల్లోనూ పర్యావరణ స్పృహ చాలా ఎక్కువై ఒక ఉద్యమంగా మారింది. ఇప్పుడు ప్రతీ development project మొదలు పెట్టే ముందు దానివల్ల వాతావరణం, గాలి, నీరు, పశుపక్ష్యాదులు మొదలైన వాటి మీద ఉండే ప్రభావాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.

మన దేశంలో పర్యావరణ స్పృహ అనాది నుంచే ఉన్నా, (“అశోకుడు చెట్లు నాటించెను”) స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వ సిద్ధాంతాలు దానికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించదు. ప్రస్తుతం ప్రజల్లోంచి పుట్టిన environmental activities groups చాలా ఉన్నాయి. వారి పుణ్యమా అని కొంత awareness కనిపిస్తుంది. జర్నలిస్టుల రిపోర్టులూ, activistల వ్యాసాలూ, సైంటిస్టుల పేపరూ చాలానే ఉన్నా పర్యావరణ సమస్యపై నవలా సాహిత్యం తెలుగులో కానీ, భారతదేశంలోని ఇతర భాషల్లో కానీ లేదనిపిస్తుంది. ఆ లోటుని దృశ్యాదృశ్యం తీరుస్తుంది. Carsonగారి Silent Spring అమెరికా ప్రజల్లో ఎంత చైతన్యాన్ని తీసుకువచ్చిందో, చంద్రలతగారి దృశ్యాదృశ్యం తెలుగు ప్రజల్లో, మన అదృష్టం బాగుంటే భారతీయులందరిలో, అంత చైతన్యాన్ని తీసుకురాగలిగే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డిగారు తమ పీఠికలో ఇంకా చక్కగా వివరించారు. ఆ పీఠికని తప్పకుండా చదవండి.

Silent Spring, దృశ్యాదృశ్యం రెండూ పర్యావరణం సమస్య నేపథ్యంగా తీసుకొనే వ్రాసిన పుస్తకాలే అయినా వాటి మధ్య చాలా తేడాలూ, విభిన్న ప్రత్యేకతలూ మనకు కనిపిస్తాయి. Carsonగారి Silent Spring నవలా సాహిత్యం (fiction)లోకి రాదు. ఒక సాంఘిక సమస్యని సంఖ్యల ద్వారా, విస్తారమైన పరిశోధనా ఫలితాల ద్వారా, అందరికీ అందుబాటులో ఉండే భాషలో వ్రాసిన రిపోర్టు లాంటిది Silent Spring. ఆవిడ ఎంత passionateగా వ్రాసినా, ఉన్న వాస్తవాలనే ఉన్నట్లుగా మన ముందుంచే వ్యాఖ్యానం వ్రాశారే గాని, ఆ వాస్తవాలని అనుభవించే జీవితాలనే సృష్టించి మనలో సన్నిహితానుభూతిని రేకెత్తించలేదు. అయితే చంద్రలతగారి దృశ్యాదృశ్యంలో ‘సజీవ’ పాత్రలనే కలుసుకుంటాం మనం. జలావరణ సమస్యను పరిశోధనాత్మక దృష్టితోనే కాకుండా, నవలలోని పాత్రలతో సన్నిహితంగా సహజీవనం చేస్తూ, వ్యక్తిగతంగా ఆ పాత్రల జీవితాల్లోని ఒడిదుడుకుల్నీ మనస్సులోని ఘర్షణల్నీ vicariousగా మనమూ అనుభవిస్తాము. అందువల్ల ఈ ముఖ్యమైన సమస్యకి మనం ఆలోచనాపథంగానే కాకుండా, హృదయంతోనూ, మనసుతోనూ స్పందిస్తాము. సామాజిక చైతన్యాన్ని ఉత్తేజపరిచే సాహిత్యానికి ఇంతకన్నా ఏం కావాలి? of course, Silent Springలో పురుగుల మందుల వల్ల వచ్చే ప్రమాదాల గురించి వ్రాస్తే, దృశ్యాదృశ్యంలో ఆనకట్టల నిర్మాణం వల్ల జరిగే పర్యావరణ నష్టాన్ని గురించి వ్రాసారు. అంతే కాకుండా జలావరణ సమస్య మీద చంద్రలతగారు చాలా సామాజిక స్పృహతో తెలుగు ప్రజలు తమ నిజజీవితానికి అన్వయించుకోగల సహజత్వంతో దృశ్యాదృశ్యం వ్రాశారు.

కథలోని ముఖ్యపాత్ర కేశవ సివిల్ ఇంజినీర్, వృత్తిధర్మం రీత్యా తన సొంత ఊరినే ఆనకట్ట నిర్మాణం వల్ల మునిగిపోయే ముంపు ప్రాంతంగా ప్రకటిస్తాడు – అలవోకగా గీసిన ఎర్రగీతతో. ఆ గీతతో మలుపు తిరిగిన అనేక జీవితాల గురించే మనమీ నవలలో చదువుతాము. అక్కడి భూమినే నమ్ముకుని బ్రతుకుతున్న సిద్దయ్య, అతని కుటుంబం, ఆ నదిలో చేపలు పట్టే శాయన్న, కేశవ స్నేహితుడు దశయ్య, అతని తండ్రి భూపాలయ్య వీరంతా ఆ ఊరి జీవన వలయానికి ప్రతిబింబాలు. వాళ్ళ మధ్య స్నేహభాంధవ్యాలు, వాళ్ళకీ పశుపక్ష్యాదులకీ , అక్కడి నదికీ అడవికీ మధ్య పెనవేసుకున్న బంధాలు మనకు అర్థమవుతాయి. ఊరు మునగటంతో చిందర వందర అయిన వాళ్ళ జీవితాల్ని మనసు ద్రవింపజేసే సంఘటనలతో రచయిత్రి చిత్రీకరించారు. ఎగదన్నిన నది నుంచి పుట్టిన ఊట నీరు వల్ల సిద్ధయ్య పసుపుతోట కుళ్ళిపోవడం, అక్కడి పాములు పుట్టల్లో నీరు నిండటం వల్ల పారిపోయి చెట్లెక్కటం ఒక హృదయవిదారక ఉదాహరణ. సంవత్సరాల తరువాత రిజర్వాయర్ పైన లాంచీలో ప్రయాణంచేస్తున్న అక్షత నీటి అడుక్కి చూస్తూ ఒకప్పుడు అక్కడ ఉండే ఊరినీ, ఆడుకునే పిల్లల్నీ, జరిగిన పెళ్ళీ పేరంటాలనూ ఊహించుకుని భాధపడుతుంది. చెరువైన ఊరినీ, ప్రాణం పోసిన ప్రకృతినీ వదిలి కూలి పనులు వెతుక్కుంటూ పోతారు చాలామంది. ‘ఏటి మట్టే ఎరువు, ఏటి నీరే కల్పతరువు’ అనుకుంటూ తరతరాలుగా అక్కడే పాతుకుపోయిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారాలు, చూపిన పునరావాసాలు మనఃక్షోభని తగ్గించలేవు. వదల్లేనివాళ్ళు, వెళ్ళి ఉండలేనివాళ్ళు ‘కొరివిదెయ్యాలై’ ఆ కొండాకోనల్లోనే తిరుగుతూ ఉంటారు. భూపాలయ్య ప్రోద్బలంతో కొంతమంది ఆ దగ్గరలోనే కొత్త నివాసాలు ఏర్పరుచుకొంటారు. ప్రభుత్వంవారి అవకతవకలతో, అధికారుల లంచగొండితనంతో, రాజకీయ కుతంత్రాలతో ఆనకట్టను నిర్మించిన ఆశయాలు అడుగంటి అనేక ఉపద్రవాలు వస్తాయి. బహుళార్థ సాథక పథకాల భాధకాలే మిగులుతాయి.

సాంఘిక సమస్యనే కాకుండా, పాత్రల మధ్య వ్యక్తిగత సంబధాలనూ, వృత్తి నిర్వహణలో ఎదురయ్యే moral dilemmasను కూడా ఈ నవలలో చాలా సహజంగా చిత్రీకరించారు. ఒక్క ఉదాహరణ: సిద్దయ్య, శ్రీనుల మధ్య ఉన్న తండ్రీకొడుకుల అనుబంధం openగా, అమాయకంగా, explicitగా ఉంటుంది. అదే అనుబంధం భూపాలయ్య, కేశవల మధ్య reservedగా, dignifiedగా implicitగా ఉంటుంది. గాఢత ఒక్కటే అయినా వాళ్ళ అంతస్తుని బట్టి, జీవన విధానాన్ని బట్టి వ్యక్తం చేసే తీరులో తేడా కనిపిస్తుంది.

చంద్రలతగారు ఈ పుస్తకంలో ఆదర్శవాదానికీ, కార్యసాధకత్వానికీ మధ్య ఉన్న తేడానే మన దృష్టికి తెస్తారు. కేశవ, పట్టాభి (కేశవ తమ్ముడు) ఇద్దరూ మంచివారే అయినా, వారిలో ఈ విభిన్న మనస్తత్వాలనీ, వాటి పర్యవసానాల్నీ మనం గమనంచవచ్చు. ఆదర్శవాదానికి అంకితమైన కేశవ జీవితం అంకురించిపోవటం, కార్యసాధకుడైన పట్టాభి సఫలీకృతుడవటం సహజత్వానికి దగ్గరగా ఉంది. ఈ తేడా మనకి చూచాయగా నవలలో చాలా ముందుగా (page 6) రాగవ్వ “పెద్ద మామ తీరయితే మాయదురుష్టం, చిన్నమామ తీరయితే సీయదురుష్టం” అని అక్షతతో అన్న మాటలలో కనిపిస్తుంది. అయితే రాగవ్వకీ కేశవ కుటుంబానికీ ఉన్న దగ్గరి సంబంధాన్ని అవసరమైనంత వివరంగా portray చెయ్యలేదేమోననిపిస్తుంది. ఆవిడ ఆ కుటుంబంతో చాలా అభిమానంగా ఉండటం మనకి కనిపిస్తుంది కానీ, ఆ అభిమానానికి ఉన్న కారణాలు అంత స్పష్టంగా కనిపించవు.

కేశవ, పట్టాభి, వత్సలల మధ్య ఉన్న love triangle నవలకి నాటకీయతనిస్తుంది. అయితే వత్సల పాత్ర వల్ల కథకు అంత బలం చేకూరినట్లు అనిపించలేదు. ప్రేమలో విఫలుడయినా, కేశవ వృత్తిలో, ఆశయ సాధనలో పొందిన పరాజయం వల్ల పొందిన మనోవేదనే మనకి బలంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో ఇటువంటి పాత్రలు అరుదు. ముఖ్యపాత్ర కేశవ పుస్తకంలో అదృశ్యంగా ఉండటం విశేషం. అసలు కథాసమయానికి కేశవ చనిపోయి 20 సంవత్సరాలు. ప్రత్యక్షంగా కనిపించే అక్షత కథకి మాధ్యమికురాలు. కేశవ డైరీలూ, అతన్ని గురించి సంభాషణలూ, అక్షత స్వంత అన్వేషణలూ — మొదలైన వాటిద్వారా కథ మనకు తెలుస్తుంది. గతానికి, ప్రస్తుతానికి మధ్య transitions, కథలోనే ముఖ్య భాగాల్ని indirectగా నైనా impactful గా మనముందుకి తేవటం చాలా smoothగా అయిపోతాయి – ఇవన్నీ మంచి సాహితీప్రక్రియలు అనుకుంటున్నాను. ఈ నవలలో చంద్రలతగారు కథావస్తువుకి కథ కంటే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినట్లు అనిపిస్తుంది. ఇందువల్ల నవల మొత్తం మీద వస్తువు చుట్టూ కథ అల్లినట్లుగా ఉంది. అయితే కథావస్తువు బలమైనది కావటం వల్ల ఈ imbalance అంత బాధకలిగించలేదు.

దృశాదృశ్యం ద్వారా ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతారు చంద్రలతగారు. శాస్త్రీయ, సాంకేతిక ప్రగతికి, సాంఘిక ప్రయోజనాలకి సమతుల్యం ఎలా సాధించగలం? కేశవ ఊరికి జరిగిన దారుణాల్ని చూసి ఆనకట్టల నిర్మాణం ఆపివేయాలా? ఆ దారుణాల్ని జరగకుండా జాగ్రత్తపడి ఈ ‘ఆధునిక దేవాలయాల’ ప్రయోజనాల్ని ప్రజలకి అందించటం అసాధ్యమా? “సమతుల్యం కావాలి. జల వనరుల వినియోగానికీ, జల సంరక్షణకీ నడుమ ఆ సంతులిత సమీకరణమే మన ఆధునిక జల సంస్కృతి” అని కేశవ నిర్ణయిస్తాడు. ఆ సమతుల్యం ఎలా వస్తుంది? ఈ ప్రశ్న జలావరణ సమస్యకీ, కేశవకీ మాత్రమే పరిమితం కాదు. ప్రతి సైంటిస్టూ ఇంజనీరూ, డాక్టరూ ఈ సందిగ్ధ ప్రశ్నతో సతమతమవుతూనే ఉంటాము. ఈ ప్రశ్నయొక్క ప్రాముఖ్యత రోజురోజుకీ ఎక్కువవుతుంది. ఈ రోజుల్లో cloning, stem-cell growth, genetically modified (GM) goods(and people!) లాంటివి పరిశోధనాత్మకంగా ఎంత excitingగా ఉంటాయో, సామాజికంగా అంత ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. త్వరలో రాబోతున్న అతి చిన్న కంప్యూటర్లను మన రక్తనాళాల్లో ఇమిడ్చి జబ్బుల్ని డయాగ్నోజ్ చెయ్యవచ్చు. వాటినే మన చర్మం కింద అమర్చి మనం ఎక్కడున్నదీ track చెయ్యవచ్చు. విజ్ఞానపుటంచుల్ని చీల్చుకుని పరుగుతీస్తున్న ఈ ఆధునికత వలన ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆలోచించవలసిన బాధ్యత మనందరిదీనూ. ఇటువంటి ‘ముందుటడుగులు’ ఒకసారి వేస్తే వెనక్కి తీసుకోలేము. కనుక ‘before the genie is let out of the bottle’ సైంటిస్టులూ, ప్రభుత్వమూ, ప్రజలూ పర్యవసానాలను ఆలోచించి ‘సమతుల్యం’ ఉండేలా చూసుకోవాలి. పైన చెప్పిన ‘Advanced Developments’ వల్ల రాగల సమస్యలు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకే కాదు, అభివృద్ధి చెందుతున్నఇండియా లాంటి దేశాలకి కూడా వర్తిస్తాయి. నిజానికి ఇటువంటి ప్రశ్నలపై అవగాహన ఉంటే వేరే దేశాలు వేసిన తప్పటడుగులు మనం కూడా వేయకుండా జాగ్రత్తపడగలం. పైగా అభివృద్ధి చెందిన దేశాల వెనుక పరుగుతీయాలనే ఆత్రంతో ఇండియా, చైనా లాంటి దేశాలు కొన్ని సాంఘిక పర్యవసానాల్ని విస్మరించే ప్రమాదం ఉంది. ఉదాహరణకి గత 20 సంవత్సరాలుగా Market economyనీ, Modernizationనీ కావలించుకొని శరవేగంతో అభివృద్ది చెందిన చైనాలో ఇప్పుడు పర్యావరణ సమస్య భయంకరంగా ఉంది. ఈ విషయంపై వివరాలను గ్రంథ సూచిక(3)లో ఇచ్చిన National Geographic వ్యాసంలో చదువుకోవచ్చు. ఇండియా చైనా కంటే మరీ భిన్న పరిస్థుతుల్లో లేదు. ఈ మధ్య కాలంలో మనమూ ‘అభివృద్ది’ వైపు పరుగులుతీస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో పర్యావరణ సమస్యని గుర్తుచేసి మనని సమగ్రాలోచనవైపు హెచ్చరిస్తుంది “దృశ్యాదృశ్యం’.

పర్యావరణ సమస్య లాంటి సున్నితమైన సమస్యకి సులువైన, శాశ్వతమైన పరిష్కారాలుండవు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దేశ కాల పరిస్థితులకి అన్వయించుకొని most reasonable compromiseని వెతుక్కోవాలి. ఒక దేశంలోని పథకాలు, ఒక కాలంలోని ఆలోచనలు మరో దేశానికి, కాలానికి వర్తించకపోవచ్చు. ఉదాహరణ: Carsonగారి పుస్తకం (Silent Spring) రాకముందు అమెరికనులు DDTని వేలంవెర్రిగా వాడేవారు. దాన్ని swimming poolsలో చల్లి ఈదేవారు. సైనికుల మీద డైరెక్టుగా గుప్పించి చల్లేవారు. ఆవిడ పుస్తకంలో DDT వల్ల రావచ్చుననే సమస్యలు చదవగానే DDT వాడకం పూర్తిగా రద్దుచేశారు. అంతేకాకుండా ఆ నిర్ణయాన్ని ఇతర దేశాల మీద కూడా రుద్దారు. అయితే DDT వాడకం ఆఫ్రికా లోని కొన్ని దేశాల్లో అవసరం. అక్కడ మలేరియా నివారణకు దోమలను చంపాలంటే DDT వాడకం తప్పటం లేదు. వేరే ప్రత్యమ్నాయం తెలిసేవరకైనా DDTని అవసరమైనంత వాడలేకపోతున్నారు. ఎందుకంటే యూరోపియనులు, అమెరికనులు అందుకు అవసరమైన సహాయం అందించటానికి నిరాకరిస్తున్నారు. DDT వాడకం ఆపేశాక ఆఫ్రికాలో పిల్లల చావులు విపరీతంగా పెరిగిపోయాయి. జాగ్రత్తగా indoorsలోనే (మనుషుల్ని బయటకి పంపేసి) spray చేయటం వల్ల మలేరియాని నివారించవచ్చనీ, పర్యావరణంపై, మనుష్యులపై ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చనీ పరిశోధనల్లో తెలుస్తుంది. అభివృద్ధిచెందిన దేశాల్లో మలేరియా లేకపోవటం వల్ల వాళ్ళు తమ సమస్యని అర్థంచేసుకోవటంలేదని ఆఫ్రికాలోని తల్లులు వాపోతున్నారు. ఈ సమస్యపై చెలరేగుతున్న గందరగోళాన్ని గ్రంథసూచికలో ఇచ్చిన BBC వ్యాసాల్లో చదువుకోవచ్చు. కాబట్టి Carson పుస్తకం చదివి గుడ్డిగా DDTని సర్వదేశాల్లో, సర్వకాలాల్లో నిరోధించటం కూడా మూర్ఖత్వమే అవుతుంది.

1952లో National Book Awardని పరిగ్రహిస్తూ Rachel Carson ఇలా అన్నారు.[2]:”The aim of science is to discover and illuminate truth. And that, 1 take it, is the aim of literature, whether biography, or history or fiction; it seems to me, then, that there can be no separate literature of science… If there is poetry in my book about the sea, it is not because I deliberately put it there, but because no one could write truthfully about the sea and leave out the poetry” శాస్త్ర విజ్ఞానాన్నీ, సామాజిక సృహనీ, వ్యక్తిగత అనుభూతులనీ సమతుల్యంచేసే తెలుగు సాహిత్యాన్ని ‘దృశ్యాదృశ్యం’ ప్రోత్సహిస్తుందని ఆశిద్దాం.

గ్రంథ సూచిక (Bibliography)
1. Rachel Carson : Silent Spring , Houghton Mifflin Co. 1994 (originally in 1962 edition )
2. Gino J. Marco, et al. (editors: Silent Spring Revised , American Chemical Society, 1987
3. National Geographic, March 2004 : “China’s Growing Pains” by Jasper Becker.
4. BBC News: “West stands accused over malaria” by Richard Black, March 4, 2004 https://news.bbc.co.uk/1/hi/health/3531893.stm
5. BBC News: “Battle over anti-malaria chemical ” by Richard Black, March 4, 2004 http://news.bbc.co.uk/i/hi/sci/tech/3532273.stm
6. BBC News: “DDT and Africa’s War on malaria” November 26, 2001https://news.bbc.co.uk/1/hi/World/africa/1677073.stm