అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 2

ట్రెకింగ్‌లో మొదటి రోజే దారంతా వర్షాన్ని మోస్తూ ఇరవై రెండు కిలోమీటర్లు నడిచి, 500 మీటర్లు ఎత్తున్న తిమాంగ్ హిల్ దాటుకుని, ముప్ఫై అయిదుమందిమి చీకటి పడక ముందే ఛామె గ్రామం చేరుకోవడం మాకే నమ్మశక్యం గాని విషయం. అవును – కొన్నిసార్లు వాస్తవం కల్పనకన్నా చిత్రంగా ఉంటుంది.

బేసిషహర్ అన్నది లమ్‌జంగ్ జిల్లా ముఖ్యపట్టణం. మళ్ళా ధారాపానీ గ్రామం మనంగ్ జిల్లాకు చెందుతుంది. ఈ మనంగ్ జిల్లాకు ఆనాడు మేము చేరుకున్న ఛామె ముఖ్య పట్టణం. పట్టణం అంటున్నామే గానీ నిజానికి ఛామె పన్నెండు పదమూడువందలమంది నివసించే తగుమాత్రపు గ్రామం. గ్రామంలోకి ప్రవేశించినపుడు ఊళ్ళో చాలాచోట్ల చిన్న చిన్న వేడి నీటి బుగ్గలు ఉండటం గమనించాం. మనుషులు టిబెటియన్ రూపురేఖలతో కనిపించారు. “అవును. ఈ ఊళ్ళో చాలామంది శతాబ్దాల క్రితం టిబెట్ పీఠభూమినుంచి వలస వచ్చారు. రూపురేఖలే కాదు – వాళ్ళ ఇళ్ళు, వృత్తి వ్యాపకాలు, జీవనసరళి ఇప్పటికీ టిబెటియన్లనే పోలి ఉంటాయి” వివరించాడు బాబు గురంగ్.

రాత్రి మా నివాసం వైట్ స్థూప టీహౌస్ లో ఏర్పాటయింది. అక్కడికి చేరీ చేరగానే అందరం తిన్నగా అప్పటికే వెలుగుతోన్న మంట చుట్టూ చేరి మా తడిసిన బట్టలు, బూట్లు, బాక్‌పాక్‌లు ఆరబెట్టుకునే పనిలో పడిపోయాం. ఏదైనా ట్రెక్‌లో జరగగల అతి పెద్ద అసౌకర్యం బూట్లలోకి నీళ్ళు వెళ్ళడం. సామాన్యంగా ట్రెకింగ్ షూస్ ఎంతోకొంత నీటిని ఆపుకోగలవుగానీ నీళ్ళల్లోనూ జలపాతాల క్రిందా నడిచినపుడు ఎంత నాణ్యమైన పాదరక్షలయినా ఓటమినంగీకరిస్తాయి. తడిసి నానిపోతాయి.

స్కాట్లాండ్ లోని వెస్ట్ హైలాండ్ వే లో, ఒక జోరు వర్షపు దినాన, ట్రెక్ చేశాక తడిసిన బూట్లను ఆరబెట్టుకోడానికి మా సహ ట్రెకర్ ఒకాయన అనుసరించిన చిట్కా ఒకటి ఆ క్షణాన గుర్తొచ్చింది. బూట్ల లోపల అడుగున ఉండే పొరను తొలగించి, ఆ లోపలంతా టిష్యూ పేపర్ కుక్కి, ఆ బూట్లను మంట దగ్గర ఉంచితే అవి చాలా తొందరగా ఆరిపోతాయని ఆయన చేసి చూపించాడు. మేము ఊళ్ళోకి వచ్చినపుడు ఎందుకైనా పనికొస్తుందని అదనపు టాయ్‌లెట్ పేపరు కొని తెచ్చాం. అప్పటి చిట్కా వాడి చూసాం. ఫలితమిచ్చింది.

మా టీహౌస్ యజమాని ప్రకాశ్, అరుదైన వ్యక్తి. చక్కని హోత. ఎంతో సహాయకారి. వానలో తడిసివచ్చిన మా ఇబ్బందులు గ్రహించి మేము ఊహించని సహాయం అందించాడు. మామూలుగా టీహౌసుల్లో ఉండే చలిమంటలను భోజనాలయ్యి అంతా పడుకున్న వెంటనే ఆర్పేస్తారు. ప్రకాశ్ మాత్రం మంటను అర్ధరాత్రి దాకా ఉంచుతానన్నాడు. దానివల్ల మా బట్టలు, బూట్లు, ట్రెకింగ్ సామగ్రి చక్కగా అరిపోయాయి. సహాయం పెద్దదా చిన్నదా అని కాదు. ఎంత సమయోచితంగా ఉందీ అన్నది ముఖ్యం. అతని ఆ అతి చక్కని సాయంవల్ల బట్టలవీ ఆరడమనే కాదు, మా మనఃస్థితి కూడా కుదుటబడింది. వర్షాన్ని మరచిపోయి మర్నాడు తాజాతాజాగా పొడిపొడిగా మా యాత్ర కొనసాగించే అవకాశం ఉంటుంది అని అందరికీ నమ్మకం, విశ్వాసం కలిగించింది. అందరం ఆ నమ్మకంతో మా గదులకు చేరాం.


అక్టోబర్ 5 మా ట్రెకింగ్‌లో రెండవ రోజు. ఛామెలో బయలుదేరి 14 కిలోమీటర్లు నడచి, 3300 మీటర్ల ఎత్తున ఉన్న ఎగువ పిసాంగ్ చేరుకోవాలన్నది ఆనాటి మా ప్రణాళిక. అందుకు ఐదారు గంటలు పడుతుందని మా అంచనా. ఆరోజు స్థూలంగా 670 మీటర్లు ఎగువకు చేరతామన్నమాట.

ఆ ఉదయం మా గది తలుపులు తెరవగానే మంచు నిండిన లమ్‌జంగ్ హిమల్ శిఖరం కనిపించి పలకరించింది. వీధిలో మరికాస్త దూరం వెళ్ళగా రెండవ అన్నపూర్ణ శిఖరం కనిపించి చక్కని దృశ్యమాలికను మా ముందు నిలిపింది. పేరుకు తగ్గట్టుగానే ఛామె ఎంతో ఛార్మింగ్ చిరుగ్రామం అనిపించింది.

అందరం మా టీహౌస్ ప్రకాశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి నడక ఆరంభించాం. నిన్నంతా కురిసి కురిసి వాన అలసిపోయిందేమో – ఆ ఉదయాన వాన ఛాయలు వెదుకుదామన్నా కనిపించలేదు. గొప్ప ఉపశమనం. సంతోషం. అప్పటిదాకా మొహం చాటేసిన సూర్యుడు కూడా తన పూర్ణస్వరూపం చూపించడానికి తొందరపడసాగాడు. గొప్ప వాతావరణం. వెచ్చని ఎండలో, చక్కని వెలుగులో హిమశిఖరాల మధ్య ట్రెకింగ్ చెయ్యడమంటే స్వర్గసమానమే.

ఛామె ఊళ్ళోంచి బౌద్ధ మతప్రతీకలు, పతాకాలు నిండిన వీడ్కోలు ద్వారం – కని, గుండా బయటకు నడిచాం. మేము నడచిన మట్టిబాట మనంగ్ వరకూ జీపులు వెళ్ళే మోటారు బాటగా కూడా వ్యవహరిస్తుందట. అవును, నిజమే అని చెప్పడానికి అపుడపుడు మాకు జీపులు తటస్థపడ్డాయి. చుట్టూ చిక్కని అడవి… లోతైన ఇరుకాటి లోయ… మా బాట కొండచరియ అంచులను హత్తుకు సాగింది. కొన్నిచోట్ల కొండను తొలిచి బాటను పరచారు.

ఆరోజు నేను సోము, ప్రసాద్‌లతోనూ, మహిళలు శైలజ వనతి సుమతి అనితారాణి ఉమా శాంభవిలతోనూ కలసి నడిచాను. అందరం మా జీవితాల గురించి, అప్పటిదాకా చేసిన ట్రెక్కుల గురించి, కబుర్లలో పడిపోయాం. ఆయా అనుభవాలను పంచుకొన్నాం. అపుడపుడు నిలచిపోయి పరిసర సౌందర్యాన్ని మనసులో ఇంకించుకున్నాం. ఫోటోలు తీసుకున్నాం… ఇంత పెద్ద బృందాలతో కలసి యాత్రలు చేసినపుడు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, తమవే అయిన అనుభవాలను అందరితో పంచుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఇహ బృందాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నపుడు అలా సభ్యుల మధ్య కబుర్లు సాగేలా, పరిచయాలు స్థిరపడేలా, పరస్పర అవగాహన గట్టిపడేలా చూడవలసిన బాధ్యతా ఉంటుంది. వారికేమన్నా ఇబ్బందులు, సమస్యలు ఉంటే నాతో పంచుకొనే వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత నా మీద ఉంది.

కాస్తంత పొద్దెక్కేసరికి మేమంతా ఒక విశాలమైన యాపిల్ తోట దగ్గరికి చేరుకున్నాం – ఎన్నో ఎకరాలలో విస్తరించి ఉన్న తోట అది. చెట్లన్నీ మంచి కాపు మీద ఉన్నాయి; పళ్ళు చాలావరకు పక్వానికి వచ్చి ఎర్రరంగు సంతరించుకుని ఉన్నాయి. ఆ తోటలో ఒక దుకాణం, ఒక రెస్టారెంటు ఉన్నాయి. అక్కడ యాపిళ్ళతో చేసిన తినుబండారాలు, పళ్ళ రసం, కాస్తంత పులియబెట్టిన యాపిల్ సైడర్ లభిస్తున్నాయి. అందరం యాపిల్ తినుబండారాలు రుచి చూశాం. పళ్ళ రసంతో సేదదీరాం. ఆ ప్రాంతం యాపిళ్ళకు ప్రసిద్ధి అట. కొన్ని తాజా పళ్ళను దారిలో తినడానికి తీసుకున్నాం.

ఆ ఉదయాన చాలాసేపు లమ్‌జంగ్ పర్వతపు హిమశిఖరాలు మాకు తోడుగా కనిపిస్తూ వచ్చాయి. పొద్దు ముదిరే వేళ ఉన్నట్టుండి దృశ్యం మారింది. మర్శియాంగ్దీ నది వెనకతట్టున నలుపూ బూడిద రంగులు కలగలసిన అతి పెద్ద కొండచరియ దృశ్యసీమను ఆవరించింది. దానిని పౌంగ్డ దండా అంటారని మా గైడ్ ప్రేమ్ వివరమందించాడు. దానికి స్వర్గద్వారి అన్న మరో పేరు కూడా ఉందట. మరణించినవారి ఆత్మలు ఈ కొండచరియ బండ మీదుగా స్వర్గం చేరుకుంటాయని స్థానికుల నమ్మకం.

పొద్దున్నే పలకరించిన నులివెచ్చని వాతావరణం మాతోపాటే రాసాగింది. ఆ స్నేహసమయంలో మా బృందపు సభ్యులతోనే కాకుండా దారిలో కనిపించిన ఇతర ట్రెకర్లతోనూ పలకరింపులు సాగాయి. ఇజ్రాయెల్‌కు చెందిన పదీ పన్నెండుమంది ఆడామగా కలగలిసిన పడుచువాళ్ళ బృందంతో మాటలు కలిశాయి. ఎందుకో ఎలాగో మా మధ్య సహజసంపర్కం ఏర్పడిపోయింది. మా రెండు బృందాలవాళ్ళమూ చూసీ చూడగానే చిరపరిచితుల్లా పలకరించుకున్నాం. బహుశా వాళ్ళకి మా బృందంలోని పరిణత స్ఫూర్తి నచ్చి ఉండవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులతో మమ్మల్ని అసంకల్పితంగా సరిపోల్చుకుని ఉండవచ్చు. వాళ్ళలోని శక్తి, ఉత్సాహం, చైతన్యం మాకు నచ్చి ఉండవచ్చు. 2013 లో నేను ఇజ్రాయెల్ వెళ్లినప్పటి జ్ఞాపకాలు అనుభవాలు కొన్ని వాళ్ళతో పంచుకున్నాను. ‘2013 అంటే మేమంతా అప్పుడు స్కూలు పిల్లలం’ అని వాళ్ళంతా ముసిముసి నవ్వులు నవ్వారు.

వాళ్ళతో ప్రస్తుతపు మా అన్నపూర్ణ ట్రెక్ గురించీ, జీపులు దూరలేని ఇరుకు దారుల గురించీ, అవి వెళ్ళే కొండచరియల్లో పొంచిన ప్రమాదాలగురించీ మాట్లాడుతున్నపుడు వాళ్ళు రెండు రోజుల క్రితం ఇదే దారిలో జరిగిన విషాద సంఘటన గురించి చెప్పారు. బేసిషహర్ – ధారాపానీ మార్గంలో రోడ్డు మీద వాహనాలకు అడ్డంగా పడి ఉన్న బండరాయిని పక్కకు తొలగించే ప్రయత్నంలో ఓ ఆస్ట్రేలియా పెద్దాయన పట్టుదప్పి లోయలోకి జారిపోయాడట. అలా పడటమంటే ఇహ మరణమే మరి – ఆ సంఘటనను కళ్ళారా చూస్తోన్న ఆయన కూతురు మనఃస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. క్షణం క్రితం ఉన్న నాన్న కన్ను మూసి తెరిచేలోగా శాశ్వతంగా అదృశ్యమై పోయాడు. కొండలు అంటే అందాలు సాహసాలు మాత్రమే కాదు; అంతులేని విషాద అగాధాలు కూడా అన్న మాటను ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తూ ఉంటాయి. అయినా ప్రపంచపు నలుమూలలనుంచీ యాత్రికులు రావడం, ఆ విషాదభరిత పర్వతశ్రేణుల్లో ఒదిగిపోవడం సాగిపోతూనే ఉంటుంది.

దారిలో మర్శియాంగ్దీ నది మీద ఉన్న పొడవాటి ఉయ్యాల వంతెన ఒకటి దాటాం. అప్పటికి 3040 మీటర్ల ఎత్తుకు చేరాం. అంటే సుమారు 10,000 అడుగులన్నమాట. వైద్యరీత్యా జాగ్రత్త పడవలసిన ఉన్నతశ్రేణి ప్రదేశమది. గాలి పలచబడటం, అంచేత అందుబాటులో ఉండే ఆక్సిజన్ తగ్గిపోవడం మొదలయ్యే ఎత్తులవి. ఆ ఉయ్యాల వంతెన మనుషులు నిర్మించినదే అయినా, అదీ అలాంటి వేలాది చిన్నా పెద్ద వంతెనలూ ఆ హిమాలయాల ఒడిలో ఎంతో సహజంగా ఇమిడిపోయి, ఆ ప్రకృతిలో అవీ అంతర్భాగమే అనిపింపజేస్తాయి.

ఒక పైన్ చెట్ల అడవి దాటాక ధుకుర్ పొఖారి అన్న గ్రామం చేరుకున్నాం. భోజనానికి ఆగాం. రాబోయే ఏడెనిమిది రోజులు మాకు దొరికే ఒకే ఒక పౌష్టికాహారం, దాల్‌భాత్ దర్శనమిచ్చింది. మాతో వచ్చిన కొత్తవాళ్ళు కూడా దాని గురించి పదే పదే విని ఉండటంవల్ల ఆ వైవిధ్యంలేని ఆహారాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆస్వాదించారు. మాతో ఈబీసీ ట్రెక్‌కు వచ్చినవారికి ఈ దాల్‌భాత్ పాతముచ్చటే. “ఒకే ఒక్క దాల్‌భాత్ తింటే, ఇరవై నాలుగుగంటలకు సరిపడే శక్తి లభిస్తుంది” అని మా గైడ్ సంజయ్ ముక్తాయించాడు.

సంజయ్ చెప్పింది నిజమే. ఆ అన్నం ముద్ద సత్వరశక్తిని ఇస్తుంది. అందులోని పప్పు పదార్థం ప్రోటీన్లు సమకూరుస్తుంది. ఆకుకూరలు నిండిన అనుపానం ఇతర పోషకపదార్థాలు అందిస్తుంది. అమాయకంగా కనిపించే అప్పడం కూడా, నేనూ ఉన్నానంటూ ప్రోటీన్ల సరఫరాలో పాలుపంచుకుంటుంది. వీటన్నిటితోపాటు, దాల్‌భాత్‌తోపాటు అందే ఇండియా పచ్చళ్ళు విటమిన్లకు నిలయాలు… ఇహ మేము తీసుకువెళుతోన్న ఎనర్జీ బార్లు, ఎలక్ట్రోలైట్లు, జీడిపప్పు బాదంలాంటి డ్రైఫ్రూట్లు, ఉదయాలు బ్రేక్‌ఫాస్ట్‌లో దొరికే ఆమ్లెట్లు – ఇలా ఎంత ఉన్నతశ్రేణులకు వెళ్ళినా, నిర్జన ప్రదేశాలలో తిరుగాడినా కొంచెం ముందు చూపూ జాగ్రత్త ఉంటే ఏ ట్రెక్‌లో అయినా పౌష్టికాహారం కొరవడకుండా చూసుకోవచ్చు. నిజానికి ఆ ప్రదేశాలలో ఆకలి మందగించడం అన్నది అసలైన సమస్య. ఏదో ఒకటి బలవంతాన అయినా తినడం అన్నది ఒక్కటే పరిష్కారం. అన్నట్టు రిఫ్రిజిరేషన్ సౌకర్యాలులేని ప్రదేశాలుగాబట్టి అక్కడ మాంసాహారం మాత్రం మేము ముట్టుకోలేదు.

ఎగువ పిసాంగ్ చేరువ అవుతోన్న సమయంలో మర్శియాంగ్దీ నదిని మరోసారి ఓ చెక్క వంతెన మీద దాటాం. దాటగానే ఒక ఆకుపచ్చని తటాకం కనిపించింది. ఆ నీళ్ళల్లో ఉండే మొక్కలూ నాచూ కలసి దానికా హరితవర్ణం ఇచ్చాయి.

దిగువ పిసాంగ్, ఎగువ పిసాంగ్ మర్శియాంగ్దీ నదీలోయలో పక్కపక్కనే ఉన్న అతి సుందరమైన గ్రామాలు. అవి 3200, 3300 మీటర్ల ఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా గురంగ్, మనంగ్ అన్న తెగలకు చెందిన వారి నివాసప్రాంతాలవి. ఆ రెండు గ్రామాలనుంచి రెండవ అన్నపూర్ణ శిఖరం సుస్పష్టంగా కనబడుతుంది. పక్షి మార్గాన ఏడెనిమిది కిలోమీటర్ల దూరానే ఉన్న ఆ అన్నపూర్ణ శిఖరం క్షితిజమంతా ఆక్రమించి అబ్బురపరుస్తుంది. అటు చివరా ఇటు చివరా కనిపించే ఇతర చిరు శిఖరాలు దృశ్యాన్ని మరింత శోభాయమానం చేస్తుంటాయి. జాగ్రత్తగా గమనిస్తే రెండవ అన్నపూర్ణకు దగ్గరలోనే నాల్గవ అన్నపూర్ణ శిఖరం కూడా చూడవచ్చు. వెనక్కి తిరిగి చూస్తే పిసాంగ్ శిఖరం ఐదారు కిలోమీటర్ల దూరాన పలకరిస్తుంది.

ఆరోజు అంతా కలసి ఏడు గంటలపాటు నడిచాం. పధ్నాలుగు కిలోమీటర్లు దాటాం. ఆ రాత్రికి స్వీట్ హోమ్ టీహౌస్ అన్నచోట ఉన్నాం. ఆ టీహౌస్ రెండవ అన్నపూర్ణకు సరిగ్గా ఎదురుగా ఉంది – ఏ అడ్డూ లేని ఆ అందమైన దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాం. ఇలాంటి దృశ్యాలను పదే పదే చూసిన నేనే చూపు తిప్పుకోలేకపోయాను; మరి మొదటిసారి ఇలాంటి ట్రెకింగ్‌కు వచ్చినవారి మనసు ఎంతగా పరవశిస్తుందో మనం ఊహించుకోవచ్చు.

మాలో కొంతమందిమి ఊళ్ళో ఉన్న గొంపా చూడటానికి వెళ్ళాం. అక్కడి భిక్షువులు 8-12 శతాబ్దాలనాటి నింగ్మాప బౌద్ధసంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఆ గొంపాలో బుద్ధుని మూడు విభిన్న రూపాల విగ్రహాలున్నాయి.

తర్వాత మేమంతా ఊళ్ళోని చిన్న కొండ ఎక్కి శిఖరాన ఉన్న బౌద్ధమఠం చేరాం. ఆ కొండమీదకు వెళ్ళే సన్నని దారి స్థానికులు నివసించే ఇళ్ళ మధ్యగా సాగింది. శిఖరంనుంచి కనిపించే రెండవ అన్నపూర్ణ దృశ్యం వర్ణనాతీతం. మంచు నిండిన శిఖరాలు, కొండ చరియల్లో హిమనదులు. పర్వతపాదాల దిగువన చిక్కని పచ్చని అడవులు – మహాద్భుత రూపమా అన్నపూర్ణది. దిగువనున్న లోయకు మర్శియాంగ్దీ నది పెట్టని ఆభరణం అనిపించింది. ఎన్ని త్రీడీ పిక్చర్ పోస్ట్‌కార్డ్‌లు మేము ఆ రోజు చూసిన వాస్తవ ప్రకృతి చిత్రానికి సాటి రాగలవు?!

మళ్ళా అందరం చిన్న చిన్న బృందాలుగా విడివడి ఆ సాయంత్రం గడిపాం. ఎడతెగని కబుర్లు, మాట అవసరం లేకుండా ఒకరినుంచి మరొకరికి సోకుతోన్న సంతోషోద్వేగాలు, సాయంసంధ్య ఆకాశం మీద గీస్తున్న చక్కని చిత్రాలు, వాటిని ఛాయాచిత్రాలలో పట్టుకొనే ప్రయత్నాలు, ఆనాటి సాయంత్రాన్ని జ్ఞాపకాల నిధిగా దాచుకోడానికి మిత్రులతో ఫోటోలు… కొత్త స్నేహాలు పండించుకోడానికి, పాత స్నేహాలు పునరుద్ధరించుకోడానికి ఎంతో అనువైన సమయమది.

కొండమీది బౌద్ధమఠంనుంచి నేను, పాత మిత్రుడు సోమేశ్ కలసి దిగి వచ్చాం. పాత కబుర్లు బోలెడు చెప్పుకున్నాం. చాలా ఏళ్ళపాటు నేను, సోమేశ్ లండన్ శివార్లలో నివాసం ఉన్నాం. నాది న్యూబరీ పట్టణం, అతనిది స్విండన్. మేమేగాక మా కుటుంబాలు యావత్తు చక్కగా కలసిపోయి ఉండేవి. పదేళ్ళ క్రితం సోమేశ్ ఆస్ట్రేలియాకు నివాసం మార్చాడు. పరస్పర సంపర్కం ఈ పదేళ్ళుగా నిలుపుకుంటూ ఉన్నా, కలసి తీరిగ్గా ఏనాడూ గడపలేదు. ఈ అన్నపూర్ణ ట్రెక్ పుణ్యమా అని ఆ అవకాశం దొరికింది. మేమిద్దరమేగాక ఇలా కొన్నేళ్ళ తర్వాత కలుసుకుని కబుర్ల పాత బాకీలు తీర్చుకుంటున్నవారు మా బృందంలో చాలామందే కనిపించారు.

మా టీహౌస్‌లకు చేరుకుని అక్కడి పచారీ దుకాణంలో మంచినీళ్ళ బాటిళ్లు కొనుక్కున్నాం. అన్నట్టు మా బృందం పరిమాణం దృష్ట్యా మేము ఆనాడు రెండు టీహౌసుల్లో ఉండవలసి వచ్చింది.


ట్రెకింగ్ మొదలుపెట్టి రెండు రోజులు గడిచాయి. 36 కిలోమీటర్లు నడిచాం. 1500 మీటర్ల ఎగువకు చేరాం. గడిచింది రెండురోజులే అయినా ఎప్పట్నుంచో కొండలలో నడుస్తోన్న అనుభూతి… ప్రకృతిలోని విశిష్టత అదే గదా!

మా భావనలను మెరుగుదిద్దేలా ఆ అక్టోబర్ ఆరవ తేదీనాటి ఉదయం సూర్యోదయ సమయాన రెండవ అన్నపూర్ణను చూడటం అన్న అపురూప అనుభవంతో మొదలయింది. అసలు సూర్యోదయమంటేనే అనుదినం జరిగే ఓ అద్భుతం. అది పర్వతాల నడుమ అంటే ఆ అందమే వేరు. ఆ పర్వతాలు హిమశిఖరాలు, మనం ఉన్నది ఒక నదీలోయలో అయితే ఇక చెప్పేదేముందీ! అలాంటిచోట, ఆ పర్వతాలూ సూర్యకిరణాల సయ్యాటను గమనిస్తూ, సూర్యోదయాన్నీ సూర్యాస్తమయాన్నీ చూడగలగడం ఒక వరం.

అలాంటి చక్కని రోజు, అక్టోబర్ ఆరు, మా బృందంలోని అనితారాణి పుట్టిన రోజు. గంగాకిశోర్, నేను బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపాం. మేము ముగ్గురం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో కలిసి చదివాం. 1986 బ్యాచ్ మాది. మా బ్యాచ్‌కొక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో అనితారాణికి ప్రపంచపు నలుమూలలా ఉన్న మా క్లాస్‌మేట్లనుంచి శుభాకాంక్షల వెల్లువ… ఆమెకు అమెరికాలో మెడిసిన్ పూర్తి చేసిన కూతురు, మెడిసిన్ చదువుతున్న కొడుకు ఉన్నారు. ప్రతి పుట్టినరోజు కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోవడం ఆమెకు ఆనవాయితీ… “ఈసారి ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది. క్లాసుమేట్లూ ట్రెకింగ్ మిత్రుల మధ్య చేసుకుంటున్నాను” అని సంబరపడ్డారామె.

బ్రేక్‌ఫాస్ట్ ముగించి అందరం ఎగువ పిసాంగ్‌నుంచి బయటపడి మనంగ్ బాట పట్టుకున్నాం. పొలిమేరలోని రంగురంగుల బౌద్ధ ‘కని’ వీడ్కోలు చెప్పింది. ఊరి బయట లోతట్టు ప్రాంతాల్లో బక్‌వీట్ పంట ఎకరాల కొద్దీ పరచుకుని కనిపించింది. కోతకు వచ్చిన పంట అది. కాసేపట్లో మరో చక్కని పచ్చని తటాకం తటస్థపడింది.

పిసాంగ్ నుంచి మనంగ్ చేరుకోడానికి రెండు మార్గాలు ఉన్నాయి: ఒకటి ప్రకృతి శోభిల్లే కొండల దారి. కాస్తంత కఠినమైన దారి. రెండవది మర్శియాంగ్దీ నదీ లోయలోంచి సాగిపోయే సులభమైన దారి. మేమంతా ప్రకృతి వేపే మొగ్గు చూపాం. కష్టమైనా సరే అనుకున్నాం. కోతకొచ్చిన బక్‌వీట్ పంట ఆ కొండదారుల్లోనూ మాకు తోడుగా వచ్చింది. అన్నట్టు ఈ బక్‌వీట్ అన్న పంటకూ మనం సాధారణంగా వాడుకొనే గోధుమకూ ఏమాత్రం సంబంధం లేదు. ఈ పంట, పూలనుంచి వచ్చే విత్తనాలకు చెందినది. అయినా ఇది స్టార్చ్ నిండిన పంట అవడంవల్ల దీన్ని సూడో పప్పు దినుసుగా పరిగణిస్తారు. ఆ విత్తనాల పిండితో నూడిల్సు వంటివి చేస్తారు.

కాస్త దూరం నడిచేసరికి ఆ ప్రాంతమంతా జూనిపర్ మొక్కలూ, పైన్ వృక్షాలూ నిండి కనిపించింది. ఈ జూనిపర్ ధూమం బౌద్ధ మతకార్యకలాపాల్లో విరివిగా వాడే ధాతువు. గత ఏడాది ఈబీసీ ట్రెక్‌కు వెళ్ళినపుడు జూనిపర్ మొక్కలతో మాకు చక్కని పరిచయం ఏర్పడింది. ఆ దారిలో మాకు కనిపించిన తెన్బోచె మఠం, ఆ మఠంలో మాకు ఎంతో ఘాటుగా పరిచయమయిన జూనిపర్ ధూమం – మా వివేక్ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకున్నాడు.

మరికాస్త దూరం వెళ్ళాక, గంట గడిచాక, ఒక పెద్ద కొండ కనిపించింది. నిటారు దారి. మెలికల బాట. అలా సాగి కొండ పైప్రాంతంలో ఉన్న ఘయరు అన్న అందమైన గ్రామం చేరుకున్నాం. 3730 మీటర్ల ఎత్తున ఉన్న గ్రామమది. ఆ ఊళ్ళో ఒక స్థూపం ఉంది… ఇళ్ళన్నీ కలపా రాళ్ళతో కట్టినవి. చదునైన పై కప్పు కలవి. ఊళ్ళో ఉన్న బౌద్ధమందిరం దగ్గరనుంచి చూస్తే దిగువనున్న పిసాంగ్ లోయ నాలుగువేపులా విశాలంగా పరచుకుని కనిపించింది. లోయ అంచులలో ఎటు చూసినా శిఖరాలే శిఖరాలు – రెండవ, మూడవ, నాల్గవ అన్నపూర్ణ శిఖరాలు, గంగపూర్ణ & తిలిచో శిఖరాలు, పిసాంగ్ లోయ నడుమన వయ్యారంగా సాగిపోతోన్న మర్శియాంగ్దీ నది, బక్‌వీట్ పొలాలలో పంటలు కోస్తోన్న రైతులు, వీటన్నిటికీ తోడు పక్వానికొచ్చిన యాపిల్ తోటలు – సుసంపన్న ప్రదేశమది. చూస్తుంటేనే కడుపు నిండిపోయిన భావన. అక్కడ పండే యాపిళ్ళు స్థానిక బేకరీలలో తయారయ్యే వివిధ తినుబండారాలకు మూలధాతువులు.

ఊళ్ళోని బౌద్ధమందిరానికి ఎదురుగా ఉన్న పేమాస్ కెఫె బేకరీ మా దృష్టిని ఆకట్టుకుంది. గ్రామపు ప్రవేశబిందువు దగ్గర, ట్రెకింగ్ బాటకు పక్కనే, విశాలమైన ముఖప్రాంగణంతో, ఎంతో అనుకూలమైన ప్రదేశంలో ఉన్న ఆ బేకరీ అలా మా దృష్టిని ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు.

ఆ బేకరీ ముంగిట తినుబండారాలు అమ్ముతోన్న వీధి దుకాణం ఒకటి కనిపించింది. అందులో బేకరీ పదార్థాలు, ఎండబెట్టిన యాక్ చీజ్, కూల్ డ్రింకులు, మంచినీళ్ళ సీసాలు లభిస్తున్నాయి. ఆ దుకాణంలో మహాజోరుగా వ్యాపారం సాగిపోతోంది. ఆ జోరంతా దుకాణంలోని మధ్యవయసు మహిళ ఒంటి చేతి మీదుగా సాగుతోంది. పక్కన పెద్ద బేకరీ ఉండగా మళ్ళా ఈ వీధి దుకాణం పోటీగా ఎందుకు ఉందో అనుకుంటూ వెళ్ళి ఆమెను పలకరించాను. ఆమె పేరు పేమ – బేకరీ యజమాని. బేకరీ లోపల కూర్చుని అమ్మడం కన్నా ఇలా ఆరుబయలు అమ్మకాలు సాగించడమే ఆమెకు ఇష్టమట!

ఆమె దగ్గర కాసిన్ని తినుబండారాలు కొంటూ ఉండగా అప్పుడే చేసిన, వేడి వేడి, పిండీ చక్కెరా కలిపిన దాల్చిన చెక్క ఉండలు – సినమన్ రోల్స్ – ఆపిల్ పళ్ళ పరిమళం వెదజల్లుతూ, దుకాణంలోకి వచ్చాయి. ఆపుకోలేక అందరం వాటిమీద పడ్డాం. ఎంతో రుచిగా ఉన్నాయి – ఒకటికి నాలుగు తినేసాం… మా ఆత్రం చూసి పేమ మహా ముచ్చటపడింది. వెళుతున్నప్పుడు ఆత్మీయంగా వీడ్కోలు పలికింది. అడిగిన వెంటనే మా అందరితో ఫోటోలు దిగింది. ప్రేమ నిండిన పేమ ఆదరణ మా మనసులను దోచింది. పన్నెండువేల అడుగుల ఎత్తున, హిమాలయ శిఖరాల నడిబొడ్డున, ఘయరు అన్న చిన్న గ్రామంలోని ఆరుబయట దుకాణంలో, రుచికరమైన తినుబండారాలను ప్రేమతో రంగరించి ఇచ్చిన ఆ దుకాణదారుతో దిగిన ఫోటోలను వెంటబెట్టుకుని ఆమెనుంచి వీడ్కోలు తీసుకోవడం – ఇది గదా యాత్రానుభవం అంటే! మీలో ఎవరైనా అన్నపూర్ణ ట్రెక్‌కు వెళ్ళే పక్షంలో ఈ పేమ అన్న మహిళ మీకు తప్పక తటస్థపడుతుంది. ఆగండి. మాట్లాడండి. తినుబండారాలు తీసుకోండి. మాలో ఆమె ఆ కొద్దిసేపట్లో కలిగించిన సంతోషం సంబరం మీకూ కలిగించి తీరుతుంది. ఆమె ఒక ఊటబావి. వీలైతే ఆమెను తప్పక కలవండి…

గ్రామందాటి అలా వెళ్ళిపోవాలనిపించలేదు. ఊళ్ళో నింపాదిగా తిరుగాడాం. కలపా రాళ్ళతో కట్టిన ఇళ్ళను పరిశీలించాం. ఆ ఇళ్ళకు కట్టిన ప్రార్థనాపతాకాలూ ఇతర అలంకరణలూ చూసి ముచ్చటపడ్డాం. అసలా గ్రామపు రంగులీనే వీధులగుండా అలా అలా నడవడమే ఎంతో ఆహ్లాదం కలిగించే అనుభవం. ఇహ చుట్టూ పరచుకొని ఉన్న ప్రకృతి సౌందర్యం సరేసరి – అరుదుగా కనిపిస్తాయి అంత అందమైన గ్రామాలు. ఊరు వదిలి ముందుకు సాగాం. పిసాంగ్ శిఖరం చక్కగా కనిపించింది. బోర్లించిన గంట ఆకారంలో, లోయకు ఒక చివర ఉందా శిఖరం.

ఇంకా ముందుకు సాగి 3800 మీటర్ల ఎత్తుకు చేరాం. పిసాంగ్ లోయ లోయంతా ఒకే ఊపులో కనిపించింది – కొండవాలున ఘయరు గ్రామం. ఒక చివరన ఎగువ పిసాంగ్ దిగువ పిసాంగ్ పట్టణాలు, వాటి నడుమన పారే మర్శియాంగ్దీ నది – గుర్తుండిపోయే దృశ్యమది. లోయకు అటు చివరన చూస్తే రెండవ, మూడవ అన్నపూర్ణ శిఖరాలు; గంగపూర్ణ, తిలిచో శిఖరాలు. .. ఇంకోవేపున మంచు నిండిన శిఖరసమూహం – అందులో ప్రస్ఫుటంగా వెలిగే మౌంట్ పిసాంగ్…

మరికాస్త సాగాక హుమ్డే లోయకు చేరుకున్నాం. ఆ లోయ అంచు వెంట నడక సాగించాం. ఆ లోయలో చిన్న చిన్న వూళ్ళు… బక్‌వీట్ చేలు… ప్రవహించే మర్శియాంగ్దీ – ఇవన్నీగాక వాడుకలో లేని రన్‌వే ఒకటి కనిపించింది! ఇక్కడి దాకా రోడ్డు రాని రోజుల్లో వారానికి ఒకసారి విమానం వచ్చేదట!

3500 మీటర్లు దాటిన ఎత్తుగదా – వృక్షాలు క్రమక్రమంగా తమ పరిమాణం తగ్గించుకుంటున్నాయి. చెట్లూ మొక్కల ఉనికి పలచబడసాగింది. ఏవేవో అడవి పూల పొదలు మాత్రం బాగా కనిపించాయి. ఆ పూల అందం ముచ్చట కలిగించింది. వాటి పేర్లు తెలిస్తే ఇంకా బావుంటుందనిపించి మా గైడ్‌లను అడిగాను. మాకూ తెలియదన్నారు.

అక్కడికి దిగువన ఉన్న గ్నావల్ అన్న గ్రామంలోకి వెళ్ళాం. ఊరి మొగలో ఉన్న టీహౌస్‌లో తీరిగ్గా భోంచేశాం. భోజనం ముగిశాక ఊరంతా తిరిగి చూశాం. ఊళ్ళో ‘ప్రాచీనత’ స్పష్టంగా కనిపించింది. ప్రసిద్ధ బౌద్ధమతాచార్యులు రింపోచె ఆ ఊరి దగ్గరి గుహలో నివసించాడని స్థానికుల నమ్మకం. ఆ గుహామార్గం మైళ్ళ దూరాన ఉన్న ముస్తంగ్ దాకా విస్తరించి ఉందని కూడా స్థానికులు నమ్ముతారని మా గైడ్ సంజయ్ శ్రేష్ట చెప్పుకొచ్చాడు.

ఊళ్ళో చెప్పుకోదగ్గ బౌద్ధాలయం ఉంది – దానికి అనుబంధంగా మఠం. ఎగువ పిసాంగ్‌లోని బౌద్ధాలయంలోలాగానే ఇక్కడి ఆలయంకూడా నింగ్మాప బౌద్ధ సంప్రదాయం ప్రకారం నడుస్తోందట. ఆ సంప్రదాయాన్ని ఈ ప్రాంతంలో బాగా గౌరవిస్తారట. ఒకటి రెండు గంటలు అక్కడ గడిపి నింగ్మాప సంప్రదాయం గురించి మరిన్ని వివరాలు మనసుకు పట్టించుకుంటే బావుంటుందని బలంగా అనిపించింది. కానీ ఆనాటి మా గమ్యం, మనంగ్, చెప్పుకోదగ్గ దూరాన ఉంది. కదలక తప్పదు. ఊళ్ళోంచి బయటకు వస్తున్నపుడు ఆ పొలిమేరలో శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న, స్థానికులు శ్రమించి పెంచిన, బృహత్తర దేవదారు వృక్షం కనిపించింది. వృక్షం నిండుగా ప్రార్థనాపతాకాలు…

నేపాల్ దేశంలో హిందూమతానికీ బౌద్ధానికీ మధ్య సరిహద్దు రేఖ ఎక్కడుంది? ఆ రెండు మతాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి? అన్న విషయం నా మనసులోకి వచ్చింది. సంజయ్ శ్రేష్ట దగ్గర ఆ విషయం కదిపాను. ‘స్థూలంగా చెప్పాలంటే దేశపు మైదానప్రాంతాల్లో హిందూ సంస్కృతి ప్రాచుర్యంలో ఉంది; పర్వతసీమల్లో బౌద్ధప్రభావం అధికం’ అన్నాడు సంజయ్. అలా అంటూనే, “ఇది స్థూలవిభజన మాత్రమే. దేశంలో ఎక్కడికి వెళ్ళినా హిందువులూ కనిపిస్తారు, బౌద్ధులూ కనిపిస్తారు,” అని ముక్తాయించాడు.

మేము బేసిషహర్‌నుంచి ధారాపానీదాకా అ నలభై కిలోమీటర్లూ రెండురోజులపాటు నడచి ఉంటే దారిలో హిందూ గ్రామాలు విరివిగా కనిపించి ఉండేవే. హిందూ దేవాలయాలు, వినాయకుడి విగ్రహాలు కనిపించి పలకరించేవే. తిన్నగా జీపుల్లో ధారాపానీ చేరుకున్నాం గదా – చేరగానే ప్రార్థనా చక్రాలు, మణికుడ్యాలు, బౌద్ధాలయాలు – మఠాలు కనిపించేశాయి. నేపాల్‌లో హిందూ బౌద్ధమతాల పరివ్యాప్తి గురించి సంజయ్ ఓ ఆసక్తికరమైన వివరణ ఇచ్చాడు: “వరిలాంటి ఉష్ణ మండల పంటలు పండే ప్రదేశాలలో మనకు హిందూమతం కనిపిస్తుంది; బార్లీ, బక్‌వీట్, యాపిళ్ళలాంటి శీతలప్రాంతపు పంటలు పండే చోట బౌద్ధం ఎక్కువగా కనిపిస్తుంది,” అని అతని వివరణ.

ఏదేమైనా నేపాల్ దేశంలో ఈ రెండు మతాల మధ్యా సామరస్యం ఎక్కువ అన్నది స్పష్టంగా తెలుస్తోంది. బౌద్ధమందిరాలకు వచ్చే యాత్రికుల్లో చాలామంది హిందువులు కూడా కనిపించారు. వివరాల్లోకి వెళితే నేపాల్ జనాభాలో 91 శాతం హిందువులు; 9 శాతం బౌద్ధులు. హిమాలయాల పాదచ్ఛాయల్లోని సారవంతమైన ఖాట్మండూ పొఖారా లోయల్లాంటి ప్రాంతాల్లోనూ, భారతదేశపు సరిహద్దుల్లో విస్తరించి ఉన్న నేపాల్ మైదానప్రదేశాల్లోనూ హిందూమతస్తులు ఎక్కువ. ఎగువ హిమాలయాలలో, జనసంఖ్య తక్కువగా ఉండే ప్రాంతాల్లో, టిబెటియన్ బౌద్ధులు ఎక్కువ. ముందే చెప్పుకున్నట్టు ఈ ప్రాంతాలకు అనాదినుంచి టిబెట్‌తో సంబంధబాంధవ్యాలు ఉన్నాయి. ఎగువ ముస్తంగ్ ప్రదేశం భౌగోళికంగా టిబెట్ పీఠభూమి క్రిందకే వస్తుంది. ఉన్నతశ్రేణి పర్వత కనుమలగుండా రెండు దేశాల మనుషులూ రాకపోకలు సాగించడం, సాంస్కృతిక బాంధవ్యాలు ఏర్పరచుకోవడం శతాబ్దాలుగా సాగుతోంది. టిబెట్‌కు చెందిన బౌద్ధులు నేపాల్ హిమాలయాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని నేపాల్ దేశపు పౌరులుగా పరిణమించడమూ ఎప్పట్నుంచో సహజంగా జరిగిపోతోంది. ఈ రకమైన సంబంధబాంధవ్యాలవల్లనే టిబెట్ ప్రాంతం 1953లో రాజకీయ అల్లకల్లోలాలకు గురి అయినపుడు వేలాదిమంది టిబెటన్‌లు నేపాల్‌కు ప్రవాసులుగా రావడం జరిగింది.

మా బాబు గురంగ్ కథనం ప్రకారం తరతరాలుగా అన్నపూర్ణ శిఖరాల ప్రాంతంలో స్థిరపడిన టిబెటన్ బౌద్ధులు ఈమధ్యకాలంలో జీవించడానికి మెరుగైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఖాట్మండూ, ధర్మశాల, డార్జిలింగ్, కలింపాంగ్‌లాంటి చోట్లకు తరలి వెళుతున్నారట. మెరుగైన ప్రదేశాలు అవడంతోపాటు ఆయా చోట్ల వారికి టిబెట్‌నుంచి ప్రవాసం వచ్చిన సాటి టిబెటన్ల సాహచర్యమూ లభించడం అదనపు లాభం. ఇహ మతసామరస్యం విషయానికి వస్తే, ఆధునిక కాలంలో జాతి పరంగా రాజ్యాలు ఏర్పడుతున్న సమయంలో రెండు మూడు మతాలు కలసి ఒకేచోట మనుగడ సాగించడం సుసాధ్యమవుతోంది. ఒకరి ప్రార్థనాస్థలాలకు మరొకరు భక్తిశ్రద్ధలతో వెళ్ళి రావడమూ జరుగుతోంది. భాషాపరంగా చూస్తే నేపాలీ భాష మన హిందీలానే ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. టిబెట్ మూలాల నేపాలీ టిబెటన్లు మాట్లాడే భాష టిబెటో-బర్మన్ భాషా కుటుంబానికి చెందినది.

మనంగ్ పట్టణం మరెంతో దూరం లేదనిపించింది. ఆనాటి మా నడకలోని అంతిమ ఘట్టం, ఎదుగుదల తగ్గిన పైన్ వృక్షాలతో నిండిన మైదాన ప్రదేశంగుండా సాగింది. దారిలో బ్రకా అన్న గ్రామం పలకరించింది. అందమైన పర్వత శిఖరదృశ్యాలు సరేసరి.

తొమ్మిది గంటలు, 22 కిలోమీటర్ల దూరం, 240 మీటర్ల ఎత్తు గడిచాక మనంగ్ చేరుకున్నాం. యతి హోమ్ అన్న చక్కని హోటల్లో స్థిరపడ్డాం. అక్కడ రెండు రాత్రులు గడపబోతున్నాం.

డిన్నర్ సమయంలో అనితారాణి పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఎనభైలనాటి క్లాస్‌మేట్స్‌ము కదా – నేనూ, గంగాకిశోర్ ఏర్పాట్లన్నీ చేశాం. పదిహేడూ పద్ధెనిమిదేళ్ల వయసులో ఇళ్లల్లోంచి బయటపడి హాస్టల్ జీవితం అనుభవిస్తున్న సమయంలో స్నేహితుల పుట్టినరోజులు జరుపుకోవడం, స్నేహితుల కోసం ఆ వేడుకలు నిర్వహించడం అంటే ఎంతో సంబరంగా ఉండేది. మళ్ళా 35 సంవత్సరాల తర్వాత అలా ఒక సహాధ్యాయి జన్మదిన వేడుకలు నిర్వహించడం మాకు సంతోషం కలిగించింది. కాలేజీ రోజుల్లో ఒకే కుటుంబంలా మెలగినవాళ్ళం కాలేజీ విడిచిపెట్టాక కూడా అడపాదడపా కలుసుకోవడం ద్వారా ఆ అనుబంధాన్ని కొనసాగించాం. ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ-మెయిళ్ళు, సోషల్ మీడియా మా పని సులభతరం చేసాయి. వీటి పుణ్యమా అని గత ఇరవై యేళ్ళుగా మా బాంధవ్యం ఇదివరకటికన్నా గట్టిపడింది.

బాబు సమయానికి తగినట్లు చక్కని కేక్ ఏర్పాటు చేశాడు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలన్నీ స్వీకరించాక అనితారాణి ఎంతో హృద్యమైన ప్రసంగం చేసింది. హిమాలయాల ఒడిలో, సహాధ్యాయులు, సాటి ట్రెకర్ల సాహచర్యంలో, అన్నపూర్ణ పర్వతశ్రేణి నడుమన తన జన్మదినం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ క్షణాలు జన్మలో మరవలేనివి అంది. గంగాకిశోర్ చక్కని గాయకుడు. కాలేజీ రోజుల్లో ఆంధ్రా కిశోర్ కుమార్ అన్న బిరుదు పొందినవాడు. స్థానిక గాయకబృందాలలో సభ్యుడిగా దేశమంతటా ప్రోగ్రాములు ఇవ్వడానికి వెళ్ళినవాడు. ..

అనిత జన్మదిన వేడుక సందర్భంగా గంగాకిశోర్ అప్పటి మధురగీతాలు పాడి వినిపించాడు. మరోసారి గతస్మృతుల జడివానలో అందర్నీ ముంచెత్తాడు.

మర్నాడు ఎక్లమటైజేషన్ విరామ దినం.

అంచేత బాబు, ఇతర గైడ్లు ఏ వత్తిడీ లేకుండా కులాసాగా కనిపించారు.