మాది మద్రాసు.
అమ్మో! మద్రాసు మాది అంటే తంతారేమో తమిళులు. తన్నరు లేండి. వారూ మంచివారే. నేను అనొచ్చింది మద్రాసు నా, మా, మన స్వంతం అని కాదు. నేను పుట్టి పెరిగింది మద్రాసులో అని. ఇప్పటికీ నిలువుగా మానేసి అడ్డంగా పెరుగుతున్నదీ మద్రాసులోనే.
పైమాట అర్థమైంది కదా. ఇప్పుడు వినండి. మాది అసలు మద్రాసు కాదు. అదేమిటి ఇప్పటి దాకా మద్రాసు మాది అని చెప్పి మళ్ళీ కాదంటానేమిటని కోప్పడకండి. మాది నిజంగానే మద్రాసు కాదు. మా తల్లితండ్రులు విజయవాడ దగ్గిర ఓ పల్లెటూరు నుంచి 1955 లో మద్రాసుకి వలస వచ్చి స్థిరపడ్డారు. ఇదేమీ మద్రాసుకీ తెలుగువారికీ విచిత్రమైన విషయం కాదు.
ఇక పోతే ఈ నా సొంత గొడవకి నేను పెట్టిన పేరు చూసి మీరు వూహించేవుంటారు నేను చెప్పబోయే విషయాన్ని గుఱించి. మద్రాసులో అధిక సంఖ్యలో తెలుగువారు వుంటారని మీలో చాలామందికి తెలుసనే అనుకుంటాను.
అందుచేత నా బోటి వాడి తెలుగు చూస్తే అందరికీ అంతగా ఆశ్చర్యము వేయక పోవచ్చు. కానీ మేము తెలుగు నేర్చుకోవటానికి పడ వలసి వస్తున్న కష్టాల వివరణే ఈ నా వ్యాసం (కథ?) సారాంశము. ఇక అసలు కథకు వద్దాము.
మొట్ట మొదట నన్ను మా ఇంటి దగ్గర ఒక బడిలో ఎల్ కే జీ లో చేర్చారు. అప్పటికి నాకు ఐదు సంవత్సరాలు. ఈ బడిలో అరవము తప్ప తెలుగు నేర్పేవారు కాదు. మా తల్లి తండ్రులకి మాకందరికీ ఎట్టి పరిస్థితులలోనూ తెలుగు నేర్పించాలన్న పట్టుదల ఉండేది. కాబట్టి ఆ సంవత్సరము ముగిసే లోపల ఇంటికి దగ్గరలోనే ఒక తెలుగు నేర్పే బడి తెరిస్తే నన్ను ఆ బడికి మార్చారు. ఏకంగా ఒకటవ తరగతికి.
మా తల్లి తండ్రులకి మాకు తెలుగు నేర్పాలని తహతహగా ఉండేదని ముందే చెప్పాను కదా. కాబట్టి ఈ బడికి మారే ముందే నాకూ మా చెల్లెలుకీ పలకలు కొనిపెట్టారు. నాకు కొంచెము తోక పెద్దదే అనుకుంటాను. నా పలక వచ్చిన కొద్ది రోజులకే బద్దలయ్యింది. రాసీ రాసీ బద్దలవ్వలేదని మట్టుకూ హామీ ఇవ్వగలను. అంటే దాంట్లో సగ భాగము మాత్రమే చట్రంలో మిగిలింది. అప్పట్లో పలకలు పగిలిపోయేవి. ఇప్పుడులా ప్లాస్టిక్కువి వచ్చేవి కావు. ఏదైతేనేం, నా పలక చక్కగా చట్రంలో సగం మాత్రమే వుండేది. దానితో చట్రాన్ని సంచీ చెవులు పట్టుకున్నట్లు చక్కగా పట్టుకోవచ్చన్న మాట. మా చెల్లెలుదైతే, విసుగెత్తించేలా సాధారణంగానే వుండేది.
ఇక ఈ పలకా బలపాల రహస్యమేమిటంటే, రోజూ మా అమ్మ తెలుగులో ఒక అక్షరం దాని మీద రాసిచ్చేది. దాన్ని మేమిద్దరమూ దిద్దే వాళ్ళము. దిద్దటమంటే, ఇప్పటి పిల్లలకు తెలియకు తెలియకపోవచ్చు. వాళ్ళు చూచివ్రాత మాత్రమే రాస్తారుగా.
మేమూ ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకోవటానికి చూచివ్రాతే గళ్ళలో వ్రాసినా తెలుగు మట్టుకు పలక మీద బలపంతో దిద్దుతూనే నేర్చుకున్నాం. సన్నగా రాసిన మా అమ్మ అక్షరం మీద పలుమార్లు దిద్దగా, అది దాదాపు ఒక అంగుళం వెడల్పు అయ్యేదాకా దిద్దితే చాలు అన్నమాట. అప్పుడు ఆ అక్షరం మాకొచ్చినట్లే లెక్క.
ఇదేమిటమ్మా ఇలా దిద్దమంటున్నావు అని మేమెప్పుడూ మా అమ్మనడుగ లేదు. అయినా అడుగకుండానే, “మీకైతే మీ నాన్న గారు పలకా బలపాలు కొనిచ్చారు. మా అమ్మమ్మా వాళ్ళు, నేల మీదా, కచ్చిక మీదా దిద్దేవాళ్ళుట,” అనేది.
ఏదైతేనేం ఈ దిద్దుడు జాడ్యము పరంపరాగత వ్యాధి అని నేను తెలుసుకున్నాను. మొత్తానికి మొదటి తరగతికి వచ్చేసరికి నాకు తెలుగు అక్షరాలన్నీ వచ్చేసాయి.
గుణింతాలు కూడా మా అమ్మ మా చేత ఎల్లప్పుడూ వల్లె వేయించేది. దానితో మాకు కా కు కొమ్మిస్తే ఏమవుతుందో, ఆ కొమ్ముకి దీర్ఘమిస్తే ఏమవుతుందో తెలిసిపోయింది.
ఇప్పటి పిల్లలకి ఈ కొమ్ము దానాలు ఇవ్వటాలూ, వాటి వల్ల కలిగే పుణ్యాలూ తెలియవనుకుంటాను.
తెలుగు నేర్పే బడి దగ్గర లోనే దొరికింది కాబట్టి మమ్మల్నక్కడకి తరలించారు. అక్కడ తెలుగు నేర్పే ఉపాధ్యాయురాలు మా కుటుంబ స్నేహితుల వారమ్మాయి. బడి దొరికినా తెలుగు వాచకము దొరకలేదు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ తమిళనాడులో తెలుగు చదువుకునే పిల్లలందరూ ఆంధ్రాలో వాడే తెలుగు వాచకాలే వాడేవారు. ప్రస్తుత పరిస్థితి తెలియదు. పదొకండు తర్వాత తెలుగు పుస్తకాలన్నిటినీ తమిళనాడు ప్రభుత్వమే తయారు చేసేది.
అందుచేత పది వరకూ తెలుగువాచకము ఆంధ్రానుంచి దిగుమతి చేయవలసి వచ్చేది. ఇక్కడ అన్ని కొట్లలోనూ ఈ పుస్తకాలు దొరికేవి కావు. దొరికే కొన్ని కొట్లలోనూ వేడి మిరపకాయ బజ్జీలలాగా ఈ వాచకాలను ప్రజలు ఎగరేసుకుపోయేవారు. కొద్దిగా ఆలస్యంగా ఎవరైనా వెళితే వారికి మొండి చెయ్యే ఎదురయ్యేది. మా నాన్న గారు బడి వెతికే హడవిడిలో వాచకాల సంగతి మఱిచారు. మా ఉపాధ్యాయిని కూడా ఈ ఖబురు కాస్తంత చల్లగానే చెప్పింది. వాచకాలు కావలసిన వారు కొంత కాలం ముందుగానే కొట్ల వారికి చెబితే వారు వీరి కోసం ప్రత్యేకంగా ఆ పుస్తకాలను దిగుమతి చేసే వారన్నమాట. ఈ వషబలస లల నపరథలన పద్ధతి అమేరికాలో కనిపెట్టారని ఎవరైనా అనుకుంటున్నారేమో. అది కాదని తెలిసుకోవాలి.
ఆ తర్వాత నా కంటే ముందుగా ఈ తరగతి ఇంకెవరైనా చదివారేమోనని వెతికారు. వారు వాడేసిన పుస్తకాలేమైనా దొరుకుతాయేమోనని. ఎవ్వరూ దొరుకలేదు.
ఆ సంవత్సరం మా ఉపాధ్యాయని దగ్గర ఉన్న వాచక ప్రతే నా ప్రతి కూడా అయ్యింది. ఇలా మొదటి సంవత్సరం నా తెలుగు బాగానే సాగింది.
నేను రెండవ తరగతికి వచ్చేసరికి మా ఉపాధ్యాయినికి పెళ్ళి అయ్యి ఆవిడ ఆంధ్రాలో ఎక్కడికో వెళ్ళి పోయింది. తెలుగు నేర్పే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా మేము నేర్పుతామంటే వారిని పరీక్షించే వారు కూడా లేరు. మొత్తానికి ఒకావిడని మాకు తెలుగు నేర్పడానికి తీసుకున్నారు. ఆవిడ వారి గ్రామంలో ఐదవ తరగతి వరకూ చదువుకుందిట. ఆవిడకి తెలుగు తప్ప వేరే భాష రాదు. మరి మా బడిలో ఇతర ఉపాధ్యాయినులకు తెలుగు రాదాయె. మొత్తానికి ఏ భాషా సరిగ్గా రాకపోయినా బహు భాషా కోవిదుణ్ణైన నా సహాయాన్ని వీరు కోరారు. వారడిగే ప్రశ్నలను తెలుగులోకి తర్జుమా చేసి ఆవిడకి చెప్పి ఆవిడ చెప్పిన సమాధానాలను వారికి అరవంలోకి అనువదించి చెప్పాను. నా ప్రయాస ఎంతవరకూ సఫలీకృతమైందొ నాకు తెలియదు కానీ, ఆవిడ మాకు తెలుగు చెప్పటానికి పనికి వస్తుందని వారు నిర్ధారించారు.
అమరకోశంలో యస్య జ్ఞాన దయా సింధో అని సాగే మొదటి పద్యంలో ఎలాంటివారిని ధీరులు తమ గురువులుగా ఎంచుకుంటారో చెప్పబడింది. అప్పటికి నాకివేమీ తెలియవు కానీ పరోక్షంగా నేనే మా గురువుని ఎంచుకున్నాను.
ఆవిడ ఐదువరకూ చదువుకుందేతప్ప నాకు తెలిసే ఆవిడ పాపము అంతటి పాండిత్యము కలిగినది కాదు. తెలుగు వాచకము చేతిలోకి తీసికొని కూడుకుంటూ కాకపోయినా అతి మెల్లగా పాఠాలు చదివేది. ఇక లాభం లేదనిపిస్తే ” సత్యనారాయణా, ఏదీ, ఇక్కడి కొచ్చి ఇది చదువూ ” అనేది. ఆవిడకి ఎంత వచ్చో ఎవరికీ తెలియదు కాబట్టి ఆవిడకు నష్టము ఏమీ కలుగలేదు. ఆవిడ కాస్త పెద్దావిడ. పైగా వితంతువు. దానికితోడు, ” నేను తెలుగు సరిగ్గా చెప్పించక పోతే, నాతోనే చెప్పుగానీ ఇంకెవరితోనూ చెప్పకు ” అని నాతో అననే అంది కాబట్టి ఆవిడే నాకు ఐదవ తరగతి వరకూ తెలుగు నేర్పిన గురువు.
ఇక ఈవిడ వద్ద ఒక వ్యాసగ్రంథరాజం ఉండేది. అది ఆవిడ స్వీయ రచన. అందులో చాలా వ్యాసాలు ఉండేవి. మచ్చుకి, కొబ్బఱి చెట్టు, కుక్క, ఆవు, అఱటి చెట్టు, మామిడి చెట్టు వంటివి. మా పెరట్లో ఆరు కొబ్బఱి చెట్లు ఉన్నా, నేను కొబ్బఱి చెట్టు పొడుగ్గా వుంటుందని, దానికి కొబ్బఱి కాయలు కాస్తాయనీ, మట్టలూ, దొన్నెలూ నేల మీదకి రాలుతాయి వగైరాల వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ గ్రంథరాజమునుండే కనుగొన్నాను. ఆ నాలుగు సంవత్సరాలు నేను నేర్చుకున్న తెలుగు, తెలుగు వాచకాల నుంచి, ఆ వ్యాససారస్వతమునుంచి, ఇక మా ఇంట్లో నెల నెలా కొనే చందమామ పుస్తకాల నుంచీ మాత్రమే. అంటే, ఐదవ తరగతి వరకూ నేను నేర్చుకున్న తెలుగు వ్యాకరణము శున్యము.
ఆ గురువుగారు ఎలా వున్నారో పాపం. “గురుర్సాక్షాత్ పరబ్రహ్మ” అని అన్నారు కదా. ఏది ఏమయినా, నాకు తెలుగు సవ్యంగా రాక పోవటానికి కారణం నా మందమతి బుఱ్ఱ మీదే వేసుకుంటున్నా, గురువుగారికి దోషం ఆపాదించటంలేదు.
మా ఇంటి దగ్గరి బడిలో ఐదవ తరగతి వరకే ఉండేది. కాబట్టి ఆరవ తరగతిలో నేనెక్కడ జేరాలన్నది ఈ ఐదు సంవత్సరాలలో మా నాన్నగారు తీర్మానించేసారు. ఆయనకు నన్ను ఒక పాఠశాలలో జేర్పించాలని ఉండేది. అది కాక తెలుగు నేర్పే బడులు మా ఇంటికి పది కిలోమీటర్ల పరిధిలో ఇంకా రెండు ఉండేవి.
అన్ని పాఠశాలల్లోనూ ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారు. ప్రతి చోటా తమ పిల్లలను అక్కడ చదివించాలనుకునే వారు చాలా మంది ఉండేవారు కాబట్టి ఇది అప్పటికే అనివార్యమయింది. ఆ పరీక్షలలో నెగ్గితేనే అక్కడ విద్యార్థులకు ప్రవేశం.
ఐదు వరకూ చదివిన బడిలో నాదే ప్రథమ శ్రేణి. కాబట్టి నేను ఈ ప్రవేశ పరీక్షలలో సులభంగానే నెగ్గగలనని నాకూ, నా తల్లితండ్రులకు నమ్మకం ఉండేది. ఆ పరీక్షలు ఆంగ్లము, తెలుగు, గణితము, విజ్ఞానములలో పెట్టేవారు.
మొదటిది పాఠశాలలోని పరీక్ష. ఇక్కడ అన్నీ పర్వాలేదు కానీ, తెలుగు ప్రశ్నాపత్రములో రాసి ఉన్నవి తెలుగు మాటలని నేను నమ్మలేక పోయాను. ఒక్క మాటా నాకు అర్థం కాలేదు. ఏమి రాసానో తెలియదు కానీ, మొత్తానికి ఉత్తీర్ణుడయ్యే ప్రసక్తే లేదని నాకర్థమైపోయింది.
ఆ రోజు ప్రొద్దున్నే గుడికి వెళ్ళి దణ్ణం పెట్టుకు వచ్చినా ఈ ప్రశ్నా పత్రం పుణ్యమా అని ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ రోజు తర్వాత నేను దేవుణ్ణి నాకిది కావాలని ఏనాడూ ఏదీ కోరలేదు. అదే నా ఆఖరు కోరిక.
మొత్తానికి పరీక్షా ఫలితాలు వచ్చాయి. మా పక్కింటి అరవబ్బాయి నెగ్గాడు. నేను అనుకున్నట్టే తప్పాను. మా నాన్న గారు చాలా అసంతృప్తితో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి రావడం నాకింకా గుర్తు. ఆయన అక్కడ కనుక్కోగా నేను తెలుగు పరీక్షలోనే తప్పానని చెప్పారుట.
ఇక ఆ తర్వాత రెండో పాఠశాల పరీక్షకి వెళ్ళాను. దానితో పాటే మూడో పాఠశాల పరీక్ష కూడా. రెండో పాఠశాలలోను మరి తెలుగులో చుక్కే ఎదురయ్యింది.
ఇక మూడో బడిలో నేను నెగ్గానని చెప్పారు. ఆహా! నా తెలుగుని చక్కగా పరిశీలించి, అవగాహన చేసుకున్న ఈ పాఠశాలే నా పాఠశాల అని నేను కూడా నిర్ధారించుకున్నాను.
ఇక మా బడి తెలుగువారి కోసమని తెలుగువారిచే స్థాపించబడినది. తెలుగువారికి ఇంకెక్కడా ప్రవేశము దొరక్క పోతే ఈ పాఠశాలే ఆపద్బాంధవమూ, అనాథరక్షకమూ అన్నమాట. అంతే కాదు అక్కడ చదివేందుకు వచ్చే విద్యార్థులు 99 శాతము తెలుగువారే. ఉపాధ్యాయ ఉపాధ్యాయినులు కూడా 99 శాతము తెలుగువారే. మద్రాసు అనే తమిళ సంద్రములో అది ఒక తెలుగు దీవి అన్నమాట.
అక్కడికి వచ్చి జేరే దాకా నేను ఇంత మంది తెలుగువారు మద్రాసులో ఉండగలరని ఊహించలేదు. అందరిని ఒక్కసారి చూసేటప్పటికి ప్రాణం లేచి వచ్చింది. ఇక నా కొత్త బడి సంగతి.
అది ఒక రమణీయ పుష్పవనమని చెప్పాలని నాకూ ఉంది. కానీ ఏం చేయడం. అప్పుడప్పుడు నాకు నిజం చెప్పే అలవాటు. కాబట్టి నిజమే చెప్తాను.
మా బడి ఒక కాలవ ఒడ్డున వుంది. కాలవ అని అంటే వెంటనే దాన్ని ఏ పంట కాలవగానో ఊహించుకునేరు. అది నాకు తెలిసినప్పటినుంచీ కుళ్ళుకాలవే.
నగరాలలో ఉండే ఈ మురుగుకాలవలే సభ్యసమాజాలకి ప్రతీకలు. ఈ కుళ్ళు కాలవల్లో నీరు ఆ నగర సభ్యతకి ప్రత్యక్ష నిష్పత్తిలో ఉంటుంది. మద్రాసు కొంచెము అధిక సభ్యత కలిగిన నగరమే. ఆ కాలవ నిండా దుర్గంధపు నీరు ఎల్లప్పుడూ జీవ నదిలా పారుతునే ఉండేది.
ఒడ్డు అంటే కొద్ది దూరంలో అని కాదు, మా పాఠశాల గోడ దూకితే వైతరిణిలో పడ్డట్టే. దీన్ని బట్టీ మీరు ఒక గోడ ఉండేదని తెలుసుకోవచ్చు. కాలవ ఈవలి ఒడ్డున మా బడి అయితే, ఆవలి ఒడ్డున ఒక మురికివాడ విరాజిల్లేది. కాలువలూ, మురికివాడలూ మనదేశంలో కొత్తేం కాదుగా.
ఇక మురికివాడలోని ప్రజలకోసమని ప్రభుత్వం ఇళ్ళు కట్టి ఇచ్చినా, వాటిలోని మరుగుదొడ్లను పూడ్చి ఇతరులకు అద్దెకిచ్చి, మరుగుదొడ్లలో చేయవలసిన కార్యక్రమాన్ని మా పాఠశాల గోడకిరువైపులా సాగించేవారు.
కానీ అమర్యాదగా ఉండేవారు కాదు. వాళ్ళు ఎంతో నిమగ్నంతో వారి కార్యక్రమం చేస్తున్నా ఎవరైనా మనుషులు కనిపిస్తే ఎంతో మర్యాదతో పనినాపేసి లేచి నుంచుండేవారు. ఈ మర్యాద మన దేశమంతటా కనిపిస్తుంది. రైల్లో ప్రయాణం చేసే వారంటే వీరికి చెప్పలేనంత మర్యాద. ఇట్లాంటి వార్ని చాలామందిని మనం రైళ్ళల్లో ప్రయాణించేటప్పుడు పట్టాల కిరువైపులా చూడవచ్చు. ఇది కూడా మన సభ్యతలో ఒక ముఖ్య అంగమే.
కానీ ఇక్కడి వారికి ఆ సభ్యత కొంచెం ఎక్కువ కూడానూ. మిగిలిన దేశమంతటా చేతిలో చెంబు ఉంటే ఇక్కడ చేతులూపుకుంటూ వచ్చి పని చేసేసి చేతులూపుకుంటూ వెళ్ళిపోతారు. వెధవ చెంబొకటి ఎందుకు చేతిలో అన్నట్టు.
కాబట్టి గోడ దూకితే అన్న మాట ఉత్తుత్తిగా అన్నాను. అసలు గోడ దగ్గరకి వెళ్ళ కలిగితే కదా దాన్ని దూక కలగటానికి! గోడల పక్కనే ఈ గతి అంటే పాఠశాలలోని మరుగుదొడ్లను ఎవరు వాడేవారో ఇక చెప్పవలసిన పని లేదనుకుంటాను.
ఇక ఆ గోడ గుఱించి ఇంకొక విశేషము. దాని పొడుగు పొడుగునా నేల నుండి అరడుగు ఎత్తున మూడు నాలుగడుగుల ఎడముతో రెండంగుళాల వ్యాసార్థంతో తూములవంటి రంధ్రాలుండేవి. వాటిని పెట్టిన వారు, వానలు కురిస్తే నీళ్ళు ఇటు పక్కనుంచి అటు పక్కకు కాలవలోకి పోవడానికి పెట్టి ఉండవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకూ అటునుంచే నీరు ఇటుకి వచ్చేది. అవి లేక పోయినా బావుండు అనేటట్టుగా.
అయినా అప్పట్లో మద్రాసులో వానలూ గట్రా పడేవి. ఇప్పుడు ఆ ప్రమాదమేమీ లేదు లేండి. ఇప్పుడు మేఘాలు చుట్టం చూపుగా వచ్చినా మద్రాసు నగర వాసుల అతిథిమర్యాదలు స్వీకరించటం లేదు.
వాన కురిస్తే, బడే వైతరణి, వైతరణే బడిగా ఉండేది.
ఇక ఈ కాలవనుండి వెలువడే సుగంధానికి నా తిండి యావ మొదటి రోజునే చచ్చింది. మధ్యాహ్నపు భోజనం మానేసాను. ఆరు లో గుండ్రంగా బంతి లా జేరిన నేను పది కొచ్చే సరికి సన్నగా దథస లా అయ్యాను.
ఇక మా పాఠశాలలో అందరూ తెలుగు పిల్లలే కావడంతో వారి భాష స్వేచ్ఛా వాయువుల్ని ఆఘ్రాణిస్తూ ఉండేది. అంటే పచ్చి సంస్కృతమన్నమాట. ఆ దేవ భాష నేను తత్పూర్వము వినియుండ లేదు. కొన్ని మాటలకు అర్థాలు ఎంత ఉహించుకున్నా తెలిసేవి కావు. మా గ్రంథాలయంలోని నిఘంటువులో వెతికినా అవి కనిపించేవీ కాదు.
కాబట్టి గాంధీ గారు అన్నట్లు నోరు, చెవులు, కళ్ళూ మట్టుకే కాక నవ రంధ్రాల్లో మిగిలినవి కూడా మూసుకొని చదువు సాగించాను.
ఇక ఒడ్డుకు ఆవలి జీవన యానం సాగించే పేద ప్రజల పిల్లలకు పాఠశాల ముఖమే తెలియదు. వారికి వారి దుర్వ్యసనములకు డబ్బు ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు మా పాఠశాలా మైదానంలో మాటు వేసి ఒంటరిగా వచ్చే విద్యార్థుల సంచూలను, పెట్టెలనూ, జేబూలను తనిఖీ చేసి దొరికినవి దొరికినట్లుగా దోచుకొనేవారు. విమానాశ్రయాలలో మాటు వేసే వారిలా. ఒంటరిగా వస్తే పన్నుతప్పదన్నమాటే. ఈ సుంకానికి ఎవ్వరూ అతీతులు కాదు ఒక్క ఉపాధ్యాయులు మినహా. పదవ తరగతి పిల్లలను సహితము మూడవ తరగతి పిల్లల వయస్సైనా ఉండని దుండగులు దోచుకొనే చోద్యము ఇక్కడ తప్ప ఈ భూప్రపంచంలోనే ఉండదని అనుకునేవాణ్ణి.
ఎదురుతిరిగి ఎవరైనా అలాంటి వెధవలకు ఒక్కటిచ్చుకుంటే కాలవ ఆవలి ఒడ్డు నుంచి ఆబాల గోపాలమూ పాఠశాలమీద విరుచుకుపడే అవకాశము ఉందని ఎవరూ సాహసించే వారు కాదు. అలా జరుగక పోయినా కొట్టిన వారికై కాపు వేసి వారికి దేహ శుద్ధి జరిపించిన సంఘటనలు లేక పోలేదు.
కొన్ని ఇంద్రియ సంబంధితాలైన కష్టాలు పడ వలసి వచ్చినా మా బడి అంతటి గొప్ప బడి ఇంకొకటి ఉండదని నా అనుమానము. మా ఉపాధ్యాయ ఉపాధ్యయినులకు నా జోహార్లు, కృతజ్ఞతలు. ఎన్నో క్లిష్ట సమస్యల్ని ఎదుర్కొని నా వంటి వార్ని సమాజంలోకి పంపినందుకు ధన్యవాదాలు పలుకకుండా ఉండలేను. ఇందులో వ్యంగ్యం ఏమాత్రమూ లేదని గమనించ ప్రార్థన.
ఈ బడిలో జేరాక నా విద్యభ్యాసము అవక తవకలు లేకుండా సాఫీగా సాగింది. మా తల్లి తండ్రుల ఇచ్ఛ ప్రకారము నాకు తెలుగులో ప్రవేశమూ కలిగింది.
ఇది ఒక్క నా కథే కాదు. మద్రాసులో తెలుగు చదువుకుని వృద్ధిలోకి వచ్చిన వారెందరిదో. మేము మా తెలుగుని కాపాడటానికి అష్టకష్టాలు పడి, నవరంధ్రాలు మూసుకుని తెలుగుని నేర్చుకున్నాం..
పుస్తకాలు లేక పోవుటం, సరియైన ఉపాధ్యాయులు లేక పోవటం, బళ్ళే లేక పోవుటం, ఇల్లాంటి నానా యాతనలూ పడి తెలుగు నేర్చుకున్నాం. మాకు అది చాలా గర్వ కారణం
ఆంధ్రాలో వీటికి వేటికీ కరువు లేవు. కానీ తెలుగే కరువైపోతోందని విన్నా, తలుచుకున్నా చాలా బాధా కలుగుతుంది.