ముద్ర

వచ్చిన ప్రతివారు
ఒక ముద్ర వదిలే పోతారు

కొన్ని తలుపులు తీసో
మరికొన్ని కిటికీలు మూసో
మనలోకి నదులను వంపో
మనలను సముద్రాలను చేసో వెడతారు

కొన్నిసార్లు
గుండెను తొక్కుకుంటూ వెడతారు
ఒకోసారి పగిలిన అద్దాలకు
అతుకులేసి వెడతారు

కొందరు
అందమైన రంగులను పులిమి
సీతాకోకలను చేసి ఎగరేస్తారు
మరి కొందరు
నడివేసవిలో నిప్పులు చల్లి
కొలిమిని రాజేస్తారు
చిరునవ్వుపొదలను
చాటు చేసుకుని
అదాటున కాటేస్తారు

స్నేహితులుగానో
రక్తబంధాలుగానో
ఆఖరికి శత్రువుగానో
ఎప్పుడో అప్పుడు
ఎక్కడో అక్కడ
పెదవులపై పేరై వెలుగుతారు
మాటల్లో నలుగుతారు

ఇక్కడ అడుగు మోపిన ప్రతివారు
తమదైన ఒక ముద్ర
తప్పక వదలిపోతారు
అవే కదా
మొలకలై మానులై వనాలై
పుష్పించేది.