కొద్దినెలల క్రితం సాహిత్య అకాడెమి యువపురస్కార ప్రకటన విడుదల కాగానే తెలుగు సాహిత్యలోకంలో ఊహించినంత దుమారమూ చెలరేగింది. ఒక రచనకు పురస్కారం లభిస్తున్నప్పుడు చర్చ జరగడం సహజం. ఆ రచన ఎంత ఉన్నతమైనదీ అన్నది, ఎవరి ప్రమాణాలకు అనుగుణంగా వారు విశ్లేషించుకుంటారు కనుక, భిన్నాభిప్రాయాలు అంతే సహజం. కాని, అసలు ఒక రచన ఎన్నో వడపోతలను దాటుకుని అక్కడి దాకా ఎలా వెళ్ళిందన్నది, అలాగే పురస్కారం ఇవ్వడానికి గల కారణాలను అకాడెమి సభ్యబృందం ఎందుకు ప్రకటించదు అన్నది, జవాబులు దొరకని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. అదట్లా ఉంచితే, నిన్న గాక మొన్న ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డుల్లో, తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రికి పురస్కారం ప్రకటించడం, ఈ అవార్డు పట్ల ఏర్పడ్డ నిరసనను కొంత చెరిపివేసేదిగా ఉంది. కథలు చెప్పడంలో శాస్త్రిగారిది చిత్రమైన ఒడుపు. ఏకథకాకథ భిన్నంగా, కొత్తగా మెరుస్తూ కనపడుతుంది ఆయన కలంలో. వడ్ల చిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు, రామేశ్వరం కాకులు, జెన్ కథలు మొదలైన కథా సంపుటాలు; హోరు, దేవరకోటేశు, వీర నాయకుడు, గేదె మీద పిట్ట నవలలు; మాధవి అనే నాటకం; గాథాసప్తశతి నుండి ఎంపిక చేసిన వంద కథలతో అడవిపూలు సంపుటినీ ప్రచురించిన పతంజలి శాస్త్రి ప్రతిభకు దక్కిన సముచిత గౌరవం, ఈ పురస్కారం. అవార్డులు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, సాహిత్యప్రపంచంలో వాళ్ళకయినా, అందులో మనలేక బయట నుండి సాహిత్యాన్ని అమితంగా ప్రేమించే సోషల్ మీడియా ఆవలి ప్రపంచానికయినా – అందుకున్న మనిషి రచనల మీద ఆసక్తిని కలుగజేయడం. పతంజలి శాస్త్రి కథలు కావాలని వాకబు చేస్తున్న వాళ్ళకి అందుతోన్న సమాధానం, అనల్ప, ఛాయా వాళ్ళు ప్రచురిస్తోన్న కథల సంపుటులు మినహా మిగతావేవీ ప్రస్తుతం అందుబాటులో లేవని. ప్రచురణకర్తల కనీస బాధ్యత పుస్తకాలను అందుబాటులో ఉంచడం. ప్రత్యేకించి ఉత్తమ రచనలను, పాపులర్ టాగ్కి అతీతంగా ఎప్పటికప్పుడు ప్రచురణలో ఉండేలా చూడటం ప్రచురణకర్తల బాధ్యతే. ఇది పతంజలి శాస్త్రి రచనలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, తెలుగులో సంప్రదాయంగా నడుస్తున్న బాధ్యతారాహిత్యం. ఒకపక్క పుస్తకాలు అమ్ముడు పోవడం లేదని వింటాం. మరొక పక్క పుస్తకాలు అందుబాటులో లేవనీ వింటాం. అన్నీ కలిపి విశ్లేషించుకుంటే మళ్ళీ పాత మాటకే వస్తాం. ప్రచురణ రంగం పటిష్టంగా, గౌరవనీయంగా, నమ్మకంగా ఉండాలి. రచయితలు రచనల ప్రచురణ నుండి ఎడంగా ఉండగల వాతావరణం ఏర్పడాలి. రెండవ బాధ్యతారాహిత్యం సాహిత్యకారులది. అవార్డులు వస్తే, ఆయా రచనల గురించి ఉబలాటపడుతూ ఆరాలు తీస్తున్నాం, మంచిదే. మరి, మనం అవార్డులు రావాలి అనుకునే రచనల మీద ఎందుకు శ్రద్ధ పెట్టం, ఎందుకు వాటి గురించి చర్చలు నడపం? ఎందుకు తెలుగులో ఇన్ని కవితలు, కథలు, ముచ్చట్లు ఉంటాయి కాని, ఫలానా కథ, కవిత ఈ ఈ కారణాలకు మంచిది, ఈ రకంగా గొప్పదీ అని వివరణలతో, విశ్లేషణలతో కూడిన వ్యాసం అరుదుగా తప్ప కనపడదు? ఎందుకు రచన గురించి మాట్లాడడమంటే, రచన మొత్తంగానో, పేరాలు పేరాలుగానో ఎత్తి ఇలా అన్నారు అలా అన్నారు అని తప్ప, ఒక రచన గురించి లోతుగా ఏమీ చెప్పలేని స్థితిలో తెలుగు సాహిత్య సమాజం ఎప్పుడూ మగ్గిపోతూ ఉంటుంది? ఎందుకు మనం ఒక చక్కని విమర్శ వ్రాయడానికి కనీసం ప్రయత్నించం? అకాడెమి అవార్డు రాకూడని వాళ్ళకు వస్తే ఆ తప్పులో తెలుగు కవి రచయితల బాధ్యత కచ్చితంగా ఉంది. తెలుగు సాహిత్యలోకం మంచి పుస్తకాల వివరాలను, వాటి మంచి చెడ్డలను, అర్హతా అనర్హతలనూ మున్ముందుగా ఎందుకు చదవకూడదు, చర్చించుకోకూడదు? అకాడెమికి దారి ఎందుకు చూపకూడదు?
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
జనవరి 2024 సంచికలో ...
- Endowed Chair In Telugu To Expand Language And Cultural Opportunities
- అప్రతిహతం
- ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1
- ఏరు
- కొండచింత
- కొన్ని జానపద పాటలు
- గడినుడి – 87
- గణానాం త్వా గణపతిం – తెలుగు అనువాదం
- గొర్రె కాలి విందు
- జనవరి 2024
- దర్శనాల వేళ
- నభూతో నభవిష్యతి
- నా దైనిక సమస్యలు
- పూలు చెరిగిన చీరలు
- బొల్లి
- మంచి రచయితలు, మంచి పాఠకులు
- మూడు పిల్లులు
- యూట్యూబ్లో ఈమాట: డిసెంబర్ 2023
- విమర్శకుడు
- వెల్చేరు నారాయణరావు తెలుగుదారి
- స్క్రాప్ బుక్ మాటలు