ఒక ప్రయాణం

ఆ క్షణాన అతని ఏడుపుకి కారణాలు చెప్పాలంటే అక్కడి దాకా అతడు చేసిన ప్రయాణం గూర్చి చెప్పాలి.


ఆ రోజు విమాన ప్రయాణం మామూలుగా లేదు అని అతననుకోవడానికి మూడు కారణాలున్నయ్.

మొదటిది, అతను మురారి కాకపోయినా ఇద్దరు నారీమణుల మధ్య కూర్చోవలసి రావడం. వాళ్ళ రూపలావణ్యాల వల్ల అతను మోహితుడయ్యే మాటటుంచి, అతను ఎక్కిన వందలాది ఫ్లైట్లల్లో అసలు ఇలాంటి పరిస్థితే ఎప్పుడూ రాలేదు. అతను చిన్నగా నవ్వుకున్నాడు వయసులో వున్నప్పుడు కాకుండా తనకీనాటికి ఈ అవకాశ మొచ్చినందుకు. వాళ్ళు అతనికంటే వయస్సులో కనీసం పదేళ్ళు చిన్నవాళ్ళని అతను చూసిన క్షణంలోనే నిర్ధారించేశాడు. మనసులోని చాంచల్యం ఎక్కడికీ పోకపోయినా వయసు మాత్రం స్థిరత్వాన్ని – దృఢత్వాన్ని కాదు – ఎక్కణ్ణుంచో పోగుచేసుకుంటోందని అతను గ్రహించి కొన్నేళ్ళయింది.

రెండవది, గేటునుండి విమానం వెనక్కు తొయ్యబడినప్పుడు మెయిన్ కాబిన్‌లో లైట్లు ఒకసారి ఆరి మళ్ళీ వెలగడం. విమానం గేటు దగ్గర ఆపివున్నప్పుడు ఇంజన్లు ఆపి వుంటాయి గనుక ఎయిర్‍పోర్ట్ టర్మినల్ సప్లయ్ చేసే విద్యుత్తుని వాడి మాత్రమే కాబిన్‌లో లైట్లని వెలిగించగలరు. విమానం గేటునుండి వెనక్కు తొయ్యబడ్డ తరువాత టర్మినల్ సప్లయ్ చేసే పవర్ నించి ఇంజన్ పవర్‍కి మారుతున్నప్పుడు అలా లైట్లు ఆరి వెలగడం మామూలే. అయితే, ఈ విమానం అత్యంత ఆధునికమైనది గనుక, అందులో ప్లే చేస్తున్న సేఫ్టీ విడియో ఆగిపోయింది. ఫెడరల్ రెగ్యులేషన్స్ ప్రకారం సీట్ బెల్టుని ఎలా పెట్టుకోవాలో, కాబిన్‌లో ఆక్సిజన్ తక్కువైనప్పుడు పైనించి వాలే యెల్లో మాస్కులని ఎలా మొహానికి తగిలించుకుని గాలి పీల్చాలో, విమానం నీళ్ళ మీద ఆగవలసి వస్తే సీటు క్రింది కుషన్‌ని తీసి దాన్ని ఫ్లోటింగ్ డివైస్ లాగా ఎలా ఉపయోగించుకోవాలో, ఏ తలుపులు ఎలా తీసుకోవాలో ప్రయాణీకులందరికీ తెలియజెయ్యాల్సిన బాధ్యత ఎయిర్‍లైన్ మీద వుంది. ఒకప్పుడు ఫ్లైట్ అటెండంట్స్ అందరికీ కనిపించేలా నిల్చుని ఈ వివరాలన్నింటినీ డిమాన్‍స్ట్రేట్ చేసి చూపించేవాళ్ళు. ఈ విడియో లొచ్చిన తరువాత, ఆ బాధ్యతని టేప్ రికార్డర్ మీద వదిలేశారు. ఇప్పుడు దానితో ట్రబులొచ్చి విమానం టేకాఫ్ కోసం రన్‍వే దగ్గరికి టాక్సీ చేస్తున్నప్పుడు మళ్ళీ ప్లే బటన్ నొక్కారు. అది మళ్ళీ మధ్యలోనే ఆగిపోయింది.

“వుయ్ అపాలజైజ్ ఫర్ దిస్ ఇన్కన్వీనియెన్స్. వుయ్ విల్ ట్రై టు రిసెట్ దిస్ విడియో,” అని ఎనౌన్స్ చేసి మళ్ళీ ప్రయత్నించారు. మళ్ళీ అదే పరిస్థితి. అయితే, అప్పటికే ఎయిర్‍ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు అతని విమానానికి పచ్చ జెండాని ఊపడమే కాక, మూవ్ మూవ్ అని ఊదరపెట్టడంతో ప్రయాణీకులకు సేఫ్టీ వివరాల నందించకుండానే విమానం గాల్లోకి లేచింది.

సేఫ్టీ గూర్చిన వివరాలని ప్రయాణీకులకి పూర్తిగా చెప్పకుండా విమానం గాల్లోకి లేవడం నా కెప్పుడూ గుర్తులేదే! ఎవరన్నా ఫెడరల్ ఏవియేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారేమో చూడాలి, అనుకున్నా డతను.


ఆ ఫ్లైట్ ఎక్కడంకోసం తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేవడం వల్ల విమానం బయలుదేరగానే అతని కళ్ళు మూతలు పడ్డాయి. తల కుడి పక్కకు వంగి పక్క సీట్లోని ఆవిడ భుజం మీద వాలింది. ఆవిడ ఆరడుగుల ఎత్తూ, ఇతని అయిదడుగుల పొడుగూ ఆమె భుజం అతని తలకి ఆసరా నివ్వడానికి దోహదం చేశాయి. ఆమె కూడా కునుకు తీసినా అతనికంటే ముందే మేలుకొని నిర్దాక్షిణ్యంగా అతని తలని పక్కకు తొయ్యడంతో అతనికి మెలకువ వచ్చింది. సారీ, సారీ! అంటూ అతను చెప్పిన క్షమాపణలు ఆవిడని ఏమాత్రం శాంతింప జేసినట్లు అతనికి అనిపించలేదు. “ఇట్లా ఎప్పుడూ జరగలేదు,” అని అతను రెండుసార్లు చెప్పగానే ఆమె “దట్స్ ఓకె!” అనయితే అన్నది గానీ, ఆ గొంతుకి అతను మాత్రం ఝడుసుకుని, తలని నిఠారుగా వుంచి సీటు వెనక్కి ఆనించి, కళ్ళు మూసుకొన్నాడు. జన్మలో మరిచిపోలేని గొంతు! అని కూడా అనుకున్నాడు.

విమానం గాల్లోకి లేచిన అరగంట తరువాత సీట్‍బెల్ట్‌ ఇంక పెట్టుకోవక్కర్లేదని సూచిస్తూ గంట మోగడంతో కళ్ళు తెరిచి టాయ్‍లెట్‍కి వెళ్ళడం కోసం లేవబోతూంటే ముందు మానిటర్ మీద సేఫ్టీ విడియో ప్లే అవుతూ కనిపించింది. అన్‍బిలీవబుల్ – అని తలనడ్డంగా ఆడిస్తూ లేచాడు. ఇంతలో ఫ్లైట్ అటెండంట్ చేస్తున్న అనౌన్స్‌మెంట్ వినిపించింది: “వుయ్ అపాలజైజ్ ఫర్ దిస్ సేఫ్టీ విడియో. ఐ హావ్ లాస్ట్ కౌంట్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ డన్ దిస్ అపాలజైజింగ్ టుడే. అన్‌ఫార్చునేట్లీ, ది మూవీస్ విల్ నాట్ ప్లే అంటిల్ దిస్ విడియో ఈజ్ ఫినిష్డ్. సో, ఐ విల్ రిసెట్ ఇట్ ఎగైన్!”

పదినిముషాల తరువాత అతను తిరిగొచ్చి సీట్లో కూర్చుంటూ ఎదురుగా చూస్తే అదే విడియో ఇంకా ప్లే అవుతోంది. ‘అన్‍బిలీవబుల్ కదా?’ అంటూ పక్కనామె వైపు చూస్తే, ఆవిడ సీట్ బెల్ట్ తియ్యడం, మళ్ళీ పెట్టుకోవడంలో నిమగ్నమై వుంది.

ఈ ప్రయాణం మామూలుగా లేదు అని అతననుకోవడానికి మూడవ కారణం హాండ్‌రెస్ట్ కోసం యుద్ధం చెయ్యాల్సిరావడం. దాని వివరాలివీ –

అతను కంప్యూటర్‍ని ఆన్ చేసి కళ్ళని స్క్రీన్‍కి అప్పజెప్పి పనిచెయ్యడం మొదలుపెట్టాడే గానీ, అతని ఎడమ చెయ్యి హాండ్‍రెస్ట్ కోసం పక్కనావిడతో యుద్ధం చెయ్యవల్సి వస్తున్నందుకు చికాకు పడుతూనే వున్నాడు. ఎంతో కొంత, కొంచెమయినా సరే అతను తన చేతిని ఆ హాండ్‍రెస్ట్ మీద నిలుపుదామని ప్రయత్నిస్తుంటే ఆ పక్కనావిడ కుదరనియ్యదే! ఆమె తోసేసే కొద్దీ అతను ప్రతిఘటిస్తూనే వున్నాడు. కాసేపటికి, “ఏయ్ మిస్టర్, కీప్ యువర్ హాండ్స్ టు యువర్‍సెల్ఫ్!” అని ఎడంపక్కనుంచి పడ్డ బాంబు అతణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. అతను ఎడంచేతిని ఠక్కున వెనక్కి లాక్కుంటూ చూస్తే, తన చెయ్యి అప్పటి దాకా యుధ్ధం చేసింది ఆమె చేతితో కాదనీ ఆమె నడుముతోననీ అతనికి అర్థమైంది. ఒక్కక్షణం, దీన్నే కదా, ఎసిమెట్రిక్ వార్‌ఫేర్ అనేది, అని అనుకున్నాడు గానీ, వెంటనే, “ఇట్స్ నాట్ మై ఫాల్ట్! ఐ వజ్ జస్ట్ ట్రైయింగ్ టు యూజ్ ది హాండ్‌రెస్ట్!” అన్నాడు. ఆవిడ వెంటనే బెల్లు కొట్టి అటెండంట్‌ని పిలిచి, “హి ఈజ్ కాలింగ్ మి ఫాట్!” అని కంప్లైంట్ చేసింది.

ఆమె వెంటనే, “సర్, యూ నీడ్ టు బిహేవ్. నో నీడ్ టు సే నాస్టీ థింగ్స్!” అని అతణ్ణి కోప్పడింది. అతనికి కోపమొచ్చింది. ముందు సీట్ పాకెట్లో వున్న సేఫ్టీ కార్డుని తీసి, దాన్ని హాండ్‌రెస్ట్ మీదుగా గాల్లోకి పైకీ కిందకీ ఆడించి చూపిస్తూ, ఆ పక్కావిడ తన సీట్ స్పేస్‍ లోకి హాండ్‍రెస్ట్ మీదుగానూ, కిందనించీనూ ఎలా చేరిపోతోందో చూపించాడు. “యూ థింక్ ఐ వాంట్ టు బి లైక్ దిస్?” అని ఆవిడ ముక్కు చీదడం మొదలుపెట్టింది. “నీ చేతుల్ని కట్టేసుకుని నీ వళ్ళో పెట్టుకోకపోతే కట్టేసి కూర్చోపెట్టిస్తాను, జాగ్రత్త!” అని అటెండంట్ వార్నింగ్ యిచ్చి వెళ్ళిపోయింది.

సీటుకి కట్టెయ్యబడ్డ విమాన ప్రయాణీకుల గూర్చి వార్తల్లో విని వున్నాడు గనుక అతను పళ్ళు నూరడం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు. కుడివైపు తిరిగి, ఆమెతో “దిస్ నెవర్ హాపెండ్ టు మి బిఫోర్!” అన్నాడు. “దేరీజ్ ఎ ఫస్ట్ టైమ్ ఫర్ ఎవిరిథింగ్!” అన్నదావిడ. మొదట తనని ఓదారుస్తోందనే అనుకున్నాడు గానీ, కొద్దిగా ఆలోచించగానే అతనికి పెద్ద సందేహం వచ్చింది – నేనిట్లా చెయ్యడమా లేక చెయ్యడం వల్ల పట్టుపడ్డాననడమా ఈవిడ ఫస్ట్ టైమ్ అన్నది? – అని ఆలోచించి, ఆవిడ కూడా తనని దోషిగానే చూస్తోందన్న నిర్ణయాని కతనొచ్చాడు. భుజంమీద తల ఆనించి నిద్రపోయానని గుర్తుండడం వల్ల కూడా అయ్యుండొచ్చులే, అని సర్ది చెప్పుకున్నాడు.

దిస్ జర్నీ హాజ్ బీన్ స్ట్రేంజ్! అనుకున్నాడు అప్పుడతను.


ఎందుకైనా మంచిదని రెండు మోచేతులనీ జాగ్రత్తగానే దగ్గరగా పెట్టుకుని, విడియో మానిటర్‌ని చూస్తే అక్కడ ఇంకా సేఫ్టీ విడియో ప్లే చేస్తూనే వుంది. తల నడ్డంగా ఆడించి కీబోర్డు మీద వేళ్ళని ఆనించబోతూ వాచ్ వైపు చూశాడు. అది, బయలుదేరి అప్పటికి గంట దాటిందని చూపించింది. కాఫీలూ, కూల్‌డ్రింకులూ అందించడం మొదలుపెట్టాలే అని సీటులోంచి వెనక్కు తిరిగి చూస్తే విమానం ఆ చివరినించీ డ్రింక్స్ కార్ట్‌ని తోసుకుంటూ రావడం కనిపించింది. తన దగ్గరకు వచ్చేసరికి కనీసం ఓ పావుగంట పడుతుంది అనుకుని పనిలో నిమగ్నమయాడు. కాసేపయిన తరువాత, అప్పటిదాకా ట్రబులిచ్చిన కంప్యూటర్ ప్రోగ్రామ్ అతనికి కావలసిన రిజల్ట్ నిచ్చేసరికి “య్యస్!” అని కుడిచేతి పిడికిలిని బిగించి హాండ్‌రెస్ట్ మీద గుద్దాడు. ఫ్లైట్ అటెండంట్ ఇచ్చిన వార్నింగ్ గుర్తుకొచ్చి చటుక్కున చేతులని కిందకు దించుతూ కనుచివరల నుంచి ఎడమవైపు చూశాడు. ఆ సీట్లో ఆమె కిటికీ పక్కకు ముడుచుకుని కూర్చోవడం అతణ్ణి నిశ్చేష్టుణ్ణి చేసింది. అంతే కాక తన కుడిచేతిని మోచేతిదగ్గర ఎడమచేత్తో పట్టుకుని హాండ్‍రెస్టుకి దూరంగా వుండేలా పెట్టి ముందున్న విడియో మానిటర్ని చూస్తోంది. అందుకనే అంతకు ముందు అతను ఆమె చేత్తో కాక నడుముతో యుధ్ధం చెయ్యాల్సి రావడం!

అతను తన ప్రవర్తనకి చాలా సిగ్గుపడ్డాడు. “ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ! ఐ వజ్ లాస్ట్ ఇన్ మై వర్క్ అండ్ డిడ్ నాట్ నోటీస్ హౌ అన్‌కంఫర్టబుల్ ఐ మేడ్ యు ఫీల్!” అని ఆమెతో అన్నాడు. ఆమె భుజాల నెగురవేసి తలని కిటికీకి ఆనించి కూర్చుంది. “కెన్ ఐ బయ్ యు ఎ డ్రింక్?” అనడిగి, ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఆ డ్రింక్స్ కార్ట్ ఇంకా రాలేదేమిటి చెప్మా, పావుగంట ఎప్పుడో అయ్యుండాలే, అనుకుంటూ చూస్తే ఇందాక అతను చూసినప్పుడెక్కడ వున్నదో ఇప్పుడూ అక్కడే వుంది. చేతికి వున్న గడియారంలో టైమ్ చూశాడు. ఇందాక ఏ టైమ్ చూపించిందో ఇప్పుడూ అదే చూపిస్తోంది. బాటరీ అయిపోయి ఆగిపోయిందేమో ననుకున్నాడు గానీ, సెకండ్ల ముల్లు తిరుగుతూనే వుంది. ఆ ముల్లు తిరుగుతూంటే, నిముషాల ముల్లెందుకు తిరగడం లేదు? అని ఆలోచించి, దీనికి రిపేర్ టైమొచ్చింది అన్న నిశ్చయాని కొచ్చాడు. ఇంటికెళ్ళిన తరువాత కొత్త వాచ్ కొనాలి, అనుకున్నాడు.

ఇల్లు – అనుకోగానే అతనికి ఆ వారాంతంలో జరిగే కార్యక్రమాలు వరుసగా గుర్తొచ్చేయ్. అమ్మాయి బేబీ షవర్ కోసం ఫ్లారిడా నుంచి వస్తోంది. కొడుకేమో కాలేజీలో వుండడం వల్ల శుక్రవారం రాత్రికి గానీ ఫ్లైట్ దిగడు. మళ్ళీ, ఆదివారం పొద్దున్నే వెళ్ళిపోతాడు. అందుకని వాడికి అప్పగించగలిగే పనులేవీ లేవు. చుట్టపు చూపు మాత్రమే కదా! అమ్మాయి మాత్రం? ఇప్పుడు టైమ్ఆఫ్ ఎలా తీసుకుంటాను, డెలివరీ అయిన తరువాత ఎలాగో తప్పదు కదా అని, ఆదివారం సాయంత్రమే వెళ్ళేలా ఫ్లైట్ టిక్కెట్లని కొన్నది వాళ్ళాయనకీ తనకీ కలిపి. అమెరికాలో వుండడం వల్ల అని అనుకోవడం ఎందుకూ? బెంగుళూరులో తాముంటూ ఢిల్లీలో వాళ్ళున్నా పరిస్థితి అదే కదా! ‘మన’వాళ్ళ మధ్యలో వుండడం వేరంటుంది అతని భార్య. చదువు కోసమని అమెరికా రావడం, పెళ్ళీ, పిల్లలూ, వాళ్ళ చదువులూ, అన్నీ సినిమా రీళ్ళలా అతని మస్తిష్కంలో తిరిగాయి.

రివరీ లోంచి బయటపడి వాచ్ వైపు చూస్తే ఇప్పుడందులో ముళ్ళే లేవు. ఇంతలోకే ఎక్కడికి పోయాయి అని ఆశ్చర్యపడ్డాడు. దీన్ని రిపేర్ షాపువాడికి చూపించి ముళ్ళు మాయమయ్యాయంటే వాడు నమ్ముతాడా అసలు? అనుకుంటూ ముందు విడియో మానిటర్ని చూశాడు. ఇంకా సేఫ్టీ విడియో వస్తూనే వుంది. రివైండ్ అండ్ ప్లే లాగా అందులోని వ్యక్తి సీట్ బెల్ట్ పెడుతూ, తీస్తూ, పెడుతూ, తీస్తూనే వున్నాడు. డ్రింక్ కార్ట్ కోసమని వెనక్కు చూస్తే కొన్ని పసుపు పచ్చని ఆక్సిజన్ మాస్కులు వేళ్ళాడుతూ కనిపించాయి. అవి ఒకటొకటిగా ప్రయాణీకుల ముందు వాలుతున్నాయి. ఈ ఫ్లైట్ అటెండంట్స్ వాటిగుండా డ్రింకులు పోస్తున్నారు గావును అనుకున్నాడు. ఆ ఆలోచనకి అతనికి నవ్వొచ్చింది. కాకపోతే, విమానం ప్రమాదంలో వుండుంటే ఈపాటికి ఎన్ని అనౌన్స్‌మెంట్స్ చేసి వుండేవాళ్ళు! పైగా, అందరి ముందూ ఒకేసారి ఆ మాస్కులు పడాలి కదా! ఆ కార్ట్ తన సీటు దగ్గరకొచ్చి నడవాని బ్లాక్ చేసే ముందరే టాయ్‌లెట్‌కి ఒకసారి వెళ్ళొస్తే మంచిది అని అనుకుని ముందున్న టాయ్‌లెట్ వైపు వెళ్ళాడు.

తిరిగి సీటువైపు వస్తూ వెనక డ్రింక్స్ కార్టు వుండిన వైపు చూస్తే అటువైపు చీకటిగా కనిపించింది. అందులోంచి మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇంకా నయం, అటువైపు వెళ్ళాను కాదు! అనుకుని సంతోషపడ్డాడు. అతని సీటు వద్దకు వచ్చేసరికి దాని ముందు కూడా ఆక్సిజన్ మాస్క్ వేలాడుతూ కనిపించింది. ఇక్కడిదాకా నడిచి రావడానికి లేని ఈ మాస్క్ అవసరం ఈ సీట్లో కూర్చోవడాని కెందుకొస్తుంది? అని ఆలోచనలో పడి అయ్‌ల్ సీట్‌లో కూర్చున్నావిడ తనని మధ్య సీట్లోకి పంపడంకోసం లేవడానికి కష్టపడడం అతను గమనించలేదు. సీట్‌లో కూర్చున్న తరువాత ముందుకు చూస్తే అక్కడ సేఫ్టీ విడియోనే ప్లే చేస్తోంది కానీ, అది విమాన ప్రయాణానికి సంబంధించినది మాత్రం కాదు. అంతరిక్ష యాత్రికులు వేసుకునే సూట్‌లని అపోలో-13, ఇంటర్‌స్టెలార్ సినిమాల్లో చూసి వున్నాడు గనుక వాటిని ఆ విడియోలో వెంటనే గుర్తు పట్టాడు. మెడ తిప్పి రెండువైపులా చూస్తే ఆ ఇద్దరు ఆడవాళ్ళూ స్పేస్ సూట్స్‌లో వున్నారు. ఒక్క మొహాలకి మాత్రం హెల్మెట్‌లని ఇంకా పెట్టుకోలేదు. ఆ సూట్‌లో నడవడమే కష్టం. అలాంటిది ఆ అయ్‌ల్ సీట్‌లో ఆవిడ సీట్ లోంచి లేవడానికి కష్టపడిందంటే ఆశ్చర్యపడడాని కేముంది?

కిటికీ పక్కన వున్నావిడ అతని సీటుని పైకెత్తమని చెప్పింది. సీటుని పైకెత్తి చూస్తే అక్కడ స్పేస్ సూట్ కనిపించింది. ఇక్కడ విమానం నీటిమీద ఆగేటట్లయితే అవసరానికి దీనిక్రింద ఫ్లోటింగ్ డివైస్ పెడతామని కదా వాళ్ళు ఎప్పుడూ చెప్పేది? ఈ ప్రయాణంలో మొదటే వాళ్ళు ఈ స్పేస్ సూట్లని పెట్టారా లేక తను టాయ్‌లెట్‌కి వెళ్ళివచ్చే ఆ కాసేపట్లోనూ ఈ మార్పిడి జరిగిందా అని ఆలోచనలో పడ్డాడు. దానికి అంతరాయాన్ని కల్గిస్తూ పక్క సీట్ల వాళ్ళు అతన్ని స్పేస్ సూట్‌లోకి ఎక్కించడం మొదలుపెట్టారు. స్పేస్ సూట్లు వేసుకుంటున్నారంటే స్పేస్ ఫ్లైట్ ఛాన్సు కొట్టేసినట్టే! ఈ ఫ్లైట్‌లో వున్నవాళ్ళందరికీ ఈ ఛాన్సా లేక తమ ముగ్గురికేనా? “హే కల్పనా చావ్లా! కష్టపడకుండానే, అప్లయ్ చెయ్యకుండానే, అస్సలు వెయిటింగ్ ఏమీ లేకుండానే మాకు ఈ స్పేస్ ఫ్లైట్ ఛాన్స్ వచ్చింది తెలుసా? ” అని ఆ స్పేస్ హెల్మెట్ లోంచి అరిచాడు.

అతని ముందుకు వాలివున్న యెల్లో ఆక్సిజన్ మాస్కుని ఆ కుడిపక్కన వున్నావిడ అతని స్పేస్ సూటుకి నడుం దగ్గర తగిలిస్తుంటే, “ఆక్సిజన్ మాస్క్ ముక్కుకి కదా తగిలించాలి?” అనుకున్నాడు గానీ, ఆ పక్క సీట్లల్లో వాళ్ళ సూట్లకి కూడా అవి నడుం దగ్గరే తగిలించి వున్నాయని చూసిన తరువాత అతనికి గుర్తొచ్చింది – స్పేస్ సూట్లలో వున్నవాళ్ళ కెవరికీ అవి ముక్కుకి తగిలించి వుండడం చూళ్ళేదని. “భూమి పరిధిలోంచి బయటకు వచ్చేసినట్లున్నామే!” అని దాన్ని తగిలిస్తున్న ఆవిడతో అన్నాడు గానీ ఆ హెల్మెట్ వున్నందువల్ల అతనేమన్నాడో ఆమెకి వినిపించలేదు.

ఆ ఆడవాళ్ళిద్దరూ అతణ్ణి చెరో రెక్కా పట్టుకుని విమానం వెనుక వైపుకు నడిపించారు. ఒక మనిషి నడవడానికి కూడా సరిపోనంత సన్నగా వుండే ఈ సీట్ల మధ్య దారిలో స్పేస్ సూట్లు వేసుకున్న ముగ్గురు చేతులు కలిపి పక్క పక్కన నడవడానికి ఎలా వీలయిందన్న ఆలోచన అతనికి కలగలేదు గానీ, ఈ అపురూప దృశ్యాన్ని మాత్రం ఐఫోన్‌తో సెల్ఫీ తీద్దామనుకున్నాడు. అయితే, ఆ ఫోన్ కాస్తా సూట్ లోపల వుండిపోయిందని గుర్తొచ్చి కొద్దిగా చికాకుపడ్డాడు. ఇందాక ఆ డ్రింక్స్ కార్ట్ వున్నచోటికి వచ్చేటప్పటికి స్విమ్మింగ్ పూల్ దగ్గర డైవింగ్ బోర్డు చివర నిలబడ్డ అనుభూతి కలిగిందతనికి. అలాగే, దానితోబాటే అక్కడే విశాల విశ్వం మొదలైనట్టుందన్న ఫీలింగ్ కూడా. “ఓ.కే. స్పేస్! హియర్ ఐ కమ్,” అంటూ కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళతన్ని తోశారో, పట్టుకున్న చేతులని మాత్రం వదిలేశారో, లేక పట్టుకునే వున్నా గానీ ఆ ఎరుక మాత్రమే లేకుండా పోయిందో అతనికి తెలియలేదు గానీ హఠాత్తుగా అక్కడ వున్నది తానొక్కడే అని అతను గ్రహించాడు.

అక్కణ్ణించి భూమి వైపుకి వెళ్ళేట్లయితే, దాని గురుత్వాకర్షణశక్తి వల్ల వేగాన్ని పుంజుకుంటూ కదులుతూ, భూమి చుట్టూ వుండే వాతావరణం లోకి ప్రవేశించగానే గాలినీ, వేగాన్ని పెంచుకుంటూ చెవి పక్కగా వెళ్ళే దాని శక్తినీ గ్రహించడం తప్పనిసరి అని అతనికి గుర్తుంది. పైగా, విపరీతమైన వేడి కూడా అనుభవంలోకి రావాలి. ఆ రెండిట్లో ఏ ఒక్కటీ అతనికి అనుభవం లోకి రాలేదు. మిణుకు మిణుకుమనే నక్షత్రాలు కనిపిస్తున్నాయి గానీ, అవి స్పేస్ సూట్ బయటవుండి వాటి ఉనికిని కళ్ళద్వారా మెదడుకు చేరవేస్తున్నాయా లేక అవి అతని మస్తిష్కంలో స్థిరంగా తమ ఉనికిని నిలుపుకున్నాయా అన్నది అతనికి అర్థం కాని విషయం.

ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం ఎప్పుడు ఆగిపోయిందో అతనికి తెలియదు. చేతులద్వారా ఆహారపదార్థాలని నోటికి అందించడం అతను చెయ్యట్లేదు. తన ఉనికి, మనుగడ రహస్యాలేమీ అతనికి తెలియట్లేదు. అనంత విశ్వంలో తను అణువుగానో లేక పరమాణువుగానో అయినా మిగిలి వున్నాడా అనే సందేహమే అతనికి రాలేదు. గుండె కొట్టుకోవడం కూడా కాలగతితో సంబంధం కలిగి వున్నది గనుక అది ఆగిపోయినదని తెలుసుకోవడం కూడా అతనికి సాధ్యం కాలేదు.

అతను ఉలిక్కిపడ్డది మాత్రం ఆ గుండె కదలిక తెలిసినప్పుడు. అప్పుడు బధ్ధకంగా వళ్ళు విరుచుకున్నాడు. చేతులు, కాళ్ళ కదలికలు తెలుసుకున్నాడు. ఏవో శబ్దాలు లీలామాత్రంగా తెలియడం వల్ల చెవులు పని చేస్తున్నయ్యని సంతోషపడ్డాడు. గాలి పీల్చవలసిన అవసరం లేదేమిటా అనీ, నోటితో ఏమీ తినడం లేదేమిటా అనీ ఆశ్చర్యపడ్డాడు గానీ, స్పేస్ సూట్ గుర్తొచ్చి, దాన్లోంచి ఫీడింగ్ కూడా వుంటుంది కాబోలునని సమాధానపడ్డాడు. ఈ ఎక్స్‌ట్రా వెహిక్యులార్ ఆక్టివిటీ అవగానే ఈ సూట్ తీసేసి అమ్మయ్య అని గాలి పీల్చుకోవచ్చు గదా అని సంతోషపడ్డాడు.

గుండె కండరాల కదలిక ఎన్నిమార్లు జరిగిందో అతను గుర్తు పెట్టుకోలేదు గానీ, తనకు స్పేస్ చిన్నదవుతున్నదని అతను గ్రహించాడు. చేతులూ, కాళ్ళతో నెడుతూ ప్రతిఘటించాడు. అప్పుడు తగిలిందతనికి ఇంకో గుండె చలనపు వునికి. మొదట కాలికి తగిలినట్లనిపించింది. తరువాత చేతికి. ఇంకోసారి ఏకంగా నెత్తి మీదే. ఇవన్నీ ఒకటే గుండె సంబంధాలో వేరేవేరేవో అతనికి అర్థం కాలేదు. ఏదయితేనేం, శరీరంలో ఎన్నిసార్లో ఎన్నో చోట్ల తగిలాయి, తగులుతూనే వున్నయ్యని అర్థమయిన తరువాత ఇంక పట్టించుకోవడం మానేశాడు. తన వంతుగా చేతులూ, కాళ్ళూ ముడుచుకుంటే ప్రతిఘటన బలంగా చెయ్యొచ్చని తలచి, ఆ ఆలోచనని అమలులో పెట్టాడు. అసలు తను స్పేస్ సూట్ లోనే లేకుండా ఏదయినా గదిలో బంధింపబడ్డాడేమోనని అనుమాన మొచ్చి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ గదిలోంచి బయట పడడానికి మార్గాలేమైనా వున్నయ్యేమోనని మోచేతులతో పొడుస్తూ, కాళ్ళతో తన్నుతూ వెదకడం మొదలుపెట్టాడు. అతనికి ఆనందాన్నిచ్చిన విషయం మాత్రం – ఈ వెదికే ప్రయత్నంలో కంపెనీ వున్నదని అర్థమవడం.

అతనలా ఎన్నిసార్లు తిరిగాడో, ఎన్నాళ్ళు అలా ప్రయత్నిస్తూనే వున్నాడో అతనికి గుర్తులేదు గానీ, వాటి వల్ల చేతులూ కాళ్ళూ కదపడానికి చోటు ఎక్కువవడం మాటటుంచి బంధించి వుంచిన గది పరిమాణ మెప్పుడూ పెరిగినట్లు అతనికి అనిపించలేదు; పైగా, ఇంకా చిన్నదవుతున్నట్లు అనిపించసాగింది. ఒకసారి, ఎవరో “జరగండి, జరగండి!” అన్నట్టుగా గట్టిగా తోస్తున్నట్లనిపించి, “కదలడానికే చోటు లేకపోతే ఎక్కడికి జరిగేది?” అని విసుక్కున్నాడు గానీ, కొంత సేపట్లోనే ఆ గదిలో అతనికి హఠాత్తుగా ఎక్కువ చోటు దొరికినట్లు తెలిసి కాళ్ళు, చేతులని ఆడిస్తూ గిర్రున తిరిగాడు. అంతలోనే అతని తలమీద కాలు పెట్టి ఎవరో తొక్కినట్లనిపించింది. అలా చెయ్యడం అతనికి ఏమాత్రం నచ్చలేదు గాని, తరువాత తనకి ఇంకాస్త చోటు దొరికిందని గ్రహించాడు. అలాగే, ఇప్పుడు మాత్రమే ఆ స్పేస్ సూట్ తనని నిలువెల్లా హత్తుకుంటోందని కూడా. ఇంతలోనే ఆ గది అతణ్ణి బయటకు తోస్తున్నట్లనిపించి కంగారు పడ్డాడు. అలా తోసేటప్పుడు అప్పటిదాకా అతని తలకి కదలడానికి వుండే ఆ కొద్ది స్వేఛ్ఛ కూడా లేకుండా పోయినప్పుడు ఉక్కిరి బిక్కిరయ్యాడు. అయినా, అతని ప్రయత్నమేమీ లేకుండానే యుగాలు అనిపించిన క్షణాల తరువాత అతని అన్ని అవయవాలకీ కదలడానికి స్వేఛ్ఛ వచ్చిందని గ్రహించి, మరి కొందరికి కూడా యుగాల్లాగే అనిపించిన అలాంటి క్షణకాలం పాటు నిశ్చేష్టుడయ్యాడు. దానికి కారణం, తనని ఎవరో రెండుకాళ్ళని ఒంటిచేత్తో పట్టుకుని తలక్రిందులుగా వేలాడదీస్తున్నారని అర్థం కావడం. ఫ్లయిట్లో ఆ లావాటావిడ గ్రిప్ లానే ఈ పట్టు కూడా గట్టిగా వుంది. రెండు కాళ్ళూ ఆ గ్రిప్‌లో నలిగిపోతున్నాయి.

అంతలో పిరుదులమీద చురుక్కుమని దెబ్బ తగిలేసరికి అతనికి భయం వేసింది. “నా చిన్నప్పుడు మా అమ్మ ముద్దు గానో లేక తప్పు చేసినప్పుడో మాత్రమే అక్కడ ఏమీ ఆచ్ఛాదన లేకుండా వున్నప్పుడు కొట్టింది. మా ఆవిడ పడగ్గదిలో ప్రేమతో అక్కడే చురుక్కు మనిపించింది. కానీ, ఆ ఇద్దరిలోనూ ఎవరూ నన్నిలా తలక్రిందులుగా వేలాడదీయలేదు. ఇప్పుడు ఇంకేమవబోతున్నదో!” అని నోరు తెరిచి ఏడ్చాడు. ఆ ఏడుపుని విని చుట్టుపక్కలవాళ్ళు సంతోషపడ్డారని అర్థమై, కళ్ళు తెరిచి చూడడానికి కూడా భయమేసి, ఊపిరితిత్తులనిండా గాలి పీల్చుకుంటూ గుక్కపట్టి ఏడ్చాడు.

“ఇద్దరమ్మాయిలూ, ఒక అబ్బాయీ – దట్ కంప్లీట్స్ ది ట్రిప్లెట్! కంగ్రాట్యులేషన్స్!!” అని ఎవరో అనడం అతనికి వినిపించింది. దానితోబాటే, ఆ మాటలని మింగేస్తున్నట్లుగా వినిపించిన రెండు ఏడుపులు కూడా. అతనా గొంతులని గుర్తుపట్టాడు. అవి నారీ నారీ నడుమ మురారీ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాయని అర్థమైందతనికి.