ఇద్దరు మిత్రుల కొత్త కవితా సంపుటాలు

తెలుగులో తరచుగా కవితా సంపుటాలు తీసుకువచ్చే కవులు చాలామందే ఉన్నారు. ఎంతోకాలంగా ఇలా ప్రచురిస్తూ వస్తున్నవారి కొత్త సంపుటి చూస్తున్నప్పుడు, మిగతా విషయాల మాట ఎలా ఉన్నా, కవితా సృజన విషయంలో వీరి ఉత్సాహాన్ని కాలం ఏ మాత్రమూ సడలించలేదని అర్థమౌతూ ఉంటుంది. మరికొందరు ఎప్పటికోగాని కొత్త సంపుటి తీసుకురారు. ఐదో, పదో కాదు. ఏకంగా ఇరవై, ముప్ఫయ్ సంవత్సరాల తరువాత ఎవరైనా కొత్త సంపుటి తీసుకువస్తే తప్పక చదవాలనే ఆసక్తి కలుగుతుంది. అదీ, రాసినవారు చిన్నప్పటి స్నేహితులైతే, కాలం పరుసవేది హస్తస్పర్శతో బంగారంగా మారిన గతదినాలు గుర్తుకు వచ్చి, జ్ఞాపకాల పరిమళం చటుక్కున గుబాళిస్తుంది. ఇటువంటి అనుభవమే రెండు కవితా సంపుటాల విషయంలో ఈమధ్య నాకు కలిగింది. అనేక దశాబ్దాల క్రితం ఈ ఇద్దరు కవుల మొదటి కవితా సంపుటి ఆవిష్కరణ సభల్లో ప్రేక్షకునిగాను, ఈ కొత్త సంపుటాల ఆవిష్కరణలో వక్తగాను పాల్గొనే అవకాశం నాకు కలిగింది. ఆ ప్రసంగ పాఠాల నుంచి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.

ఇందులో మొదటిగా చెప్పవలసిన పుస్తకం పేరు కాలం సైకత తీరం. దీనిని రాసిన కవి ఈమాట పాఠకులకు సుపరిచితుడైన ఇంద్రప్రసాద్. ఈమాటలో ప్రసాద్ కవితలు చదువుతూ వస్తున్న పాఠకులకు ఆయన కవిత్వం మీద ఇప్పటికే ఒక అవగాహన ఏర్పడివుంటుంది. ప్రసాద్ మొదటి సంపుటి నడిచి వచ్చిన దారి తరువాత దాదాపు ముప్ఫయ్ సంవత్సరాలుగా రాసిన కవితలలో నుంచి ఎంపిక చేసిన వంద కవితలతో కూర్చిన సంపుటి ఇది. అందువల్ల, వివిధ దశలలో కలిగిన విస్తృతమైన, వైవిధ్యభరితమైన అనుభవాల వల్ల గాఢత, అనుభూతి సాంద్రత, తాత్వికత నిండిన ఒక విధమైన ప్రౌఢకవిత్వం మనకు ఇందులో దొరుకుతుంది.

ఇంద్రప్రసాద్ ఆవంత్స సోమసుందర్ ప్రియశిష్యులలో ఒకడు. సాహిత్యమే కాకుండా, సంగీతం, సినిమా, చరిత్ర మొదలైన అంశాలలో ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు. వాటి సారం తన కవిత్వంలో కనిపిస్తుంది గాని, కవితా నిర్మాణంలో, నిర్వహణలో తన మార్గం తనదే. ముఖ్యంగా, క్లుప్తత విషయంలో పట్టుదల కనిపిస్తుంది. ఇందులోని కవితలలో చాలా వరకు ఒకటీ రెండూ పేజీలు మించనివే. ప్రసాద్ సంస్కృతంలో విశారదుడని కొత్తగా తెలిసింది. ఆ ప్రభావం కూడా కొన్ని కవితలలో గమనించవచ్చు. తాత్వికతతో బాటు ప్రసాద్ కవిత్వంలో అన్వేషణ, తలపోత ఎక్కువగా ఉంటాయి. వయసుతో వచ్చిన మార్పు కనిపిస్తుంది. తను రాసిన ఏ కవితైనా కుదురుగా, పొందికగా ఉంటుంది. భావాలు పది దిక్కులకీ పరుగులు తీయటం కాకుండా, తదేక దృష్టితో వాటిని కేంద్రీకరించటానికి కవి తీసుకున్న శ్రద్ధ స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడా అనవసరమైన విస్తరణకు తావీయకుండా సాగుతుంది. మాటలు, వాక్యాలు ఆడంబరాలకు పోకుండా పొందికగా నిసర్గ సౌందర్యంతో నిలుస్తాయి. ఊహలలో ఎనలేని సౌందర్య దృష్టి అనేక కవితలలో తళుక్కున మెరుస్తుంది.

కవిత్వంలో సార్వజనీనతకున్న విలువ చాలా ముఖ్యమైనది. ఐతే, కొన్ని సందర్భాలలో పరిస్థితిని బట్టి, మరీ ముఖ్యంగా ఒక సంస్కృతి, భాష, ప్రదేశం వంటి వాటితో మనకున్న అనుబంధం వల్ల స్థానికత అలరిస్తుంది. కాకినాడ, పిఠాపురాలతో నాకున్న అనుబంధం అటువంటిదే. ఈ సంపుటిలో ఉప్పాడ ప్రయాణం అనే కవిత అందుకే నన్ను ఆకర్షించింది. ఈ కవిత చదువుతుంటే, పిఠాపురంలో గోధూళి వేళ గేదెల్ని తోలుకొంటూ ఇంటి ముఖం పట్టే పశుల కాపర్లు, ఉప్పాడ సముద్రంలో ఆరోజు దొరికిన వేటను కేరేజికి కట్టుకుని, హేండిల్ బార్ మీదకి వంగి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే మత్సకారులు, నెమ్మదిగా నడుచుకుంటూ సాగే చెరుకు బళ్ళు, వీధి చివర వీర్రాజు టాకీసులోనుంచి ఝుమ్మంది నాదం పాట – ఇవన్నీ గుర్తుకువచ్చి, మనసు ద్రవించింది.

ఊరు ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఊరు మారటం గురించి యిక్కడ ప్రస్తావిస్తాను. ఊరు మారటం అంటే రెండు రకాలు: మనం ఊరు మారి వేరే చోటుకు పోవటం, లేదా ఊరే తన స్వరూపాన్ని మార్చుకోవటం. ఊరికెళతానా 1, ఊరికెళతానా 2, అన్న ఈ రెండు కవితలలోనూ ఎన్నో రోజులకి వెళ్ళి చూసినా ఊరు మారలేదనే ప్రస్తావన ఉంది. పిఠాపురం వరకు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సోమసుందర్ చాలా కాలం క్రితం మా ఊరు మారింది అనే కావ్యం రాశారు. అది చదివినప్పుడు అనుకునేవాణ్ణి – పిఠాపురం అంతగా ఏమి మారి ఉంటుందని. బహుశా, ఆయన తన చిన్నప్పటి ఊరితో పోల్చుకొని రాసి ఉంటారు. సాధారణంగా, అదే ఊరిలో ఉన్నవారికి మార్పు తెలియదు, బయటనుంచి వచ్చినవారికి అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఊరి విషయంలో అది వ్యతిరేకంగా జరగటం కొంత విచిత్రంగా అనిపిస్తుంది.

రెండవది మనమే ఊరు విడిచి… ఊరని ఏముంది ‘ఇంకొంచెం దూరమే కదా అని దేశమే దాటేసి’ పోవటం గురించి. ప్రవాసంలో ఉన్నవారు, వివిధ దేశాలలో ఉన్నా, ఆయా దేశ పరిస్థితులు, పరిసరాలు వేరే వేరే అయినా, మాతృదేశం మీద బెంగ, దూరాభారం అందరికీ ఒకలాగే ఉంటాయి. అందువల్ల, ఇందులో ప్రవాస జీవితం గురించి రాసిన కవితలకు ఎంతోమంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిద్రనొదిలేసి అన్న కవితలో చెప్పినట్టు ప్రయాణంలో ఉన్న రంగుల కల చివరికి మసక మసక పాత సినిమాగా మారిపోతుంది. నిన్న జనమే జనం అన్న కవిత కూడా మాతృదేశంలో ఉండే సామూహిక జీవనానికి, ఇక్కడి ఒంటరితనానికి తేడా తెలియజేస్తుంది: జనమే జనమైన నిన్న / పరీక్షిత్తులా నేడు / ఒంటి స్థంభం మేడలో నేను. అంతేకాకుండా ఈ ప్రవాసం ‘ప్రయాసపడి మనమే కోరుకున్నది కదా’ అనే ఎరుక కవి కలగజేయటం సమంజసంగా ఉంది. ఇది ఏదో రాజకీయ నిర్బంధం వల్లనో, బ్రతకలేని దుర్భర పరిస్థితుల వల్లనో దేశం విడిచి రావటం కాదు కదా. ఈ స్వచ్చంద ప్రవాసం వల్ల ఇక ఏవిధమైన విక్టిమ్ కార్డు ప్లే చెయ్యటానికి కూడా అవకాశం ఉండదు. ఇది ఎంతోమంది ప్రవాస భారతీయులకు అనుభవమే అనుకుంటాను. అందువల్లనే దీనిని ప్రయాసపడి సాధించిన ప్రవాసంగా గుర్తించటం కవిగా ప్రసాద్ లోని నిజాయితీని ప్రతిబింబిస్తుందని నాకనిపించింది.

ఉదయాస్తమయాలు, పగలు రాత్రులు తరచుగా కనిపించే ప్రసాద్ కవిత్వంలో కాలం గురించి వివిధ సందర్భాలలో చేసిన వర్ణన ఆయా సందర్భాలను బట్టి అందంగా, గంభీరంగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. కాలాన్ని కొలవటమెందుకు, అదేమైనా పరిమితమా?’ అని ప్రశ్నించినా, ‘ఆరుపేటల కాలానికి ఎండా వానా రెండు జడలు’ అని వర్ణించినా హృద్యంగానే ఉంది. ‘కాలం నిత్యభోగం’ అని, ‘జరరుజాలెరుగని నిత్య బాలింత’ అని చెప్పిన నిత్య బాలింత అనే కవితలో కాలం గురించి వరుసగా చెప్పిన విశేషణాలు ఎంతో గాఢంగా, గంభీరంగా సాగుతాయి.

కవిత్వమంటే పొడి మాటలు కాదు. అది రాసే కవికి కవిత్వం మీద, భాష మీద గొప్ప ఆరాధన, గౌరవమూ, ప్రేమా ఉండాలి. అందువల్లనే, ప్రసాద్ ‘కవిత్వం పొడి ఇసుక కాదు’ అని చెప్పటం బాగుంది. తన దృష్టిలో కవిత్వం –

హృదయమగ్నమై,
సహానుభూతమై
సహజాతమైన కల్హార మాల.
ప్రవాళ కాంతి స్ఫటికం

ఇతర కళలకు, అంటే సంగీతం, చిత్రలేఖనం వంటివాటికి స్పందించి రాసిన కవితలంటే నాకు ప్రత్యేకమైన ఆసక్తి. కబీరు, ఆమె, నేను – అని కబీర్ గీతాలను ఆలపించే ఆబిదా పర్వీన్ గురించి రాసిన కవిత ఆకర్షిస్తుంది.

ఈ పుస్తకాన్ని ఆవలి తీరం, ప్రతీరం, సరస్తీరం, సైకత తీరం అని నాలుగు తీరాలుగా విభజించారు. ఈ వర్గీకరణలో అంతరార్థం పూర్తిగా బోధపడలేదు గాని, బహుశా శిల్పరీత్యా గాని, వస్తురీత్యా గాని దగ్గర ఉన్న కవితల్ని ఒకచోట చేర్చారనుకుంటాను. ఇంకా లోతైన వ్యూహమేమన్నా ఉన్నదేమో తెలియదు. ఏది ఏమైనా ఇది ఆసక్తికరమైన అమరికే. నేను కవితల్ని సంపుటిగా కూర్చే సమయంలో, ఒకే రకమైన కవితలు ఒకచోట కాకుండా, వీలైనంత దూరంగా ఉంచటానికి ప్రయత్నం చేస్తాను. అందువల్ల, నాకు ఈ పధ్ధతిలో ఉన్న వైవిధ్యం నన్ను మరింతగా ఆకర్షించింది.

వీటిలో చివరి రెండు – సరస్తీరం, సైకత తీరం – భాగాలలో కవితలు చాలా బాగా వచ్చాయి. సరస్తీరం ఎక్కువగా జ్ఞాపకాల మీద ఆధారపడిన కవితలు కావటం వలన ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక, సైకత తీరంలో కవితల కూర్పు వలన ఆ విభాగానికి ఒక హార్మనీ ఏర్పడింది. సంయోగంలో ఉన్న వియోగం గురించి, ఆ అంతరం కలిగించే ఆవేదన గురించి వర్ణిస్తూ సాగే ఇందులోని కవితలు బిగువుతో, గాఢతతో ఎప్పటికీ గుర్తుండిపోయే కవితలుగా రూపొందాయి. మరీ ముఖ్యంగా, శేషశయ్య, రంగస్థలం మీద, ఒడ్డు లేని మంచం – వంటి కవితలు చెప్పుకోదగినవి. ఉదాహరణకు, శేషశయ్య కవిత ఇలా సాగుతుంది:

ఒకళ్ళ కోసం చేసిన మంచం మీద
ఇద్దరం ఒకటయ్యేం

ఇప్పుడు
ఇద్దరు పట్టే మంచం మీద
మనకే కాదు
గతానికీ
నిశ్శబ్దానికీ
అగాధానికీ
కూడా చోటుంది.

ప్రసాద్ కవితలలో క్లుప్తత గురించి ఇంతకు ముందు చెప్పాను. క్లుప్తత విషయంలో మరొక సాహసం ప్రసాద్ చేశారని నాకనిపిస్తుంది. అది, పదాలకే కాకుండా, పద చిత్రాలకు కూడా దానిని వర్తింపజేయటం. అంటే, కొన్ని పరిమితమైన పరికరాలతోనే కవిత్వం చెప్పే ప్రయత్నం చెయ్యటం. ఉదాహరణకు అద్ధం, ఉదయాస్తమయాలు, నడక, ఇంద్రధనుస్సు వంటివి ఈ కవితలలో తరచుగా కనిపిస్తాయి. కవితలను విడివిడిగా చదివినప్పుడు మనం దీనిని గమనించకపోవచ్చు గాని, ఒక సంపుటిలో వీటిని వరసగా చదివినప్పుడు మన దృష్టికి వచ్చే అవకాశం ఉంది. ఆయా పదచిత్రాల మీద కవికున్న మమకారం దీనికి ఒక కారణం కావచ్చు. ఏమైనాగాని, కొన్ని పరిమితమైన పరికరాలతోనే ఇంత వైవిధ్యం కలిగిన కవితలు రాయగలగటమే చెప్పుకోవలసిన విషయం. అవే గాజుముక్కలు కెలైడోస్కోప్‌లో లెక్కలేనన్ని ప్రతిరూపాల్ని కల్పించినట్టు, అదే ఇనుప రజను దిశని, ఆకర్షణ శక్తిని బట్టి వివిధ అయస్కాంత చిత్రాలను సృష్టించినట్టు అవే పరికరాలతో చేసిన విభిన్నమైన, మనోహరమైన కవితా సృష్టిని ఈ పుస్తకంలో చూడవచ్చు.


ఇక నేను చెప్పబోయే రెండో పుస్తకం, మిత్రుడు రవూఫ్ రాసిన ఒక పరి హత్తుకుపో అనే కవితా సంపుటి. తన మొదటి కవితా సంపుటి అంతర్నేత్రంతో మంచి గుర్తింపు సాధించిన రవూఫ్ తర్వాత కాలంలో కొంత విరామం తీసుకుని ఈ మధ్య అంటే ఈ సంవత్సరమే తీసుకువచ్చిన పుస్తకం ఇది. వివిధ సందర్భాలలో, పరిస్థితులలో కవికి కలిగిన భావాలు ప్రతిబింబించే ఈ సంపుటిలో అక్కడక్కడా ఒక ద్వైదీభావం తొంగిచూస్తుంది. ఆశ-నిరాశ, ప్రేమ-ప్రేమ రాహిత్యం, అంతర్ముఖీనత- జనం ప్రపంచం – ఇలా కొన్ని వ్యతిరేక భావాలు వివిధ కవితల్లో వ్యక్తపరచడం మనం చూడవచ్చు. ఇందులో అంతర్జనం అనే మాట ఒకటి వాడారు. (ఈ శీర్షికతో ఇదివరకు శివారెడ్డి కవితా సంపుటి ఒకటి వెలువడింది.) అంతర్జ్వాల, లోపలి వాన వంటి వాటితో పోలిస్తే అంతర్జనం అనే మాట కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఈ లోపలి జనం ఎవరు? బహుశా మన ముందు లేకపోయినా మన తలపుల్లో నిలిచిపోయే బంధువులు, స్నేహితులు, మనం చూసిన సినిమాలలో పాత్రలు లేదా మనం చదివిన కథలు, నవలల్లోని పాత్రలు మొదలైనవారు కావచ్చు.

ఈ పుస్తకానికి శీర్షికగా ఉన్న కవితలో కూడా ద్వైదీభావం కనిపిస్తుంది. ఎవరు నిన్ను అంటూ ఒక స్నేహరాహిత్యంతో మొదలై కరవాలాల కరచాలనాలనే ఒక బిట్రేయల్ గురించి కూడా చెప్పే పద్యం ఎలా ముగుస్తుందని మనం అనుకుంటాం? అదే టోన్‌లోనో లేదా అంతకు మించిన తీవ్రతతోనో అని కదా. కానీ, ‘నువ్వు ఆకాశ ఛత్రమై అల్లుకుపోయి కొట్టుకులాడుతున్న ప్రతి హృదయాన్ని స్పృశిస్తూ ఈ లోకం యావత్తుని హత్తుకుపో‘ అంటూ ముగించటం పూర్తిగా వ్యతిరేకమౌతుంది. బహుశా రవూఫ్‌లో ఉన్న అనుకూల దృక్పథం, ఈ లోకం పట్ల, చుట్టూ ఉన్న వారి పట్ల అప్రతిహతమైన ప్రేమ దీనికి కారణం కావచ్చు. ‘చార్మినార్ పట్టెడు ప్రేమ కోసం నాలుగు చేతులు సాచింది’ అనటం ఇటువంటిదే. తాజ్ మహల్‌లో ఎవరైనా ప్రేమను చూడవచ్చు కానీ చార్మినార్‌లో ప్రేమను చూడాలంటే ఒక అంతర్నేత్రం కావాలి. లేదా మరొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రేమరాహిత్యంతో బాధపడే వారికి కూడా తాజ్ మహల్ ప్రేమని పంచి ఇస్తోందని, అటువంటి ప్రేమను చార్మినార్ అర్ధిస్తోందని మనం అనుకోవచ్చు. ఈ అనుకూల స్వభావమే మరొక కవితలో కనిపిస్తుంది. సాధారణంగా మనం పని ముగించుకొని సాయంకాలం రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు అలసటతోనో, విసుగుతోనో ఉండటం సహజం. అటువంటి సందర్భంలో భుజానికి తగిలించుకున్న సంచిలో ‘గుప్పెడు నక్షత్రాలు, దోసెడు వెన్నెల కాంతులు ఒకటో రెండో కవితాక్షరాలు’ ఉంటాయని చెప్పే కవి తన వృత్తిని, ప్రవృత్తిని ఎంతగా ఆస్వాదిస్తున్నాడో అని మనం ఆశ్చర్యపడవలసి వస్తుంది. ఈ రకమైన అనుకూలత వైదేహి శశిధర్ కవిత్వంలో కూడా కొంత ఉంటుంది. రోజంతా పేషంట్లని చూసి ఇంటి ముఖం పట్టినప్పుడు, అందులోనూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే ఇక చెప్పక్కర్లేదు, చాలా చిరాకుగా ఉంటుంది. కానీ దానిని ‘కార్ల హారాలలో పగడపు పూసనై చిక్కుకున్నాను’ అని వర్ణిస్తారు. ఇది చదివినప్పుడు ఆవిడ సహనానికి మనసులోనే జోహార్లు చెప్పకుండా ఉండలేకపోయాను.

ఎలాగూ వేరే కవితతో పోలిక వచ్చింది కాబట్టి అదే తరహాలో మరో రెండు మూడు కవితలను తులనాత్మకంగా పరిశీలిస్తాను. కారణం అనే కవితలో రవూఫ్ ప్రేమను గురించి కొద్ధి మాటల్లో చెపుతారు. ‘చెట్టు కారణాలు అడగదు పూస్తుంది’ అని మొదలుపెట్టి చివర్లో కేవలం ప్రేమనే కాక జీవించటం, మరణించటం అనే మరొక రెండు కూడా చేర్చడం వల్ల ఈ కవితకు కొంత బలం ఏర్పడి, పద్యం కాంతివంతం అయిందని చెప్పవచ్చు. ఇటువంటిదే కృష్ణశాస్త్రి పద్యం ఒకటి ఉంటుంది:

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

ఈ పద్యం చదివితే కృష్ణశాస్త్రి ప్రేమ నిష్కామమైనది మాత్రమే కాదు నిష్కారణమైనది కూడా అని మనకు అర్థమౌతుంది!

ఇస్మాయిల్ మార్క్సిస్టుల్ని ఆట పట్టించటానికి వ్యంగ్యంగా రాసిన కొన్ని మినీ కవితల్ని మినహాయిస్తే, ఆయన సీరియస్‌గా రాసిన ఒకే ఒక రాజకీయ కవిత బోటులో టాగోర్. టాగోర్ రాసిన కథల ప్రస్తావనతో మొదలయ్యే ఈ కవిత ‘పద్మానదిని విడగొట్టి పంచుకున్నప్పుడు టాగోర్ ఎన్ని వికృత శబ్దాలు’ అంటూ పార్టీషన్ గురించి చెప్పి, చివర్లో ‘జబ్బులతో ఆకలితో ఉబ్బిన పిల్లల పొట్టల డోళ్ళు’ అంటూ పేదరికం గురించి ప్రస్తావిస్తూ ముగిస్తుంది. రవూఫ్ బహుశా ఈ కవితను దృష్టిలో పెట్టుకుని ‘పద్మానదిపై బోటులో’ అనే కవిత రాశారు. అయితే ఇది పూర్తిగా భిన్నమైన కవిత. ఇందులో నది రవీంద్రుని కవిత్వంతో, రవీంద్ర సంగీతంతో పులకితం కావడం, సంతాలీ తెగకు చెందిన ఆదిమ స్త్రీ గళంతో స్వరం కలపటం వంటి వాటి వర్ణన ఉంటుంది.

శిఖామణి మువ్వల చేతికర్ర సంపుటిలో పూలకుర్రాడు అనే ప్రసిద్ధ కవిత ఉంటుంది. వీధి వీధికి సైకిల్ మీద తిరుగుతూ పువ్వులమ్ముకొనే సలాది బుల్లెబ్బాయి అనే అతని గురించి రాసిన కవిత ఇది. శిఖామణి కొన్ని కవితల్లో కనిపించే రొమాంటిసైజేషన్, సెంటిమెంటాలిటీల వంటివి ఈ కవితలోనూ ఉంటాయి. ఉదాహరణకి ఆ అబ్బాయి తన ‘కన్నీళ్ళని చల్లి ఆ పువ్వులు వాడిపోకుండా కాపాడతాడు’ వంటి వాక్యాలు. రవూఫ్ ‘నడిచే పూల తోట’ అటువంటి వ్యక్తి గురించి రాసినదే. ఆమె తోపుడు బండిమీద పూలు పెట్టి తోసుకుంటూ వీధి వీధికి తిరుగుతుంది. ఇందులో సహజవర్ణన ఎక్కువగా కనిపిస్తుంది. ‘అదేమిటో సాయంత్రమైనా ఆ పూలు వాడిపోవు’ అని మాత్రమే ఉంటుంది. ‘వాడి వడలిన పువ్వుల ధైన్యం లాంటి జీవన విషాదం ఆమె తోసుకు వెళ్ళే బండికి మటుకే తెలుసు’ అనటంలో దుఃఖపు జీర లాంటిది తొంగిచూస్తుంది.

మనుషుల గురించి రాసే కవితల్లో రెండు మూడు రకాలు ఉంటాయి. మొదటిది వివిధ వృత్తుల్లో పనిచేసేవారికి ప్రతీకగా వారిలో ఒకరిని తీసుకుని చెప్పటం. పై కవిత దానికి ఒక ఉదాహరణ. ఇలా రకరకాల వృత్తుల వారి మీద కవితలు రాయటం ఒక సమయంలో బాగా ప్రాచుర్యంలో వచ్చింది. వీటి మీద ప్రధానంగా వచ్చిన విమర్శ ఏమిటంటే వీటిలో ఇందాక చెప్పినట్టు రొమాంటిసైజేషన్, సెంటిమెంటాలిటీ ఎక్కువగా ఉండటం. రవూఫ్ ఈ పుస్తకంలో పూలమ్మే ఆవిడతో బాటు తన చిన్నప్పటి కాలంలో వీధి దీపాలు వెలిగించేవాడు, టూరింగ్ టాకీస్ సినిమాల గురించి బండిలో తిరుగుతూ ప్రచారం చేసేవాడు, జాలరివాడు ఇలా వివిధ వృత్తుల వారి గురించి రాసిన కవితలు ఉన్నాయి. వీటన్నిటిలో సహజత్వం సంయమనంతో కూడిన వర్ణన మనం చూడవచ్చు. వీటన్నిటిలోను ‘వలలో సూర్యుడూ చంద్రుడూ’ అనే జాలరి గురించి చెప్పే కవిత ఉత్తమమైనదని నేను భావిస్తాను.

మనుషుల గురించి చెప్పే మరొక రకం కవితలు మనకు వ్యక్తిగతంగా తెలిసిన బంధువులు, మిత్రులు అయినవారి గురించి రాసేవి. ఇందులో తాతగారి గురించి రాసిన కవిత ఒకటి ఉంది. ఇందులో ప్రత్యేకంగా అనిపించిన అంశం ఏమిటంటే అది ఆయన బహుముఖీనమైన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పటమే కాకుండా, ఆయన జీవిత గమనాన్ని కూడా కొంత నేరేటివ్ స్టయిల్‌లో చెప్తుంది. ఇది రవూఫ్ కవిత్వంలో కొత్తగా కనిపిస్తున్న అంశం. ఒక విధంగా చెప్పాలంటే కేవలం ఎప్పుడు రెండు పేజీలకి పరిమితమై క్లుప్తంగా సాగే మ్యాక్సీ తరహా కవితలే కాకుండా రూపపరంగా కొంత స్వేచ్ఛ తీసుకుని విస్తృతపరుచుకొనే ప్రయత్నం ఇందులో కనిపించింది. మో, శేషేంద్రలు రాసినట్టు పేరాల కవిత కూడా ఒకటి ఇందులో ఉంది. అలాగే కొన్ని మినీ కవితలు. ఇవన్నీ రూపం విషయంలో రవూఫ్ చేస్తున్న ప్రయోగానికి వైవిధ్యానికి తార్కాణంగా నిలుస్తాయి.

నిజజీవితంలోని వ్యక్తులే కాకుండా సాహిత్యంలోనూ సినిమాలు నాటకాల్లోనూ తారసపడే పాత్రలు కొన్ని మనల్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టు ‘అంతర్జనం’లో ఈ పాత్రలు కూడా చేరి జీవితాంతం మనతో సహవాసం చేస్తాయి. పౌరాణిక చారిత్రక వ్యక్తుల గురించి జాషువా, కరుణశ్రీ వంటివారు రాసిన ఖండికలు ఉన్నాయి. అందులో కొన్ని ఒక పాత్ర స్వయంగా మాట్లాడుతున్నట్టుగా రాసినవి ఉంటాయి. కరుణశ్రీ రాసిన ‘కన్నీళ్ళతో ప్రభువు కదలిపోతున్నాడు/ ఎన్నాళ్ళకు ఇక మాకు పునర్దర్శనము’ అన్నది కరుణాత్మకంగా సాగుతుంది. మెడికోశ్యామ్ తాతగారు చిర్రావూరు కామేశ్వర రావుగారు రాసిన పద్యాలపుస్తకంలో కౌసల్య స్వగతంతో ‘కౌసల్యా విలాపము’ అనే పేరుతో ఒక ఖండిక ఉంటుంది. అయితే వచన కవిత్వంలో ఈ విధంగా పాత్రల ఆధారంగా వచ్చిన కవితలు చాలా తక్కువగా ఉంటాయి. రవూఫ్ చివరకు మిగిలేదిలో దయానిధి గురించి, అన్నా కరెనీనాలో నాయకి గురించి రాసిన రెండు బలమైన కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ రెండు నవలలు చదివినవారికి ఈ కవితలు ఎంతో ఆలోచన కలగచేస్తాయి.

కవిత్వం రాస్తున్న మొదటి రోజుల నుంచి ఇప్పటి వరకు రవూఫ్ కాపాడుకుంటూ వస్తున్నది చెక్కుచెదరని సౌందర్య దృష్టి. ‘ముంచెత్తుతోంది వెల్లువలై వెన్నెల’ వంటి కవితల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అదే రాత్రిని ఎడ తెగని రాత్రిగా చెప్పే నిరాశామయమైన కవితలు కొన్ని పరిమితంగా ఉంటాయి. అలాగే జీవితం మీద గడిచిపోయిన కాలం మీద ఎక్కడో ఒకటి రెండు చోట్ల ‘కాలం గుప్పిట్లోంచి ఇసుకలా చేజారి పోయిం’దని, ‘జీవితం సితార ఏదో ఒక విషాద మార్మిక మౌనరాగాలు పోతూ ఉంద’ని అన్నా కూడా మళ్ళీ వెంటనే మరొక చోట ‘యవ్వనం కరిగిపోయిందని బాధ లేద’ని చెప్పటం కూడా ఉంటుంది.

మొత్తం మీద రవూఫ్ కవిత్వం వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించిన ఆశావహమైన ప్రకటనే అని నాకనిపిస్తుంది. అందుకే ‘పడటం లేవటం ఉన్నా కుంగిపోకుండా, ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఎగిరెగిరి చూసే సముద్రం’ ఈయన కవిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని భావించవచ్చు. దానికి తగినట్టుగానే ఇందులో సముద్రం గురించి రాసిన కవితలు నాలుగైదు వరకు ఉన్నాయి. సముద్రాన్ని అంతగా ఇష్టపడటం, ‘సముద్రం నాలోనే ఉంద’ని చెప్పుకోవటానికి కారణం ఇదే కావచ్చు. చివరగా కొత్త కవిత కాకపోయినా అనుబంధంలో ఉన్న ఒక కవిత గురించి చెప్పుకోవాలి. ఈ కవిత పేరు అర్ధాంగి. ప్రేయసి మీద కవిత్వం రాసిన కవులు ఎంతోమంది ఉన్నారు కానీ భార్య మీద ఆవిడ బతికి ఉండగానే రాసినవారు చాలా తక్కువ. అయితే రవూఫ్ చాలా ముందుచూపుతో ఎప్పుడో 80, 90ల లోనే కాబోయే అర్ధాంగి మీద రాసిన కవిత ప్రత్యేకమైనది. ఇందులో ఆర్. ఎస్. సుదర్శనం ఇష్టపడిన ‘నన్ను నేను కోల్పోయి వెతుకులాడితే తనలో స్ఫురిస్తానట’ అన్న వ్యక్తీకరణ బాగుంది.

తమ్మినేని యదుకుల భూషణ్ ఎప్పటిలాగే తన లోతైన విశ్లేషణతో ‘తానే ఒక దీపమై…’ అంటూ రాసిన ముందుమాట ఈ పుస్తకానికి అదనపు విలువ సమకూరుస్తుంది. మొత్తం మీద వైవిధ్యభరితమైన కవితలతో చాలా కాలం తరువాత రవూఫ్ నుంచి ఈ కవితా సంపుటి వెలువడటం ఒక ఆహ్వానించదగిన పరిణామంగా భావిస్తాను.