ద్వైతం

నువ్వు వెడతానంటావని తెలుసు గానీ ఇంత త్వరగా అని అనుకోలేదు.

నిజం చెప్పు. అసలు నేను వెడతానన్న ఆలోచనే నీ దరిదాపులకి రాకుండా ఎన్నాళ్ళు గడిపావ్?

అదేమన్నా పండగ చేసుకునే విషయమా ఎదురుచూస్తూ కూర్చోడానికి?

అటు నీ రాకనీ సెలబ్రేట్ చేసుకోలేదు, ఇటు నీ పోకని నిశ్శబ్దంగా చూస్తూ కూర్చునేందుకు తప్ప వేరే అవకాశాన్నీ పొందట్లేదు.

చూడగలనని అనుకుంటున్నావ్, అంతే!

ఎందుకు చూళ్ళేను?

ఫాతిమా కూడా ఇలానే వాదించింది.

అప్పుడేం చెప్పావ్?

ఇప్పుడు చెబుతోందే!

ఏమిటి, చిర్నవ్వా?

నాలో లేనిది అక్కడేం దొరుకుతుంది నీకు?

ప్రతీ ఏడాదీ కొత్త ఆవకాయ ఎందుకు తింటావు?

నీకేమన్నా గ్యారంటీ వున్నదా, నా దగ్గర దొరకనివి అక్కడ దొరుకుతాయని?

ఇక్కడ దొరకనివి అక్కడ దొరకవచ్చు. ఇక్కడ దొరికినవి అక్కడ కొరవడనూ వచ్చు.

నిన్ను ఆపడానికి ఎంత కష్టపడ్డాను! ప్రతీసారీ కానుపులో నీకోసం కాదూ యుధ్ధం చేసింది?

శాంతి మొదటి కానుపులో రెండ్రోజుల ప్రసవవేదన నాగ్గుర్తుంది.

మరి? మూడు కానుపులు విజయవంతంగా. నాకేమన్నా అవార్డు లిచ్చావా మరి?

నేను నీతోనే వుండడం అవార్డు గాక మరేమిటి?

ఆ యాక్సిడెంటు అయినప్పుడు – అంత రక్తం పోయి, ఒళ్ళంతా గాయాలతో – ఐ.సి.యూ.లో కళ్ళు తెరవకుండానే వారంరోజులు పోరాడి తర్వాత నెలరోజులు ఇంట్లో మంచానికి బందీ అయి – నీకోసం కాదూ?

నీకు బందీని అయిన నాకోసమా?

బందీ నంటావ్? దేనితో బంధింపబడ్డావో చెప్పు? గాలితోనా, నీటితోనా, ఇంకేవేవో వుండాలి -వాటితోనా? అయినా, నువ్వు నాకు బందీ వయితే నా చెర నుంచీ విడిపించుకునేటందుకు నువ్వు కదా యుధ్ధం చెయ్యవలసింది? నీ ప్రయత్న మేమీ లేకుండా నేను గెలిస్తేనే నాతో వుంటా ననడం, ఓడిపోతే వీడిపోతా ననడం – నా కిదేమీ సమంజసంగా కనిపించడం లేదు!

ఈ రూల్స్ నేను పెట్టిన వనుకున్నావేమిటి? ఫాతిమాకి తప్పనప్పుడు నీకు మాత్రం ఎలా తప్పుతుంది? ఆమె అయితే ఒక చిన్న యుధ్ధానికే – ఫినిష్!

ఎంచక్కా ఆనందించి వుంటావ్!

నాకన్నా నువ్వే ఎక్కువ ఆనందించాలి – అందువల్లే నీకు నా పొందు దొరికినందుకు.

అందుకే – ఈ పొందుని కాపాడుకోవడానికే – ఈ యుధ్ధం!

నీ యుధ్ధానికి నాకు రింగ్‌సైడ్ సీటిచ్చావు కదా!

ఇది నీకు అలవాటైన సీటే కదా! నా దగ్గరే నీకు ఈ సీటు మొదటిసారి కాదు. పైగా, అంతకు ముందు ఎలాగో ఫాతిమా వుండనే వుంది.

కరక్ట్. కానీ, ఫాతిమాదీ ఒక యుధ్ధమేనా అనిపిస్తుంది నీ పోరాటాన్ని చూస్తుంటే.

యుధ్ధం చూడడం నీకిష్టమా?

అది నాకు తప్పని పని.

నువ్వు చూసిన యుధ్ధాల గూర్చి చెప్పు.

గాలితో చేసినవాళ్ళు కొందరు. నీటితో చేసినవాళ్ళు కొందరు. అగ్నితో యుధ్ధం చేసినవాళ్ళు మరికొందరు. భూమితో యుధ్ధం చేసినవాళ్ళు ఇంకొందరు. మరీ వెనక్కు వెడితే – పైన చెప్పిన వాటిల్లో ఒకదానితో అని కాకుండా కొన్నింటితోనూ లేక అన్నింటితోనూ కలిపి ఏకకాలంలో చేసినవాళ్ళు కూడా వున్నారు.

నా అంతలా యుధ్ధం చేసిన వాళ్ళెవరయినా వున్నారా?

నా మానాన నన్నుండనివ్వకుండా “రా, రా, వచ్చి చూడు!” అంటూ క్షణాని కోసారి వేధించిన వాళ్ళూ వున్నారు.

పోనీలే! నేను నిన్ను అంతగా వేధించలేదు గదా! ఏదో అప్పుడప్పుడూ మాత్రమే ఇలా. మరెందుకు వెడతానంటున్నావ్?

నీతో నాకు పనయిపోయింది.

నీకోసమే పెట్టి పోషించిన దాన్ని. వయసొచ్చినా అందమేం సన్నగిల్లలేదు. వయసు తెచ్చిన మిసిమి తప్ప అంత లావూ కాను. ముగ్గురు పిల్లల్ని మోసిన ఛాయలు పొత్తికడుపు మీంచి తీయలేని మాట నిజమే. అంతమాత్రాన –

పిల్లలని నాకోసం కన్నావా?

నా యవ్వనాన్ని నువ్వు హరించావ్. నా శరీరాన్ని నిర్దాక్షిణ్యంగా వాడుకున్నావ్.

కాదు. నీ యవ్వనాన్ని నువ్వు ఆనందించావ్. దానికై నీ శరీరాన్ని నువ్వు వాడుకున్నావ్. నువ్వు లేకుండా నాకు ఆనందం లేదు. నీ ప్రమేయం లేకుండా నాకు కలగని దుఃఖం లేదు.

నీ ఆనందానికి గానీ దుఃఖానికి గానీ నన్ను కారణం చెయ్యడం – నీలాంటి వ్యక్తిని నేనయ్యుంటే మాత్రం ఆశ్చర్యపడాల్సిన విషయం. నీ యుధ్ధాన్ని చూస్తున్నట్లే నీ ఆనందాన్నీ, దుఃఖాన్నీ చూశాను – అన్నింటికీ రింగ్‌సైడ్ సీట్లేగా మరి! కాదులే, ఆ పెర్ఫార్మన్స్‌కి స్టేజీ ముందర మొదటి వరుసలో మధ్య సీట్లో కూర్చొని –

కేవలం దుఃఖాలకీ ఆనందాలకీ తప్ప అసలైన కళా ప్రదర్శనలకి వేటికీ నిన్ను స్టేజీ ముందర కూర్చోబెట్టలేకపోయానని నాకు విచారంగా వున్నది – ఇప్పుడే కాదు, ఎప్పటినించో! నవ్వకు – నా ఖర్మ కాలి ఇలా మంచానికి బందీ నయి కళ్ళు మూతలు పడినప్పుడే నాకు సంగీతమూ, నృత్యమూ ఏవీ రావు అని గుర్తుకొచ్చి బాగవగానే ఈసారి తప్పకుండా నేర్చుకోవాలని అనిపించేది. తరువాత లేస్తానా, అదేమిటో, వాటి విషయమే పూర్తిగా మర్చిపోతాను. పోనీ, ఫాతిమాకి అవేమైనా వచ్చా?

మంచి డాన్సర్. వినసొంపైన గొంతు. ప్రతీ మగాడూ కావాలని కోరుకునేటంత లావణ్యం గల శరీరం.

అయితే ఏదో తప్పు చేసుంటావ్. లేక, కొంపదీసి, ఆమే నిన్ను వెళ్ళగొట్టిందా? లేకపోతే నువ్వు నాకు దొరకడం… తను చేసినట్లు చికెనూ, మటనూ, ఏవీ వండిపెట్టలేకపోయాను.

తనకి వంటే రాదు. నవాబు చెరలో నలిగింది. నచ్చిన వాడితో పారిపోతున్నప్పుడు నవాబు గారి సైనికుడు విసిరిన బాకు – అదిప్పుడెందుకులే. తను నాకేం వండిపెట్టలేదు.

తినిపించి వుంటుంది కదా!

అవుననుకో. వాళ్ళమ్మ చేసినవి తినిపిచ్చింది. కానీ, ఆవకాయా, మజ్జిగపులుసూ, బూందీ లడ్డూ ఆమె దగ్గర దొరకలేదు మరి.

పోనీ, నీకు ఆ చికెనూ, మటనూ వండిపెడితే నిన్ను ఆపగలనా?

ఇంకా నయం – సంగీతమూ, డాన్సూ నేర్చుకోవడం మొదలు పెడతానన్నావు కాదు!

కొత్త వంటలు నేర్చుకోగలనన్న నమ్మక ముంది గానీ కొత్త కళలు నేర్చుకో గలనన్న ధీమా ఏమాత్రం లేదు. పైగా, వంట సరిగ్గా కుదరకపోతే అవతల పారెయ్యొచ్చు. సంగీతం అయితే అదేదో కొద్దిగా నయినా వంట పట్టేదాకా అపశ్రుతులనీ, లయ లేకపోవడాన్నీ అనుక్షణం భరించక తప్పదు కదా! అలా చేస్తే నిన్ను ఇంకా తొందరగా వెళ్ళగొట్టినట్లవుతుందేమో! డాన్స్ కూడా జీవితకాల సాధన అనే విన్నాను. అది కూడా వచ్చే అవకాశమే లేదు – – ఈసారి కళ్ళు తెరిచినప్పుడు గుర్తుండి సాధన చేద్దా మనుకున్నా గానీ – పైగా ఈ వయసులో! పోనీ, సాహిత్యం?

ఫాతిమాకి సాహిత్యంతో పరిచయం లేదు.

పోనీ, నేను మొదలుపెడితే అని?

సాహిత్యంలో మరియా ఆల్బర్ట్ లెవల్‌తో మాత్రమే నాకు పరిచయం.

ఆమెవరు?

ఒక స్పానిష్ వనిత.

ఇంటర్నేషనల్ టచ్ వున్న నిన్నాపడం నాకిక సాధ్యం కాదనుకుంటాను. సంగీతం అంటే ఒకళ్ళు పాడితే ఇంకొకళ్ళు వినొచ్చు. డాన్స్ ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు చూడొచ్చు. ఆ కుతూహలంతో అడుగుతున్నాను. సాహిత్యపరంగా – ఏం చేసేవాళ్ళిద్దరూను?

తను చదువుతూండేది. నేను అర్థంచేసుకుంటూ కూర్చునేవాణ్ణి. బందీలు అంతకన్నా ఏం చెయ్యగలరు?

ఏం చదివేది?

స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు సాహిత్యం.

నేనేమో, మహా అయితే తెలుగు పత్రికలు చదువుతూ, టీవీముందు కూర్చుని సీరియళ్ళని చూస్తూ – నిన్ను బాగా బాధపెట్టాను కదా?

చెప్పాగా, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకుంటయ్యని! నీకు వీలవుతే ఎవర్ని పెళ్ళి చేసుకునేదానివి?

హృతిక్ రోషన్‌ని. సచిన్ తెందూల్కర్‌ని. సూర్యారావుని.

మొదటి ఇద్దరూ అందరికీ తెలుసు. సూర్యారావంటే – కాలేజీలో క్లాస్‌మేట్ – అతనేనా?

అతనే.

మరెందుకు చేసుకోలేదు?

ఆస్తిపాస్తుల్లేవు. ఉద్యోగమూ అంతంత మాత్రమే నన్నారు అమ్మా, నాన్నా. అలా వాళ్ళ మాటలకి తలొగ్గడం తప్పనిపించింది గానీ, తరువాత –

నీకు తెలియని దేముందీ? ఉన్న ఊళ్ళోనే అప్పుడప్పుడు కనిపిస్తూనే వుంటాడు కదా! అతని సంసారం డబ్బుకోసం పడే ఇబ్బందులని చూసిన తరువాత ఆ నిర్ణయం సరయినదేనని ఒకవైపూ, డబ్బుకోసమేనా ఇంకో మనిషి పొందుని కోరేది అని ఇంకోవైపూ – అవునూ, ఇది డ్రామా గనుక నేను నిన్ను ఒక పెర్ఫార్మెన్స్ ఆర్ట్ కయినా ఎక్స్‌పోజ్ చేసినట్లే లెఖ్ఖ. హమ్మయ్య! ఇంకా నీకేమీ ఇవ్వలేకపోయానని బాధపడుతున్నాను. ఇప్పటికి కొంచెమయినా వూరట కలుగుతోంది.

…నానుంచి పారిపోవాలని నువ్వెంత పట్టుదలతో వున్నావో, నేనంత గట్టిగా పట్టుకుని నిన్నాపుతున్నాను. నేను కొత్తగా ఇవ్వగలిగినది ఏమీ లేనప్పుడు కూడా నిన్ను ఇంతసేపు ఆపగలగడం నా గొప్పదనం వల్లనా, నన్ను విడిచిపోలేని నీ నీరసం వల్లనా?

ఒక్కోసారి వేరేవాళ్ళ సహాయం తీసుకోవడం తప్పనిసరి అవుతుందని ఫాతిమా విషయంలో తెలుసుకున్నాను గదా! ఇప్పుడలాంటి సహాయం నాకు మళ్ళీ అవసరమవుతోంది.

ఇప్పటిదాకా ఏవో ఆలోచనలూ, ఆశయాలూ, ఆవేశాలూ లేనట్లే మాట్లాడావు కానీ, నీకు నన్ను వదిలేసి ఏ క్షణాన పారిపోదామా అని వుంది!

నిజమే. ఇంతమంది పొందులో ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఒక ఐన్‌స్టీన్‌కో, ఒక బాలమురళీకృష్ణకో, ఒక లతా మంగేష్కర్‌కో, ఒక శోభానాయుడికో, ఒక స్టీఫెన్ హాకింగ్‌కో, ఒక శ్రీశ్రీకో, ఒక షేక్స్‌పియర్‌కో, ఒక సచిన్ తెందూల్కర్‌కో, చివరాఖరుకి కనీసం ఒక హృతిక్ రోషన్‌కో ఆలంబన కాలేకపోతానా అనుకున్నాను. కాలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్ నాకు చికాకుని తెప్పిస్తోంది. మరియా ఆల్బర్ట్, ఫాతిమా, నువ్వూ – ఈ సామాన్యులే నాకెందుకు తగుల్తూంటారు? నాకెప్పుడు విముక్తి?

నీ విముక్తి సంగతి నా కనవసరం. నేను నిన్ను వదలను, అంతే. చూడు – ముక్కులోకి వెడుతున్న ఈ గాలి ఆగే ప్రశ్న లేదు. అలాగే, నీళ్ళూ, నువ్వు చెప్పిన, భూమీ – అంటే, దాన్నుండీ మొలిచిన మొక్కలతో చేసిన పదార్థం – నా వంట్లోకి క్రమబధ్ధంగా వెడుతూనే వున్నాయి. నన్నొదిలేసి ఎలా వెడతావో?

పిచ్చిదానా! నా విముక్తి నీ చేతుల్లో వున్నదనుకుంటున్నావా? రింగ్ సైడ్ సీటున్నప్పుడు ప్రేక్షకుడు వెళ్ళిపోవడం రెండు విధాలుగా జరగొచ్చు – ఒకటి తనంతట తానుగా వెళ్ళిపోవడం వల్ల; అయితే, అది నా చేతుల్లో లేదు. రెండవది, యుధ్ధం ఆగిపోవడంవల్ల. ఆ రెండవపని చెయ్యడానికే సహాయాన్ని తీసుకోబోతున్నాను. చిటికె వేస్తున్నాను చూడు. బయటివాళ్ళు – నువ్వు నీవాళ్ళే ననుకుంటున్న వాళ్ళు – నాకు సహాయం చేస్తారు. నీకు చిన్న కన్సొలేషన్. ఇది నీ అనుమతితోనే జరగబోతోంది.


“ఆవిడ నెలరోజులబట్టీ కోమాలో వున్నారు. బ్రెయిన్ డెడ్ అని మా డాక్టర్లూ, మీరు పట్టుకొచ్చిన డాక్టర్లూ అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఆవిణ్ణి ఇట్లా ఆక్సిజన్ మాస్కుని మొహానికి తగిలించీ, ఫీడింగ్ ట్యూబుని పెట్టీ ఇంకా లైఫ్ సపోర్టు మీద వుంచడం వల్ల ప్రయోజనమేమీ కనిపించట్లేదు. మా హాస్పిటల్ ఖర్చులని భరిస్తూ ఇట్లాగే కొనసాగించమంటే అలాగే చేద్దాం. కాకపోతే, ఆ లైఫ్ సపోర్టుని తొలగించడానికి మేమీ క్షణాన రెడీ!”

“ఈ కుటుంబంలో ఎవరూ – ఆవిడ భర్తే గాక కూతుళ్ళు గానీ వాళ్ళ భర్తలు గానీ ఎవరూ కూడా – నోరు విప్పి ఆ మాట చెప్పలేరు. ఇలా మంచం మీద పడివుండడం తన కిష్టం లేదనీ, ఆ లైఫ్ సపోర్టుని తొలగించడం డాక్టర్ల నిర్ణయం మేరకు అమలు జరపాలనీ ఆవిడ ఎప్పుడో విల్లు రాశారు. ఆ విల్లులోని వివరాలని తెలియజెయ్యడం వాళ్ళ లాయరుగా నా బాధ్యత. దాన్ని అమలు జరపండి!”