కూడికకు రొండుపక్కల

1.

బైలెల్లుడుకే తీర్మానం జేసుకున్నంక వత్తవత్త ఇంటిని కాలబెట్టి అడుగు బైటపెడుతం. తిరిగి వచ్చేదన్క ఇంటి కుంపటిల కుతకుత ఉడికిపోతయి లోపలి పానాలన్నీ! మంటపెట్టందే సందు దొరకదు. ఆత్మీయంగ అల్లుకున్న ప్రేమపాశం తీగలన్నీ కాళ్ళకు అడ్డంబడుతయి. బెల్లంగొట్టిన రాయిలెక్క ఒక్కకాన్నే వుండలేనితనం. కాలు నిలువదు. తెగదెంపులు జేసుకున్నంత పనైతది.

2.

తొవ్వపొడుగూత బోతాంటె కలవబోయే ఆరాటాలను మంచానికి నులకనల్లినట్టు వొడుపుగ ఇగురంతోటి మ్యానిఫెస్టో తయారై మెడకోలు బరువైతది. గున్నగున్న నడ్శి బిన్నబోయినా సుత భారీ బహిరంగసభల రాజకీయ నాయకుడి ఆగమనం తీరైతది. వాడిపోవడానికి తయారుగున్న పువ్వుల్లా సోపతిగాళ్ళు ఎదుర్కోల్ల మతాబులు పేల్చి అలాయ్ బలాయ్ దీసుకుంటరు. మందలిచ్చె తీరుగ మందలిచ్చి ఇంకోపాలి తీరుబడి యవ్వారం కూడదని మాట దీసుకుంటరు.

3.

ఎప్పుడు మాటల బుడుగులో దిగబడిపోతమో అస్సలు పెయి మీద సోయి వుండదు. మొగలి పొట్టెల కమ్మటి వాసనల్ని గుండెల నిండుగ నింపుకుంట కాలపరీక్షకు హాజరై ఎదురు నిలబడతం. పొంటెలు పొంటెలు ముచ్చట్లల్ల మునిగి బతుకు గొప్పదనం మీద దీర్ఘకావ్యాలల్లి పాడుకుంట సాగిపోతనే వుంటం. గిందుకే గద గంటలు గంటలు తీరుబడిగొచ్చే దోస్తుకోసం ఆగమాగమై సందులు గొందులు కలెదిరిగింది! బీరపువ్వు నవ్వులకోసం పెయ్యంత కండ్లేసుకుని కొత్త సాలుకు ఎదురుసూశినట్టు ఎంత సంబురం! ఎంత ఉత్కంఠ!

4.

ఇంటిబెల్లు గొట్టిన సూరన్న ముసుగుదన్ని పన్నంక సుత ఒడ్వని ముచ్చట్లే కాపలాగాత్తంటయి. పిట్టలు రాయబారం మోసుకొచ్చే యాల్లయితాంటది. ఆడిబిడ్డను అత్తగారింటికి సాగదోలినట్టు మనసంతా ఒకటే బుగులైతాంటది. ఒక్కొక్కలుగ తలో తొవ్వబట్టుకుని బోతాంటె బడిల వీడ్కోలు సమావేశం యాదికొత్తది. కండ్లనీళ్ళొత్తుకునుడే దక్కువ.

5.

ఇల్లుజేరేటాల్లకు ఏ నడిజాము రాతిరైతదో దెల్వదు. అప్పటికే కర్ఫ్యూ కొనసాగుతున్న ప్రాంతమది. అల్లర్లు జరిగే అవకాశమున్నందున పైలంగుండమని ఆకాశరామన్న సంకేతాలు అందుతయి.