పాయిరం

వీనమ్మకు శెడబుట్టిండు నా కొడుకు! వీని శెర ఎన్నడు ఇర్గడయితదో ఏందో?
సుట్టు జెయ్యలేక నా రెక్కలిరిగిపోతానయి. ఎన్నడు బాత్తదో ఈ రంది? నా తలరాతని సరిపెట్టుకుందునా…

కాలిదప్పి ఏండ్లు గడిశినయి. పెయిమీది బట్టకు సోయి లేదు.
ఒకటికి రెంటికి ఇగజెప్పాల్నా… ఆడిపుట్క పుట్టినందుకు తలుగు తలిగిచ్చుకున్నట్టయింది.

అయ్య లేడాయే. అవ్వ లేదాయె. ఇంత ఉడుకబెట్టి పెడ్తనే ఆయింతనన్నున్నడు.
ఆళ్ళ ఈళ్ళ మాటలిని మార్వానంబోయినా పానమంత ఈన్నె వుండేది.

ఈడంత గంజి వార్సినట్టయితాందని ఊరకుక్కలు ఓరసూపు జూత్తయి.
పలుకు మీదున్నప్పటి పదునే పదునని పదిమంది గుడిసె సుట్టే కాపల గాత్తాంటరు.
గంజిలబడ్డ ఈగకు గాశారమా పాడా? అని మొఖం జూసుకుంటనే గొణుగుతాంటరు.

శేతజెయ్యలేక యాష్టకొచ్చి తిడుతాంటె ఎన్నడు బోతడోనని ఎదురుసూత్తాందని…
రంకుబొంకు సాటుంగ జేత్తానికి సందు దొర్కుతలేదని నరాల్లేని నాలికెలు బుసలుగొడుతనే వుంటయి.

మనిషి మీది పాయిరం ఎన్నయినా ఓర్సుకుంటదని ఈ జనాలకి ఎప్పటికీ తెల్వని రహస్యంగానే ఉండిపోతది.