ఏప్రిల్ 2023

సృష్టిలోని జీవులన్నీ ఇంద్రియ ధర్మాలైన చూపు, స్పర్శ, వినికిడి, రుచి, వాసనల ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. జీవించడానికి అవసరమైన ప్రాథమిక, సహజ జ్ఞానం ఈ ఇంద్రియానుభవపు జ్ఞాపకాల వల్ల వాటికి ఏర్పడుతుంది. రాను రానూ మేధ అభివృద్ధి చెందుతూ వచ్చింది. దానితోపాటే సామాజిక జీవనం, సంభాషణ. జీవపరిణామక్రమంలో మనుషుల స్థాయికి వచ్చేసరికి ఆలోచన, వాక్కు అత్యంత బలమైన పరికరాలుగా రూపు దిద్దుకున్నాయి. ఇంద్రియానుభూతి వల్ల ఏర్పడే సహజ జ్ఞాన స్థాయిని దాటి, తర్కము, విచక్షణ, విశ్లేషణలతో తన అనుభవాలకు విలువలు ఆపాదించడం మనిషి క్రమక్రమంగా పెంపొందించుకున్నాడు. ఇది, ద్వితీయ, తార్కిక స్థాయిలో నేర్చుకునే జ్ఞానం. మనిషి సంఘజీవి కావడంతో వాక్కు, వాక్యం ద్వారా జ్ఞానాన్ని, అనుభవాలని ఒకరికొకరు బట్వాడా చేసుకోవడం మొదలైంది. తమకు తెలియని ప్రపంచాలను పరోక్షంగా తెలుసుకోవడం, ప్రశ్నించడం, తమనూ తమ ప్రపంచాన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం క్రమేణా జ్ఞానసముపార్జనకు ప్రధానమార్గాలయ్యాయి. మౌఖికమైనా, లిఖితమైనా, ఒక వాక్యపు బలం ఈ సందర్భంలోనే మనకు అర్థమవుతుంది. తద్వారా సాహిత్యపు అవసరం కూడా. సాహిత్యపు ప్రధాన ఉపయోగం మన ఆలోచనలను, పరిశీలనలను, స్పందనలనూ స్పష్టం చేసుకోడంలో సహాయపడడం. అలా సహాయపడేది తార్కిక స్థాయి సాహిత్యం. అంటే అనుభూతి కలిగించి ఆపైన అది దాటి మేధను కూడా తాకగలిగే సాహిత్యం. ఈ సాహిత్యపు అవసరాన్ని ఎంత లోతుగా గుర్తించగలిగితే ఆ సమాజం అంత దీర్ఘాయుష్షు ఉన్న సాహిత్యాన్ని సృష్టించుకుంటుంది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న, ఉత్పన్నమవుతున్న సాహిత్యాన్ని పరిశీలించండి. ఇందులో ఎంత శాతం ప్రాథమిక అనుభూతి స్థాయిని దాటగలుగుతున్నదో చూడండి. భావుకత్వం, అన్యాయాన్ని ఎదిరించే ఆవేశం, అసమానతలను ప్రశ్నించే ఆగ్రహం ఇవన్నీ బలమైన అనుభూతులే. అయితే ఇవి తార్కిక చింతన, వివేచనల ఫలితం కావు. ఇవి ప్రాథమిక స్పందనలు. రచయితలు సామాజికస్థాయి రుగ్మతలకు వైయక్తికస్థాయిలో సమాధానాలు చెప్పడానికి వారు అనుభూతి స్థాయి దాటి ఆలోచించకపోవడం మినహా మనకు వేరొక కారణం కనపడదు. సినిమాలలో ఒక విలన్‍ను ఒక హీరో చంపినంత మాత్రాన ఆ విలనీ సమాజం లోనుంచి ఎలా పోదో, ఒక కథలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేసినంత మాత్రాన ఆ దురాచారం సంఘంలో సమసిపోదు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు మార్గం ఆ రుగ్మతల స్వరూపస్వభావాలను విశ్లేషించి తెలుసుకోవడంలోను, అవి పాఠకులకు అర్థం చేయించడంలోను ఉంటుంది. ఆ మార్గం తార్కికస్థాయి సాహిత్యం మాత్రమే చూపుతుంది. ఉదా. ఒక రచన మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆవేశాన్ని రగిలిస్తుంది. కాని, అదే సమయంలో ఆ అనుభూతిని దాటి పాఠకులలో, శ్రోతలలో ఏదో ఒక ఆలోచననూ రేకెత్తించగలిగినప్పుడు ఆ రచన పది కాలాలు సజీవంగా ఉంటుంది. అనుభూతి సాంద్రత ఎక్కువయేకొద్దీ అది మేధకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ సాంద్రత లోపించిన సాహిత్యం, సినిమా తదితర ఏ కళారూపమయినా ప్రత్యక్షంగా దానితో గడుపుతున్న సమయంలో మాత్రమే ఆ అనుభూతిని మనలో మేల్కొలిపి, తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి ఆ వెంటనే మాయమైపోతుంది. వెంటనే స్పందించేలా చేస్తుంది. అలాకాక బలమైన ప్రాథమిక అనుభూతి, దానిని దాటి అంతే తీక్షణమైన తార్కిక విచక్షణ – ఈ రెండూ కలిగించగలిగినదే సజీవ సాహిత్యం అవుతుంది. మన ఆవేశాలని, అనురాగాలనీ కూడా లోతుగా అర్థం చేసుకోడానికి సహాయపడుతుంది. సాహిత్యపు ప్రయోజనం నెరవేర్చడంలో ఈ మేధ చేస్తున్న పని అన్నిసార్లూ స్పష్టంగా కనపడకపోవచ్చు. కాని, గొప్ప సాహిత్యాన్ని చదివినవారందరికీ తెలుసు: మేధకు దారి మనసు నుండి. మేధోచితమైన అనుభూతి ప్రకటన చిక్కగా లోతుగా ఉంటుంది. అలా దాని సాంద్రత ఎంత ఎక్కువ ఉంటే మేధకు, తార్కికతకూ అది అంత దగ్గరవుతుంది. స్పందన అంత నిదానమవుతుంది. మనిషి భావుకత తార్కికతల కలబోత. అందుకే, మనకు మనసును మాత్రమే తాకే సాహిత్యంతో పాటు మెదడుకు పదును పెట్టే సాహిత్యం కూడా అత్యంత అవసరం. తెలుగు సాహిత్యంలో ఈ తరహా రచనలెన్ని?