మరింత దగ్గరికి

పార్క్ హయాత్ హోటల్ లోపలికెళ్ళేటపుడు సెక్యూరిటీవాళ్ళు కారులోపల, కారుకిందా చెక్ చేశారు. హోటల్ లాబీ ఎంట్రన్స్ దాకా తీసుకెళ్ళి కారు ఆపాడు. అందరు ఊబర్ డ్రైవర్లలా కాకుండా, దిగొచ్చి నా డోర్ తెరిచిపట్టుకున్నాడు. మీరు వేసుకున్న పర్ఫ్యూమ్ బావుంది మేడమ్ అంటూ నవ్వాడు. వాడి నవ్వులో కొద్దిగా గర్వం కనిపించింది, అందమైన అమ్మాయి వాడి కార్లో వచ్చిందని కావొచ్చు. పర్సు, ఫోన్ చేతిలో పట్టుకుని, టీషర్ట్ సర్దుకుంటూ కారు దిగాను.

మెయిన్ లాబీ స్లైడింగ్ డోర్ వైపు వెళ్ళకుండా ఇంకాస్త ముందుకెళ్ళి పక్కనే ఉన్న సైడ్ లాబీ డోర్ వైపు వెళ్ళాను. ఇదివరకు వచ్చినవాళ్ళకే తెలుస్తుంది అక్కడ ఇంకో లాబీ ఉంటుందని. ఈ లాబీ సర్వీస్ అపార్ట్‌మెంట్స్ రెసిడెంట్స్ కోసం.

ముందు అతను ట్రైడెంట్ హోటల్‌లో దిగేవాడు. ఈ మధ్యే హయాత్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్ రెంట్‌కు తీసుకున్నాడు.

డోర్‌బెల్ నొక్కి నిలబడ్డాను. జుట్టుని పోనీటెయిల్‌లా కట్టుకున్నాను. మరీ ఎక్కువ మేకప్ చేసుకోలేదు. న్యాచురల్ షేడ్ లిప్‌స్టిక్ వేసుకున్నా. కంఫర్టబుల్‌గా ఉంటుందని లినెన్ స్లాక్స్, టీషర్ట్ వేసుకున్నా.

స్లీపోవర్ కాదు కాబట్టి అదనంగా బట్టలేం తెచ్చుకోలేదు.

“హేయ్ నమ్మీ!” డోర్ తీసి పట్టుకున్నాడు.

పరిచయమున్న పర్ఫ్యూమ్ వాసన. లోపలికెళ్ళగానే చేతులు సాచాను. చేతుల్లో ఉన్న పర్సు, ఫోన్‌తో అలానే అతని చేతుల్లోకి ఒదిగిపోయాను. నాకంటే అరడుగు పొడుగు.

నా భుజాల చుట్టూ చేతులు చుట్టి నా పక్కటెముకలు రుద్దుతూ కళ్ళు మూసుకుని పెద్దగా శ్వాస పైకి పీలుస్తూ “థాంక్స్ ఫర్ కమింగ్” అన్నాడు.

కొన్ని క్షణాల తర్వాత తేరుకొని “ప్లీజ్” అంటూ చేయి చూపిస్తూ లివింగ్ రూమ్ లోకి ఆహ్వానించాడు. పరిచయమున్న రూమ్. అతని కంటే ముందే వెళ్ళి సోఫాలో కూర్చున్నాను.

“ఏదైనా డ్రింక్ తీసుకుంటారా?” కిచెన్ వైపు వెళ్ళబోతూ ఎప్పట్లానే మర్యాదగా అడిగాడు.

“వొద్దొద్దు.” గోడమీద పెయింటింగ్‌లో ఉన్న జంట ఒకర్నొకరు తాకుతూ కూర్చున్న పద్దతిని గమనిస్తూ చెప్పాను.

“ఒక్క క్షణం, ఇప్పుడే వస్తా.” అతను బెడ్రూంలోకి వెళ్ళాడు.

నేను బాల్కనీ వైపు నడిచాను. చీకటి చిక్కబడుతుంటే హైదరాబాద్ దీపాల అస్తిత్వాలు బయటపడుతున్నాయి. చీకటిని హత్తుకోనంతసేపూ దీపం ఒంటరిదే.

“చీకట్లో హైదరాబాద్ చాలా బావుంటుంది కదా?” అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతని తెలుగు యాక్సెంట్ చిన్నపిల్లలు మాట్లాడినట్టుంది. వేల్ లోగో ఉన్న బూడిదరంగు టీషర్ట్ వేసుకున్నాడు. నలభై కంటే తక్కువే ఉన్నట్టు కనిపిస్తాడు. అంత జోవియల్ కాదు కానీ నవ్వు ముఖం.

“హైదరాబాద్‌తో నాది ఎప్పుడూ లవ్ హేట్ రిలేషనే!” నవ్వుకుంటూ వచ్చి సోఫాలో అతని పక్కనే కూర్చుంటూ చెప్పాను.

“ఇక్కడే ఉండిపోతారా ఈరోజు? మీకు వేరే పనేం లేకపోతేనే…” బతిమాలుతున్నట్టు అడిగాడు.

“ఉండిపోవచ్చు కానీ పొద్దున్నే ఏడింటికి కాఫీ షాప్ తెరవాలి. పన్నెండు వరకు ఉండగలను.”

“సారీ, నేను ముందే స్లీపోవర్ అని చెప్పి ఉండాల్సింది.”

“పరవాలేదు.” అతని కళ్ళలోకి చూస్తూ అన్నాను.

రెండు చేతులు అటూ ఇటూ బార్లా సాచి అరిచేతులు సోఫా పైఅంచు మీద పెట్టి కూచునున్నాడు. పొడవుంటాడు కాబట్టి అలా కూర్చోవడం చూడటానికి బావుంది.

మొట్టమొదటిసారి అతన్ని ట్రైడెంట్ హోటల్‌లో కలిసినప్పుడు కనిపించినంత స్ట్రెస్ ఇప్పుడు అతని ముఖంలో కనిపించడంలేదు.

సోఫా పక్కనే హైహీల్స్ విప్పేసి వెళ్ళి అడ్డంగా అతని ఒళ్ళో కూర్చున్నాను. మోస్ట్ కంఫీ ఛెయిర్. నా కుడివైపు శరీరం అతని ఛాతీకి ఆనుకుంది. నేను జారిపోకుండా సపోర్ట్‌గా అతను తన రెండు చేతుల్ని నా నడుం చుట్టూ చుట్టి నా కుడిభుజానికి తల ఆన్చి కళ్ళు మూసుకున్నాడు.

మామూలుగానే మాట్లాడటం తక్కువ. అందులో ఇలా నన్ను కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నపుడైతే యోగిలా నిశ్శబ్దంగా కూర్చునుంటాడు. ఆ మూసుకున్న కళ్ళ వెనక పోరాడి ఎదురుదెబ్బలు తిన్న సైనికుడు కనిపిస్తాడు నాకు.

చేతుల్లో పావురాన్ని పొదువుకున్నంత సున్నితంగా పట్టుకున్నాడు నన్ను. ఒక చేత్తో అతని వెనకజుట్టులోకి వేళ్ళు జొనిపి అతని తలకు నా తలను ఆనించాను.

నాకు ఏం అవసరం వచ్చినా నాన్న మీద ఇలాగే కూర్చుండి తల మసాజ్ చేస్తూ గోముగా అడిగేదాన్ని. నాన్న కూడా ఇలానే కళ్ళు మూసుకుని ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేవాడు. ఏది అడిగినా ఇట్టే ఒప్పుకునేవాడు. కౌగిలింతకున్న శక్తి అప్పుడే తెలిసింది నాకు. మనిషి ఒంటరిగా ఏదైనా చేయగలడు కానీ కౌగిలించుకోడానికి కనీసం ఇంకొక్కరైనా కావాలి. ఒంటరిగా మనం ఎప్పటికీ సగమే కదా అనిపిస్తుంది.

“బెడ్‌రూమ్‌లోకి వెళ్దామా?” నా చెవిలో గుసగుసగా చెప్పాడు. అతని చేతిని పట్టుకొని బెడ్‌రూమ్‌లోకి నడిచాను.

ముందు తనెళ్ళి వెల్లకిలా పడుకున్నాడు. అతని పక్కనే ఒదుగుతూ భుజం మీద తల పెట్టి పడుకున్నాను. అతన్ని చుట్టుకొని నా చేతులు. మంత్రం చెప్తున్నట్టు అతని చెవికి దగ్గరగా నా పెదవులు. కమ్ టు పాపా.

అమ్మ చెవిపోగుతో ఆడుకోడానికి ఇలాగే పడుకునేదాన్ని. నన్నూ నాన్నని విడిచిపెట్టి అమ్మ ఎందుకెళ్ళిపోయిందో ఇప్పటికీ అర్థంకాదు. జస్ట్ అలా… స్నానం చేసే ముందు బట్టలు విప్పేసినట్టు పదేళ్ళ పిల్లని అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు చిన్నప్పుడు చాలా కోపం ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలనిపిస్తుంది. నా ఒంటరితనం ముందు తన దుఃఖం ఎంతో తేల్చుకోవాలని అనిపిస్తుంది.

“కనిపిస్తూ గాల్లో కలిసే కమ్మటి కాఫీ పొగ, కనిపించకుండా ముక్కును చేరే మల్లెపూల వాసన, ఈ రెండు నీ జుట్టులో ఎప్పుడు దూరాయో?!” నా పోనీటెయిల్‌ని చూపుడువేలుతో తిప్పుతూ అన్నాడు. తిప్పి తిప్పి పొయెటిక్‌గా చెప్పటం అతనికి అలవాటే.

“ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పావా?” చెవిలో గుసగుసగా నవ్వుతూ అన్నాను. ఇలా దగ్గరగా ఉన్నపుడు ఏకవచనంతోనే పిలిపించుకోవడం ఇష్టం అతనికి. ఇద్దరం పక్కకు తిరిగి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నాం.

అతను కొద్దిగా కిందకు జరిగి నా గుండెల్లో తల దాచుకున్నాడు, మూడంకెలా కాళ్ళు ముడుచుకొని. నా కాళ్ళు అతని నడుము చుట్టూ పెనవేసుకున్నాయి. మెయిన్ స్క్వీజ్. మా మధ్య ఎక్కువగా మాటలు సాగేవి మేమిలా ఒకరిలోకొకరు వొదిగిపోయినపుడే.

ఆర్కిటెక్చర్ అంటే ఇష్టమని, అమెరికాలో ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందని చెప్పాడు మొదటిసారి కలిసినపుడు. హైదరాబాద్‌లో కూడా ఏదో వెంచర్ చేస్తున్నట్టు చెప్పాడు. దాదాపు నెలకోసారి వచ్చి ఓ రెండు వారాలు ఉండిపోతాడు. కాఫీ కాక్‌టైల్స్ గురించి నేను మాట్లాడితే ట్రీ హగింగ్ హౌసెస్ గురించి తను చెప్తాడు.

నా కుడిచేయి వేళ్ళు అతని ఎడమచేయి వేళ్ళసందుల్లో ఇమిడిపోయాయి. ఒకటి విడిచి ఒకటి ఇద్దరి వేళ్ళు క్విల్ట్ పాటర్న్ లాగా కనిపిస్తున్నాయి. కుట్టిన పూవుల్లా లైట్ పింక్ నెయిల్స్. ఒక్కటైన చేతుల్ని ఒక వ్యూహం లేకుండా వలయాల్లో తిప్పుతూ ఏవో కబుర్లు చెప్పుకున్నాం.

కాసేపయాక నన్నలాగే పక్కనుంచే మెడచుట్టూ చేతులు బిగించి కౌగిలించుకున్నాడు. చెవులతో ముద్దు పెట్టుకుంటున్నట్టు మా తలలు. అతని వేల్ లోగోకి మెత్తగా గుచ్చుతూ నా బ్రా. అతని రెండు కాళ్ళ మధ్య నా నడుము కింది భాగం. ఫోర్కింగ్. ఒక దాంట్లో ఇంకోటి ఇరుక్కున్న రెండు ఫోర్కుల్లా ఎదురెదురు కరుచుకుని పడుకున్నాం.

హోటల్ ఆవాసలో ఇంటర్‌వ్యూకి వెళ్ళినపుడు ఫోర్కింగ్ గురించి చెప్తూ ఆమె నన్ను హత్తుకున్న బరువైన స్పర్శ నాకెప్పుడూ గుర్తుంటుంది. ప్లెటానిక్ కడిలింగ్ గురించి ఆవిడ చెప్తున్నపుడు ఎంతసేపైనా వినాలనిపించింది. నా ఒంటరితనానికి తాళం తీసింది ముందు దీపు అయితే, పూర్తిగా తలుపులు తీసింది మాత్రం ఆమే. కడిల్ క్వీన్ అని ఆమెని పిలిస్తే ఎంత సంతోషించిందో ఆరోజు.

మెడ చుట్టూ వేసిన చేతుల్ని తీసి నా కళ్ళలోకి చూశాడు. అతనికి షోల్డర్ స్ట్రాప్‌లా చుట్టిన నా చేతుల్ని తీసేశాను. బొడ్డు పైకి జరిగిన టీషర్ట్‌ని కిందికి లాక్కుని బ్రా స్ట్రాప్స్ సరిచేసుకున్నాను.

దేనికో రెడీ అవుతున్నట్టు నన్ను వెల్లకిలా పడుకోబెట్టి నాపైకి వొరిగాడు. నా మీద నాకు నమ్మకం పోయేది ఈ పొజిషన్ లోనే. ముందు సులువుగానే మానేజ్ చేసేదాన్ని. ఈ మధ్యే నాలో ఈ మార్పు గమనించాను. అతని పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిసిపోతుంది. మెత్తని ఈటెల్లా నా గుండెలోకి గుచ్చుకెళ్ళిపోయే ఫీలింగ్స్. అటు స్వీకరించలేను. ఇటు తిప్పిపంపించనూ లేను.

రెండు చేతులతో నా రెండు భుజాలు పట్టుకున్నాడు. అనుమతించు అని అడుగుతున్నట్టు నా కళ్ళలోకి చూశాడు. నా రెండు చేతులతో తన తలని నా చెస్ట్ మీద అదుముకున్నాను. తన బరువుని నెమ్మదిగా నామీదికి బదిలీ చేస్తూ కళ్ళు మూసుకున్నాడు.

‘బ్రేక్ ఫాస్ట్ ఇన్ ది బెడ్’ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్.

ఇక ఈ రాత్రి అతనికి ఎలాంటి ఆంటీడిప్రెసెంట్స్ అవసరం ఉండదు.

నాక్కూడా.


స్కూటీ పార్క్ చేసి, హెల్మెట్ తీస్తూ షాప్ మెయిన్ డోర్ వైపు చూశాను. దీపు నాకంటే ముందే వచ్చినట్టుంది. లోపల లైట్స్ వెలుగుతున్నాయి. పేపర్-న్-కప్స్ సైన్ బోర్డు ఇంకా పూర్తిగా తెల్లారకపోవడంతో క్లియర్‌గా కనిపించడంలేదు. రోడ్ నంబర్ 40, 41 ఇంటర్ సెక్షన్‌లో ఉంటుందీ కాఫీ షాపు. ఏడాదయ్యింది ఇక్కడ బరిస్టాగా నేను జాయిన్ అయ్యి. దీపు వల్లే నాకీ ఉద్యోగం దొరికింది.

లోపలికెళ్ళి కిచెన్ వెనకాలున్న క్యాబినెట్‌లో హెల్మెట్ పెట్టి, “గుడ్ మార్నింగ్ దీపూ!” అని పిలుస్తూ బార్ కౌంటర్ వెనక్కి వెళ్ళాను.

ఫ్రెష్‌గా గ్రైండ్ అవుతున్న కాఫీ బీన్స్. దేవుడికి ఒక వాసన ఉంటే అది కచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఒంట్లో నిద్దరోతున్న నరాలన్నీ ఒకేసారి మేలుకునే వాసన ఇది.

“హేయ్, నమ్మీ!” ఎదురొచ్చి నా చెంపకి తన చెంప తాకించి మూతి సున్నా చుట్టింది.

“నిన్న సాయంత్రం హయాత్‌కి వెళ్ళాను. సారీ! పొద్దున్నే లేవడం లేటయ్యింది.”

“ఓహ్, రఘు వచ్చాడా యూ.ఎస్. నుంచి?”

“…” తలూపుతూ ఏప్రాన్ కట్టుకొని కప్స్ తుడిచి వాటిని ఒక వరుసలో పెట్టడం మొదలెట్టాను.

“నేనెప్పుడో మానేశాను. ఇక నువ్వూ మానెయ్యొచ్చుగా ఆ పార్ట్ టైమ్. ఈ శాలరీ సరిపోతుందిగా?”

“మానేస్తాలే దీపూ. ఇప్పుడైతే ఒక్క రఘు కాల్స్ మాత్రమే అటెండ్ అవుతున్నా. రఘు గురించే ఆలోచిస్తున్నా. అతనికి నా అవసరం ఉంది. అంతే కాకుండా, ఇందులో నాక్కావలసింది కూడా ఏదో దొరుకుతుంది.”

కనీకనిపించకుండా నవ్వి అటు తిరిగి కౌంటర్ తుడుస్తున్న దీపు వైపు చూస్తూంటే మా మొదటి పరిచయం గుర్తొచ్చింది.


రెండేళ్ళ క్రితం.

డాక్టర్ ధానితో కౌన్సిలింగ్. ఆయన అసలు పేరు అవధాని.

వన్ అవర్ సెషన్. ముందు రెండు గంటలు ఉండేది. పోయిన వారం నుండే ఇక కౌన్సిలింగ్ వారానికి ఒక గంట చాలు అన్నాడు. సెషన్ నుండి బయటికి వస్తున్నపుడు గమనించాను. తను ఇంకో డాక్టర్ రూమ్ నుండి బయటికి వస్తూ కనిపించింది. ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ ఆ క్షణం గుర్తుకురాలేదు.

సుమారు నా వయసే ఉంటుంది కానీ మొహంలోని స్ట్రెస్ చూస్తే ఇంకో ఐదేళ్ళు పెద్దగా కనిపించింది. ఫ్రెండ్లీ ఫేస్.

రెండే ఫ్లోర్స్ కావడంతో నేను మెట్లు దిగడానికే ఇష్టపడతా. తను కూడా లిఫ్ట్ వైపు వెళ్ళకుండా నాతోనే దిగుతూ “హాయ్, ఐయామ్ దీపూ…” అంటూ పరిచయం చేసుకుంది.

చేయి కలుపుతూ నా పేరు చెప్పాను.

“ఎక్కడుంటారు?” మాటలు కలపడానికి అంది.

నేనుండే హాస్టల్ పేరు చెప్పాను.

“ఓ! నేనూ అదే హాస్టల్‌లో ఉంటాను.” నవ్వుతూ చెప్పింది.

“అదే అనుకున్నా. ఎక్కడో చూసినట్టు అనిపించింది.”

“డిన్నర్ టైమ్ అవుతుంది. ఇక్కడే తిని వెళదామనుకుంటున్నా. ఉడ్ యూ లైక్ టు జాయిన్?” బయటికొచ్చాక పక్కనే ఉన్న రెస్టారెంట్‌ని చూపిస్తూ అంది.

“ష్యూర్, నాకూ కంపనీ కావాలి ఎలానూ.”

కౌన్సిలింగ్ స్నేహం సిగరెట్ స్నేహం లాంటిదే అనుకుంటా. ఇట్టే అతుక్కుపోయాం. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటేనని తేలిపోయింది. తనదీ నా లాంటి కథే అని తెలిసింది.

“అమ్మ పదేళ్ళపుడే వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయాక నాన్న కోలుకోలేకపోయాడు. నేను ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడే నాన్న కూడా వెళ్ళిపోయాడు. హార్ట్ ఎటాక్ అన్నారు. నాన్న చేసిన అప్పులు మాకున్న ఆస్తికంటే ఎక్కువ అవ్వడంతో ఇల్లు అమ్మాల్సి వచ్చింది. ఆస్తి తగాదాల్లో చిన్నాన్న దూరమై మా ఇంటివైపు చూడటం అప్పటికే మానేశాడు. హాస్టల్‌కి మారాను. ఒంటరితనం. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. చదువు మీద ధ్యాస పోయింది. చదువు పూర్తిచేయలేకపోయాను. దాదాపు ఐదేళ్ళు ఒంటరిగా బ్యాక్ పాక్ వేసుకుని దేశం అంతా తిరిగొచ్చాను. ఆల్కహాల్, డ్రగ్స్, ఆశ్రమ్స్, టాటూస్… కావలసింది దొరకలేదు. నన్ను నన్నుగా ఇష్టపడేవాళ్ళు కనిపించలేదు. చివరికి స్నేహితులే లేకుండాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు నేనే నిలబడటానికి ప్రయత్నిస్తూ కౌన్సిలింగ్‌కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇల్లు అమ్మి అప్పులు కట్టాక మిగిలిన డబ్బులన్నీ ఖర్చయిపోయాయి.” ఓ రోజు మాటల్లో నా గురించి చెప్పాను.

“ఇప్పుడు నెల నెలా బతకడం కష్టం అవుతుంది…” నా గొంతు వణికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“అయ్యో తినేటప్పుడు ఏడిపించాను, సారీ! సారీ! ” అంటూ తింటున్నది ఆపేసి నా పక్కకి వచ్చి గట్టిగా హత్తుకుంది దీపు. చాలాసేపు అలానే.

అప్పట్నుంచి మేమిద్దరం ఇంకా దగ్గరయ్యాం. ఆ ఒక్క హగ్ నా జీవితాన్ని మార్చింది. ఆప్యాయమైన స్పర్శ కోసం నా దేహం ఎంత విలవిలలాడుతుందో తెలిసివచ్చింది. దీపు ఆలింగనంలో నేను వెదికేది ఏదో దొరికింది.

ఆ రోజు తిరిగి హాస్టల్‌కి వెళ్తున్నపుడు మాటల్లో తనకూ ఉద్యోగం లేదని చెప్పింది. కానీ టెంపరరీగా ఏదో జాబ్ చేస్తున్నా అంది. ఆ వెబ్‌సైట్ ఓనర్‌కి నా గురించి చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా అని నా ఫోన్ నెంబర్ తీసుకుంది.


హోటల్ ఆవాస లాబీ.

రంగులు మారుతూ సీలింగ్ నుండి వేలాడుతున్న పొడవైన స్ట్రింగ్ ఎల్.ఈ.డి. షాండ్‌లీయర్. దానికిందే వాటర్ పాండ్. నీళ్ళపై తేలుతున్న ఎర్రటి పూలరెక్కలను చూస్తూ కూర్చునున్నాను.

“ఈ జాబ్ గురించి దీపు ముందే చెప్పింది కదా?” అంది లాబీలోకి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటూ ఆ ఉదయం. బెరుగ్గా తలూపాను. కొద్దిగా బొద్దుగా ఉన్నా చూడటానికి బావుంది. నా అంతే పొడవుంటుంది కావొచ్చు. ముప్పై నలభై మధ్య ఉంటుంది వయసు.

ఫోర్త్ ఫ్లోర్‌లో తన రూమ్. లాబీలో పరిచయం చేసుకోగానే హాల్-వేలో నా చేయి తన చేతిలోకి తీసుకుంది. తర్వాత రూమ్ వరకూ భుజం మీద చెయ్యేసి నడిచింది. అచ్చు దీపు లాగా.

సోఫాలో పక్కపక్కనే చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. చేతన్ భగత్ నుంచి, మహేశ్‌బాబు వరకు. ప్రేమల గురించి, ప్రేమకి ముందూ వెనకల గురించి, మనుషుల గురించి, టచ్ సెన్సిటివిటీ లేని మనుషుల గురించి. ముందు ఉన్న బెరుకుతనం పోయింది. స్నేహితురాలిలా అనిపించింది ఆమె కాసేపట్లోనే.

కాసేపు హాయిగా మాట్లాడుకున్నాక “నౌ హగ్ మీ” అనడిగింది. తలూపి ఆమెను హగ్ చేసుకున్నాను. తర్వాత ఇష్టమైనవాళ్ళని ఎలా హగ్ చేసుకుంటావో చూపించమంది. అమ్మనూ, నాన్ననూ, దీపునూ ఎలా కౌగిలించుకొనేదాన్నో చూపించాను.

ల్యాప్‌టాప్‌లో ప్రెజెంటేషన్ ఓపెన్ చేసింది.

“ది ఆర్ట్ ఆఫ్ స్నగ్‌లింగ్. కళ్ళతో మాట్లాడుకోవడంతో మొదలై, కంటితో శరీరాన్ని తాకడం, ముఖాముఖం మాట్లాడుకోవడం, చేతిలో చేయివేయడం, భుజాల చుట్టూ చేయివేయడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, చివరికి ఇద్దరూ ఒక్కటవడం-ఇలా సాధారణంగా ఏ జంటైనా వాళ్ళ మధ్య దగ్గరితనం పెరగడానికి ఒక వరుసలో ఇవన్నీ చేస్తుంది. ఇందులో మొదటి మూడు తప్ప మిగతావన్నీ స్పర్శకి సంబంధించినవే. టచ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ టచ్…

యూ నో! ఒంటరితనం ప్రస్తుతం ఒక పెద్ద శాపం ఈ ప్రపంచంలో ఎందరికో. ఎన్ని వున్నా కానీ మనిషికి కావల్సింది సాటి మనిషి స్పర్శ. ఎ సింపుల్ హ్యూమన్ టచ్. చిన్నబిడ్డలుగా ఉన్నప్పణ్ణుంచీ మనకంటూ ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. మనం ఏడిస్తే అమ్మా నాన్నలు మనల్ని అలానే దగ్గరకు తీసుకొని ఓదారుస్తారు. పెరిగి పెద్దయ్యాక మన బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్, హజ్బండ్స్, వైవ్స్… మనందరం ఒకరినుంచి ఒకరం ఓదార్పు ఇలానే కోరుకుంటాం. ఇప్పుడు అదే ఓదార్పు ఒక ప్రొఫెషనల్ లాగా…”

మొదట సోఫాలో, తర్వాత బెడ్‌రూమ్‌లో, చేతివేళ్ళు మాత్రమే తగలడం నుంచి రెండు శరీరాలూ ముడిపడిపోయేదాకా ఎన్ని రకాలుగా, ఎన్ని భంగిమల్లో ఒకర్నొకరు తాకవచ్చో, హత్తుకోవచ్చో ఒక్కొక్కటి చేస్తూ, చూపిస్తూ చెప్పింది.

చివరికి ముఖ్యంగా కంట్రోల్ గురించి. మనకి ఫీలింగ్స్ కలిగితే ఎలా డిస్ట్రాక్ట్ చేసుకోవాలి, క్లయింట్‌కి ఫీలింగ్ కలిగి మనకి నచ్చని విధంగా ప్రవర్తించినపుడు వాళ్ళని సున్నితంగా ఎలా రిజెక్ట్ చేయాలి, ఇలా అన్నీ, ఎంతో అనుభవం ఉన్న థెరపిస్ట్‌లా చెప్పింది.

ఎందుకో తను అలా నన్ను తాకుతూ చెప్తుంటే బతకడానికి స్వచ్ఛమైన శారీరక సంభాషణ ఎంత ముఖ్యమో కదా అనిపించింది.

ఆరోజంతా ఎలా గడిచిందో కూడా తెలీదు. సాయంత్రం లాబీ దాకా వచ్చి “యూ ఆర్ ఎ ట్రెయ్‌న్డ్ స్నగ్‌లర్ నౌ!” అని చెప్పి ఒక గట్టి హగ్ ఇచ్చి వీడ్కోలు పలికింది ఆమె.

ఆ తరవాత నాకు మళ్ళీ కౌన్సిలింగ్‌కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు.

తొందర్లోనే ఇదొక ప్రత్యేకమైన ప్రపంచం అని తెలిసిపోయింది.

నేను కలుస్తున్నవాళ్ళలో ఎక్కువమంది మర్యాదస్తులే ఉన్నా, నా ఉద్యోగాన్ని తప్పుగా అర్థంచేసుకుని ఇబ్బంది పెట్టినవాళ్ళు కూడా లేకపోలేదు. టచ్ అబ్సెషన్ ఉన్నవాళ్ళు, నాకంటే ఎక్కువ ఒంటరితనంలోంచి వచ్చినవాళ్ళు, నా కంటే సున్నితంగా రియాక్ట్ అయ్యేవాళ్ళు, చిన్న టచ్‌తోనే ఎమోషనల్‌గా ఎంతో దగ్గరయి స్నేహం కోరుకునేవాళ్ళు… ఇలా అన్ని రకాల మనుషుల్ని చూశాను. ఈ పని అంత సులువైనదేమీ కాకపోయినా, ఇందులో నాలాంటివారికి సహాయం చేస్తున్నానన్న తృప్తితో పాటు నా ఒంటరితనానికి ఒక సాంత్వన దొరుకుతుండేది.

ఈలోగా ఓరోజు దీపు కాఫీ షాప్ జాబ్ గురించి చెప్పింది. దీపుతో కలిసి పనిచేయొచ్చన్న ఇష్టంతో వెంటనే ఒప్పుకున్నా.

ఆంబియాన్స్, సర్వీస్‌తో పాటు కాఫీ క్వాలిటీ కూడా బావుంటుందని, మా కాఫీ షాప్‌కి మంచి పేరు రావడంతో ఇక ఫుల్‌టైమ్ కాఫీ షాప్‌లోనే పనిచేయాల్సొచ్చింది. స్నగ్‌లింగ్ మానేసి కొన్ని నెలలు దాటింది. అయినా రఘు ఒక్కడు మాత్రం గుర్తొస్తూనే ఉన్నాడు. రఘు స్పర్శని కోరుకుంటున్నానని తెలుస్తుంది నాకు.

చాలా రోజుల తర్వాత ఓరోజు రఘు నుంచి కాల్ వచ్చింది.


“యూ లుక్ క్యూట్ ఇన్ దిస్ స్కర్ట్” బెడ్రూంలోకి వెళ్తున్నపుడు అన్నాడు.

ఇలాంటి డ్రెస్‌లో రావడం ఇదే మొదటిసారి. వాటర్ ఫాల్ కర్ల్‌డ్ జుట్టుని కూడా అలా వదిలేశాను.

అతను గ్రే స్వెట్స్ అండ్ లైట్ స్కైబ్లూ టీషర్ట్‌లో చాలా క్యాజువల్‌గా అంతకు ముందు కంటే చాలా రిలాక్స్‌డ్‌గా కనిపించాడు.

“థాంక్స్! చాన్నాళ్ళ తర్వాత కలుస్తున్నారు. ఈజ్ ఎవిరీథింగ్ ఆల్రైట్?” మాకున్న చనువుతో అడిగాను.

“…”

బెడ్ మీద కాళ్ళుచాపి కూర్చోగానే నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. స్కర్ట్ కొద్దిగా పైకి జరగడం వలన అతని వేడి నగ్నంగా ఉన్న నా కాళ్ళకు తగిలి హాయిగా అనిపించింది. అతన్ని కొద్దిగా జరిపి స్నగుల్ నుంచి హోల్డ్ లోకి తెచ్చాను. వేళ్ళని అతని జుట్టులోకి పోనిచ్చి-

“నాతో పంచుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోతేనే చెప్పండి” అన్నాను.

స్పర్శాసుఖాన్ని చాలా రోజుల తర్వాత అనుభవిస్తున్నట్టు కాసేపు మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా నా ఒళ్ళోంచి తల తీసి, కొద్దిగా మోకాళ్ళు మలిచి నా వెనకాలే నన్నానుకుని ఒక పక్కమీద పడుకున్నాడు.

నేను అలా కూర్చుండే అతని నడుముకి ఇంకాస్త దగ్గరగా జరగాను. ఒక చేయి అతని కాళ్ళ మీద, రెండవ చేయి అతని భుజంమీద వేసి దిండుమీదకి ఒరిగినట్టు అతనికి ఆనుకుని ఇష్టంగా కూర్చున్నాను.

“ఈజ్ దిస్ కాల్‌డ్ హజ్బండ్ పిల్లో?” నవ్వుతూ అన్నాడతను.

“ఉయ్ నెవర్ ట్రైడ్ దిస్ బిఫోర్, రైట్?” అతని వైపు వోరగా చూస్తూ కన్ను గీటుతూ అన్నాన్నేను.

“వెల్. దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫస్ట్ టైమ్. నిజానికి నా గురించి నీకు ఎప్పటినుండో చెప్పాలనే అనుకున్నా…” అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు.

చెప్తున్నంతసేపూ నా చేతి వేళ్ళలో వేళ్ళు దూర్చి ఆడుకోవడమో, లేక నా జుట్టుని సర్దడమో చేస్తుండటం గమనించాను.

అతని స్పర్శ మునుపటికంటే ఎంతో ఆప్యాయంగా, మరింత దగ్గరగా అనిపించింది.