భారతీయ పరిచయక్రమం: కాఫ్కా

ఉన్నవి రెండే, సత్యము అసత్యాలు. సత్యం అదిభాజ్యం, (ఏకం సత్) కనుక తనను తాను తెలుసుకోలేదు. దానిని తెలుసుకోవలెననుకునేవాడు అసత్యం కావలె. – కాఫ్కా.

(There are only two things. Truth and lies. Truth is indivisible, hence it cannot recognize itself; anyone who wants to recognize it has to be a lie. -Kafka)

కాఫ్కా ఉపనిషద్భాష మాట్లాడుతున్నాడు. ‘ఏకమేవాద్వితీయమ్’; ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.’ జ్ఞానం అనంతం, అంటే జ్ఞాత, జ్ఞేయము, రెండూ లేని స్థితినే బ్రహ్మము అంటారు. ఆ బ్రహ్మమే ఆత్మ.

యస్యామతం తస్య మతం, మతం యస్య న వేద సంః
ఆవిజ్ఞాతం విజాసతాం, విజ్ఞాతమవిజాసతామ్ (కేనోపనిషత్తు: 2.3.)

బ్రహ్మము ఎవనికి అవిజ్ఞాతమో అతనికి తెలియును. ఎవనికి విజ్ఞాతమో అతడు బ్రహ్మమును తెలియడు.

కాఫ్కా: జీవితవివరాలు

వానలో తడవనివారు, కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి, తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు, ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని. చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడు. తన నలభయ్యవ ఏట.


ప్రతులకు: అమెజాన్.ఇన్

1883, 3 జులై: కాఫ్కా జననం, ప్రాగ్‌లో (Prague). ప్రస్తుతం చెక్ (Czech) రిపబ్లిక్ రాజధాని. అప్పుడు ఆ రాజ్యం ఆస్ట్రో హంగరీ. యూదు కుటుంబంలో పుట్టాడు. హెర్మన్, జూలీలకు కాఫ్కా మొదటి సంతానం. తన తరువాత యిద్దరు మగపిల్లలు పుట్టిపోయారు. ముగ్గురు చెల్లెళ్ళకు ముందు చనిపోయాడు కాఫ్కా. కాఫ్కా న్యాయశాస్త్రం చదివాడు. లా కాలేజిలో, మేక్స్ బ్రాడ్ (Max Brod) యితడి సహాధ్యాయి, జీవితకాలమిత్రుడు. ఇతడి మిత్రుడు బ్రాడ్‌కు సాహిత్యలోకం ఋణపడి ఉంది, కాఫ్కా చివరి కోరికను ఉల్లంఘించి కాఫ్కా రచనలను భవిష్యత్తుకు అందించినవాడు కనుక. కాఫ్కా బీమా కంపెనీకి న్యాయవాదిగా పని చేశాడు. కంపెనీ నియమనిబంధనలను సవరించి, కంపెనీ పరిధిలోకి వచ్చే పనివారి పరిస్థితులు మెరుగుపరచడానికి ఎంతో చేశాడు. (రచనలలో నిష్క్రియత, జీవితంలో క్రియాశీలత.)

1912 ఆగస్టు: కాఫ్కా ఫెలిస్ బాఅర్‍ను కలిశాడు. ఈమెతో కాఫ్కాకు రెండుసార్లు పెళ్ళి నిశ్చయమై రెండుసార్లూ భగ్నమయింది.

1917: అతడికి క్షయవ్యాధి పట్టుకుంది.

1918: జూలీ వోరిజెక్‌తో పెళ్ళి నిశ్చయమయింది, కాని జరగలేదు. ఎంతకాలం బతుకుతాడో తెలియని స్థితిలో ఒక వివాహితతో (మిలెనా) కలిసి జీవించాడు. బహుశా అతడి జీవితంలో అతడు ఆనందంగా జీవించింది ఆమెతో గడిపిన ఆ చివరి కొద్ది రోజులేనట. మిలెనా కాఫ్కా రచనలను కొన్నిటిని చెక్ (Czech) భాషలోకి అనువదించింది.

1922: అనారోగ్య కారణంగా తన ఉద్యోగానికి రాజీనామా చేయవలసివచ్చింది. (కాఫ్కా ఒక ప్రభుత్వ కార్మిక బీమా సంస్థలో పనిచేసేవాడు.) వియెనా (Vienna) దగ్గరలోని కొన్ని క్షయరోగుల శానిటోరియమ్‌లలో కొంతకాలం గడిపి చివరకు 1924, జూన్ 3న చనిపోయాడు.

జీవితము:రచనలు

కాఫ్కా రచనల్లో సాధారణ కావ్యవస్తువులు రెండు: ఒకటి, జరగని పెళ్ళి; రెండు, తండ్రి కొడుకుల మధ్య స్పర్థ. ఈ తండ్రి కొడుకుల మధ్య స్పర్థకు, ఆ స్పర్ధను మించి రెండు మతసంప్రదాయాల అంతస్సంఘర్షణ అనే మరో అంతస్స్రోతస్సు ఉంది. బహుశా యిదే అతని రచనల ప్రధాన యితివృత్తం అనదగినంత. మూడవ వస్తువు కూడా ఉన్నది. మొదటి రెండిటి కంటే కూడా ముఖ్యమైనది, ఆ రెంటి అడుగున అంతస్స్రోతస్సుగా సాగేది. అది రచయిత-రచనా ప్రవృత్తి-రచనాప్రక్రియ. సుమారు అతని ముప్పయ్యవ ఏట అతని యూదు వారసత్వంపై ఆసక్తి పెరిగింది. ఈ స్రోతస్సు అతడి మొదటి కథ అనగలిగిన తీర్పులో (The Judgement) స్పష్టంగా తెలుస్తుంది. కిఎర్కగార్‌, కాఫ్కాల జీవితాలలో, తండ్రి కొడుకుల సంబంధ విషయంలో, వివాహ వైఫల్య విషయంలో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. పెద్ద భేదమూ ఉన్నది. ఇద్దరి రచనలలో అంతటా పరచుకుని ఉన్న ప్రధాన విషయం, యీ రెంటి ప్రభావమే. ఈ వైఫల్యకారణాలు వెదుక్కోడమో కనిపెట్టడమో వారి రచనలకు ప్రధాన ఆశయం. నీచకు (Nietzsche) అసలు పెళ్ళిలో, నమ్మకమే లేదు. అతడికి పెళ్ళంటే ‘ఉంచుకోడం’ (concubinage – వ్యవస్థీకృత వేశ్యావృత్తి). కిఎర్కగార్‌ భావంలో తన తండ్రి ఒక అబ్రహాం, తను ఒక ఐౙక్. తనను తన తండ్రి భగవంతుడికి బలి యిచ్చాడు. అలాగే తను రెజీనా పట్ల తన ప్రేమను భగవంతుడికి బలి యిచ్చానంటాడు. కాఫ్కా తన రచనాప్రవృత్తి కొరకు వివాహాన్ని త్యాగం చేశాను అంటాడు. (కాఫ్కా తండ్రి ఆధిపత్యం కూడా తన నిర్ణయానికి, లేక నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణమని, కాఫ్కా భావం. తన తండ్రి తన పాలిట నిర్దయుడైన ‘యెహోవా’ (యూదుల దైవం. …for I, the LORD your God, am a jealous God! – Exodus 20:5)

కాఫ్కా తండ్రి బృహత్కాయుడు, చండశాసనుడు. ఇది కాఫ్కా భావం కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య స్పర్ధ, వైరుధ్యం సృష్టిలో సాధారణమే. తల్లికి దగ్గరైనంత తండ్రికి కారు మగపిల్లలు. కాఫ్కా యీ నిజజీవితంలోని వైరుధ్యాన్ని తన రచనలకు అవసరమైనంతగా మరింత పరిపుష్టం చేసి ఉండవచ్చు. తీర్పు (The Judgement) కథలో ఈ తండ్రి పాత్ర, తండ్రి కొడుకుల స్పర్ధ, వైరుధ్యము ప్రధానవస్తువు. జరగని పెళ్ళి రెండవ వస్తువు. అంతస్స్రోతస్సుగా రచనాప్రవృత్తి మూడవ వస్తువు. అతడు వృత్తిని ప్రవృత్తితో సమన్వయం చేయడంలోని ఘర్షణ కూడా ముఖ్య కథావస్తువు.

కాఫ్కా విమర్శకులు అతని రచనలను వివరిస్తూ, అతని జీవితపరిస్థితులతో, అతని జీవితంలోని సంఘటనలతో సమన్వయం చేస్తారు. అందుకు సమర్ధకంగా అతడి డైరీలనుండి, నోటుబుక్స్ నుండి, లేఖల నుండి వాక్యాలు విస్తృతంగా ఉదాహరిస్తారు. కాని, యీ విధమైన విమర్శ కాఫ్కా సాహిత్యకళకు అన్యాయం చేస్తుందనే చెప్పాలి. కాఫ్కా డైరీలు రాసి ఊరుకోవచ్చు కదా? కథలు కూడా రాయడమెందుకు? బయట, డైరీలలో ఉత్తరాలలో, ఎన్ని కథలైనా చెప్పగలవు. కథలో ‘కథలు’ చెప్పలేవు. చచ్చినట్టు నిజం చెప్పవలె. చెప్పిస్తుంది, ‘అంతా నిజమే చెబుతాను. నిజం మాత్రమే చెబుతాను. నిజం తప్ప మరేమీ చెప్పను’ అని. తను కోరినట్టు తాను ఎదగడానికి తన తండ్రి పెద్ద అవరోధమని అతడు తన తండ్రికి రాసిన ప్రసిద్ధలేఖ చెబుతుంది. కాని ఆ లేఖ సగమే నిజం చెబుతుంది. మిగతా సగం అతని కథలలో దొరుకుతుంది, ముఖ్యంగా తీర్పులో, లేఖలో కాఫ్కా వ్యక్తి, కథలో అతడు మనిషి, నీవు నేను.

కాఫ్కా జీవితకాలంలో మొదటి ప్రపంచయుద్ధం, రష్యావిప్లవం ప్రముఖ సంఘటనలు, యూదులపై హింసావాతావరణం యూరపును నిండి ఉండింది. తన ముగ్గురు అక్కచెల్లెళ్ళు యీ హింసకు బలి అయ్యారు. ఇరవై సంవత్సరాల తరువాత జరగబోయే ఊచకోత నీడలు కాఫ్కాకు స్పష్టంగా కనిపించాయి.

ఫ్రాయిడ్ రచనల ప్రభావం తన రచనలపై చాలా ఉన్నదని కాఫ్కా చెప్పుకున్నాడు. దొస్తోవ్‌‍యస్కీని, కిఎర్కగార్‌ను కూడా బాగా చదివాడు. దొస్తోవ్‌‍యస్కీ పాత్రలు నేరాలు చేసి శిక్ష అనుభవిస్తారు. కాఫ్కా  పాత్రలు ఏ నేరము చేయకుండా శిక్ష అనుభవిస్తారు. (నేరం చేయనివాడు లేడనేది కాఫ్కా ప్రాథమిక సాహిత్యవస్తువు, ప్రతి ఒక్కడు శిక్షింపబడకపోవచ్చు. కాని శిక్షార్హుడు కానివాడు లేడు. ‘రాజు’ తలచుకోవాలే కాని) ధర్మం తనను సొంతం చేసుకున్నదన్నాడు కిఎర్కగార్‌. కాఫ్కా ఆ అంతుచిక్కని ధర్మాన్ని సొంతం చేసుకోవాలని జీవితకాలమంతా ప్రయత్నించాడు.

కాఫ్కాను అస్తిత్వవాదరచయితగా చెప్పడం కష్టమే. అస్తిత్వవాదంలో ప్రధానాంశమైన భయము, ఆందోళన, బాధ (Fear, Dread, Anxiety) యితని రచనలనిండా ఉన్నాయి. కాని, అస్తిత్వవాద ఎంపికలోని ఆందోళన (existential choice) ఉండదు. అస్తిత్వవాదంలో మూలమైన అంశం చర్య (action: Existence is doing) కాఫ్కా పాత్రలు ఏమీ చేయరు. ఏ నిర్ణయమూ తీసుకోలేని మనిషి, నిర్ణయం తీసుకోనివ్వని వ్యవస్థ యితడి రచనలలోని ప్రధానవస్తువు. నిజానికి కాఫ్కా తనపై ఏ ముద్రను ఆమోదించడు. అతన్ని గురించి చెప్పుకోవలసిన మాట, అతడు సాహిత్యం తప్ప మరేమీ రాయడు. ఏ భావమైనా, ఏ వాదమైనా, ఏ సిద్ధాంతమైనా సాహిత్యపు కరెన్సీలోకి మార్చి కాని రాయడు. ఈ విషయంలో కాఫ్కాను గుస్తావ్ ఫ్లోబేతో (Gustave Flaubert) పోలుస్తారు. అతడి రచనా శిల్పమే అతని కథావస్తువు.

రూపము సారము విడదీయలేని విధంగా కలిసిపోతాయి కాఫ్కా కథలలో, కాఫ్కా పేరు యిప్పుడు నామవాచకం కాదు, విశేషణం. ఒక విధమైన వింతకు కాఫ్కా మారుపేరు అయింది. అతడి సాహిత్య ప్రపంచంలో అడుగుపెట్టిన క్షణం మన ప్రపంచం మనల్ని వదిలిపోతుంది. మనం ఒక పీడకలలోకి జారుకుంటాం, భయంగా, కాని వదలలేనంత యిష్టంగా కూడా.

కాఫ్కా పాఠకులలో అత్యంతము భయము వికారము జుగుప్ప కలిగించేది అతని నవలిక రూపాంతరం (Metamorphosis, Die Verwandlung 1815). అత్యంత ఆదరణ పొందినది కూడా. సాధారణంగా కాఫ్కా పాఠకులు ఆ నవలికతోనే మొదలుపెడతారు. అన్ని కాఫ్కా రచనలలాగానే అందులో మొదటి వాక్యం దగ్గరనుండి లోతులు తెలిసి చదవాలి. ఆ మొదటి వాక్యం ఒక విధంగా పునర్జన్మగాను, మనిషి పుట్టడమే సంకెళ్ళు వేసుకుని పుడుతున్నాడు (Man is not born free but with chains) అన్న స్ఫురణను కలిగిస్తుంది.

కాఫ్కా మెటమార్ఫసిస్ పై వచ్చినంత వివరణ, విశ్లేషణ బహుశా చాలా కొద్ది రచనలపై వచ్చి ఉంటుంది. దాంట్లో మనకు తెలియని కోణాలు యింకా కొన్ని ఉన్నాయేమో చూద్దాం. ఈ వ్యాసం ఆ నవలికపై సమగ్ర విశ్లేషణ కాదు. దానిని మరోకోణం నుండి చదివి, ఆ కథార్థాన్ని మరింత విస్తృతం చేసికోడానికి ఉపయోగిస్తుందేమో చూడడానికి.

రూపాంతరం

గ్రిగర్ సాంసా (లేక) సంసా (Gregor Samsa) ఒక రోజు నిద్ర లేచి చూచుకుంటే తానొక బృహత్‌కీటకంగా మారి ఉన్నాడు. రాత్రంతా పీడకలలు.

[చాలా ఆంగ్ల అనువాదాలలో ఆ బృహత్‌కీటకాన్ని బొద్దింక (cockroach) అన్నారు. జర్మన్ మూలంలో (Ungeziefer) ఏ ఒక్క పురుగును చెప్పడం లేదు. మూలం దాని పరిమాణాన్ని (gigantic insect) మాత్రం సూచించింది. కనుక బృహత్‌కీటకం అని తెలుగు చేశాను. ‘పెద్ద పురుగు’ అనవచ్చు. కాని బృహత్ అంత ‘పెద్ద’ పరిమాణాన్ని సూచించలేదేమో అని సంస్కృతాన్ని ఆశ్రయించాను.] ఇక ఆంగ్లానువాదాలు ఒక వాక్యంలో చెప్పిన అర్థానికి నేను తెలుగులో రెండు వాక్యాలు వాడాను. దాని ప్రయోజనం అందులో కాఫ్కా రెండు భావాలను చెబుతున్నాడు. ఆ రెంటినీ విడివిడిగా విశదంగా చెప్పడానికి రెండు వాక్యాలుగా విడి విడిగా చెప్పాను. ఆ రెండవ భావం కొంత ఆగి వివరిస్తాను, అది కీలకమైనది కనుక. ఈ కథ చాలామందికి పరిచయమే కనుక వివరంగా చెప్పబనిలేదు. కథానాయకుడు గ్రిగర్ సంసా ఒక రోజు ఉదయం నిద్రలేచేటప్పటికి తానొక బృహత్‌కీటకంగా మారిపోయాడు. అతడి ఆకారం యిప్పుడు ఒక వికారం. ఆ మాటకొస్తే యీ సృష్టిలో ఏది వికారం కాదు?

యథా సోమ్యైకేన మృత్పిణ్ఢేన సర్వం మృణ్మయం విజ్ఞాతం
స్యాద్వాచారమ్ఖణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యమ్ (ఛాందోగ్య ఉప. 6:1:.4వ మంత్రం)

ఉపనిషత్తు ఏమంటున్నది? సృష్టిలో ప్రతి వస్తువు వికారమే. ఒక మట్టి ముద్దతో అన్ని మట్టి వస్తువులు తయారవుతున్నాయి. కాని అది శాశ్వతం కావు. కుండ, మూకుడు పగిలిపోతాయి. పగిలి, విరిగి, లేక మరోవిధంగా, నశిస్తాయి. కాని మట్టి నశించదు.

సంసా మనిషి ఆకారం పోయి, ఒక వికారం పొందాడు. పోయింది ఆకారం మాత్రమే, మనిషి మారలేదు. మారింది లోకం. తన కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగస్థులు, యిరుగు పొరుగు, అందరూ మారిపోయారు. వికారరూపం పొందారు. ఇంత కాలం అతడు తన కుటుంబపోషణ కొరకు, తనకు యిష్టంలేని బట్టలవ్యాపారి దగ్గర ఒక సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేశాడు. ఆ ఉద్యోగధర్మంగా అతడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాడు. ఇంటిలో, కుటుంబసభ్యులతో (తల్లి, తండ్రి, చెల్లెలు) గడపడానికి అతడికి సమయం ఉండదు.

ఈ వ్యాసం మొదటి వాక్యాన్ని, రెండు వాక్యాలుగా విభాగం చేశాను. ఆ రెండవ విభాగం ఏమిటి? తరువాత వివరిస్తాను అన్నాను. ఇప్పుడు చూద్దాం:

‘రాత్రంతా పీడకలలు’, ‘నిద్రలేచాడు’ అంటే చాలదా? కాఫ్కాకు చాలదు. కాఫ్కాపై షోపెన్‌హౌవర్ ప్రభావం చాలా ఉంది అన్నది తెలిసిన విషయమే. షోపెన్‌హౌవర్‌ను భారతీయ ధర్మము తత్వచింతన బలంగా ప్రభావితం చేశాయి. ‘అసలు యీ ప్రపంచం ఉండకూడదు, యిక్కడ కోరికలు, కామము, వ్యథ, పుట్టడం, చావడం తప్ప ఏమీ లేదు. ప్రశాంతి ఉండాలంటే ప్రపంచం ఉండకూడదు’ అంటాడు షోపెన్‌హౌవర్ (ప్రపంచోపశమం శాంతం: మాండూక్యోపనిషత్తు: నిష్ప్రపంచాయ శాంతాయ: గురుస్తవం). షోపెన్‌హౌవర్ ఉపనిషత్తులు బాగా చదివాడు. కాఫ్కా రచనల్లోని నిర్ణయలోకానికి అందులోని విషాదానికి నిస్సహాయతకు నిరాశానిస్పృహలకు కష్టాలకు షోపెన్‌హౌవర్ తత్వధార కారణం. కాఫ్కా సూత్రాలు (Aphorisms) షోపెన్‌హౌవర్ రచనలలోని వాక్యాలకు మార్జిన్‌లో రాసుకున్న వివరణలు (marginal notes) అన్నారొకరు (Erich Heller).

ఈ బృహత్‌కీటకం ‘పూర్వజన్మ’లో పేరు గ్రిగర్ సంసా. పూర్వజన్మ? అవును, అతడి పేరు సంసా. ఈ పదం యాదృచ్ఛికమా? షోపెన్‌హౌవర్ రచనల ప్రభావం కాఫ్కాపై బలంగా విస్తృతంగా ఉంది. ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ సంసా పదంలో తెలుస్తుంది. ఇది వేదాంతపదం, జననమరణరూప ‘సంసార’ చక్రాన్ని గుర్తుచేస్తుంది. ప్రాచ్యసంస్కృతులలో యీ ‘సంసార’ దృష్టి ప్రధానం (సమ్యక్ సరతీతి సంసారః – ఎడతెగక పారు నది).(చూడండి: Eternal recurrence: *Samsa and Samsara: Suffering, Death, and Rebirth in The Metamorphosis, by Michael P. Ryan) సంసారచక్రంలో అంతర్భాగమే పునర్జన్మ. కనుక ప్రాచ్యధర్మాలలో మనిషి స్వేచ్ఛతో పుట్టడు. (Man is not born free.) పూర్వజన్మలోని అనేక కర్మపాశాలతో బద్దుడై పుడతాడు. (Man is not born free, but is born in chains.) ‘అనేక’ ఎందుకు? ఈ సంసారం జననమరణరూప చక్రం. ఎన్నిసార్లు ప్రాణి పుట్టాలో చావాలో! ఈ సంసా ప్రస్తుత కథలో ప్రయాణికుడు (traveller). అతడు సంసారప్రవాహంలో నిరంతర ప్రయాణికుడు. అతడు ఏ వ్యాపారి వద్ద సేల్స్‌మన్? జట్టల వ్యాపారి. బట్టలే ఎందుకు? వాసాంసి జీర్ణాని అనే గీతా శ్లోకం గుర్తు రావడంలో తప్పు లేదు. దేహమే కాదు గేహం కూడా నిత్యం కాదు. సంసారే నిత్యే సతత యాయిని (శ్రీవిష్ణుధర్మోత్తర పురాణము): ‘సతతమూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కనుక అతడు యింట్లో కంటే ప్రయాణాలలో ఎక్కువ ఉంటాడు.’

‘ఇదంతా నీవు కాఫ్కాకు ఆపాదిస్తున్నావు’ అనవచ్చు. కాని ఒక రచయిత ప్రతిపదాన్ని సప్రయోజనంగానే వాడుతాడు, ఉద్దేశం లేకుండా రాయడు అన్న నమ్మకంతో, ప్రతి పదాన్ని, దాని వ్యుత్పత్యర్థంతో సహా, పరిశీలిస్తూ చదవాలి. అప్పుడే మనం ఒక రచయితకు పూర్తి న్యాయం చేసినట్టు.

2

కాఫ్కా మొత్తం రచనలను ఆక్రమించిన కావ్యవస్తువు అతడి తండ్రితో అతడి బంధం. అది పెద్ద బంధం, ప్రతిబంధం. అతని సాహిత్యమంతా తన తండ్రి నుండి పలాయన ప్రయత్నమే. అతడు తన తండ్రికి రాసుకున్న ఉత్తరంలో కాఫ్కా అన్నాడు: నా రాతలన్నీ నీవే. నీ గుండెమీద వాలిపోయి చెప్పుకోలేకపోయిన నా కొరవలు. కాఫ్కా రాసిన తీర్పులో (The Judgement, Das Urteil) కాక, యితర కథలలో కూడా యిది సుస్పష్టం. ప్రస్తుత నవలిక రూపాంతరంలో కూడా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మరో కథావస్తువును, ఆపిల్ పండును, తన జేబులో పెట్టుకొని వస్తాడు. విచారణలో కూడా యీ ఆపిల్ పండు, సారంతో నిండిన ఆపిల్ పండు, ప్రస్తావన చూశాం. అది అక్కడ ఆదిపాపంతో (Original Sin) కలిసి కనిపించింది. ఇక్కడ తండ్రి యెహోవా ప్రతీక రూపంలో కలిసి ఆపిల్ పండు కనిపిస్తుంది. పండు కాదు, పండ్లు. తండ్రి కోటుజేబు ఎంత పెద్దదో, ఆ కోటు ఎంత పెద్దదో, ఆ కోటు వేసుకున్న తండ్రి ఎంత బృహదాకారుడో! కాఫ్కా రచనల్లో ‘తండ్రి’ బృహదాకారుడు, కఠోరుడు. నవలికలో రూపాంతరం చెందింది సంసా కాదు, అతడి లోకం. అతడి కుటుంబం, తన యజమాని కంపెనీ లోని సహోద్యోగులు, మేనేజర్. అతడు ఒక్క రోజు పనికి వెళ్ళడం ఆలస్యమైతే, మేనేజర్ యితడిని వెదుకుతూ యింటికి రావడం ఆశ్చర్యం. ఆ మేనేజర్‌కు అతడి సేవలు అంత ముఖ్యం. సంసాకు ఆ కంపెనీలో ఉద్యోగమూ అంతకంటే ఎక్కువ అవసరం. అతడి జీతంపై మొత్తం కుటుంబం ఆధారపడి ఉంది.

కుటుంబసభ్యుల్లో అతడి చెల్లెలికి అతడు యిష్టం. తండ్రి కఠోరుడు. కాఫ్కా రచనల్లో తల్లి, పాత్రగా ఉన్నా కథ వెనుక ఉన్నా, ప్రముఖం కాదు. అది కాఫ్కా విషాదానికి అతని రచనలలోని ప్రేమరహిత వ్యవస్థకు ప్రతీక. పాత్రగా ప్రముఖం కాని తల్లి, యీ తల్లిలేనితనం అతని రచనల్లో ప్రధానకార్యవస్తువు అనవచ్చు కూడా. సంసా జీవితంలోను యీ నిర్దయలోకమే రూపాంతరం చెందింది. చెల్లెలు మొదటిరోజు పురుగుగా మారిన సంసాకు బ్రెడ్, పాలు యిస్తుంది. ఆమె ఒక్కతే అతడిపై జాలి చూపిస్తుంది. (తల్లిని అతడిని కలవనివ్వరు కుటుంబసభ్యులు.) చెల్లెలు కూడా చాలాకాలం అతడిపై శ్రద్ధ చూపించలేదు. చివరకు తన తల్లితండ్రులతో అంటుంది, ‘వీడిని ఎక్కువ కాలం భరించలేము, మనం సర్వనాశనం అవుతాము’ అని. చెల్లెలు ఒక్కతే మారలేదు. అతడి లోకమంతా వికారరూపంగా మారిపోయింది. ఆ వికారరూపమే దాని అసలు రూపం, వాస్తవాకారం.

సంసా ఆయా, కథ చివరలో అతడు చనిపోయినాడని చెబుతుంది. అది చెబుతూ ఆమె అతడి దేహానికి చేయవలసిన అంత్యక్రియ కూడా చేశాను అని చెబుతుంది, ఒక నవ్వుకాని నవ్వుతో. ఆమె అతడి మృతదేహాన్ని తీసేశానని, బయట చెత్తలో వేశానని చెబుతుంది. ఆ కుటుంబ సభ్యులకు ఒక యిబ్బందిని తొలగించానని ఆమెకు తెలుసు. వారికి ఎంత ఊరట!

ఇంతకూ సంసా అంతం ఎలా జరిగింది? అతడి అంతం అతడి ఆదిలోనే ఉంది. అది పాపంలో, జీవితంలో అంతర్భాగమైన పాపభావంలో (Sickness Unto Death: Kierkegaard). ఇది ఎలా చెప్పాడు కాఫ్కా? కాఫ్కా రచనల్లో ఆపిల్ పండ్లు తప్పనిసరిగా ఉంటాయి. సంసా వికారాన్ని, అతడి విచిత్ర చేష్టలను సహించలేని ‘తండ్రి’ తన జేబులో ఉన్న ఆపిల్ పండ్లను అతడిపై విసరుతాడు, ఆ పురుగును హింసిస్తూ. అది సంసార క్షయానికి ఆరంభం. ఆ క్షయం శిక్షతో కాని కలగదు. ఆ పాపానికి ఆది ఆపిల్ పండు. జీవితం శిక్ష, శిక్షణ కూడా.

కాఫ్కా కథలు సాధారణంగా ఏదో ఒక రూపంలో పునర్జన్మతోనే మొదలవుతాయి, అంతాన్ని తోడు తెచ్చుకుని. అతని కథలలో మనిషికి కలిగే ఘోరం కాదు ప్రధాన వస్తువు, ప్రతిఘటనతో మొదలవుతుంది అతడి స్పందన, ఏమిటి నేను చేసిన నేరం, ఏమిటీ ఘోరం? అని. కాని ఆ ఘోరాన్ని అతి త్వరలో ఆమోదిస్తాడు. ఇదీ అసలు ఘోరం. విచారణలో (The trial) అరెస్ట్ అయిన కొద్ది క్షణాలలోనే, ‘ఓ! అలాగా! అంటే అరెస్ట్ అవడం పెద్ద ఘోరం కాదన్నమాట!’ అంటాడు కె. రూపాంతరంలో పురుగుగా మారిన సంసా మొదట నిర్ఘాంతపోతాడు. కాని త్వరలోనే తన స్థితికి అలవాటు పడిపోతాడు. తన యిరుకు గదిలో మరింత తిరగడానికి అవకాశం కొరకు కొన్ని వస్తువులు తొలగించారు. ఆ స్వేచ్ఛావైశాల్యానికే మురిసిపోయి పురుగు నేలపై గోడలపై ‘యథేచ్ఛగా’ పాకుతుంది. అంత సులభంగా, త్వరగా తన నిస్సహాయతను స్వీకరిస్తాడు మనిషి. ఒక కోణంలో యిదీ ఘోరం.